close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లిపి లేని కంటి భాష

లిపి లేని కంటి భాష
- సీహెచ్‌.మాధవి

‘‘నందూ, ఆరయ్యిందిరా... ఇక బయలుదేరదామా?’’ అంటూ శ్రీకాంత్‌ వచ్చేసరికి, ఆఫీసులో సిస్టమ్‌తో కుస్తీ పడుతున్న నేను ఉలిక్కిపడి తలెత్తాను.
కంగారుగా చేతి గడియారం వంక చూసుకుని ‘‘నీకేదో దారిలో పనుందని చెప్పావు కదూ... మర్చిపోయాన్రా... సారీ, ఒక్క నిమిషం’’ అంటూ చకచకా సిస్టమ్‌ షట్‌డౌన్‌ చేసి, బ్యాగు తగిలించుకుని శ్రీకాంత్‌తో కలిసి లిఫ్ట్‌ వైపు నడిచాను.
లిఫ్ట్‌ దిగి బయటకు రాగానే ‘‘నందూ, నేను కారు తెస్తాను. ఇక్కడే ఉండు’’ అంటూ పార్కింగ్‌ వైపు వెళ్ళాడు.
శ్రీకాంత్‌, నేనూ ఇదే ఆఫీసులో ఆరేళ్ళనుండీ కలిసి పనిచేస్తున్నాం. అంతేకాకుండా మా ఇద్దరి ఇళ్ళూ పక్కపక్క అపార్ట్‌మెంట్లలోనే ఉండటంతో ఇద్దరం కలిసి వంతులవారీగా ఒకరి కారులోనే ఆఫీసుకి వస్తుంటాం. ఇద్దరి మనస్తత్వాలూ ఒకలాంటివే కావటంతో ఇద్దరం గాఢ స్నేహితులమే కాక మా కుటుంబాలు కూడా స్నేహంగానే ఉంటాయి.
ఎత్తైన భవంతుల మధ్య ఆహ్లాదంగా కనిపిస్తున్న లాన్‌లోకి నడిచి, అక్కడున్న సిమెంటు బెంచీ మీద కూర్చున్నాను. కొంచెం ఖాళీ దొరకగానే, మనసులో పొద్దుటి నుండీ మరుగునపడ్డ ఆలోచనలన్నీ మళ్ళీ విజృంభించాయి. అమ్మ చెప్పిన మాటలు తలచుకున్నాను. ‘నందూ, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన శైలూ ఎందుకో ఈమధ్య అదివరకట్లా లేదురా. ఏదో దిగులుతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. నేను అడిగినా ఏం లేదనే చెపుతోంది కానీ నాకు తెలుస్తోందిరా. వూహ తెలిసినవాళ్ళు... మీకు నేను చెప్పనవసరం లేదు కానీ మనసు ఉండబట్టలేక చెపుతున్నాను నాన్నా! భార్యాభర్తలుగా మీమధ్య ఏమైనా సమస్యలుంటే మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోండి. తను ఏదైనా అసంతృప్తితో బాధపడుతుంటే నువ్వే తెలుసుకుని తీర్చాలిరా. నీ అవసరాలన్నీ నోరు మెదపకుండానే జరిగిపోతున్నాయని గర్వపడటం గొప్ప కాదు. తనకీ ఇష్టాయిష్టాలూ అభిప్రాయాలూ ఉంటాయని గుర్తించి తను చెప్పకుండానే అవి నువ్వు తెలుసుకుని తీర్చగలిగితే అదీ గొప్ప. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తను మళ్ళీ సంతోషంగా కళకళలాడుతూ ఇంట్లో తిరిగేలా చూడు. నేను సాయంత్రమే పెద్దమ్మావాళ్ళ వూరికి బయలుదేరేది. శైలూని వాళ్ళ కోడలి శ్రీమంతం నాటికి అక్కడికి పంపు...’ అంటూ లేచింది అమ్మ.

శ్రీకాంత్‌తో కారులో వెళుతూ ఆలోచిస్తున్నాను. ఒక ప్రఖ్యాత ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నాది. ఆరంకెల్లో జీతం, సొంత ఫ్లాట్‌, సొంత వూళ్ళొ పిత్రార్జితంగా వచ్చిన పొలం... వీటన్నిటితోపాటు పంచప్రాణాలుగా పెంచిన తల్లీ, అనుకూలవతి అయిన భార్యా... అన్నివిధాలా వడ్డించిన విస్తరిలాంటి జీవితమే నాది.

నాలుగేళ్ళకిందట నాకు పెళ్ళి చేయాలని అమ్మ అప్పుడే సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. నేనేమో నాకు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దని పట్టుపట్టాను. ఉద్యోగం చేసే ఆడవాళ్ళపట్ల గౌరవం ఉన్నా, ఇద్దరం అలసిపోయి ఎప్పుడో ఇంటికి చేరుకుంటుంటే, జీవితం చప్పగా సాగిపోతుందన్నది నా అభిప్రాయం. మాకు తెలిసిన బంధుమిత్రుల్లో అందరి అమ్మాయిలూ ఇంజినీరింగో, ఎమ్‌సీయేనో లేదా ఎమ్‌బీయేనో చేసి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళే. దాంతో మా అమ్మకి నా కోసం మాట్రిమోనీ సైట్లనీ, మ్యారేజీ బ్యూరోల్నీ ఆశ్రయించక తప్పలేదు.

ఆ ఆదివారం నేను ఖాళీగా కూర్చుని మాట్రిమోనీ సైట్‌ తీసి అమ్మతో కలిసి సంబంధాలు చూస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అని రాసి ఉన్న సంబంధాలన్నీ నిరాసక్తంగా తిప్పేస్తున్న నేను హఠాత్తుగా ఉలిక్కిపడ్డాను. ఆ అమ్మాయిని చూడగానే ఆమె కళ్ళు అయస్కాంతాల్లా నన్ను ఆకర్షించాయి. ఎందుకో ఆ కళ్ళు నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. వెంటనే అమ్మతో చెప్పేశాను- ‘నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే’ అని.

అమ్మ కళ్ళజోడు సర్దుకుంటూ చూసి ఆశ్చర్యంగా ‘అదేమిట్రా... అమ్మాయి బాగుందనుకో! కానీ ఉద్యోగం వద్దని కదా నువ్విన్ని సంబంధాలు వదిలేశావు. మరి, ఈ అమ్మాయి ఇన్ఫోసిస్‌లో పనిచేస్తోందని ఉంది కదా ఇక్కడ! అలా కావాలని చదువుకుని ఉద్యోగంచేసే అమ్మాయి ఖాళీగా ఉండలేదురా నాన్నా’ అంది.

‘లేదమ్మా, తను ఉద్యోగం చేసినా నాకు ఫర్వాలేదు. నేనే అన్నీ సర్దుకుంటాను. వీళ్ళను కాంటాక్ట్‌ చేద్దాం అమ్మా’ అన్నాను.

అమ్మ ఏదో అర్థమైనట్లు నావంక చూసి నవ్వుతూ ‘సరే’ అంది. తర్వాత ఏం మాట్లాడిందో నాకు తెలియదు కానీ సాయంత్రం అయ్యేసరికి చెప్పింది- ‘నందూ, మనం ఈ శుక్రవారం ఆ అమ్మాయిని చూడటానికి వాళ్ళింటికి వెళ్దాం’ అని.

పెళ్ళిచూపుల్లో నేనేమీ అడగలేదు, తనేమీ చెప్పలేదు. కానీ చిత్రంగా అదే ఫీలింగ్‌... ‘లిపి లేని కంటి భాష’లా... తన కళ్ళల్లోని భావాలు నాకర్థమైనట్లు. వాళ్ళకీ నేను నచ్చటంతో మా పెళ్ళి వైభవంగా జరిగిపోయింది.

పెళ్ళయాక శైలూ, అమ్మతో సొంత కూతురిలాగే కలిసిపోయింది. అమ్మ ద్వారా నాకు ఇంట్లో ఉండే అమ్మాయి కావాలని అనుకున్నానని తెలిసి ఉద్యోగం మానేసి, ఏదో ఆన్‌లైన్‌లో ఇంట్లోనే ఉండి పనిచేసుకుంటోంది. ఆ విషయంలో నిజాయితీగానే నేను బాధపడ్డాను - నాకోసం తనకిష్టమైన ఉద్యోగం మానేసినందుకు. కానీ శైలూ మాత్రం చాలా తేలిగ్గా ఆ విషయాన్ని తీసిపారేసింది.

శైలూ తల్లిదండ్రులు ఈ వూళ్ళొనే ఉంటారు. మా అత్తగారు చాలాకాలం నుండి కీళ్ళవ్యాధితో బాధపడుతుంటే, ఆమె కోసం మామగారు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని ఇంట్లోనే సాయంగా ఉంటున్నారు. అల్లుడి ఇంట్లో ఉండటం ఇష్టంలేక, బలవంతం చేసినా మా ఇంట్లో ఉండరు.

‘‘ఏరా... ఏ లోకంలో ఉన్నావు? నా దారిన నేను వాగుతుంటే!’’ అన్న శ్రీకాంత్‌ గదమాయింపుతో ఈ లోకంలోకి వచ్చాను.

‘‘ఏం లేదులేరా, చెప్పు... ఇంతకీ ఇప్పుడు యశోదా హాస్పిటల్‌కి ఎందుకు?’’ అడిగాను.

 

‘‘మా మామగారికి మొన్న శుక్రవారం రాత్రి హార్ట్‌ అటాక్‌ వచ్చిందిరా. అర్జంటుగా బైపాస్‌ ఆపరేషన్‌ చేశారు. ఈరోజు నా ప్రాజెక్టు ఆఖరిరోజు కదా... తప్పనిసరిగా రావాలని వచ్చాను. నా భార్య ఇంకా అక్కడే ఉంది. అందుకే ఒకసారి అక్కడకు వెళ్ళి, వాళ్ళకు కావలసిన వస్తువులు ఏమైనా కావాలంటే ఇంటినుంచి తెచ్చిపెట్టాలి’’ అన్నాడు శ్రీకాంత్‌.

అది వినగానే బాధపడుతూ ‘‘అయ్యో... అలాగా! నేను కూడా ఒకసారి వచ్చి ఆయన్ని పలకరించి వెళతాను శ్రీకాంత్‌’’ అన్నాను, ఆయనతో నాకూ కొద్ది పరిచయం ఉండటంతో.

ఇద్దరం దిగి ఆసుపత్రిలో ఆయన గదికి చేరుకున్నాం. విజిటర్స్‌ టైమ్‌ కావడంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి వాళ్ళ మామగారిని పలకరించి బయటకు వచ్చాను. శ్రీకాంత్‌ ఇంకా లోపలే వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న సోఫాలో బడలికగా కూలబడ్డాను. ఇంతలో పక్కనుండి శ్రీకాంత్‌ అత్తగారు ఎవరో బంధువులతో చిన్నగా మాట్లాడుతూ ఉండటం వినిపిస్తుంటే, కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలి అప్రయత్నంగా అటు చెవులొగ్గాను.

‘‘హఠాత్తుగా గుండెనొప్పి అంటే నా ప్రాణం పోయినంత పనైంది వదినా... ఉన్న కొడుకేమో అమెరికాలో కాలు ఫ్రాక్చరయి, కదలలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే అమ్మాయికి ఫోన్‌ చేశాను. అర్ధరాత్రి ఒంటిగంటైంది. నా అల్లుడని చెప్పటం కాదు కానీ... దేవుడిలా ఆదుకున్నాడు. వాళ్ళుండేది వూరికి ఆ చివరైతే, నిమిషాల్లో తన స్నేహితుల్ని మా ఇంటికి పంపి, అంబులెన్సులో ఆసుపత్రికి చేర్చి, తనువచ్చి డాక్టర్లకి తెలిసినవాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి, వెంటనే సరైన వైద్యం జరిగేలా చూశాడు. తనే బాధ్యతంతా తీసుకుని ఆ హామీ సంతకాలూ బిల్లులూ అన్నీ చూసుకున్నాడు. ఇక ఆపరేషన్‌ అయ్యాక నేను బీపీ పెరిగి కళ్ళుతిరిగి పడితే, ఆయన్ని కంటికి రెప్పలా రాత్రీ పగలూ చూసుకున్నాడు. నిజంగా నా కొడుకు ఇక్కడ ఉన్నా అంతలా చేసేవాడుకాదేమో అనిపించింది పిన్నీ’’ అంటుంటే ఆవిడ కంఠం రుద్ధమైంది.

ఇదంతా వింటూ మనసులోనే శ్రీకాంత్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మరో పది నిమిషాల్లో శ్రీకాంత్‌ బయటకు వచ్చాడు. ఇద్దరం మెట్లు దిగి కారు వైపు వెళుతుండగా అన్నాను- ‘‘నువ్వు గ్రేట్‌రా! మామగారిని ఇంత బాధ్యతగా చూసుకున్నావంటే...’’ నవ్వాడు శ్రీకాంత్‌.

‘‘నీ మొహం... ఇందులో గొప్పేముందిరా. వాళ్ళ అమ్మానాన్నల్ని నేను అవసరంలో ఉన్నప్పుడు ఆదుకుని ప్రేమగా చూడకపోతే... అనునిత్యం ఇంట్లోనే ఉంటున్న మా అమ్మానాన్నల్ని నా భార్య మనస్ఫూర్తిగా ఎలా చూడగలుగుతుందిరా. అయినా పెళ్ళంటేనే అర్ధాంగి ఆత్మీయులందరూ మనవాళ్ళనుకోవాలి కదా! సో, సింపుల్‌...’’ తేలిగ్గా తీసేస్తూ కారు స్టార్ట్‌ చేశాడు.

నాకేదో కళ్ళముందు మబ్బులు విడిపోయినట్లయింది. వాడి మాటల్లోనే నేను చెయ్యనిదీ చెయ్యాల్సిందీ నాకర్థమైంది. అర్థమయ్యాక ఇక నేను ఆలస్యం చేయలేదు. రాత్రంతా నేను చేయాల్సిన పనుల గురించి ఆలోచించి నా యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసుకున్నాను. ఇదేదీ శైలూకి తెలియకుండా జాగ్రత్తపడ్డాను.

అనుకున్నట్లే ఫంక్షన్‌ సమయానికి శైలూని మా పెద్దమ్మావాళ్ళ వూరు పంపేశాను. తను లేని మూడురోజుల్లో నేను అనుకున్న పనంతా పూర్తయింది. ఆరోజు రాత్రి అమ్మ ఫోన్‌ చేసింది ‘‘ఒరేయ్‌ నందూ, నేను మరో వారంరోజులాగి వస్తాన్రా! అక్కావాళ్ళు ఉండమని బలవంతం చేస్తున్నారు. శైలూ మాత్రం నీకు ఇబ్బందవుతుందని బయలుదేరుతోంది. రాత్రికి మామయ్య ‘గౌతమి’లో ఎక్కిస్తున్నాడు. పొద్దునే స్టేషనుకి వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళు. మొద్దునిద్రపోకు’’ అంటూ వెయ్యి జాగ్రత్తలు చెప్పింది.

సరేనంటూ ఫోన్‌ పెట్టి ‘యాహూ’ అనుకున్నాను.

ఉదయాన్నే లేచివెళ్ళి శైలూని రిసీవ్‌ చేసుకుని ఇంటికి తీసుకువచ్చాను. లిఫ్ట్‌ రెండవ ఫ్లోర్‌లో ఆగటం చూసి... ‘‘నందూ, రెండు నొక్కావేంటి, నిద్రమత్తులో ఉన్నావా? మనిల్లు మూడోఫ్లోర్‌ కదా’’ అంది.

మాట్లాడకుండా బయటికి నడిచి, మా ఇంటికి సరిగ్గా కింది ఫ్లాట్‌ దగ్గర ఆగి కాలింగ్‌బెల్‌ మోగించాను. అయోమయంగా నన్ను అనుసరించి, ‘‘చెప్పవేం నందూ... కొంపతీసి నేను లేనప్పుడు ఇల్లుగానీ మారిపోయావా?’’ అంది.

ఇంతలో తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన వ్యక్తిని చూసి కొయ్యబారిపోయింది శైలూ.

నవ్వుతూ నిలబడిన శైలూ తల్లి ‘‘లోపలికి రండమ్మా, కాఫీ తాగి పైకి వెళుదురుగానీ’’ అంటూ ఆహ్వానించింది.

వెనకే వస్తున్న తండ్రిని చూస్తూ ‘‘అమ్మా, ఏమిటీ సర్‌ప్రైజ్‌! నాకు మాట మాత్రం కూడా... అయినా ఇక్కడ ఇల్లెలా దొరికింది మీకు? ఎందుకు మారిపోయారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది శైలూ.

‘‘కాస్త ఆగు మరి... అన్నీ చెప్తాను... ముందీ కాఫీ తాగు’’ అని ఇద్దరికీ కాఫీ అందించిందావిడ.

కాఫీ తాగి ‘‘మీరు మాట్లాడుకోండత్తయ్యా, నేను ఆఫీసుకు రెడీ అవుతాను’’ అని చెప్పి పైకి నడిచాను.

నేను నెమ్మదిగా స్నానం చేసి తయారయ్యే సమయానికి గెంతుకుంటూ వచ్చింది శైలూ. వస్తూనే సుడిగాలిలా నన్ను చుట్టేసి గాఢంగా బుగ్గపైన ముద్దిచ్చింది. పెదవుల చివర నవ్వును బంధించి అడిగాను ‘‘ఎందుకో హఠాత్తుగా నాపైన ఇంత ప్రేమ..!’’

నా గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది ‘‘థాంక్యూ నందూ, ఎంత మంచిపని చేశావో! నిజంగా నాకు ఇలాంటి ఆలోచన రాలేదు. ఎంతసేపూ మనింట్లో ఉండటానికి అమ్మానాన్నా ఒప్పుకోవట్లేదని కుమిలిపోయానేగానీ, ఇలా దగ్గరగా ఉంచుకుని కూడా వాళ్ళ బాగోగులు చూసుకోవచ్చని నాకు తట్టలేదు సుమా! అనారోగ్యంతో, వృద్ధాప్యంతో వాళ్ళక్కడ అవస్థపడుతుంటే, నన్నంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన వాళ్ళ రుణం ఏ విధంగానూ తీర్చుకోలేకపోతున్నానని రోజూ బాధగానే ఉండేది. వాళ్ళిక్కడే ఉంటే ఏదో వంటచేసి పెట్టేందుకో, హాస్పిటల్‌కి చెకప్‌కి తీసుకెళ్ళేందుకో సాయం చెయ్యగలం... కదా! నువ్వెలా అక్కడికెళ్ళి అమ్మానాన్నలతో మాట్లాడి వాళ్ళు ఇల్లు మారటానికి ఒప్పించావో, ఇల్లు మార్చటానికి ఎంత సాయంచేశావో చెప్పి, వాళ్ళు మురిసిపోతుంటే నాకు సంతోషంతో కన్నీళ్ళొచ్చాయి తెలుసా! ఇంతకీ నేన్నీకు దీని గురించి ఏమీ చెప్పలేదు కదా. నేనీ విషయం గురించే బాధపడుతున్నానని నీకెలా తెలిసిందీ?’’ అనుమానంగా అడిగింది శైలూ.

తన కళ్ళలో మెరుపుల్ని తనివితీరా చూసుకుంటూ, తనని నా కౌగిలిలో బంధించి చెవిలో గుసగుసగా చెప్పాను ‘‘లిపి లేని నీ కంటి భాష నేను చదవగలను కదా...’’ అని.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.