close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త
- నాగేశ్వరరావు

‘‘ఒరేయ్‌ సోమీ, సోమీ...’’ అంటూ కొడుకు సోమయాజిని పిలిచింది చారుమతి.

‘‘ఏంటీ..?’’ అంటూ వచ్చాడు లోపల నుంచి సోమయాజి.

‘‘వచ్చే ఆదివారం మీ నాన్నగారి తద్దినం. పంతులికి చెప్పావా?’’ అడిగింది.

‘‘చూద్దాంలేవే, ఇంకా వారం రోజులు టైమ్‌ ఉందిగా’’ అన్నాడు సోమయాజి.

‘‘సమయానికి పంతుళ్ళు దొరకద్దూ. తూతూ మంత్రాలు చదివే పంతుళ్ళని తీసుకువస్తే పళ్ళు రాలగొడ్తాను’’ అంది కోపంగా.

‘‘నీ సంగతి నాకు తెలీదా. అందుకే కాశీపతి అని మన అమలాపురం సుబ్బరాయశాస్త్రిగారి అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నిన్ననే ఫోన్‌ చేశాను. రేపు వస్తానన్నాడు, అప్పుడు మాట్లాడొచ్చులే’’ అంటూ లోపలికి వెళ్ళాడు సోమయాజి.

‘ఏవిటో దేనికీ తొందరపడడు కదా! కాశీపతా... రేపు వస్తాడా, రానీ మాట్లాడదాం’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది చారుమతి.

***

కాశీపతి సెల్‌ మాట్లాడుతూ వచ్చాడు- ‘‘సుబ్బారావుగారూ, చెప్పాను కదండీ- ఆరోజు కుదరదూ... పంతుళ్ళు దొరకరని. అయినా ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలూ, దారి ఖర్చులూ అడుగుతున్నారు. అలాగే అంటారా... సరే, అలా అయితే పంపిస్తాను. డబ్బులు వాళ్ళకేం ఇవ్వకండి. నేనే వచ్చి తీసుకుంటాను. సరే, ఉంటాను’’ అంటూ సెల్‌ కట్టేసి కామేశానికి ఫోన్‌ చేశాడు.

‘‘హలో కామేశం, సుబ్బారావుగారి ఇంటికి భోక్తలు కావాలిట. ఒక్కొక్కళ్ళకీ మూడొందలు ఇచ్చి నలుగురిని పంపించు. అక్కడ ఏం ఇవ్వరని చెప్పు’’ అంటూ సెల్‌ ఆఫ్‌ చేసి ‘‘సోమయాజిగారూ, సోమయాజిగారూ’’ అంటూ పిలిచాడు.

లోపలనుంచి సోమయాజి ‘‘ఎవరూ?’’ అంటూ వచ్చాడు.

‘‘అయ్యా, నా పేరు కాశీపతి. సుబ్బరాయశాస్త్రిగారి అల్లుడిని’’ చెప్పాడు కాశీపతి.

‘‘మీరా... నమస్తే, కూర్చోండి’’ అన్నాడు వినయంగా సోమయాజి.

కాశీపతి కూర్చున్నాడు.

లోపల నుంచి చారుమతి వచ్చింది. కాశీపతిని చూడలేదు.

‘‘ఒరే సోమీ, కాశీపతిగాడు వస్తాడన్నావు... ఇంకా వచ్చి చావలేదు. ఎక్కడ చచ్చాడో ఓసారి కనుక్కో’’ అంది విసురుగా.

సోమయాజి కంగారుపడి ‘‘అమ్మా’’ అంటూ చెప్పబోయాడు.

చారుమతి- ‘‘అమ్మా లేదు, బొమ్మా లేదు... ముందు ఫోన్‌ చెయ్యి. మనకున్న కంగారు వాడికెందుకు ఉంటుంది’’ అంది.

‘‘అదికాదే...’’

‘‘ఏదికాదు... ఓసారి ఫోన్‌ కలిపి ఇవ్వు. వెధవని నాలుగు దులిపేస్తాను. దరిద్రప్పీనుగాని... అసలు వాడినికాదు, ఆ సుబ్బరాయశాస్త్రిని అనాలి. ఇలాంటి వెధవని అల్లుడిగా చేసుకున్నందుకు’’ అంది చిరాగ్గా.

‘‘అమ్మా, ఆయన వచ్చారు’’ అన్నాడు సోమయాజి.

‘‘వచ్చాడా, ఎక్కడరా’’ అంటూ చూసింది చారుమతి.

‘‘అడుగో అతనే’’ అంటూ కాశీపతిని చూపించాడు సోమయాజి.

చారుమతి చూసి ‘‘నువ్వా, బాగుంది... సంగతి చూడు’’ అంటూ కూర్చుంది.

‘‘మామయ్యగారు చెప్పారు. రేపు ఆదివారం ఎవరిదో తద్దినం ఉందిట కదా?’’ అన్నాడు కాశీపతి.

‘‘ఆఁ... నాదే’’ అంది చారుమతి.

కాశీపతి షాకయి ‘‘అదేంటమ్మా అంతమాట అన్నారు’’ అన్నాడు.

‘‘లేకపోతే ఏంటి... తద్దినం అని చెప్పినవాడు, ఎవరిదో చెప్పలేదా?’’ గద్దించింది

‘‘అంటే... అదీ...’’ నసిగాడు కాశీపతి.

‘‘సరేలే, విషయానికి రా’’ అంది.

‘‘తద్దినం ఎలా పెట్టమంటారు?’’ అడిగాడు కాశీపతి.

చారుమతికి కోపం నషాళానికి ఎక్కింది ‘‘ఎలా పెట్టడం ఏంటి? కాశీపతి, అసలు నువ్వు పంతులువేనా?’’ అడిగింది.

‘‘అదేంటమ్మా, అంత మాటన్నారు’’ అన్నాడు వూతపదంగా కాశీపతి.

‘‘లేకపోతే తద్దినం ఎలా పెట్టాలని నన్ను అడుగుతావేంటి?’’ అంది కోపం తమాయించుకుంటూ.

‘‘అమ్మా, మీకు తెలిసినట్టు లేదు. ఇక్కడ నాలుగు రకాల తద్దినాలు ఉన్నాయి. ఇన్‌స్టంట్‌, ఆర్డినరీ, స్పెషల్‌, సూపర్‌ స్పెషల్‌. ఎందుకంటే ఇది సిటీ. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అట్టే టైమ్‌ ఉండదు, అందుకన్నమాట’’ అన్నాడు కాశీపతి.

ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.

‘‘అర్థంకాలేదు... కాస్త వివరంగా చెబుతారా?’’ అడిగాడు సోమయాజి.

‘‘అయితే, వినండి’’ అంటూ కాశీపతి వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు.

‘‘అమ్మా, మొదటిది- ఇన్‌స్టంట్‌ తద్దినం... అంటే, పంతుల్ని పిలిచి కాళ్ళు కడిగి, పంతులి భోజనానికి హోటల్‌ టికెట్‌ ఇచ్చి సంభావన ఇవ్వటం. దీనికి వెయ్యినూటపదహార్లు - సమయం పావుగంట. రెండోది- ఆర్డినరీ... అంటే తూతూ మంత్రం చదివేసి ఏదో అయింది అనిపించేసి, వీలయితే భోజనం, లేకపోతే ఇన్‌స్టంట్‌లో మాదిరిగానే పంతులి భోజనానికి హోటల్‌ టికెట్‌ ఇచ్చి సంభావన ఇవ్వటం. దీనికి రెండువేలా నూటపదహార్లు - సమయం అరగంట. ఇక మూడోది- స్పెషల్‌... అంటే అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. కాకపోతే మంత్రాల తతంగం సింపుల్‌గా తక్కువగా ఉంటుంది. భోజనాలు ఇక్కడే. సమయం గంటనుంచి గంటన్నర. మూడువేలా నూటపదహార్లు. ఇకపోతే నాలుగోది- సూపర్‌ స్పెషల్‌... అంటే అన్నీ శాస్త్రోక్తంగా జరుపుతాం. మీ ఏర్పాట్లు మీవి, మా ఏర్పాట్లు మావి. భోక్తలు అందరూ వస్తారు. సమయం రెండు నుంచి మూడు గంటలు. ఐదువేలా నూటపదహార్లు’’ అంటూ ముగించాడు.

‘‘ఓరి నీ తద్దినం పాడుగానూ, ఇంత కథ చెప్పావేంటి?’’ అంది చారుమతి.

‘‘కథ కాదమ్మా, సిటీ కదా... ఇలాగే ఉంటాయి’’ అన్నాడు కాశీపతి.

‘‘అమలాపురంలో ఇంతలేవు’’ అన్నాడు సోమయాజి.

‘‘ఉండవు. అందుకే అది అమలాపురం అయింది, ఇది హైదరాబాద్‌ అయింది. అయినా, ఈ రోజుల్లో శాస్త్రోక్తంగా తద్దినం ఎవరూ పెట్టడంలేదు. అందరూ ఇన్‌స్టంట్‌, ఆర్డినరీ. నూటికి ఒక్కడు స్పెషల్‌ తద్దినం పెడుతున్నాడు. ఇక సూపర్‌ స్పెషల్‌ పెట్టేవాడే లేడు’’ అంటూ ఆగాడు కాశీపతి.

‘‘నోరుముయ్యి. అసలు తద్దినాలలో ఇన్ని రకాలు కనిపెట్టినవాడి తద్దినం పెట్టాలి. మీరు సవ్యంగా చెబితే వాళ్ళు సవ్యంగా చేస్తారు’’ అంది చారుమతి.

‘‘నా బొంద చేస్తారు. అసలు వీళ్ళలో ఓర్పు ఎక్కడున్నదమ్మా. మొన్న ఓ ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతానికి పిలిచారు. వ్రతం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ‘ఇంకా ఎంతసేపు, ఇంకా ఎంతసేపు’ అంటూ ప్రాణాలు తోడేశారంటే నమ్మండి. దాంతో మంత్రాలు షార్ట్‌కట్‌ చేసి కథలు టూకీగా చెప్పాల్సి వచ్చింది. మాకు చెప్పే ఓపిక ఉన్నా కూర్చుని వినే ఓపిక జనాల్లో లేదమ్మా. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టు ‘యధా జనం, తధా పంతుళ్ళు’ అనుకుంటూ బతుకుతున్నాం’’ అన్నాడు కాశీపతి.

‘‘మొత్తానికి లౌక్యం తెలిసినవారే’’ అన్నాడు సోమయాజి.

‘‘ఏం లౌక్యంలెండి... ఆ కాశీపతి అయితే ఎక్కువసేపు చేస్తాడు. వాడు వద్దు’’ అని ఇంకో పంతుల్ని పిలుస్తారు. దాంతో వచ్చేవి కూడా పోతున్నాయి. అందుకే తెల్సున్నవాళ్ళని మొహమాటం లేకుండా అన్ని వివరాలూ ముందే చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మీ తద్దినం... క్షమించాలి... అదే, పెద్దాయన తద్దినం ఎలా పెట్టమంటారు. ఇన్‌స్టంటా, ఆర్డినరీనా, స్పెషలా, సూపర్‌ స్పెషలా... చెప్పండి’’ అన్నాడు కాశీపతి.

‘‘కాశీపతీ, ఇలాంటి పిచ్చివేషాలు నా దగ్గర పనిచేయవు. అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి’’ అంది చారుమతి.

‘‘అయితే, సూపర్‌ స్పెషల్‌ అన్నమాట... చాలా సంతోషం’’ అన్నాడు సంతోషంగా కాశీపతి.

‘‘ఎందుకు... డబ్బులు ఎక్కువ వస్తాయనా?’’ అన్నాడు సోమయాజి.

‘‘అయ్యా, ఓ విధంగా అదే అయినా... గత ఆరేళ్ళనుంచి పూజలుగానీ వ్రతాలుగానీ ఇవిగానీ ఆఖరికి లక్షలు ఖర్చుపెట్టి చేసే పెళ్ళిళ్ళుగానీ... ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా చేయలేదంటే నమ్మండి. మాకూ కాస్త తృప్తిగా చేయించామనే ఫీలింగ్‌ ఉండాలి కదా, అలాగే కానిద్దాం. ఇక ఆ విషయం నాకు వదిలేసి, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఆదివారం ఉదయాన్నే వస్తా’’ అన్నాడు కాశీపతి.

‘‘మర్చిపోతావేమో రాసుకోరా అబ్బీ’’ అంది చారుమతి.

‘‘అవసరంలేదమ్మా, ఆరేళ్ళ తర్వాత మంచి అవకాశం... వదులుకుంటానా- సెల్‌లో ఫీడ్‌ చేసుకుంటా’’ అంటూ సెల్‌లో ఫీడ్‌ చేసుకున్నాడు.

‘‘అడ్వాన్స్‌ ఏవన్నా ఇమ్మంటారా?’’ అడిగాడు సోమయాజి.

‘‘చెప్పు తీసుకు కొడతాడు మా మామయ్య, మీ దగ్గర అడ్వాన్స్‌ తీసుకుంటే... వస్తా’’ అంటూ వెళ్ళిపోయాడు.

***

ఆదివారం కాశీపతి వచ్చి తద్దినం శాస్త్రోక్తంగా పెట్టాడు. కానీ ఒక తంతు మిగిలిపోయింది.

‘‘అయ్యా, తద్దినంలో ముఖ్యమైనది పిండం కాకులకి పెట్టడం. మనం చేసిన ఈ కర్మ సక్రమంగా జరిగి, మన పెద్దలు సంతోషించారు అని తెలియజెప్పేది ఈ కార్యక్రమం. మనం పెట్టిన పిండాలు కాకులు ముట్టుకుంటే పెద్దలు సంతోషించి తరించినట్టే, పదండి’’ చెప్పాడు కాశీపతి.

అందరూ డాబా పైకి చేరారు.

సోమయాజి ఆకులో పిండాలు తెచ్చి డాబా పిట్టగోడ మీద పెట్టాడు. అందరూ కాకి కోసం చూస్తున్నారు. కనుచూపు మేరలో కాకి అన్నదే కనిపించలేదు.

కొంతమంది పైకి చూస్తూ కొంతమంది చుట్టుపక్కల చూస్తూ ‘కా.. కా..’ అంటూ అరుస్తున్నారు కాకుల కోసం. చివరికి అందరూ అరవటం మొదలుపెట్టారు.

పిల్లలకి ఏమీ అర్థంకాక వాళ్ళూ గొంతులు కలిపారు. కాకపోతే వాళ్ళు గొంతులు కలిపింది కాకుల కోసం కాదు, ఆకలేసి.

‘‘బామ్మా, కాకులు రావటంలేదే... ఆకలేస్తోంది’’ అన్నాడు సోమయాజి కొడుకు రామ సోమయాజి.

‘‘కాకి పిండం ముట్టుకునేదాకా ఎవరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు’’ ఖరాఖండిగా చెప్పింది చారుమతి.

అందరూ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. సమయం రెండు గంటలు దాటడంతో అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు.

‘‘కాశీపతిగారూ, కాకులు కాదు కదా... కాకి ఈక కూడా కనబడటంలేదు, ఏం చేద్దాం?’’ అన్నాడు సోమయాజి.

‘‘మీరేం కంగారుపడకండి. ఓ పావుగంటలో కాకి వస్తుంది’’ అన్నాడు కాశీపతి సోమయాజితో.

‘‘రెండుగంటలైనా రాని కాకి... ఓ పావుగంటలో ఎలా వస్తుందండీ?’’ అంటూ అడిగాడు ఓ పెద్దమనిషి.

‘‘డబ్బులుంటే కొండమీద కోతి కూడా దిగివస్తుంది. కాకి ఓ లెక్కా?’’ అన్నాడు కాశీపతి.

‘‘అదెలాగండీ’’ అన్నాడు సోమయాజి.

‘‘ఓ అయిదువందలు ఇటివ్వండి... పావు గంటలో కాకి వచ్చి వాలేలా ఏర్పాటుచేస్తా.’’

‘‘అయిదువందలు కాదు, ఐదు వేలయినా సరే... కాకి ముట్టిన తర్వాతే అందరూ అన్నాలు ముట్టేది’’ అంది చారుమతి.

‘‘విన్నారుగా, మీ అమ్మగారికి ఐదువేలు అయినా ఫర్వాలేదుట’’ అన్నాడు కాశీపతి ఆనందంగా.

‘‘కాశీపతిగారూ, ఆవిడ మాటలకేంగానీ, అయిదువందలు ఖాయం చేసుకుని అర్జెంటుగా కాకి చేత కబురు పంపి ఓ కాకిని రప్పించండి. అందరూ ఆకలితో ఉన్నారు’’ అన్నాడు సోమయాజి.

కాశీపతి సెల్‌ఫోన్‌లో ఓ నంబరు డయల్‌ చేసి ‘‘హలో, కాకి కామేశం... నేను కాశీపతిని. అర్జెంటుగా ఓ కాకి’’ అంటూ ఆగి సోమయాజితో ‘‘ఒకటా, రెండా?’’ అని అడిగాడు.

సోమయాజికి అర్థంకాలేదు. ‘‘అంటే?’’ అన్నాడు.

‘‘ఒక కాకయితే అయిదొందలు, రెండయితే ఏడువందలయాభై. రానూపోనూ ఖర్చులు ఇవ్వాలిట’’ అన్నాడు కాశీపతి.

‘‘ఒకటి చాల్లెండి’’ అన్నాడు సోమయాజి.

‘‘ఒకటి చాలుట. వెంటనే పది నిమిషాల్లో నువ్వు కాకితో సహా ఇక్కడ వాలాలి’’ అంటూ సెల్‌ఫోన్‌ కట్‌ చేసి ‘‘అయ్యా, ఇంకో పావుగంటలో కాకి వస్తుంది. పిండాన్ని ముట్టుకుంటుంది. అమ్మా, ఈలోగా ఆకులు వెయ్యమని చెప్పండి’’ అన్నాడు కాశీపతి చారుమతితో.

‘‘ఎన్నిసార్లు చెప్పాలిరా అబ్బీ, కాకి ముట్టిన తర్వాతే ఆకులయినా వడ్డనయినా...’’ విసుక్కుంది చారుమతి.

‘‘కోప్పడకండమ్మా, పది నిమిషాల్లో కాకి వచ్చి ముట్టుకుంటుంది... నాదీ గ్యారంటీ. కాకపోతే సోమయాజిగారూ, కాకి విషయంలో నా కమీషను యాభై రూపాయలు మీరు కాదనకూడదు’’ అన్నాడు కాశీపతి.

‘‘అలాగేలెండి’’ అన్నాడు సోమయాజి.

అందరూ అరవటం మానేసి రోడ్డువంక చూస్తున్నారు కాకి కోసం.

ఇంతలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ముసుగు వేసిన వస్తువుతో దిగాడు నల్లగా ఉన్న కామేశం.

అందరూ కామేశం చేతిలో ఉన్నదాన్నే చూస్తున్నారు.

‘‘అదిగో, కామేశం వచ్చాడు’’ అన్నాడు కాశీపతి.

చారుమతి కామేశాన్ని చూసి ‘‘కాకి వస్తుంది అనుకుంటే, కాకిలాంటి వీడు వచ్చాడేంటీ’’ అంది.

‘‘అమ్మా, కామేశం వచ్చాడంటే... కాకి వచ్చిందన్నమాట’’ అన్నాడు కాశీపతి.

‘‘ఏంటీ ఆలస్యం’’ అన్నాడు కామేశం.

‘‘మాదేంలేదు, నీదే ఆలస్యం... త్వరగా కానీ’’ అన్నాడు కాశీపతి.

‘‘ఇదిగో, ఒక్క నిమిషం’’ అంటూ కామేశం ముసుగుతీశాడు. అందులో ఓ పంజరం, దానికి రెండు అరలున్నాయి. ఓ అరలో కాకి ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు.

కామేశం పంజరం తలుపు తీశాడు.

‘‘సోమయాజిగారూ, ఆ పిండాన్ని తీసి పంజరంలో పెట్టండి’’ అన్నాడు కాశీపతి.

సోమయాజి పిండాన్ని పంజరంలో పెట్టాడు.

కామేశం పంజరం తలుపు మూసి లోపల ఉన్న అరని పైకి లాగాడు.

అందరూ చూస్తున్నారు.

కాకి పిండాన్ని ముట్టుకోవటం లేదు.

అందరూ ఆశ్చర్యపోయారు.

‘‘బామ్మా, ఏమిటే కాకి ముట్టుకోవటంలేదు’’ అడిగాడు రామ సోమయాజి.

‘‘మీ తాతయ్యకి కోపం వచ్చిందేమోరా’’ అంది బామ్మ.

‘‘తాతయ్యా, త్వరగా తిను తాతయ్యా... మా అందరికీ ఆకలేస్తోంది’’ అన్నాడు రామ సోమయాజి.

‘‘ఏంటి కాశీపతిగారూ, కాకి ముట్టుకోవటంలేదు?’’ అడిగాడు సోమయాజి.

‘‘మీ అమ్మగారన్నట్టు, మీ నాన్నగారికి కోపం వచ్చిందేమో’’ అన్నాడు కాశీపతి.

‘‘నాన్నా, ఏంటిది? నీకోసం అయిదువందలు పెట్టి పిలిపించాను. ఇంకా ఏంటి?’’ అని కాకితో అన్నాడు సోమయాజి.

కాకి కామేశం వంక చూసింది.

ఎవరూ గమనించకుండా- కామేశం తల అడ్డంగా వూపాడు.

కాకి పిండం ముట్టుకోలేదు.

‘‘అయ్యా, మీ నాన్నగారికి తీరని కోరికలు ఏమయినా ఉన్నాయోమో ఓసారి గుర్తుతెచ్చుకోండి’’ అన్నాడు కామేశం.

‘‘నాకు తెలిసి మా నాన్నకి సినిమా నటి సావిత్రి అంటే చాలా ఇష్టం. ఖర్మకాలి మీ అమ్మని చేసుకున్నాను. లేకపోతే సినిమా నటి సావిత్రిని పెళ్ళిచేసుకునేవాడిని, లవ్‌ లెటర్‌ కూడా రాశాను- అంటూండేవారు.’’

‘‘ఆ మాట నాతో ఎప్పుడూ అనలేదే!’’ అంది చారుమతి కోపంగా.

‘‘బాగుందమ్మా, ఆయన లవ్‌స్టోరీ మీకెందుకు చెబుతారు. చెబితే మీరు మాత్రం ఒప్పుకుంటారా? అందుకనే పాపం అబ్బాయికి చెప్పి ఉంటారు. ఏవంటారు సోమయాజిగారూ’’ అన్నాడు కాశీపతి.

‘‘నాన్నా, నువ్వు పోయావు. సావిత్రి కూడా పోయింది. నీ కోరిక తీరేది కాదు, తిను నాన్నా’’ అంటూ కాకిని బతిమిలాడాడు సోమయాజి.

‘‘అదికాదుగానీ ఇంకో కోరిక ఉందేమో ఆలోచించండి’’ అన్నాడు కామేశం.

‘‘నాకు తెలిసి ఇంకేంలేవు. నాన్నా, నీకు కోరికలేమైనా ఉంటే నాకుగానీ అమ్మకుగానీ కలలో కనిపించి చెప్పు, తీరుస్తాం’’ అన్నాడు సోమయాజి కాకితో.

‘‘ఆ... ఈ ఏర్పాటు ఏదో బాగానే ఉంది కానీ దోష నివారణార్థం దక్షిణ పెట్టండి’’ అన్నాడు కామేశం.

‘‘నాన్నా, దోష నివారణార్థం కామేశం గారికి వెయ్యి రూపాయలు ఇస్తా, తిను’’ అన్నాడు సోమయాజి.

కాకి కామేశం వంక చూసింది.

కామేశం తల అడ్డంగా వూపాడు.

కాకి పిండం ముట్టుకోలేదు.

‘‘అయ్యా, లాభంలేదు’’ అన్నాడు కామేశం.

‘‘పోనీ పదిహేనువందలు ఇస్తా, ఇక తిను నాన్నా’’ అన్నాడు సోమయాజి.

కాకి కామేశం వంక చూసింది.

కామేశం తల నిలువుగా వూపాడు.

ఆకలిమీద ఉన్న కాకి ఆబగా పిండాన్ని తింది.

అందరూ ఆనందపడ్డారు.

‘‘బామ్మా, తాతయ్య కోపం పోయిందే... తినేశాడు’’ అన్నాడు రామ సోమయాజి బామ్మతో.

‘‘అవునురా కన్నా. ఇక ఆలస్యం ఎందుకు పదండి వడ్డిద్దాం’’ అంటూ అందరూ లోపలికి వెళ్ళారు.

***

పంతుళ్ళ భోజనాలయ్యాయి. మిగిలినవాళ్ళు తింటున్నారు.

సోమయాజి పంతులికి తాంబూలంలో అయిదువేలా నూటపదహార్లు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు.

‘‘అయ్యా, మీ బోటివాళ్ళు ఉండబట్టి ఇంకా ధర్మం నిలబడింది. ‘మనో వాంఛా ఫల సిద్ధిరస్తు’ ’’- అంటూ దీవించి డబ్బు లెక్కపెట్టుకుని ‘‘అయ్యా, కాకి తాలూకు కమీషన్‌ యాభై రూపాయలు ఇవ్వలేదు’’ అన్నాడు కాశీపతి.

సోమయాజి కాశీపతికి యాభై రూపాయలు ఇచ్చి ‘‘కామేశంగారూ, ఇవిగో ఈ అయిదువందలు కాకికి, ఈ రెండువందలు మీ రానూపోనూ ఖర్చులు, ఈ పదిహేను వందలు మా నాన్న కోరిక కోసం. ఈ మూడు వందలు మీకు సంభావన’’ అంటూ రెండువేల అయిదు వందలు ఇచ్చాడు.

‘‘మహాప్రసాదం’’ అంటూ తీసుకున్నాడు కామేశం.

కాకిని పంజరంలో సర్దుకున్నాడు కామేశం.

‘‘కామేశంగారూ, మీ పని బాగుందండీ’’ అన్నాడు సోమయాజి.

‘‘నాదేముందండీ, అంతా కాకిదే. కాకిని నమ్ముకుని బతుకుతున్నా’’ అన్నాడు కామేశం.

‘‘కాకిని నమ్ముకుని కాదు... కాకిని అమ్ముకుని బతుకుతున్నావు. అది సరేగానీ అబ్బీ, కాకి కామేశం అంటే... మీ ఇంటిపేరు కాకివారా?’’ అడిగింది చారుమతి.

‘‘కాదమ్మా, ఈ హైదరాబాద్‌ డెవలప్‌మెంటు వల్ల నాకా పేరు వచ్చింది’’ అన్నాడు కామేశం.

‘‘అంటే?’’ అడిగాడు సోమయాజి.

‘‘అయ్యా, ఈ హైదరాబాదు నగరంలో చెట్లు నరికి కాకులకీ, పక్షులకీ చోటులేకుండా కనిపించిన ఖాళీ స్థలాల్లో అంతా ఇళ్ళు కట్టేశారు. దాంతో పాపం కాకులు ఉండటానికి చోటులేక సిటీ వదిలిపెట్టి పల్లెలకి పారిపోయాయి. అందుకే తద్దినాలకి సిటీలో కాకులకి కరువొచ్చింది. ‘కూటికోసం కోటి విద్యలని’ మా అన్నయ్యకి ఓ ఐడియా వచ్చి, ఖాళీగా ఉన్న నాకు- ఓ పంజరం, నాలుగు కాకులు ఇచ్చాడు. దాంతో నా పేరు కాసుల కామేశం కాస్తా కాకి కామేశంగా మారిపోయింది’’ అన్నాడు కామేశం.

‘‘అవునమ్మా, హైదరాబాద్‌లోనే కాదు, అన్ని పట్టణాలలో అద్దెలు వస్తాయని ఇంటి ఓనర్లూ, సెజ్‌ల పేరుతో నాయకులూ, చెట్లు నరికి పెద్దపెద్ద భవనాలూ ప్యాక్టరీలూ కట్టడంతో ఇప్పటికే పట్టణాలన్నీ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయాయి. ఇలా ఇంకొన్నాళ్ళు జరిగితే పట్టణాల్లో ఏ పక్షులూ కనపడవు. అందుకే ఈ కాకి ఏర్పాటు చేశా’’ అన్నాడు కాశీపతి.

‘‘బాగా చెప్పావురా అబ్బీ! చెట్లు లేకపోతే పక్షులు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. వంటింట్లో తినడం, వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కోవడం. దాంతో ఎంగిలి మెతుకులు డ్రైనేజి గొట్టాలలోకి పోయి కాకులకి అవి కూడా కరువైపోయాయి. ఏం ఉందని పక్షులు పట్టణాల్లో ఉంటాయి. పక్షుల్ని చూడాలంటే ఏ జూపార్కుకో, పచ్చదనం చూడాలంటే... పంటపొలాలున్న పల్లెలకో వెళ్ళాలి. మనకా దుస్థితి రాకుండా ఉండాలంటే మనం చెట్లని పెంచాలి. అప్పుడే సకాలంలో వానలుపడి భూమిలో నీటిమట్టాలు పెరుగుతాయి. చెట్లే ప్రగతికీ పురోభివృద్ధికీ మూలాధారాలు. మనం తినే తిండీ, కట్టుకునే బట్టా, నీడనిచ్చే ఇల్లూ అన్నీ చెట్లనుంచే వస్తున్నాయి. మనుషులు లేకపోయినా మొక్కలూ చెట్లూ ఉంటాయి. కానీ, మొక్క లేకపోతే మనిషే కాదు... ఏ ప్రాణికీ మనుగడే లేదు. అందుకే, మనం మొక్కలు నాటుదాం, చెట్లని పెంచుదాం. పర్యావరణాన్నీ పక్షులనీ కాపాడుదాం’’ అంది చారుమతి.

‘‘మీరు చెప్పింది నూటికి రెండు నూర్ల శాతం కరెక్టు’’ అన్నాడు కాశీపతి.

‘‘నీ బొంద, చూడు కాశీపతీ... ఇలా కాకిని పంజరంలో పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు. నువ్వు తద్దినం పెట్టిన ప్రతిచోటా ఓ నాలుగు మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాక నీ పిండం తినడానికైనా కాకులు వస్తాయేమో’’ అంది చారుమతి.

అందరూ నవ్వారు.

కాశీపతి కంట్లో కాకులు తిరిగి అవాక్కయ్యాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.