close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నచ్చిన బైక్‌ నడిపేయండి!

నచ్చిన బైక్‌ నడిపేయండి!

కొత్తకొత్త బైకుల్నీ, ఖరీదైన బైకుల్నీ నడిపి చూడాలన్న కోరిక కుర్రకారుకి సహజం. కానీ లక్షల్లో ఉండే వాటి ఖరీదు గుర్తురాగానే ఆ కోరికలకు సడన్‌ బ్రేక్‌ పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన ఓ ముగ్గురు మిత్రులు... ‘ఇకపైన అలాంటి ఆలోచనలకు బ్రేక్‌ వేయనవసరంలేదు’ అంటున్నారు.

నిల్‌, వివేకానంద, వరుణ్‌... స్నేహితులు. కాలేజీలో ఉన్నపుడే భవిష్యత్తులో కలిసి వ్యాపారం చేద్దామనుకున్నారు. ఆ తర్వాత అనిల్‌ కంపెనీ సెక్రటరీగా, వివేకానంద సీఏగా, వరుణ్‌ ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌’ ఇంజినీరుగా పనిచేశారు. 2013లో చేస్తున్న ఉద్యోగాలను వదిలి వ్యాపార ప్రణాళికలు వేసుకున్నారు. 2014లో ‘వికెడ్‌ రైడ్‌’ పేరుతో బెంగళూరులో ఖరీదైన బైకులను అద్దెకు ఇచ్చే కంపెనీని ప్రారంభించారు.

అవసరం నుంచి...
ఈ ముగ్గురు మిత్రులూ కలిసి ఒక ఖరీదైన బైకు కొని దాన్ని తమ అవసరాలకు వాడుకుంటూనే, ‘ఈఎమ్‌ఐ’ల భారాన్ని తగ్గించుకోవడానికి స్నేహితులకీ, పరిచయస్థులకీ అద్దెకు ఇవ్వాలనుకున్నారు. ఆ సమయంలోనే బైకులను అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది వారికి. మొదట రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ‘కాంటినెంటల్‌ జీటీ కెఫే రేసర్‌, హ్యార్లే 750 బైకులను అద్దెకు నడిపి చూశారు. ఆ బైకులపైన వారు షికారు చేసినపుడు ‘ఎంత గురూ’, ‘ఎంత మైలేజీ ఇస్తోంది గురూ’ లాంటి ప్రశ్నలు జనాల నుంచి వచ్చేవి. అలాంటపుడు అవి సొంత బైకులు కావనీ ‘వికెడ్‌ రైడ్‌’ నుంచి అద్దెకు తీసుకున్నామనీ చెప్పేవారు. అలా కంపెనీ గురించి నోటిమాటగానూ అందరికీ తెలిసేలా చేసేవారు. స్పందన బాగుందని నిర్ధారించుకున్నాక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడానికి ప్రణాళికలు వేశారు. ‘మేం ముగ్గురం హార్లే డేవిడ్‌సన్‌, ట్రంఫ్‌, బీఎమ్‌డబ్ల్యూ లాంటి ఖరీదైన బైకులు నడపాలని కలలుగనేవాళ్లం. ఆ బైకులు కనిపించగానే ఉత్సాహం... ధరలు గుర్తొచ్చాక వాటిని అందుకోలేమన్న నిరుత్సాహం... మమ్మల్ని ముంచెత్తేవి. ఇదే కాదు, మేం తరచూ పర్యటనలకూ వెళ్తుంటాం. గోవా, మనాలీ లాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ ధరకే బైకులు అద్దెకు దొరుకుతాయి. కానీ దేశంలోని మిగతా చోట్ల ఇలాంటి సదుపాయంలేదు. ఆటోలూ, అద్దె కార్లలో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటపుడు ఖర్చు ఎక్కువవుతుంది. అసలు యువతకు అలా వెళ్లడం ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని మేం గమనించాం. ఈ రెంటికీ పరిష్కారంగా వికెడ్‌ రైడ్‌ని ప్రారంభించాం’ అని చెబుతాడు వివేక్‌.

ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు, మైసూరు, హంపీ, బెళగావి, మణిపాల్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, దిల్లీ, జైసల్మేర్‌, భుజ్‌, ఉదయ్‌పూర్‌ నగరాల్లో బైకులను అద్దెకు ఇస్తోంది. న్యూజిలాండ్‌లోనూ శాఖను ఏర్పాటుచేశారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకీ తమ సేవల్ని విస్తరించాలని చూస్తున్నారు. వీరి దగ్గర ప్రస్తుతం 500లకుపైగా బైకులున్నాయి. వీటిలో 200వరకూ సొంతవి కాగా, మిగిలినవి లీజుకు తీసుకున్నవి. హార్లే డేవిడ్‌సన్‌ ఐరన్‌, 833, సూపర్‌ లో, స్ట్రీట్‌ 750, ట్రయమ్స్‌ బోనవిల్లే, టైగర్‌, కవాసాకీ నింజా 650, వెర్సస్‌ 650, డ్యూక్‌ 200, 390, జెడ్‌ 800, ఆర్‌సీ 200, 290, రోయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ప్రఖ్యాత మోడళ్లూ వీరి బైకుల జాబితాలో ఉన్నాయి. వీటి అద్దె రోజుకి రూ.750 నుంచి రూ.8500 వరకూ ఉంటుంది. వికెడ్‌ రైడ్‌... ఏంజెల్‌ ఫండిగ్‌ ద్వారా రూ.5కోట్లు సేకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 కోట్ల ఆదాయాన్ని పొందింది. ప్రారంభం నుంచీ పెట్టుబడి సులభంగానే వచ్చిందనీ, ఆదరణ కూడా బాగా ఉందనీ కాకపోతే ఇలాంటి సంస్థను ప్రారంభించింది తాము మాత్రమే కాబట్టి ప్రభుత్వ రవాణా సంస్థల అనుమతులూ, బీమాకు సంబంధించిన అంశాలూ సవాలుగా నిలిచేవనీ చెబుతాడు వివేక్‌.

జాగ్రత్తల తర్వాతే
‘‘బైకు కోసం వచ్చేవారి నుంచి ఎలాంటి ‘సెక్యూరిటీ డిపాజిట్‌’నీ తీసుకోం. బైకు ఇచ్చే ముందు మాత్రం అనేక జాగ్రత్తలు చెబుతాం. హెల్మెట్‌, నీప్యాడ్స్‌, జాకెట్‌ü్స లాంటివి తప్పనిసరిగా ఉండేలా చూస్తాం. బైకు గురించి ప్రతి ఖాతాదారుకీ వివరిస్తాం. 21 ఏళ్లు నిండినవాళ్లకే అనుమతి. ఈ బైకులను కొన్ని గంటలకూ, రోజువారీగానూ అద్దెకు తీసుకోవచ్చు. సంస్థ కార్యాలయానికి వచ్చి బైకు తీసుకోవచ్చు లేదంటే ఇంటికే తెప్పించుకోవచ్చు కూడా’’ అని చెబుతారు సంస్థ జీఎం(ఆపరేషన్స్‌) అజయ్‌ తలారి. ఖరీదైన బైకులనే కాదు, ‘అప్నా రైడ్‌’ పేరుతో స్కూటర్లూ, మోటార్‌సైకిళ్లనీ అద్దెకు ఇస్తున్నారు. బెంగళూరులోని అన్ని మెట్రోస్టేషన్లలోనూ వీరు సాధారణ స్కూటీలూ, బైకుల్నీ అద్దెకు ఇస్తున్నారు.

మనదేశంలో బైకు పర్యటకాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతుగా కృషి చేస్తున్నారు వికెడ్‌ రైడ్‌ వ్యవస్థాపకులు. అందుకుగానూ బైకు బృందాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఉన్న బైకు క్లబ్బులకు పర్యటనల్ని నిర్వహిస్తున్నారు. మహిళలకు బైకు రైడింగ్‌లో పాఠాల్ని నేర్పిస్తూ తమ ఖాతాదారుల్లో వారినీ చేర్చుకుంటున్నారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చే ఖరీదైన బైకులను కొని వాటిని తమ అద్దె బైకుల జాబితాలో చేర్చుతున్నారు. ఏంటీ మీకూ ఖరీదైన బైకులను నడపాలని ఉందా! అయితే, wickedride.com వెబ్‌సైట్‌ను చూడండి!


తన కాళ్లతో నడిపిస్తున్నాడు! 

కాళ్లూ చేతులూ లేని వాళ్లకి తిరిగి వాటిని తీసుకు రాలేకపోవచ్చు కానీ, కృత్రిమ అవయవాలతో ఆ లోటుని కొంతవరకూ భర్తీ చేయొచ్చు. దాని వల్ల వికలాంగులనూ ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించొచ్చు. చాలా ఏళ్లుగా అదే పని చేస్తూ ఇరవై వేలకు పైగా వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపి ముందుకెళ్తొంది శ్రీ గురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌.

స్నేహితుడి వైకల్యం, ఓ స్వామీజీ ఉద్బోధ, నిత్యం కళ్ల ముందు కనిపించే సమస్యలూ... అన్నీ కలిసి ఓ దశలో రాపర్తి జగదీష్‌బాబుని తీవ్రంగా కదిలించాయి. దాని ఫలితమే విజయనగరం జిల్లాలో వెలసిన శ్రీ గురుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌. ప్రమాదంలో కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న అభాగ్యులకూ, పుట్టుకతో వైకల్యం బారిన పడ్డ పసికందులకూ తానే వూతంగా మారి సంస్థ ముందుకు నడిపిస్తోంది. రెండేళ్ల చిన్నారి నుంచి 80ఏళ్ల పండు ముసలి వరకూ సంస్థ సాయంతో ఉచితంగా కృత్రిమ అవయవాలు పొంది కొత్త ఆశలతో ముందడుగేస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం జగదీష్‌బాబు, నళినేష్‌బాబుల చొరవతో వెలసిన ‘గురుదేవ’ సంస్థ దేశ వ్యాప్తంగా ఇరవై వేల మందికి పైగా వికలాంగులకు చేయూతనిచ్చి దూసుకెళ్తొంది.

మేనల్లుడి నుంచి మొదలు
విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం మంగళపాలెం జగదీష్‌ బాబు స్వస్థలం. ఒకప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకే పెద్దగా తెలీని ఆ కుగ్రామం ప్రస్తుతం ట్రస్టుని సందర్శించడానికి వచ్చే రాజకీయ నాయకులూ, న్యాయమూర్తులూ, ఐఏఎస్‌లూ, అధికారుల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. చాలా ఏళ్ల క్రితమే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్న జగదీష్‌ ఆపైన కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. తరవాత ఓ హోటల్‌ నిర్వహించారు. జగదీష్‌ మేనల్లుడు పుట్టుకతో బధిరుడు. ఆ పిల్లాడిని చూడ్డానికి మైసూరులోని రోటరీవెస్ట్‌ సంస్థ నిర్వహిస్తోన్న పాఠశాలకు ఓసారి జగదీష్‌ వెళ్లారు. అక్కడ వినికిడి సమస్యతో బాధపడుతోన్న ఐదుగురు చిన్నారుల పరిస్థితికి చలించిపోయి ఇరవై వేలు పెట్టి వినికిడి యంత్రాలను కొనిచ్చారు. పాఠశాలకు గ్రంథాలయ భవనాన్నీ నిర్మించి ఇచ్చారు. అదే సేవా ప్రస్థానానికి మొదలు.

స్నేహితుడి సూచనతో...
ఓసారి లఖ్‌నవూలో సుఖబోధానంద స్వామి చేసిన భగవద్గీత ప్రవచన ప్రభావంతో జగదీష్‌ ఆలోచనలు తోటి వారికి సాయం చేయడంవైపు మళ్లాయి. మొదట స్వగ్రామం మంగళపాలెంలో రూ.30లక్షల వ్యయంతో సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. చుట్టుపక్కల అనేక పాఠశాలలూ, కళాశాలలూ, సేవాసంస్థలకు ఆర్థికంగా సహాయ పడటం మొదలుపెట్టారు. అలా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు సేవ రూపంలో కరగసాగాయి. ఓసారి జగదీష్‌ స్నేహితుడు రాజశేఖర్‌ రహదారి ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో అతడిని జైపూర్‌ తీసుకెళ్లి కృత్రిమ కాలు వేయించాలని అనుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల స్నేహితుడితో కలిసి జగదీష్‌ వెళ్లలేకపోయారు. కృత్రిమ కాలు కోసం జైపూర్‌ బయల్దేరిన రాజశేఖర్‌ దురదృష్టవశాత్తూ రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఆపైన గ్రామంలో మరో ఇద్దరు పరిచయస్తులూ ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవడంతో అలాంటి వాళ్లకు సాయపడాలని నిర్ణయించుకున్నారు. జైపూర్‌ తరహా కృత్రిమ అవయవాలనే హైదరాబాద్‌లోని భారత్‌ వికాస్‌ పరిషత్తు కూడా తయారు చేస్తున్నట్లు తెలిసి వికలాంగులను సొంత ఖర్చులతో అక్కడికి పంపించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు మంగళపాలెంలోనే శిబిరాన్ని నిర్వహించి అవయవాల కొలతలు తీసుకుని వాటిని హైదరాబాద్‌ పంపించి తయారు చేయించసాగారు. ఆ ప్రాంతం నుంచి ఆర్డర్లు ఎక్కువగా రావడాన్ని అవయవ తయారీ నిపుణుడు నళినేష్‌ బాబు గమనించారు. అందుకని అక్కడే ఓ కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తే బావుంటుందని జగదీష్‌కి సూచించారు. ఆపైన వాళ్లిద్దరికీ సాన్నిహిత్యం పెరగడంతో నళినేష్‌ సూచన ప్రకారం మంగళపాలెంలోనే శ్రీ గురుదేవ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి కృత్రిమ అవయవాల తయారీ, ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టారు.

వాళ్ల స్ఫూర్తితోనే...
సంస్థ సేవలు సజావుగా సాగుతున్న దశలో సంస్థ ఉపాధ్యక్షుడూ, టెక్నీషియన్‌ నళినేష్‌బాబు గుండెపోటుతో మరణించారు. చిన్నతనంలోనే రెండుకాళ్లూ పోగొట్టుకున్న నళినేష్‌ ఆత్మవిశ్వాసంతో ఎదిగి ఎంతో మందికి కృత్రిమ అవయవాలు తయారు చేసిచ్చారు. అలాంటి వ్యక్తి మరణం మరోసారి జగదీష్‌ని కుంగదీసింది. నళినేష్‌ ఆశయాలకు వూపిరిపోస్తూ మరో టెక్నీషియన్‌ని నియమించుకొని సంస్థ కార్యక్రమాలను జగదీష్‌ కొనసాగిస్తున్నారు. ప్రస్తుత సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి ఓసారి సంస్థను సందర్శించి, సేవలకు ముచ్చటపడి సహాయం అందించడం మొదలుపెట్టారు. ఆయన మూలంగా పలు కార్పొరేట్‌ సంస్థలూ దాతల జాబితాలో చేరాయి. ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి, చిత్తూరు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఛŒత్తీస్‌గఢ్‌, కర్ణాటక లాంటి అనేక ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి ఉచితంగా కృత్రిమ అవయవాలను సంస్థ అందించింది. విశాఖలోని గిరిజన మండలాల్లో గర్భిణులకు పౌష్టికాహారం, వృద్ధులకు పింఛన్లూ, బధిరులకు వినికిడి పరికరాలూ, వికలాంగులకు ట్రైసైకిళ్లూ, చక్రాల కుర్చీల లాంటి వాటినీ ట్రస్టు సమకూరుస్తోంది. ‘నా ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చిన సుఖబోధానంద స్వామీ, సంస్థ ఏర్పాటు చేయాలని సూచించీ, సహకరించిన నళినేష్‌, సేవలను విస్తరించడానికి కారణమైన కేవీ చౌదరి లాంటి వాళ్లే నా పనులకు స్ఫూర్తి’ అంటారు జగదీష్‌(9346234536).

- యల్లపు వెంకట్‌ అప్పారావు,
ఈనాడు, విజయనగరం
ఫొటోలు: గుదే రామారావు

రోల్స్‌రాయిస్‌తో రోడ్లు వూడ్పించాడు

 

అనగనగా ఒక రాజు. ఆయన ఓసారి లండన్‌లోని రోల్స్‌ రాయిస్‌ షోరూమ్‌కి వెళ్లాడు. అక్కడున్న సేల్స్‌ బాయ్స్‌ రాజుగారిని అస్సలు పట్టించు కోలేదట. దాంతో రాజుకి కోపం వచ్చి షాపులో ఉన్న రోల్స్‌రాయిస్‌ కార్లన్నిటినీ కొనేసి, చెత్త బండ్లుగా మార్పించాడట. ఇంకో రాజుకి తన కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే, ఒక్కో కుక్కకూ ఓ గదినీ, పనిమనిషినీ, ఫోనునీ ఏర్పాటు చేశాడు. ఇవి... కథలు కాదు. చరిత్రలో నిలిచిపోయిన ఒకనాటి భారతీయ రాజుల దర్పం తాలూకూ జ్ఞాపకాలు.

 ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన రోల్స్‌ రాయిస్‌ అంటేనే దర్పానికి మారుపేరు. కానీ రాజస్థాన్‌లోని అల్వార్‌కు రాజైన జై సింగ్‌ మాత్రం ఆ కార్లను చెత్త వ్యానులుగా మార్పించేశాడు. ఓసారి లండన్‌ వెళ్లిన జై సింగ్‌ సాధారణ మనిషిలా ఓ రోల్స్‌రాయిస్‌ షోరూమ్‌కి వెళ్లాడు. అక్కడున్న సేల్స్‌మెన్‌ ఆయన మామూలు వ్యక్తి అనుకుని నిర్లక్ష్యంగా, హేళనగా మాట్లాడారట. దాంతో కొంత సేపటికి మహారాజులా తిరిగొచ్చి షాపులో ఉన్న ఆరు కార్లనూ కొనేశాడు జైసింగ్‌. భారత్‌కు వచ్చాక వాటన్నిటినీ నగరంలోని చెత్త తరలించడానికీ చీపుర్లు కట్టి, రోడ్లను వూడవడానికీ వాడమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ వార్త అమెరికా, ఇంగ్లండ్‌లకూ పాకడంతో రోల్స్‌రాయిస్‌ పేరు వినగానే ‘ఏదీ భారత్‌లో చెత్త తరలించడానికి వాడుతున్నారు... అదేనా...’ అనడం మొదలుపెట్టారు. ఆ దెబ్బతో ప్రపంచ నెంబర్‌ వన్‌ కార్ల ప్రతిష్ఠ బాగా దెబ్బతింది. అమ్మకాలూ తగ్గిపోయాయి. దాంతో రోల్స్‌రాయిస్‌ సంస్థ యజమానులు జై సింగ్‌ని క్షమాపణ కోరి, ఆ కార్లలో చెత్తను తరలించడం ఆపమని బతిమాలుకున్నారు. మరో ఆరు కొత్త కార్లను రాజుగారికి ఉచితంగా కూడా ఇచ్చారు. అలా వారికి బుద్ధి వచ్చిన తర్వాతే మహారాజు చెత్త తరలింపును ఆపాడట.

రాజుగారి కుక్కకు పెళ్లంట...
ఎనిమిది వందల పెంపుడు కుక్కలు ఉండేవంటేనే జునాగఢ్‌ మహారాజైన ‘నవాబ్‌ సర్‌ మహబత్‌ ఖాన్‌ రసూల్‌ ఖాన్‌’కి కుక్కలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆయన దగ్గరున్న ఒక్కో కుక్కకీ ఒక్కో గది, ఓ పనిమనిషితో పాటు ఫోనునూ కేటాయించేవాడు. వాటికోసం పాలరాతితో నిర్మించిన ఆసుపత్రితో పాటు, అందులో ఓ బ్రిటిష్‌ డాక్టర్‌ కూడా ఉండేవాడు. అంతేనా, తనకు ఎంతో ఇష్టమైన కుక్క రోషనారాకు మరో రాజుగారి కుక్క బాబీతో పెళ్లి చెయ్యాలనుకున్నాడు రసూల్‌ ఖాన్‌. మూడు రోజుల ఈ వేడుకకు ఎంతోమంది రాజులూ ప్రముఖులను ఆహ్వానించాడు. పెళ్లిరోజుని సెలవుగా ప్రకటించాడు. పెళ్లితంతు విషయానికొస్తే, వధూవరులైన కుక్కలకు ఒంటినిండా నగలూ వెండి పల్లకీలూ సైనిక వందనాలూ ఇలా ఎన్నో చేశారు. దీనికోసం అప్పట్లోనే రూ.20-30 లక్షలు ఖర్చుపెట్టాడట ఆ రాజు.

అతిపెద్ద వెండి బిందెలు

జైపూర్‌ మహారాజు ‘సవాయి మాధోసింగ్‌-2’కి 1901లో ఇంగ్లండ్‌ వెళ్లాల్సిన పనిపడింది. కానీ ఆయన వేరే దేశంలోని నీళ్లను తాగడానికి ఇష్టపడలేదు. దాంతో గంగా జలాన్ని తనతో తీసుకెళ్లేందుకు నల్లబడని పెద్ద వెండి గంగాళాలను తయారుచేయమని పురమాయించాడు. అలా స్వర్ణకారులు 14వేల వెండి నాణాలను కరిగించి 5.2 అడుగుల పొడవుతో నాలుగువేల లీటర్ల నీరు పట్టే రెండు గంగాళాలను తయారుచేశారు. ఇవి తర్వాతికాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వెండి బిందెలుగా గిన్నిస్‌ రికార్డుకెక్కాయి.

వడ్డించేందుకు వెండి రైలు
గ్వాలియర్‌ మహారాజైన జీవాజీరావ్‌ సింధియా ఆయన దర్పాన్ని ఇంకాస్త ప్రత్యేకంగా ప్రదర్శించాడు. పొడవుగా ఉన్న టేబుల్‌ మీద ఆ చివర్నుంచి ఈ చివరికి అతిథులకు చిటికెలో వంటకాలూ పానీయాల్ని చేరవెయ్యడానికి టేబుల్‌మీదే రైల్వేట్రాక్‌ ఏర్పాటు చేయించాడు. దీనిమీద చిన్న సైజు వెండి రైలును బటన్‌ సహాయంతో తిప్పేవారు. గూడ్స్‌ రైల్లాంటి దీన్లోనే రకరకాల పదార్థాలను ఉంచేవారు.

ఈ మంచం ఎంతో ప్రత్యేకం
బ్రిటిష్‌ ఇండియాలో భాగమైన బహావల్‌పూర్‌ని పాలించిన ‘సాదిఖ్‌ మొహమద్‌ ఖాన్‌ అబ్బాసి-4’ 1882లో ఆర్డరిచ్చి చేయించుకున్న ఈ మంచం ఆధునిక డిజైనర్లను సైతం అవాక్కయ్యేలా చేస్తుంది. 290 కిలోల వెండితో తాపడం చేసిన దీని నాలుగు మూలలా విదేశీ యువతులను పోలిన నగ్న శిల్పాలను ఏర్పాటు చేశారు. సహజమైన జుట్టుతో, మెరిసే మేని ఛాయతో, కళ్లను కదిలిస్తూ ఉండే ఈ బొమ్మల్ని చూస్తే నిజంగానే అక్కడ అమ్మాయిలున్నారని అనిపిస్తుంది. అంతేకాదు, బటన్‌ నొక్కగానే ఇవి చేతులు వూపుతూ వింజామరలతో విసురుతుంటాయి. ఆ సమయంలో మంచం అడుగు భాగంలో ఏర్పాటు చేసిన మ్యూజిక్‌బాక్స్‌ ద్వారా సంగీతం కూడా వినిపించడం విశేషం.


న శరీరం ఓ నడిచే నీటి కుండ. అందులో 60 శాతానికి పైగా నీరే మరి. అందుకే మన శరీరానికి నీరు ఎంతో ముఖ్యం. శరీరంలోని మలినాలను కడిగేసి మంచి ఆరోగ్యాన్నిచ్చే నీళ్లు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇక, నీటిని బాటిళ్లలో అమ్మడమూ ఎప్పటి నుంచో తెలిసిందే. అయితే అలా బాటిళ్లలో అమ్మే నీటిని ‘ఎన్‌హాన్స్‌డ్‌ వాటర్‌’ పేరిట సరికొత్తగా మార్కెట్లోకి తెస్తున్నారు. ఒంట్లోని శక్తిస్థాయుల్ని పెంచేందుకు ఈ ఎన్‌హాన్స్‌డ్‌ వాటర్‌ పనిచేస్తాయన్నమాట. ఇటు దాహం తీరడంతో పాటూ అటు మనం కావాలనుకున్న ప్రొటీన్లూ, విటమిన్లూ కూడా శరీరానికి అందుతాయి. అంతేకాదు వివిధ పండ్ల ఫ్లేవర్లలోనూ ఈ నీరు అందుబాటులోకి వస్తోంది.