close
మాచూపీచూ.. ఓ అద్భుతం!

‘రోబో సినిమాలో కిలిమంజారో పాటను చిత్రీకరించిన ప్రదేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలోని మాచూపీచూ. ఇన్‌కా నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యమూ కొత్త ప్రపంచ వింతల్లో ఒకటీ అయిన ఆ ప్రాంతాన్ని చూసొచ్చాం...’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు నెల్లూరుకి చెందిన డాక్టర్‌ కె.ఎల్‌.సంపత్‌కుమార్‌.
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న మా చిన్నమ్మాయి దగ్గరకు వెళ్లి అటు నుంచి పెరూకి వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ముందుగా నిర్ణయించుకున్న తేదీల ప్రకారం విమాన టిక్కెట్లూ ఆ దేశంలో బస చేయడానికి నిర్ణయించుకున్న హోటల్‌ వసతి వివరాలతో దిల్లీలోని పెరూ దేశ రాయబార కార్యాలయానికి అప్లై చేయడంతో అమెరికా వెళ్లడానికి ముందే ఆ వీసా లభించింది.

చెన్నై నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కోకి చేరుకున్నాం. అక్కడ నుంచి పెరూ దేశ రాజధాని లీమాకు ప్రయాణమయ్యాం. అక్కడ శాకాహారులకు ఇబ్బంది అని తెలిసి బ్రెడ్‌తో తినడానికి పచ్చళ్లూ పొడులూ తీసుకుని బయలుదేరాం. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముందుగా అమెరికా తూర్పుతీరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామికి వెళ్లి, అక్కడ నుంచి లీమాకు చేరుకున్నాం. పెరూ దేశం ఒకనాటి స్పెయిన్‌ వలసరాజ్యం కావడంతో ఇక్కడి ప్రజలు స్పానిష్‌ భాషనే మాట్లాడతారు. ఎక్కడ చూసినా స్పానిష్‌ సంస్కృతే కనిపిస్తుంటుంది. ఆనాటి చర్చిలు, పార్లమెంటు భవనం, రాష్ట్రపతి నివాస భవనం అన్నీ స్పానిష్‌ సంస్కృతికే అద్దంపడుతుంటాయి. ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయాన్నే లీమాకు ఈశాన్య దిశలో దాదాపు ఆరువందల కిలోమీటర్ల దూరంలోని కుస్కో నగరానికి లాన్‌ఎయిర్‌లైన్స్‌ విమానంలో వెళ్లాం. ఇది 15వ శతాబ్దంలో ఎంతో అభివృద్ధి చెందిన ‘ఇన్‌కా’ నాగరికతకూ ఇన్‌కా సామ్రాజ్యానికీ రాజధాని నగరం. ఈ సామ్రాజ్యం మధ్య దక్షిణ అమెరికా కేంద్రంగా ప్రస్తుతం దక్షిణ కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బొలీవియా దేశాల వరకూ వ్యాప్తి చెందింది.

క్రీ.శ. 1533లో స్పెయిన్‌ నుంచి వచ్చిన జనరల్‌ ఫ్రాన్సిస్‌ పిజారో చేతిలో ఇన్‌కా సామ్రాజ్య చక్రవర్తి అటా హుల్పో ఓడిపోవడంతో దీని పతనం మొదలైంది. కానీ, ఆనాటి నాగరికతా చిహ్నాలు ప్రస్తుతం పవిత్రలోయలోని మాచూపీచూలోనే కనిపిస్తాయి. ఉరుబాంబా నదీతీర ప్రాంతంలో ఉన్న ఈ పవిత్రలోయ కుస్కో నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలోని పిసక్‌ గ్రామం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని ఒయాంతైతాంబో అనే గ్రామం వరకూ వ్యాపించి ఉంది. స్థానిక కెచువా భాషలో ఉరుబాంబా అంటే పవిత్రమైనది అని అర్థం.

200 రకాల బంగాళాదుంపలు!
ఇక్కడ ప్రధానంగా చూడదగ్గవి పిసక్‌, మోరె, యకాయ్‌, చించిరో, ఒయాంతైతాంబో. కుస్కోలో విమానాశ్రయం నుంచి నేరుగా పిసక్‌ గ్రామానికి గైడు సాయంతో వెళ్లాం. ఆ రోజు ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ గ్రామాల్లో తయారుచేసిన హస్తకళావస్తువులను ఆ గ్రామానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అక్కడ 200 రకాల బంగాళాదుంపల్ని చూశాం. ఆల్పాకా, వికూనా, లామా... లాంటి జంతువుల వూలుతో చేసిన వస్తువుల అమ్మకం ఈ మార్కెట్‌కున్న మరో ప్రత్యేకత. తరవాత పర్యటకుల కోసమే ఏర్పాటుచేసిన ఇన్‌కాన్‌ హెరిటేజ్‌ సెంటర్‌కు వెళ్లాం. అక్కడ ఆల్పాకా, లామా జంతువుల నుంచి వూలుని తీసి ఆ వూలుతో దుస్తులు నేయడం చూపించారు. తరవాత మోరె, చించిరో ప్రదేశాల్లోని నాటి శిథిలాలను చూపించారు. నాటి ప్రజలు కొండలపైన దొరికే నీటిని వ్యవసాయానికి ఉపయోగించడంలో ప్రవీణులు. కొండచరియలను తొలిచి మెట్లుగా మలిచి నేలను చదును చేసి ఆ నేలలోనే వ్యవసాయం చేయడానికి అనువుగా ఐదు రకాల మట్టి పొరలను ఏర్పాటుచేశారు. అట్టడుగున పెద్దరాళ్లు, తరవాత చిన్నరాళ్లు ఆపైన గులకరాళ్లు పరిచారు. ఆపైన అక్కడి ఉరుబాంబా నది ఒడ్డున దొరికే ఇసుకను వేసి దానిమీద వర్షం వల్ల పర్వత శిఖరాగ్రాలనుంచి జారిపడిన ఒండ్రుమట్టిని వేసేవారు. ఈ ఒండ్రుమట్టి ఎంతో సారవంతమైనది. కాబట్టి తమకు కావాల్సిన పంటల్ని పండించుకునేవారు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ కొండల్లో పంటల్ని పండించడం, వాటికి నీటిపారుదల సౌకర్యం ఏర్పాటుచేయడం చూస్తుంటే నాటి ప్రజల సివిల్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యం అర్థమవుతుంది. మిగులు ధాన్యాన్ని భద్రపరిచేందుకు పర్వతాలమీదే గిడ్డంగులు కట్టడం ఆశ్చర్యం కలిగించింది. శత్రువుల దాడులను అరికట్టేందుకు కొండలపైనా కొండలమధ్య లోయల్లోనూ సైనికులు నివసించడానికీ ఆయుధాలను భద్రపరిచేందుకు కోటల్నీ గృహాలనీ నిర్మించారు.

భూకంపాలను తట్టుకునేలా...
అంతెత్తున ఉన్న కొండలమీదకి అంతదూరాన ఉన్న రాళ్లను తరలించడం ఒక ఎత్తయితే, ఆ రాళ్ల మధ్య మట్టీ సిమెంటూ లాంటివేవీ లేకుండా వాటిని కేవలం అమరిక ద్వారా అంత పటిష్టంగా నిర్మించడం ఆశ్చర్యం కలిగించింది. భూకంపాలను తట్టుకునేందుకు వీలుగా ఆ రాళ్లను సమలంబ చతుర్భుజాకారం రూపంలో మలిచి ఆ రాళ్ల మధ్య ఎల్‌, 7 రూపంలో చిన్నరాళ్లను అమర్చారు. క్యాలెండర్లూ పంచాంగాలూ గడియారాలూ లేని కాలంలో సూర్యగమనాన్ని గమనించడం ద్వారానే రుతువుల్నీ సమయాన్నీ లెక్కించడం అద్భుతంగా తోచింది. నాటి ప్రజలు సూర్యుడిని ఆరాధించేవారనీ కొన్ని ఆచారాలను పాటించేవాళ్లనీ నాటి నిర్మాణాలను గమనిస్తే అర్థమవుతుంది.

ఆ రోజు సాయంకాలం ఒయాంతైతాంబో లోని హోటల్లో ఉండి మర్నాడు ఉదయాన అక్కడి శిథిలాలను చూడ్డానికి వెళ్లాం. అక్కడి శిథిలాల్లో చూడదగ్గ వాటిల్లో సూర్యమండపం, రాజకుమారి స్నానగృహం, పంటధాన్యాల గిడ్డంగులూ ముఖ్యమైనవి. ఆరోజు మధ్యాహ్నం భోజనం కాగానే ప్రపంచ ఏడువింతల్లో ఒకటైన మాచూపీచూని చూడ్డానికి బయలుదేరాం. అక్కడకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచూపీచూ స్పెయిన్‌వాళ్ల దురాక్రమణకు గురికాలేదు. దీనికి కారణం ఏమిటనేది ఇప్పటివరకూ చరిత్రకారులకూ అంతుబట్టలేదు. కానీ ఇది పూర్తిగా మరుగున పడిపోవడానికి స్పెయిన్‌దేశం నుంచి ఈ ప్రాంతంలోకి వ్యాపించిన మశూచిరోగం వల్ల అక్కడి జనాభా మొత్తం మరణించి ఉండవచ్చు అని వూహిస్తున్నారు. తరవాత ఈ ప్రాంతంలో దట్టమైన అడవి పెరగడంతో ఇది మానవ సంచారానికి దూరంగా ఉండిపోయింది. 20వ శతాబ్దపు ఆరంభంలో క్రీ.శ. 1911లో అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఇరమ్‌ బింగమ్‌ స్థానిక రైతు సహాయంతో ఈ ప్రాంతాన్ని పరిశోధించి ప్రపంచానికి పరిచయం చేశారు. దాంతో ఆనాటి ఇన్‌కా నాగరికత ప్రపంచ ప్రజలకు తెలిసింది. 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా ప్రకటించింది. 2007లో ఇది ఏడు వింతల్లో ఒకటిగా ఎంపికైంది.

కెచువా భాషలో మాచూపీచూ అంటే ప్రాచీన పర్వతం అని అర్థం. ఇది సముద్రమట్టానికి 2430 మీటర్ల ఎత్తులో ఆండీస్‌ పర్వతశ్రేణుల మధ్యలోని మాచూపీచూ హుయనాపీచూ అనే రెండు కొండలమధ్య ఉరుబాంబా నదీలోయలో దాదాపు 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. చరిత్రకారుల ప్రకారం- పాచాక్యుటెక్‌, యుపంకీ, టుకెక్‌ ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తుల్లో ముఖ్యులు. యుపంకీ 1450-1490 మధ్యకాలంలో మాచూపీచూ కోటను కట్టించినట్లు తెలుస్తోంది. రెండు కొండలమధ్య ఉండటంతో ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం అనో లేదా వేసవిలో చల్లగా ఉంటుందన్న కారణంతోగానీ ఈ కోటను కట్టి ఉండొచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం.

ఇన్‌కా నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యం!
ఒయాంతైతాంబో నుంచి అగ్వస్‌ కాలియాంటిస్‌ అనే రైల్వేస్టేషన్‌కు విదేశీ పర్యటకులకోసం రైల్వేవారు నడుపుతున్న విస్టాడోమ్‌ సర్వీస్‌ అనే సూపర్‌ లగ్జరీ రైల్లో వెళ్లాం. దాదాపు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి టిక్కెట్టు ఖరీదు 68 అమెరికన్‌ డాలర్లు. ప్రయాణం కొండల మధ్య ఆహ్లాదకరంగా సాగింది. ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు ఉదయం దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని మాచూపీచూకి బస్సులో వెళ్లాం. దాదాపు అరగంట సమయం పట్టింది. ఘాట్‌రోడ్డు ప్రయాణం థ్రిల్లింగ్‌గా అనిపించింది.

మాచూపీచూ కట్టడాలు స్పెయిన్‌ ఆక్రమణలకు గురికాలేదు. కాబట్టి ఇది ఇన్‌కా నాగరికతకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. కానీ దాదాపు 4 శతాబ్దాల కాలం ప్రకృతి వైపరీత్యాలకు లోనయింది. ఈ శిథిలాలను ఎగువ, దిగువ అని రెండు విభాగాలుగా చెబుతారు. ఎగువన రాజకుటుంబీకులు, దిగువన సామాన్యప్రజలు నివసించేవారట. ఎగువ భాగంలో దాదాపు 200 భవనాలు బయటపడ్డాయి.ఇందులో ముఖ్యమైనవి సూర్యమండపం, ఇంటివాతనా మండపం, మూడు కిటికీల మండపాలు. సూర్య మండపంలో ఎలాంటి విగ్రహం లేదు. ఇక్కడ సూర్యగమనాన్ని బట్టి నిర్ణయించిన తేదీల్లో మతసంబంధ ఆచారాలు జరుగుతూ ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇంటివాతనా మండపం మధ్యలో ఓ పెద్ద దీర్ఘచతురస్రాకారపు శిల ఉంది. ఏటా జూన్‌ 21నాడు ఈ శిలకి దక్షిణం వైపున అతిపెద్ద ఛాయ, 21 డిసెంబరునాడు ఉత్తరంవైపున అతి చిన్న ఛాయ పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే 11 నవంబరు, 30 జనవరి మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఈ రాతిస్తంభం పైన ఉంటాడు. ఆ రోజుల్లో దీనిమీద ఎలాంటి ఛాయా పడదు. ఇవన్నీ చూస్తుంటే వీళ్లకు ఖగోళశాస్త్రంలో అపార ప్రతిభ ఉన్నట్లు చెప్పవచ్చు. మూడు కిటికీల మండపంలో సూర్యమండపం దిశగా ఉన్న గోడకు మూడు కిటికీలు ఉన్నాయి. మొత్తం గోడా, అందులోని కిటికీలూ ఏకశిలానిర్మితం. కానీ ఆ మండప నిర్మాణ కారణం ఇప్పటికీ బోధపడలేదు. దిగువభాగంలోని కట్టడాలలో ముఖ్యమైనది గండభేరుండ పక్షి మండపం. జలదర్పణాల మండపం. మొదటి మండపంలో పక్షి ఆకారంలో ఒక శిల, దాని ముందు ఆ పక్షికి ప్రసాదంగా జంతుబలులను ఇవ్వడానికి ఓ చిన్న శిల ఉన్నాయి. రెండో మండపంలోని శిల మధ్యలో దాదాపు ఓ అడుగు వ్యాస పరిమాణంలో వృత్తాకారంలో రెండు గుంటలు ఉన్నాయి. వాటిల్లో నీటిని పోసి అద్దాలుగా వాడి రాత్రివేళ ఆకాశంలోని గ్రహాలనూ నక్షత్రాలనూ గమనించేవాళ్లని చరిత్రకారుల అభిప్రాయం. ఇవేకాదు, సూర్య వేడుకకి వేదికగా నిలిచే ‘ఇంటి మాచె’ అనే గుహ నిర్మాణం ప్రత్యేకం. చలికాలంలో ఇక్కడకు సూర్యకాంతి అస్సలు ప్రసరించదు. కానీ ఓ టన్నెల్‌ లాంటి కిటికీ ద్వారా ఆ కాలంలో కొన్ని రోజులపాటు ఆ గుహలోకి కొండమీద నుంచి సూర్యకాంతి పడేలా ఏర్పాటుచేయడం ఎలాంటివాళ్లనయినా అబ్బురపరుస్తుంది. కొండమీద వ్యవసాయానికి అవసరమైన నీటికోసం ఎన్నో కాలువలూ కొలనులూ నిర్మించారు. కొండవాలుల్లో చిన్న చిన్న రాళ్లతో మెట్లలా నిర్మించి వ్యవసాయం చేయడం కూడా అవి కోతకు గురికాకుండా ఉండేందుకే. ఇలా దాదాపు నాలుగు గంటలపాటు మాచూపీచూలో గడిపి నాటి ప్రజల నాగరికతకు అబ్బురపడుతూ వెనక్కి వచ్చాం.