close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒట్టు... ఇవి స్వీట్లు!

స్వీట్లు ఎక్కడైనా మధురంగానే ఉంటాయి. కానీ జపనీయుల స్వీట్లు తియ్యదనానికి మించి అందంగా కూడా ఉంటాయి. వాళ్లు చేసే వగస్సి స్వీట్లు అతిథులను గౌరవించడంలో ఓ భాగంగా పుట్టుకొచ్చాయి మరి. అందుకే, ఎంతందంగా తయారుచేస్తే అతిథులు అంత బాగా సంతోషిస్తారన్నది వారి ఆలోచన. మన దగ్గర అతిథులను ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఎంత ప్రాధాన్యమైన విషయమో జపాన్‌లో తేనీటి విందుకు అంత ప్రాధాన్యత ఉంది. దానికోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ చోటును కూడా కేటాయిస్తారు. అంతేకాదు, అతిథులను చుట్టూ కుర్చోబెట్టి మధ్యలో కూర్చుని వారి ముందే గ్రీన్‌టీ పెట్టిస్తారు. ఆ టీ చేదుగా ఉంటుంది కాబట్టి, మధ్యలో తినేందుకు తయారుచేసేవే ఈ వగస్సి స్వీట్లు. మరి, ఇన్ని వినూత్నమైన రూపాలెలా పుట్టుకొచ్చాయంటారా... భోజనాల బల్లమీద అతిథులను ఆకట్టుకునేలా మనం పదార్థాలను అందంగా అలంకరిస్తాం. తేనీటి విందులో తినే స్వీట్లను రకరకాల ఆకృతుల్లో వినూత్నంగా తీర్చిదిద్దే పద్ధతి కూడా అలాగే మొదలైంది. అయితే, ఆ సంప్రదాయం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ మరింత వినూత్నంగా ముస్తాబవ్వడమే అసలు విశేషం.

ఎంతందమో...
మొగ్గ తొడిగినట్లూ పువ్వు విచ్చుకున్నట్లూ పండు తొన తీసినట్లూ రత్నాల్ని పేర్చినట్లూ నీటి బొట్టు గడ్డకట్టినట్లూ అందులో చూడచక్కని పూల అందాలు అమరినట్లూ... ఇలా ఎన్నో రకాలుగా తయారుచేసే ఆ స్వీట్లను చూస్తే చూడాలనే కోరికా తినాలనే కోరికా కలగకుండా ఉంటాయా... అందుకే, ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఇవిప్పుడు జపాన్‌తోపాటు ప్రపంచదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇంతందంగా ఉండే వీటిని బహుమతులుగా ఇచ్చేందుకూ ఆన్‌లైన్‌లో ఆర్డర్లిస్తున్నారు. పాశ్చాత్యులైతే ఈ స్వీట్ల తయారీ నేర్చుకునేందుకే ప్రత్యేకంగా జపాన్‌ వెళ్తున్నారట.

ఆశ్చర్యపోయే విషయమేంటంటే... వగస్సి స్వీట్లు చాలావాటిని పంచదార వాడకుండానే తియ్యగా తయారుచేస్తారు. జపనీయులకు పంచదార గురించి తెలియని సమయంలో అజుకి బీన్స్‌, అన్నం, స్టార్చ్‌, పండ్లతోనే స్వీట్లను తయారు చేసేవారట. అందుకే, ఇప్పటికీ ఆ పద్ధతే కొనసాగుతోంది. కొన్ని స్వీట్లు నీటిలా పారదర్శకంగా ఉండడానికి కారణం వాటి తయారీలో స్టార్చ్‌, జెలాటిన్‌లను వాడడమే.
అసలే జపనీయులకు సృజనాత్మకత పాళ్లు కాస్త ఎక్కువ. అందుకే, వారి స్వీట్లూ కళకళలాడుతున్నాయి.


 

కదంబం
వారెవ్వా... ఏమి ఫ్యాషన్‌!

బాటిల్‌ మూతల్ని అలా తలనిండా చుట్టుకున్నారు... ఇదెక్కడి విడ్డూరం... అని మనకు అనిపించొచ్చుగానీ అవి వాళ్లకు మాత్రం ఎంతో అందమైన ఆభరణాల్లా కనిపించాయి. ఇథియోపియాకు చెందిన డాసనాచ్‌ గిరిజనులు వీళ్లు. అడవులూ కొండలకు దగ్గరగా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఈ గిరిజనులు నిన్న మొన్నటి వరకూ స్థానికంగా దొరికే చెక్కలూ పూసలతో చేసిన నగల్ని వేసుకునేవారు. కానీ ఇప్పుడు పర్యటకులు తాగి వదిలేసిన బీరు బాటిళ్లూ కూల్‌డ్రింకు బాటిళ్ల మూతలూ పాత వాచ్‌లూ ఇనుప ముక్కలూ తదితర వ్యర్థాలే వారికి ఆభరణాలవుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్లూ ఇథియోపియాలోని ఒమో వ్యాలీలో ఇప్పుడు ఎటుచూసినా గిరిజనుల తలల్ని ఈ వ్యర్థాభరణాల ఫ్యాషన్‌ చుట్టుముట్టేసింది. అంతేకాదు, ఈ ఆభరణాల్ని వాళ్లు తమ తెగకే ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నంగా భావిస్తున్నారట.


చంపొద్దు ప్లీజ్‌