close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆపిల్‌ చిప్స్‌ తిన్నారా!

ఆకలిగా ఉన్న కుమారరాజా... ఓ చేత్తో ఆపిల్‌ చిప్స్‌నీ, మరో చేత్తో ఆరెంజ్‌ చిప్స్‌నీ నోట్లో వేసుకు నమిలేస్తున్నాడు... అప్పటికీ ఆకలి తీరక అక్కడే ఉన్న చామ దుంప చిప్స్‌నీ కరకరలాడించేసి కొబ్బరినీళ్లను గటారించి కుదుటపడ్డాడు. ఇదేదో సినిమా జోక్‌లా ఉన్నా... ఇక్కడ కుమార్‌రాజా నిజంగానే పండ్లూ, కూరగాయల చిప్సు తినగలడు. ఎందుకంటే యాపిల్‌, అరటీ, పైనాపిల్‌ మొదలు క్యారెట్‌, బీట్‌రూట్‌, చామదుంపల దాకా అన్ని రకాల చిప్సూ ఇప్పుడు తయారవుతున్నాయి మరి!

రుచిగా కరకరలాడుతూ ఉండే చిప్స్‌ని ఇష్టపడని వారుండరు. అందులో మనందరికీ తెలిసిందీ... చాలా మంది అమితంగా ఇష్టపడేదీ ఆలుగడ్డ చిప్స్‌నే. వీటి తరువాత మనకు అందుబాటులో ఉన్నవీ, కొంత మంది ఇష్టంగా తినేవీ అరటి, కాకరకాయ చిప్స్‌. వీటిలోనే రకరకాల ఫ్లేవర్లను జోడించిన వాటిని మనందరం రుచి చూసి ఉంటాం. కానీ రకరకాల పండ్లనీ, మరెన్నో రకాల కూరగాయల్నీ కూడా వివిధ పద్ధతులనుపయోగించి నోరూరించే చిప్స్‌గా తయారు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిని మనం తయారు చేసుకోవచ్చూ... కొన్నింటిని కొనుక్కు తినొచ్చూ.

పండ్లకు కొత్త రుచి
పండ్లంటే... అచ్చంగానో, సలాడ్లలోనో మహా అయితే చాకొలేట్‌కోట్‌తోనో తింటాం. కానీ చిప్స్‌ బోరుకొట్టకుండా ఉండేలా, పండ్లకూ కొత్త రుచులద్దేలా తయారవుతున్నవే ఫ్రూట్‌ చిప్స్‌. అంటే, ఇవి అచ్చం ఆలూ చిప్స్‌లాగే కరకరలాడుతూ ఉంటాయి. కాకపోతే ఒక్కో పండు రుచితో ఒక్కో రకం చిప్స్‌ ఉంటాయి. రంగూ పండుని బట్టే మారుతుంది. మామిడి, అరటి, పైనాపిల్‌, పియర్స్‌, కివీ, బొప్పాయి, పనస... ఇలా అన్ని రకాల పండ్లతోనూ చిప్స్‌ చేసుకోవచ్చు. ఈ చిప్స్‌ను ఓవెన్‌ బేక్డ్‌, ఆయిల్‌ ఫ్రైడ్‌, ఎయిర్‌ ఫ్రైడ్‌, వాక్యూమ్‌ ఫ్రైడ్‌... ఇలా రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఉదాహరణకు అరటి, పనస, ఆపిల్‌లాంటి పిండి పదార్థాలుండే పండ్లని పల్చగా తరిగి ఆరబెట్టి నూనెలో కరకరలాడేలా వేయిస్తారు. అదే పియర్స్‌, పైనాపిల్‌లాంటి పండ్లను పల్చగా తరిగి ఓవెన్లో పండు రకాన్ని బట్టి రెండు నుంచి మూడున్నర గంటల పాటు ఉంచితే కరకరలాడుతూ వస్తాయి. వీటినే తక్కువ నూనె ఉపయోగించి చేసే ఎయిర్‌ ఫ్రైయర్లలోనూ చేసుకోవచ్చు. ఇక వీటన్నింటికన్నా పండ్ల చిప్స్‌ తయారీకి అధునాతన ప్రక్రియ... వాక్యూమ్‌ ఫ్రైయింగ్‌. ఎయిర్‌ ఫ్రైయర్‌లాగే వాక్యూమ్‌ ఫ్రైయర్‌ కూడా తక్కువ నూనెతో వేయించే యంత్రం. దీన్ని ముఖ్యంగా ఆలూచిప్స్‌ తయారీలో వాడతారు. ఇందులో ఉండే చిప్స్‌ అధిక పీడనంతో, మామూలు ఫ్రైయర్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేగుతాయి. అందువల్ల వాటి రంగూ, రుచీ అలాగే ఉంటాయి. కానీ ముక్కల్లోని నీరు త్వరగా ఇగిరిపోయి బోలుగా కరకరలాడుతూ తయారవుతాయి. అంతేకాదు ఇందులో నూనె వాడకమూ తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా పరిశ్రమల్లో ఈ యంత్రాలను వాడుతున్నా... ఇంట్లోకి సరిపడేంత చిన్నవీ వస్తున్నాయి.

పండ్లతో పాటూ కూరగాయల్లోనూ చిప్స్‌ తయారు చేయడం కొత్త ట్రెండ్‌. క్యారట్‌, బీట్‌రూట్‌, బీన్స్‌, చామదుంప, కీరదోస, వంకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, ముల్లంగి, చిలగడదుంప... ఇలా అన్ని రకాల కూరగాయలతోనూ చిప్స్‌ తయారవుతున్నాయి. వీటినీ పండ్లలాగే రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి వివిధ వంటలకూ జోడించుకోవచ్చు. ఇంకేంటి, మనమూ పండ్లూ కూరగాయల మీద చిప్స్‌ ప్రయోగం మొదలెట్టేద్దామా!


రోడ్డెక్కితే రచ్చ రచ్చే!

  కొత్త అవసరాలను బట్టి కొత్త వస్తువులూ మన జీవితంలో భాగమవుతుంటాయి. అలాగే రోడ్లూ. పెరిగే ఇబ్బందులను బట్టి సరికొత్త ఫీచర్లుండే వాహనాలు అవసరమవుతున్నాయి. అందుకే రోడ్డు మీది వాహనాల పైనుంచే నడిచే బస్సును ఓ దేశం తీసుకొస్తే, ఏకంగా ఎగిరే కారుతో కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుని తయారైన, తయారవుతున్న వాహనాలివి... ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి!

ఎగిరే కార్లు...

సాంకేతికత అండ ఉంటే అద్భుతాలు సుసాధ్యమవుతాయని నిరూపిస్తున్నాయి ఫ్లయింగ్‌ కార్లు. మామూలు కారులానే కనిపించే ఇవి కావాలనుకున్నప్పుడు హెలీకాప్టర్‌లా పైకెగురుతాయి. రన్‌వే అవసరం లేకుండానే గాల్లోకి ఎగిరి కావలసిన చోటుకి దింపుతాయి. మనం ఎక్కడికి వెళ్లాలి అనే సమాచారాన్ని ఇందులో ఎంటర్‌ చేస్తే సరి, అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఇవి మనల్ని క్షేమంగా ఆ చోటులో దింపుతాయి. నేల మీదకు వచ్చాక తిరిగి కారులా మారి పోయి రోడ్డు మీద రయ్యిమంటాయి. ఈ రకం కార్లను అతి త్వరలో రోడ్డెక్కించనున్న సంస్థల్లో టెర్రా ఫుగియా, ఎయిరోమొబైల్‌ 0.3 ముందున్నాయి.


డ్రోనే కారు...

ప్పటి దాకా డ్రోన్లు ఫొటోలూ వీడియోలూ తీసేవిగానో, మిలటరీలో బాంబర్లుగానో ఉపయోగపడుతున్నాయని తెలుసు. కానీ ఏకంగా మనుషుల్ని ఎక్కించేసుకుని జామ్మంటాయని మీకు తెలుసా! ఇదిగోండి ఇప్పుడు మనుషులు ఎక్కే ప్యాసింజర్‌ డ్రోన్లూ వచ్చేశాయి. దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల విలువ చేసే ఈ డ్రోన్‌లో ఒక మనిషి ప్రయాణించవచ్చు. నేల నుంచి దాదాపు పదకొండున్నర వేల అడుగుల ఎత్తులో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. ఛార్జబుల్‌ బ్యాటరీల సాయంతో నడిచే ఇది ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 23 నిమిషాలు ప్రయాణిస్తుంది. దీన్ని తయారు చేసిన చైనాకు చెందిన ఇహాంగ్‌ సంస్థ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని చెబుతోంది.


కార్ల మీదుగా బస్సు!

త్యధిక జనాభాకు తగ్గట్టే ట్రాఫిక్‌ ఇక్కట్లూ చైనాకు ఎక్కువే. దాన్ని అధిగమించేందుకు సరికొత్త విధానాన్ని ఎంచుకుందా జనదేశం. అదే ట్రాన్సిట్‌ ఎలివేటెడ్‌ బస్‌. నేల మీది నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఈ బస్సు కింది భాగం ఖాళీగా ఉంటుంది. దాంతో బస్సు కింది నుంచి కార్లు సులభంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఈ బస్‌ కూడా ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా చిన్న చిన్న వాహనాల మీద నుంచే వెళ్లిపోతుంది. మామూలు రోడ్లకు ఇరువైపులా వేసిన పట్టాల్లాంటి వాటిమీద ఇది నడుస్తుంది. 21 మీటర్ల పొడవూ 25 అడుగుల వెడల్పుతో గంటకు దాదాపు 60 కి.మీ. వేగంతో వెళ్లే ఈ బస్సులో ఒక్కసారే 300 మంది ప్రయాణించవచ్చు. అంతేకాదు ఒక బస్సును మరొక బస్సుతో అనుసంధానం చేసుకోవచ్చు కూడా.


పదకొండు గంటల్లో బస్సు రెడీ...