close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అల్లుడుగారు

అల్లుడుగారు
- జి.సుశీలారావ్‌

‘‘ఏవండోయ్‌, అల్లుడుగారి దగ్గర నుంచి ఫోన్‌ అనుకుంటా చూడండి’’ అంటూ సెల్‌ఫోన్‌ని భర్త రాఘవయ్యగారికి ఇచ్చింది.
దాన్ని అందుకుని ఆన్‌ చేసి ‘‘హలో బాబూ, బాగున్నారా... పిల్లలు బాగున్నారా?’’ అని అడిగాడు.
అవతలనుంచి రాహుల్‌ ‘‘మేము బాగున్నాం మామయ్యగారు... మీరెలా ఉన్నారు?’’ అని అడిగాడు.
‘‘మేమందరం క్షేమంగానే ఉన్నాం’’ అని సమాధానమిచ్చారు రాఘవయ్యగారు.
‘‘ఏం లేదు మామయ్యా, నేను వచ్చే శనివారం ఢిల్లీకి క్యాంప్‌కి వెళ్ళవలసి వస్తోంది. పిల్లలకు ఎగ్జామ్స్‌... అందుకని, కాస్త వీలుచూసుకుని ఒక పదిరోజులు మీరూ అత్తయ్యగారూ హైదరాబాద్‌ రావడానికి కుదురుతుందేమోనని ఫోన్‌ చేశాను’’ అన్నాడు.
రాఘవయ్యగారు అల్లుడి పరిస్థితిని అర్థంచేసుకుని వెంటనే ‘‘అలాగా బాబూ, తప్పనిసరిగా వస్తాం’’ అని చెప్పాడు.
‘‘సరే మామయ్యా, నేను ట్రైన్‌కి రిజర్వేషన్‌ చేయిస్తాను’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు.
‘‘ఏమంటున్నారేమిటి అల్లుడుగారు, పిల్లలు బాగున్నారు కదా!?’’ కుతూహలంగా అడిగింది జానకమ్మ.
‘‘అంతా బాగానే ఉన్నారు. అల్లుడుగారు ఢిల్లీకి ఆఫీసు పనిమీద క్యాంప్‌కి వెళుతున్నారట. పిల్లల దగ్గర ఒక పదిరోజులు ఉండటానికి మనల్ని రమ్మంటున్నారు. నేను సరేనన్నాను’’ అన్నారు.
‘‘అయ్యో పాపం, అల్లుడుగారు అంత ఇబ్బందిపడుతూ అడగాలా. అల్లుడి తరఫున తల్లిదండ్రులు కూడా లేరు సమయానికి ఆదుకోవడానికి. అన్నీ మనమే కదా చూడవలసింది.’’

దేవుడులాంటి అల్లుడ్నీ, పిల్లల్నీ ఒంటరిచేసి వెళ్ళిపోయిన పెద్దకూతురు సరోజని తలుచుకుని గతం గుర్తుకువచ్చి తనకు తెలియకుండానే కన్నీళ్ళు వరదలా తన్నుకువచ్చాయి. దేవుడు తమకు రత్నాల్లాంటి ముగ్గురు ఆడపిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు ఏనాడూ తమకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా చదువుసంధ్యల్లో ముందుండేవారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వారి స్వశక్తితో కష్టపడి చదువుకున్నారు. అనుకోకుండా సరోజకు రాహుల్‌ సంబంధం కుదరడం, పెళ్ళవడం... సరోజకు పెళ్ళయిన ఏడాదికే రమ్యకు కూడా సంబంధం ఖాయం అవడంతో చాలా వ్యయప్రయాసలుపడి ఇల్లు తనఖా పెట్టి అప్పు చేసి ఉన్నంతలోనే ఘనంగానే ఇద్దరు ఆడపిల్లల బాధ్యతనూ నిర్వర్తించుకున్నారు. రాహుల్‌, సరోజా ఇద్దరు మగపిల్లలతో హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటున్నారు- అని అనుకుంటున్న సమయంలో విధి వికటించి యాక్సిడెంట్‌ రూపంలో సరోజను మృత్యువు వెంటాడింది. అది తన కళ్ళముందరే జరిగిన ఘోరం. పోయిన ఏడాది పండగకని సరోజ, పిల్లలు మాత్రమే వచ్చారు. అల్లుడికి సెలవు దొరకక రాలేదు. షాపింగ్‌కని ఆటోలో వెళుతుంటే ప్రమాదవశాత్తూ వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటో తిరగబడి సరోజ ప్రాణం పోయింది. తను గాయాలతో బతికి బయటపడింది. ఎన్నోసార్లు అనుకుంది- ‘తన ప్రాణంపోయి కూతురు బతికితే ఎంత బాగుండేది’ అని. సరోజ చనిపోయి ఏడాది దాటింది. అప్పటి నుంచీ అల్లుడు ఇద్దరు పిల్లల్నీ కంటికిరెప్పలా తల్లిలేని లోటు తెలియకుండానే పెంచుకుంటున్నాడు.

మంచి మనసున్న అల్లుడు వేరే పెళ్ళి ఆలోచన అనేది లేకుండా పిల్లల్ని చూసుకుంటున్నాడు.
రాహుల్‌కి ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్ళు తమ్ముడికి మళ్ళీ పెళ్ళి చేయాలని ఎన్నో సంబంధాలు చూస్తూ - డబ్బున్నవాళ్ళు, కట్నకానుకలు లక్షలకొద్దీ ఇస్తామంటున్నారని చెపుతున్నా... వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా పిల్లల్ని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. అల్లుడి మంచితనాన్ని తలుచుకుంటూ స్టవ్‌ మీద టీ పెట్టడానికి పాలు పెట్టి కళ్ళవెంబడి ఉబికివస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంది.

* * *

రాఘవయ్య, జానకమ్మ పిల్లల్ని చూసుకోవడానికి హైదరాబాద్‌ వెళ్ళారు. అమ్మమ్మా, తాతయ్యా వచ్చిన సంబరంతో పిల్లలు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పిల్లలు సంతోషంగా ఉండటం చూసి రాహుల్‌ ధైర్యంగా క్యాంప్‌కి ఢిల్లీ వెళ్ళిపోయాడు.
ఉదయాన్నే పిల్లల్ని లేపి బ్రష్‌ చేయించి, స్నానం చేయించి, బట్టలువేసి, టిఫిన్‌ రెడీచేసి తినిపించి, పాలు తాగించి, లంచ్‌బాక్స్‌లు రెడీ చేసి పెట్టేసరికి స్కూల్‌ బస్సు రావడంతో పిల్లల్ని పంపించింది.
జానకమ్మ ఇంటిని సర్దిపెట్టి వచ్చి రాఘవయ్యగారితో మాటలు కలిపింది. ‘‘అల్లుడుగారిని చూస్తే చాలా బాధగా ఉందండీ, ఆడదిక్కు లేకుండా పిల్లల్నీ ఇంటినీ చూసుకోవడం మాటలా... నాకే ఎంతో కష్టం అనిపించింది’’ అంది.

‘‘అవును జానకీ, పాపం ఇంత చిన్న వయసులో భార్య లేకపోవడం, ఇటు పిల్లల పనీ అటు ఆఫీసు పనీ చేసుకోవడం చాలా కష్టమైన పనే... అయినా, ఏం చేస్తాం... విధి మనతో, మన పిల్లలతో ఆడుకుంటోంది. పెద్దది సరోజ అర్ధాయుష్షుతో మనకు దూరం అయింది. అది మరచిపోకముందే పెళ్ళయిన అయిదేళ్ళకే రెండోపిల్ల రమ్య జీవితం మోడువారిపోయింది. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసి, మన బాధ్యత నిర్వర్తించేశాం అని అనుకున్నాం. కానీ, మనమొకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. లేకపోతే పెళ్ళయిన అయిదేళ్ళకే చిన్నల్లుడు గుండెపోటుతో చనిపోవడం... తల్లీ పిల్లా మన పంచన చేరడం... ఏమిటో ఈ కష్టాలు భరించడానికే మనం ఇంకా బతికి ఉన్నామా అనిపిస్తుంది’’ అని బాధగా విచారంగా అన్నారు రాఘవయ్య.

జానకమ్మ దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకుని ‘‘జరిగిందానికి మనం బాధపడటం తప్ప ఏమి చేయగలం చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకండి’’ అని ఓదార్చుతూ... ‘‘రమ్యకి ఏం ఫర్వాలేదులెండి, మనం ఉన్నాం కదా, ఏ లోటూ రాకుండా చూసుకోవడానికి. కానీ, పాపం అల్లుడుగారినీ పిల్లలనీ చూస్తేనే బాధగా అనిపిస్తుంది’’ అంది.
‘‘అవును మరి, రెండో పెళ్ళి చేసుకోమంటే అల్లుడు ససేమిరా అంటున్నాడు.’’
‘‘అల్లుడిగారి ఆలోచన కూడా సరి అయిందేకదండీ, వచ్చేది పిల్లల్ని సరిగా చూస్తుందో లేదో తెలియదు కదా. సరే, ఆ మాటకేంగానీ ఎలాగోలాగ చిన్నదాని పెళ్ళి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందండీ.’’
‘‘అవునులే కానీ, అప్పుడే దానికి తొందరేముంది’’ అన్నాడు.
‘‘భలేవారే, మీరు చూస్తే రిటైర్‌ అయిపోయారు. అప్పోసొప్పో చేసి దాన్ని ఒక అయ్యచేతిలో పెట్టేస్తే అయిపోతుంది.
అయినా దాని గురించి ఏం బెంగలేదులెండి. బాగా చదువుకుంది. పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. కాస్త కష్టపడి దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టేస్తే మన గుండెలమీద భారం దిగిపోతుందిలెండి.’’
‘‘ఈరోజుల్లో మంచివాడో చెడ్డవాడో ఎలా తెలుస్తుంది. మొన్నటికిమొన్న ఒక సంబంధం చూస్తే ఏమయింది..? నాకు తెలిసిన స్నేహితుడు చెప్పబట్టి- వాడికి ఇదివరకే రెండు పెళ్ళిళ్ళు అయి విడాకులు తీసుకున్నాడనీ, అందుకే కాణీ కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటామన్నారనీ పైగా చెడు అలవాట్లు కూడా ఉన్నాయనీ, సరైన ఉద్యోగం కూడా లేదనీ... తెలిసింది. లేకపోతే బంగారంలాంటి స్వప్న బతుకును నాశనం చేసేవాళ్ళం’’ అన్నాడు.

‘‘అవునండీ, నిజమే... దేవుడి దయవల్ల ఆ గండం నుంచి తప్పించుకున్నాం. లేకపోతే ఆ వూబిలో పడిపోయేవాళ్ళం’’ అని ఏదో ఆలోచన వచ్చినదానిలా... ‘‘ఏవండీ నాకొక ఆలోచన వచ్చింది చెప్పమంటారా..!?
చంకలో పిల్లని పెట్టుకుని వూరంతా వెతికినట్లుంది. మంచివాడూ మంచి ఉద్యోగం చేస్తున్న మన అల్లుడికన్నా గొప్పవాడిని, మన స్వప్నకి ఎన్ని లక్షలుపెట్టినా తేలేం. పైగా పిల్లల్ని కూడా మన స్వప్న బాగా చూసుకుంటుంది. అది కూడా సుఖపడుతుంది’’ అంది.
రాఘవయ్యకు కూడా ఆ ఆలోచన మంచిగానే అనిపించింది. ‘‘నీ ఆలోచన బాగానే ఉంది. అమ్మాయి ఇష్టపడుతుందో లేదో’’ అన్నాడు అనుమానంగా.
‘‘భలేవారే మీరు, మన పిల్లల సంగతి మీకు తెలియదా! మనం ఎలా చెపితే అలా వింటారు. అల్లుడుగారు వచ్చాక ఆయన నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం’’ అంది.

రాఘవయ్య ఆలోచనలోపడ్డాడు. జానకి చెప్పింది నిజమే. చిన్న గుమస్తా ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. తన తాహతుకుమించి ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఆ అప్పులు తీరనేలేదు. ఇప్పుడు స్వప్న పెళ్ళి అంటే కొద్దోగొప్పో డబ్బు అవసరం, లక్షలు లేనిదే ఎవరూ ముందుకు రావడంలేదు. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళూ, కష్టాలూ, బాధలతో తామిద్దరూ అనారోగ్యంతో క్షీణించిపోయారు. ఇలాంటి కష్టకాలంలో అన్నీ తెలిసిన అల్లుడికి స్వప్ననిచ్చి పెళ్ళి చేయడం తప్పులేదనిపించింది. స్వప్నకన్నా కాస్త పెద్దవాడయినా, మంచివాడు కాబట్టి పిల్ల సుఖపడుతుంది’’ అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు.

* * *

ఆ మరుసటిరోజు రాహుల్‌ వచ్చాడు. టిఫిన్‌, టీలు అయిన తరవాత రాహుల్‌ పెద్దక్క దగ్గర నుంచి ఫోన్‌ రావడం... అవతలనుంచి ఫోన్‌లో గట్టిగా మాటలు వినిపించడం... రాహుల్‌ విసుగ్గా ‘‘అక్కా, దయచేసి నాకు సంబంధాలు చూడటం మానేయండి. వచ్చేవాళ్ళు నాకు భార్యగా ఉండగలరేమోగానీ, నా పిల్లలకు తల్లి కాలేరు. నన్ను ఇలా ఉండనీయండి’’ అని కోపంగా చెప్పి ఫోన్‌ పెట్టేయడం... అంతా చూస్తున్న రాఘవయ్య నెమ్మదిగా ‘‘అల్లుడుగారూ, మీతో కొంచెం మాట్లాడాలి’’ అన్నాడు.

రాహుల్‌ వచ్చి సోఫాలో కూర్చుని, ‘‘చెప్పండి మామయ్యా’’ అన్నాడు.
‘‘ఏం లేదు బాబూ, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మళ్ళీ పెళ్ళిచేసుకో బాబూ. తల్లిలేని లోటు చిన్నపిల్లలకు బాగా తెలుస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా నువ్వు మళ్ళీ చేసుకో బాబూ. పోనీ, బయట సంబంధం నీకు ఇష్టంలేకపోతే, మా చిన్నమ్మాయి స్వప్న గురించి మీకు తెలుసు కదా... అది కూడా అన్ని పనులూ చేస్తుంది. అక్కపిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. దాన్ని చేసుకో బాబూ, మా బాధ్యత కూడా తీరుతుంది’’ అన్నాడు.
రాహుల్‌ చిన్నగా నవ్వుతూ ‘‘భలేవారే మామయ్యా, స్వప్న నాకన్నా పదేళ్ళు చిన్నది, పైగా బాగా చదువుకుంది. పెళ్ళయి పిల్లలున్న నాకు ఇచ్చి స్వప్న జీవితం ఎందుకు పాడుచేస్తారు’’ అన్నాడు.
‘‘అదేంలేదు బాబూ, నీలాంటి మంచి వ్యక్తిని దానికి మేము తేలేం బాబూ. ఆ స్థోమత కూడా మాకు లేదు. అందుకనే దయచేసి నామాట కాదనకు బాబూ, మీ కాళ్ళు పట్టుకుంటాను’’ అని ప్రాధేయపడ్డాడు.
‘‘భలేవారే మామయ్యా, మీరు దయచేసి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి’’ అని నిర్మొహమాటంగా చెప్పాడు.
రాఘవయ్యగారూ, జానకమ్మా చేసేదేమీలేక బాధగా ఇంటికి వెళ్ళిపోయారు.

* * *

పండక్కి పిల్లలూ అల్లుడూ హైదరాబాద్‌ నుంచి వస్తున్నారనీ ఫోన్‌చేసి చెప్పారనీ జానకమ్మకు చెప్పాడు రాఘవయ్య. జానకమ్మకు ఎక్కడలేని ఆనందంతో మనసు నిండిపోయింది. అల్లుడుగారు ఈసారి వచ్చినప్పుడు ఎలాగైనా స్వప్నతో పెళ్ళికి ఒప్పించాలని గట్టి పట్టుదలతో నిర్ణయం తీసుకుంది.

అనుకున్నరోజు రానే వచ్చింది. పిల్లలూ అల్లుడూ రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. పిల్లలతో కలిసి చిన్నపిల్లలా ఆడుతున్న స్వప్నని నవ్వుతూ చూశాడు రాహుల్‌. ‘‘పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూశారుగా. దాన్ని పెళ్ళి చేసుకుని దాని జీవితానికి ఒక దారి చూపించండి’’ అంది జానకమ్మ.

‘‘అత్తయ్యా, మీరు కాసేపు ఈ పెళ్ళి విషయం మాట్లాడకండి’’ అంటుండగానే కారులో నలుగురు కొత్త వ్యక్తులు దిగారు. చూడటానికి బాగా డబ్బున్నవాళ్ళలా ఉన్నారు.

రాఘవయ్య, జానకమ్మ ఆశ్చర్యంగా ఎవరన్నట్టు రాహుల్‌ వంక చూశారు.

వచ్చిన కొత్త వ్యక్తుల్ని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి ‘‘మామయ్యా, అభిరామ్‌ అని నా ఫ్రెండ్‌, నాతోపాటు పనిచేస్తున్నాడు. నాకన్నా మంచి జీతం సంపాదిస్తున్నాడు. వీళ్ళు అభిరామ్‌ తల్లిదండ్రులు అని వాళ్ళకి పరిచయం చేసి, మన స్వప్నకి సంబంధం మాట్లాడాను. ఫొటో చూపించాను. వాళ్ళకి స్వప్న నచ్చింది. స్వప్నకి కూడా నచ్చితే ఇక పెళ్ళి చేయడమే ఆలస్యం’’ అని చెప్పేసరికి ఇద్దరూ నిర్ఘాంతపోయారు.

అందరూ కూర్చుని అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు. కాణీ కట్నం కూడా వద్దనీ అమ్మాయి తమకు బాగా నచ్చిందనీ ముహూర్తాలు పెట్టుకుందామనీ పెళ్ళి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామనీ తమకు ఒక్కగానొక్క కొడుకు - వచ్చే కోడలే తమను కూతురిలా చూసుకోవాలనీ... చెప్పి తాంబూలాలు మార్చుకుని వెళ్ళిపోయారు.

అంతా కలలా జరిగిపోయినదాన్ని చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు రాఘవయ్య, జానకమ్మలు. ‘‘ఏమిటి బాబూ ఇదంతా’’ అన్నట్టు చూశారు.

‘‘మామయ్యా, స్వప్న చిన్నపిల్ల... తనకి తగ్గవాడు అభిరామ్‌. చాలా మంచివాడు. పేరెంట్స్‌ కూడా చాలా మంచివాళ్ళని నేను గ్యారంటీ ఇస్తాను’’ అని నమ్మకంతో చెప్పాడు.

రాఘవయ్య ఆలోచనలోపడినట్టుగా ‘‘ఇంత మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించాలో, లేక మీలాంటి మంచివాడికీ పిల్లలకూ స్వప్న దూరం అవుతుందని బాధపడాలో తెలియడంలేదు. తల్లిలేని పిల్లల గురించే మాకు బాధగా ఉంది’’ అన్నాడు.

‘‘సరే మామయ్యా, మీరంతగా మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, మన రమ్యకు ఇష్టమైతే నా పిల్లలకు తల్లిగా ఉంటుందేమో అడిగి తెలుసుకోండి’’ అనేసరికి, ఇద్దరి ఆనందానికీ అవధులు లేకుండా పోయాయి.

మోడువారిపోయిందనుకుని అసలు రమ్య గురించీ ఆ పిల్ల జీవితం గురించీ ఆలోచించలేదు. కానీ, పెద్దమనసు చేసుకుని రమ్యకి కొత్త జీవితాన్ని ఇస్తానంటున్న అల్లుడ్ని కృతజ్ఞతాభావంతో చూసింది జానకమ్మ. కిచెన్‌లో పనిలో ఉన్న రమ్యను స్వప్న వెళ్ళి అడుగుతుంటే ‘‘అమ్మానాన్నల ఇష్టం’’ అని చిన్నగా నవ్వుతున్న రమ్యని చూడగానే ఆ తల్లిదండ్రులకు ఆనందంతో గుండె నిండిపోయింది. విధి వక్రించి తమ జీవితాలతో ఆడుకున్న ఆ దేవుడే అల్లుడి రూపంలో వచ్చి, సొంత కొడుకులా తమ కష్టాలూ బాధలూ తీర్చాడనుకుంటూ కృతజ్ఞతాభావంతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో అల్లుడ్ని చూశారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.