close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కృష్ణమ్మ సిగలో పుష్కరుడు!

కృష్ణమ్మ సిగలో పుష్కరుడు!

బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే బృహత్తర ఘడియల కోసం కష్ణవేణి ఎదురుచూస్తోంది. మరో అయిదు రోజుల్లో బృహస్పతి తనతోపాటే తీసుకొచ్చే పుష్కరుడితో తన జలాన్ని పునీతం చేయడమే కృష్ణమ్మ కోరిక. అసలు నదులకీ పుష్కరుడికీ మధ్య పవిత్రబంధం గురించి పురాణాలు ఏమంటున్నాయంటే...

పుష్కరం అంటే పవిత్ర తీర్థమని అర్థం. పుష్కరాధిపత్యాన్ని సాధించిన తుందిల మహర్షి పుష్కరుడు అయ్యాడు. తుందిలుడి తపస్సుకు శంకరుడు సాక్షాత్కరించి కోరికేమిటని అడిగాడు. ‘నన్ను నీలో లీనం చేసుకో దేవరా’ అని వేడుకున్నాడు తుందిలుడు. ‘తథాస్తు’ అన్నాడు భక్తవశంకరుడు. పృథ్వి, అగ్ని, జలం, వాయువు తదితర అష్టవిధ శక్తులకూ మూలకేంద్రం మహాశివుడే. తపస్సంపన్నుడైన తుందిల మహర్షికి సముచిత స్థానం ఇవ్వాలన్న తలంపుతో... జలాధిపత్యాన్ని ప్రసాదిస్తాడు గంగాధరుడు. అలా జలంలో ప్రవేశం పొందిన తుందిలుడు మూడున్నర కోట్ల తీర్థాలకు ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు. ఆయన ఉండే తీర్థానికి దివ్యమైన శక్తి సంక్రమిస్తుంది.

గురుడితో ప్రయాణం
సృష్టి నిర్మాణానికీ, మనుగడకూ నీరే ఆధారం. కానీ జల సంపదంతా తుందిలుడి అధీనంలో ఉండిపోవడంతో సృష్టికర్త బ్రహ్మదేవుడికి పెద్ద చిక్కే వచ్చింది. పరిష్కారం కోసం పరమేశ్వరుణ్ని ప్రార్థించాడు. పుష్కరుడు తన కమండలంలో ఉండేలా ఆనతి ఇవ్వమని కోరాడు. మరో ఆలోచన లేకుండా అనుమతించాడు శివుడు. అలా పుష్కరుడు బ్రహ్మ కమండలంలోకి ప్రవేశించాడు. నవ గ్రహాల్లో గురుడిది ప్రత్యేక స్థానం. జాతకంలో కూడా మిగిలిన గ్రహాలెలా ఉన్నప్పటికీ గురు(బృహస్పతి) గ్రహం లక్షణం బావుంటే జాతకుణ్ని రక్షించుకుంటుంది. లోకాన్ని సౌభాగ్యవంతం చేయడానికి తనకు పుష్కర స్పర్శ అవసరమని భావించాడు గురుడు. బ్రహ్మ దగ్గరున్న పుష్కరుణ్ని తన దగ్గర ఉంచమని శంకరుణ్ని వేడుకుంటూ తపస్సుకు పూనుకున్నాడు. సృష్టికర్త కమండలంలోని జలంలో ఆవాహనై ఉండటాన్ని చాలా సంతోషంగా భావిస్తాడు పుష్కరుడు. ఆ సందర్భంలో ‘స్వామీ! పరమశివుడి సన్నిధిలో చల్లగా బతుకుతున్న నన్ను, నీ చెంతకు పిలిపించుకున్నావు. అంతదాకా బాగా ఉంది. మళ్లీ ఇప్పుడు బృహస్పతాచార్యుల పెత్తనమెందుకు!’ అంటూ బ్రహ్మదేవుడితో గోడువెళ్లబోసుకున్నాడు పుష్కరుడు. బ్రహ్మ అందుకు మధ్యేమార్గాన్ని సూచించాడు. ‘మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు, మొదటి పన్నెండు రోజులూ పుష్కరుడు ఆయా నదుల్లో ఉండాలి. ఆ సమయంలో నాతోపాటు ముక్కోటి దేవుళ్లూ, పితృదేవతలూ బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన నదీజలంలో ఉంటారు’ అని ప్రకటించాడు బ్రహ్మ. దాంతో బృహస్పతి కోరిక తీరింది, పుష్కరుడి జన్మ చరితార్థమైంది. అలా పుష్కర సంప్రదాయం మొదలైంది. అప్పట్నుంచీ బ్రహ్మ తన కమండలంలో ఉన్న పుష్కరుణ్ని తీసుకొని ఏటా బృహస్పతి కొత్త రాశిలో ప్రవేశించినపుడు మొదటి 12 రోజులూ ఆయనతో ఉండటానికి వెళ్తాడు. ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఇతర దేవతలూ ఆయన్ని అనుసరిస్తారు. ఇన్ని దివ్యశక్తులు ఒక్కచోటకు చేరే కాలమే పుష్కర కాలం. అందుకే పుష్కరాలకు అంతటి మహత్యం.

ఏ రాశి... ఏ నది?
నవగ్రహాల్లో ఒకటైన బృహస్పతి ఏడాదికో రాశిలో చొప్పున తిరుగుతూ ఉంటుంది. గురువు ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరం! మనకు చాలా నదులు ఉన్నప్పటికీ పుష్కర నదులు మాత్రం పన్నెండే ఉన్నాయి. పుష్కరుడు ఈసారి శ్రావణ, శుక్ల అష్టమినాడు (ఆగస్టు 11) రాత్రి తొమ్మిది గంటల తర్వాత దేవగురుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. కానీ సూర్యాస్తమయం తర్వాత ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆరోజుని లెక్కలోకి తీసుకోరు. అందుకే ఆగస్టు పన్నెండు నుంచి పన్నెండు రోజులపాటు అంటే 23(శ్రావణ బహుళ పంచమి) వరకూ పుష్కరాలు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులూ కృష్ణా తీరం భక్త సంద్రంతో పుష్కర శోభను సంతరించుకుంటుంది.


పుష్కరస్నానం ఇలా చెయ్యాలి!

నర్మదా నదిలో తపస్సు, గంగా నదిలో స్నానం, కురుక్షేత్ర ప్రాంతంలో దానం, కాశీలో మరణం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుందో పుష్కర నదిలో స్నానం కూడా అంతే ఫలితాన్నిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, పుష్కరాల సమయంలో స్నానం, దానం, పిండ ప్రదానాలు చెయ్యడానికి కొన్ని విధి విధానాలున్నాయి.

శివకేశవుల ప్రతిరూపమైన కృష్ణవేణీ నదిలో పుష్కరాల సమయంలో సూర్యోదయ వేళ స్నానం చేస్తే వేయి గోదానాలు చేసిన పుణ్యమూ సూర్యోదయానికి ముందు పిండ ప్రదానాది క్రతువులను ఆచరిస్తే అశ్వమేధ యాగఫలమూ సిద్ధిస్తుందన్నది పండితుల మాట. అలాగే మధ్యాహ్న సమయంలో స్నానమాచరిస్తే వాజపేయాది యజ్ఞఫలం కలుగుతుందట.

పుష్కర స్నానమిలా...
ఏదో నదిలో మునిగి స్నానం చేస్తున్నట్లు కాకుండా పుష్కర స్నానాన్ని భక్తితో చెయ్యాలి. పవిత్ర కృష్ణవేణీ జలాలు మనకు భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదిస్తున్న అనుభూతిని పొందాలి. ఇంటి దగ్గర స్నానం పూర్తి చేసుకున్నాకే పుష్కర స్నానానికి వెళ్లాలి. నదిలోకి దిగేముందు...

‘పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ
మృత్తికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ’

అని చెప్పుకుని గట్టు మీదున్న మట్టిని కొద్దికొద్దిగా మూడుసార్లు నదిలో వేసి, అప్పుడు స్నానం చెయ్యాలి. లేదంటే ఆ స్నానఫలం దక్కదని పెద్దలు చెబుతారు. దీని వెనకో కథ ఉంది. పిప్పలాదుడు అనే మహర్షి యజ్ఞకుండం లోంచి కృత్య అనేవాడు ఉద్భవించాడు. పుట్టీపుట్టగానే ఆకలి ఆకలి... అంటూ దేవతల్ని తినబోయాడు. అప్పుడు శంకరుడు ‘దేవతల్ని కాదు కానీ... నిన్ను తలుచుకోకుండా నదీస్నానం చేసేవారి స్నానఫలాన్ని తిందువులే’ అని వరమిచ్చాడు. ఈ శ్లోకం చెప్పుకునేటపుడు మహిళలైతే ‘మృత్తికాం’ అన్న చోట ‘హరిద్రా’ అని పలకాలట. మట్టికి బదులు పసుపు కుంకుమలు సమర్పించాలట.

ఏ రోజు ఏమి దానం..?
పుష్కరాల సమయంలో పూజలతో పాటు దానధర్మాలకూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. పోషయతీతి పుష్కరం- పుష్కరం అంటే పోషించేది అన్న అర్థం ఉంది. అంటే ఉన్నవారు లేనివారికి తోచినంతలో సాయం చేస్తే అందులోనూ పుణ్యం దక్కుతుందన్నమాట. పుష్కరాల సమయంలో పన్నెండు రోజులూ పన్నెండు రకాల దానాలు చెయ్యాలని చెబుతారు పండితులు. మొదటిరోజు... భూదానం, ధాన్య దానం, సువర్ణదానం, రజతదానం, అన్నదానం శ్రేష్ఠమని చెబుతారు. అంటే ఎవరికైనా ఉండడానికి కాస్త చోటుని దానంగా ఇవ్వొచ్చు. పేదింటి ఆడపిల్లకు ఓ గ్రాము బంగారం లేదా వెండిని ఇవ్వొచ్చు. నిరుపేదకు కడుపునిండా భోజనాన్ని పెట్టొచ్చు. రెండోరోజు... రత్న, గో, వస్త్ర, లవణ దానాలు చేయాలంటారు. పాడి ఆవు ఇంట్లో ఉంటే చాలు, ఆ కుటుంబానికి కరవు ఉండదు. అందుకే, గో దానం. వీధుల్లో వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఎంతోమంది ఉంటారు. వారికి ఓ జత బట్టలు కొనిస్తే అదే మనకు శ్రీరామ రక్ష. మూడోరోజు... ఫలదానం. పండ్లూ కూరగాయల్ని దానమిస్తే మంచిది. నాలుగోరోజు తేనే, నెయ్యీ, పాలూ, నూనే ఇవ్వాలంటారు. ఐదోరోజు... ఎద్దులూ బండీ నాగలీ వగైరా వ్యవసాయ పనిముట్లను దానం చెయ్యాలి. ఆరోరోజు... ఔషధ దానం చేయాలంటుంది శాస్త్రం. డబ్బుల్లేని వారికి మందులు కొనిపెడితే వారి ఆరోగ్యాన్ని కాపాడి ఆయుష్షును పెంచినట్లే. ఏడోరోజు... మంచం, పీటా లాంటి గృహోపకరణాలను దానంగా ఇవ్వాలి. ఎనిమిదో రోజు... దుంపలు దానం చెయ్యాలట. తొమ్మిదోరోజు... దుప్పట్లూ, కంబళ్లూ దానంగా ఇవ్వాలి. పదోరోజు... ముత్యాలూ, పగడాలూ, నవరత్నాల్లో ఏవైనా... పదకొండోరోజు... పుస్తకాలు. పన్నెండో రోజు.. నువ్వుల దానం. వీటిలో చాలావరకూ నిత్యావసరమైన వస్తువులే. అందుకే, వాటిని దానంగా ఇచ్చి పేదవారిని సంతోషపెడితే కృష్ణమ్మ ఆశీస్సులు దక్కినట్లే అంటారు పెద్దలు.

పిండ ప్రదానం
ముక్కోటి దేవతలతో పాటు పితృదేవతలూ పుష్కరస్నానాలకు దిగొస్తారని ఓ నమ్మకం. పుష్కర సమయంలో పిండ ప్రదానం చేస్తే సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుందంటారు పండితులు.
* తల్లిదండ్రుల వైపు నుంచి అటు ఏడు, ఇటు ఏడు తరాల వారికి పిండ ప్రదానం చేయాలి.
* వీరుకాక పాలకులు, ఆశ్రయం ఇచ్చిన వారు, గురువులు, అన్నం పెట్టిన వారు, విద్య చెప్పించిన వారు, సేవకులు, స్నేహితులు, దాయాదులు పిండ దానార్హులు అన్నది పురాణ ప్రవచనం. సూర్యాస్తమయ వేళ పుష్కరాల్లో ఎలాంటి క్రతువులూ చేయరాదని పండితులు పేర్కొంటున్నారు.
అందుకే, పుష్కర సమయంలో వీటిని గుర్తుంచుకుందాం.


ఇల కైలాసం... శ్రీశైలం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, భూలోక కైలాసంగా విరాజిల్లుతోన్న పుణ్యక్షేత్రం శ్రీశైలం. భూమండలానికి నాభిస్థానంగా చెప్పే శ్రీశైల మహాక్షేత్రం కర్నూలు జిల్లాలో పాతాళగంగ పేరుతో ఉత్తరంవైపు ప్రవహిస్తున్న కృష్ణానదీ తీరానికి కుడివైపున వెలిసింది.

ట్టమైన నల్లమల అడవుల్లో, పర్వత పంక్తుల మధ్యన, సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది శ్రీశైల మహాక్షేత్రం. కృతయుగంలో రాక్షస రాజైన హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని సేవించాడనీ, ఈ శ్రీశైలక్షేత్రం ఆయన పూజామందిరమనీ స్కందపురాణం చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణాల్లో సీతారాములు రెండు సహస్రలింగాలను ప్రతిష్ఠించారు. ద్వాపరయుగంలో పాండవులు ఐదు శివలింగాలనూ, ద్రౌపది సాలంకేశ్వరులుగా పిలిచే శివలింగాలనూ ప్రతిష్ఠించారు. కలియుగంలో దత్తాత్రేయులు, ఆదిశంకరాచార్యులు, వీరశైవ శివశరణులైన అల్లమ ప్రభువు, అక్కమహాదేవి, సిద్ధయోగి సిద్ధరామప్ప, మంత్రాలయ రాఘవేంద్రులు... ఇలా ఎందరో స్వయంభువులింగంగా వెలసిన శ్రీమల్లికార్జునస్వామిని, భ్రమరాంబాదేవిని వేనోళ్ల కీర్తించి సేవించారు.

పురాణాల్లో శ్రీశైలం
శ్రీశైల మహాక్షేత్రం గురించి పద్మ, మార్కండేయ, శివ, ఆదిత్య, స్కందపురాణాల్లో ప్రస్తావించబడింది. చరిత్ర పరంగా చెప్పాలంటే క్రీ.శ ఒకటో శతాబ్దం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆనాడు ఈ క్షేత్రాన్ని శాతవాహనులు ‘సిరితన’, ‘శ్రీపర్వతం’ అని పిలిచేవారని తెలుస్తోంది. ఆంధ్రదేశ తొలి పాలకులైన శాతవాహనులు మూడో శతాబ్దం వరకూ శ్రీశైలాన్ని పాలించారు. వీరి తర్వాత ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, కదంబులు, తెలుగుచోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరరాజుల వంటి రాజాధిరాజులు శ్రీశైలాన్ని పాలించి ఆలయ సముదాయాల అభివృద్ధికి కృషిచేశారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణం 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంది. దీనిచుట్టూ 20 అడుగుల ఎత్తు, 2121 అడుగుల పొడవుతో నిర్మితమైన ప్రాకారకుడ్యం (కోటగోడ)పైన శిల్పాకళా సోయగాలు తిలకించడానికి రెండు కళ్లూ చాలవు. అంతేకాదు ప్రాకారానికి నలువైపులా ఎత్తైన రాజగోపురాలు ఆలయశోభకు వన్నె తెచ్చాయి. ఆలయ ప్రాంగణంలోపల శనగల బవసన్నగా పేరొందిన నంది విగ్రహం ఎదుట నిలిచి రెండు చేతులెత్తి మొక్కాలనీ, నంది మోపురాన్ని తనివితీరా నిమరాలన్న భావన కలుగుతుంది. వృద్ధమల్లికార్జునస్వామి ఆలయంలో స్వామివారు నిత్యాభిషేకాలతో పులకించిపోతుంటారు.

శ్రీశైల మల్లికార్జునస్వామి నిత్య అభిషేక ప్రియుడు. ఆయనకు భక్తులు ప్రతినిత్యం రుద్రాభిషేకాలు జరుపుతారు. భ్రమరాంబాదేవికి కుంకుమార్చనలు చేసి అమ్మవారి కరుణాకటాక్షం కోసం తపిస్తుంటారు. అంతేకాదు ఆదిదంపతులైన శ్రీస్వామి-అమ్మవార్లకు రోజూ రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య కల్యాణోత్సవం జరుగుతుంది. కృష్ణానదీతీరమైన పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలూ నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం, సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో శ్రీగంగాపార్వతీ సమేత మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం జరుగుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవం రోజున శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి తెల్లటి వస్త్రంతో పాగాలంకరణ చేయడం ఇక్కడి ప్రత్యేకత. 2007లో శ్రీమల్లికార్జునస్వామి, 2013లో శ్రీభ్రమరాంబాదేవి ఆలయాల గర్భాలయ విమానగోపురానికీ బంగారు తాపడాలు చేయించడంతో ఆలయం స్వర్ణకాంతులతో శోభాయమానంగా మారింది.

శ్రీశైల మహిమలు
‘‘శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’’... శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని ప్రతీతి. శిఖరేశ్వరం నుంచి శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ గర్భాలయంపై ఉండే శిఖరాన్ని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో రావణవధ అనంతరం బ్రహ్మహత్యాదోషం పోగొట్టుకునేందుకు శ్రీరాముడు రామేశ్వరంలో ‘శివలింగ ప్రతిష్ఠ’ చేసి, మిగిలిన అరకొరగా ఉన్న పాపాన్ని పోగొట్టుకునేందుకు నారదుని సలహాపై శ్రీశైల శిఖర దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రాన్ని స్మరిస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయనీ, ఈ క్షేత్రంలో రెండు అడుగులు వేస్తేనే తన వంశంలోని వారందరినీ ఉద్ధరించిన వారవుతారనీ పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్రంలో లక్షలు దానమిచ్చి, రెండువేల సార్లు గంగాస్నానం చేసి, నర్మదాతీరంలో బహుకాలం తపస్సు చేసి, లక్ష సంవత్సరాలు కాశీలో నివాసం చేసేవారు పొందే పుణ్యాన్ని శ్రీశైల మల్లికార్జునస్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన పొందవచ్చు. శ్రీశైలక్షేత్రంలో ఒక్క రోజు నిష్ఠతో నివసించినవారు ఇరవై వేల యుగాలు కేదారంలో నివసించిన పుణ్యాన్ని పొందుతారని శివుడు స్వయంగా పార్వతికి వివరించినట్లు స్కందపురాణం చెబుతోంది.

- జె.సిచ్‌.వెంకటేశ్వర్లు
న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

ఆధ్యాత్మిక సన్నిధి అలంపూర్‌!

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం. ఇక్కడ అడుగడుగునా కన్పించే ఆలయాలు మన హృదయాల్లో ఆధ్యాత్మిక భావనలను రేకెత్తిస్తాయి.ఎన్నో పురాణాల్లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృష్ణా, తుంగభద్రల సంగమం ఇక్కడికి సమీపంలోనే!

కప్పుడు హమతాపూర్‌, అమలాపూర్‌ పేర్లతో పిలిచిన క్షేత్రమే ప్రస్తుత అలంపూర్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 100 కి.మీ.దూరంలో ఉంది అలంపూర్‌. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయంతోపాటు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం... ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయిక్కడ. ఒకప్పుడు ఈ క్షేత్రం ప్రసిద్ధ విద్యా పీఠంగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలంపూర్‌ తుంగభద్ర తీరంలో ఉంది. ఇక్కడికి కాస్త దూరంలోనే కృష్ణానది ఉంటుంది. కృష్ణమ్మ పొంగి ప్రవహించినపుడు, శ్రీశైలం జలాశయం గేట్లు తెరవకుండా ఉంచినపుడు కృష్ణా నీరు తుంగభద్ర నీటిలో కలిసి వెనక్కి మళ్లి ఇక్కడివరకూ వస్తుంది. దీనికి దక్షిణ కాశీగానూ పేరు. పుష్కరాల సమయంలో ఇక్కడ ఘాట్లలో స్నానమాచరించి ఒడ్డునే ఉన్న ఆలయాల్లో దైవ దర్శనానికి భక్తజనం పెద్ద ఎత్తున వెళ్తారు.

శక్తిపీఠం జోగులాంబ
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయం ఇక్కడ ఉంది. దక్షయజ్ఞం సమయంలో దక్షప్రజాపతి శివనిందచేస్తూ పరిహాసంగా మాట్లాడటంతో ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి యాగాగ్నికి ఆహుతి అవుతుంది. దాంతో పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై యాగాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అనంతరం అమ్మవారి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం చేస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శనం అమ్మవారి శరీర భాగాన్ని 18 భాగాలుగా ఖండిస్తుంది. ఒక్కొక్క భాగం ఒక్కో ప్రాంతంలో పడుతుంది. అవే 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. ఇందులో అమ్మవారి పైదవడ భాగం అలంపూర్‌లో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. కింద దవడకంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ తల్లి రౌద్ర స్వరూపిణిగా వెలసింది. మిగతాచోట్ల స్త్రీ దేవతలకు తల వెంట్రుకలు వెనక్కి ఉంటే ఇక్కడి మాతకు మాత్రం పైకి ఉంటాయి. ఇలా ఉండటాన్ని ‘జట’ అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. అమ్మవార్లలో జోగులాంబకి మాత్రమే ఇలా ఉంటుంది. ఆ తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితోపాటు అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ అయిదూ ఇక్కడి ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువకాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పడానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయి.

నవబ్రహ్మ ఆలయం
బాదామి చాళుక్యుల కాలంలో రెండవ పులకేశి నిర్మించిన నవబ్రహ్మల దివ్యధామమూ అలంపూర్‌లో ఉంది. ఈ నిర్మాణశైలి దేశంలోనే ప్రథమంగా భావించే ఆలయ నిర్మాణశైలుల్లో ఒకటి. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయం... చాళుక్యల శిల్పచిత్ర రాజాలతో, మండపాలతో, ప్రాకారాలతో చూడ్డానికి మనోహరంగా ఉంటుంది. నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైనది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. దీని చుట్టూ ప్రాకారంలో మిగిలిన ఎనిమిది బ్రహ్మల ఆలయాలు ఉంటాయి. ఒకానొకసారి బ్రహ్మదేవుడు తన బ్రహ్మత్వాన్ని కోల్పోగా తిరిగి బ్రహ్మత్వాన్ని సంపాదించుకునే క్రమంలో పరమేశ్వరుని గురించి ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై తిరిగి బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడట. బ్రహ్మ పిలుపు మేరకు పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడంతో ఇక్కడి లింగానికి బ్రహ్మేశ్వరుడనీ, విగ్రహం చిన్నదిగా ఉండటంతో బాలబ్రహ్మేశ్వరుడనీ పేరువచ్చిందని పురాణాలద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పూర్వం ఈ విగ్రహం నుంచి కొన్ని రసాలు వెలువడుతుండటంతో ఈ విషయాన్ని గమనించిన రససిద్ధులు అనే మహాముని పరుసవేధి విద్యతో ఆ రసాల్ని మిళితం చేస్తూ ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారంలో ఎనిమిది బంగారు ఆలయాలను నిర్మించారట. ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని నవబ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ దివ్యభవనంగా పిలుస్తారు. బాలబ్రహ్మ చుట్టూ కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, గరుడబ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ ఆలయాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో విగ్రహం గోష్పాదముద్రికగా ఉండి రసాత్మకతను కల్గి ఉంటుంది. మిగిలిన ఆలయాల్లో శివలింగాలు స్తూపాకారంగా కనిపిస్తూ ఔషధ మూలికలను సంతరించుకుని వివిధ రంగులలో దర్శనమిస్తాయి. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం పొంది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా విరాజిల్లుతున్నాయి. అలంపూర్‌లో ఉన్న మరో ఆలయం సంగమేశ్వర ఆలయం. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణాతీరంలోని ముంపు ప్రాంతం నుంచి రాళ్లను తరలించి యథాతథంగా పునర్నిర్మించిన సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడికి దగ్గర్లోనే పాపనాశేశ్వర ఆలయాల సముదాయం ఉంది.
ఇలా ఎన్నో ఆలయాలకు ఆలవాలం అలంపురం!

- కె.మద్దిలేటి, న్యూస్‌టుడే అలంపూర్‌

కృష్ణమ్మ చెంత దుర్గమ్మ

దేశంలోని మహిమాన్విత పుణ్యక్షేత్రాలలో విజయవాడలోని కృష్ణాతీరంలో వెలసిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఒకటి. సృష్టిస్వరూపిణి అయిన కనకదుర్గమ్మ స్వయంభువుగా వెలిసిన ఆలయమిది. వేదంలా ఘోషించే పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన కొలువై ఉన్న ఈ ఆలయం శ్రీశక్తి పీఠాలలో ఒకటిగా పేరుగాంచింది.

కృష్ణుడూ పరమేశ్వరుడి అంశలతో ప్రవహించే కృష్ణవేణీ నది అంటే దుర్గమ్మ తల్లికి ఎంతో మక్కువ. అందుకే, ఏరికోరి కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహించే చోటైన ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసింది. ఆ నదిలో స్నానం చేసి తనను దర్శించుకున్నవారిని దుర్గతులనుంచి తప్పిస్తానని వరమిచ్చింది. ముగురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. ఏటా రెండు కోట్ల మందికి పైగా భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుంటారు. దసరా సమయంలో వైభవంగా నిర్వహించే శరన్నవరాత్రోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారు. భవానీదీక్షల సమయంలోనూ మరో 10 లక్షల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దుర్గమ్మ పాదాల వద్ద కృష్ణమ్మ ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు కృష్ణవేణిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నేరుగా వచ్చి ఆలయంలోని గర్భగుడిలో శోభాయమానంగా వెలుగొందే దుర్గమ్మను దర్శించుకుంటారు. నమ్ముకున్న వారిని రక్షించి, భక్తుల కోర్కెలు తీర్చే ఆశ్రిత మందారవల్లిగా కనకదుర్గమ్మను కొలుస్తారు.

స్థలపురాణం
పర్వతరూపుడైన కీలుడు అనే యక్షుడు దుర్గమ్మ కృప కోసం ఘోరమైన తపస్సు చేశాడు. దానికి మెచ్చి ప్రత్యక్షమైన అమ్మవారు వరం కోరుకోమంది. ఎప్పుడూ తన హృదయ కుహరం(గుహ)లో ఉండాలని వరం కోరాడు కీలుడు. దాంతో దుర్గమ్మ తనకు ఇష్టమైన కృష్ణా నదీ తీరంలో కొలువై ఉండమని యక్షుడికి చెప్పింది. దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. స్వర్ణమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారిని ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణిలో స్నానమాచరించి వచ్చి శాంతించమని పూజించారు. నాటి నుంచి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించి కనకవర్ణశోభితురాలై ఉండడంతో అమ్మవారు కనకదుర్గమ్మగా పేరుగాంచింది. పూర్వం నుంచీ దేవతలూ, మహర్షులూ కృష్ణవేణిలో స్నానమాచరించి దుర్గమ్మను దర్శించుకునేవారు.

అమ్మవారి ఆలయం పక్కనే పరమేశ్వరుడిని కూడా కొలువుంచాలని భావించిన బ్రహ్మాది దేవతలు శతాశ్వమేధయాగం చేసి శివుడిని మెప్పించారు. దీంతో శివుడు జ్యోతిర్లింగ స్వరూపంతో స్వయంభువుగా ఇంద్రకీలాద్రిపై వెలిశాడు. బ్రహ్మాదిదేవతలు పరమేశ్వరుడిని మల్లి కదంబ పుష్పాలతో పూజించడంతో మల్లేశ్వరస్వామి నామంతో వెలుగొందాడు.

తర్వాతి కాలంలో ఇంద్రకీలాద్రిని సందర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేసేందుకు శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేశారు. దీంతో అమ్మ శాంతి స్వరూపిణిగా మారి భక్తులకు దర్శనమిస్తోంది. పరమేశ్వరుని జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గుర్తించిన ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఆలయానికి ఉత్తరభాగంలో పునఃప్రతిష్ఠించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవదుర్గల విగ్రహాలు ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను చేకూరుస్తాయి. కొండమీద ఉన్న అనేక రకాల వృక్షాలను పూర్వం దేవతా స్వరూపాలుగా కొలిచేవారు.

అర్జునుడికి ఇక్కడే పాశుపతాస్త్రం
అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడిని మెప్పించేందుకు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశాడు. దాంతో అతడిని పరీక్షించేందుకు పరమేశ్వరుడు కిరాతుడి రూపంలో వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు. అనంతరం అతడి భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడంతో అర్జునుడు కురుక్షేత్రంలో విజయుడయ్యాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి ఫల్గుణ క్షేత్రం, విజయపురి అనే పేర్లు కూడా వచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు చేసినట్టుగా చెబుతున్న స్థలం నేటికీ కనిపిస్తుంది. తాజాగా ఇంద్రకీలాద్రి బృహత్తర ప్రణాళికలో భాగంగా ఇక్కడికీ భక్తులు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గాదేవి శుంభ, నిశుంభులను సంహరించి విజయం సాధించడం వల్ల ఈ నగరానికి విజయవాడ అనే పేరు వచ్చిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. కృష్ణాతీరంలో ఉన్న అతిపెద్ద నగరం విజయవాడే!

ఈ కృష్ణా పుష్కరాల్లో విజయవాడలో ఏర్పాటు చేస్తున్న ఏడు ఘాట్లలో మూడు కోట్లకు పైగా భక్తులు స్నానమాచరించనున్నారు. పుష్కరాల సమయంలో కృష్ణానదిలో మునిగాక అమ్మవారిని దర్శించుకుంటే శుభప్రదమని భక్తుల నమ్మకం. కానీ అంతమందీ అమ్మవారిని నేరుగా దర్శించుకోవడం సాధ్యం కాదు కాబట్టి, ఎదురుగా కన్పించే అమ్మవారి ఆలయానికి మొక్కినా అంతేస్థాయిలో పుణ్యం వస్తుందని శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శంకరశాండిల్య వెల్లడించారు.

- ఎం.జగదీష్‌కుమార్‌
ఈనాడు, అమరావతి