close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వక్రతుండ మహాకాయా... సూర్యకోటి సమప్రభా!

వక్రతుండ మహాకాయా... సూర్యకోటి సమప్రభా!

గణపతిని కళ్లతో కాదు, హృదయనేత్రంతో దర్శించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం...అంటూ మొక్కుబడిగా శ్లోకం చెప్పుకోవడం కాదు, గణాధిపతి ప్రతి గుణాన్నీ లోతుగా విశ్లేషించుకోవాలి. అక్షింతలతో ఆగిపోకుండా, చవితి కథను మనకూ అన్వయించుకోవాలి. ఆ విఘ్నాల దేవుడు, వికాస ప్రదాత కూడా!
హాగణపతి - సకలవేదాల సారం, ఉపనిషత్తుల అంతరార్థం, సర్వ పురాణాల సంక్షిప్తరూపం. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం వరకూ...ఆ అపురూప రూపమంతా ప్రతీకాత్మకమే. పెద్ద తల...గొప్పగా ఆలోచించమంటుంది. గొప్ప ఆలోచనతోనే, గొప్ప ఆచరణ. గొప్ప ఆచరణ ద్వారానే గొప్ప విజయాలు. పాతాళం వైపు చూస్తూ ఆకాశాన్ని అందుకోలేం. ఆకాశాన్ని చేరుకోవాలంటే ఆకాశమంత ఉన్నతంగానే ఆలోచించాలి.

చిన్న కళ్లు...చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యాన్ని నర్మగర్భంగా చెబుతాయి. పెద్దకళ్లకు చంచలత్వం ఎక్కువ. ఎటుపడితే అటు తిరిగేస్తుంటాయి. చిన్నకళ్లకు ఆ అవరోధాలేం ఉండవు. గురి చుట్టూ గిరిగీసుకుంటాయి.

చాట చెవులు...నలుదిక్కుల విజ్ఞానం నావైపు ప్రసరించు గాక - అని ప్రార్థిస్తారు వేదర్షులు. ఆ అపౌరుషేయ వాక్యానికి ప్రతీక ఏనుగు చెవులు.

బుల్లి నోరు...నోరు పెద్దదైతే బుద్ధి చిన్నదవుతుంది. నోరు చిన్నదైతే బుద్ధి పెద్దదవుతుంది. గణపతిని ‘సుముఖుడు’ అనీ అంటారు. ఆ మాటకు ముద్దుమోము వాడనే కాదు, ముచ్చటైన మాటతీరు కలిగినవాడనీ అర్థం. ఏనుగు నోరు చిన్నది. ఆ నోటిని కూడా తొండం కప్పేసి ఉంటుంది. తొండం వివేకానికి గుర్తు. వివేకపు వడపోత తర్వాతే, ప్రతి మాటా నోట్లోంచి రావాలన్న అంతర్లీన సందేశమిది.

లంబోదరం...పేరుకు పరమశివుడి పెద్దకొడుకే అయినా, ఎక్కడా ఆ అభిజాత్యం కనిపించదు. గణపతి సామాన్యుడిలానే పెరిగాడు. వ్యాసాది పురాణ పురుషులకు శుశ్రూష చేశాడు. అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. చంద్రుడి వెక్కిరింతల్ని భరించాడు. కుమారస్వామి సవాళ్లకు తట్టుకున్నాడు. ఆ అపార అనుభవసారమే బానపొట్ట.

ఎలుక వాహనం...మూషికానికి పోగేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ. ఏం దొరికినా తీసుకెళ్లి కలుగులో దాచేసుకుంటుంది. ఆ దురాశను అధిగమించాలి, మూషిక స్వభావాన్ని ఆత్మవిశ్వాసంతో అధిరోహించాలి. ఇదే వినాయక వాహన రహస్యం. భాగవతం మొదలు బ్రహ్మాండ, స్కందపురాణాల దాకా... గణపతితో ముడిపడిన ఐతిహ్యాలు అనేకం. అన్నీ జీవన ప్రస్థానంలో విఘ్నాలను అధిగమించడం ఎలాగో బోధించేవే.

అందరికోసం...
ఒక్కో జీవికి ఒక్కో అవయవం మీద మక్కువ. నెమలికి ఒంటిమీది పింఛమంటే ప్రాణం. చమరీమృగానికి తన తోకంటే తగని ఇష్టం. ఏనుగుకేమో...తెల్లగా మెరిసిపోయే దంతాలంటే ప్రత్యేక అభిమానం. వ్యక్తిగత ఆనందం కంటే, సమష్టి ప్రయోజనమే గొప్పది. నలుగురి కోసం మన సంతోషాల్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెబుతుంది - ‘ఏకదంత’ ఉదంతం. వ్యాసుడి భారత రచన ఓ మహాకార్యం. వేద నీతినీ ఉపనిషత్తుల ఉద్బోధనూ సామాన్యుల చెంతకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం. ఆ సత్కార్యం కోసం ప్రాణానికి ప్రాణమైన దంతాన్ని పెకిలించి కలంగా మలిచాడు గణపతి. వ్యాసులవారు ఆశువుగా చెబుతుంటే, రాయసగాడై పొల్లుపోకుండా రాసుకున్నాడు. ఆ రాయడం కూడా...మొక్కుబడిగా కాదు, అర్థం చేసుకుంటూ, సారాన్ని గ్రహించుకుంటూ! ఆ జ్ఞానయజ్ఞం నిరంతరాయంగా సాగింది. అయినా గణపతికి అలుపూ సొలుపూ లేదు. ‘నలుగురి కోసం...’ అన్న భావనలోని గొప్పదనమే అది.

సమర్థ గణాధిపతి...
సకల గణాలకూ అధినాయకుడు గణపతి. ఆ హోదా అయాచితం కాదు. వారసత్వంగా రాలేదు. కార్తికేయుడితో పోటీపడి గెలుచుకున్న స్థానమది. ప్రతిభకు పట్టాభిషేకమది. శారీరక బలం కంటే, మనోశక్తే గొప్పదని చాటిన ఉదంతమది. అన్నిసార్లూ కష్టపడినంత మాత్రాన ఫలితం దక్కదు. తెలివితేటలూ తోడవ్వాలి. పదునైన వ్యూహం సిద్ధంగా ఉండాలి. ‘ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి రావాలి’ అంటూ పరమశివుడు పోటీ పెట్టినప్పుడు గణపతి ‘థింక్‌ స్మార్ట్‌’ మార్గాన్నే ఎంచుకున్నాడు. స్వీయ లోపంబు ఎరుగుట దొడ్డ విద్య. తానేమో స్థూలకాయుడు, లంబోదరుడు. అడుగేస్తే ఆయాసం! ఇక ముల్లోకాల్నీ ఎలా చుట్టొస్తాడు, శక్తిమంతుడైన కుమారస్వామిని ఎలా నిలువరిస్తాడు? అలా అని, నిరాశపడలేదు. ఓటమిని అంగీకరించ లేదు. పోటీ నియమాల్ని యథాతథంగా తీసుకోకుండా, అంతరార్థాన్నే గ్రహించాడు. ప్రకృతి-పురుషులైన జననీ జనకులకు ప్రదక్షిణలు చేసి...నదీస్నాన ఫలాన్ని సిద్ధించుకున్నాడు.

గణాధిపతిగా సర్వసమర్థుడని పేరుతెచ్చుకున్నాడు గౌరీతనయుడు. ముక్కోటి దేవతలూ మహర్షులూ ఏదో ఓ రూపంలో, ఏదో ఓ సమయంలో గణపతి సాయం అందుకున్నవారే. సాక్షాత్తూ పరమశివుడికి కూడా విఘ్నాధిపతి అండ కావాల్సి వచ్చిందో సారి. త్రిపురాసుర సంహారానికి బయల్దేరగానే, శివుడి రథానికి ఇరుసు విరిగిపోయింది. దీంతో, గణపతి రంగప్రవేశం చేసి ఆ విఘ్నాన్ని తొలగించాడు. రావణాసురుడు శివుడి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తున్నప్పుడు...గోవులకాపరి వేషంలో వెళ్లి విఘ్నం సృష్టించాడు. అసురుడి నుంచి శివాత్మకు విముక్తి కలిగించాడు. రాముడు లంకకు సేతువు కడుతున్నప్పుడు కూడా, వినాయకుడే మార్గదర్శనం చేశాడు. నిపుణుడైన ఇంజినీరులా వారధి నిర్మాణంలో మెలకువలు బోధించాడు.

ధూమకేతుడనే రాక్షసుడు మహా దుర్మార్గుడు. ముక్కోటి దేవతలనూ వేధించేవాడు. ఆ రాక్షసుడికి ధూమమే ఆయుధం. పొగతోనే పగవారిని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. దుష్ట సంహారానికి ఓ మహారాణి గర్భంలో అవతరించాడు గణపతి. ఆ విషయం అసురుడికి తెలిసింది. రాణిని బంధించి తీసుకురమ్మని మంత్రిని పంపాడు. ఆ సమయానికి ఆమె గాఢనిద్రలో ఉంది. పక్కనే మహారాజూ నిద్రపోతున్నాడు. ఎంత రాక్షసులైనా ఎంతోకొంత ధర్మాన్ని పాటించే కాలం అది. ఆడవాళ్లను చంపడం అన్యాయం అనిపించుకుంటుంది కదా! అందులోనూ దంపతుల్ని విడదీయడం ఇంకా పాపం! ఏం చేయాలో తోచక...ఆ మంచాన్ని అరచేతితో ఎత్తుకెళ్లి దట్టమైన అడవిలో వదిలిపెట్టాడు. అక్కడే ఆ తల్లి కడుపు పండింది. కబురు అందగానే రాక్షసుడు దండెత్తి వచ్చాడు. దట్టమైన పొగ వదిలాడు. ఆ నెలల బాలుడు పొగనంతా పీల్చుకుని...తిరిగి ధూమాసురుడి మీదికే ప్రయోగించాడు. వూపిరాడక రాక్షసుడు చచ్చిపోయాడు. అందుకే వినాయకుడికి ధూమకేతువన్న పేరొచ్చింది. మూషికాసుర సంహారంతోనూ మానవజాతిని ఓ పెద్ద విపత్తు నుంచి తప్పించాడు.

పరిస్థితిని బట్టీ వ్యక్తుల్ని బట్టీ వినాయకుడి ఎత్తుగడలు మారుతుంటాయి. ఆ వ్యూహరచనాశైలి ముచ్చటగొలుపుతుంది. కొన్ని విఘ్నాల్ని లోకోపకారం కోసం తనే సృష్టించాడు. మరికొన్ని విఘ్నాల్ని అదే లోకోద్ధరణ కోసం తనే తొలగించాడు. కాబట్టే, ‘విద్యారంభే, వివాహేచ, ప్రవేశే, నిర్గమే తథా...సంగ్రామే, సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే’ అంటూ ఏ పని తలపెట్టినా తొలుత ఆ బాలకుడినే తలుచుకుంటాం. గణపతి పట్టుదలనూ వ్యూహ రచననూ స్ఫూర్తిగా తీసుకుంటే, ఏ పనిలోనూ ఎదురే ఉండదు!

హృదయ సౌందర్యం..
చంద్రుడు అందగాడు. అందం వందపాళ్లయితే, అందగాడినన్న గర్వం వేయిపాళ్లు. ఆ కాంతీ ఆ చక్కదనం...అన్నీ పైపై మెరుగులే. లోలోపల అతడో కురూపి. గురుపత్నినే కామించిన కుబుద్ధి. వినాయకుడిదేమో ఏనుగు తొండమూ, చిన్నచిన్న కళ్లూ, చాటంత చెవులూ, బానపొట్టా, కురచకాళ్లూ... సామాన్య నేత్రాలతో చూస్తే నవ్వు పుట్టించే ఆకారం. మనసు కళ్లతో దర్శించగలిగితే మాత్రం, మహాద్భుత రూపమది. సౌందర్య గర్వంతో కళ్లు నెత్తికెక్కిన చంద్రుడికి అంత సంస్కారం ఎక్కడిది? మరుగుజ్జు బాలుడు కనిపించగానే పకపకా నవ్వాడు. వినాయకుడికి కోపం వచ్చింది. అది ధర్మాగ్రహం కూడా! ఎదుటివాళ్ల అజ్ఞానాన్నీ అహంకారాన్నీ ఎంతోకాలం భరించలేం. భరించకూడదు కూడా. ‘ఇక నుంచి నిన్నెవరూ చూడకూడదు...’ అని శపించేశాడు. నలుగురూ కళ్లార్పకుండా చూసినప్పుడే అందగాడికి ఆనందం. ఏ కళ్లూ ఆరాధనగా చూడనప్పుడు, ఏ నోళ్లూ పరవశంతో ప్రశంసించనప్పుడు...ఎంత అందం ఉన్నా ఏం లాభం? చంద్రుడిలాంటి అహంభావికి అది మరణంతో సమానం. అవమానభారంతో సముద్రం చాటున తలదాచుకున్నాడు. ఆతర్వాత తప్పు తెలుసుకుని వచ్చి గణపతి పాదాలమీద పడ్డాడు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష ఏం ఉంటుంది? ‘భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం నిన్ను చూడకుండా ఉంటే చాలు...’ అంటూ శాపతీవ్రతను నామమాత్రం చేశాడు విఘ్నాధిపతి. అంతటి అందగాడు మరుగుజ్జు పాదాల్ని శరణువేడాడంటే...అంతిమంగా హృదయ సౌందర్యమే గెలిచినట్టు. రూపురేఖల్ని బట్టో, ఆడంబరాల్ని బట్టో ఎదుటి మనిషిని గౌరవించకూడదు. అతన్లోని ప్రతిభను గుర్తించాలి, ఆ పరమోన్నత వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయాలి.

కథ వెనుక కథ...
చవితి నాటి సాయంత్రం చక్కగా కథ చదువుకుని, నెత్తిన నాలుగు అక్షింతలు చల్లుకున్నంత మాత్రాన నిత్యజీవితంలో ఎదురయ్యే నీలాపనిందల్ని పూర్తిగా తప్పించుకోలేం. ఏదో ఓ రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. వాటికెలా స్పందించాలి, వాటినెలా స్వీకరించాలి? - అన్న ప్రశ్నకు శ్యమంతకమణి ఉపాఖ్యానమే జవాబు. సత్రాజిత్తు ఓ మామూలు రాజు. భానుదేవుడి ఉపాసకుడు. ఆ భక్తికి మెచ్చి సూర్యనారాయణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే మనిషిలోని దురాశ బయటికొస్తుంది. భస్మాసురుడు మొదలు రావణ బ్రహ్మ వరకూ...పరమాత్మ ఆనతి ఇవ్వగానే అలవికాని కోరికలేవో కోరుకున్నారు. చివరికి, అవే శాపాలై ప్రాణాలు తీశాయి. నిత్య జీవితంలోనూ అంతే! అవకాశం తలుపు తట్టినప్పుడు...వివేకంతో వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆబగా ఆకాశానికి నిచ్చెనలేయకూడదు...సత్రాజిత్తులా! ఎదురుగా సూర్యుడు, సూర్యుడి మెడలో ధగధగా మెరిసిపోతున్న శ్యమంతకమణి! ఇంకేం, ‘అదిగో...ఆ హారం కావాలి’ అని నిర్మొహమాటంగా అడిగాడు. మణి ఉన్నచోట సకల ఐశ్వర్యాలూ ఉంటాయి. రోజూ వేల మణుగుల బంగారాన్ని ఇస్తుందా మహిమాన్విత హారం. సూర్యుడైతే ఇచ్చి వెళ్లాడు కానీ, పుచ్చుకున్న మరుక్షణం నుంచీ రాజుగారికి కష్టాలు మొదలయ్యాయి. హారాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో అన్న భయం పట్టుకుంది. స్థాయికి తగని కోరికలతో, అవసరానికి మించిన ఐశ్వర్యాలతో ఇలాంటి ఉపద్రవాలే ఉంటాయి. హారాన్ని ధరించి వేటకెళ్లిన సోదరుడు కనిపించకుండా పోయాడు. దీంతో, చిరకాల మిత్రులు కూడా శత్రువుల్లా అనిపించసాగారు. కృష్ణుడి మీదే నీలాపనిందలు వేసేంతలా దిగజారాడు. జీవితంలో మనశ్శాంతి కరవైంది. నడమంతపు సిరి ప్రభావాలు ఇలానే ఉంటాయి.

చాలాసార్లు...మనం చేయని తప్పులకు వేలెత్తి చూపుతారు. మనకసలు సంబంధంలేని వ్యవహారంలో బాధ్యుడిని చేస్తారు. కలలో కూడా అనని మాటల్ని మన ఖాతాలో జమచేస్తారు. అలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి? యాదృచ్ఛికంగా జరిగినా, ఉద్దేశపూర్వకంగా చేసినా...ఆ మచ్చను తొలగించుకోవాల్సిన బాధ్యత అపనిందపాలైన వ్యక్తిదేనంటుంది వినాయక వ్రతకథ. వీధిలో నడుస్తున్నప్పుడు నెత్తిమీద కాకిరెట్ట పడుతుందనుకోండి. రెట్ట వేసింది కాకే కాబట్టి, అదే వచ్చి తుడవాలని అనుకోం కదా. అది మన శరీరం, మన శుభ్రతకు సంబంధించిన వ్యవహారం. అపనిందలూ అలాంటి మరకలే. వాటిని తొలగించుకోడానికే కృష్ణుడు అడవి బాట పట్టాడు. ఆనవాళ్లు వెతుక్కుంటూ ముందుకెళ్లాడు. జాంబవంతుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. అంతిమంగా మణినీ, కన్యామణినీ సొంతం చేసుకున్నాడు. అపనింద తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా, శాశ్వతమైన కీర్తిని సంపాదించిపెట్టింది. మనమేమిటో నిరూపించుకోగలిగితే, తిట్టిననోళ్లే కీర్తిస్తాయి. వేలెత్తి చూపిన చేతులే ముకుళితం అవుతాయి. నిర్లిప్తంగా వ్యవహరిస్తే మాత్రం, జీవితాంతం ఆ అపఖ్యాతిని భరించాల్సిందే.

విఘ్నం అనగానే భయపడిపోతాం. దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తాం. విఘ్నం తాత్కాలిక అవరోధం, శాశ్వత పాఠం. విఘ్నాధిపతి అంటే, విఘ్నాల్ని కలిగించేవాడని కాకుండా, విఘ్నాలను అధిగమించే శక్తినిచ్చేవాడనీ భావించాలి. ఆ విఘ్నాల ద్వారా గెలుపు పాఠాలు నేర్పేవాడనీ అర్థం చేసుకోవాలి.