close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ గోపురం... మూడు మతాల చిహ్నం!

ఆ గోపురం... మూడు మతాల చిహ్నం!

సబ్‌కా మాలిక్‌ ఏక్‌... షిరిడీ సాయిబాబా చెప్పే విలువైన సూత్రం. మానవత్వమే మనుషుల మతంగా ఉండాలన్న బాబా... ఏసు, అల్లా, రాముడు అంతా ఒక్కరేనన్న ఐక్యభావనను బోధించారు. ఆయన మాటల గుర్తుగా, మూడుమతాల చిహ్నంగా దర్శనమిస్తుంది చిత్తూరుజిల్లా కట్టమంచిలోని సాయి ఆలయం.

ప్రతి ఆలయానికీ ఒక రూపురేఖ ఉంటుంది. ఎవరి మతాచారాల ప్రకారం వారి దేవతల ఆలయాలు నిర్మించుకుంటారు. అక్కడే వారి మతపరమైన క్రతువులు నిర్వహిస్తుంటారు. కానీ, చిత్తూరులోని కట్టమంచిలో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. హిందువులు ఎక్కువగా కొలిచే బాబా ఆలయానికి సంబంధించిన గోపురం మీద ఓ పక్క మేరీమాత, క్రీస్తు, శిలువలతో కూడిన చర్చి పైభాగం ఉంటే, మధ్యలో హిందూ దేవాలయాల గోపురం, దాని పక్కనే చంద్రవంకతో కూడి ఆకుపచ్చ రంగు వేసిన మసీదు పైకప్పు తరహా నిర్మాణం ఉంటాయి. రాష్ట్రంలోనే అరుదైన రీతిలో నిర్మించిన ఈ ఆలయం సర్వమత శాంతికే కాదు మానవ సేవకూ పాదుకొల్పుతోంది.

చరిత్ర చెక్కారు...
వినూత్న రీతిలో నిర్మించిన ఈ మందిర దర్శనమే ఓ దివ్యానుభూతి. ఇక విశాలంగా ఉండే లోపలి ఆవరణ అణువణువూ ఆధ్యాత్మిక భావనను నింపుతుంది. గుడిలోపలికి అడుగుపెట్టగానే సాయిబాబా షిరిడీ గ్రామానికి వచ్చింది మొదలు, ఆయన చెట్టు కింద నివసించడం, మహల్సాపతి మసీదుకు పిలువడం, అక్కడే ఆయన బస చేయడం, భిక్షాటన చేయడం, కలరా మహమ్మారిని పారదోలడం, తన భక్తులకు వివిధ మతాల దేవతల రూపాల్లో దర్శనం ఇవ్వడం ఇలా బాబా నిర్యాణం చెందే వరకూ సాయి చరిత్రకు సంబంధించిన వివిధ ఘట్టాలను చూడచక్కని బొమ్మల రూపంలో చెక్కారిక్కడ. ఒక్కో ఘట్టానికి సంబంధించిన వివరణ ఆ దృశ్యం కింద తెలుగులో రాసి ఉంటుంది. 1989లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో ఆలయ ప్రతిష్ఠ జరిగింది. 2006లో ద్వారకామాయి ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. మందిరంలోని పూజలూ విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ మూడు మతాలకు సంబంధించిన వేడుకలూ నిర్వహిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో వాహన సేవలు బాబాకు నిర్వహిస్తారు. రోజూ షిరిడీ తరహాలో ఉదయం కాగడా హారతితో పూజలు మొదలవుతాయి. పంచామృతాభిషేకం, హారతులు, భజన, పల్లకీసేవ, రాత్రి 9 గంటలకు షేజా (పవళింపుసేవ)తో అర్చనలు పూర్తవుతాయి. క్రైస్తవుల పండగ క్రిస్‌మస్‌ రోజున బాబాను క్రిస్‌మస్‌తాత వేషధారణలో అలంకరిస్తారు. క్రీస్తు జన్మదిన పర్వాన్ని కూడా నిర్వహిస్తారు. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌ నెలలో బాబా విగ్రహాన్ని ముస్లిం మతాచారం ప్రకారం వస్త్రధారణ చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. గురుపౌర్ణమి రోజున 116 ద్రవ్యాలతో భక్తులే బాబాకు అభిషేకం చేస్తారు. శ్రీరామనవమి, దసరా నవరాత్రుల్లో ఆయా దేవతలనూ ఆవాహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దత్త జయంతి రోజున బాబా భక్తులు చిత్తూరు నగరంలో భిక్షాటన చేసి, మహా అన్నదానాన్ని నిర్వహిస్తుంటారు. ఆ రోజు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదం అందిస్తున్నారు. బాబా సమాధిలోకి వెళ్లిన రోజైన అక్టోబరు 15ని పురస్కరించుకుని భక్తులే బాబాకి పాలాభిషేకం చేస్తారిక్కడ. ప్రతి నెలా దాదాపు 20 వేల మంది ఈ మందిరాన్ని సందర్శిస్తుంటారు.

సేవా నిరతి
మానవ సేవే... మాధవ సేవ అని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి. దేవుడిని ఏ రూపంలో కొలిచినా పరోపకారిగా ఉండాలని పురాణ ఇతిహాసాలూ, ధర్మశాస్త్రాలూ, మత గ్రంథాలూ ప్రబోధిస్తున్నాయి. అందుకే భక్తి భావంతో పాటూ సేవా దృక్పథాన్నీ పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏర్పడ్డదే శ్రీషిర్డీ విశ్వసాయిబాబా ఛారిటబుల్‌ ట్రస్టు. దేవాలయానికి వచ్చే భక్తుల సహకారంతో ఈ ట్రస్టు చిత్తూరు జిల్లాలో కులమతాలకతీతంగా ఎన్నో సేవాకార్యక్రమాలను చేపడుతోంది. ఏళ్ల తరబడి దప్పికతో అల్లాడిన చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు, భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ట్రస్టు ద్వారా 13 మినరల్‌ వాటర్‌ప్లాంట్లను నిర్మించి నగర పాలకసంస్థకు అప్పగించారు. ట్రస్టు ఆధ్వర్యంలో చిత్తూరు చుట్టుపక్కల ఉన్న 25 పాఠశాలలకు ఏటా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే 30 వేల నోటు పుస్తకాలను పంపిణీకోసం కొనుగోలు చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థి బృందాలకు క్రీడా పరికరాలను అందజేస్తున్నారు. అంతేకాదు, విద్యార్థులలో సత్ప్రవర్తన పెంచడానికి వ్యక్తిత్వ వికాస తరగతులూ, జ్ఞాపకశక్తిని పెంచే శిక్షణా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. చిత్తూరు చుట్టుపక్కల మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే బాబా బోధనలు కార్యరూపం దాల్చి కనిపిస్తాయీ దేవాలయంలో.

- శ్యాంసుందర్‌ పాణిగ్రహి,
ఈనాడు, తిరుపతి,
ఫొటోలు: రాజా రమేష్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.