close
ఉషోదయం

ఉషోదయం
- గంటి ఉషాబాల

కాశం దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ‘త్వరగా కూరలు కొనుక్కుని ఇంటికి బయలుదేరాలి. వాన మొదలైందంటే వెళ్ళడం కష్టం’ అనుకుంటూ బెండకాయలు ఏరుతున్నాను.
‘‘మీకాడ వంద సిల్లరుంటే ఇయ్యండమ్మా. ఆ అయ్యకాడ లేవంట’’ కూరలమ్మి మాటలకి ఏదో ఆలోచిస్తూ కూరలు ఏరుతున్న నేను ఉలిక్కిపడి పైకి చూశాను.
‘‘హండ్రెడ్‌ రూపీస్‌ ఛేంజ్‌ ఉందా మేడమ్‌’’ చేతిలో వంద నోటుతో మర్యాదగా అడిగాడు అతను.
‘‘ఒక్క నిమిషం’’ అని పర్సు తీయబోతూ, ఒక్కసారి అతని ముఖంలోకి చూశాను.

ఏదో ఉలికిపాటు. ఇతను... ఎవరూ... ఆలోచిస్తూ రాయిలా బిగుసుకుపోయాను. ఒక్కసారిగా ఆకాశంలో పెద్దపెద్ద ఉరుములు. నాలో పిడుగులు. ఇరవై ఏళ్ళనాటి జ్ఞాపకం. కాదు... పీడకల. నా జీవితం ఇలా పొగచూరిపోవడానికి కారణమైనవాడు. అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మంట. ఎవరి ముఖమైతే జీవితంలో ఎప్పటికీ చూడకూడదూ అనుకుందో, ఎవరి పేరైతే కలలో కూడా తలచుకోకూడదనుకుందో... ఆ వ్యక్తి నిలువెత్తు ఆకారం తన ముందు. నా దవడ ఎముక బిగుసుకుంటోంది. కోపంతో వంట్లోంచి వేడి ఆవిర్లు బయటకొస్తున్నాయి. చిల్లర తీద్దామని తీసిన పర్సు జిప్పును సర్రున లాగి ఏరిన కూరల కవరు అక్కడే వదిలేసి స్కూటీ వైపు గబగబా అడుగులేశాను. అతను కూడా నన్ను గుర్తుపట్టాడేమో- ఆశ్చర్యంగా, అయోమయంగా చూస్తూ ‘‘లలితా’’ అని గొణిగినట్టనిపించింది... అన్నాడో లేక నాకలా అనిపించిందో మరి.

‘‘ఓయమ్మో, సిల్లరడిగితే అంత కోపమేందమ్మో, ఇడ్డూరం కాకపోతే’’ అంటూ కూరలమ్మే యాదమ్మ సణుగుడు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది.
విసురుగా బండి స్టార్ట్‌ చేసి ఇంటికొచ్చిపడ్డాను. ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్ళ బాటిల్‌ తీసుకుని గటగట తాగేశాను. ఆయాసంతో వగరుస్తున్నాను. బయట వర్షం మొదలైంది. పెద్దపెద్ద మెరుపులు. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం. టప్పున కరెంటు పోయింది. నా గుండె చప్పుడు నాకే భయంకరంగా వినిపిస్తోంది. అంత వర్షంలోనూ నా ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. గజిబిజి ఆలోచనలతో మెదడు మొద్దుబారిపోతోంది. జీవితాన్నివ్వలేకపోయిన జ్ఞాపకాన్ని ఇప్పుడిప్పుడే మరుగునపడేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హఠాత్తుగా ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడు? నాకెలా ఎదురుపడ్డాడు? వయసు తెచ్చిన చిన్నచిన్న మార్పులు తప్ప గుర్తుపట్టలేనంత మారిన మనిషి కాడు. అతను కచ్చితంగా మురళే. చుట్టూ దట్టమైన చీకటి. కొవ్వొత్తి కూడా వెలిగించుకునే ఓపిక లేక అలాగే పక్కమీద వాలిపోయాను. ఏమీ తినాలని లేదు. నిద్ర కంటికొలకులను దాటి రానంటోంది. దశాబ్దాలనాటి జ్ఞాపకాలు కందిరీగల్లా రొదపెడుతున్నాయి.

* * *

అదొక రైల్వే జంక్షన్‌ ఉన్న వూరు. అక్కడ ఎక్కువగా రైల్వేలో ఉద్యోగాలు చేసేవారే. అందరికీ కోడికూతతో తెల్లారితే మాకు మాత్రం రైలు కూతతో తెల్లారేది. మా నాన్నగారూ, మురళీ వాళ్ళ నాన్నగారూ అక్కడే పనిచేసేవారు. తెల్లారిందంటే రైలుపట్టాల వెంటే మా ఆటలు. రైల్వే బళ్ళొనే మా చదువు. అలా పక్కపక్క రైల్వే క్వార్టర్లలో ఉండే మా రెండు కుటుంబాల అనుబంధం బాగా పెనవేసుకుపోయింది. తెల్లారినప్పటి నుండి పొద్దుగుంకే వరకూ ఒకళ్ళ ఇళ్ళలో ఒకళ్ళమన్నట్టుండేవాళ్ళం. అమ్మా, శారదత్తయ్యా (మురళీ వాళ్ళ అమ్మ) ఎంతో స్నేహంగా ఉండేవారు. వీళ్ళ స్నేహం చూసి చుట్టుపక్కలవాళ్ళు అసూయపడేవారు. అలాగే నాన్నా, భాస్కరం మామయ్యా కూడా అలాగే ఉండేవారు. కష్టాలూ సుఖాలూ కలిసి పంచుకునేవారు. ఇక పిల్లలమైతే సరేసరి. మాటవరసకైనా కొట్టుకుని ఎరగం. ప్రాణంలో ప్రాణంగా మెలిగేవాళ్ళం. మా ఇంట్లో నేనూ, చెల్లీ ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో మురళితోపాటు వాళ్ళ అన్నయ్య శ్రీను, చెల్లెలు మీనా ఉండేవారు. సాయంత్రమైతే చాలు స్టేషన్‌ వెనుక ఉన్న పున్నాగ చెట్లుకిందే మా మకాం.

‘చీకటి పడుతోందర్రా... పురుగూ పుట్రా ఉంటాయి’ అంటూ మురళీ వాళ్ళ నాన్నమ్మ తెచ్చిన లాంతరు వెలుతురులో ఇంటికి చేరేవాళ్ళం. వేసవి వచ్చిందంటే శారదత్తయ్య పెద్ద పళ్ళెం నిండా కొత్తావకాయ అన్నం కలిపి ముద్దలు తినిపించేది. ఆ రుచి అమృతాన్ని తలపించేది. ఇక మురళి అయితే ఎప్పుడూ నా వెనకే ఉండేవాడు. నాకు జామకాయలంటే ఇష్టమని ఓసారి చెట్టెక్కి నాకోసం కాయలు కోయబోయి కొమ్మమీంచి కిందపడి చెయ్యి విరగొట్టుక్కున్నాడు. అంత బాధలోనూ ‘నీకు కాయ కోసివ్వలేకపోయానే’ అని దిగులుపడ్డాడు. అలా అలా అందమైన బాల్యం నుంచి- అంటే హైస్కూలు నుంచి- కాలేజీలోకి అడుగుపెట్టాను. నాకంటే రెండేళ్ళ ముందే కాలేజీలో అడుగుపెట్టినవాడు కాబట్టి మురళి నా ప్రతి అడుగులోనూ నాకు అండదండగా ఉండేవాడు. రైలుపట్టాల వెంటే చెట్టాపట్టాలేసుకుని కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఏదో తెలియని ఆకర్షణ నాకూ మురళీకీ మధ్య ఏర్పడింది.

మా సంగతి ఇంట్లోవాళ్ళకి చూచాయగా తెలిసినా చూసీచూడనట్లుండేవారు. పొరపొచ్చాలులేని కుటుంబాలూ, కలిసిన మనసులూ మా వివాహానికి మార్గం సుగమం చేశాయి. ఓ శుభ ముహుర్తంలో నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నారు. ఇక ముహుర్తాలు పెట్టుకోవటమే తరువాయి. మేమిద్దరం తిరగని చెట్టూపుట్టా లేదు. చూడని సినిమా లేదు. ఇలా ఆనంద తరంగాల్లో తేలిపోతున్న తరుణంలో హఠాత్తుగా ఒక కుదుపు... మురళీవాళ్ళ నానమ్మ మరణం రూపంలో. సంవత్సరీకమయ్యే వరకూ మా పెళ్ళి వాయిదా పడింది. సరేలే నిరీక్షిద్దామనుకుంటున్న సమయంలోనే మరొక పిడుగు... నా చెల్లెలు నా పెళ్ళి అయ్యేవరకూ ఆగలేక ఇంట్లో ఎలాగూ ఒప్పుకోరని తనకు నచ్చినవాడితో తనదారి తాను చూసుకుంది. ఈ సంఘటన అమ్మానాన్నలను కోలుకోలేనంత దెబ్బతీసింది. అది మొదలు ఆదర్శ కుటుంబాలుగా అందరూ అనుకునే మామధ్య ఒక దళసరి గాజుతెర.

‘ముఖాలు కనిపిస్తాయిగానీ మాటలు వినిపించవు. మనుషులు కనిపిస్తారుగానీ మనసులు మాట్లాడవు.’

మురళి కూడా నన్ను తప్పించుకుని తిరగడం మొదలుపెట్టినట్లనిపించింది. ఈ మౌనాన్ని చేధించడానికే అన్నట్టు అమ్మా నాన్నా ఓరోజు వాళ్ళింటికి వెళ్ళారు. వాళ్ళెవరూ వీళ్ళని కనీసం పలకరించలేదట. ఇక ఉండబట్టలేక నాన్నే చనువుగా భాస్కరం మామయ్యతో ‘‘అది చేసిన తప్పుకి మా అందరికీ ఏవిట్రా ఈ శిక్ష’’ అని అడిగారట.

ఆ మాటకి అంతెత్తున లేచాడటాయన. ‘‘నాకింకా పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఇలాంటి కుటుంబంలోని పిల్లని చేసుకుంటే దాన్నెవడు చేసుకుంటాడు? దయచేసి మా సంబంధం విషయం మర్చిపోండి’’ అంటూ కటువుగా చెప్పి ముఖం మీదే తలుపేశాడట. ఈ విషయాలేవీ అమ్మా నాన్నా నా దగ్గర ప్రస్తావించలేదు- నేను బాధపడతానని. మా ఇంటి పనిమనిషి గౌరమ్మ చెప్పింది.

మరోరోజు మళ్ళీ నాన్నే వాళ్ళింటికి వెళ్ళారు. ‘‘దాని ముఖం చూసైనా కాదనకురా’’ అని మామయ్యని బతిమాలారు. అక్కడే ఉన్న మురళితో ‘బాబూ, ఇది న్యాయమా... నువ్వైనా ఆలోచించు’ అని అడిగేంతలోపే-

‘‘వాడితో నీకు మాటలేంటి? ‘శిరసుండగా మోకాలు పూజలన్నట్టు’- పెద్దముండావాడిని నేనున్నాను. మాట్లాడాలంటే నాతో చెప్పు. ఈ విషయంలో వాడికేం సంబంధం లేదు’’ అంటూ మండిపడ్డాడట.

ఆ మాటలకి నాన్నకీ రోషమొచ్చింది. ‘‘నా కూతుర్ని ప్రేమించి వూరంతా తిరిగినప్పుడు నీ శిరస్సు ఏం చేస్తోంది, నిద్రలో జోగుతోందా? అప్పుడేమైంది నీ పెద్దరికం. ఒకరు చేసిన తప్పుకు మరొకరికి శిక్ష వేయడం ఎంతవరకు న్యాయం?’’ అంటూ గట్టిగా వాదనకి దిగేసరికి అమ్మ భయపడి నాన్నని ఇంట్లోకి లాక్కొచ్చింది.

ఆయాసపడుతూ కుర్చీలో కూలబడ్డ నాన్నతో ‘‘ఎందుకు నాన్నా, కాదు పొమ్మంటున్నా చూరుపట్టుకు వేళ్ళాడ్డం. పెళ్ళొకటేనా జీవిత పరమార్థం. మీరు కొంచెం శాంతపడండి’’ అంటూ గుండెల్లో సముద్రాలు పొంగుతున్నా నాన్నకి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాను.

‘‘వాడు నన్నేమన్నా తట్టుకునేవాడినమ్మా, కానీ నిప్పులాంటి నిన్ను ఏమన్నాడో తెలుసా... దానిలాగే ఇదీ ఎక్కడో అక్కడ సర్దుకుంటుందిలే అన్నాడమ్మా’’ అని నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, ఆ క్షణం నాలో ఎగసిన మంటను ఆర్పడానికి సాక్షాత్తూ వరుణదేవుడికి కూడా సాధ్యం కాకపోయేదేమో.

మరికొన్ని రోజులకే వూరు నిద్ర లేవకముందే మేం ముగ్గురం రైలెక్కి తూర్పును వెదుక్కుంటూ దూరంగా వెళ్ళిపోయాం.

* * *

ఎండ కళ్ళమీద పడుతుంటే గమ్మున తెలివొచ్చింది. రాత్రి ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. మెల్లగా లేచి ముఖం కడుక్కుని కాఫీ కలుపుకోవడం కోసం స్టౌ వెలిగించాను. కాలింగ్‌బెల్‌ మోగింది. ‘ఇంత ఉదయాన్నే ఎవరు?’ అనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మురళి. ముఖంమీదే తలుపు వెయ్యడం నాకు తెలియని సంస్కారం గాబట్టి ‘‘ఇక్కడికెందుకొచ్చావ్‌’’ అన్నాను తీక్షణంగా చూస్తూ.

‘‘నీతో చిన్న విషయం మాట్లాడాలి, ఒక్క నిమిషం టైమిస్తావా?’’ అన్నాడు మార్దవం ఉట్టిపడుతున్న స్వరంతో.

‘‘నా దగ్గర ఒక్క సెకను కూడా సమయం లేదు. నేను చెవిటిదాన్నై చాలా రోజులైంది. దయచేసి వెళ్ళిపో’’ అంటూ రెండు చేతులూ జోడించాను.

‘‘ప్లీజ్‌ లలితా, నాకో సాయం కావాలి’’ అభ్యర్థనగా అడుగుతున్నాడతను.

మా ఇద్దరినీ మార్చిమార్చి ఆశ్చర్యంగా చూస్తోంది అక్కడే ఇల్లు వూడుస్తున్న పనిపిల్ల. మరింక తప్పదన్నట్టు గుమ్మానికి అడ్డు తప్పుకున్నాను- లోపలికి రమ్మనట్టుగా. మెల్లగా లోపలికొచ్చి కూర్చున్నాడు. నేనలాగే నిలబడ్డాను.

‘‘నేనీ వూరు వారంక్రితమే ట్రాన్స్‌ఫరై వచ్చాను. అనుకోకుండా నిన్న కనబడ్డావ్‌. ఈ వీధిలోనే నేనూ ఉంటున్నాను.’’

‘అయితే ఏమిటట?’ అన్నట్టు చూశాను.

‘‘నేను గత విషయాల గురించి మాట్లాడటానికో నా తరఫున ఇన్నేళ్ళ తరవాత సంజాయిషీ ఇవ్వడానికో రాలేదు. దానికి నాకు అర్హతగానీ అవకాశంగానీ లేదని నాకు తెలుసు. చేజారిన బతుకుని అతకలేమనీ తెలుసు.’’

‘‘ఈ ప్రవచనాలన్నీ నాకెందుకు? నాకు చాలా పనులున్నాయి. విషయమేమిటో త్వరగా చెప్పు’’ అన్నాను చిరాగ్గా.

‘‘నేనిక్కడ జాయిన్‌ అయిన తరవాత వారంరోజులు ట్రైనింగ్‌ కోసం ‘పూణె’ వెళ్ళవలసి వస్తోంది. తప్పించుకోలేని ప్రయాణం. ఇక్కడ నాకెవరూ తెలీదు. నా కూతురు ఒక్కతే ఉంటుంది. దానికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. కాస్త అప్పుడప్పుడూ చూసి వస్తావని తప్పని పరిస్థితులలో ఆడపిల్ల కోసం నీ సహాయం అడుగుతున్నాను- అదీ మీ ఇంట్లోవాళ్ళ అనుమతితోనే సుమా’’ మాటలు మెల్లిగా నాన్చుతూ చెప్పాడు.

నా ముందున్న ఖాళీ కుర్చీని దఢాలున తోసి నిలబడ్డాను. ‘‘అంటే, ఈవారం రోజులూ నీ కూతురికి ఆయాగా రమ్మంటావా? నేనేమన్నా ఛారిటీ హోం నడుపుతున్నానుకున్నావా. నీ సంతానాన్ని చూసుకోవడానికి నీవాళ్ళని రప్పించుకో. నాలో జాలీ, దయా ఇలాంటి సున్నిత భావాలన్నీ ఎప్పుడో చచ్చిపోయాయి. ఇలాంటి వంకలతో మళ్ళీ ఎప్పుడూ నా గుమ్మం తొక్కకు. ప్లీజ్‌ గెటవుట్‌’’ అంటూ బయటికి చెయ్యి చూపించాను.

మౌనంగా లేచి వెళ్ళిపోయాడతను. విసురుగా వీధి తలుపేసి అక్కడే సోఫాలో వాలిపోయాను. ఎక్కడినుండి వస్తోందో అతని మీద కోపం ఆనకట్ట వెయ్యలేనంత దుఃఖంగా మారుతోంది.

నాలుగు రోజుల తరవాత స్కూటీ టైర్‌ పంక్చర్‌ అయితే తోసుకుంటూ వస్తున్నాను. ‘ఇల్లు దగ్గరే కదా, ఇంటికెళ్ళాక మెకానిక్‌ని పిలవచ్చులే’ అనుకుంటూ.

ఇంతలో ‘‘లలితా, లలితా’’ అంటూ గట్టిగా ఎవరో పిలుస్తున్నట్లనిపించడంతో వెనక్కి తిరిగి చూశాను - ఓ ఇంటి గుమ్మంలో నిలబడిన ఓ ముసలావిడ.

‘‘ఎవరండీ’’ అంటూ దగ్గరికెళ్ళాను.

దాదాపు డెబ్భై ఏళ్ళు దాటిన వయసు, కళ్ళలో ఏదో తెలీని దైన్యం, ముతకనేత చీర, పరిశీలనగా చూస్తే ఆవిడెవరో అర్థమైంది... శారదత్తయ్య. ఎందుకో ఒక్క క్షణం వెనుక్కు వెళ్ళిపోదామనిపించింది. ఇంతలోనే ఆవిడ లోపలికెళ్ళి మంచినీళ్ళు తెస్తూ, ‘‘రా అమ్మా, కూర్చో’’ అంది కాస్త తటపటాయిస్తూనే.

నా కోపం, అసహనం ఆవిడ మీద చూపించడం భావ్యం కాదని ఇబ్బందిగానే అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను.

‘‘బావున్నావా లలితా’’ మాటలు కూడబలుక్కుంటూ అడిగిందావిడ.

‘‘హు బాగు’’ అన్నాను కసిగా.

‘‘నువ్విక్కడే ఉన్నావని మురళి చెప్పాడు. వాడిక్కడికి రాగానే ట్రైనింగ్‌కి వెళ్ళాల్సి వచ్చిందటమ్మా. పిల్ల కోసం వచ్చాను. దానికి రెండు రోజుల నుంచీ ఒళ్ళు తెలీని జ్వరం. డాక్టరు టైఫాయిడ్‌ అని చెప్పారు. పనిపిల్ల సాయంతో ఉన్నాను.’’

‘‘నాకెవరి గురించీ తెలుసుకోవాలని లేదు’’ అన్నాను నిర్లిప్తంగా.

‘‘నీకు లేకపోయినా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది లలితా. వూళ్ళొ ఆయనొక్కరే ఉన్నారమ్మా. ఆరోగ్యం బావుండటం లేదు. అన్నీ మంచం మీదే. ఎవరి కర్మలను ఎవరు తప్పించగలరు చెప్పు. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత. అది సరేగానీ, అమ్మా నాన్నా ఎలా ఉన్నారు?’’ అడిగిందావిడ.

‘‘ఏదో మీ అందరి దయవల్ల వాళ్ళు ఒకళ్ళ తరవాత ఒకళ్ళు నన్ను ఒంటరిని చేసి పోయి పదేళ్ళవుతోంది’’ అన్నాను బాధగా.

‘‘అయ్యో’’ అని ఆవిడ ఏదో అనేంతలో లోపలి నుంచి ‘‘నాన్నమ్మా’’ అని పిలుపు వినబడింది. ‘‘ఒక్క నిమిషం’’ అంటూ లోపలికెళ్ళినావిడ అయిదు నిమిషాల తరవాత బయటికి వచ్చింది. నేనిక వెడతానన్నట్టు లేవబోయాను. కూర్చోమన్నట్టు చెయ్యిపట్టి ఆపింది. తప్పక మళ్ళీ కూర్చున్నాను.

‘‘నీకెంతమంది పిల్లలు? ఏం చదువుతున్నారు?’’ కాస్త ఆరాగా అడిగిందావిడ. నేనేమీ మాట్లాడకపోయేసరికి ‘‘మీ ఆయనేం చేస్తుంటారు?’’ అంది నన్ను పరిశీలనగా చూస్తూ.

‘ఏమిటీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌’ అనుకుంటూ ‘‘నేను పెళ్ళి చేసుకోలేదు. ఒంటరిగానే బతుకుతున్నాను’’ అన్నాను.

ఆవిడ ముఖంలో నేను చదవలేని భావాలు. ఉన్నట్టుండి ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడలా ఏడుస్తుంటే నాకిబ్బందిగా అనిపించింది. అలాని మునపటిలా చనువుగా ఓదార్చలేకపోతున్నాను.

‘‘ఒక మనిషి రాతి నిర్ణయం ఇందరి జీవితాల్ని శాసించిందమ్మా... అనుభవిస్తున్నాం’’ అంది వెక్కిళ్ళమధ్య.

‘‘మీకేమైందత్తయ్యా. నా జీవితం కదా బుగ్గిపాలయింది. తనకేం హాయిగా పెళ్ళి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు’’ అన్నాడు ఆక్రోశంగా.

ఆవిడ చురుగ్గా చూసింది.

‘‘హు పెళ్ళి. నీతో కుదిరిన పెళ్ళి పెటాకులయ్యాక వాడు మళ్ళీ పెళ్ళి మాట ఎత్తలేదంటే నమ్ముతావా? ఒకరి తప్పుకు మరొకరు శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆయనకి అప్పుడు ఏం మహమ్మారి పూనిందోగానీ దానికి మీరిద్దరూ బలయ్యారన్నమాట’’ ఆవిడ కొంగు అడ్డుపెట్టుకుని బావురుమంది.

‘‘అంటే...’’ అయోమయంగా చూస్తూ అడిగాను.

‘‘ఇటు తండ్రిని ఎదిరించలేక, అటు నిన్నూ వదులుకోలేక వాడెంత నరకం అనుభవించాడో ఆ భగవంతుడికే ఎరుకమ్మా. మీరా వూరు నుంచి వెళ్ళకముందే నిన్ను కలవాలని వాడు చాలా ప్రయత్నించాడు. ఓరోజు ఎవరూ చూడకుండా గోడ దూకి మీ ఇంటికి వెళ్ళి నీతో మాట్లాడమని నేనే ప్రోత్సహించాను. ఇంతలో ఉగ్రనరసింహంలా ఆయన ప్రత్యక్షమయ్యారు. ‘నువ్వెళ్ళావో ఇక్కడే బావిలో దూకేస్తా’ అని బెదిరించారు. ఏమీ చేయలేక చాతకానివాడిలా చతికిలబడిపోయాడు. పరిస్థితి చక్కబడేవరకూ ఓపిక పట్టమని నీకు ఉత్తరం రాశాడు. బహుశా ఆయన చేసిన అవమానాన్ని తలచుకుని ఆ ఉత్తరాన్ని మీ నాన్న నీ వరకూ చేరనివ్వలేదేమో. మీరు వెళ్ళిపోయిన తరవాత కూడా నీ ఆచూకీ కోసం చాలా ప్రయత్నించాడమ్మా. చాలాకాలం మనోవ్యాధితో మంచం పట్టాడు. చావాలని కూడా చూశాడు. నేనే అడ్డుపడి తప్పించాను. అయినా, నిన్ను ప్రాణంలా ఇష్టపడే మురళి నిన్నుగాక మరొకరిని తన జీవితంలోకి రానిస్తాడని ఎలా వూహించావు లలితా’’ అన్నారావిడ.

ఆశ్చర్యంగా వింటున్నాను ఆవిడ చెప్పేది. ‘‘మరి... ఆ పాప?’’ అడిగాను ఆత్రుతగా.

‘‘భగవంతుడికి మనందరి మీద తీర్చుకున్న కక్ష సరిపోలేదేమో, పదేళ్ళక్రితం తిరుపతి యాత్రకి వెళ్ళి తిరిగి వస్తుంటే కారు ప్రమాదంలో శీనూ, వాడి భార్యా పోయారు. ఈ పిల్లా, నేనూ బతికాం. నేనిలా అవిటి దాన్నయిపోయాను’’ అంటూ చీర కొంగు భుజంమీంచి తీసింది. మొండెంలా వేలాడుతున్న ఎడమ భుజం, చెయ్యి లేదు. అదిగో, ఆ పాపనే వాడు పెంచుతున్నాడు. తనతోపాటే బదిలీ అయిన వూళ్ళకి దాన్ని తీసుకెళ్ళి తల్లీ, తండ్రీ తనే అయి సాకుతున్నాడు’’ వెక్కుతూ చెప్పి వూపిరి తీసుకోవడానికన్నట్టు ఆగిందావిడ.

మురళి గురించి విన్న తరవాత ఒక్కసారిగా నా మెదడు పనిచేయడం మానేసింది. ఏదో తెలీని అలజడి. తనపట్ల మొన్నటి నా ప్రవర్తన తలచుకుంటే సిగ్గేసింది. నా కోపంవల్ల అతనికి మాట్లాడే అవకాశాన్నివ్వలేకపోయాను. వసివాడిన మా ఇద్దరి జీవితాలూ ఒకే పడవ మీద ప్రయాణించినట్లనిపించాయి. ఏళ్ళుగా ఏదో తెలియని కోపంతో ఘనీభవించిన నా హృదయం మెల్లమెల్లగా కరిగి నీరవుతోంది. నా ఆలోచనలు పసిగట్టినట్టుగా ఆవిడ ఓదార్పుగా నా భుజంపైన చేయి వేసింది. ఆ స్పర్శ నా బాధని మరింత పెంచింది. ఎన్నేళ్ళగానో పేరుకున్న బాధ కన్నీళ్ళ రూపంలో ఏరులవుతోంది.

‘‘ఇప్పటికీ మించిపోయింది లేదమ్మా. నీ కోసమే బతుకున్న వాడి జీవితంలో దీపం వెలిగించమ్మా. ఆ పిల్లకి తండ్రితోపాటు తల్లిని కూడా ఆ భగవంతుడిచ్చినట్లవుతుంది. ప్రశాంతంగా ఆలోచించు తల్లీ’’ అంటూ, ‘‘ఇంతకీ దానికి మురళి పెట్టిన పేరేమిటో తెలుసా... లలిత’’ అందావిడ వత్తి పలుకుతూ.

ఆప్పుడే ఆలోచించడం మొదలుపెట్టాను... నా జీవితం నిశీధి నుంచి ఉషోదయానికి చేరుతున్న భావన.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.