close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
100% లవ్‌

100% లవ్‌
- జమ్మలమడక శారద

మై గాడ్‌!
36లో 30 పాయింట్లు కలిశాయి.
రాధ, శ్యామ్‌! ఆఖరికి పేర్లు కూడా కలిశాయి.

ఆస్ట్రాలజీ, గ్రాఫాలజీ, న్యూమరాలజీ, కంపాటిబిలిటీ పరీక్షలు... అన్నింట్లో దాదాపు 85 శాతం మార్కులు. మా ఇద్దరి అభిరుచులూ కలిశాయి. బహుశా మాది జన్మజన్మల బంధం కావచ్చు. ఒకరికోసం మరొకరం పుట్టి ఉంటాం. అందుకే మా ఇద్దరిమధ్యా ఇంత కంపాటిబిలిటీ ఉంది. నాకు ఏం ఇష్టమో, తనకి కూడా అవే ఇష్టం. ఆఖరికి రంగుల దగ్గరి నుంచీ.
కెరీర్‌ గురించిన ఆలోచనలూ ఒకేలా ఉన్నాయి.
హాబీస్‌ దాదాపు ఒకటే.
వావ్‌! ఎంత అదృష్టం!
భగవంతుడు మా ఇద్దరినీ ఒకరి కోసం మరొకరిని పుట్టించాడు.
పెద్దలు మొదట్లో కొంత అభ్యంతరం చెప్పారు. వాళ్ళకి మాది ప్రేమా లేక ఆకర్షణా అని అనుమానం కావచ్చు. అప్పుడు మేము మా ఇద్దరిమధ్యా ఉన్న కంపాటిబిలిటీ గురించి వివరించి, ఒప్పించాం.
మా పెళ్ళి చుట్టాలందరూ కొన్ని రోజులపాటు చర్చించుకునేంత గొప్పగా జరిగింది.
ఆ తర్వాత హనీమూన్‌! పదిహేను రోజులు ఎంజాయ్‌ చేశాం. తిరిగివచ్చి జాబ్‌లో జాయిన్‌ అయ్యాం.
లేవడం, పరుగులు, కొంత ఏకాంతం. మూడు అలకలూ ఆరు ముచ్చట్లలా సాగిపోతోంది జీవితం. నెలలు గడిచాయి.
అత్తయ్యకి ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతింది. హాస్పిటల్‌లో చేర్చాం. ఇరవై రోజుల తర్వాత ఇంటికి వచ్చారు.

ఆఫీసు పని, ఇంటిపని, టెన్షన్‌... శ్యామ్‌ నుంచి నాకు ఏ సహాయమూ అందటంలేదు. పైగా నేను వాళ్ళ అమ్మని- అంటే అత్తయ్యని సరిగా పట్టించుకోవటంలేదని తనకి అసంతృప్తి. దీంతో మా ఇద్దరిమధ్యా ఘర్షణలు మొదలయ్యాయి. నేను నా కెరీర్‌లో కీలకమైన మలుపు దగ్గర ఉన్నాను. శ్యామ్‌కి ఆ సంగతి తెలుసు. అయినా అర్థంచేసుకోకుండా నన్నే తప్పు పడుతున్నాడు. దాంతో గొడవలు ఎక్కువయ్యాయి.

నేనెందుకు తగ్గాలి? నేను కూడా ఈ స్థాయికి చాలా కష్టపడి వచ్చాను. మా అమ్మానాన్నకి- నేను, చెల్లి... ఇద్దరమే. వాళ్ళు మా చదువూ, కెరీర్‌ల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నిజం చెప్పాలంటే, ఈరోజు నా జీతం శ్యామ్‌ శాలరీకంటే తక్కువేమీ కాదు. అసలు ఈ గొడవలతో హాబీస్‌కి సమయం దొరకడం లేదు. కెరీర్‌పై ధ్యాస పెట్టలేకపోతున్నాను. నేను మా అమ్మమ్మావాళ్ళ కాలం నుంచీ చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఆడవాళ్ళే త్యాగం చేయాలి, ఎందుకు?

నేను ఈ కాలం ఆడపిల్లని. నేనెందుకు తగ్గాలి? ఏం నేను బతకలేనా? అందుకే అమ్మావాళ్ళ ఇంటికి వచ్చేశాను. కొన్ని రోజులు గడిచాయి. ఏదో పనిమీద అమ్మమ్మా, తాతయ్యా వచ్చారు. ఒకరోజు నా పక్కన కూర్చుని ఈ పరిస్థితికి కారణం ఏమిటని అడిగారు. నేను అంతా చెప్పాను. తర్వాత అమ్మమ్మ ఒక్కతీ నా గదిలోకి వచ్చింది. అదీ ఇదీ మాట్లాడుతూ ‘‘నీ దృష్టిలో పెళ్ళంటే ఏమిటి రాధా?’’ అని అడిగింది.

‘‘ఏముంది. ఇద్దరు వ్యక్తులు ప్రేమతో దగ్గరయి, జీవితాంతం హాయిగా గడపడం’’ అన్నాను.

‘‘నీది లవ్‌ మ్యారేజేగా?’’
‘‘అవును!’’
‘‘అంటే, మీ అభిరుచులూ ఆలోచనలూ కలిశాకేగా మీకు ప్రేమ ఏర్పడింది?’’
‘‘అవును. మాది గుడ్డిప్రేమ కాదు, కంపాటిబిలిటీ ఉందని తెలిశాకే మేము దగ్గరయ్యాం.’’
‘‘ఇందులో మీ అమ్మానాన్నల బలవంతం ఏం లేదుగా?’’
‘‘అమ్మమ్మా, నువ్వు అడగబోతున్నది నాకు అర్థమైంది. కానీ శ్యామ్‌ పెళ్ళయ్యాక మారిపోయాడు. నాకోసం టైమ్‌ ఉండట్లేదు తనకి. నామీద ప్రేమ తగ్గింది.’’
‘‘వూ... సరే... నేను అడిగేవాటికి నిజాయతీగా సమాధానం చెబుతావా?’’
‘‘అడుగు, చెప్తాను.’’
‘‘ప్రేమంటే ఏమిటి?’’
‘‘ఏముంది... ఒకరినొకరు ఇష్టపడటం, అభిరుచులు కలవడం...’’
‘‘అంటే, మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, అభిరుచులు కలిశాయి... అంతేగా!’’
‘‘అవును.’’
‘‘పూర్తిగా కలిశాయా?’’
‘‘పూర్తిగా కలవలేదు. అయినా అమ్మమ్మా నీకామాత్రం తెలియదా... ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి అభిరుచులూ పూర్తిగా కలవవని. నీవీ, తాతయ్యవీ పూర్తిగా కలిశాయా ఏంటి చెప్పు?’’
‘‘నిజమే కలవలేదు. కానీ మేము సర్దుకుపోయాం తప్ప విడిపోలేదుగా...’’

‘‘మీలా నాకు సర్దుకుపోవాల్సినంత ఖర్మ ఏమీ పట్టలేదు. నా ఆత్మగౌరవాన్ని నేను ఎందుకు చంపుకోవాలి? మీ కాలంలోలా మేము ఎందుకు తగ్గాలి? మా అమ్మా నాన్నా మమ్మల్ని వ్యక్తిత్వంతో పెంచారు. మాకు ఆత్మాభిమానం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ. సమానంగా సంపాదిస్తున్నాం. వాళ్ళకంటే మేము ఎందులో తక్కువ? అటువంటప్పుడు మేము ఎందుకు తగ్గి ఉండాలి? నన్ను గౌరవించని వ్యక్తిని నేనెందుకు గౌరవించాలి? అతనికి నేను ఆక్కర్లేనప్పుడు, నాకూ అతను అక్కర్లేదు. నేనన్నదాంట్లో తప్పేమన్నా ఉందా, చెప్పు అమ్మమ్మా?’’
‘‘నువ్వన్నదాంట్లో తప్పేంలేదమ్మా. నీ అవగాహనలోనే తప్పుంది.’’
‘‘ఏంటీ?!’’
‘‘అవును. ప్రేమంటే నువ్విచ్చిన నిర్వచనం, పెళ్ళి అంటే...’’
‘‘నేనన్నదాంట్లో తప్పేముంది? ప్రేమంటే...’’
‘‘ఆగు, నన్ను చెప్పనియ్యి.’’

‘‘నువ్వు ఏమన్నావు... ఒకరినొకరు ఇష్టపడటం, అభిరుచులు కలవడం... అంతేగా! ఇష్టపడటమూ ప్రేమా ఒకటి కాదు. నువ్వే చెప్పావు... ఏ ఇద్దరి అభిరుచులూ పూర్తిగా ఒకేలా ఉండవని. నిజమే, అభిరుచులు పూర్తిగా కలవకపోయినా ప్రేమ ఉన్నచోట ఒకరినొకరు అర్థంచేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి బలహీనతల్ని వేరొకరి బలంలో నెగ్గుకొస్తూ, అదేదో వాళ్ళకోసం త్యాగం చేస్తున్నామన్న భావనతో కాకుండా, ఇష్టంగా ముందుకు సాగడం- ఇదే పెళ్ళి. అంతేకానీ, ఇరవైనాలుగ్గంటలూ ఫోన్‌లో మాట్లాడుతూ, గిఫ్ట్స్‌ ఇచ్చుకుంటూ... నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళుతూ ఉండటం కాదు ప్రేమంటే. నువ్వు ఎలాగైతే శ్యామ్‌ నీకూ, నీ తల్లిదండ్రులకూ, నీ తోడబుట్టినవాళ్ళకీ గౌరవం ఇవ్వాలనుకుంటావో, అతను కూడా అలాగే అనుకుంటాడు. అందులో తప్పేం ఉంది? అతని తల్లి ఆరోగ్యం బాగాలేదు. అతనికీ పని ఒత్తిడీ, తల్లీ తండ్రిని గురించిన బెంగా అన్నీ ఉంటాయిగా. చిరాకుపడ్డా అతని పరిస్థితులు అర్థంచేసుకుని, అతనికి అండగా ఉండాల్సింది పోయి, నువ్వు చేసిందేమిటి? నీతో గడపలేదని అలుగుతావా? నీ తల్లే ఆ స్థానంలో ఉంటే ఆ మాట అనగలవా? ఈరోజు అత్తగారూవాళ్ళు అక్కరలేదు, రేపు భర్త అక్కరలేదు, ఆ తర్వాత..? గౌరవం, ప్రేమ అనేవి ఒకళ్ళిస్తే వచ్చేవి కాదు, మనం సంపాదించుకోవాలి. ఎదుటివ్యక్తి మనల్ని గౌరవించేటట్టు, ప్రేమించేటట్టు మనం ప్రవర్తించాలి. అంతమాత్రాన నువ్వు నీ వ్యక్తిత్వాన్ని వదులుకోవాలని కాదు. నీకు నచ్చని విషయాలూ, కష్టంగా అనిపించిన విషయాలూ తెలియజెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడే సంబంధాలు నిలుస్తాయి.

వ్యక్తిత్వం వేరు... అహం వేరు.
ప్రేమ వేరు... ఇష్టం వేరు.
గౌరవించాలనుకోవడం వేరు... గౌరవించబడేటట్టు ప్రవర్తించడం వేరు.
ఏంటీ, మా కాలంలో మేము మా వ్యక్తిత్వాన్ని చంపుకుని బతికామన్నావు కదూ... వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం అంటే ఒంటరి అవడం కాదు, నలుగురినీ గెలవడం.

‘నేను సంపాదిస్తున్నాను, నేనెందుకు తగ్గాలి’ అని నువ్వు అన్నావూ అంటే దానర్థం మీ మధ్య ఉన్నది ప్రేమ కాదు, అహం అన్నమాట. నీ అహం దెబ్బతిననంత వరకూ- అంటే నువ్వు చెప్పింది విన్నంత వరకూ శ్యామ్‌ మీద ప్రేమ ఉంటుంది. ఏమాత్రం నీకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రవర్తించినా అతనికి నీమీద ప్రేమ లేదు, గౌరవం లేదు అంటావు- అంతేగా! నీకు కావాల్సింది నువ్వు చెప్పే అన్నింటికీ తల వంచే ఒక బానిస - భర్త కాదు.

నీకు ఏం తెలుసు, మా గురించి...

ఉన్నట్టుండి ఆస్తి పోయింది. ఆ బాధతో తాతయ్య వ్యసనాలకి బానిసయ్యాడు. నలుగురు పిల్లలు. మాకు ఆ కాలంలో ఈ కంపాటిబిలిటీ పరీక్షలూ అవీ ఏమీ లేవు. మామధ్య ప్రేమ ఉందో లేదో కూడా తెలీదు. మా నాన్న వచ్చేయమన్నారు, అన్నీ తను చూసుకుంటానన్నారు. మా అన్నయ్యలు కూడా నాకు ఆస్తి ఇస్తామన్నారు. నిజమే, మా నాన్న మోతుబరి ఆసామి. నన్నూ నా పిల్లల్నీ పోషించగలరు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ నా భర్త నన్ను బాగా చూసుకున్నన్ని రోజులూ అతనితో ఉండి, అతను ఆస్తి పోగొట్టుకుని, వ్యసనాలకి బానిసై కష్టాలలో ఉన్నప్పుడు వదిలేసి రావడం మానవత్వమేనా అనిపించింది. నాకు ప్రేమ మొదలైన పదాలు తెలియవు. ఒక్కటే అనుకున్నాను... ఇప్పుడు నా కర్తవ్యం నా పిల్లల్ని పోషించడమే కాదు, నా భర్తని దోవలో పెట్టడం కూడా అని. నువ్వు అనొచ్చు... తాతయ్య మారకపోతే ఏంటి నీ పరిస్థితి అని. నిజమే, కానీ కనీసం నా ప్రయత్నం త్రికరణశుద్ధిగా చేశాననే తృప్తి అయినా మిగులుతుందిగా నాకు. నీ పరిస్థితులు ఇంతకంటే భయంకరంగా ఉన్నాయా అన్నది నాకు తెలీదు. నువ్వే ఆలోచించుకో. మీరు ప్రేమ అని పిలిచే దాని అర్థం నాకు తెలిసి ఇది. అంతేకానీ, నీ కొంగు పట్టుకుని, నువ్వు చెప్పే అన్నిటికీ తలవూపేది కాదు. ఘర్షణ ఉండాలి. అయితే, అది హద్దులు దాటకూడదు. ఈరోజు తాతయ్య దృష్టిలో నేను దేవతని. ఈ గౌరవాన్ని నేను నా ప్రవర్తనతో (ప్రేమ అనే పదం వాడన్లే) సంపాదించుకున్నాను, అంతేకానీ బలవంతంగా ఆశించలేదు.

ప్రేమ అనేది బలవంతం చేస్తే పుట్టేది కాదు.
అయినా, నువ్వు తెలివైనదానివంటున్నావుగా... నీ తెలివితేటలతో నీ భర్త ప్రేమని గెలువు. అంతేకానీ, నీ భర్తని వదిలివేయడానికి పనికివచ్చేవాటిని తెలివితేటలనరు. బంధం తెంచుకోవడానికి తెలివితేటలక్కరలేదు, కలిసి ఉండటానికే కావాలి.
మీరు విడిపోదామనుకుంటున్నారంటే... మీమధ్య ఉన్నది ప్రేమ కాదు, ఆకర్షణ... అది ఇప్పుడు ద్వేషంగా మారింది.
మీది వ్యక్తిత్వం కాదు, అహం... కాబట్టే నేను ఎందుకు తగ్గాలి అనే ప్రశ్న.
మీకు సరదా కావాలి, సర్దుబాటు అక్కరలేదు. సంతోషం కావాలి, బాధ్యత అక్కర్లేదు.
నీ చిన్నప్పుడు మీ నాన్న ఉద్యోగం పోయి ఆరోగ్యం దెబ్బతింది. ఆ బాధలో మీ అమ్మనీ కాస్త ఇబ్బందిపెట్టాడు. ఆరోజు మీ అమ్మ కనుక మీ నాన్నని వదిలేస్తే ఎలా ఉండేది మీ పరిస్థితి? మీ అమ్మ ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషించిందని నీకూ తెలుసు. తాను ఎన్నో కష్టాలుపడి మిమ్మల్ని పెంచింది. అంతేకానీ, మీ నాన్నని వదిలెయ్యలేదు.

మీ పెళ్ళప్పుడు నువ్వే అన్నావు, భగవంతుడు మిమ్మల్ని ఒకరికోసం మరొకరిని పుట్టించాడు అని- నిజమే అది. అయితే దానర్థం మీరనుకుంటున్నది కాదు. దానర్థం- ఒకరి బలహీనతల్ని మరొకరు అర్థంచేసుకుని, సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని... ఒకరు బలహీనమయినప్పుడు మరొకరు తమ బలంతో, ఓర్పుతో జీవితంలో ముందుకు సాగమని.

తొంభై శాతం కంపాటిబిలిటీ ఉన్న బంధాన్నే నిలుపుకోలేకపోయినదానివి... రేపు మరో పెళ్ళి చేసుకున్నా ఎలా నిలుపుకోగలవు?

భగవంతుడు మిమ్మల్ని కలిపింది మీ ఇద్దరిమధ్యా తొంభైశాతం కంపాటిబిలిటీ ఉందని మాత్రమే కాదు- మిగతా పది శాతం కంపాటిబిలిటీని మీ తెలివితేటలు, ప్రేమతో సాధిస్తారని.

మీ భాషలో చెప్పాలంటే, రెడీమేడ్‌గా దొరికేవాటితో ‘కిక్‌’ రాదు. మన తెలివితేటలూ, ప్రేమతో ఆ పదిశాతం సాధిస్తేనే ‘కిక్‌’ వస్తుంది - అదే జీవితం. లోటు ఉండి, దాన్ని సరిచేసుకుంటూ ముందుకి వెళ్ళడమే జీవితం. నేను చెబుతున్న మాటలు నీ ఒక్కదానికే కాదు- శ్యామ్‌కీ, ఈతరం పిల్లలందరికీ కూడా.
వూ... ఇప్పుడు మాట్లాడు.’’
‘‘ఏం మాట్లాడను అమ్మమ్మా, గీతాబోధ విన్న తరువాత అర్జునుడిలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. నేను చేసిన పొరపాటు ఏమిటో నీ మాటల్లోని నిజమేమిటో అర్థమైంది. ఆచరించడానికి నాకు కొంత సమయం పడుతుంది.’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.