close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న దారిలో నడవం..!

నాన్న దారిలో నడవం..!

వాళ్లంతా దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అయినా చాలామంది వారసుల్లా కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకొని సంపదను రెట్టింపు చేయాలనుకోలేదు. తమ తండ్రులకు సంబంధంలేని కొత్త రంగాల్లోకి వెళ్లి తమను తాము నిరూపించుకోవాలని కలలు కన్నారు. వాటిని నిజం చేసుకున్నారు కూడా...

హైక్‌ సీయీవోగానే...

దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిట్టల్‌. 20దేశాలకు పైగా విస్తరించిన ఆ సామ్రాజ్యానికి కాబోయే అధినేత ఆయన తనయుడు కవిన్‌ మిట్టలే అనుకున్నారంతా. కానీ కవిన్‌ మొదట్నుంచీ సొంతంగా పేరుతెచ్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు. దానికి తగ్గట్లే యాప్‌ స్పార్క్స్‌ అనే సంస్థను నెలకొల్పి వివిధ రకాల మొబైల్‌ యాప్స్‌ తయారు చేయడం మొదలుపెట్టాడు. అవేవీ సంతృప్తినివ్వక పోవడంతో చివరికి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ తయారీ పైన దృష్టిపెట్టాడు. దాని ఫలితమే ‘హైక్‌ మెసెంజర్‌’. వాట్సాప్‌ తరవాత పదికోట్ల మందికి పైగా వినియోగదారులతో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న హైక్‌, ప్రపంచంలోని మేటి మెసెంజర్‌ యాప్స్‌లో ఒకటి. మిట్టల్‌ తనయుడిగా కంటే హైక్‌ సీయీవోగానే కవిన్‌కు ఎక్కువ పేరుంది.


కళాకారులకు ఆసరాగా

న్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు సంస్థలో ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉన్నా, ఆమె ఆసక్తి చూపించలేదు. మొదట్లో సిడీరియన్‌ అనే ఓ అంతర్జాతీయ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలో పనిచేసిన అక్షత తరవాత సొంతంగా ఫ్యాషన్‌ బిజినెస్‌ను మొదలుపెట్టింది. దాని ద్వారా భారతీయ గ్రామీణ హస్త కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఆమె ఉద్దేశం. అందులో భాగంగా తన సంస్థ రూపొందించిన డిజైన్లకు తగ్గట్లుగా వస్త్రాలూ, యాక్సెసరీలను గ్రామీణ కళాకారులతో తయారు చేయించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేస్తోంది. ‘మన కళాకారుల నైపుణ్యానికీ, ఆ కళలకూ ప్రాచుర్యం కల్పించాలన్నదే నా సంస్థ ఉద్దేశం’ అంటుంది అక్షత.


నాన్న ముద్ర లేకుండా!

న్‌ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వీది దేశంలోని సంపన్నుల జాబితాలో రెండో స్థానం. ఆయన కొడుకు ఆలోక్‌ సంఘ్వీ తండ్రి కోరిక మేరకు మొదట ఫార్మా కంపెనీలోనే ఉద్యోగిగా చేరాడు. కానీ విదేశాల్లో చదువుకునే రోజుల్లోనే అతడు సౌర విద్యుత్‌ వ్యాపారంపైన మనసు పారేసుకున్నాడు. అందుకే ‘పీవీ పవర్‌ టెక్‌’ పేరుతో మరో స్నేహితుడితో కలిసి సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్లను తయారు చేసే కంపెనీ నెలకొల్పాడు. ఆసియాతో పాటు ఐరోపా, ఆఫ్రికాల్లోని అనేక దేశాల్లో గృహావసరాలతో పాటు భారీ ప్రాజెక్టులకూ ఆ సంస్థ సోలార్‌ ప్యానెళ్లు సమకూరుస్తూ ముందుకెళ్తొంది.


‘స్వతంత్ర’ మార్గంలో...

నాలుగు తరాల వ్యాపార చరిత్ర ఉన్న బిర్లా సామ్రాజ్యానికి ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా. ఆయన కుమార్తె అనన్య మాత్రం తండ్రి నడిచిన దారిలో వెళ్లాలనుకోలేదు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునేప్పుడే భారత్‌లో అట్టడుగు వర్గ మహిళల అభివృద్ధి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న అనన్య, స్వదేశానికి రాగానే ఆ పనిలోనే నిమగ్నమైంది. ‘స్వతంత్ర మైక్రోఫైనాన్స్‌’ అనే సంస్థను నెలకొల్పి గ్రామీణ మహిళలకు రుణాలిచ్చి వాళ్ల చిరు వ్యాపారాలను ప్రోత్సహించడం, కొత్త వ్యాపారాల్లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా లక్షా పాతికవేల మందికి రూ.108కోట్లకు పైగా రుణాలందించిన సంస్థకు ఎగవేతదార్లు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.


ముఖేష్‌ మాటల వల్లే...

 
ఫార్మా దిగ్గజం అజయ్‌ పిరమల్‌ తనయుడు ఆనంద్‌ కొన్నేళ్ల క్రితం చదువు పూర్తిచేసుకుని భారత్‌కి వచ్చేప్పటికి తండ్రి పిరమల్‌ గ్రూప్‌లో కొంత భాగాన్ని ఓ విదేశీ కంపెనీకి అమ్మేశాడు. అప్పుడు ఆనంద్‌కి మూడు దార్లు కనిపించాయి. ఒకటి... ఉన్న ఆస్తిని అనుభవించడం. రెండు... తండ్రితో కలిసి పిరమల్‌ గ్రూప్‌ అభివృద్ధికి పనిచేయడం. మూడు... సొంతంగా కెరీర్‌ మొదలుపెట్టడం. ఆనంద్‌ మూడో దానికే ఓటేశాడు. మొదట గ్రామీణ వైద్య సేవలూ, టెలీ మెడిసిన్‌కు సంబంధించిన వ్యాపారం మొదలుపెట్టాడు. తరవాత ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థను నెలకొల్పి విదేశీ పెట్టుబడిదార్లనూ ఆకర్షిస్తూ దూసుకెళ్తున్నాడు. ‘సొంతంగా వ్యాపారం చేయడమంటే క్రికెట్‌ ఆడటం లాంటిది. తండ్రులు ఎలా సంపాదిస్తున్నారో చూస్తూ కూర్చొని బండి నడిపేయడం క్రికెట్‌ కామెంటరీ చేయడం లాంటిది. ఆడేవాడి నొప్పి కామెంటేటర్‌కి తెలీదు’ అని ముఖేష్‌ అంబానీ ఓసారి నాతో అన్నారు. ఆ మాటలే నా సొంత ప్రయాణానికి స్ఫూర్తి’ అంటాడు ఆనంద్‌.


  ‘స్వచ్ఛ’ చిత్రానికి పది లక్షలు!

లఘు చిత్రాలు ఈ మధ్య చాలా పెద్ద ట్రెండ్‌నే సృష్టిస్తున్నాయి. సూటిగా సుత్తిలేకుండా సృజనాత్మకతతో వీటిని తీస్తున్నారు దర్శకులు. గంటల నిడివిలో చెప్పే విషయాన్ని కొన్ని నిమిషాల్లోనే ఆకట్టుకునేలా చెప్పడం షార్ట్‌ ఫిల్మ్స్‌ ప్రత్యేకత. ఈ విషయాన్ని గమనించిన మోదీ ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమం కథాంశంతో లఘు చిత్రాల పోటీ పెట్టి లక్షల రూపాయల్ని బహుమతిగా ప్రకటించింది!


‘లైట్స్‌ కెమెరా యాక్షన్‌... నేను కాదు ఈ సినిమా తీస్తున్నది, మీరే! అవును, స్వచ్ఛ భారత్‌పైన సందేశాత్మకంగా ఉండే ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీయండి! డిజిటల్‌, మొబైల్‌... ఏ కెమెరాతో అయినా ఫర్వాలేదు. మీరు తీసిన ఆ ఫిల్మ్‌ చూశాక దేశమంతా స్వచ్ఛతవైపు కదలాలి. అంతేకాదు, మీ సినిమాల్లో నటించడానికి అవకాశమివ్వమని నాలాంటి నటులు మిమ్మల్ని బతిమాలాలి. మరెందుకు ఆలస్యం, కథ ఆలోచించండి’... ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు స్వచ్ఛ భారత్‌ ప్రచారకర్తగా ఉన్న అమితాబ్‌ బచ్చన్‌. స్వచ్ఛ భారత్‌... కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కీలకమైన కార్యక్రమాల్లో ఒకటి. 2014 అక్టోబరు 2న ప్రారంభించినప్పట్నుంచి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా నడుస్తోంది. ఆ ఉద్యమ స్ఫూర్తి ప్రతి గడపకీ, ప్రతి వ్యక్తికీ చేరేలా ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్వచ్ఛ భారత్‌ మొబైల్‌ ఆప్‌ని తీసుకొచ్చింది. ప్రత్యేక వెబ్‌సైట్‌నీ ప్రారంభించింది. వీటికితోడు స్వచ్ఛ భారత్‌ ప్రచారకర్తల్నీ నియమించింది. ఈ కార్యక్రమాన్ని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో తాజాగా ‘స్వచ్ఛ భారత్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ పేరుతో లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ పోటీని ‘నేషనల్‌ ఫిల్మ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (nfdcindia.com) ఆధ్వర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అక్టోబరు రెండో తేదీన దిల్లీలోని సిరి ఫోర్ట్‌ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

3 నిమిషాలు... 10 లక్షలు
స్వచ్ఛ భారత్‌ పోటీకి పంపే లఘు చిత్రాల నిడివి మూడు నిమిషాలకు మించి ఉండకూడదు. వీటిని హెచ్‌డీ ఫార్మాట్‌లోనే తీయాలి. పోటీలో పాల్గొనే వ్యక్తులకు ఎలాంటి నియమ నిబంధనలూ లేవు. చిత్రాల్ని పంపేందుకు ఎలాంటి రుసుమూ లేదు. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో లేదంటే భారతీయ అధికార భాషలుగా గుర్తించిన ఏ భాషలోనైనా చిత్రీకరించవచ్చు. ఇతర భాషల్లో తీసేవాటికి ఇంగ్లిష్‌లో సబ్‌టైటిల్స్‌ ఉండాలి. పోటీకి పంపే చిత్రాన్ని 2015 అక్టోబరు 1తర్వాతే చిత్రీకరించి ఉండాలి. లఘు చిత్రాలను ఆన్‌లైన్లో (sbsff@nfdcindia.comకు) పంపడంతోపాటు డీవీడీ లేదా యూఎస్‌బీ డ్రైవ్‌ రూపంలో నిర్వాహక సంస్థకు పోస్టు చేయాలి. సెప్టెంబరు 10లోగా వీటిని పంపించాలి. పిల్లల్ని స్వచ్ఛ భారత్‌లో భాగం చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. కాబట్టి వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అన్ని వయసులవారినీ ఉద్దేశించి ఉండేలా చిత్రాన్ని తీయాలి. బాగున్నాయనుకుంటే ఈ చిత్రాలను స్వచ్ఛ భారత్‌ ప్రచారం కోసం ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. పోటీకి వచ్చిన చిత్రాలకు ఉత్తమ, ద్వితీయ, తృతీయ విభాగాల్లో మొత్తం పది బహుమతులు ఇస్తారు. ఉత్తమ చిత్రానికి రూ.10 లక్షల నగదు బహుమతి ఉంటుంది. ద్వితీయ చిత్రాలుగా మూడింటిని ఎంపిక చేస్తారు. ఈ విభాగంలో ఎంపికైన ఒక్కో చిత్రానికి రూ.5లక్షలు నగదు బహుమతి ఉంటుంది. తృతీయ విభాగంలో ఆరు చిత్రాలను ఎంపిక చేస్తారు. ఈ విభాగంలో ఎంపికైన చిత్రాల్లో ఒక్కో దానికి రూ.2లక్షల నగదు బహుమతి ఉంటుంది.

ఈ చిత్రం చూశారా!
మూడు నిమిషాల్లో దేశాన్ని కదిలించగలిగే లఘు చిత్రమా! అని నిరుత్సాహపడొద్దు... ఇటీవల ‘డోంట్‌ లెట్‌ హర్‌ గో’ పేరుతో స్వచ్ఛ భారత్‌ నేపథ్యంతో ఒక లఘు చిత్రం వచ్చింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన ఈ లఘు చిత్రం నిడివి ఎంతో తెలుసా? ఒకటిన్నర నిమిషాల లోపే. కానీ సోషల్‌ మీడియాలో ఈ చిత్రం ఎన్నో ప్రశంసల్ని అందుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో పదిలక్షలకుపైగా వీక్షణల్ని పొందిందీ చిత్రం. స్వచ్ఛత, శుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి ఉంటుందన్నది ఈ లఘు చిత్ర కథాంశం. సామాజిక స్పృహ ఉండే లఘు చిత్రాలను తీసే అనీల్‌ మురార్క ఈ సినిమాని తీశాడు. పండగ పూట మన ఇంటినీ, ఇంట్లోని వస్తువుల్నీ ఎంత బాగా శుభ్రం చేసుకుంటామో, మన పరిసరాల్నీ అంతే శుభ్రంగా చేయాలి లేకుంటే లక్ష్మీదేవి మన దగ్గర నుంచి వెళ్లిపోతుందని ఈ చిత్రంలో చక్కగా చూపించారు. దీన్లో లక్ష్మీదేవిగా కంగనా నటించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ‘కాలా ఘోడా’ సంస్థ ‘స్వచ్ఛ భారత్‌’ నేపథ్యంలో 2015లో లఘు చిత్రాల పోటీ పెట్టింది కూడా! అంటే ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లింది. దాన్ని మరింత లోతుగా తీసుకువెళ్లాలి. మరెందుకు ఆలస్యం... కథ రాయండి, కెమెరా పట్టండి, ప్రధానితో శభాష్‌ అనిపించుకోండి!  తొక్కే వాడిదే రిక్షా!

16 సంవత్సరాల పాటు ఒకే రిక్షాకు రోజూ అద్దె కడుతూ... కేవలం ఆరున్నర వేల రూపాయల విలువ చేసే ఆ రిక్షాను సొంతం చేసుకోలేక పోయిన ఓ రిక్షా తొక్కేవ్యక్తి జీవితం ఆయన్ను కదిలించింది. ఇలాంటి శ్రమజీవులకు కనీసం రిక్షాను సొంతం చేయలేమా అన్న ఆలోచన... వేల మంది ఇప్పుడు సొంత రిక్షాలను గర్వంగా నడిపించుకునే దిశగా అడుగులేయించింది. ఆ స్ఫూర్తిదాయక కథనమే ఇది!

 
న దగ్గర తక్కువకానీ దిల్లీ, మధ్యప్రదేశ్‌, బిహార్‌, అసోం, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో రిక్షా కార్మికులు చాలా ఎక్కువ. ఒకానొక సందర్భంలో అసోం రాజధాని గువాహటిలోని ఓ రిక్షా కార్మికుడిని కలిశాడు పశువైద్యుడైన ప్రదీప్‌ కుమార్‌ శర్మ. అతని కథ విన్న ప్రదీప్‌ రిక్షా కార్మికులకు సొంత రిక్షాలు ఏర్పాటు చేసేలా ఎంతో కష్టపడి రిక్షాబ్యాంకును స్థాపించాడు. దాని విజయం ఫలితంగా ఇప్పటికి 15 వేల మందికిపైగా కార్మికులకు సొంత రిక్షా కల నెలవేరింది. ఆ విజయం మరి కొన్ని రాష్ట్రాలకూ పాకింది. తన విజయగాథను వినిపించేందుకు హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆహ్వానాలు పంపేలా చేసింది.

తొలి ప్రయాణం...
డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ శర్మ... ప్రభుత్వ ఆసుపత్రిలో పశువైద్య శస్త్రచికిత్సా నిపుణుడు. తరువాత పశువైద్యశాల అందుబాటులోలేని ఓ ప్రాంతంలో సేవలందించడం కోసం సొంతంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మందిని జంతువులకు వైద్యం అందించడంలో స్వచ్ఛంద సేవకులుగా మార్చాడు. 2001లో ఓ రోజు ఆయన ఇంటికి వెళ్లేందుకు సదుపాయాలేం లేకపోవడంతో ఓ రిక్షా మాట్లాడుకున్నారు. ఆ క్రమంలోనే ఆ రిక్షావాలాతో మాటలు కలిపారు. అప్పుడే తెలిసింది, ఆ రిక్షా అతని సొంతం కాదని. కానీ 16 సంవత్సరాలుగా రిక్షా తొక్కే అతను జీవిస్తున్నాడనీ, రోజుకు రిక్షా అద్దె 25 రూపాయలు పోగా మిగిలే 50 రూపాయలతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడనీ. అతని మాటలు శర్మను ఆలోచింపజేశాయి. ఇంత శ్రమపడే రిక్షా కార్మికులు సొంత కాళ్లమీద నిలబడలేకపోతున్నారు. ఎలాగైనా వీళ్ల జీవితాల్లో మార్పు వస్తే బాగుండు అనుకున్నాడు. ఇలా ఇతనొక్కడేనా లేక చాలా మంది ఉన్నారా అని తెలుసుకునేందుకు గువాహటిలోని 300 మంది రిక్షా కార్మికులతో సర్వే నిర్వహించాడు. ఆశ్చర్యంగా వారిలో 90 శాతం మందికిపైగా సొంత రిక్షాలు లేవు. రిక్షా అద్దె కట్టడం మిగిలిన డబ్బుతో తినడం... అవీ చాలక ఎప్పటికీ అప్పుల్లోనే జీవిస్తున్నారు వాళ్లు. వీళ్లకెలాగైనా సొంత రిక్షాలు ఇప్పించగలిగితే కొంత కాలానికైనా జీవితాల్లో మార్పు వస్తుందనుకున్నాడు. అందుకే చాలా బ్యాంకులకు తిరిగాడు. ఎన్నో అభ్యర్థనలు పెట్టుకున్నాడు. ప్రయోజనం లేదు.