close
నా డైరీలో 'అవి’ లేవు

నా డైరీలో 'అవి’ లేవు

ద్రోణాచార్య... దేశంలో క్రీడల విభాగంలో గురువులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగువారైన నాగపురి రమేష్‌ ఇటీవల అందుకున్నారు. యాభయ్యేళ్ల జీవితంలో పాతికేళ్లపాటు క్రీడాకారుల్ని మెరుగుపరుస్తూ అథ్లెటిక్స్‌ విభాగంలో ఎన్నో అంతర్జాతీయ పతకాల్ని భారత్‌ ఖాతాలో చేర్చడంలో గురుతర బాధ్యత వహించారు రమేష్‌. ద్రోణాచార్య అందుకున్న సందర్భంగా ఆ ప్రస్థానం గురించి ఆయన ఏం చెబుతున్నారంటే...
నేను పుట్టింది హన్మకొండలో. నాన్న మల్లయ్య, అమ్మ పుల్లమ్మ. మేం నలుగురు అన్నదమ్ములం, ఒక అక్క. నాన్న విద్యుత్‌ శాఖలో అటెండర్‌. పదోతరగతి వరకూ స్థానిక మచిలీబజార్‌ హైస్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో చేశాను. అక్కడ స్నేహితులూ, కుటుంబ సభ్యులూ నన్ను రవి అని పిలుస్తారు. అప్పట్లో హన్మకొండలో సారంగపాణి, ప్రభాకర్‌... అనే ఇద్దరు సీనియర్‌ అథ్లెట్లు ఉండేవారు. రన్నింగ్‌లో వారికి మంచి పేరుండేది. ఇద్దరూ మా వాడలోనే ఉండేవారు. రోజూ ఉదయాన్నే వారితోపాటూ రన్నింగ్‌కి వెళ్లడం అలవాటైంది. వాళ్ల పరిచయంతో హన్మకొండలోని ‘జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం’లో ప్రాక్టీసు చేసే అవకాశం వచ్చింది. అక్కడ వారితోపాటు ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ లాంటి సీనియర్‌ అథ్లెట్స్‌ సమక్షంలో రన్నింగ్‌ ప్రాక్టీసు చేసేవాణ్ని. స్టేడియంలో వై.రామకృష్ణ అనే క్వాలిఫైడ్‌ కోచ్‌ ఉండేవారు. ఆయన మాకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చేవారు. అసలు ప్రొఫెషనల్‌ శిక్షణ అంటే ఏంటో అప్పుడే తెలిసింది. నేను పెరిగిన వాతావరణం కాస్త రఫ్‌గా ఉండేది. స్కూల్‌, ఇంటర్మీడియెట్‌ సమయంలో భద్రకాళీ చెరువు, వెయ్యి స్తంభాల గుడి... వీటిచుట్టూ స్నేహితులతో షికార్లు చేసేవాణ్ని. కానీ గ్రౌండ్‌కి వెళ్లడం ప్రారంభించాక నా ఆలోచనలూ స్నేహాలూ మారాయి. క్రమశిక్షణ అలవడింది. గ్రౌండ్‌లో ప్రదీప్‌ గారి ప్రభావం చాలా ఉండేది. డిగ్రీ చదివే సమయంలో ఆయన జాతీయస్థాయి అథ్లెట్‌. ఆ స్ఫూర్తితో నేనూ జూనియర్‌ నేషనల్స్‌ పోటీలకు వెళ్లాను. డిగ్రీలో ఆలిండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ జట్టుకి కెప్టెన్‌గానూ చేశాను. డిగ్రీ ఫైనలియర్లో మోకాలికి గాయమైంది. 21 రోజులపాటు మంచం మీదే విశ్రాంతి తీసుకున్నాను. కోలుకున్నాక పూర్తిస్థాయి అథ్లెట్‌గా రాణించడం కష్టమనిపించింది. ఆ సమయంలో ఒక స్నేహితుడు తమిళనాడులోని కారైకుడిలో ‘మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’ చేయమనీ, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ పేపర్లో పడిందనీ చెప్పాడు. తనే దగ్గరుండి దరఖాస్తు చేయించాడు. సీటు వచ్చింది. కారైకుడికి తిరుచ్చిరాపల్లి నుంచి గంటన్నర ప్రయాణం. హన్మకొండలో నాకు కోచింగ్‌ ఇచ్చిన వై.రామకృష్ణ గారు తర్వాత తిరుచ్చిరాపల్లిలో శిక్షకుడిగా ఉండేవారు. ఆయనకు ఫోన్‌ చేసి విషయం చెబితే ‘మంచి యూనివర్సిటీ చేరిపో’ అన్నారు. కారైకుడిలో చదువుతూ వారాంతాల్లో రామకృష్ణ గారి ఇంటికి వెళ్లేవాణ్ని. నన్ను వాళ్ల కుటుంబ సభ్యుడిగానే చూసుకునేవారు. నాకు తమిళం రాదు. అక్కడెవరికీ తెలుగు రాదు. నాకు ఒకటే దారి కనిపించింది. ఇంగ్లిష్‌ నేర్చుకోవడం. హిందూ పేపర్‌ బాగా చదువుతూ ఇంగ్లిష్‌పైన పట్టు సాధించాను. అది తర్వాత నా కెరీర్లో చాలా ఉపయోగపడింది. అప్పుడు ఇంటి దగ్గర కష్టమైనా ఏదోలా సర్దుబాటు చేసి నాకు నెలనెలా డబ్బు పంపేవారు.

కారైకుడిలో నేను చదివింది ‘అళగప్ప యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌’లో. దేశంలోనే పేరున్న కాలేజీ అది. అక్కడ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పైన రీసెర్చర్లు కూడా ఉండేవారు. క్యాంపస్‌ వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉండేది. వారాంతాల్లో, సెలవురోజుల్లో తిరుచ్చి వెళ్లినపుడు రామకృష్ణ గారి శిష్యుల్లో ఆయన్‌ అన్నారీతో పరిచయమైంది. ఆయన పదేళ్లపాటు హైజంప్‌లో జాతీయ ఛాంపియన్‌, జాతీయ రికార్డు నెలకొల్పాడు కూడా. ఇంకా ఆయన శిష్యుల్లో చాలామంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉండేవారు. వాళ్లని చూసి చాలా నేర్చుకునేవాణ్ని. వారంతా గురువులకు ఇచ్చే గౌరవం చూసి నేనెంత బాధ్యతాయుతమైన వృత్తిని ఎంచుకున్నానో అర్థమైంది. రోజూ శిక్షణ తర్వాత అంతా తమ అనుభవాలను పంచుకునేవారు. కారైకుడిలో పీజీ చేస్తూ మరోవైపు తిరుచ్చీలో క్రీడాకారుల ప్రాక్టీసుని పరిశీలించడంవల్ల ఆ రెండేళ్లలో చాలా విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. పీజీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను.

దరఖాస్తు లేకుండా ఉద్యోగం
తర్వాత హన్మకొండ వచ్చి ‘కాకతీయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌’లో పీఈటీగా చేరాను. అక్కడ ముగ్గురు విద్యార్థులకు లాంగ్‌జంప్‌, హైజంప్‌, రన్నింగ్‌లలో శిక్షణ ఇచ్చాను. వారు జూనియర్స్‌లో సౌత్‌జోన్లో, నేషనల్స్‌లో పతకాలు సాధించారు. ఆ సమయంలో ప్రేమ్‌కుమార్‌ అని వరంగల్‌లో ఫుట్‌బాల్‌ కోచ్‌ ఉండేవారు. ‘మీరు పీజీ చేశారు. ఆపైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌)కి వెళ్తే ఇంకా బావుంటుంద’ని చెప్పారు. దరఖాస్తు చేశాను. బెంగళూరులో సీటు వచ్చింది. ‘డిప్లొమో ఇన్‌ కోచింగ్‌ అథ్లెటిక్స్‌’ కోర్సు అది. నేను పనిచేస్తున్న స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఛైర్మన్‌ అయిన శ్రీదేవి గారికి చెప్పాను. ఏడాదికి ఫీజు రూ.3000. ‘ఫీజు నేను కడతాను వెళ్లి చేరు’ అన్నారు. అలా 1991లో అక్కడికి వెళ్లాను. అక్కడ బ్యాచ్‌ టాపర్‌గా నిలిచాను. అక్కణ్నుంచి వచ్చి స్కూల్లో పనిచేస్తుండగా రెండు నెలల తర్వాత ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌)’ నుంచి కోచ్‌గా చేరమని పిలుపు వచ్చింది. ‘ఎన్‌ఐఎస్‌’లో టాపర్‌కి దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే కోచ్‌గా ఉద్యోగమిచ్చే పద్ధతి అప్పట్లో ఉండేది. నేను చేరిన తర్వాత ఏడాది నుంచి ఆ పద్ధతి మారిపోయింది. అది నిజంగా నా అదృష్టమే. కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు ‘శాయ్‌’ శిక్షణ కేంద్రంలో అథ్లెటిక్స్‌ కోచ్‌గా చేరమని ఆ ఉత్తరంలో ఉంది. వెంటనే శ్రీదేవి గారితో జాబ్‌ సంగతి చెప్పాను. ‘మిమ్మల్ని ఇక్కడే ఉంచి మీ ఎదుగుదలని ఆపేశానన్న అపవాదు నాకు వద్దు’ అన్నారు. ఆమె భర్త వసంతరావుకూడా ‘ఇక్కడ ఉంటే ఈ స్కూల్‌కీ, మీ వాడకే పరిమితమైపోతావు. కోచ్‌గా దేశానికి నీ సేవలు చాలా అవసరం. వెంటనే వెళ్లి చేరిపో’ అన్నారు. అలా 1992లో శాయ్‌లో కోచ్‌గా చేరాను. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే దేవుడు ఉద్యోగమిచ్చాడు. అలాంటపుడు ఈ ఉద్యోగానికి ఎంతో న్యాయం చేయాలని మొదటిరోజు నుంచే అనుకున్నాను. 1996 వరకూ చిక్‌మగ్‌ళూరులోనే పనిచేశాను. అక్కడ అరుణ్‌ డిసౌజా (స్టీపుల్‌చేజ్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడు, ఆరేళ్లు నేషనల్‌ ఛాంపియన్‌), లౌలినా లోబో, ప్రకాశ్‌... లాంటి అథ్లెట్‌లకు శిక్షణ ఇచ్చిన బృందంలో ఉన్నాను.

సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్లా!
1996లో హైదరాబాద్‌కు సమీపంలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌కి డిప్యుటేషన్‌పైన వచ్చాను. 1996-99 మధ్య అక్కడ పనిచేశాను. తర్వాత బెంగళూరులోని శాయ్‌కి బదిలీ అయింది. అప్పుడే నన్ను భారతీయ హాకీ జట్టుకి ఫిట్‌నెస్‌ కోచ్‌గా పంపారు. హాకీ జట్టు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కి సన్నద్ధమవుతున్న సమయమది. కొన్ని నెలల ముందు జట్టుతో చేరాను. ఒలింపిక్స్‌ ప్రారంభానికి మూడు వారాల ముందే సిడ్నీలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఓ పక్క శిక్షణ ఇస్తూ అక్కడ ఫిట్‌నెస్‌ క్లబ్‌లకు వెళ్తూ స్థానిక శిక్షకులతో చర్చిస్తూ చాలా విషయాలు తెలుసుకునేవాణ్ని. ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాక జట్టు శిక్షణ తర్వాత ఓరోజు విశ్రాంతి తీసుకుంటుండగా హాకీ ఆటగాడు ముఖేష్‌ కుమార్‌ నా దగ్గరకు వచ్చి... ‘అన్నా మనం ఇంటి దగ్గర ఎలాగూ రెస్ట్‌ తీసుకుంటాం. ఇక్కడ మిగతా దేశాల వారి శిక్షణ పద్ధతుల్ని పరిశీలించు’ అని చెప్పాడు. ఆరోజు నుంచీ అక్కడున్న 21 రోజులూ ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో జర్మన్‌, కొరియా లాంటి దేశాల కోచ్‌లను పరిచయం చేసుకొని వారి శిక్షణ పద్ధతుల్ని తెలుసుకునేవాణ్ని. ఒలింపిక్స్‌ తర్వాత కొన్నాళ్లు భారతీయ మహిళా జట్టుకీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేశాను.

లక్ష్మణ్‌కు సాయంగా...
క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆస్ట్రేలియాపైన కోల్‌కతాలో 281 పరుగులు చేసిన సమయంలో ఆయనకి ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ఇచ్చాను. తనకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావాలని మాటల మధ్యన లక్ష్మణ్‌ అడిగితే... హైదరాబాద్‌లోనే మంచి ట్రైనర్‌ ఉన్నాడని చెప్పి నన్ను పరిచయం చేశారు ముఖేష్‌. 281 పరుగుల ఇన్నింగ్స్‌... లక్ష్మణ్‌ జీవితంలోనే ఓ మైలురాయి. దాని వెనుక నా పాత్ర కూడా ఉందని గర్వంగా ఫీలవుతుంటాను. ఇప్పటికీ లక్ష్మణ్‌ నన్నో కుటుంబ సభ్యుడిగా చూస్తారు. 2000 ఒలింపిక్స్‌ తర్వాత హైదరాబాద్‌లోని శాయ్‌ శిక్షణ కేంద్రానికి బదిలీ అయింది. ఆ సమయంలో గోపీచంద్‌కి కొన్నాళ్లు ఫిట్‌నెస్‌ మెళకువలు నేర్పా! కానీ ఇక్కడున్న సమయం తక్కువే. 1999-2014 మధ్యలో ఎక్కువగా పటియాలాలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌’లో అథ్లెటిక్స్‌ కోచ్‌గా ఉండేవాణ్ని. అక్కడ ఎక్కువగా జాతీయస్థాయి శిక్షణ శిబిరాలు జరుగుతాయి. అక్కడ ఉంటూ దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మన ఆటగాళ్లకు ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాలకు వెళ్లాను. 2004, 2008 ఒలింపిక్స్‌ అథ్లెటిక్‌ బృందాలను తయారుచేశాను. 2016 రియో ఒలింపిక్స్‌కూ వెళ్లాను. 2002, ’06, ’10, ’14 ఆసియా క్రీడల్లో 4్ల400 రిలే విభాగంలో మన మహిళల జట్టు స్వర్ణాలు గెల్చుకుంది. భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో అదో రికార్డు. ఆ బృందానికి కోచ్‌గా ఉన్నాను. ఇదే విభాగంలో 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం, 2010లో స్వర్ణం మనకే వచ్చాయి. నేను శిక్షణ ఇస్తున్న రన్నర్‌ ద్యుతి చంద్‌... 36 సంవత్సరాల తర్వాత మనదేశం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళా అథ్లెట్‌. ఒడిశా లాంటి రాష్ట్రం నుంచి వచ్చినా జాతీయ ఛాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్స్‌ అర్హత కోసం మూడుసార్లు జాతీయ రికార్డుని తిరగరాసింది. ద్యుతితోపాటు నా శిష్యులైన సత్తి గీత, శంకర్‌, సౌజన్య, మౌనిక, మన్‌జీత్‌, పూవమ్మ... ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించారు. ఇప్పుడు చాలా రాష్ట్రాలకు చెందినవాళ్లు నా దగ్గరకు శిక్షణకు వస్తామని అడుగుతున్నారు.

గోపీచంద్‌ అకాడమీలో
2014 డిసెంబరు నుంచి గోపీచంద్‌ అకాడమీకి అనుబంధంగా శాయ్‌ నన్ను నియమించింది. గోపీ సహకారంతో ఇక్కడ సింధూతో సహా చాలామంది ఆటగాళ్లకి శిక్షణ ఇచ్చాను. సాధారణంగా కోచ్‌లు ఒక ఆటకే పరిమితమవుతారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని కావడంవల్ల విభిన్న క్రీడాంశాల్లో కృషిచేసే అవకాశం నాకు వచ్చింది. నా శ్రీమతి విద్యుల్లత. పిల్లలు అనీషా, భవిష్య. పెద్దమ్మాయి జూనియర్స్‌లో జిల్లాస్థాయి పరుగుపోటీలకు వెళ్లింది. ఓ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. కానీ నేను హైదరాబాద్‌లో ఎక్కువ సమయం లేకపోవడంవల్ల తనకు శిక్షణ ఇవ్వలేకపోయాను. చిన్నమ్మాయి ఏడో తరగతి చదువుతోంది ఆమెను క్రీడలవైపు ప్రోత్సహిస్తా. ద్రోణాచార్య అందుకున్న సందర్భంలో ప్రధానితో, రాష్ట్రపతితో ముఖాముఖి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ గౌరవం ఎంత మందికి దక్కుతుంది! నా విజయం వెనక కుటుంబ సభ్యుల త్యాగం కూడా ఉంది. దాదాపు 15 ఏళ్లపాటు కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో ఒక్కోసారి ఆరేసి నెలలపాటు ఇంటి ముఖం చూసేవాణ్ని కాదు. అలాంటప్పుడు మా అత్తామామ(సుజాత, నర్సయ్య)లు కుటుంబానికి సాయంగా ఉండేవారు. నా డైరీలో పతకాలూ, రికార్డులూ, క్రీడల పోటీలు తప్ప శుభకార్యాలూ, పిల్లల పుట్టినరోజులూ, మా పెళ్లిరోజు వేడుకలూ లేవు. క్రీడలవల్ల సత్కారాలు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవితమూ అందింది. రోజూ ఉదయం నాలుగున్నరకి నిద్రలేస్తాను. స్నానం చేశాక, యోగా, ప్రార్థన చేస్తాను. ఆరోజు శిక్షణ గురించి కాసేపు పుస్తకాలు తిరగేస్తాను. ఆరింటికి మైదానంలో ఉంటాను. సాయంత్రం మళ్లీ శిక్షణ. అప్పుడు మైదానంలో పూర్తిస్థాయిలో నేనూ వ్యాయామాలు చేస్తాను. శిక్షణ తర్వాత ధ్యానం చేస్తాను. భగవద్గీత శ్లోకాలు వింటాను. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదువుతాను. ఇంటికి దూరంగా ఉన్నపుడు నన్ను సన్మార్గంలో నడిపించేందుకు వీటిని ఎంచుకున్నాను. ద్రోణాచార్యగా మరింత ఉత్సాహంగా పనిచేస్తూ మరింత మంది క్రీడాకారుల్ని తయారుచేయడమే నా ముందున్న లక్ష్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.