close
తీరం పొడవునా తీర్థాలే!

తీరం పొడవునా తీర్థాలే!

దేవుళ్లతో సమానంగా జీవ నదుల్నీ పూజించారు మన పూర్వికులు. అందుకే, పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ నదుల ఒడ్డునే వెలిశాయి. ఇక, మహాబలేశ్వరం నుంచి హంసలదీవి వరకూ కృష్ణమ్మ ప్రవాహాన్ని ఆనుకుని ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉండటం ఒక విశేషమైతే కృష్ణానది పేరుతోనే ఓ ఆలయం ఉండటం మరింత విశేషం.

ఇవి... నదుల ఆలయాలు

హారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ ఆలయం ఉంది. అందులో చెక్కిన గోవు ముఖంలోనుంచి వచ్చే నీటి ధారే కొండలూ కోనలూ దాటి కృష్ణానదిగా ప్రవహిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి. కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది.

కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణీ, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయని నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుంచి వచ్చే ధార ఆ అయిదు నదులకూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం తర్వాత నుంచి కృష్ణానది విడిగా ప్రవహిస్తుంది.


వాయిలో దొడ్డ గణపతి

హాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది. వందకు పైగా ఆలయాలున్న వాయిలో కృష్ణానదికి ఏడు ఘాట్లున్నాయి. అన్నీ ప్రముఖ ఆలయాలతో కొలువుతీరి ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిలో గణపతి ఘాట్‌ దగ్గరున్న ధోల్యా గణపతి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. 1762లో నిర్మించిన ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం పది అడుగుల ఎత్తూ, ఎనిమిది అడుగుల వెడల్పుతో ఎంతో ప్రసన్నంగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ప్రముఖమైందే.


సంగమేశ్వరం... ముక్తిప్రదాయకం!

కృష్ణ, మలప్రభ, ఘటప్రభ నదుల సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ‘కూడల సంగమ’ కర్ణాటకలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. బెంగళూరుకి సుమారు 450 కి.మీ దూరంలో ఉన్న ఈ సంగమేశ్వరాలయం వీరశైవులకు పుణ్యక్షేత్రంగా ఖ్యాతికెక్కింది. దీన్ని పదో శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. పన్నెండో శతాబ్దపు సంఘ సంస్కర్త, సిద్ధపురుషుడూ అయిన బసవేశ్వరుడు ఇక్కడే శివుడి గురించి తపస్సు చేసి, శివునిలో ఐక్యమైనట్లు స్థల పురాణం చెబుతోంది. భక్తులు మూడు నదుల సంగమంలో స్నానాదులు చేసి ఈ స్వామిని భక్తితో పూజిస్తే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. ఏటా జనవరిలో బసవ క్రాంతి సందర్భంగా ఇక్కడ శరణ మేళా జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచీ వీరశైవులు వస్తుంటారు.


పాతాళంత శ్రీశిఖరం

ర్నూలు జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కృష్ణవేణి ఉత్తరవాహినిగా ప్రవహించే ఈ ప్రాంతాన్ని పాతాళగంగగా పిలుస్తారు. దానికి కుడివైపు ఒడ్డునే శ్రీ భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి స్వయంభువుగా వెలిశాడు. శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఏటా మహాశివరాత్రి, సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వపాపాలూ నశిస్తాయనీ, మల్లన్నను చెంబు నీళ్లతో అభిషేకించినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం.


అమ్మలగన్నమ్మ దుర్గమ్మ

విత్ర కృష్ణవేణీ నదీ తీరాన విజయవాడలో కొలువై ఉన్న ఈ ఆలయం శ్రీశక్తి పీఠాలలో ఒకటిగా దివ్య క్షేత్రంగా పేరుగాంచింది. పర్వతరూపుడైన కీలుడు దుర్గమ్మను ఎప్పుడూ తన హృదయ కుహరం(గుహ)లో ఉండాలని వరం కోరాడు. దాంతో అమ్మ తనకు ఇష్టమైన కృష్ణా నదీ తీరంలో కొలువై ఉండమని కీలుడికి చెప్పింది. దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు మాట ప్రకారం వచ్చి కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. కృష్ణుడూ పరమేశ్వరుడి అంశలతో ప్రవహించే కృష్ణవేణీ నది అంటే దుర్గమ్మకి ఎంతో మక్కువ. అందుకే, ఆ నదిలో స్నానం చేసి తనను దర్శించుకున్నవారిని దుర్గతులనుంచి తప్పిస్తానని వరమిచ్చింది.


హరిహరులు కొలువైన వాడపల్లి

రిహరులు ఒక్కచోట వెలసిన చోటు ఎంతో ప్రశస్తమైనదనీ, నదీ సంగమస్థానం పరమ పవిత్రమనీ పురాణవాక్కు. అలాంటి దివ్యక్షేత్రమే నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి. ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, మరోపక్క మీనాక్షీ సమేతుడైన అగస్త్యేశ్వరుడు... అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిన ఈ దేవాలయాల పక్కగా కృష్ణా మూసీ నదుల సంగమ స్థానం. ఒకనాడు బోయవాడు ఓ పావురాన్ని వేటాడబోగా ప్రాణాపాయంలో ఉన్న అది శివుణ్ని శరణు వేడింది. శివుడు పావురాన్ని వదిలేయమనీ అందుకు బదులుగా తన తల నుంచి మాంసాన్ని తీసుకోమనీ బోయవాడికి చెప్పాడట. అందుకు నిదర్శనంగా ఇక్కడి శివలింగం పైభాగం గుంతపడినట్లు ఉండి అందులోంచి నిరంతరం ఒక దివ్యజలం తీసేకొద్దీ ఉబికి వస్తుంది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై ఈ పవిత్ర జలాలను చల్లి ఆశీర్వదిస్తారు.


పాపాలు హరించే ఆంధ్ర మహావిష్ణు

కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళంలో వెలసిన స్వామిని ఆంధ్ర మహావిష్ణువుగా పిలుస్తారు. కలియుగంలో భక్తుల పాపాల్ని హరించడానికి చతుర్ముఖ బ్రహ్మ సహా దేవతలంతా ఈ ప్రాంతానికి వచ్చి మహావిష్ణువు గురించి తపస్సు చేస్తారు. ఆ తపస్సుకి మెచ్చి స్వామి సాక్షాత్కరించగా ఈ ప్రాంతంలో కొలువై భక్తుల పాపాలని హరించమని బ్రహ్మ కోరడంతో ఆయన అందుకు సమ్మతిస్తాడనేది పురాణ గాథ. చెంతనున్న కృష్ణానదిలో స్నానంచేసి భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. ‘ఆముక్త మాల్యద’ రచనకు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే ఉపక్రమించాడని చెబుతారు. వైకుంఠ ఏకాదశినాడు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వరస్వామిని ఉత్తర ద్వారాన దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.


పరమ పవిత్రం ... అమరారామం

పంచారామాల్లో ప్రథమ క్షేత్రమైన గుంటూరు జిల్లాలోని అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయం త్రేతాయుగం నుంచే ఇక్కడ ఉనికిలో ఉంది. పరమేశ్వరుడు లింగ రూపంలో తన హృదయంలో కొలువై ఉండేలా వరం పొందిన తారకాసురుడు లోక కంటకుడయ్యాడట. దాంతో కుమారస్వామి తారకుడితో యుద్ధంచేసి అతడి హృదయంలోని శివలింగాన్ని బాణంతో ఛేదించి ముక్కలు చేశాడు. దీంతో అసురుడు మరణించగా, బయటపడిన శివలింగం ఐదు ముక్కలై భూమిపై ఐదుచోట్ల పడింది. అందులో ప్రథమభాగం అమరావతిలో కృష్ణానది ఒడ్డున వెలిసింది. ఆ శివలింగాన్ని తొలిసారి ఇంద్రుడు పూజించడంతో అది అమరేంద్రుడి పేరుతో అమరేశ్వరలింగంగానూ ఈ ప్రాంతం ఇంద్రనగరమైన అమరావతిగానూ ప్రసిద్ధి చెందాయనేది స్థలపురాణం. అయితే శివలింగం ఇక్కడ అంతకంతకూ పెరిగిపోతుండటంతో లింగం పైభాగంలో శీల కొట్టారనీ అప్పటి నుంచీ ఎత్తుపెరగడం ఆగిందనీ చెబుతారు. ప్రస్తుతం స్వామివారు తొమ్మిదడుగుల ఎత్తున, మూడడుగుల కైవారంతో తెల్లని స్ఫటిక లింగాకార రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ మరో 23 ఉపాలయాలు కొలువుదీరి ఉండడం విశేషం.


హంసలదీవి... కృష్ణమ్మ ఆఖరి మజిలీ

1400 కి.మీ.కు పైగా ప్రవహించిన కృష్ణమ్మ... కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి దగ్గర సాగరుడిలో సంగమిస్తుంది. ఇక్కడకు దగ్గర్లోనే శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. కృష్ణ-సాగర సంగమంలో పుణ్యస్నానాలాచరిస్తే సర్వపాపాలూ పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నాడు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వచ్చి పుణ్యస్నానమాచరిస్తారు. దీనిని దేవతలే స్వయంగా నిర్మించారనేది పురాణ గాథ. ఆలయాన్ని దేవతలు నిర్మిస్తుండగా కోడికూత సమయానికి మానవులు చూడటంతో వారు శిలలుగా మారిపోయారని చెబుతారు. ఇక్కడ దేవతల శిల్పాలెన్నో ఉన్నాయి. మాఘశుద్ధ పౌర్ణమిరోజున స్వామివారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇవేకాదు, కర్ణాటకలో ఎలగూరు ఆంజనేయస్వామి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అలంపురం జోగులాంబ, బీచుపల్లి ఆంజనేయస్వామి, గింజపల్లి కాశీ విశ్వేశ్వరాలయం, మక్తల్‌ దత్త క్షేత్రం, నల్గొండలో మెట్టపల్లి లక్ష్మీనృసింహ స్వామి, కృష్ణాజిల్లాలో ముక్త్యాల ముక్తి మహేశ్వరాలయం, వేదాద్రి నరసింహ క్షేత్రం... చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా పవిత్రమైన ఆ నీటిని మరింత పావనం చేసుకునేందుకా అన్నట్లు వందల కిలోమీటర్ల కృష్ణమ్మ ప్రయాణంలో అడుగడుగునా పుణ్యక్షేత్రాలే.


శ్రీశక్తి స్వరూపం జోగులాంబ

యిదో శక్తిపీఠంగా అలరారుతున్న అలంపురం జోగులాంబ ఆలయం ఉన్నది కూడా తుంగభద్రా కృష్ణా సంగమానికి దగ్గర్లోనే. ఈ అమ్మవారిని లలితాసహస్రనామాల్లో విశృంఖలగా పేర్కొన్నారు. పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవి పార్థివదేహాన్ని విష్ణుమూర్తి ఖండించినపుడు తెగిన శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయి. వాటిలో పై దవడ పడింది ఇక్కడే అనేది పురాణ కథనం. జటాజూటధారి అయి, ప్రేతాసనం మీదున్న జోగులాంబ అమ్మవారి తలను ఆవరించి ఇక్కడ తేలు, బల్లి ఉంటాయి. అలంపురంలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండడం మరో ప్రత్యేకత.


బీచుపల్లి హనుమంతుడు...

కృష్ణా తుంగభద్ర నదుల మధ్య వెలసిన ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రమే బీచుపల్లి. మహబూబ్‌ నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలంలో ఉన్న ఇక్కడి మూలవిరాట్టును శ్రీకృష్ణదేవరాయల గురువు అయిన వ్యాసరాయలు ప్రతిష్ఠించారట. అయితే, స్వామి వారిని మొదట దర్శించుకున్న బీచుపల్లి అనే పశువుల కాపరిని ఆలయ పూజారిగా నియమించారు. అలా ఈ స్వామి బీచుపల్లి రాయుడుగా ప్రసిద్ధి చెందాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారికి రథోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. కోదండరామస్వామి, కణ్వ మహర్షి ఆలయాలు ఇక్కడ అదనపు ఆకర్షణలు. ఆలయానికి సమీపంలో నది మధ్యలో నిజాం రాజులు నిర్మించిన దుర్గం ఉంది.

ఇవేకాదు, కర్ణాటకలో ఎలగూరు ఆంజనేయస్వామి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో గింజపల్లి కాశీ విశ్వేశ్వరాలయం, మక్తల్‌ దత్త క్షేత్రం, నల్గొండలో మెట్టపల్లి లక్ష్మీనృసింహ స్వామి, కృష్ణాజిల్లాలో అమరావతి అమరేశ్వరస్వామి, శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణు గుడి, ముక్త్యాల ముక్తి మహేశ్వరాలయం, వేదాద్రి నరసింహ క్షేత్రం... చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా పవిత్రమైన ఆ నీటిని మరింత పావనం చేసుకునేందుకా అన్నట్లు వందల కిలోమీటర్ల కృష్ణమ్మ ప్రయాణంలో అడుగడుగునా పుణ్యక్షేత్రాలే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు