close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తీయని’ శత్రువు!

ద్యోగం వచ్చింది. సంబంధం కుదిరింది. పెళ్లి ఘనంగా జరిగింది. పాపో బాబో పుట్టారు. జీతం పెరిగింది. ప్రమోషన్‌ వరించింది. బైకో కారో కొన్నారు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తీసుకున్నారు. ఏ శుభవార్త చెప్పినా, తక్షణ స్పందన... ‘కంగ్రాట్స్‌! మరి, స్వీటు?’

కబురు అయినా మిఠాయి జోడిస్తేనే ‘తీపి కబురు’! ఉట్టిచేతులతో వచ్చి చెబితే మాత్రం చప్పచప్పని సమాచారమే. పర్వదినాలప్పుడూ అంతే. కడుపులో నాలుగు మిఠాయి ముక్కలు కుక్కేసుకోకపోతే...ఎంత పెద్ద పండగైనా దండగే! పెళ్లి భోజనంలో అయితే ఒకట్రెండు రకాలుంటే ఆనదు. అథమపక్షం అరడజనైనా కనిపించాలి. అప్పుడే, ‘విందు బ్రహ్మాండం’ అన్న ట్యాగ్‌లైన్‌! ఆత్రేయపురమంటే పూతరేకులూ, బందరంటే తొక్కుడు లడ్డూలూ, కాకినాడంటే కాజాలూ...కొన్ని వూళ్ల పేర్లు తలుచుకున్నా నోరూరుతుంది, ఉచ్ఛరిస్తుంటే లాలాజలం ఉప్పొంగుకొస్తుంది. పెద్దల దర్శనానికి వెళ్తున్నప్పుడు, ఖరీదైన దుకాణంలో ఓ కిలో నేతి మిఠాయి కట్టించుకునెళ్తే ఆ స్పందనే వేరు, సగం పని అయిపోయినట్టే. మిగతా సగం మరో కిలోతో!

అసలు, మనిషికి తీపి అంటే ఎందుకంత మమకారం? మిఠాయి పొట్లాన్ని చూడగానే మొహం వాచినట్టు ప్రవర్తిస్తాడెందుకు? కొంపదీసి, పంచవన్నెల రామచిలుకలో మాంత్రికుడి జీవం ఉన్నట్టు...పంచదారలో మనిషి పంచప్రాణాలున్నాయా? - నిజమే, ఆ తీయని బంధం పుట్టుకతోనే మొదలవుతుంది. తల్లి చనుబాలలోని ‘లాక్టోజ్‌’తో బిడ్డకు తొలితీపి పరిచయం అవుతుంది. ఆతర్వాత, మళ్లీ అన్నప్రాశన రోజు కమ్మని పాయసం రుచి చూపిస్తారు. అడుగులు వేసిననాడు అందరికీ అరిసెలు పంచుతారు. చాక్లెట్లూ, బిస్కెట్లూ, లాలీపాప్‌లూ, ఐస్‌క్రీమ్‌లూ...అలా అలా వయసు పెరిగేకొద్దీ, కొత్త రుచులు పరిచయం అయ్యేకొద్దీ ఆ అనుబంధం ముదురు పాకమంత చిక్కనైపోతుంది.

భారత్‌ మిఠాయ్‌ భాండార్‌!
చక్కెర చాలా ప్రాచీనమైంది. ఆ మూలాలు క్రీస్తుపూర్వం నాలుగైదు శతాబ్దాల నాటికే ఉన్నాయి. అన్ని మొక్కలూ గ్లూకోజ్‌ రూపంలో చక్కెరను తయారు చేసుకుంటాయి. కానీ, దాన్ని వేరుచేసి తీయలేం. చెరుకులో మాత్రం ఆ వెసులుబాటు ఉంది. కొన్నిరకాల దుంపల నుంచీ, మొక్కజొన్న నుంచీ కూడా చక్కెరను తయారు చేస్తున్నారు. శర్కర అన్న సంస్కృత పదం నుంచి ‘చక్కెర’ పుట్టింది. గుప్తుల కాలం నాటికే స్ఫటికల్లా చక్కెరను తయారు చేయగలిగే నైపుణ్యాన్ని మనం సాధించాం. చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ విలువైన బౌద్ధ సాహిత్యంతో పాటూ చక్కెర తయారీ రహస్యాన్నీ తనతో తీసుకెళ్లాడని చెబుతారు. ఆయనొక్కడేనా, మన మీదికి దండెత్తిన ప్రతి పాలకుడూ వెళ్తూ వెళ్తూ కాసిన్ని చెరుకు గడల్ని చంకన పెట్టుకుని వెళ్లినవాడే. అప్పటిదాకా ఆయాదేశాల్లో పిండి వంటల్లో తీపి కోసం తేనె, పండ్లు, బార్లీ వగైరా వాడేవారు. అలా, ప్రపంచం నోట్లో తొలిసారిగా చక్కెర పోసింది మనమే. ‘చక్కెర మనదే..’ అన్న ఆ మమకారం ఈరోజుకూ చావలేదు. ప్రపంచ ఉత్పత్తిలో పదమూడు శాతానికి పైగా మనమే మెక్కేస్తున్నాం.

 

చక్కెర రెండు మార్గాల్లో ఒంట్లోకి వెళ్తుంది.

ఒకటి - కాఫీలూ టీలూ మిఠాయిలూ శీతల పానీయాలూ మొదలైనవాటి తయారీలో వాడే సాధారణ పంచదార రూపంలో.

రెండు - కూరగాయలూ పండ్లూ పాలూ రొట్టెలూ వగైరాల్లోని కార్బొహైడ్రేట్ల రూపంలో.

రెండోరకం ఏమంత ప్రమాదకరం కాదు. ఎందుకంటే వాటిలో చక్కెరతో పాటూ విటమిన్లూ ప్రొటీన్లూ ఖనిజాలూ ఇనుమూ తదితర పోషకాలూ ఉంటాయి. సాధారణ చక్కెరలో మాత్రం...ఆ పోషకాలు మచ్చుకైనా కనిపించవు. దీంతో ఓ స్థాయి తర్వాత, తీపి పదార్థం అచ్చమైన విషంలా పనిచేస్తుంది. మనం తీసుకునే తీపి పదార్థంలోని కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. మిగిలిందంతా కొవ్వుగా పేరుకుపోతుంది.

తీపి రుచుల్ని ఇష్టపడటంలో తప్పులేదు. తీయని పదార్థాల్ని తినడం నేరమో ఘోరమో కాదు. శరీరానికి ఇతర పోషక విలువలతో పాటూ పంచదారా ఎంతోకొంత అవసరమే. తక్కువ బరువుతో బాధపడుతున్నవారికైనా, పోషక విలువల లోపం ఉన్న పిల్లలకైనా తక్షణ శక్తి కావాలంటే, చక్కెర సాయం తీసుకోవాల్సిందే. లేకపోతే ఒంట్లోని మాంసకృత్తులన్నీ అసలు బాధ్యతని పక్కన పెట్టేసి, శక్తిని ఇవ్వడానికే పరిమితం అయిపోతాయి. అయితే, ఆ చాపల్యం హద్దులు దాటితే ప్రమాదం. వ్యసనంగా మారితే ప్రాణాంతకం. పరిస్థితి అంతదాకా రాకూడదంటే - ప్రతి మిఠాయి ముక్కనీ ఎరుకతో నోట్లో వేసుకోవాలి. ఆ తీపి...కొవ్వుగా మన నడుము చుట్టూనో, పిరుదుల మీదో పేరుకుపోతున్న దృశ్యాన్ని వూహించుకోవాలి. ‘మరొకటి’, ‘ఇంకొకటి’, ‘ఈ ఒక్కసారికి’...తరహా సాకులేం చెప్పుకోకూడదు.

 

వద్దొద్దు...అంతొద్దు!
పంచదార వాడకం రోజుకు పాతిక నుంచి ముప్ఫై గ్రాములకు మించితే అనారోగ్యానికి దగ్గర అవుతున్నట్టేనని హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన తీపి విషంతో సమానం. చక్కెర చుట్టూ ఈగల్లా, శరీరం చుట్టూ రోగాలు ముసురుకుంటాయి. ప్రపంచ సగటు వినియోగంతో పోలిస్తే...భారత్‌ చాలా ఎక్కువే తినేస్తోంది. కాఫీలో అదనపు చెంచా, గులాబ్‌జామ్‌లో ఇంకాస్త పాకం, పాయసంలో మరింత తీపి...ఆ వ్యామోహానికి హద్దూ అదుపూ లేకుండా పోయింది. మార్కెట్లో అమ్మకానికున్న చక్కెరలో డెబ్భై అయిదు శాతం...బేకరీలకూ, ఐస్‌క్రీమ్‌ తయారీదారులకూ, శీతల పానీయ సంస్థలకూ, చాక్లెట్‌ కంపెనీలకూ, మిఠాయి కొట్లకూ వెళ్తొంది. అంటే, అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ జనం కడుపులోనే పోగవుతోంది. అక్కడి నుంచి ఒంట్లో కలసిపోయి నానా రుగ్మతల్నీ అంటగడుతోంది.

చక్కెర వాడకం ఎక్కువగా ఉన్న...పంజాబ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోనే వూబకాయం అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అవసరానికి మించిన అదనపు చక్కెరంతా కొవ్వుగా మారిపోయి, ఒంట్లో పేరుకుపోవడం వల్లే ఈ ఇబ్బందులు. చదువుకుంటే ఉన్నమతీ పోతుందన్నట్టు...గ్రామాలతో పోలిస్తే, అక్షరాస్యత అధికంగా ఉండే పట్టణ ప్రాంతంలోనే చక్కెర వినియోగం ఎక్కువ. ఓ అంచనా ప్రకారం...పల్లె జనం నెలకు సగటున 2.2 కిలోల చక్కెరను కరిగిస్తుంటే, పట్టణవాసులు ఐదున్నర కిలోల్ని ఆవురావురుమంటూ నమిలేస్తున్నారు. ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. వూబకాయం ఉందంటే, మధుమేహమూ ఉన్నట్టే. గుండె జబ్బులూ రాజ్యమేలుతున్నట్టే. గ్రామీణ ప్రాంతాల్లో ఐదుశాతం మందికి హృద్రోగాలు ఉంటే, పట్టణాల్లో పది శాతం మందికి ఉంటున్నాయి. అధిక రక్తపోటు సమస్య పల్లెల్లో ఐదుశాతమైతే, పట్టణాల్లో పదిహేనుశాతం! చీమలు చక్కెర ముక్కల్ని కొరుక్కుతిన్నట్టు, ఆ చెడు ప్రభావాలు అనేక రూపాల్లో శరీరాన్ని కుళ్లబొడిచేస్తాయి.

హద్దుల్లేని చక్కెర వినియోగంతో చిన్న వయసులోనే కళ్లను శుక్లాల పొర కమ్మేసే ప్రమాదం ఉంది. ముక్కులో సైనస్‌ సమస్యలు రావచ్చు. వినికిడిని బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు దెబ్బతీయవచ్చు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్‌, లస్సీ...ఇలా ఏదో ఓ రూపంలో రోజుకు ఓ ముప్ఫై నిమిషాల సేపు దంతాలు చక్కెర నీళ్లలో మునిగితేలతాయి. అదే అదనుగా సూక్ష్మక్రిములు చేరిపోతాయి. ఇంకేముంది, వజ్రాల్లాంటి పళ్లు పుచ్చుపట్టిపోతాయి. చక్కెర చర్మాన్ని ముడతల పాలు చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు మీదపడిపోతాయి. స్థాయికి మించిన చక్కెర నిల్వలు జ్ఞాపకశక్తిని మరుగుపరుస్తాయని పరిశోధకులు గుర్తించారు. మితిమీరిన చక్కెర వాడకం రోగనిరోధకశక్తిని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో కేశసంబంధ సమస్యలకూ పురుషుల్లో బట్టతలకూ ఒంట్లోని చక్కెర స్థాయీ ఓ కారణమని చెబుతారు. రోజూ వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండటం...ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పంచదారను నియంత్రించకపోతే - అవన్నీ బూడిదలో పోసినట్టే. ‘గుండె జబ్బులకు ప్రధాన కారణం ఉప్పేనని చాలామంది అభిప్రాయం. అది అర్ధసత్యమే. ఉప్పు కూడా పంచదార తర్వాతి స్థానంలోనే ఉంది’ అంటారు నిపుణులు. కాలేయం మీద కూడా మద్యం ఎంత చెడు ప్రభావాన్ని చూపుతుందో పంచదారా అంతే తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఒకటేమిటి, చక్కెర శత్రువులా అన్ని వైపుల నుంచీ దాడిచేస్తుంది. కొన్నిసార్లు, అప్పటికే ఉన్న రుగ్మతలు చక్కెర నిల్వల్ని అడ్డం పెట్టుకుని మరింత రెచ్చిపోతాయి. అలా అని, ఆ పేరు వినిపించగానే వణికిపోవాల్సిన అవసరమూ లేదు. ఓ స్థాయి వరకూ నష్టాన్ని పూడ్చుకునే శక్తి శరీరానికి ఉంది. ఈ క్షణం నుంచి పంచదార వాడకాన్ని నియంత్రించుకున్నా, పెద్ద గండాల్ని గట్టెక్కినట్టే.

 

చక్కెర లేకుండా...
చక్కెర వద్దు, చక్కెర తీపి మాత్రమే కావాలి - అనుకునేవారికి చాలా ప్రత్యామ్నాయాలే ఉన్నాయి. వీటివల్ల, అసలు దుష్ప్రభావాలే ఉండవని చెప్పలేం కానీ, పంచదారతో పోలిస్తే తక్కువే. ఆ జాబితాలో మొట్టమొదటి పేరు...తేనె! చక్కెర పుట్టకముందు... మిఠాయిల తయారీకి తేనే దిక్కు. చక్కెరలో నూటికి నూరుశాతం కార్బొహైడ్రేట్లు ఉంటే, తేనెలో ఎనభై అయిదు శాతం వరకూ ఉంటాయి. ఆ ప్రకారం...ఓ వంద గ్రాముల తేనెలో దాదాపు మూడొందల కెలోరీలు ఉంటే, అంతే పరిమాణంలోని చక్కెరలో నాలుగొందల దాకా ఉంటాయి. అంటే, పావుశాతం తేడా! అదీ తేనెలోని సౌలభ్యం. మిఠాయిల్లో, కేకుల్లో, గ్రీన్‌టీలో...కాస్తంత తీపి ఉంటే బావుండనిపించే ఏ పదార్థంలో అయినా నిరభ్యంతరంగా తేనె చుక్కల్ని చిలకరించుకోవచ్చు. స్టీవియా మొక్క నుంచి తీసిన తీపి పదార్థాన్నీ వివిధ పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో కెలోరీలు సున్నా. అయితే, స్టీవియా మొక్కను నేరుగా వాడకూడదు. శుద్ధి చేశాకే ఉపయోగించాలి. మెక్సికో, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో దొరికే అగేవ్‌ నెక్టార్‌ కూడా ఓ ప్రత్యామ్నాయమే. ఇదీ ఓ రకమైన మొక్క నుంచే లభిస్తుంది. అయితే, ఇందులోని భారీ సుక్రోజ్‌ నిక్షేపాలు కొవ్వును పెంచిపోషిస్తాయన్న విమర్శ ఉంది. మ్యాపల్‌ సిరప్‌, ఎరిథ్రిటోల్‌ వగైరా వగైరా కృత్రిమ తీపి పదార్థాలూ అందుబాటులో ఉన్నా...దేని పరిమితులు దానివే. ప్రత్యేకించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేనివారు చక్కెర స్థానంలో బెల్లాన్ని ఉపయోగించవచ్చని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బెల్లంలో కాల్షియం, ఇనుము కూడా ఉంటాయి. మధుమేహ పీడితులు కాఫీ,టీలలో కలుపుకునే ‘కృత్రిమ తీపి’ గుళికలూ దీర్ఘకాలంలో ఏమంత సురక్షితం కాదు. పిల్లలూ గర్భిణులూ అయితే అస్సలు వాడకూడదంటారు. ‘బ్రౌన్‌షుగర్‌’గా పిలిచే ముడి చక్కెర కూడా కొద్దిపాటి పోషక విలువల్ని మినహాయిస్తే...దాదాపుగా సాధారణ పంచదారతో సమానమే. ఎందుకైనా మంచిది, చక్కెర ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ముందు ఓసారి వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

చాపల్యాన్ని గెలిస్తే...
చక్కెరను గెలవాలంటే, ముందు మనసును గెలవాలి. అప్పుడిక, ఏ వూరింపులూ మనల్నేమీ చేయలేవు. కళ్లముందే గులాబ్‌ జామూన్ల గిన్నె ఉన్నా...అస్సలు పట్టించుకోం. నిజానికి, నాలుకకు రుచీ పచీ తెలియదు. మనం దేన్ని అలవాటు చేస్తే, దాన్నే కిక్కురుమనకుండా తినేస్తుంది. చక్కెర కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిజమే, హఠాత్తుగా చక్కెరను వంటింట్లోంచి నిషేధించలేం. కానీ, క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. చాయ్‌ కాఫీల విషయంలో... రెండు చెంచాల నుంచి ఒక చెంచాకూ, ఒక చెంచా నుంచి సగం చెంచాకూ...ఇలా వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకెళ్లడం కష్టమేం కాదు. ఒకట్రెండు రోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది. చప్పచప్పగా ఉంటుంది. నాలుక ఆ మోతాదుకు అలవాటు పడిపోగానే, అదే పరమాద్భుతంగా తోస్తుంది. చక్కెరను దూరంగా ఉంచాలంటే, ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లను దగ్గర చేసుకోవాలి. కడుపులో ఆకలి మొదలైపోగానే, మనసు రకరకాల రుచుల వైపు మళ్లుతుంది. ఏదో ఒకటి తినేయాలి - అన్నంత వరకూ పరిస్థితిని రానీయకూడదు. ఏం తినాలన్న నిర్ణయాధికారాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. ‘స్వీట్‌హాలిక్‌’గా మారిపోయామంటే...తినడం, తినకపోవడం అన్నది మన చేతుల్లో ఉండదు. అర్ధరాత్రి అయినా సరే, నేరుగా వంటింట్లోకో ఫ్రిజ్‌ దగ్గరికో వెళ్లి మిఠాయిల కోసం వెతుకుతాం. ఏమీ దొరక్కపోతే గుప్పెడు పంచదార తీసుకుని నోట్లో పోసుకుంటాం. అదే జరిగితే, చక్కెర మెదడును హైజాక్‌ చేసినట్టే. తీపి రుచుల్ని ఆస్వాదిస్తున్నప్పుడు మెదడులో ‘డోపమైన్‌’ అనే హార్మోను విడుదలవుతుందని నిపుణులు గుర్తించారు. ఆదే, మనిషిని పంచదారకు బానిసను చేస్తుంది. ‘మరింత....మరింత’ అన్న ఆరాటం మొదలవుతుంది. కడుపును నింపడం సులభమే, మనసును సంతృప్తి పరచడం చాలా కష్టం. ఆ వ్యసన గుణం వల్లే...ఎవరైనా ఓ మిఠాయి డబ్బా ముందు పెడితే, మొహమాటం పక్కనపెట్టి రెండు ముక్కలు తీసుకుంటాం. విందుల్లో అడిగిమరీ వడ్డించుకుంటాం.

చక్కెర లేనిదే బతకలేనేమో అన్న స్థాయి నుంచి ‘నో షుగర్‌ ప్లీజ్‌’ నినాదాన్ని అందుకునే దాకా...తన ఆలోచనల్నీ అధ్యయనాల్నీ ఓ పుస్తకంగా రాశారు రచయిత్రి డాక్టర్‌ వాణీ శ్రీనివాస్‌. ‘షుగర్‌ - ఎ మిస్టీరియస్‌ అడిక్షన్‌’ లో ఆ అనుభవాల్ని పంచుకున్నారు. ‘ఐదు కిలోల బరువు తగ్గాను. మిగతా రుచుల్నీ ఆస్వాదిస్తున్నాను. దంత సమస్యల నుంచి ఉపశమనం వచ్చింది. మెడ చుట్టూ ఉన్న నల్లని గీతలు కనుమరుగు అయ్యాయి. నడుము చుట్టుకొలతలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. మునుపటి కంటే చురుగ్గా ఉండగలుగుతున్నా’ అంటూ పంచదారను వంటింట్లోంచి తరిమేశాక తన జీవితంలో వచ్చిన మార్పుల్ని వివరించారు.

తన మానాన తాను తపస్సు చేసుకునే మహర్షిలా...మనం పంచదారను పూర్తిగా త్యజించినా రంభావూర్వశుల్లాంటి వాణిజ్య ప్రకటనలు, ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తుంటాయి. శీతలపానీయం తాగకపోతే జీవితమే వ్యర్థం అన్నట్టూ, ఫలానా మిఠాయిలో అసలు చక్కెరే లేనట్టూ తెగ కోతలు కోస్తాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అర్ధసత్యమో నిర్ధారించుకున్నాకే - వాటి జోలికెళ్లాలి. శీతలపానీయాల్లాంటి వాటిలో వాడే కృతకమైన చక్కెర పాకం మూత్రపిండాల్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ నెఫ్రాలజీ ప్రకటించింది. పండ్లూ పండ్ల రసాలూ ఆరోగ్యానికి మంచిదే. కానీ మార్కెట్లో దొరికే పళ్లరసాలన్నీ సురక్షితం కాదు. ఎందుకంటే, చాలా రసాల్లో ఎనభైశాతం పానకం ఇరవైశాతమే పళ్లరసం. మనమేమో గటగటా తాగేసి బోలెడంత బలం వచ్చిందని మురిసిపోతాం. అంతా భ్రమ, ‘తీయని’ భ్రమ! ‘డైట్‌ బిస్కెట్ల’ పేరుతో మార్కెట్‌ను పెంచుకుంటున్న ఉత్పత్తుల్లో అలిగోశాక్రైడ్స్‌ రూపంలో చక్కెర ఉంటుంది. వీటివల్ల జీర్ణ సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టి, రంగురంగుల ప్యాకింగ్‌లో వూరించే చిరుతిళ్లను తినేముందు..అందులోని దొంగచాటు చక్కెరను డేగ కళ్లతో గమనించాలి.

***

కొంతమంది...తీయగా నవ్వుతారు, తీయగా పలకరిస్తారు, తీయగా కబుర్లు చెబుతారు. అంతమాత్రాన పడిపోతామా? చెప్పినట్టల్లా తలూపుతామా? లేదే! ఆ కృతకమైన ప్రేమ వెనుక ఉన్న విషపు ఆలోచనల్ని పసిగడతాం. మొహమాటం లేకుండా దూరం పెట్టేస్తాం. చక్కెర విషయంలో ఆ విచక్షణ ఏమైపోతుందో!

మనుషుల విషయంలో చూపించే తెలివిడి...రుచుల విషయంలోనూ చూపగలిగితే - చక్కెర ఉన్నా లేకపోయినా, జీవన మాధుర్యానికి ఢోకా ఉండదు.

పంచదారా బొమ్మా బొమ్మా...

అందాన్ని పోల్చాల్సి వచ్చినప్పుడు ‘పంచదార బొమ్మ’ను గుర్తుచేసుకుంటాం. ఏ పదార్థానికైనా పంచదారతో కొత్త అందం వస్తుంది. అప్పటిదాకా లేని మెరుపేదో తోడవుతుంది. ఓ స్థాయికి మించి వేడిచేసినప్పుడు (175 డిగ్రీల సెల్సియస్‌) ఓ విధమైన సువాసన వచ్చి చేరుతుంది. దాంతోపాటే ముదురు బంగారం వన్నె! పంచదార తగిలితే, పదార్థానికి మృదుత్వం వస్తుంది. అందుకే, మిఠాయిల్ని సుతారంగా పసిపాపల్లా అందుకుంటాం. నిల్వ విషయంలో అయితే తిరుగే లేదు. నెలల తరబడి నిక్షేపంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతలన్నీ... మిఠాయిల వ్యాపారులకు వరాల్లా మారాయి.

ఏది, ఎంత?

ప్రతి వంద గ్రాముల చక్కెరలో దాదాపుగా...శక్తి 387 కెలోరీలు, కార్బొహైడ్రేట్లు 99.98 గ్రాములు, కొవ్వు 0, ప్రొటీన్లు 0, విటమిన్‌ బి2 0.019 మిల్లీ గ్రాములు, మినరల్స్‌ - కాల్షియం 1 మిల్లీ గ్రాము, ఇనుము - 2 మిల్లీ గ్రాములు, పొటాషియం - 2 మిల్లీ గ్రాములు, నీళ్లు - 0.03 గ్రాములు ఉంటాయి.


బహుమతిగా...

బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్తున్నప్పుడు దార్లో ఓ కిలో మిఠాయి కట్టించుకుని వెళ్తాం. పుచ్చుకున్నవాళ్లూ సంతోషంగానే పుచ్చుకుంటారు. ఆధునిక కుటుంబాల్లో ముగ్గురు నలుగుర్ని మించి ఉండరు. అన్నన్ని మిఠాయిలు ఏం చేసుకుంటారు? చూస్తూ చూస్తూ చెత్తబుట్టలో పడేయలేరు. తీపి మీద మమకారం కొద్దీ ఏ పనిమనుషులకో ఇవ్వనూలేరు. చేసేదేముంది, ఫ్రిజ్‌వైపు వెళ్లిన ప్రతిసారీ ఓ ముక్క నోట్లో వేసుకుంటారు. దీనివల్ల ఎన్ని అదనపు కెలోరీలు పోగైపోతాయో ఆలోచించుకోండి. ఆ ప్రభావం గుండె మీద ఉండవచ్చు, మూత్ర పిండాల మీద పడవచ్చు, రక్తపోటును పోటెత్తించవచ్చు. ‘హ్యాపీ బర్త్‌డే’ అనో, ‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ’ అనో మీరు హృదయపూర్వకంగా అందించిన శుభాకాంక్షలకు అర్థమే లేకుండా పోతుంది. ఈసారి, మిఠాయి పొట్లానికి బదులుగా తాజా పండ్లు ఇవ్వండి. పచ్చని మొక్కలు ఇవ్వండి. మంచి పుస్తకాలు ఇవ్వండి. ఇస్తూ ఇస్తూ... మీరు మిఠాయి ఎందుకు ఇవ్వడం లేదన్నదీ స్పష్టంగా చెప్పండి.


ఎందులో ఎంత చక్కెర

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం...ఆరోగ్యవంతురాలైన మహిళ రోజుకు ఆరు చెంచాలూ (25 గ్రాములు), ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేని పురుషుడు రోజుకు ఎనిమిది చెంచాలూ (35 గ్రాములు) చక్కెర వాడవచ్చు. మోతాదు దాటితే మాత్రం అనారోగ్యకరమే. భారతీయుల సగటు వినియోగం వంద గ్రాములు దాటుతోందని అంచనా.

 

సంప్రదాయమే తీపి!
- ప్రొఫెసర్‌ కడియాల ఉమాదేవి
గృహ విజ్ఞాన కళాశాల(హైదరాబాద్‌), ప్రొ.జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ

యాబెటిక్‌ ఫౌండేషన్‌ అంచనా ప్రకారం...ఏడు మహానగరాల్లోని దాదాపు పాతికశాతం పిల్లలు వూబకాయులే. రోజూ తినే ఐస్‌క్రీమ్‌లూ చాక్లెట్లలోని తీపి...చిన్నారుల ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది. పసివాళ్లు కొత్తదనాన్ని కోరుకుంటారు. రోజుకో రకం తినాలని ఉవ్విళ్లూరతారు. ఆ తినిపించేదేదో...పిజ్జాలో బర్గర్లో కాకుండా, సంప్రదాయ ఆహారం అయితే మేలు. విదేశీ చిరుతిళ్లతో పోలిస్తే మన రుచులే ఆరోగ్యకరం. కొబ్బరి లడ్డూలూ, నువ్వుల ఉండలూ, పప్పు చెక్కలూ..మొదలైన వాటిలో రుచికి రుచీ, పోషక విలువలకు పోషక విలువలూ ఉంటాయి. బాల్యం నుంచే కూరగాయల పట్లా పండ్ల పట్లా మక్కువ పెంచాలి. కన్నవారి ఆహారపు అలవాట్లే పిల్లలకు వస్తాయి. ముందు పెద్దలు మారితే, మెల్లగా పిల్లలూ మారతారు.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.