close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మపల్లి లో.. అయోధ్య రాముడు

అమ్మపల్లి లో.. అయోధ్య రాముడు

అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికొచ్చాడట. పరిసరాల్లోని పచ్చదనాన్ని ఆస్వాదించాడట. ఆశ్రమం కట్టుకుని కొంతకాలం నివాసం ఉన్నాడట. లోకకల్యాణం కోసం తపస్సు కూడా చేశాడట. శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి ఆలయంలో ప్రతి అణువూ రామకథను వినిపిస్తుంది.


శ్రీరామకథతో తెలుగునేలకు, అందులోనూ తెలంగాణ గడ్డకు అవినాభావ సంబంధం ఉంది. ఈ నేల మీదే... శోకమే శ్లోకమై లోకపావనమైన రామాయణ కావ్యంగా ప్రాణంపోసుకుందని ఐతిహ్యం. ఇక్కడి కొండకోనల్లోనే వాల్మీకి మహర్షి పుట్టిపెరిగాడని బలమైన నమ్మకం. రామలక్ష్మణులు సేదతీరిన బండరాళ్లూ, సీతమ్మవారు చీరలు ఆరేసుకున్న ఆనవాళ్లూ పల్లెకొక్కటి కనిపిస్తాయి. ఆ మమకారంతోనే కావచ్చు, సాక్షాత్తూ రామలక్ష్మణులే మానవ రూపంలో వచ్చి...సుల్తాను కొలువునకెళ్లి, బంగారు నాణాలు సమర్పించి, రామదాసును చెర విడిపించారు. హైదరాబాద్‌ శివార్లలోని అమ్మపల్లితోనూ ఆ జగదభిరాముడికి అనుబంధం ఉన్నట్టు స్థానికులు కథలుకథలుగా చెబుతారు. శంషాబాద్‌ మండలం, నర్కూడ గ్రామానికి తూర్పు వైపుగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉందీ పురాతన ఆలయం. రాములవారి గుడికి ‘అమ్మపల్లి’ ఆలయంగా పేరెందుకొచ్చిందన్న విషయంలో చరిత్రకారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. పూర్వం ఆ పేరుతో ఇక్కడో గ్రామం ఉండేదని భావించాల్సి ఉంటుంది. కాలక్రమంలో కరవుకాటకాలతోనో, యుద్ధాలతోనో, ఇంకేవైనా కారణాలతోనో ఆ పల్లె అంతరించి ఉండాలి.

అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణులు అమ్మపల్లి పరిసరాల్లో కొంతకాలం విడిది చేసినట్టు చెబుతారు. పచ్చని పొలాలతో, పక్షుల కిలకిలరావాలతో కళకళలాడే ఈ ప్రాంతం శ్రీరాముడిలో ఆధ్యాత్మిక స్పందనలు కలిగించిందట. ప్రయాణాన్ని వాయిదా వేసుకుని...ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడనీ, లోక కల్యాణం కోసం కొంతకాలం తపస్సు కూడా చేశాడనీ ఐతిహ్యం. ఆ పురాణ ప్రశస్తి చాళుక్య పాలకుల్నీ పరవశుల్ని చేసింది. ఖజానా నుంచి అపారమైన నిధులు తరలించి, పదెకరాల విస్తీర్ణంలో రామాలయాన్ని నిర్మించారు. స్థానికంగా లభించే బండరాళ్లనే కళాత్మకంగా మలిచారు ఆనాటి శిల్పులు. ప్రభుత్వం ఈ రామాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించింది.

భారీ గోపురం...
అరవింద దళాయతాక్షుడూ ఆజానుబాహుడూ అయిన శ్రీరాముడు నిటారుగా నిలబడి, రావణ సంహారానికి నారి సారిస్తున్నాడా...అన్నట్టుగా ఉంటుంది గాలిగోపురం. దాదాపు ఎనభై అడుగుల ఎత్తు మహా నిర్మాణమది. ఆరంతస్తులతో కనువిందు చేస్తుంది. దీన్ని పదకొండో శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టిన భవంతులు కూడా ఏడాది రెండేళ్లు తిరిగేసరికి కుప్పకూలిపోతున్న పరిస్థితుల్లో...వందల సంవత్సరాల నాటి కట్టడం చెక్కుచెదరకపోవడం విశేషం. ఒక్కో అంతస్తూ ఓ అద్భుతమే. విష్ణుమూర్తి లీలల్నీ, రామకథల్నీ, దశావతార గాథల్నీ కట్టెదుట నిలిపే శిల్పాలు అనేకం. ఆలయానికి తూర్పు, పడమర దిశల్లో... రెండు కోనేర్లు కట్టారు. ఒక్కొక్కటి, ఎకరం విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమ కోనేరు మనిషి నిర్లిప్తతకూ చారిత్రక అజ్ఞానానికీ బలైపోయి, దాదాపుగా ధ్వంసమైపోయింది. తూర్పు కోనేరు తన ప్రాభవ వైభవాల్ని ఏమాత్రం కోల్పోలేదు. అప్పట్లో, రామనవమినాడు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేవారట. నాటి సువిశాల కల్యాణ మండపమే అందుకు సాక్ష్యం. ఇప్పటికీ, అంతే ఘనంగా జరుగుతాయి రామనవమి ఉత్సవాలు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించే సంప్రదాయమూ ఉంది. హైదరాబాద్‌తో పాటూ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు. ఆరోజుల్లో.. ఉత్సవ మూర్తుల్ని దాదాపు ఇరవై అడుగుల ఎత్తయిన రథంలో వూరేగించేవారట. ప్రస్తుతం తేరు లేకపోయినా, రథశాల ఆనవాళ్లు మాత్రం కనిపిస్తాయి. అలనాటి గజశాలనూ చూడవచ్చు. రెడ్డిరాజుల హయాంలో రామాలయానికి రెండువందల యాభై ఎకరాల వ్యవసాయభూమిని సమర్పించారు. దీంతో, నిత్యోత్సవ కల్యాణోత్సవాలకు ఎలాంటి కొదవా ఉండేది కాదు.

నిజాముల సలాములు...
అమ్మపల్లి ఆలయమంటే హైదరాబాద్‌ నవాబులకు ప్రత్యేక అభిమానం. నిర్మాణంలో అంతర్లీనమైన అరబ్‌శైలి ఇందుకో కారణం కావచ్చు. పదిహేడో శతాబ్దం నాటికి శిథిల స్థితికి చేరిన రామాలయానికి అసఫ్‌జాహీ పాలకులు మరమ్మతులు చేయించినట్టు నాటి దస్తావేజుల ద్వారా తెలుస్తోందని ఆలయ పాలన అధికారి శ్రీనివాస్‌ చెబుతారు. ప్రకృతి సౌందర్యానికి చిరునామాగా నిలిచిన పరిసరాలు సినిమా పరిశ్రమనూ ఆకర్షించాయి. మూడున్నర దశాబ్దాల క్రితమే ఇక్కడ చిత్రీకరణల సందడి మొదలైంది. ఓ దశలో, అమ్మపల్లి ఆలయం వద్ద షూటింగ్‌ చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారన్న బలమైన నమ్మకం ఏర్పడింది. తారల రాకపోకలతో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతుండటంతో... చిత్రీకరణలను నిషేధించారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులు చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలోని... వూటుపల్లి శృంగేరి శంకరమఠాన్నీ, రామాంజపూర్‌లోని రామాలయాన్నీ, వెండికొండ సిద్ధేశ్వర ఆలయాన్నీ దర్శించుకోవచ్చు.

- మైలారం వెంకటేశ్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌ గ్రామీణం
ఫొటోలు: సాదిఖ్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.