close
ఆ పుస్తకాన్ని 120సార్లు చదివా!

ఆ పుస్తకాన్ని 120సార్లు చదివా!

గోదావరి పాలిమర్స్‌... పాతికేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న సంస్థ. తుంపర, బిందు సేద్యం పరికరాలూ, పైపులూ తయారు చేసే జాతీయ స్థాయి భారీ కంపెనీల్లో అదీ ఒకటి. నైట్‌ కాలేజీల్లో, ప్రైవేటుగా చదువుకొని, ఓ తేయాకు కంపెనీలో సేల్స్‌మన్‌గా జీవితాన్ని మొదలుపెట్టి అంత పెద్ద సంస్థకు ప్రాణం పోశారు డా. చెక్కిళ్ల రాజేంద్రకుమార్‌. పారిశ్రామికవేత్తగా దూసుకెళ్తూనే రచయితగా, ఆధ్యాత్మికవేత్తగా, సామాజిక సేవకుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు.‘ఇబ్బందులు అందరికీ వస్తాయి. వాటిని తట్టుకుని బాగా చదువుకున్న వాళ్లే జీవితంలో పైకెళ్తారు’... అని చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. చాలా సాధారణ స్థాయి నుంచి మొదలైన నా జీవితం ఇక్కడి దాకా రావడానికి అప్పట్లో అమ్మ చూపిన దారీ, నేను చదివిన చదువే పునాదులు వేశాయి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌ పాత బస్తీలోని కాలీఖబర్‌ ప్రాంతంలో. నాన్న ఆర్టీసీలో టికెట్‌ కలెక్టర్‌గా పనిచేసేవారు. చాలీచాలని నాన్న జీతంతోనే ఇల్లు గడిచేది. పదో తరగతి వరకూ స్థానిక వివేక వర్థిని స్కూల్లో చదువుకున్నా. అప్పట్లో పెద్దగా రవాణా సౌకర్యాలూ లేవు. రోజూ రిక్షాలకు డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితీ లేదు. దాంతో పదేళ్లపాటు రోజూ ఐదారు కిలోమీటర్లు నడిచే స్కూలుకెళ్లేవాణ్ణి. నలుగురు పిల్లల్ని చదివించడానికి నాన్న చాలా ఇబ్బంది పడేవారు. మేం పైతరగతులకు వచ్చేసరికి ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఇంట్లో వాళ్లకు సాయంగా ఉండటానికి కోఠీలో నోటు పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టా. ఆ వచ్చిన డబ్బుల్లో కొంత మిగుల్చుకుని ప్రైవేటుగా ఇంటర్‌కి కట్టా. యాదయ్య అనే మాస్టారు నాకు కామర్స్‌ పాఠాలు చెప్పేవారు. ఆయన శిక్షణా, ప్రోత్సాహంతోనే కాలేజీకెళ్లకుండా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశా.

నైట్‌ కాలేజీలో చదువు
చిన్నప్పుడు అమ్మ నన్ను కూర్చోబెట్టి బాలభారతం, బాలల రామాయణం, పంచతంత్ర కథల లాంటి వాటిని చదివించి వాటికి అర్థాలు వివరించి చెప్పేది. అలా చదువుకునే రోజుల్లోనే క్రమంగా పుస్తకాలపైనా ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ పూర్తయ్యేనాటికే చాలా పుస్తకాలూ, నవలలూ చదివా. డిగ్రీకొచ్చాక ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు అకౌంట్స్‌ ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టా. ఆ వచ్చిన డబ్బులతో నారాయణగూడలోని న్యూసైన్స్‌ ఈవ్నింగ్‌ కాలేజీలో చేరి బీకాం పూర్తిచేశా. అమ్మకు నన్ను ఎంబీఏ చదివించాలని ఉండేది. ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీల్లో సీటు కూడా వచ్చింది. కానీ అప్పటికే కుటుంబ భారం మోయలేకపోతున్నానే బాధ నన్ను వెంటాడేది. దాంతో అక్కడితో చదువాపేసి ఉద్యోగ వేట మొదలుపెట్టా.

ట్రెయినీ నుంచి మేనేజర్‌!
చాలాకాలం కాళ్లరిగేలా తిరిగాక చివరికి దక్కన్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. నెలకు ఆరొందలు జీతం. ఓ ఎనిమిది నెలలు పనిచేశాక అక్కడ సంతృప్తిగా అనిపించలేదు. దాంతో ఈసీఈ బల్బ్స్‌ అనే సంస్థలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా మూడు నెలలు పని చేశా. తరవాత తెలిసిన వాళ్ల ద్వారా కస్తూరీ టీ కంపెనీలో సేల్స్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. తెల్లవారుజామునే నగరంలోని టీ దుకాణాలకు వెళ్లి ఆర్డర్లు తీసుకురావడం నా బాధ్యత. నా మాటతీరుతో టీ కొట్ల యజమానులను ఆకట్టుకునేవాణ్ణి. దాంతో మొదటి నెలలోనే 60కేజీల టీ పొడికి ఆర్డర్‌ తీసుకొచ్చా. క్రమంగా ఆర్డర్ల విలువను పెంచుకుంటూ వెళ్లా. ఆ సమయంలో మా బృంద సారథి రవిరామకృష్ణన్‌ గురువులా మారి మార్కెటింగ్‌ మెలకువలు నేర్పించేవారు. ఆయన ప్రోత్సాహంతో ట్రెయినీ సేల్స్‌మన్‌గా మొదలైన నా ప్రయాణం, ఏరియా, బ్రాంచ్‌, ఫీల్డ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ స్థాయి నుంచి సేల్స్‌ మేనేజర్‌ వరకూ సాగింది. ఉద్యోగంలో అనుభవంతో పాటు మార్కెటింగ్‌లో నైఫుణ్యమూ పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలోనే సొంత కాళ్లపైన నిలబడాలీ, నలుగురికీ ఉపాధి కల్పించాలీ, నాకంటూ ప్రత్యేకత తెచ్చుకోవాలనే కోరిక నాలో పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వయం ఉపాధిపైన దృష్టిపెట్టా.

పదిమందితో మొదలు
డిగ్రీలో పరిచయమైన నా స్నేహితుడు చీకోటి వెంకటేశ్వరరావు సహాయంతో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా. అప్పటికే అతనికి రెండు మూడు చిరువ్యాపారాలు చేసిన అనుభవముంది. ఎక్కువ మందికి ఉపయోగపడే రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని ఇద్దరం రకరకాల మార్కెట్‌ అవకాశాలను పరిశీలించడం మొదలుపెట్టాం. ఆ క్రమంలోనే వ్యవసాయ రంగంపైన ఆసక్తి కలిగింది. ఆధునిక పరికరాలూ వ్యవసాయంలోకి ప్రవేశిస్తోన్న సమయమది. ఆ రంగంలోకే వెళ్లి కొత్త నాణ్యతతో పైపులూ, వ్యవసాయ పరికరాల ఉత్పత్తి మొదలుపెడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. దానికోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని పరిశోధనలు జరిపాం. వివిధ రకాల పొలాల అవసరాలకు తగ్గట్లు పైపులను తయారు చేసే ఫార్ములాలను అభివృద్ధి చేశాం. వ్యవసాయ రంగంలో విశ్వసనీయతే పెట్టుబడి. రైతుల నోటి మాటే ప్రచార మంత్రం. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకునే 1990లో హైదరాబాద్‌లోని చెర్లపల్లి పారిశ్రామికవాడలో ‘గోదావరి పాలిమర్స్‌’ సంస్థకు శ్రీకారం చుట్టాం. రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడీ, పది మంది కార్మికులతో కార్యకలాపాలు మొదలయ్యాయి.

వ్యాపారం చేస్తూనే పీహెచ్‌డీ
సంస్థను ప్రారంభించిన ఏడాది తరవాత ఎక్కువ మందికి పరిచయంలేని ‘హెచ్‌డీపీఈ’ పైపులను ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేయడం మొదలుపెట్టాం. అంతకుముందు వరకూ మార్కెట్లో ఉన్న పైపులతో పోలిస్తే అవి నాణ్యమైనవి కావడంతో వచ్చిన కొద్ది రోజులకే రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రమంగా పైపులతో పాటు నీటినీ, విద్యుత్తునూ పొదుపుగా ఉపయోగిస్తూ తక్కువ ఖర్చుతో పనిచేసే తుంపర, బిందు సేద్య పరికరాల తయారీకీ శ్రీకారం చుట్టాం. కొన్ని వందల గ్రామాల్లో తిరిగి నిపుణులతో ఆధునిక పరికరాల వినియోగంపైన రైతులకు శిక్షణ ఇప్పించాం. అలా మొదట తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది రైతులకు మా పరికరాలు చేరువయ్యాయి. ఎంతో మంది రైతులు వాటి సాయంతో లాభాల బాట పట్టారు. క్రమంగా హరియాణా, పంజాబ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి అనేక రాష్ట్రాల రైతులు మా వినియోగదార్లుగా మారారు. నేను పరిశ్రమను నెలకొల్పే నాటికే అమ్మ చనిపోయింది. నా వ్యాపారం విజయవంతంగా ముందుకు నడుస్తున్నా ఎంబీఏ చదివించాలనుకున్న అమ్మ కోరిక మాత్రం నన్ను వెంటాడుతూనే ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కంపెనీ పెట్టిన ఏడేళ్ల తరవాత పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సు చేశా. ఆ తరవాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్‌తో ఎంబీఏ పూర్తి చేశా. ఆపైన తమిళనాడులోని అలగప్పా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్‌ చేశా. ఇంకా పైచదువులు చదవాలనే ఉద్దేశంతో మార్కెటింగ్‌ రంగంలో పీహెచ్‌డీ చేయడం మొదలుపెట్టి మహారాష్ట్రలోని అమ్రావతి యూనివర్సిటీ నుంచి దాన్నీ పూర్తిచేశా. అలా పదేళ్ల పాటు ఓ పక్క చదువూ, ఇంకో పక్క వ్యాపారంతో క్షణం తీరికలేకుండా రోజులు గడిచిపోయాయి.

అయోధ్య నుంచి శ్రీలంక దాకా
పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే వివిధ అంశాలపైన సమగ్రంగా థీసీస్‌ రాయడం అలవాటైంది. అదే క్రమంగా పుస్తకాలు రాసే అలవాటుకు దారితీసింది. రూరల్‌ మార్కెటింగ్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ మెథడాలజీ లాంటి కొన్ని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌కు సంబంధించిన పుస్తకాలు రాశా. నేను రచించిన 52 పరిశోధనా పత్రాలు జర్నల్స్‌లో, ఆంగ్లపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఎన్ని పుస్తకాలు రాసినా నాలోని ఆధ్యాత్మిక కోణానికి అర్థాన్ని వెతుక్కునే సందర్భం ఈ మధ్యే వచ్చింది. ఒకప్పుడు నేను ఉద్యోగం కోసం వెతుక్కునే రోజుల్లో శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామిని కలిశాను. క్రమంగా ఆయన బోధనలను అనుసరిస్తూ ఆయన శిష్యుడిగా మారా. మూడేళ్ల క్రితం స్వామిని కలిసినప్పుడు శ్రీరాముడి తత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను ఉపదేశించారు. వాటి ప్రభావంతో రాముడి గురించి లోతుగా తెలుసుకోవాలనిపించి వాల్మీకి రామాయణం చదవడం మొదలుపెట్టా. అలా ఒకటీ రెండూ కాదు 120సార్లు ఆ మహా గ్రంథాన్ని పఠించా. అయోధ్య నుంచి శ్రీలంక దాకా రాముడు తిరిగిన ప్రస్తావన కనిపించే ప్రతి ప్రాంతానికీ వెళ్లి రామాయణ పారాయణ చేశా. చదివిన ప్రతిసారీ రాముడి లక్షణాలూ, విధానాలూ ఏదో ఒక కొత్త పాఠాన్ని నేర్పించేవి. రాముడి వ్యక్తిత్వం, అతడి నాయకత్వ లక్షణాలూ ఇప్పటి యువతకూ, కార్పొరేట్‌ దిగ్గజాలకు సైతం పాఠాలు నేర్పగలవని అనిపించింది. అదే నేను రాసిన ‘శ్రీరామ- లీడ్‌, లీడింగ్‌ అండ్‌ లీడర్‌షిప్‌’ అనే పుస్తకానికి పునాది. అదే తెలుగులో ‘శ్రీరాముడు- నీతి, నేత, నేతృత్వం’గా వెలువడింది.

250 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలైన మా ప్లాంట్‌, పాతికేళ్లలో పాతికవేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి చేరుకుంది. పది మంది ఉద్యోగుల దశ నుంచి ఇప్పుడు 540మంది ఉద్యోగులూ, పరోక్షంగా నాలుగు వేల మంది కార్మికులూ మా ద్వారా ఉపాధి పొందుతున్నారు. 60దాకా చిన్న తరహా పరిశ్రమలకు మా సంస్థే ఆధారమైంది. ఆర్థికంగా, స్థాయి పరంగా సాధించిన ఎదుగుదల కంటే కొన్ని లక్షల జీవితాలను ప్రభావితం చేశానన్న ఆనందమే నాకెక్కువ. ఒక సామాన్య టికెటü కలెక్టర్‌ కొడుకుగా, చదువుకోవడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డ నేనే కోట్లు విలువ చేసే పరిశ్రమను పెట్టగలిగినప్పుడు, కష్టపడితే ఎవరైనా, ఏదైనా సాధించగలరన్నది నా నమ్మకం. వ్యాపారం, ఆధ్యాత్మికత, సేవా... ఈ మూడూ నాకెంతో ఇష్టమైన రంగాలు. భవిష్యత్తులోనూ ఈ రంగాల్లో నాదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్తా.


అదే గొప్ప విజయం!

పారిశ్రామిక వేత్తగా బిజీగా ఉన్నా ఆధ్యాత్మిక బోధనలకూ రాజేంద్రకుమార్‌ సమయం కేటాయిస్తారు. ఈటీవీ వార్తాఛానెళ్లలో ‘తమసోమా జ్యోతిర్గమయ’ కార్యక్రమంలో, భక్తి ఛానెల్లో, రేడియోలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తుంటారు.* దిల్లీలోని ‘శారదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’కు గవర్నింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. నిరుద్యోగిగా భారతీ తీర్థ స్వామిని కలిసిన రాజేంద్ర, ఆయన ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థకి డైరెక్టర్‌గా మారడం గొప్ప విజయంగా చెబుతారు.
* ఏటా వందల గ్రామాలలో పర్యటించి రైతులకు స్వయంగా వ్యవసాయ డైరీలూ, క్యాలెండర్లూ అందించడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. గ్రామాల్లోని అనేక పాఠశాలల్లో మౌలిక వసతులూ మెరుగుపరిచారు.
* దేశ వ్యాప్తంగా ఏటా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, అలా సేకరించిన రక్తాన్ని రెడ్‌క్రాస్‌, లయన్స్‌ క్లబ్‌ల ద్వారా తలసీమియా బాధితులకూ, ప్రభుత్వ ఆస్పత్రులకూ అందించడం ఆయనకు అలవాటు.
* తమ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ మొక్కలను బహుమతిగా ఇచ్చి నాటిస్తారు. వినాయక చవితి సమయంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా సరఫరా చేస్తారు.
* ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఓ చిన్నపాటి ఉద్యమమే నడిపిస్తున్నారు. అనేక గ్రామాల్లో సభలూ, ర్యాలీలూ ఏర్పాటు చేసి వాటి ఆవశ్యకతను వివరించి గుంతలు తవ్విస్తున్నారు. ఏటా లక్ష క్యూబిక్‌ మీటర్ల పరిధిలో ఇంకుడు గుంతలు తవ్వించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
* ‘చెక్కిళ్ల జయప్రద చంద్రశేఖర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలూ, స్టేషనరీ సామగ్రిని అందిస్తున్నారు. ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఏటా రోగులకు మూడు నెలలకు అవసరమయ్యే మందులను పంపిణీ చేస్తున్నారు. ఆస్పత్రికి కొన్ని వైద్య పరికరాలనూ సమకూర్చారు.
* కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అవుట్‌స్టాండింగ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’, ఫ్యాప్సీ నుంచి ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌’, హైమా నుంచి ‘ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, అసోచామ్‌ సంస్థ నుంచి ‘బెస్ట్‌ కాస్ట్‌ కాంపిటేటివ్‌నెస్‌’ తదితర అవార్డులు అందుకున్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ నుంచి ‘బెస్ట్‌ డోనర్‌’గానూ రాజేంద్రకు గుర్తింపు దక్కింది.

- శ్రీనివాస్‌ నల్లా, న్యూస్‌టుడే, కాప్రా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.