close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోపీ గ్యారేజ్‌

నాలుగేళ్ల క్రితం సైనా... ఈసారి సింధు... గెలుపు గుర్రాలు మారినా, రథ సారథి మారలేదు. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత పతకాలు- 2... పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ పతకాలు- 2... దాని గొప్పదనం చెప్పడానికి ఇంతకంటే మెరుగైన ఉపమానాలూ, కొలమానాలూ అక్కర్లేదు. దాదాపు 120ఏళ్లలో ఎవరికీ సాధ్యం కానిదీ, కేవలం ఎనిమిదేళ్లలో ఒక అకాడమీ ఎలా సాధించింది..? అసలక్కడ ఏం జరుగుతోంది..? ఆ విజేతల పాఠశాల ప్రయాణం ఎలా మొదలైంది..? రండి తెలుసుకుందాం.

  తెల్లవారు జాము 4.15... హైదరాబాద్‌ మహానగరం గాఢ నిద్రలో జోగుతోంది. రహదారులను శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఇళ్లూ, కార్యాలయాల గేట్లు బిర్రుగా బిగుసుకొని ఉన్న వేళ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. చిక్కటి చీకట్లను చీల్చుకుంటూ లోపలి నుంచి విద్యుత్‌ దీపాల వెలుగులు ప్రసరించాయి. చుట్టూ అలుముకున్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ కోర్టులో భావి ఛాంపియన్ల కాళ్లు కదం తొక్కుతున్నాయి. చేతిలో బ్యాడ్మింటన్‌ రాకెట్లతో చెమట్లు కక్కుతూ సాధన చేస్తుంటే, వాళ్ల ఒంట్లోంచి పుడుతోన్న వేడికి ఆ భవనాన్ని కప్పేసిన మంచు దుప్పటి కరిగిపోతోంది. ఒక్కో పాయింటూ సాధించినప్పుడల్లా ఆటగాళ్లు ఆనందంతో పెట్టే కేకలతో పరిసరాల్లో ఉలికిపాటు మొదలవుతోంది. అలా చూస్తుండగానే రెండు గంటలు గడిచిపోయాయి. సూర్యుడు వచ్చేశాడు. రాజధానిలో కొన్ని లక్షల మంది అతి కష్టమ్మీద మంచం దిగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే అకాడమీలో తొలి విడత సాధన పూర్తయిపోయింది. దేశానికి అత్యుత్తమ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులను అందించే పనిలో ఒక అడుగు ముందుకు పడింది. మరో అరగంటకు మరో బ్యాచ్‌. మరుసటి రోజు మళ్లీ అదే సాధన... ఒకటీ రెండూ కాదు ఎనిమిదేళ్లుగా పండగలూ సెలవులతో సంబంధం లేకుండా పుల్లెల గోపీచంద్‌ అకాడమీ దినచర్య ఇలానే సాగుతోంది. రోజులో పదిహేను గంటల వ్యవధిలో అక్కడ జరిగే అనేక పరిణామాలే భారత బ్యాడ్మింటన్‌కు కొత్త ఛాంపియన్లను అందిస్తున్నాయి

అప్పటి కథ వేరు...
బయటి వాళ్లకు గోపీచంద్‌ అకాడమీ ఓ సాధారణ రాతి కట్టడమే. గోపీకి మాత్రం తన జీవిత లక్ష్యానికి నిలువెత్తు రూపం. అతడి తల్లిదండ్రులకు అచ్చంగా అదో దేవాలయం... అందుకే లోపలికి వెళ్లేప్పుడు చెప్పులు కూడా వేసుకోరు! రియో ఒలింపిక్స్‌లో సింధు వెండి పతకం గెలవగానే అందరూ గోపీని ఆకాశానికెత్తేశారు. ఆ అకాడమీ ఓ అద్భుతమంటూ కీర్తించారు. అలాంటి క్రీడా ప్రాంగణాన్ని తమ రాష్ట్రాల్లోనూ పెట్టమని చేతులు పట్టుకొని ఆహ్వానించారు. ఒక్క ఫోన్‌తో గేటు ముందు వాలడానికి స్పాన్సర్లు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపే. సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం అదే గోపీచంద్‌... అకాడమీ కడతానూ డబ్బులివ్వండీ అంటూ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అధికారుల గదుల బయట గంటల తరబడి ఎదురుచూశాడు. ఆశపెట్టిన వాళ్లకు ఫోన్లు చేసీ చేసీ విసుగెత్తిపోయాడు. క్రీడాకారుడిగా బ్యాడ్మింటన్‌ కోర్టులో ఎన్నోసార్లు గెలిచిన గోపీ, అకాడమీ ఏర్పాటుకి సాయం పొందడంలో మాత్రం ఓడిపోయాడు!

డైరీలో కోరిక
గోపీచంద్‌... ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనీ, ఆటలో ఉన్నత శిఖరాలను చేరాలనీ కలలు కంటూ పెరిగాడు. లక్ష్యాలు ఆకాశంలో ఉంటే పరిస్థితులు మాత్రం పాతాళాన్ని చూపించేవి. కొత్త బూట్లు కొనాలన్నా అమ్మావాళ్లు అప్పు చేయాల్సిందే. వారానికి ఒక షటిల్‌ మాత్రమే వాడాలన్నది తల్లి షరతు. ఆఖరికి తొలిసారి అంతర్జాతీయ పోటీలకు వెళ్లినప్పుడు రాకెట్‌ని కూడా తెలిసిన వ్యక్తి నుంచి ‘బహుమతి’గా తీసుకోవాల్సిన పరిస్థితి. అలా కష్టాలు దాటుతూనే ఆటలో రాటుదేలాడు. అంతర్జాతీయ మేటి క్రీడాకారుల్లో ఒకడిగా ఎదిగాడు. ఓటమికి సాకులు చూపించే అలవాటు గోపీకి లేదు. కానీ గెలవడానికి ఏం కావాలో మాత్రం బాగా తెలుసు. బయటి పోటీలకు వెళ్లినప్పుడు తనకు లేని సౌకర్యాలేంటో, ప్రత్యర్థులు పొందుతోన్న వసతులేంటో గమనించేవాడు. అంతంతమాత్రం శిక్షణతోనే తాను అంతలా రాణిస్తున్నప్పుడు, సరైన ప్రోత్సాహం అందితే భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్తు బంగారమేనన్న నమ్మకం కలిగింది. అప్పుడే అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ బ్యాడ్మింటన్‌ అకాడమీని స్థాపించాలన్న ఆలోచన మనసులో మెదిలింది. కానీ అకాడమీ కోసం సాయం చేయమని ఎవరినైనా అడిగితే, దాన్ని నడిపించేంత స్థాయి తనకు లేదంటారేమోనన్న భయం వెంటాడింది. అందుకే ఆ కోరికను డైరీలో రాసుకొని తనలోనే దాచుకున్నాడు. దాన్ని నిజం చేసుకునే అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశాడు.

ఆ ఒక్క విజయం!
ఒక్క సరైన విజయం చాలు గోపీ కల నిజమవ్వడానికి. 2001లో ఆ సమయం రానే వచ్చింది. ఆ ఏడాది ‘ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌’ గోపీ సొంతమైంది. తన గురువు ప్రకాశ్‌ పదుకొణె తరవాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. భారతీయులంతా ఆ విజయానికి ముగ్ధులయ్యారు. అప్పటికే గోపీ వయసు 27 దాటింది. నిత్యం గాయాలతో సతమతమవుతూ, ఇక తన పనైపోయిందని అందరూ అనుకున్నప్పుడల్లా పట్టుదలతో మళ్లీ పైకొచ్చేవాడు. ఆ సమయంలో ‘ఆల్‌ ఇంగ్లండ్‌’ విజయంతో కెరీర్‌ను ఇంకొన్నాళ్లు కొనసాగించే అవకాశమూ దొరికింది. కానీ తన స్వార్థం చూసుకుంటూ అకాడమీ స్థాపన ఆలస్యం చేస్తే తరవాతి తరానికి ఎంత నష్టమో అతడికి బాగా తెలుసు. అందుకే ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఇంటికొస్తుండగా అమ్మానాన్నల దగ్గర తన మనసులో మాట బయటపెట్టాడు. మంచి వసతులూ, శిక్షణా ఉంటే ఇరవై ఏళ్లకే తాను ఆ టోర్నీ గెలిచేవాణ్ణనీ, ఆ అవకాశాన్ని ఇతరులకు అందించేలా బ్యాడ్మింటన్‌ అకాడమీని స్థాపించాలనుందనీ చెప్పాడు. తల్లిదండ్రులూ తథాస్తు అన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు ఎకరాల స్థలాన్నిచ్చి భుజం తట్టారు. అంతా బావున్నట్టే అనిపించినా, అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి..!

ఫోన్లెత్తడం మానేశారు!
ప్రభుత్వం గోపీకి ఇచ్చిన స్థలం నిండా నీళ్ల గుంటలూ, తుప్ప చెట్లూ, బండరాళ్లే. దాన్ని చదును చేసి అకాడమీ నిర్మించాలంటే కోట్లలో పని. మొదట సాయం చేస్తామన్న వాళ్లంతా ఇదిగో అదిగో అంటూ దాటేస్తూ వచ్చారు. అధికారులు గోపీని రోజూ ఆఫీసుకి పిలిపించుకొని గంటల తరబడి గది బయటే కూర్చోబెట్టేవారు. ఇంకొందరు తమ అవసరాల కోసం రకరకాల వేడుకలకు పిలిచి డొనేషన్‌ అడగ్గానే ముఖం చాటేసేవారు. క్రమంగా చాలామంది ఫోన్లు ఎత్తడం మానేశారు. కాస్త గట్టిగా అడిగితే బ్యాడ్మింటన్‌కు భారత్‌లో అంత ఆదరణ లేదంటూ నేరుగా చెప్పేశారు. ఎంత తిరిగినా చిల్లిగవ్వ కూడా రాలదన్న విషయం గోపీకి అర్థమైంది. అక్కడితో ఇంక ఎవరికీ ఫోన్లు చేయొద్దనీ, ఏ ఆఫీసు గడపా తొక్కొద్దనీ ఒట్టు పెట్టుకున్నాడు. ఎవరూ ఆదుకోకపోయినా అకాడమీ పెట్టి తీరాలన్న కసితో ఉండేవాడు. ఆ కార్యం ఆలస్యమయ్యే కొద్దీ ఒక తరం ఆటగాళ్ల భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది. అందుకే దేవుడిపైన భారంవేసి, దగ్గరివాళ్ల నుంచి సేకరించిన కొద్దిపాటి డబ్బుతో 2004లో ఆ స్థలంలోని బండరాళ్లను తొలగించే పనితో అకాడమీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.