close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మువ్వన్నెల సోయగం!

జాతీయ జెండాని దుస్తుల రూపంలో ధరించకూడదు. కావాలని నేలమీద వేయకూడదు, వాహనాలమీద కప్పకూడదు... ఇలా చాలానే నిబంధనలు ఉన్నాయి. అందుకే జాతి కీర్తిని చాటే పతాక గౌరవానికి ఎలాంటి విఘాతం కలిగించకుండా ఆ జెండా రంగుల్నే ఫ్యాషన్‌ డిజైన్లుగా మార్చుకుని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాన్ని చేసుకుంటున్నారు ఈతరం ఫ్యాషనిస్టులు. తమ డ్రెస్సుల్లో యాక్సెసరీల్లో నగల్లో వస్తువుల్లో అంతటా ఆ మువ్వన్నెల్ని నింపుకుని తమదైన పంథాలో దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. దాంతో అనేక కంపెనీలు కూడా తాము ఉత్పత్తి చేసే వస్తువులకు ఆ రంగుల్ని జోడిస్తూ మేము సైతం అంటున్నాయి. 70వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా ఫ్రెడరిక్‌ కాన్‌స్టంట్‌... లాంటి బ్రాండెడ్‌ కంపెనీలు సైతం మువ్వన్నెల స్ట్రాప్‌లతో వాచీలను విడుదల చేయడమూ ఇందులో భాగమే మరి.

తిరంగ సౌందర్యం..!
జెండాలోని రంగులతోనే జాతీయ పండగ ఎందుకూ అనిపించడం సహజం. కానీ ఆ రంగుల్లో ఓ అందం ఉంది. ఆకర్షణ ఉంది. అంతకుమించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి. జాతీయపతాకంలోని పై పట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగనిరతినీ ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే, మధ్యలోని తెలుపు స్వచ్ఛతనీ శాంతినీ నిజాయతీనీ చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతనీ ప్రకృతినీ పాడిపంటల్నీ సంపదనీ సూచిస్తే, మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుంది.

ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం ప్రకటించాక 15 ఉదయం గవర్నర్‌ హౌస్‌మీదా, 16 ఉదయం ఎర్రకోటమీదా భరతజాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వన్నెల పతాకం... నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, జండా వూంఛా రహే హమారా’ అంటూ ఆనందంగా జెండాను ఎగరేసి వందనం చేయడంతోనే సరిపెట్టకుండా అందులోని త్రివర్ణాల్ని వినూత్న డిజైన్లలో ధరిస్తూ జాతీయపండగ జరుపుకుంటున్నారు.

మూడే వర్ణాలు... ఎన్నెన్నో అందాలు..!
నిజానికి మొన్నమొన్నటివరకూ చాలామంది జాతీయ పర్వదినాలకు తెలుపురంగు ఖాదీ లేదా చేనేత దుస్తుల్ని ధరించడం ద్వారా మాత్రమే తమ దేశభక్తిని చాటుకునేవారు. కానీ ఇప్పుడు వాటికి తిరంగ సౌందర్యాన్నీ జోడిస్తున్నారు. అయినా దేశభక్తిని చాటుకునేందుకు ఆ రంగుల్ని వాడాల్సిన అవసరం ఉందా అనే సంప్రదాయవాదులు లేకపోలేదు. నిజమే, కానీ ఆ రంగుల్ని చూస్తేనే ఒకలాంటి ఆనందం కలుగుతుంది. దేశభక్తి ఉప్పొంగుతుంది. అందుకే ఈతరం కేవలం జెండా వందనంతోనే దేశంపట్ల తమ ప్రేమను సరిపెట్టుకోవడం లేదు. అందులోని రంగుల్ని ఒంటికి హత్తుకోవడం ద్వారానూ వాటిని ఆస్వాదించడం ద్వారానూ మాతృభూమిపట్ల తమ మమకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కొందరు డిజైనర్లు స్వాతంత్య్రదినోత్సవాన్ని థీమ్‌గా చేసుకుని దుస్తుల్ని రూపొందిస్తున్నారు. ఆ రంగులతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని సెలెబ్రిటీలూ ఎంతో ఇష్టంగా ధరిస్తూ ఆనందంగా జాతీయ పండగను జరుపుకుంటున్నారు. దాంతో సాధారణ ప్రజలు సైతం ఆ రంగులమీద మనసు పారేసుకుంటున్నారు. అచ్చంగా ఆ మూడు రంగుల్లో ఉన్నవి మార్కెట్లో దొరకకపోతే తామే స్వయంగా డిజైన్‌ చేసుకునేవాళ్లూ ఉన్నారు. విడివిడి రంగుల్లో చుడీదార్‌, కమీజ్‌, చున్నీలు వేసుకోవడమూ లేదా చున్నీని ఆ మూడు రంగుల్లో డై చేయించుకోవడమూ, ఆ మూడు రంగులకూ దగ్గరగా ఉండే లెహరియా చీరలు ఎంపికచేసుకోవడమూ, టీషర్టులమీద ఆ రంగుల్ని పెయింటు చేసుకోవడమూ లేదంటే బల్కీగా ముద్రణకి ఇవ్వడమూ చేస్తున్నారు. అంతేనా... ఆ రంగుల్లోని బ్యాగులూ ఫోనుకవర్లూ కీఛెయిన్లూ వంటి వాటిని ఉపయోగిస్తూ సంప్రదాయ పండగల రీతిలోనే ఎంతో ఆడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది నేటి యువత. వాళ్ల మనసెరిగిన ఆయా కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో ఆ మువ్వన్నెల్ని అద్దుతున్నాయి. కేవలం దుస్తులూ యాక్సెసరీల్లోనే కాదు, ఆయా రంగుల్లో అలంకారాలూ చేసుకుంటున్నారు. నెయిల్‌ పాలిష్‌లూ వేస్తున్నారు. బిందీలూ పెడుతున్నారు. నగల్లో కూడా ఆ రంగుల్ని మేళవిస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లయితే కాషాయమూ తెలుపూ ఆకుపచ్చా రంగుల పూసలూ రత్నాలతో చెవిపోగులూ బ్రేస్‌లెట్లూ లాకెట్లూ నెక్లెస్‌లూ గాజులూ ప్రత్యేకంగా తయారుచేసి మరీ విక్రయిస్తున్నాయి. వాటిమీద ఆఫర్లూ ప్రకటిస్తున్నాయి. దుస్తులూ నగలూ వస్తువుల్లోనే ఆ రంగులు అంతగా ఆకట్టుకుంటుంటే, తినే ఆహారపదార్థాల్లోనూ ఆ మువ్వన్నెల్ని చొప్పిస్తే నోరూరించకుండా ఉంటాయా... అందుకే మెట్రో నగరాల్లోని కొన్ని రెస్టారెంట్లలో మూడు రంగుల్నీ చొప్పించిన ఐస్‌క్రీములూ కుల్ఫీలూ హల్వాలూ వూతప్పాలూ డోక్లాలూ ఇడ్లీలూ ఇలా రకరకాల పదార్థాలను తయారుచేస్తున్నారు. వీటికి తామూ సై అంటున్నారు నేటితరం గృహిణులు.

చూశారుగా మరి... మనదైన జాతీయ పండగని ఆనందంగా చేసుకోవాలన్న మనసుండాలేగానీ అందుకు ఎన్నెన్నో మార్గాలూ... అన్నింటా మువ్వన్నెల సోయగాలూ... జాతి సమైక్యతను చాటేలా... దేశభక్తిని ప్రతిబింబించేలా..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.