close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోవిందుడు అందరివాడేలే...

 
నందాల వెన్నముద్దలేమైపోయాయి? ఆత్మీయతల పాలకుండకు చిల్లులెలా పడ్డాయి? దారితప్పిన లేగదూడల్లా, సమూహాల్లోనూ ఒంటరితనాలెందుకు? కాళీయ సర్పం కాటేయడానికొస్తున్నట్టు, బతుకునిండా ఇన్నిన్ని భయాలేమిటి? మధురాధిపతే...అఖిలం విషాదం!
- ఆధునిక జీవితంలోని సర్వ సంక్షోభాలకూ కృష్ణతత్వమే సరైన జవాబు.
అలా అని, ఆ పరిష్కారమేం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కనిపించదు. అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో ‘సేమ్‌ డే డెలివరీ’కి సిద్ధంగా ఉండదు. యశోదమ్మ సువ్వీసువ్వంటూ చల్ల చిలికి వెన్న తీసినట్టు, మనల్ని మనం మట్టికుండల్ని చేసుకుని...శ్రీభాగవతమనే కవ్వంతో అంతర్మథనం చేసుకోవాలి. అంతరంగాన్ని చిలికినకొద్దీ వెన్న, కాచినకొద్దీ మీగడ!

కృష్ణతత్వం ఓపట్టాన ఒంటబట్టదు. అర్థమై కానట్టు ఉంటుంది. పైపైకి ఆ లీలలన్నీ బాల్యచేష్టల్లా అనిపిస్తాయి. అదికాదు, భాగవతాన్ని చూడాల్సిన పద్ధతి. కృష్ణుడిని... యశోదలా ప్రేమించాలి, రాధలా అర్పించుకోవాలి. ద్రౌపదిలా విశ్వసించాలి. గోపబాలకుల్లా స్నేహం చేయాలి. అర్జునుడిలా అహాన్ని వదిలేసుకోవాలి. అప్పుడిక కృష్ణుడు...ఉట్టి కొట్టినా, వెన్న తిన్నా, పాము పడగనెక్కినా...ప్రతీకాత్మకంగానే అనిపిస్తుంది. ప్రతి లీలా ఓ ఉపనిషత్తు వాక్యంలా, గీతా శ్లోకంలా వినిపిస్తుంది. ‘కృష్ణుడిని అర్థం చేసుకోనంత కాలం ఈ శరీరం ఓ చెరసాల. వ్యామోహాలు సంకెళ్లు. కామక్రోధాదులు శత్రువులు’ అంటారు శుక మహర్షి. ఆ బంధనాల్ని తొలగించే తాళం చెవి...కృష్ణతత్వం!

ఆనందతత్వం!
రవివర్మ చిత్రాల నుంచి బాపు బొమ్మల వరకూ, ఉడుపీ క్షేత్రంలోని బాలకృష్ణుడి నుంచి ఇస్కాన్‌ ఆలయంలోని చైతన్య కృష్ణుడి వరకూ...ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా - ఆ సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద తకధిమి తకధిమి నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, రణక్షేత్రంలో భీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!

ఆనందానికి సంకేతమే చిరునవ్వు. మరి, ఆనందంగా ఎప్పుడుంటాం? ‘కష్టనష్టాలు లేనప్పుడే...’ అని బల్లగుద్ది మాత్రం చెప్పలేం. ఎందుకంటే...మనిషన్నాక కష్టం ఉంటుంది, నష్టాలూ వాటిల్లుతుంటాయి. వాటన్నిటినీ మనసులోకి తీసుకోకుండా, జీవితాన్ని ఓ ఆటలా ఆడేసుకుంటే ఏ బాధా ఉండదు. బాల్యలీలల ద్వారా కృష్ణయ్య మనకు బోధించింది ఇదే. కృష్ణతత్వ అంతస్సూత్రం కూడా ఇదే. పాపం పసివాడు, పుట్టీపుట్టకముందే పుట్టెడు కష్టాలొచ్చిపడ్డాయి! కఠినాత్ముడైన కంసమామ అమ్మానాన్నల్ని చెరసాలలో పెట్టాడు. తోబుట్టువుల్ని తెగనరికాడు. బకాసురుడు, శకటాసురుడు, తృణావర్తుడు, పూతనాది రాక్షస గణమంతా కట్టకట్టుకుని వచ్చి మరీ కడతేర్చడానికి సిద్ధపడింది. అయినా కృష్ణుడు బిత్తరపోలేదు, తత్తరపడలేదు. ఆట బొమ్మల్ని పుటుక్కున విరిచేసినట్టు, మహామహా రాక్షసుల్ని కూడా చటుక్కున చంపేశాడు. ఇదంతా ఓ జగన్నాటకమన్న ఎరుక ఉంటే...ఎదుటి మనుషుల స్వార్థ స్వభావాలూ, అహంకార ప్రసంగాలూ తోలుబొమ్మలాటలా నవ్వుపుట్టిస్తాయి. ఎవర్నీ ద్వేషించం. మహా అయితే ప్రేమిస్తాం.

మనలోని ఆనందం, మన చుట్టూ ఉన్న మనుషులకూ విస్తరిస్తుంది. పరిసర ప్రకృతిలోనూ ప్రతిధ్వనిస్తుంది. కాబట్టే, ఆనంద స్వరూపుడికి జన్మనిస్తున్న సమయంలో దేవకి ప్రసవ వేదనను భరించలేదు, ప్రసవానందాన్ని పొందింది. సువ్వీసువ్వీ సువ్వాలమ్మా...నవ్వుతు దేవకి నందను గనియె - అంటాడు సంకీర్తనాచార్యుడు. శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి నాటికి ప్రకృతి మొత్తం పరమ ప్రశాంతంగా మారిపోయింది. రేపల్లెలోని ఆవులు పలుపుతాడు తెంచుకుని వచ్చి మరీ వీధుల్లో నాట్యం చేశాయి. ఆనంద కృష్ణుడు మనతో ఉన్నాడన్న భావన చాలు. ఇక బాధలుండవూ కష్టాలుండవూ. ఉన్నా అవి బాధల్లా కష్టాల్లా అనిపించవు. కృష్‌...ణ - అన్న రెండక్షరాల్లో సత్‌, చిత్‌ ఆనందాలు రెండూ దాగున్నాయంటారు విజ్ఞులు. కృష్ణుడిని పురాణాలు సచ్చిదానంద స్వరూపుడని కొనియాడాయి.

వసుదేవుడు చిమ్మచీకట్లో యమునను దాటొచ్చాడు. నందుడి ఇల్లాలి పక్కన పండంటి పసిబిడ్డను పడుకోబెట్టి మళ్లీ చెరసాలకు వెళ్లిపోయాడు. అంతలోనే తెల్లారిపోయింది. కృష్ణోదయ వార్త పల్లెకంతా పాకిపోయింది. పూల సజ్జెలతో, పండ్ల బుట్టలతో రేపల్లె వాసులంతా నందుడి ఇంటికి బయల్దేరారు. అమ్మ యశోదమ్మ ఆనందానికి హద్దేం ఉంటుంది. జగదేకపతిని తన కన్నబిడ్డే అనుకుంది. గంగాజనకుడికి లాలపోసి మురిసిపోయింది. పాలకడలిలో పవళించేవాడికి పాలబువ్వ తినిపించి పరమానందాన్ని అనుభవించింది. శేషతల్పశాయి ఆడుకోడానికెళ్తుంటే ‘పాములుంటాయ్‌ కన్నా!’ అంటూ సకల జాగ్రత్తలూ చెప్పింది. మహామహారాక్షసుల్ని సంహరించినవాడిని ‘అదిగో బూచి!’ అని భయపెట్టింది. నిరంతర నిర్నిద్రుడికి ‘జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణా’ అంటూ జోలపాడింది.

ఆనందతత్వమే కొలువైన చోట ఆనందానికి కొదవేం ఉంటుంది? నందవ్రజం ఆనంద వ్రజమైంది. ఆనందం ఉందంటే సకల ఐశ్వర్యాలూ, సర్వ సుఖాలూ ఉన్నట్టే. పశువులు సమృద్ధిగా పాలిస్తున్నాయి. గోపికలు కృష్ణ లీలలే తలుచుకుంటూ, కృష్ణగీతాలే పాడుకుంటూ ఉత్సాహంగా వెన్న తీస్తున్నారు. మధురానగరికి వెళ్లి పాలూపెరుగూ అమ్ముకుని వస్తున్నారు. చేతినిండా వరహాలు ఆడుతున్నాయి. ఇళ్లలో శుభకార్యాలు జరుగుతున్నాయి. మనసులు మహా ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇన్ని మార్పులకూ మూలం...ఆనందమే, కృష్ణానందమే! అందుకే, సుధామాది భక్తులు...చిన్నికృష్ణుడిని చేరి కొలుస్తున్నప్పుడు, మణులో మాణిక్యాలో అడగలేదు. కృష్ణపాద కమలసేవను కోరుకున్నారు, కృష్ణప్రియులతో నేస్తాన్నీ, కృష్ణతత్వమైన భూతదయనూ దయచేయమన్నారు. ఈ మూడూ ఆనంద సోపానాలే. అహంకారి దుర్యోధనుడు మాత్రం పరమాత్మ కంటే పదివేల సైన్యమే ఎక్కువని భ్రమపడ్డాడు, చివరికి భంగపడ్డాడు. ‘నువ్వుంటే చాలు బావా!’ అంటూ కృష్ణుడి సాన్నిధ్యాన్ని కోరుకున్న అర్జునుడికి...యోగేశ్వరుడి సారధ్యంతో పాటూ విజయమూ వైభోగమూ మహదానందమూ దక్కాయి.

ప్రేమతత్వం!
ఓ ఉప్పు బొమ్మకు సముద్రం లోతులు చూడాలన్న కోరిక కలిగింది. ఆత్రుత కొద్దీ దూకేసింది. నీళ్లలోకి వెళ్లగానే తానెవరో మరచిపోయింది. తనెందుకొచ్చిందీ మరచిపోయింది. కరిగి కరిగి సముద్రంలో భాగమైపోయింది. కృష్ణ ప్రేమా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకు తారసపడినా.... చివరికంతా కృష్ణప్రేమాంబుధిలో కలసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ...అన్న మాటకు ఆకర్షించేవాడన్న అర్థమూ ఉంది. గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. మహర్షులు తపస్సుతో దగ్గరయ్యారు. కంసాది రాక్షసులు శతృత్వంతో దగ్గరయ్యారు. పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరిదారులు వారివే. గమ్యం మాత్రం ఒకటే - కృష్ణుడే.

పూతన రాక్షసి చిన్ని కృష్ణుడిని చంపడానికొచ్చింది. కంసుడే ఆ ఆడబూచిని పంపాడు. రవిక ఒదులు చేసుకుని, ‘రారా కృష్ణా!’ అని పిలవగానే బిరబిరా వెళ్లాడా బిడ్డడు. ‘పాలకుండలనుకుని ఆబగా జుర్రుకుంటున్నాడు. కాలకూట భాండాలని తెలియదు కాబోలు’ అనుకుంది పూతన. దేవతలకే అమృతాన్ని పంచి ఇచ్చినవాడికి, పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? నవ్వుకుని ఉంటాడు! ఎంత రాకాసి అయినా అమ్మే కదా! చనుబాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది. చాల్చాలు. ఆ కాస్త ప్రేమ చాలు. మహామహా యోగీంద్రులు యజ్ఞయాగాలు చేసి ‘కృష్ణార్పణం’ అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమైపోయింది. కృష్ణప్రేమలోని గొప్పదనమే అది. పూతన ఒంట్లోని విషాన్నంతా సర్రున జుర్రుకున్నాడు. రాక్షసి అంటేనే నిలువెల్లా పాషాణం. కృష్ణయ్య చేదునంతా మింగేశాక...పూతనతోపాటే పూతనలోని రాక్షసత్వమూ చచ్చిపోయింది. శవాన్ని వూరవతల తగులబెడుతుంటే, అద్భుత పరిమళాలు! కృష్ణ ప్రేమ తాలూకు సువాసనలవి.

మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి. పద్నాలుగేళ్ల పసివాడు...అన్న బలరాముడితో కలసి కంసమామ చేపట్టిన ధనుర్యాగానికి బయల్దేరాడు. రథం దిగి వీధుల్లో నడుస్తుంటే, మధురానగరమంతా ‘అధరం మధురం, వదనం మధురం...’ అంటూ కృష్ణ సౌందర్యాన్ని కీర్తించింది. ఓ నిరుపేద నేత కళాకారుడిచ్చిన బట్టల్ని ప్రేమగా అందుకున్నాడు. తానే వెళ్లి మాలలు కట్టుకుని బతికే సుధాముడి తలుపుతట్టాడు. కుబ్జ పూసిన మంచిగంధాలకు మురిసిపోయాడు. భక్తి, ముక్తి, అనురక్తి...ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చాడు. ఎవర్నుంచి అందుకోవాల్సిన ప్రేమను వాళ్ల నుంచి అందుకున్నాడు.

పరమ రాక్షసుడైన కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణప్రేమలో పడిపోయాడు. కృష్ణుడు మధురలో కాలుపెట్టాడని తెలిసిన మరుక్షణమే..భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు, కృష్ణుడొస్తున్నట్టు అనిపించేది. పూల సువాసనలు నాసికాన్ని తాకగానే...వైజయంతీమాల పరిమళమేమో అన్న భ్రమ కలిగేది. ఎవర్ని ఎవరు పిలిచినా, ‘కృష్ణా’ అన్నట్టు చెవినపడేంత చిత్త చాంచల్యం. బాలకృష్ణుడు రానేవచ్చాడు. ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దుతుంటే, ‘చంపొద్దు కృష్ణా..వదిలిపెట్టు కృష్ణా...’ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవర పాటులో అయితేనేం, తలుచుకున్నాడు కదా! ఆ కాస్త స్మరణకే పొంగిపోయి, మేనమామకు ముక్తినిచ్చేశాడు కృష్ణస్వామి.

ఓసారి బ్రహ్మదేవుడికి కృష్ణుడిని పరీక్షించాలన్న బుద్ధిపుట్టింది. కృష్ణుడి చుట్టూ ఉన్న గోవుల్నీ గోపబాలకుల్నీ మాయం చేసేశాడు. కృష్ణుడు మనిషిగా జన్మించాడు కదా, మనిషిలానే ప్రవర్తిస్తాడని అనుకున్నాడు. ‘నా గోవులు...నా గోపకులు’ అని గగ్గోలు పెడతాడని భావించాడు. ఆ ఏడుపును ఎనిమిది కళ్లతో చూడాలన్నది బ్రహ్మ ఉబలాటం. ఆయన అనుకున్నట్టేం జరగలేదు. తానొక్కడే... రేపల్లెలోని ప్రతి ఇంటా గోపాలకుల్లా, గోవుల్లా, లేగదూడల్లా కనిపించి...కనికట్టు చేశాడు. బ్రహ్మయ్యకు దిమ్మదిరిగిపోయింది. ‘పొట్టలోని పసిబిడ్డ కాళ్లతో తన్నేస్తున్నప్పుడు అమ్మ ఎంత మురిపెంగా క్షమించేస్తుందో, అలా నన్నూ మన్నించు తండ్రీ!’ అంటూ కాళ్ల మీద పడ్డాడు బ్రహ్మదేవుడు. ‘ఛీఛీ..మనమధ్య క్షమాపణలేమిటి?’ అని ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు కృష్ణబాబు.

ఎవరు ఏ ఆలోచనతో దగ్గరవుతున్నారన్నది కృష్ణుడు పట్టించుకోడు. ఎదుటి మనుషుల్లోని లోపాలూ పాపాలూ అస్సలు గుర్తుంచుకోడు. తెలిసి ప్రేమించినా తెలియక ప్రేమించినా అది ప్రేమేనంటాడు. జీవితకాలం ప్రేమించినా క్షణకాలం ప్రేమించినా...అదీ ప్రేమేనని తేల్చి చెబుతాడు. నిజమే, తాను ముట్టుకుంది పరుసవేదిననే విషయం ఇనుప ముక్కకు తెలియాల్సిన పనేముంది! అంతటి అనురాగాన్ని సొంతం చేసుకుంటే...లోపాలూ అహాలూ స్వార్థాలతో సహా ఎదుటివారిని యథాతథంగా ప్రేమించగలిగితే - శుత్రువులుండరు, ద్వేషాలుండవు. అంతా ప్రేమమయమే, అంతా కృష్ణమయమే!

స్నేహతత్వం...
స్నేహితుడంటే కృష్ణయ్యే! ఒక్కసారి కృష్ణ మిత్రమండలిలో చోటు సంపాదిస్తే జన్మ ధన్యమైనట్టే. కన్నయ్య కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎప్పట్లానే ఓరోజు గోపాల బాలకులు మందల్ని మేపడానికి అడవులకెళ్లారు. ఓ మడుగులో భయంకర విషసర్పం నోరు తెరుచుకుని కనిపించింది. అదేం చిత్రమో, ఆ పిల్లలకు పాము నోట్లోకి వెళ్లాలన్న కోరిక పుట్టింది. తమకేమీ కాదన్న ధైర్యం. కృష్ణుడున్నాడన్న అభయం. పరుగుపరుగున వెళ్లి పడగలో తలపెట్టారు. అక్కడున్నది సర్పరూపంలోని అఘాసురుడని కృష్ణయ్యకు అర్థమైపోయింది. అయినా సరే, గోపాలకుల్ని కాపాడటం స్నేహ ధర్మమని భావించాడు. తనూ వెళ్లి పాము నోట్లో తలపెట్టాడు. లోపలికి వెళ్లగానే...ఇంతింతై ఆ సర్పాసురుడిని చీల్చేసి బయటికొచ్చాడు. స్నేహంలోని భరోసా ఎంత బలమైందో కృష్ణుడిలా చాటి చెప్పాడు. ఆ గొల్ల పిల్లలు కృష్ణుడిని చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేకపోయేవారు. అడవిలో చద్దులు తింటున్నప్పుడు కూడా గుండ్రంగానే కూర్చునేవారు. వృత్తాకారంలో కూర్చుంటేనే కదా కృష్ణుడు అందరికీ కనబడేది. మిత్రుడి ఎడబాటును ఆ కాసేపు కూడా భరించలేని, బలమైన అనుబంధమది.

జతగాడైన కుచేలుడిని ఆదుకున్న తీరూ అద్భుతమే! మొహమాట పడుతూ వచ్చిన నేస్తాన్ని నేరుగా తన సౌధానికి తీసుకెళ్లాడు. అడిగిమరీ అటుకుల మూట తీసుకున్నాడు. అడక్కపోయినా సకల సౌభాగ్యాలూ ప్రసాదించాడు. కృష్ణుడి దైవత్వం పూర్తిగా తెలియని రోజుల్లో అర్జునుడు, స్నేహితుడన్న చొరవతో ‘వెన్నదొంగా!’, ‘గొల్ల గోపాలా!’ అని ఆటపట్టించేవాడు. ఆతర్వాత, అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో ‘నీ తేరు తోలేవాడిని. అంత పెద్ద మాటలెందుకులే బావా!’ అంటూ పెద్ద మనసుతో మన్నించాడు. కృష్ణుడిలాంటి నేస్తం ఒక్కడున్నా చాలు...కష్టాల పాము నోట్లో సుఖంగా తల పెట్టవచ్చు. పేదరికాన్ని కూడా ఐశ్వర్యంలా అనుభవించవచ్చు. జీవన కురుక్షేత్రంలో పార్థుడిలా పోరాడవచ్చు. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్నవారి ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ను కృష్ణయ్య తప్పక ఆమోదిస్తాడు.

 

ప్రకృతి తత్వం!
వాసనాత్‌ సర్వభూతానాం వసుత్వాత్‌ దేవయోనితః ... సమస్త ప్రాణుల్లోనూ నివాసం ఉండడం వల్లా, దేవతలు ఆయనలో కొలువుదీరడం వల్లా - వాసుదేవ అన్న పేరొచ్చిందని వ్యాసభారతం చెబుతోంది. మనిషి కోసం అవతరించిన దేవతలు చాలామందే ఉండవచ్చు. కానీ, కృష్ణుడు ప్రకృతి కోసమూ పుట్టాడు. ఆ మమకారం కొద్దే వైకుంఠాన్ని వదిలిపెట్టి పచ్చని పల్లెకు విచ్చేశాడు. రేపల్లె పౌరసత్వం పుచ్చుకున్నాడు. ఆవుల్ని కాచాడు, లేగలతో ఆడుకున్నాడు. కొండలెక్కాడు, గుట్టలెక్కాడు. ఆ వెన్నదొంగ మన్నుదొంగ కూడా! మట్టిని పరమాన్నంలా తినేస్తూ యశోదమ్మకు దొరికిపోయాడు. ‘అమ్మా మన్నుదినంగనే శిశువునో ఆకొంటినో’ అంటూ బుకాయించే ప్రయత్నమొకటి. అమ్మకు తెలియవా ఆ దొంగాటలు. నోరుతెరవమంది. ఆ...అనగానే అనంత ప్రకృతి!

ఓసారి కాళింది మడుగులోని నీళ్లు తాగి గోవులు చనిపోయాయి. కాళీయుడనే సర్పం ఆ జలాల్ని విషపూరితం చేసింది. ‘నీళ్లంటే అమృతమే. పశువుల పొట్టలు నిండుతాయి. మనుషుల దప్పిక తీరుతుంది. చేపలూ కప్పలూ మడుగునే ఆశ్రయించి బతుకుతాయి. జలాన్ని కలుషితం చేయడం అంటే పంచమహా పాతకాలకు పాల్పడినట్టే’ అంటాడు కృష్ణుడు. తనే, మడుగులోకి దూకి...శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. వాసుకితో పాలసముద్రాన్ని మధించినట్టు కాళిందిని చిలికేశాడు. కాలుష్యపు జాడే లేకుండా శుభ్రం చేసేశాడు. పన్లోపనిగా కాళీయుడి అహాన్ని అణిచేశాడు. కృష్ణుడికి చెట్టూచేమలన్నా మనిషంత ఇష్టం. ఓసారి యశోదమ్మ బిడ్డ కాలు కదపకుండా రోకలికి కట్టేసింది. అల్లరి కృష్ణుడు గమ్మునుంటాడా, ఏకంగా రోటినే లాక్కుంటూ వెళ్లి తరాలనాటి మద్దిచెట్లకు మోక్షమిచ్చాడు. వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్నని గీతలో ప్రకటించాడు కూడా. కొండలంటే కూడా కొండంత ప్రేమ. పల్లె జనమంతా ఇంద్రుడికి పూజలు చేసి నైవేద్యాలు పెడతామంటే, కృష్ణుడు వద్దేవద్దన్నాడు. ‘ఎక్కడో ఉన్న ఇంద్రుడికెందుకు? మన కోసమే, మన పల్లె పక్కనే వెలసిన గోవర్ధనగిరికి పూజలు చేద్దాం పదండి! ఆ కొండ...గోవులకు గడ్డి ఇస్తుంది. పక్ష్యాదులకు నీడనిస్తుంది. మనకు పండ్లూ పూలూ ఇస్తుంది. ప్రాణాలు నిలిపే ఓషధుల్ని అందిస్తుంది. ఇంతకు మించిన వేలుపు ఇంకెక్కడ దొరుకుతుంది?’ - అని చెప్పాడు. ఎదురేముంది, అంతా బయల్దేరారు. పూజలు చేశారు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. కుంభవృష్టి కురిపించాడు. కృష్ణుడికి ఆ మాయలు తెలియవా? వేలితో కొండనెత్తి రేపల్లె జనానికంతా నీడనిచ్చాడు. అంతలోనే ఇంద్రుడు తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు. గోవులకూ గోపాలకులకూ గోపికలకూ అధిపతిగా కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం జరిపించాడు. మేని ఛాయ, మెడలోని చెంగల్వపూదండ, తలమీది పింఛం, మొలతాడుకు కట్టుకున్న కొమ్ముబూర... అన్నీ ప్రకృతి ప్రేమకు చిహ్నాలే. కృష్ణుడిని ప్రేమించడమంటే ప్రకృతినీ ప్రేమించడమే. కాదంటే, కన్నయ్య మెచ్చడు.

నాయకత్వం...
భాగవత బాలుడు...అమాయకుడు, సున్నిత స్వభావుడు, గోపీజనవల్లభుడు. అదే కృష్ణుడు మహాభారత ఘట్టానికి వచ్చేసరికి...రాజకీయవేత్త, మేధావి, వ్యూహకర్త, దార్శనికుడు. కృష్ణుడేం చక్రవర్తి కాదు. ఓ చిన్న రాజ్యానికి నాయకుడు. అయితేనేం, మహామహా చక్రవర్తులు సైతం కృష్ణుడికి పాదాభివందనాలు చేసేవారు. ఆ గౌరవం అధికారంతో సొంతం కాలేదు, మేధస్సుతో వచ్చింది. ఎక్కడ నెగ్గాలన్నదే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా అతడికి తెలుసు. కాలయవనుడనే రాక్షసుడు అక్షౌహిణుల కొద్దీ సైన్యంతో యుద్ధానికొచ్చినా...కృష్ణుడు నిరాయుధుడై ఎదురు నిలబడ్డాడు. యవనుడు తరుముకొస్తుంటే...పరిగెత్తుకెళ్లాడు. కొండలు దాటి, కోనలు దాటి పాడుబడిన గుహలోకెళ్లాడు. ‘పిరికి కృష్ణుడు...’ అని ఎగతాళి చేసుకుంటూ గుహలో కాలుపెట్టాడా రాక్షసుడు. చిమ్మచీకట్లో...గాఢనిద్రలో ఉన్న వృద్ధుడిని చూసి కృష్ణుడేనని భ్రమించాడు. తట్టిలేపి ఆ తాపసి ఆగ్రహానికి గురై...బూడిదైపోయాడు. ఆ నేత్రాగ్ని ముచికుంద మహర్షిది. అదీ కృష్ణుడి వ్యూహరచనా నైపుణ్యం.

కృష్ణుడు మంచిని కోరుకున్నాడు. మంచివైపు నిలబడ్డాడు. పాండవ పక్షపాత అంతరార్థమూ అదే! పాండురాజు మరణం తర్వాత....ధృతరాష్టుడి కొలువులో వివక్షకు గురవుతున్న మేనత్త పిల్లలకు ఉద్ధవుడి ద్వారా ‘నేనున్నా...’ అని సందేశం పంపాడు. అప్పటి నుంచి మహాప్రస్థానం దాకా - పాండవులకు కృష్ణుడే బంధువూ సఖుడూ గురువూ...సర్వస్వమూ! అంతిమంగా ధర్మం గెలవాలంటే, ముందు నుంచీ ధర్మబద్ధుల్ని కాపాడుకోవాలి. అందుకే, ‘అన్నా...’ అని పిలవగానే, పరుగుపరుగున వెళ్లి ద్రౌపదికి వస్త్రాలిచ్చాడు. ‘బావా...యుద్ధం చేయలేను’ అని అర్జునుడు విల్లంబులు జారవిడవగానే కర్తవ్యోపదేశం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామం దాకా శిశుపాలుడూ జరాసంధుడూ బతికుంటే...పాండవుల విజయావకాశాలు దెబ్బతింటాయని ముందే వూహించి ఆ ఇద్దరి అడ్డూ తొలగించాడు. దీని ద్వారా కౌరవులకూ ఓ పరోక్ష సంకేతం పంపాడు. కర్ణుడి బలాన్ని పరిమితం చేసి అర్జునుడిని శక్తిమంతుడిని చేశాడు. దుర్యోధనుడి బలహీనతను చేరవేసి భీముడికి మనోబలాన్నిచ్చాడు. భీష్ముడిని నిరోధించడానికి శిఖండిని రంగంలోకి దించాడు. ద్రోణుడిని నిలువరించడానికి ధర్మరాజుకో ధర్మ సూక్ష్మం బోధించాడు. అంతిమంగా పాండవులు గెలిచారు. ధర్మసంస్థాపన జరిగింది. కృష్ణుడి లక్ష్యం నెరవేరింది. మానవజాతికి ఓ మహత్తర సందేశం అందింది -
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే!
అప్పుడే, ఓ యుగం గడిచిపోయింది.
మళ్లీ, ఎప్పుడు పుడతావు కృష్ణా!

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు
ల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై 
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే!
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార నాకు దయసేయగదే
యమ్మ నీకుమారుడు
మా యిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ
చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములం
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కెనతండు లీల దల్లి చేతన్‌ రోలన్‌
నీవే తల్లివి దండ్రివి 
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!

మ్మా మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెర్రినో
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్‌ నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్‌ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము చేసి నా వచనముల్‌ దప్పైన దండింపవే


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.