close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్యాగు... బహుబాగు..!

ప్రతి అందమైన అమ్మాయి విజయం వెనకా ఓ ముచ్చటైన హ్యాండ్‌బ్యాగు ఉంటుందనేది ఫ్యాషనిస్టుల ఉవాచ. బ్యాగులో పైసలున్నా లేకున్నా అది మాత్రం భుజానికి వేలాడాల్సిందే. అంతగా ఆధునిక మహిళకు బ్యాగు అత్యవసర యాక్సెసరీగా మారింది. లిప్‌స్టిక్‌ నుంచి లంచ్‌బాక్సు వరకూ ఏ వస్తువు వెంట తీసుకెళ్లాలన్నా హ్యాండ్‌బ్యాగుతోనే పని. అందుకు తగ్గట్లే ఇప్పుడు చేతి బ్యాగులు కూడా పరిమాణాన్ని పెంచుకుని సరికొత్త డిజైన్లలోనూ విభిన్న రంగుల్లోనూ కనువిందు చేస్తున్నాయి. చిల్లర వేసుకునే గుడ్డసంచీతో మొదలైన బ్యాగు ప్రయాణం కాటన్‌, సిల్కు, వెల్వెట్‌, రెక్సిన్‌, లెదర్‌ పదార్థాల మృదుత్వాన్నీ ఎంబ్రాయిడరీ అందాలనీ వజ్రాల మెరుపుల్నీ అద్దుకోవడంతోనే ఆగలేదు. చిన్నగా దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాగెట్‌, పొడవాటి తాడుతో అడ్డంగా వేసుకునే మెసెంజెర్‌, క్రాస్‌బాడీ, అర్ధచంద్రాకృతిలో మీడియం సైజులో ఉండే హొబో, రెండు స్ట్రాప్‌లతో ఉండే టొటె, బకెట్‌ ఆకారంలోని బకెట్‌, సన్నని పొడవాటి తాడుతో వేలాడే స్లింగ్‌... ఇలా భిన్న రూపాల్నీ సంతరించుకుంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందుకుని మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌... వంటి గ్యాడ్జెట్‌లకే గ్యాడ్జెట్‌గా మారి డిజైన ర్లనూ చకితుల్ని చేస్తోంది.

అయితే బ్యాగు కొనేముందు అది ఎంత అందంగా కొత్త డిజైన్‌తో ఉందన్నదే కాదు, దాని పరిమాణమూ జిప్పులూ స్ట్రాప్‌ పొడవూ వెడల్పులు అన్నీ సరిచూసుకోవాలి. బ్యాగు సైజు మరీ పెద్దదయితేే అందులో చెత్త ఎక్కువ జమ అవుతుంది. భుజంమీదా భారం పెరుగుతుంది. చిన్నదయితే అవసరమైనవి కూడా పట్టవు. కాబట్టి మీడియం సైజు బెటర్‌. జిప్పులు కూడా పట్టినట్లుగా కాకుండా సులభంగా కదులుతున్నాయో లేదో చూడాలి. అన్నింటికన్నా బ్యాగు ఫ్యాషన్‌గా ఉందా లేదా అన్నదానికన్నా సౌకర్యాన్నే పట్టించుకోవాలి. కాబట్టి భుజం నొప్పెట్టకుండా మీ శరీరాకృతిని బట్టి తగిలించుకోవడానికి ఏది అనువుగా ఉంటే అదే మీకు సరైనది, ఆ బ్యాగే బహు బాగు.


బ్యాగు... ఓ విలాసం..!

సెలెబ్రిటీలకు బ్యాగు ఓ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌. తమదైన ముద్రను వాడే బ్యాగుల్లోనే చూపిస్తారు. అందుకే వాళ్లకోసం ఆయా బ్రాండ్‌లు సైతం ప్రత్యేకంగా డిజైన్‌ చేసినవే ఈ అత్యంత ఖరీదైన బ్యాగులు...
1. మౌవాడ్స్‌ 1001 నైట్స్‌ డైమండ్‌ బ్యాగ్‌: పది మంది నిపుణులైన కళాకారుల 8,800 గంటల నిరవధిక శ్రమ ఫలితమే ఈ మాస్టర్‌ పీస్‌. 18 క్యారెట్ల బంగారం, 56 గులాబీ వజ్రాలూ 105 పసుపురంగు వజ్రాలూ 4,356 పారదర్శక వజ్రాలతో తయారైన ఈ బ్యాగు ధర అక్షరాలా 25 కోట్ల 46 లక్షల రూపాయలు.

2. గింజా తనకా హెర్మెస్‌ బిర్కిన్‌: ప్లాటినంతోనూ రెండు వేల వజ్రాలతోనూ రూపొందించిన ఈ బ్యాగు ధర సుమారు రూ. 12 కోట్ల 73 లక్షలు. బ్యాగుమీద అమర్చిన ఎనిమిది క్యారెట్ల వజ్రాన్ని బయటకు తీసి నెక్లెస్‌లోనో బ్రూచ్‌గానో కూడా వాడుకోవచ్చోచ్‌.

3. ఛానల్‌ డైమండ్‌ ఫరెవర్‌: మొసలి చర్మంతో తయారుచేసిన ఈ బ్యాగుకి 334 వజ్రాల మెరుపులు అదనపు ఆకర్షణ. భుజాలమీదుగా వేలాడే తాళ్లు అచ్చంగా తెల్ల బంగారంతో చేసినవే. ధర సుమారు కోటీ 75 లక్షలు.

4. లానామార్క్స్‌ క్లియోపాత్రా: పేరులోనే కాదు, బ్యాగులోనూ రాజసం తొణికిసలాడే ఈ బ్యాగును మొసలి కిందిభాగంలోని చర్మంతో తయారుచేశారట. బ్యాగు పైభాగంలో తెలుపురంగు బంగారపు రేకుని తాపడం చేసి దానిమీద 1500 నలుపూ తెలుపూ వజ్రాలను అతికించారు. ధర కోటీ 67 లక్షల 50 వేల రూపాయలు.

5. లూయీ వీటన్‌ అర్బన్‌ శాచెల్‌: బంగారమూ వజ్రాలూ పొదిగినవి మాత్రమే ఖరీదైన బ్యాగులు కాదు. బ్రాండెడ్‌ కంపెనీ డిజైన్‌ చేస్తే చాలని నిరూపిస్తోందీ స్క్రాప్‌ ఫ్యాషన్‌ బ్యాగ్‌. వాటర్‌బాటిళ్లూ సిగరెట్‌ప్యాక్‌లూ చూయింగ్‌గమ్‌ రేపర్లతో తయారుచేసిన ఈ బ్యాగు ధర వూహించగలరా... కోటీ యాభై వేల రూపాయలు మాత్రమే.


టెకీల కోసం..!

హ్యాండ్‌బ్యాగ్‌ వాడేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే అది కాలానుగుణంగా సరికొత్త ఫీచర్లతో ఉండాలనుకునేవాళ్లు కొందరే ఉంటారు. అలాంటివారి కోసమే ఈ టెక్‌ బ్యాగులు...వందర్‌వల్స్‌: టెక్నాలజీతోబాటు ఫ్యాషన్‌నీ జోడించినదే వందర్‌వల్స్‌ హైడ్రోజన్‌ బ్యాగ్స్‌. ఈ బ్యాగు కోసం రూపొందించిన ఆప్‌ను ఫోనులో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు... ఫ్యాషనిస్టులు తమ డ్రెస్సూ లేదా షూకి మ్యాచయ్యేలా చేతివేలుతోనే ఆప్‌లోని రంగుల్ని తాకుతూ బ్యాగు రంగును మార్చేసుకోవచ్చు. ఇక గ్యాడ్జెట్స్‌ ఛార్జింగ్‌ సౌకర్యం ఎటూ ఉండనే ఉంది. టొటె, క్రాస్‌ బాడీ స్ట్రాప్‌ ఇలా రెండు రకాల్లో ఈ బ్యాగులు దొరుకుతున్నాయి.

బ్యాగ్‌ లేడీ 2.0: వేసుకునే బ్యాగును చూస్తేనే హైటెక్‌ లేడీ అని తెలిసేలా డిజైన్‌ చేసినదే ఇది. దీనికి అమర్చిన డిజిటల్‌ కీబోర్డూ యాంటెన్నాలు వైఫై సిగ్నళ్లను క్యాచ్‌ చేసి సమాచారాన్ని బ్యాగులోని ఫోనూ లేదా ల్యాప్‌టాప్‌కు చేరేలా చేస్తాయి. అంతేకాదు, జీపీఎస్‌ ద్వారా ఆ డేటా ఎక్కడిదో కూడా తెలియజేయగలదీ సూపర్‌బ్యాగ్‌.

బ్లాక్‌ రికీ బ్యాగ్‌: ఒక్కోసారి చీకట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. బ్యాగులోనేమో చెత్త పేరుకుపోయి ఉంటుంది. అవసరమైనది ఠక్కున కనిపించదు. అలాంటప్పుడు బ్యాగులో లైటు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది. సరిగ్గా ఆ ఆలోచనతో రూపొందించినదే రాల్ఫ్‌ లోరెన్‌ బ్లాక్‌ రికీ. దీన్ని తెరవగానే అందులో అమర్చిన నాలుగు ఎల్‌ఈడీ బల్బులూ లోపల భాగాన్నంతా ప్రకాశవంతంగా చేస్తాయి. ఇంకా ఇందులోని యూఎస్‌బీ పోర్టు సాయంతో మొబైల్‌నూ ఛార్జ్‌ చేసుకోవచ్చు. రోజ్‌గోల్డ్‌ ప్లేటెడ్‌ బ్రాస్‌తో చెక్కిన బ్రాండ్‌ పేరు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ బ్యాగుకో విలాసవంతమైన అందాన్నీ తీసుకొస్తుంది.

డిఫస్‌ సోలార్‌ హ్యాండ్‌బాగ్‌: సీక్వెన్లలా ఎంబ్రాయిడరీ చేసిన ఈ బ్యాగుమీదున్న సౌర ఫలకాలు రోజూ రెండు వాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌కి చక్కగా సరిపోతుంది. అంతేకాదు, మిగులు శక్తి లోపలున్న లిథియం బ్యాటరీలోకి చేరి నిల్వ ఉంటుంది. అది బ్యాగు లోపలున్న ఆప్టికల్‌ ఫైబర్లను వెలిగేలా చేయడం ద్వారా రాత్రివేళలో అందులోని వస్తువులు కనిపించేలా చేస్తుంది. అందుకే ఇది పర్యావరణప్రియమైన టెకీ బ్యాగన్నమాట.

ఇవే కాదు, లాక్‌ చేసుకోగలినవీ సీక్రెట్‌ అరలుండేవీ... ఇలా నేటి మహిళల అవసరాలకు తగ్గట్లుగా డిజైన్‌ చేస్తోన్న టెక్‌ బ్యాగులు ఎన్నో... ఎన్నెన్నో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.