close
జ్ఞాపిక

జ్ఞాపిక
- నందిరాజు పద్మలతాజయరాం

సుధీర్‌!
ఓ అందమైన కల
ఓ అపురూప అనుభవం
ఓ చల్లటి పలకరింత
ఓ ఆత్మీయ కౌగిలింత
మగాళ్ళనే మురిపించేంత అందగాడు. అల్లరిగా నవ్వే ఆ కళ్ళనిండా చిలిపితనమే! అర క్షణమైనా తనని వదిలి ఉండలేని లవర్‌బాయ్‌. మూడు పదులు దాటాయని తనకు తానుగా చెప్పుకున్నా, ఏ ఒక్కరూ నమ్మలేరు. ఛామనఛాయలో, సొట్ట బుగ్గలతో ఎంతందంగా ఉంటాడు! తను అతగాడి భుజందాకా కూడా రాదేమో! ఏం చూసి తనని లవ్‌ చేశాడో! ఎంతమందిని ఎదిరించి తనని పెళ్ళి చేసుకున్నాడో! అయిదేళ్ళు ఎలా గడిచాయో!

టేబుల్‌ మీద తల ఆన్చిన స్వాతి మరో లోకంలో ఉంది. లంచ్‌టైమ్‌ అయిన సంగతి తెలీనంత తాదాత్మ్యంలో ఉంది.

ఫోన్‌ రింగయింది. మొబైల్‌లో పేరు చూసింది స్వాతి. లలిత... లంచ్‌మేట్‌.

‘‘ఆకల్లేదే! నువ్వు కానీయ్‌. తలనొప్పిగా ఉంది. రాను.’’

ఫోన్‌ పెట్టేశాక ఆమె మనసు గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చింది.

అవును. సుధీర్‌ ఇప్పుడు గతం. ఆ నవ్వూ, పలకరింపూ, కౌగిలీ అన్నీ తనకు దూరమే! ఎప్పటికీ దగ్గరకి రాలేనంత దూరానికి ఒంటరిగా ప్రయాణంకట్టాడు సుధీర్‌. స్వాతిగానీ, మూడేళ్ళ పాప అనన్య కానీ తోడు రాలేనంత క్లిష్టమైన పయనం అతనిది. సుధీర్‌ చనిపోయాడు.

* * *

ఆర్నెల్ల క్రితం...

ఈ సృష్టిలోని ఆనందం అంతా నాదే! ఏ బాధా నన్నంటదు. నేనేది కోరినా దొరుకుతుంది. మంచి మనసున్న సుధీర్‌ని కోరాను. లభించాడు. కాదూ, కూడదూ అన్న పెద్దవాళ్ళ ఆశీర్వచనం కావాలనుకున్నాను. అనన్య పుట్టగానే అందరూ మనసు మార్చుకుని తమను చేరదీశారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, ఏ ఇబ్బందీ లేని జీవితం. పూలబాటలో సాగే ఈ జీవితం ఇలాగే కొనసాగుతుంది. నా సుధీర్‌ గుండెగూటిలో గువ్వలా నేనుంటాను. మా పొదరింట్లో అనన్య కువకువలతో ఏ పొద్దూ శుభోదయమే!

స్వాతి మదినిండిన భావాలవి.

దేవుడికెందుకు కన్నుకుట్టిందో? పన్నీటి జల్లులే కాదు, కన్నీటి బిందువులూ జీవితంలో భాగమే అని నిరూపించదలిచాడేమో. సంసార స్వరధునిలో అపస్వరం పలికింది. ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వగతం పలికే తరుణంలో, సుధీర్‌ స్వాతి బతుకు నుంచి వీడ్కోలు పలికి అందని తీరాలకి సాగిపోయాడు.

ఆరోజు...

నూటనాలుగు డిగ్రీల జ్వరంతో ఇల్లు చేరాడు సుధీర్‌. కంగారుపడిపోయింది స్వాతి.

‘‘మామూలు జ్వరమేలే! కంగారెందుకోయ్‌, డాక్టరు దగ్గరికెళితే సరి. రెండ్రోజులు విశ్రాంతి, నాలుగైదు రోజుల యాంటీబయాటిక్స్‌తో జ్వరం పారిపోదూ?’’ నీరసంగా నవ్వాడు సుధీర్‌.

స్కూటీ మీద డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళింది స్వాతి. మూడు రోజులకి ట్రీట్‌మెంట్‌ రాశాడు డాక్టర్‌. వైరల్‌ ఫీవర్‌ అని చెప్పాడు.

వారం రోజులు గడిచినా జ్వరం నియంత్రణలోకి రాకపోగా సుధీర్‌కి నీరసం మరింత పెరిగింది. క్లినికల్‌ పరీక్షలు చేయించమన్నాడు డాక్టర్‌.

‘‘సాధ్యమైనంత శీఘ్రంగా పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి’’ రిపోర్ట్సు చూస్తూనే చెప్పాడు డాక్టర్‌.

‘‘భయపడాల్సిందేమీ లేదు కదూ!’’

స్వాతి మాటలకి కాస్త తడబడ్డాడు డాక్టర్‌.

‘‘మరేంలేదులేమ్మా! రక్తం తక్కువగా ఉంది, ఎక్కించాలి’’ అంటూ తనే భార్యభర్తలిద్దర్నీ ఆటోలో ఎక్కించి కార్పొరేట్‌ ఆసుపత్రికి పంపాడు. ఫోన్‌ చేసి అక్కడవాళ్ళకి సుధీర్‌ని తక్షణం చేర్చుకోమని కూడా చెప్పాడు.

‘‘నువ్వుత్తి బెదురుగొడ్డువి. ఈ డాక్టర్లేమో మరింతగా కంగారుపెట్టి గోరంతల్ని కొండంతలు చేస్తారు. అవసరం లేదు స్వాతీ, మరో డాక్టర్‌ దగ్గరికెళ్దాం’’ ఆటోలో చెప్పాడు సుధీర్‌.

‘‘నువ్వేం మాట్లాడకు ధీరూ, చిన్న పాముని కూడా పెద్ద కర్రతోనే కొట్టాలి. మనకి ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉంది. వర్రీ అవకు.’’

సుధీర్‌ని ఆసుపత్రిలో చేర్చగానే, ఆ విషయం తనవాళ్ళకీ అత్తామామలకీ ఫోన్‌ చేసి చెప్పింది స్వాతి. ఒకళ్ళది వరంగల్‌, మరొకళ్ళది వైజాగ్‌.

నలుగురైదుగురు డాక్టర్లు సుధీర్‌ చుట్టూ మూగి మాట్లాడుకోవడం, చకచకా ఏవేవో పరీక్షలు చేయించడం, ఎక్స్‌రేలూ స్కానింగులూ... ఏవిటో అంతా గాభరాగా తోచింది స్వాతికి. సుధీర్‌ మనసులో ఏముందోగానీ పైకి మాత్రం చిరునవ్వుతోనే వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు.

‘‘యానిమల్‌ ప్లానెట్‌లో జీబ్రానో, జిరాఫీనో చంపగానే, పులులు మూగినట్లు మూగారు కదూ డాక్టర్లు’’ జోక్‌ చేశాడు స్వాతితో నెమ్మదిగా సుధీర్‌.

‘‘ష్‌! ఏం పోలికది... షటప్‌’’ కసిరింది స్వాతి.

‘‘అనన్యని కేర్‌సెంటర్‌ నుంచి తేవాల్సిన టైమ్‌ అయినట్లుంది, నువ్వెళ్ళిరా! నాకేం భయం లేదు’’ అంటూనే ఉన్నాడు సుధీర్‌, అంతలోనే గొంతు కొరబోయినట్లయి భళ్ళున వాంతయింది.

ఎర్రటి, చిక్కటి నెత్తురు!

ఒక్కసారిగా డాక్టర్లూ నర్సులూ గుమిగూడారు. స్వాతిని దూరంగా పొమ్మన్నారు. ‘‘ఇంతకుముందిలా ఎప్పుడైనా అయిందా? ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్‌ ఉందా?’’ లాంటి ప్రశ్నలతో సుధీర్‌ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

కేవలం వారం జ్వరానికి ఇంత సీరియస్‌ అవడం ఆశ్చర్యంగా ఉంది సుధీర్‌కి. తనకేమైందో తెలియడం లేదు. ‘ఇదేమైనా ప్రాణాంతకం కాబోతోందా? అదే అయితే, ప్రేమించి పెళ్ళి చేసుకున్న స్వాతి గతేంటి? అమ్మానాన్నలెలా తట్టుకుంటారు? చిన్నారి అనన్య తను పక్కన లేకుంటే నిద్ర కూడా పోదే, ఏమిటిది?!’

స్ట్రెచర్‌ సిద్ధమయింది. స్వాతితో ఒక్క మాటయినా చెప్పకుండా అత్యవసర విభాగంలోకి సుధీర్‌ని తీసుకెళ్ళిపోతున్నారు.

‘‘ఆగండి’’ గట్టిగా అరిచింది స్వాతి. ‘‘ఆయనకేమైందో చెప్పండి. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారు?’’ ముందుకు ఉరికిన స్వాతిని సెక్యూరిటీ సిబ్బంది ఆపారు.

‘‘ఆవిణ్ణి రానీయండి. అమ్మా, అర్జంటుగా కొన్ని పరీక్షలు చేయాలి. వివరాలు మావాళ్ళు మీకు చెప్తారు’’ పెద్ద డాక్టర్‌ అనునయించాడు.

‘‘ధీరూ, నీకేం కాదు ధీరూ! భయపడకు. ఇదంతా అనవసర హంగామా! నువ్వన్నట్లు మరో డాక్టర్‌ దగ్గరకెళ్తే పోయేది. కంగారుపడకు.’’ భర్త తలను గుండెల్లో పొదువుకుంది స్వాతి.

‘‘నేను కాదురా కంగారుపడేది, నువ్వు. నువ్వుండగా నాకేం భయం?’’ స్వాతి చుబుకాన్ని ముద్దుపెట్టుకున్నాడు సుధీర్‌.

ఐసీయూలోకి చేర్చిన వెంటనే మరో రెండుసార్లు రక్తపు వాంతులయ్యాయి సుధీర్‌కి. కొద్దిగా ఎగరొప్పు మొదలయింది. కళ్ళు మసకబారసాగాయి. శరీరంలోని ప్రతి కీలూ నొప్పిగా ఉంది. కదలలేకపోతున్నాడు. వింత వర్ణాల వలయాలతో నిండిన కుహరాల లోపలికి పయనిస్తున్న అనుభూతి. అతన్ని అపస్మారకం కమ్ముకుంది.

‘‘మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమైంది మా ఆయనకి?’’ డాక్టర్ని ప్రాధేయపడింది స్వాతి.

‘‘సారీ అమ్మా, అతనికి బ్లడ్‌ క్యాన్సర్‌. సైలెంట్‌గా వృద్ధి చెందింది.’’

‘‘అంటే... ఆయన...’’

‘‘పెద్దవాళ్ళెవరైనా ఉంటే పిలవండమ్మా! నర్స్‌... ఈవిడకి సాయం చేయండి’’ వెళ్ళిపోయాడు డాక్టర్‌.

ఆ తర్వాత సంఘటనలేమీ స్వాతికి గుర్తులేవు. స్మృతి తప్పిన ఆమెని నెలరోజులపాటు కంటిరెప్పలా కాపాడుకున్న బంధువులు, ఆమె కాస్త వాస్తవంలోకి వచ్చాక తిరిగి వెళ్ళిపోయారు. చలనం ఉన్న ప్రతిమలా అనన్య కోసం బతుకుతోంది. ఉద్యోగం చేస్తోంది. అనుక్షణం గుర్తొచ్చే సుధీర్‌తో గతంలోనే బతుకుతోంది.

* * *

తలమీదెవరో నిమిరినట్లనిపించి తలెత్తింది స్వాతి.

చైతన్య!

‘‘ఏమిటిది స్వాతీ... ఎన్నాళ్ళిలా? నవ్వు తప్ప కన్నీరు తెలియని స్వాతివేనా నువ్వు?’’ బాధగా అన్నాడు.

స్వాతి, సుధీర్‌, చైతన్య ముగ్గురూ డిగ్రీ నుంచి స్నేహితులు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఎంబీఏ చేసి ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరాడు చైతన్య. స్వాతి, సుధీర్‌ ఇద్దరికీ ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. వాళ్ళిద్దరి ప్రేమ వివాహానికి సూత్రధారి చైతన్యే.

‘‘కూర్చో చైతూ, నేను ఎలా ఉంటేనేం?’’

‘‘అలా అనకు. అనన్య కోసమైనా నవ్వుతూ ఉండాలి. నువ్విలా ఉంటే సుధీర్‌ సంతోషంగా ఉంటాడా?’’

విరక్తిగా నవ్వింది స్వాతి.

‘‘చదువుకున్నదానివి. ఆ పసిదానికి తల్లి ప్రేమని కూడా దూరం చేయకు. నువ్వూ, నేనూ, ఈ ప్రపంచంలోని మునుషులందరికీ తప్పని పరిణామం ఇది. నువ్వెంత ఏడ్చినా గతాన్ని గాలం వేసి తేగలమా? అసాధ్యం కదూ.’’

‘‘నేనేం చేయను చైతూ. ప్రతి క్షణం...’’

‘‘గుర్తొస్తాడు. రానీ! వాడికిష్టమైన స్వాతిలా నువ్వుంటే వాడూ నిన్ను మరవడు. నువ్వు మానసికంగా సిద్ధపడు. నీ ధైర్యం నీకు తోడుగా ఉంటే చాలు స్వాతీ!’’

‘‘కానీ, ఎలా?’’

పసిపాపలా అడిగిన స్వాతి చేతిని పట్టుకున్న చైతన్య చెప్పాడు. ‘‘ఈరోజు నుంచే నువ్వూ, అనన్యా పార్కులకీ సినిమాలకీ వెళ్తారు. నువ్వు ఈ హెయిర్‌స్టయిల్‌, డ్రెస్‌ స్టయిల్‌ అన్నీ మార్చుకుంటావు. నిన్ను నువ్వు మెచ్చుకునేలా కొత్త పనులు ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌ లాంటివి మొదలుపెడతావు. అవును, స్వాతి మరో జన్మెత్తుతుంది. ఈ చైతూ నీకు తోడుంటాడు. అయినా సుధీర్‌ ఎక్కడికెళ్ళాడు స్వాతీ... అనన్య రూపంలో అనుక్షణం నీ కొంగు పుచ్చుకునే తిరుగుతున్నాడుగా! వాడు నీకిచ్చిన ‘మెమెంటో’ అనన్య.’’

కాసేపయ్యాక వెళ్ళిపోయాడు చైతన్య.

* * *

‘‘దిల్‌సుఖ్‌నగరెళ్ళాలమ్మా, స్టేజీ వస్తే చెప్తావా?’’ నడివయసు స్త్రీ అడిగిన ప్రశ్నకి తల వూపి, ఆమె వంక చూసింది స్వాతి. బస్‌లో కిటికీ వైపుకి ఒదిగి కూర్చున్న ఆమె ఒళ్ళొ ఓ పాప.

‘‘ఎక్కడ్నుంచి వస్తున్నారు?’’ అడిగింది స్వాతి.

‘‘తెనాలి దగ్గర పల్లెటూరమ్మా మాది. నా ముగ్గురు పిల్లలూ పసివాళ్ళుగా ఉన్నప్పుడే మావారు విషజ్వరంతో పోయారు. ఏదో కష్టపడి పెంచుకొచ్చాను. పెద్దవాడు ఉద్యోగమంటూ దుబాయ్‌ వెళ్ళి ఏదో గొడవల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. నా దురదృష్టం. ఆ బాధ సలుపుతూండగానే రెండోవాడికి యాక్సిడెంట్‌లో కాళ్ళు విరిగాయి. ఏడాదిపాటు మంచం మీదే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొయ్యకాళ్ళతో నడుస్తున్నాడు. హు! అది చాలనట్లు, ఇదిగో ఈ పిల్ల. పదహారేళ్ళు దీనికి. బుద్ధిమాంద్యం. ఇప్పుడు దీనికోసమే వెళ్తున్నాను. ఇక్కడేదో ప్రత్యేక స్కూల్‌ ఉందట. కనుక్కుందామని వెళ్తున్నాను.’’

అన్ని కష్టాలనీ నిబ్బరంగా చెప్తున్న ఆవిణ్ణి విస్మయంగా చూసింది స్వాతి.

‘‘మరి మీ బతుకుతెరువు?’’

‘‘మా రెండోవాడికి ఎలక్ట్రికల్‌ పనులొచ్చమ్మా. కావాల్సిన సామాను తెచ్చిస్తే స్విచ్‌బోర్డులూ వగైరాలు తయారుచేస్తాడు. నేను పచ్చళ్ళూ అప్పడాలూ పొళ్ళూ తయారుచేస్తాను. ఏదో జీవితం వెళ్ళిపోతోంది. దేవుడు నా నుదుట రాసినన్నాళ్ళూ వీళ్ళకోసం బతకాలిగా.’’

పెద్దావిడ మాటలకి గుండె భారమైంది స్వాతికి.

దిల్‌సుఖ్‌నగర్‌ రాగానే ఆవిడకి చేతిసాయం అందించి బస్టాప్‌లో దింపింది స్వాతి.

ఇంటికి రాగానే తనని చుట్టుకున్న అనన్యని దగ్గరికి తీసుకుని, ఆయాని వెళ్ళిపొమ్మంది స్వాతి. కూతురి ముఖంలోకి తేరిపారా చూసింది. దీపాల్లా వెలిగే దాని కళ్ళూ, బంగారురంగులో మెరిసిపోయే బుగ్గలూ వాడిపోయి ఉన్నాయి. కళావిహీనంగా ఉన్న దాని వర్ఛస్సు చూసేసరికి ఏడుపొచ్చేసింది స్వాతికి. ఎదురుగా ఉన్న ఫొటోలోని సుధీర్‌ తనను నిలదీస్తున్నట్లనిపించింది. పాపని దగ్గరకు తీసుకుని ఆపిల్‌ ముక్కలు తినిపిస్తూ టీవీ ఆన్‌ చేసింది.

ఏదో న్యూస్‌ ఛానల్‌.

టీవీలో చూపిస్తున్న నవయువతి ఎంతో విశ్వాసంతో, పట్టుదలతో తాను సాధించిన విజయాలను వివరిస్తోంది. కొన్నేళ్ళక్రితం సునామీలో తన వాళ్ళందర్నీ పోగొట్టుకున్న అనాథ ఆమె. ఆమెలో ఎక్కడా దైన్యం లేదు- రూపుకట్టిన స్థైర్యం తప్ప.

చైతన్య కిరణమేదో తనను తాకి, తనలో లీనమైనట్లనిపించింది స్వాతికి.

* * *

స్వాతిలో వచ్చిన మార్పుని ఆఫీసులోవాళ్ళూ, చుట్టుపక్కలవాళ్ళూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఆమెని అనునయించి, సముదాయించి మామూలుగా ఉండమన్నవాళ్ళే, స్వాతిలోని కొత్తదనాన్నీ చురుకుదనాన్నీ ఆమోదించలేకపోతున్నారు. వాళ్ళ గుసగుసల్లో అనుమానాలు దొర్లుతున్నాయి.

‘‘ఈ లోకం తీరింతే స్వాతీ! ఇలాగే ఉంటుంది. మనం వెంటబడితే పరుగెత్తుతుంది. మనం పరుగుతీస్తే వెంటపడుతుంది. తన సంతృప్తి కోసం సానుభూతి చూపిస్తుంది. ఆ సానుభూతికి తావు లేకపోతే నిరాశపడుతుంది. నిందలు వేస్తుంది. ఇదో కొత్త స్టేజ్‌ నీకు. అలవాటుపడు. నీకోసం నువ్వు బతుకు. ఈ ప్రపంచానికి ప్రతి నిత్యం ఓ కొత్త విషయం కావాలి. ఇవాళ్టికి నువ్వు, రేపు మరొకరు. అంతేకానీ, వాళ్ళనిందల్నీ నిష్ఠూరాల్నీ మనసుకు తీసుకుని బాధపడకు. జస్ట్‌, ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే సినిమాలాగా చూస్తూ హాయిగా నవ్వుకో!’’ నవ్వుతూ అన్నాడు చైతన్య.

‘‘అనన్య ఎంత ఆనందంగా ఉందో తెలుసా చైతూ! దాని నవ్వు అచ్చు సుధీర్‌ నవ్వులాగే ఉంటుంది’’ బొమ్మలతో ఆడుకుంటున్న పాపని చూస్తూ అంది స్వాతి.

‘‘నిన్నూ, అనన్యనీ ఇలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో వూహించలేవు స్వాతీ! అన్నట్లు, ఈ ఆదివారం రాధికతో నా నిశ్చితార్థం. నువ్వు రావాలి. పిలవడానికే వచ్చాన్నేను.’’

సంతోషంగా తలూపింది స్వాతి. తమ ఇరువురి మధ్య లేని బంధాన్ని వూహించి చెవులు కొరుక్కుంటున్న వాళ్ళ నోళ్ళింక మూతలుపడతాయన్న తృప్తితో నిట్టూర్చింది. దగ్గరికి వచ్చిన అనన్యని గుండెలకు హత్తుకుంటూ ఫొటోలోని సుధీర్‌తో అంది, ‘‘ఇది నీ జ్ఞాపిక ధీరూ, భద్రంగా చూసుకుంటున్నా!’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.