close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జై...జైనథ్‌ లక్ష్మీనారాయణ!

జై...జైనథ్‌ లక్ష్మీనారాయణ!

ఆ నారాయణుడు...లక్ష్మీనారాయణుడు, సూర్యనారాయణుడు, సత్యనారాయణుడూ! ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనథ్‌లో వెలసిన నారాయణమూర్తిని భక్తులు సంతాన నారాయణుడిగా కూడా కొలుస్తారు. ఎనిమిది వందల ఏళ్ల నాటి ఆలయం ఇది.


క్త వత్సలుడు జైనథ్‌లో వెలసిన లక్ష్మీనారాయణుడు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉందీ క్షేత్రం. శంఖ, చక్ర, గదాయుధాలు ధరించిన స్వామి...మరొకచేతితో అభయాన్ని ప్రసాదిస్తాడు. ఇక, హృదయవాసిని అయిన లక్ష్మి సుఖసంతోషాల్నీ భోగభాగ్యాల్నీ అందిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం చాలా ప్రాచీనం. ఎనిమిది వందల సంవత్సరాల నాటిదని అంటారు. మూలవిరాట్టు మూలాలు ఏ త్రేతా ద్వాపరయుగాల్లోనో ఉండి ఉండవచ్చని ఆస్తికుల నమ్మకం. సెప్టెంబరు 11 నుంచి నవంబరు 11 వరకూ...తరచూ సూర్య కిరణాలు నేరుగా స్వామి పాదాల్ని తాకుతూ ఉంటాయి. ఆ సమయంలో గర్భాలయం వైకుంఠంలా దివ్యతేజస్సుతో అలరారుతుంది. ఆ దృశ్యం సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణుడికి కిరణాభిషేకం చేస్తున్న భావన కలిగిస్తుంది. ఆ అపురూప ఘట్టాన్ని దర్శించుకోడానికి ఎక్కడెక్కడి భక్తులో తరలివస్తారు. జైనథ్‌ నారాయణుడిని...ఆరోగ్యానికి అధిపతి అయిన సూర్యనారాయణుడిగా, కోరిన వరాలిచ్చే సత్యనారాయణుడిగా, సంతాన భాగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీనారాయణుడిగా అర్చించడం ఓ ప్రత్యేకత. కార్తిక పౌర్ణమికి పూర్తయ్యేలా...వరుసగా ఐదు పున్నముల్లో ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. రంగనాథస్వామిని పూజించి, ప్రేమించి తరించిన గోదాదేవి మధురభక్తికి సాక్ష్యంగా...ధనుర్మాసంలో నెల రోజుల పాటూ స్వామిని పాశురాలతో అర్చిస్తారు. ఘనంగా గోదాకల్యాణం నిర్వహిస్తారు.

ఆలయ ప్రశస్తి
తెలంగాణలోని ప్రాచీన క్షేత్రాల్లో జైనథ్‌ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఆలయ నిర్మాణ శైలిలోనూ ఎంతో ప్రత్యేకత కనిపిస్తుంది. శిఖరానికి నలువైపులా మర్కటాలూ సింహాల ప్రతిమలు కనువిందు చేస్తాయి. ఆలయం పూర్వాభిముఖంగా, ఎనిమిది కోణాలతో అలరారుతుంది. గర్భగుడిలో లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం తేజోవంతంగా దర్శనమిస్తుంది. లక్ష్మీదేవి, అళ్వారులూ, ఇతర దేవతల మూర్తులూ ఉన్నాయి. గర్భగుడి ద్వారం దగ్గర అందమైన శిల్ప తోరణం ఉంది. సన్నని గొలుసుల్లా చెక్కి వాటి చివర గంటలను అమర్చారు. స్వామివారికి రెండు సింహాసనాలు ఉన్నాయి. అందులో ఒకటి చాలా ప్రాచీనమైందనీ ఉక్కు శిలతో చేశారనీ చెబుతారు. ఆలయం ముందు సువిశాలమైన కోనేరు ఉంది. పూర్వం బ్రహ్మోత్సవాల్లో భాగంగా డోలా హరణోత్సవం, తెప్పోత్సవం ఇక్కడే నిర్వహించేవారు. ఆలయానికి ఎడమ పక్కన శిథిల శివాలయం ఉంది. ఒకప్పుడు శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ ధర్మాల కూడలిగా భాసిల్లింది జైనథ్‌.తొలి శాతవాహనులు జైనాన్ని అవలంబించారు. శ్రీముఖ శాతవాహనుడు కోటిలింగాల కేంద్రంగా పాలిస్తూ ఆదిలాబాద్‌ ప్రాంతాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. కొంతమేర మహారాష్ట్ర భూభాగాన్నీ జయించాడు. జైనథ్‌లోని ఆలయం అప్పటి జైన క్షేత్రమని చరిత్ర చెబుతోంది. వైదిక మతం విజృంభించడంతో...జైనులు ప్రాధాన్యాన్ని కోల్పోయారు. ఆలయ అంతరాళ మండపంలో శిథిలమైన శిలాఫలకం మీద సూర్య భగవానుడిని స్తుతించే శ్లోకాలున్నాయి. దీన్నిబట్టి చూస్తే, జైనం మరుగునపడిపోయాక...ఈ క్షేత్రం ఆదిత్యుడి ఆలయంగా మారిపోయి ఉండవచ్చు. వైష్ణవం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాక లక్ష్మీనారాయణుడి ప్రాధాన్యం పెరిగి ఉండవచ్చని చరిత్రకారుల విశ్లేషణ.

మరో శబరి

దాకాతే తానుబాయి స్వామి భక్తురాలు. కడివెడు కష్టాల్ని అనుభవించింది. ‘లక్ష్మీనారాయణుడు తోడుగా ఉన్నంతకాలం సమస్యలు నన్నేమీ చేయలేవు’ అని బలంగా నమ్మింది. ఆ ఆధ్యాత్మిక సాధనను మరింత సానబట్టడానికే అన్నట్టు అవసానదశలోనూ ఏవో ఇబ్బందులు. చేతికొచ్చిన బిడ్డ... వెంకటి కెనడాలో ఆకస్మికంగా మరణించాడు. అతడు పనిచేస్తున్న సంస్థ నష్టపరిహారంగా కొంత డబ్బు ఇచ్చింది. బీమా కింద మరో ఇరవై లక్షలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఐదు లక్షలదాకా తేలింది. మొత్తం డబ్బుతో తనే దగ్గరుండి యాత్రికుల కోసం అతిథి గృహాన్ని నిర్మించిందా భక్తురాలు. పొట్టనింపుకోడానికి కూరగాయల వ్యాపారం చేస్తున్నా...తానుబాయి మనసునిండా జైనథ్‌ లక్ష్మీనారాయణుడే!

ఘనంగా రథోత్సవం

లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ఏటా కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మొదలవుతాయి. బహుళ పంచమి రోజు ఘనంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామి పంచవాహనుడై భక్తులకు దర్శనమిస్తాడు. సంతానం లేని మహిళలు కార్తిక శుద్ధ ద్వాదశినాడు...అంటే కల్యాణోత్సవం రోజున స్వామి వారి ప్రసాదాన్ని (గరుడ ముద్ద) స్వీకరిస్తే ఏడాది లోపే సంతానం కలుగుతుందని ప్రతీతి. బ్రహ్మోత్సవాల చివరి రోజు రాత్రి జరిగే నాగవెల్లి కార్యక్రమంలో...భక్తితో పూజించినా స్వామి సంతాన భాగ్యాన్ని ఇస్తాడని అంటారు. ఆదిలాబాద్‌ పట్టణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోని జైనథ్‌ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉందీ ఆలయం. ఆదిలాబాద్‌ నుంచి అంతర్రాష్ట్ర రహదారి గుండా బేల, సాంగిడి, దీపాయిగూడ, లక్ష్మీపూర్‌, మహారాష్ట్రలోని చంద్రపూర్‌ వెళ్లే బస్సులు అరగంటకు ఒకటి అందుబాటులో ఉన్నాయి.

- మంద రామచంద్రం, ఈనాడు, ఆదిలాబాద్‌ డెస్కు
ఫొటోలు: రవికుమార్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.