close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎనిమిదేళ్లలో రూ.4వేల కోట్లు!

ఎనిమిదేళ్లలో రూ.4వేల కోట్లు!

ఎనిమిదేళ్ల క్రితం కాలేజీ గోడల మధ్య మొదలైన ఆ స్టార్టప్‌ విలువ ఇప్పుడు నాలుగువేల కోట్లకు చేరింది. తండ్రి విషయంలో ఎదురైన ఓ సమస్యకు పరిష్కారంగా దాన్ని మొదలుపెట్టిన శశాంక్‌ అనే కుర్రాడు, ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్యసేవల రంగ సంస్థగా దాన్ని నిలబెట్టాడు. ప్రాక్టో... ఏటా నాలుగు కోట్ల మంది రోగుల అవసరాలను ఆన్‌లైన్‌లో తీరుస్తోంది. రెండు లక్షల మందికి పైగా వైద్యులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆరోగ్యసేవలను అరచేతిలోనే అందిస్తోంది.


రోగ్య సమస్యలు చాలా చిత్రంగా ఉంటాయి. ఓ వైద్యుడు ఆపరేషన్‌ చేసి తీరాల్సిందే అని చెప్పిన సమస్యను మరొకరు మందులతోనే తగ్గించొచ్చు. అదేం పెద్ద ఇబ్బంది కాదని ఓ డాక్టరు కొట్టిపారేసిన కొన్ని లక్షణాలు తీవ్రమైన వ్యాధిగా పరిణమించొచ్చు. అందుకే చాలామంది రోగులు ఏ సమస్యకైనా అదనంగా మరో ఒకరిద్దరు నిపుణుల సలహాల్నీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సరైన వైద్యులు మన చుట్టుపక్కల ఎక్కడున్నారో, ఆ రంగంలో వాళ్ల అనుభవం, అర్హతలు ఏపాటివో తెలుసుకో వడం అంత సులువేం కాదు. అలాంటి సమాచారాన్నంతా వెబ్‌సైట్‌లో, యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తోన్న సంస్థే ప్రాక్టో. ఇందులో దేశవ్యాప్తంగా పదివేలకుపైగా ఆస్పత్రులకు చెందిన రెండు లక్షలకుపైగా వైద్యులు సేవలందిస్తున్నారు. రోగులు చెప్పిన లక్షణాలూ, అప్‌లోడ్‌ చేసిన రిపోర్టుల ఆధారంగా మెరుగైన సలహాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వాళ్లకి రేటింగులూ ఉంటాయి. వాటి సాయంతో సరైన వైద్యుడిని ఆశ్రయించొచ్చు. అక్కడికక్కడే అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చు. సందేశం రూపంలో సమస్యను తెలిపి సలహా తీసుకోవచ్చు. అలోపతి, ఆయుర్వేద, హోమియో వైద్యులూ, ఫిట్‌నెస్‌ నిపుణులూ, ఫిజియో థెరపిస్టులూ, డైటీషియన్లూ... ఇలా ఆరోగ్య రంగానికి చెందిన వేలమంది నిపుణులు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటారు.

తండ్రి సమస్య నుంచే...
ప్రస్తుతం యాభైకి పైగా భారతీయ నగరాలతో పాటు బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, అమెరికా లాంటి మరో ఐదారు దేశాల్లోనూ ప్రాక్టో సేవలు అందుతున్నాయి. గతేడాది నాలుగు కోట్ల మందికి పైగా రోగులు దీని ద్వారా వైద్యులతో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకున్నారు. కేవలం ఎనిమిదేళ్లలో ఆ స్థాయికి చేరిన సంస్థను శశాంక్‌ అనే కుర్రాడు అభినవ్‌ లాల్‌ అనే మరో స్నేహితుడితో కలిసి 20ఏళ్ల వయసులో కాలేజీ ప్రాంగణం నుంచే మొదలుపెట్టడం విశేషం. బెంగళూరు కుర్రాడు శశాంక్‌ అక్కడే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చదివాడు. ఓసారి తండ్రికి కీలు మార్పిడి ఆపరేషన్‌ చేయాలని ఓ వైద్యుడు చెప్పడంతో, దాని అవసరం లేకుండా ఏదైనా చేయొచ్చా అని మరో నిపుణుడి సలహా కోసం శశాంక్‌ ప్రయత్నించాడు. స్నేహితుల సహాయంతో అమెరికాలో ఉండే ఓ వైద్యుడి గురించి తెలుసుకొని అతనితో మాట్లాడాడు. కానీ మెడికల్‌ రిపోర్టులను డిజిటల్‌ ఫార్మాట్‌లో పంపమని ఆ వైద్యుడు అడగడంతో, ఆ పద్ధతి గురించి శశాంక్‌కి అర్థం కాలేదు. ఇక్కడి వైద్యుల్ని అడిగితే తమ దగ్గర ఆ విధానం అందుబాటులో లేదని చెప్పారు. చివరికి ఎలాగోలా అమెరికాకు రిపోర్టులను పంపించినా, వైద్య సేవల్లో ఉన్న ఆ లోపం శశాంక్‌ను ఆలోచనలో పడేసింది. స్నేహితుడు అభినవ్‌తో ఆ విషయం చెప్పి రోగులకు సంబంధించిన వైద్య నివేదికలనూ, ఎక్స్‌రేలనూ, ఇతర వివరాలనూ డిజిటల్‌ రూపంలో పొందుపరిచే యాప్‌ను తయారు చేస్తే బావుంటుందని చెప్పాడు. అలా ఇంజినీరింగ్‌ చివరి ఏడాదిలోనే ఆ ఇద్దరూ యాప్‌ తయారీకి శ్రీకారం చుట్టారు.

ఉద్యోగాలు వదులుకొని
మొదట ‘ప్రాక్టో రే’ పేరుతో రోగుల కేస్‌ షీట్లూ, రిపోర్టులూ, ఎక్స్‌రేల్లాంటి వాటిని డిజిటల్‌ ఫార్మాట్‌లో భద్రపరిచేందుకు వీలుగా యాప్‌ని రూపొందించారు. దాని సాయంతో రోగుల తదుపరి అపాయింట్‌మెంట్‌లూ, మార్చాల్సిన మందుల లాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు వాళ్లకు ఎస్సెమ్మెస్‌లు అందేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణ నియామకాల్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చినా వదులుకొని ప్రాక్టోపైనే దృష్టిపెట్టారు. మొదట కొత్తగా నగరాలకు వచ్చిన వాళ్లకోసం ప్రాక్టో వెబ్‌సైట్లో(ప్రాక్టో.కామ్‌) మంచి వైద్యులకు సంబంధించిన వివరాలను అందుబాటులోకి తేవడం మొదలుపెట్టారు. ఒక్కో క్లినిక్‌కీ తిరిగీ, వైద్యుల గురించి క్షుణ్ణంగా వాకబు చేశాకే ఆ వివరాలను వెబ్‌సైట్లో పెట్టేవారు. సేవలను బెంగళూరుతో మొదలుపెట్టి క్రమంగా హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా విస్తరించారు.

24గంటలూ అందుబాటులో...
‘మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో గాయపడ్డ నా భుజానికి ఆపరేషన్‌ చేసిన వైద్యుల్నీ, ఆ తరవాత ఫిజియోథెరపిస్టుల్నీ ప్రాక్టో ద్వారానే సంప్రదించాను’ అంటారు అవినాష్‌ బజాజ్‌. మ్యాట్రిక్స్‌ పార్ట్నర్స్‌ అనే సంస్థకు అధిపతైన అవినాష్‌, ఆ తరవాత ప్రాక్టోలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. రకరకాల సంస్థలనుంచి కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సంపాదించిన ప్రాక్టో విలువ ప్రస్తుతం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు. గతేడాది ఈ స్నేహితులిద్దరికీ ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ వ్యాపారుల జాబితాలోనూ చోటు దక్కింది. ఇరవై నాలుగ్గంటలూ వైద్యులతో చాట్‌ చేసే అవకాశంతోపాటు, 24గంటల లోపల రోగులు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్నీ ప్రాక్టో కల్పిస్తోంది. ‘ప్రస్తుతం గ్రామాల్లో ఇంటర్నెట్‌ అవసరం లేకుండా వైద్యుల్నీ, ప్రజల్నీ కలిపే మార్గాల్ని అన్వేషిస్తున్నాం’ అంటాడు శశాంక్‌. ఆలోచనలో కొత్తదనం, ఆచరణలో సామాజిక కోణం ఉంటే ఏ సంస్థయినా విజయం సాధిస్తుందనడానికి ప్రాక్టో కథే ఉదాహరణ.


  బైజు.. ఆప్‌ చదువుల్లో రాజు

బైజు... భారతీయ విద్యా రంగంలో ఓ సంచలనం. సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న విద్యాభ్యాసాన్ని సాంకేతికతతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ‘బైజు’ వ్యవస్థాపకులు రవీంద్రన్‌. స్కూల్‌ విద్యార్థుల నుంచి సివిల్స్‌ అభ్యర్థుల వరకూ అన్ని వర్గాలకీ ఆన్‌లైన్‌ శిక్షణ కేంద్రంగా మారుతోంది బైజు.


క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)... ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎమ్‌)లతోపాటు మరికొన్ని విద్యాసంస్థల్లో ఎంబీఏ ప్రవేశానికి అర్హత పరీక్ష. సివిల్స్‌, ఐఐటీ ప్రవేశ పరీక్షల మాదిరిగా అత్యంత కఠినమైన వాటిలో ఒకటిగా క్యాట్‌ని చెబుతారు. ఆ పరీక్షలో మంచి స్కోరు సాధించడం చాలా కష్టమంటారు. కానీ తనదైన శైలిలో పాఠాలు చెప్పి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు రవీంద్రన్‌.

ఉద్యోగం వదిలి...
బైజు రవీంద్రన్‌ పుట్టి పెరిగింది కేరళలోని కన్నూర్‌ జిల్లా, అజికోడ్‌లో. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. అందరు తల్లిదండ్రుల మాదిరిగానే వాళ్లూ బైజూనీ బాగా చదవమని చెప్పేవారు. దాంతోపాటు ఆడుకోమనీ చెప్పేవారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటల్లో స్కూలు, కాలేజీ జట్లకు ఆడాడు బైజు. ఆటలకోసం వెళ్లడంవల్ల తరగతి గదిలో కొన్ని పాఠాలు వినలేకపోయేవాడు. ఆ పాఠాల్ని సొంతంగా నేర్చుకోవాల్సి వచ్చేది. ఆ అనుభవమే తానీ రోజు ఈస్థాయిలో ఉండేలా చేసిందని చెబుతాడు బైజు. సొంతంగా ఆలోచించడంవల్ల బట్టీపట్టడం తనకు అలవాటు కాలేదనీ, ఆటలద్వారా నలుగురిలో కలిసిపోవడమూ అలవాటయిందనీ, దానివల్లే ఇప్పుడు వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నానని చెబుతాడు. ఇంజినీరింగ్‌ చేసిన బైజు... ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాడు. ఉద్యోగరీత్యా ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉండేవాడు. 2003లో సెలవులకు వచ్చి బెంగళూరులో స్నేహితులకు క్యాట్‌ పరీక్షకు సిద్ధమవ్వడంలో సాయపడ్డాడు. ఆసక్తికొద్దీ తానూ రాశాడు. అలా రాసినపుడే టాపర్‌గా నిలిచాడు. తర్వాత ఉద్యోగానికి వెళ్లిపోయాడు. రెండేళ్లకు మళ్లీ బెంగళూరు వచ్చాడు. ఈసారి ఇక్కడే ఉద్యోగం. ఆ సమయంలోనూ పరిచయస్తులకు క్యాట్‌ క్లాసులు చెప్పేవాడు. తనను పరీక్షించుకునేందకు 2005లో మరోసారి క్యాట్‌ రాశాడు. ఆసారీ టాపర్‌గా నిలిచాడు. శిక్షణ ఇవ్వమంటూ వచ్చేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2007లో క్యాట్‌ శిక్షణ సంస్థని ప్రారంభించాడు. తన ఇంటిపేరు వచ్చేలా సంస్థకి ‘బైజూస్‌ క్లాసెస్‌’ అని పేరుపెట్టాడు. పాత పాఠాలనే కొత్త కోణంలో చెబుతూ విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచేలా చేస్తాడు బైజు. చాలా శిక్షణ సంస్థల మాదిరిగా పాత ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాకుండా ప్రతి పాఠ్యాంశంలో కీలక అంశాలను చెబుతాడు. దానిద్వారా ఎలాంటి ప్రశ్నకైనా విద్యార్థి సొంతంగా ఆలోచించి జవాబు కనుగొనేలా సిద్ధం చేస్తాడు. తానూ వరుసగా క్యాట్‌ పరీక్ష రాసి మంచి స్కోర్‌ సాధించేవాడు.

రవీంద్రన్‌ క్లాసులు ప్రారంభించిన రెండు మూడేళ్లకే అవి తరగతి గది నుంచి సమావేశ గదులకు మారాయి. తర్వాత మైదానాల స్థాయికి వెళ్లాయి. ఆయన క్లాసుకు ఒక్కోసారి 20వేల మంది హాజరయ్యేవారు. వారాంతాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేవాడు. తర్వాత బెంగళూరు బయట కూడా శిక్షణ కేంద్రాల్ని ప్రారంభించాడు బైజు. ఒక దశలో వారంలో తొమ్మిది నగరాలు చుట్టొచ్చేవాడు. పునశ్చరణ కోసం పెద్ద హాళ్లలో వీడియో పాఠాల్ని వేస్తూ... వీడియో కాన్ఫ్‌రెన్స్‌ద్వారా సందేహాల్ని తీర్చేవాడు. కాలక్రమంలో తన విద్యార్థులనే సహోపాధ్యాయులుగా నియమించుకున్నాడు. ప్రవీణ్‌ ప్రకాష్‌... నాలుగు సార్లు క్యాట్‌ పరీక్ష రాశాడు. లాభం లేకపోయింది. అయిదోసారి బైజు శిక్షణతో మంచి స్కోరు సాధించాడు. చాలా ఐఐఎమ్‌ల నుంచి పిలుపు వచ్చింది. అదే విషయాన్ని బైజూకి చెబితే, ‘బైజూకే శిక్షకుడిగా రావొచ్చు’గా అన్నాడు. అందుకు సిద్ధమన్నాడు ప్రవీణ్‌. దివ్యా గోకుల్‌నాథ్‌ కూడా బైజు దగ్గర శిక్షణకు వచ్చింది. తర్వాత శిక్షకురాలిగా, ఆపైన జీవిత భాగస్వామిగా మారింది.