close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టూర్‌కి వెళ్లండి, డబ్బిస్తాం!

టూర్‌కి వెళ్లండి, డబ్బిస్తాం!

  ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ... ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాలెన్నో ఉన్నాయి! కానీ, లేనివల్లా జేబులో పైసలే! అయితే, ఇది నిన్నటివరకూ ఉన్న సమస్య. ఇప్పుడు కొత్త ప్రదేశాలు చూడాలనుకోవాలేగానీ, అందుకు సాయం చేయడానికి ముందుకొచ్చేవారెందరో!
ప్రస్తుతం ప్రపంచాన్ని బైకుపైన చుట్టొచ్చే పనిలో ఉన్నాడు 22 ఏళ్ల రోహిత్‌. 18 నెలల్లో 46 దేశాలు తిరగాలనేది అతడి ప్రణాళిక. ఇప్పటికే ఆరు నెలల్లో మనదేశంలోని రాష్ట్రాలన్నీ చుట్టివచ్చిన రోహిత్‌ సింగపూర్‌, ఇండోనేషియా, మలేసియా దేశాల్లోనూ పర్యటించాడు. ప్రస్తుతం పశ్చిమాసియాలో పర్యటిస్తున్నాడు. తర్వాత ఐరోపాలో అడుగుపెట్టనున్నాడు. ఈ పర్యటన ఖరీదు ఆరు లక్షలు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా రోహిత్‌ జేబులోంచి తీసింది కాదు. ఆ మొత్తమంతా క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సేకరించిందే! దాదాపు 87 మంది రోహిత్‌ పర్యటనకు సాయం అందించారు. ప్రపంచాన్ని చుట్టి రావాలని ఉందంటూ తాను సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఫండ్‌మైడ్రీమ్‌డాట్‌ఇన్‌’లో ఒక వీడియోని పెట్టాడు రోహిత్‌. అది చూసి చాలామంది విరాళాలు ఇచ్చారు. దానికితోడు స్నేహితులూ, బంధువులూ సాయమొచ్చారు. మొత్తంమీద ఆరు లక్షల రూపాయలు సేకరించాక ఫిబ్రవరిలో తన పర్యటనను ప్రారంభించాడు రోహిత్‌. ‘నేను సంపన్నుల కుటుంబంలో పుట్టలేదు. లక్షలు జీతం వచ్చే ఉద్యోగమూ చేయడంలేదు. కానీ 19 ఏళ్లపుడే ప్రపంచాన్ని చుట్టిరావాలనుకున్నాను. అప్పుడే నాలాంటి వారికోసం ఒక వెబ్‌సైట్‌నీ ప్రారంభించాను. అందులో ఈ పర్యటన గురించి వివరించాను. సోషల్‌ మీడియాలోనూ నా లక్ష్యం గురించి చెప్పాను’ అని చెబుతాడు రోహిత్‌. ఇతడికి విరాళాలు ఇచ్చినవారిలో ఎక్కువమంది 70 ఏళ్లు దాటినవారే. అందుకు కారణం అర్థమయ్యే ఉంటుంది. ఫేస్‌బుక్‌లో ‘ద లోన్‌ వాండరర్‌’ పేరుతో పేజీని ప్రారంభించి అందులో తన పర్యటన వివరాల్ని పెడుతున్నాడు రోహిత్‌.అంటార్కిటికా వెళ్లొచ్చాడు
ముంబయికి చెందిన అర్జున్‌ మేనన్‌... ఈ మధ్యనే అంటార్కిటికా యాత్రని ముగించుకొని వచ్చాడు. అక్కడ పేరుకుపోయిన టన్నులకొద్దీ చెత్తను తొలగించడానికి ప్రముఖ పర్యావరణవేత్త రాబర్ట్‌ స్వాన్‌ నేతృత్వంలో అక్కడికి వెళ్లి వచ్చిన 80 మందిలో అర్జున్‌ ఒకడు. ఈ యాత్రకోసం అర్జున్‌ సుమారు రూ.17లక్షలు ఖర్చుచేశాడు. దీన్లో రూ.3,68,770 క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్‌ ketto.org ద్వారా సేకరించాడు. అతడి మొత్తం ఖర్చులో దాదాపు సగం విరాళాల రూపంలోనే సేకరించాడు. ‘మనకు పెను సవాలుగా నిలుస్తోన్న భూతాపం గురించి వివరించాను. కాబట్టే నాకు 88 మంది విరాళాలు అందించారు. వ్యక్తిగత కారణమైతే ఇచ్చేవారు కాదేమో’ అంటాడు అర్జున్‌. విరాళాలు ఇచ్చినవారందరికీ తాను పెంగ్విన్లతో దిగిన ఫొటోలను పోస్టుకార్డు పరిమాణంలో ప్రింట్‌ చేయించి పంపాడు. అక్కడ తీసిన వీడియోల లింకుల్నీ వారికి ఈమెయిల్‌ చేసేవాడు.

కిక్‌స్టార్టర్‌, ఇండీగోగో, విష్‌బెర్రీ, గోఫండ్‌మి, కెటో లాంటి వెబ్‌పోర్టళ్లలో ఎవరైనా, తమ లక్ష్యం ఏదైనా క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం అభ్యర్థించవచ్చు. పర్యటనలకు సంబంధించిన ప్రాజెక్టుల్నీ చెప్పొచ్చు. ఇవి కాకుండా కేవలం పర్యటనలకే క్రౌడ్‌ఫండింగ్‌ వెబ్‌సైట్లూ ఉన్నాయి. అవి ఫండ్‌మైట్రావెల్‌, ట్రావెల్‌స్టార్టర్‌, ప్లమ్‌ఫండ్‌... మొదలైనవి. ‘ఈతరం కుర్రాళ్లు సాహసాలు చేయడానికి వెనకాడటంలేదు. ఎక్కువగా పర్యటించడానికి ఇష్టపడుతున్నారు. పర్యటించాలన్న కోరిక బలంగా ఉండి, లక్ష్యం ఉన్నతంగా ఉంటే డబ్బు వారికిపుడు సమస్య కానే కాదు’ అని చెబుతారు ‘ఫండ్‌మైట్రావెల్‌’ వ్యవస్థాపకుడు క్రిస్టీన్‌ పెటిల్లా. 2012లో ఏర్పాటైన ఈ పోర్టల్‌ద్వారా ఇప్పటివరకూ 5000 మంది నిధులు సేకరించి తమకు ఇష్టమైన ప్రదేశాల్ని చూసి వచ్చారు. క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్లలో వివరాల్ని పెట్టడంతోపాటు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లద్వారా ఎక్కువ మందికి తమ గురించి తెలిసేలా ప్రచారం చేస్తుంటారు. అక్కడ చూసి కూడా విరాళాలివ్వడానికి ముందుకు వచ్చేవారు చాలామందే ఉంటారు.హనీమూన్‌కి ప్రత్యేకం
‘మంచి లక్ష్యంతో పర్యటనకు వెళ్తామనేవారికి మా వెబ్‌సైట్లో చోటు కల్పిస్తున్నాం. స్టాండప్‌ కామెడీ చేసే ఒక బృందం తమ విదేశీ పర్యటనకు అవసరమైన ఫండింగ్‌ని మా వెబ్‌సైట్‌ ద్వారా పోగుచేసింది. వేరొకరు అంటార్కిటికా పర్యటనకు మా పోర్టల్‌ వేదికగా విరాళాలు సేకరించారు. లక్ష్యమంటూ లేకుండా కేవలం సరదా కోసం వెళ్తామని చెప్పి చాలామంది తమ వివరాల్ని మా వెబ్‌సైట్లో ఉంచుతామంటారు. వారిని ప్రోత్సహించం’ అని చెబుతారు ‘విష్‌బెర్రీ’ సహ వ్యవస్థాపకురాలు అన్షులిక దుబే. అయితే, ఇలా పరిమితులు పెడుతున్న వెబ్‌సైట్లు కొన్ని మాత్రమే. ఇంకొన్ని వెబ్‌సైట్లు కేవలం వ్యక్తిగత పర్యటనలకే క్రౌడ్‌ఫండింగ్‌ చేసేందుకు ఏర్పాటయ్యాయి. ఆ కోవకు చెందిందే హనీఫండ్‌డాట్‌కామ్‌. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకూ అయిదు లక్షలమంది తమ హనీమూన్‌కి విరాళాలు సేకరించారు. సమీర్‌, నీతాల జంట ఈ వెబ్‌సైట్‌ వేదికగా ఆఫ్రికాలో తమ హనీమూన్‌కి రూ.16లక్షలు సేకరించారు. ఇక్కడ దాతల్లో చాలామంది ‘మేము హనీమూన్‌కు వెళ్లలేకపోయాం మీరైనా వెళ్లండ’న్నవారే!
మరెందుకు ఆలస్యం మీ పర్యటనకీ ప్రణాళిక వేయండి!


 

ఓ మట్టి గణపయ్య

పండగలన్నీ ప్రకృతితో ముడిపడినవే. కానీ వాటిని ప్రకృతికి హానికలిగించేవిగా మార్చేస్తున్నాం. ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌’తో చేసిన, రసాయనాలు పూసిన విగ్రహాల్ని కొని పూజిస్తాం. వాటిని జలాశయాల్లో నిమజ్జనం చేయడంవల్ల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి పరిష్కారంగా మట్టి విగ్రహాల్ని తయారుచేసి ఉచితంగా అందిస్తున్నారు ఓ పర్యావరణ ప్రేమికుడు.

దేవుడు ఏ రూపంలో ఉన్నా భక్తులకు అందంగానే కన్పిస్తాడు. ఈ విషయంలో గణనాథుడు కాస్త ముందే ఉంటాడు. మరి మనమేం చేస్తున్నాం... బొజ్జ గణపయ్య మరింత అందంగా, ఆకర్షణీయంగా కన్పిచేందుకంటూ ప్రమాదకర రసాయనాలూ, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌(పీఓపీ)తో విగ్రహాల్ని తయారు చేస్తున్నాం. వాటితో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. మన పండగల స్ఫూర్తికే ఇది విరుద్ధం. ప్రజలను దీనిపై చైతన్యం చేస్తూ... హైదరాబాద్‌ మహానగరంలో గత పదేళ్లుగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దొరరాజు.