close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిదానమే... విధానం!

నిదానమే... విధానం!

త్తకు జై!
ఆ నడకలో వేగం లేకపోవచ్చు. అయితేనేం, గమ్యాన్ని చేరుకోవాలన్న తపన ఉంటుంది. ఒక్క ఉదుటున గెంతలేకపోవచ్చు. కానీ, చిన్నచిన్న అడుగుల్నే శక్తిమంతంగా వేస్తుంది. ఓ బౌద్ధ కథలో ముసలి నత్త ఫ్యూజీ పర్వతాన్ని అధిరోహిస్తూ మధ్యలోనే మరణిస్తుంది. సృష్టికర్త ఆ నత్త ఆత్మను ‘విజయం కంటే ప్రయత్నమే గొప్పది మిత్రమా, నీ జన్మధన్యం!’ అని అభినందిస్తాడు.

తాబేలుకు జిందాబాద్‌!
కుందేలు తేలికైన ప్రాణి. వేగంగా పరుగెత్తగలదు. తాబేలు బరువైన జీవి. అడుగు తీసి అడుగేయడానికే ఆపసోపాలు పడుతుంది. అనగనగా కథలో...పందెం మొదలైపోగానే కుందేలు చకచకా ముందుకెళ్లిపోయింది. తాబేలు మాత్రం, తనదైన శైలిలో కాలు కదిలించింది. కుందేలుకు స్థిరత్వం తక్కువ. తాబేలుకు లక్ష్యమే సర్వస్వం. కాబట్టే, కూర్మమే గెలిచింది.
- ఈ రెండు జీవులూ ‘కైజెన్‌’ కథానాయకులు.
కొద్దికొద్దిగా...
క్రమక్రమంగా...
బలంగా...
స్థిరంగా...
నిరంతరంగా...
- ఇదే కైజెన్‌ మంత్రం, ఇదే కైజెన్‌ సూత్రం, ఇదే కైజెన్‌ సిద్ధాంతం. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఆ కొద్దికొద్ది మార్పే దీర్ఘకాలంలో కొండంత ప్రభావం చూపుతుంది. ఆ క్రమక్రమమైన ఎదుగుదలే ఏదో ఓరోజు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఆ కాస్తంత కాస్తంత ప్రయత్నాలన్నీ పోగైపోయి కొండంత అండనిస్తాయి.
బరువు తగ్గించుకోవడం, ఆర్థికంగా మెరుగుపడటం, వ్యసనానికి దూరం కావడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం...లక్ష్యం ఏదైనా మార్గం కైజెన్‌!
కైజెన్‌కు పరిమితుల్లేవు, మినహాయింపుల్లేవు, హద్దుల్లేవు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా అన్వయించుకోవచ్చు - వ్యక్తి కావచ్చు, వ్యాపార సంస్థ కావచ్చు, ప్రభుత్వమూ కావచ్చు.
జపనీస్‌ భాషలో -
కై అంటే మార్పు.
జెన్‌ అంటే మంచి.
కైజెన్‌ - మంచి మార్పు, నిరంతరం మెరుగుపడుతూనే ఉండటం.
మారితీరాలన్న బలీయ ఆకాంక్షే కైజెన్‌కు వూపిరి. కొత్తను ఆమోదించలేని అభద్రత కైజెన్‌కు పరమశత్రువు. సమస్యను ఉన్నదున్నట్టు చూడగలిగే గుండెదిటవూ ఉండాలి. ‘అవును; ఇదీ సమస్య, ఇప్పటికైనా పరిష్కరించకపోతే మరింత తీవ్రం అవుతుంది’ - అని నిర్భయంగా అంగీకరించగలగాలి. పలాయనవాదం అస్సలు పనికిరాదు. ఈ ప్రపంచంలో మీరు అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. అంతకు మించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. కైజెన్‌లో ఆత్మద్వేషానికీ, ఆత్మన్యూనతకూ తావులేదు. ఒక్కసారి కైజెన్‌కు సరిపడా మనోస్థైర్యాన్ని కూడగట్టుకున్నామంటే, ఓ పెద్ద మార్పు వైపుగా చిన్న ప్రయత్నం మొదలైనట్టే.

టొయోటా ఆవరణలో...
కైజెన్‌కు రూపమిస్తే, దాన్నో కార్ఖానాగా మారిస్తే అచ్చంగా జపాన్‌లోని టొయోటా కంపెనీలా ఉంటుంది. కైజెన్‌ ... టొయోటా అంతరాత్మ, అక్కడి పనిసంస్కృతిలో ఓ భాగం. ఆ ఆవరణలో అట్టడుగు ఉద్యోగి కూడా, తనను తాను ప్రత్యేకంగా భావిస్తాడు. యాజమాన్యం తన ఆలోచనల్ని గౌరవిస్తుందని సగర్వంగా చెబుతాడు. ఏటా మూడువేల కొత్త కైజెన్లు ఉద్యోగుల నుంచి అందుతాయి. అందులో సగానికిపైగా ఏదో ఓ రూపంలో అమలుకు నోచుకుంటాయి. ప్రతి చిన్న పనిలో ఇంకాస్త మెరుగుదల సాధించాలన్న తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఉదయం ప్రార్థన సమావేశంలా అక్కడ ‘కైజెన్‌ మీటింగ్‌’ ఉంటుంది. ప్రవేశ ద్వారం పక్కనే కైజెన్‌ అర దర్శనమిస్తుంది. పనితీరును మెరుగుపరచే చిన్నచిన్న ఆలోచనల్ని అక్కడ రాసిపెట్టవచ్చు. బొమ్మలుగానూ అతికించవచ్చు. ఏ మార్పునైనా అమలు చేసే ముందు ఐదు అంచెల్లో ‘ఎందుకు?’ అని ప్రశ్నించుకుంటారు. ఆతర్వాతే ఆచరణ. ఏ కార్ల కంపెనీ అయినా, ఓ కొత్త డిజైన్‌కు తుదిరూపం ఇవ్వడానికి మూడేళ్లు తీసుకుంటుంది. ఆ పని టొయోటాలో ఏడాదిలోపే పూర్తయిపోతుంది. అలా అని అక్కడ భారీభారీ ప్రోత్సాహకాలేం ఉండవు. చిన్నచిన్న ప్రశంసలూ, చిరు కానుకలూ మాత్రమే అందుతాయి.

ఓసారి, టొయోటా అమెరికా శాఖలో ఉత్పత్తి బాగా పడిపోయింది. సాంకేతిక సమస్యలూ వచ్చాయి. దీంతో అమెరికా నిపుణుల్ని జపాన్‌ కార్ఖానాకు పంపారు. ఆ రెండు దేశాల పని సంస్కృతుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అమెరికా ఉద్యోగులకు కచ్చితమైన టార్గెట్లు ఉంటాయి. జపాన్‌లో లక్ష్యాల కంటే నాణ్యత మీదే ఎక్కువ దృష్టి. అమెరికా శ్రామికులు తమకు అప్పగించిన బాధ్యత వరకే పరిమితం అవుతారు...నట్లు బిగించడమంటే నట్లు బిగించడమే, రంగులేయడం అంటే రంగులేయడమే. జపాన్‌ శ్రామికులు తాము చేస్తున్న పనినే కాకుండా, తమకంటే ముందు మరొకరు చేసిన పనినీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. దీనివల్ల, లోపాలుంటే వెంటనే బయటపడిపోతాయి. అదే అమెరికాలో, ఏ చిన్న సమస్య ఉన్నా...చిట్టచివరి దశలోనే తెలుస్తుంది. దీంతో, మళ్లీ మొత్తం విప్పదీయాలి. ఎంత సమయం వృథా! కొన్నిసార్లు ఆ ఉత్పత్తి ఖాతాదారుడి చేతికి వెళ్లిపోయి ఉండనూవచ్చు. ఫలితంగా బ్రాండ్‌ విలువ దెబ్బతింటుంది. పని సంస్కృతిలోని ఆ లోపాన్ని గుర్తించాక, అమెరికా విభాగంలోనూ కైజెన్‌ను అమలుచేశారు. ‘ద టొయోటా వే’ పుస్తక రచయిత జెఫ్రీ లైకర్‌ అన్నట్టు... టొయోటా అన్నది కంపెనీ పేరు మాత్రమే కాదు, కైజెన్‌ మనోస్థితి!కొత్త నిర్వచనం...
ఓ సోమరి చెట్టుకింద కునుకుతీస్తున్నాడు. శ్రమజీవి అటుగా వెళ్లాడు. ‘సమయాన్ని వృథా చేయకుండా, నాలా కష్టపడొచ్చుగా!’ అని మంచి చెప్పబోయాడు శ్రామికుడు. ఎదురు ప్రశ్నించాడు బద్ధకస్తుడు. ఆ ఇద్దరి సంభాషణ ఇలా సాగింది...
‘కష్టపడి ఏం చేస్తావ్‌?’
‘నాలుగు డబ్బులు సంపాదిస్తా’
‘సంపాదించాక?’
‘ఇల్లు కట్టుకుంటా, పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని కంటా...’
‘ఆతర్వాత....’
‘ఇంకేముంది, హాయిగా విశ్రాంతి తీసుకుంటా’
‘ఎప్పుడో నువ్వు చేయాలనుకుంటున్నది, ఇప్పుడు నేను చేస్తున్నా. ఆమాత్రం దానికి అంత కష్టపడటం ఎందుకు?’ - చెప్పాల్సిందేదో చెప్పేసి, మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు బద్ధకస్తుడు.
ఓ ప్రయోజనాన్ని ఆశించి పడే కష్టం, ఇలానే నవ్వులపాలు చేస్తుంది. తరచూ అసంతృప్తికి గురిచేస్తుంది. ఓ లక్ష్యానికి గురిపెట్టడం, ఎలాగోలా సాధించడం, విజయానందాన్ని ఆస్వాదించడం. అంతేనా, ఆ కాస్త సంతోషంతోనే సర్దుకుపోవాల్సిందేనా! కానేకాదు. పరుగు-గెలుపు-విశ్రాంతి...ఫార్ములాను కైజెన్‌ నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది. చాలామంది విజేతల జీవితాలు ఆవిష్కరణ దగ్గరో, పురస్కారంతోనో ఆగిపోతాయి. ఆ కల సాకారం కాగానే, ‘ఆతర్వాత ఏమిటి?’ అని ప్రశ్నించుకోడానికి ధైర్యం సరిపోదు. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడానికి అహం ఒప్పుకోదు. ఇంకేముంది, వికాసానికి సమాధి కట్టుకున్నట్టే. ఓ చిన్న కప్పు అందుకున్నాకో, ఒకట్రెండు ఇంక్రిమెంట్లు మంజూరైపోయాకో, ఓ బిరుదం పేరుపక్కన చేరాకో...సృజన ప్రవాహం మందగించకూడదు. కైజెన్‌ ప్రకారం...గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదు, మహా అయితే ఓ చిన్న మలుపు. కైజెన్‌ పని సంస్కృతిలో విజయానికిచ్చే నిర్వచనమే వేరు - మనకు మనం మెరుగులు పెట్టుకుంటున్నప్పుడు తళుక్కుమనే చిన్న మెరుపే గెలుపు! ఆ కాస్త వెలుగునే మహాకాంతిగా భ్రమిస్తే నష్టం మనకే.

‘ప్రక్రియే’ ప్రధానం...
కైజెన్‌లో ప్రతి సమస్యనూ ప్లాన్‌-డూ- చెక్‌-యాక్ట్‌ (పీడీసీయే) పద్ధతిలో విశ్లేషించుకుంటారు.
ప్లాన్‌: సమస్యను గుర్తించడం. అందుబాటులో ఉన్న పరిష్కారాల్ని ముందుంచుకోవడం.
డూ: అందులోంచి ఉత్తమమైన పరిష్కారాన్ని అమలు చేయడం.
చెక్‌: ఆ పరిష్కారం ఎంత సమర్థంగా పనిచేస్తోందో బేరీజు వేయడం.
యాక్ట్‌: పరిష్కారం సంతృప్తికరంగా అనిపిస్తే, దాన్నే మరింత మెరుగుపరచడం. మరిన్ని విభాగాలకు విస్తరించడం. ఏదైనా లోపం ఉన్నట్టు తేలితే, ఆ లోపాన్ని సరిచేయడం లేదా మరో పరిష్కారాన్ని వెతికిపట్టుకోవడం.
ఈ సూత్రాన్ని ఏ సమస్యకైనా అన్వయించుకోవచ్చు.
కైజెన్‌ - ఆరు నెలలకు పది కిలోలు తగ్గాలనో, పదిహేను కిలోలు తగ్గాలనో చెప్పదు. కార్ఖానాలో ఉత్పత్తి పది టన్నులు పెరగాలనో పాతిక టన్నులు పెరగాలనో లక్ష్మణరేఖ గీసేయదు. నిన్నటితో పోలిస్తే ఈరోజు నువ్వెంత మారావు, ఈరోజుతో బేరీజు వేస్తే రేపటికి ఇంకెంత మారబోతున్నావు ... ఇలా ఆ మదింపు చిన్నచిన్న మార్పుల చుట్టే తిరుగుతుంది. కైజెన్‌లో లక్ష్యాన్ని చేరుకునే ‘ప్రక్రియ’ ప్రధానం! ఒకటి, రెండు, మూడు..తదితర లెక్కలది రెండో స్థానమే. రోజూ ఏడింటికి నిద్రలేవడం మీకు అలవాటు. దాన్ని ఆరున్నరగా మార్చుకుంటారు. ఆ అరగంట సమయాన్ని యోగాకో, వ్యాయామానికో, నడకకో కేటాయిస్తారు... అయినా, కుదరకపోతే ఓ ఇరవై నిమిషాలు! భోజన విధానంలోనూ అంతే. కాస్త నూనె తగ్గిస్తారు. కాస్త మితంగా భోంచేస్తారు. రెండు మిఠాయిలు తినేచోట ఒకటే నోట్లో వేసుకుంటారు. ఇప్పటిదాకా రోజూ మాంసాహారం తినేవారు, ఇకనుంచి వారానికి రెండుసార్లో మూడుసార్లో తింటారు. అంతేకానీ, హఠాత్తుగా తిండిమానేసి కడుపు కాల్చుకోవడమో, బెరియాట్రిక్‌ సర్జరీకి సిద్ధపడి పరపరా పొట్ట కోయించుకోవడమో అస్సలు జరగదు. అయితే, ఆ చిన్న మార్పులోనే స్థిరత్వం ఉంటుంది. ఉల్లంఘన దాదాపుగా కనిపించదు. ఎట్టిపరిస్థితిలోనూ మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలేయరు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం, హఠాత్తుగా ఆహార విధానాన్ని మార్చుకునేవారిలో తొంభై ఎనిమిదిశాతం మంది ఘోరంగా విఫలం అవుతున్నారు. కొద్దికాలానికే మళ్లీ పాతదార్లోకి వస్తున్నారు. మార్పు అనేది ఓ అలవాటుగా మారినప్పుడే ఫలితం ఉంటుంది. అది సాధ్యం కానంత కాలం, మనం పూర్తిగా మారనట్టే. మనం సాధించాల్సిన మార్పునకు అవరోధంగా ఉన్న అలవాట్లు ఏమిటో ఓ అంచనాకు రావాలి. వాటిని క్రమక్రమంగా వదిలించుకోవాలి. లక్ష్యసాధనకు ఉపకరించే అలవాట్లు ఏమిటన్నదీ గుర్తించాలి. వాటిని అంతే క్రమంగా జీవితంలో భాగం చేసుకోవాలి.
ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉంది.
కాస్త ముందే లేచి నడకకో యోగాకో వెళ్లే అలవాటుతో దాన్ని అధిగమించాలి.
మద్యం తాగే అలవాటు ఉంది.
ఏ హాబీ క్లాసుకో వెళ్లే అలవాటుతో ఆ స్థానాన్ని పూర్తిచేయాలి.
ఇలా... మెల్లమెల్లగా ఓ హానికరమైన అలవాటును వదిలించుకుంటాం.
క్రమక్రమంగా ఓ మంచి అలవాటును పెంచిపోషించుకుంటాం.
దీన్నే కైజెన్‌ పరిభాషలో ‘రిప్లేస్‌మెంట్‌ థెరపీ’ అంటారు. ఆ ప్రక్రియ విజయవంతం అవుతున్నకొద్దీ...మనం గమనించినా గమనించకపోయినా బరువులో తేడా వచ్చేస్తుంది, ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది, మనసు మునుపటికంటే మహాప్రశాంతంగా ఉంటుంది.చిన్నగా పెద్ద మార్పులు...
పెనుమార్పులను మెదడు వ్యతిరేకిస్తుంది. చిన్నచిన్న సర్దుబాట్ల విషయంలో ఆ సమస్య ఉండదు. ఓ చిన్న అడుగేస్తాం. కాస్తంత నమ్మకం వస్తుంది. రెండో అడుగు వేస్తాం. నమ్మకం ఇంకాస్త పెరుగుతుంది. మూడో అడుగువేస్తాం. నాలుగో అడుగుకు సరిపడా ఆత్మవిశ్వాసం సమకూరుతుంది. అప్పటికే కొద్ది అడుగులు వేశామన్న ధైర్యం ఉండనే ఉంటుంది. మెదడు కూడా మార్పులోని ‘కిక్కు’ను మెల్లమెల్లగా ఆస్వాదించడం మొదలుపెడుతుంది. మార్పులకు తగినట్టు తనను తాను రీ-ప్రోగ్రామ్‌ చేసుకుంటుంది. దీంతో అదో అలవాటుగా మారుతుంది. చిత్రలేఖనం, వ్యాయామం, పుస్తక పఠనం.. ఇవన్నీ ఏదో ఒకరోజు చిన్నగా మొదలుపెట్టిన అలవాట్లే. ఆ మాటకొస్తే మద్యం, ధూమపానం కూడా చిన్నచిన్నగా మొదలైనవే. మిత్రుడి బలవంతం మీద ఒకసారీ, సహోద్యోగి ప్రమోషన్‌ పార్టీలో ఒకసారీ... ఇలా బిడియం బిడియంగా బోణీ చేసినవే. మొదట్లో మెదడు తిరస్కరించే ఉంటుంది. ‘లేనిపోని అలవాట్లు అవసరమా?’ అని హెచ్చరించే ఉంటుంది. ఒకట్రెండుసార్లు, మనస్సాక్షి మాటల్ని వినే ఉంటాం. ఆతర్వాత, పెడచెవిన పెట్టేసి ఉంటాం. ఇక, ఎంత చెప్పినా ఉపయోగం లేదనుకుని నోరు మూసుకుని ఉంటుంది. అప్పటి నుంచీ ఆడిందే ఆటా, పాడిందే పాటా! పెద్దపెద్ద మార్పుల్ని అమలు చేయడానికి మెదడుకు ఓటమిభయం అడ్డొస్తుంది. చిన్నచిన్న ప్రయత్నాల్లో ఇలాంటి ఇబ్బందేం ఉండదు కాబట్టి, తొందరగా ఒప్పేసుకుంటుంది.