close
తెర అందం చూడతరమా..!

సుతిమెత్తని గాలి కెరటాలకు సుతారంగా కదిలే పలుచని ఆ పరదాల రెపరెపల్ని చూస్తూ కూర్చునే సౌందర్య పిపాసులు ఎందరో... అందుకేనేమో కవివర్యుల వర్ణనల్లో కిటికీల తెరలూ కవితా వస్తువులే. అయితే ఒకనాటి ఆ సాదాసీదా తెరల సోయగం నేడు కవుల్నే కాదు, సాధారణ వ్యక్తుల చూపుల్నీ కట్టిపడేసేంత అందమైన గృహాలంకారంగా మారిపోయింది.

లివింగ్‌రూములోని సోఫాసెట్‌ సూపర్‌. బెడ్రూమ్‌లో మంచం డిజైన్‌ అద్భుతం. డైనింగ్‌హాల్లోని టేబులూ చూడముచ్చటగా ఉంది. గోడలమీద చిత్రాల అలంకరణా అదుర్సే. మొత్తంగా ఫర్నిచరూ అలంకరణ వస్తువులూ అన్నీ దేనికది ఎంతో బాగున్నాయి. అయినా ఇల్లు బోసిపోయినట్లుగా అనిపించిందీ అంటే... కచ్చితంగా కర్టెన్‌ అలంకార లోపమే అనుకోవాలి. అంతగా ఇప్పుడు కర్టెన్లు ఇంటి అలంకరణలో భాగంగా మారిపోయాయి.

ఒకప్పడు కిటికీల్లోంచి ఎండ రాకుండానో వాటిని తెరిచి ఉంచినప్పుడు లోపలికి దుమ్ము పడకుండానో రాత్రివేళ వీధి లైట్ల కాంతి గదిలో పడితే నిద్ర పట్టదన్న కారణంతోనో మాత్రమే ఎక్కువమంది కర్టెన్లు తగిలించేవారు. అది కూడా ఏదైనా డిజైన్‌ ఉన్న మందపాటి క్లాత్‌ను కిటికీ బారునా ఉండేలా వేసేవారు. మహా అయితే ఎంబ్రాయిడరీ చేసినవో లేదా పెయింట్‌ చేసినవో మాత్రమే వాడేవారు. అదీ సింగిల్‌ పీస్‌ కర్టెన్ల వాడకమే అప్పట్లో ఎక్కువ.

 

కానీ ఆధునిక గృహాలంకరణలో కిటికీ కర్టెన్లూ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పడకగదీ, హాలూ, వరండాగదీ, వంటిల్లూ ఏదయినా గానీ విశాలమైన కిటికీలు అమర్చి వాటికి రెండు మూడు విడివిడిగా ఉండే పొడవాటి కర్టెన్లు తగిలించడం ఇంటి అలంకారంలో తప్పనిసరి అయింది. అయితే కాలంతోబాటు ఈ కర్టెన్ల అలంకరణలోనూ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ పొడవాటి క్లాత్‌ కర్టెన్లకు పై భాగంలో కుచ్చులు వచ్చేలా కాస్త డాబుగా మరో కర్టెన్‌ను తగిలించే అలంకారం కూడా ఇప్పుడు పాత ఫ్యాషనయిపోయింది. వెనకభాగంలో పారదర్శకమైన పేస్టల్‌ రంగుల్లోని పలుచని పాలీయెస్టర్‌ లేదా నెట్‌ క్లాత్‌ ఉండి దానిమీద గౌను కుచ్చిళ్ళ మాదిరిగానో చీర కట్టినట్లో అనార్కలీ తొడుక్కున్నట్లో రకరకాల డిజైన్లలో కుట్టిన మరో రకమైన కర్టెన్‌ క్లాత్‌ను తగిలించడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఈ రకమైన కర్టెన్‌ అలంకరణతో ఆ గది లుక్కే మారిపోతుంది. అంతేకాదు, హరివిల్లు సోయగం ఉట్టిపడేలా అనేక రంగుల కర్టెన్లూ తగిలించి వాటిని ఎంతో అందంగా మడుస్తున్నారు. దాంతో గదిలో రంగుల అందం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. కర్టెన్లను వేలాడదీసే రాడ్లలోనూ రాజీపడటం లేదు. అందులోనూ వేనవేల డిజైన్లు వస్తున్నాయి. ఇక, కర్టెన్లను అందంగా మడిచి ఉంచే తాళ్లూ, పూసలూ క్రిస్టల్స్‌తో అలంకరించే దారపు కుచ్చుల అందాన్ని మాత్రం వర్ణించగలమా... అందుకే మార్కెట్లో కర్టెన్లూ వాటి అలంకరణ సామగ్రికోసమే ప్రత్యేక షోరూమ్‌లూ వెలుస్తున్నాయి. ఇక, పరదాల అందాల గురించయితే ప్రత్యేకంగా చెప్పేదేముందీ... వందల రంగుల్లో వేనవేల డిజైన్లలో విభిన్న ఫ్యాబ్రిక్కుల్లో దొరుకుతాయి. వీటిల్లో అన్నీ కుట్టి రెడీమేడ్‌గా అలంకరించుకోగలగినవి కొన్నయితే, మనకు నచ్చిన డిజైన్లలో కుట్టించుకోవాల్సినవి మరికొన్ని. వీటికితోడు ఈ గది అచ్చంగా నాది అనిపించేలా ఎవరికి వాళ్లు తమ ఫొటోలను ముద్రించుకోగలిగే పర్సనలైజ్‌డ్‌ కర్టెన్లూ వస్తున్నాయి. ఇంకా, గదిలోని సోఫా కవర్లూ బెడ్‌సెట్లకూ మ్యాచయ్యేలా రూపొందించిన సెట్లూ ఉంటున్నాయి.

చూశారా మరి... ఒకప్పుడు రెస్టారెంట్లలోనో పెళ్లి వేదికలమీదో సినిమా థియేటర్లలోనో కనిపించే రకరకాల కర్టెన్ల అలంకారాలు నేడు సాధారణ గృహాలనూ కళ కట్టిస్తున్నాయి. ‘తెర అందం చూడతరమా’ అనుకునేలా చేస్తున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.