close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుష్కర స్నానం ఎక్కడ?

పుష్కర స్నానం ఎక్కడ? 

పుష్కరాల్లో ప్రధాన ఘట్టం... పుష్కర స్నానం. అందుకే పుష్కరాల సమయంలో కృష్ణమ్మ ఒడ్డున జనం బారులుతీరుతారు. జనమే జలం అయిపోతారు. జనమే జలంలా కనిపిస్తారు. పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లకు సంబంధించిన సమాచారమిది...

పాలమూరు జిల్లాలో
మాగనూర్‌ మండలం... మాగనూర్‌ వద్దే కృష్ణానది తెలంగాణలో అడుగిడుతుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. కన్నడ, తెలుగు రాష్ట్రాల భక్తులు ఇక్కడ పుష్కర ఘాట్లలో స్నానమాచరిస్తారు. మక్తల్‌ మండలం... కురుమగడ్డ ఆలయం నది మధ్యలో ఉండటం ప్రత్యేకత. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేస్తారు. ఆత్మకూర్‌ మండలం... జూరాల ఆనకట్ట సమీపంలోని నందిమల్ల ఆలయానికి భక్తులు దర్శనానికీ, పుష్కర స్నానానికీ వస్తారు. నడిగడ్డ... బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం 44వ జాతీయరహదారికి పక్కనే ఉండటం, సమీపంలోనే కృష్ణానది ఉండటంచేత భక్తులు ఎక్కువగా పుష్కర స్నానాలకు వస్తుంటారు. అలంపూర్‌... గొందిమల్ల గ్రామంవద్ద కృష్ణానదిలో తుంగభద్ర కలుస్తుంది. ఇక్కడ గుట్టపై జూంకరేశ్వరి ఆలయం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడే పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఇక్కణ్నుంచి అలంపూర్‌లోని జోగులాంబ, నవబ్రహ్మల ఆలయాలు దగ్గరే. వీపనగండ్ల... జట్‌పోల్‌లో నది చెంతనే మదనగోపాలస్వామి, అగస్తేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఇక్కడే పుష్కర ఘాట్లు ఉన్నాయి. కొల్లాపూర్‌... సోమశిలలో నదికి దగ్గరగా శివాలయాలు ఉండటం వలన భక్తులు ఇక్కడి ఘాట్‌లలో పుష్కరస్నానాలకు వస్తారు.

నల్గొండ జిల్లాలో
దామరచర్ల మండలం... కృష్ణా-మూసీ సంగమ ప్రాంతమైన వాడపల్లి దగ్గర ఎనిమిది ఘాట్లను ఏర్పాటుచేశారు. భక్తులు పుణ్య కృష్ణాలో పుష్కర స్నానమాచరించి ఒడ్డునున్న శ్రీమీనాక్షి, అగస్త్యేశ్వర, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి 180 కి.మీ. దూరంలో, నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి పక్కన కిలోమీటరు దూరంలో వాడపల్లి ఉంది. మఠంపల్లి మండలం... మట్టపల్లిలో నాలుగు ఘాట్లున్నాయి. మట్టపల్లి క్షేత్రంలోని లక్ష్మీనరసింహుడి ఆలయం కృష్ణాపరీవాహక ప్రాంతాల్లోని పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటి. ఒడిపై ప్రహ్లాదుడితో యోగానందుడై మూర్తీభవించే నృసింహుని స్వరూపం భక్తులను తన్మయులను చేస్తుంది. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడల నుంచి హుజూర్‌నగర్‌కూ, అక్కణ్నుంచి 24 కి.మీ. ఉన్న మట్టపల్లికీ ఆర్టీసీ బస్సులూ, వాహనాలద్వారా చేరుకోవచ్చు. గుంటూరు నుంచి వచ్చే భక్తులు తంగెడరేవునుంచి బల్లకట్టు ద్వారా నదిని దాటవచ్చు. నాగార్జున సాగర్‌లో మూడు ఘాట్లు నిర్మిస్తున్నారు. దయ్యాలగండి సమీపంలో ఒకటీ, సాగర్‌వద్ద రెండు ఘాట్లూ నిర్మిస్తున్నారు. ఇక్కడికి 35 లక్షలమంది వస్తారని అంచనా.

విజయవాడలో
దుర్గాఘాట్‌... ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయానికి దిగువనున్న ‘దుర్గాఘాట్‌’కు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులందరూ ఈ ఘాట్‌లోనే స్నానమాచరించి వెళ్లనున్నారు. వీఐపీలు కూడా ఈ ఘాట్‌ వద్దకే వస్తుంటారు. ఘాట్‌ని 325 మీటర్ల మేర వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. పున్నమి ఘాట్‌... హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం మార్గంలో వచ్చే భక్తులకు అనువుగా ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారికి సమీపంలో ‘పున్నమి ఘాట్‌’ను అభివృద్ధి చేశారు. పర్యటకాభివృద్ధి సంస్థకు చెందిన పున్నమి హోటల్‌ సమీపంలో ఈ ఘాట్‌ ఉంది. 700మీటర్ల మేర ఘాట్‌ నిర్మాణం జరిగింది. సమీపంలోనే పుష్కరనగర్‌లు, పిండప్రదాన కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. భవానీఘాట్‌... 300మీటర్ల మేర ఘాట్‌ను విస్తరించారు. భవానీపురం మసీదు రోడ్డు నుంచి నదీ తీరం వెంబడి ఈ ఘాట్‌ ఉండనుంది. ఘాట్‌ వెంబడి భక్తులకు అనువుగా ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి క్లోక్‌రూమ్‌లు, పిండప్రదానం షెడ్డులు, వైద్యశిబిరాలు, సమాచార కేంద్రం లాంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ‘పద్మావతి ఘాట్‌’... దూర ప్రాంతాల నుంచి రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు ఈ ఘాట్‌ అనువుగా ఉండనుంది. బస్టాండ్‌ నుంచి రైల్వే రాజీవ్‌గాంధీ ఉద్యానవనం వరకూ దాదాపు కిలోమీటరు మేర ఘాట్‌ను అభివృద్ధి చేశారు. ‘కృష్ణవేణీ ఘాట్‌’... ప్రకాశం బ్యారేజీ సమీపంలో 750 మీటర్ల మేర ఈ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. ఘాట్‌ నుంచి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో దిగిన భక్తులు ఈ ఘాట్‌ వద్దకు వెళ్లి స్నానాలు చేసి అమ్మవారి ఆలయానికి వెళ్లే వీలుంది. ‘పవిత్ర సంగమం ఘాట్‌’... గోదావరి నీరు కృష్ణానదిలో కలిసే ఇబ్రహీంపట్నం సమీపంలో 250 మీటర్ల మేర ఈ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. ఇక్కడ కృష్ణమ్మకు హారతులు ఇవ్వనున్నారు. ‘ఫెర్రీ ఘాట్‌’... హైదరాబాద్‌, భద్రాచలం మార్గంలో వచ్చే భక్తులకు ఫెర్రీఘాట్‌ సౌకర్యంగా ఉండనుంది. దాదాపు 750 మీటర్ల మేర ఘాట్‌ను అభివృద్ధి చేశారు. నగరంలోకి రాలేని భక్తులకూ స్నానాలు చేసిన వెంటనే ఆలయాలకు వెళ్లాలనుకునే వారికీ ఉపయోగంగా దేశంలోని ఎనిమిది నమూనా ఆలయాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నారు.

అమరావతిలో
పుష్కరాలకు సంబంధించి గుంటూరు జిల్లావైపున అమరావతి రేవును ప్రభుత్వం ప్రధాన స్నానఘట్టంగా ప్రకటించింది. రోజుకు రెండు లక్షలమంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేలా ధ్యానబుద్ధ స్నానఘట్టం, అమరేశ్వరా స్నానఘట్టాల పేరుతో 1.3కి.మీల పొడవున స్నానవాటికను నిర్మించారు. స్నానఘట్టాల నుంచి అమరేశ్వరుని కోవెలకూ, ధ్యానబుద్ధకూ భక్తులు రాకపోకలు సాగించేలా నిర్మాణాలు చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలనుంచి ఇక్కడకు యాత్రికులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు సకల సౌకర్యాలూ కల్పించేందుకు పుష్కరనగర్‌లు ఏర్పాటుచేశారు.

కర్నూలు జిల్లాలో
కొత్తపల్లి మండలంలో కృష్ణానది ఒడ్డున సంగమేశ్వరం క్షేత్రం ఉంది. ఇక్కడ కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరిణి, భీమనది, భవనాసి... ఈ ఏడు నదులూ సంగమేశ్వర ప్రాంతం వద్ద కలుస్తాయి. ఇక్కడ భక్తులు పుష్కర స్నానం చేసేందుకు మూడు ఘాట్లని ఏర్పాటు చేశారు. కర్నూలు నుంచి ఆత్మకూరు చేరుకొని కొత్తపల్లి మీదుగా కపిలేశ్వరం చేరుకొని అక్కడి నుంచి సంగమేశ్వరం చేరుకోవచ్చు. శ్రీశైలంలో పాతాళగంగ దగ్గర రెండు స్నానఘాట్లు, సమీపంలోని లింగాలగట్టులో రెండు స్నానఘాట్లు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ సమాచారం
krishnapushkaram.ap.gov.in ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన వెబ్‌సైట్‌. దీన్లో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పుష్కర ఘాట్లు, పుష్కర్‌నగర్‌లు, హోటళ్ల వివరాలూ, రవాణా, పార్కింగ్‌ సదుపాయాలూ, పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అందించే తాజా సమాచారం, ప్రతీ విభాగానికి సంబంధించిన అధికారుల ఫోన్‌ నంబర్లూ, పుష్కర ఘాట్లకు సమీపంలోని పర్యటక ప్రదేశాల వివరాలూ ఉన్నాయి. ‘పుష్కరాలు 2016’ పేరుతో ఆండ్రాయిడ్‌ యాప్‌ని విజయవాడలోని పీబీ సిదార్థ కాలేజీ విద్యార్థులు అభివృద్ధిచేశారు. దీన్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కరాలకు సంబంధించిన అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా పుష్కరాల సమయంలో వివిధ రకాల సమాచారం, సేవలు అందించేందుకు krishnapushkaralu.org, krishnapushkaram.com, krishnapushkaralu2016.com, krishnaushkaram2016.net లాంటి వెబ్‌సైట్లూ ఉన్నాయి.


అమరావతి... అయిదోసారి రాజధాని!

అమరావతి... ఆంధ్రప్రదేశ్‌ తొలి రాజధాని. ఇది ఇప్పటి మాట. కానీ కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ నగరం అంతకుముందు నాలుగుసార్లు ఆంధ్రులకు రాజధానిగా ఘన చరిత్రను సృష్టించింది. వందల ఏళ్లపాటు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. శతాబ్దాల ఆ వైభవమే సరికొత్త రాజధానికి పునాది.

దులు నాగరికతకు పుట్టినిళ్లు... అమరావతి చరిత్ర తెలిసినవారెవరైనా ఆ మాట అక్షర సత్యం అనకుండా ఉండరు. కృష్ణవేణి ఒడ్డునున్న ఈ నగరం ఈనాటిది కాదు మరి. ఆదిమానవుడు ఇక్కడ సంచరించాడనడానికి ఆధారాలున్నాయి. భారతదేశాన్ని ప్రపంచానికి మరింత గొప్పగా పరిచయం చేసిన మహాయాన బౌద్ధమత ఆధ్యాత్మిక సుగంధాలు ఈ నేల నుంచి గుబాళించినవే. అమరావతి నమూనా రూపకల్పన చేసింది జపాన్‌. అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి చైనా ముందుకొచ్చింది... వీటి గురించి మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ క్రీ.పూ. రెండు, మూడు శతాబ్దాల్లోనే ఈ దేశాలకు దిశా నిర్దేశం చేసిన ఘనత అమరావతిది. ఆచార్య నాగార్జునుడి దగ్గర విద్యాభ్యాసం చేసేందుకు చైనా, జపాన్‌, శ్రీలంక... లాంటి ఎన్నో ఆసియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చేవారు. ఆయా దేశాల్లో బౌద్ధం వేళ్లూనుకోవడానికి ఓ ప్రధాన కారణమిదే. అవును, అమరావతి అంటే చరిత్ర కాదు. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన ఒకనాటి వైభవం. ఆ చరిత్రను పునరావృతం చేసేందుకే గుంటూరు జిల్లాలోని కృష్ణా తీరంలో అమరావతి పేరుతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

గౌతమీ పుత్రుడి రాజధాని
ధమ్మకడ, ధనకడక, ధాన్యకటకంగా తర్వాత ధరణికోటగా చివరికి అమరావతిగా స్థిరపడిందీ నగరం. ఇక్కణ్నుంచి దక్షిణాన కంచి వరకూ ఉత్తరాన అనేక ప్రదేశాలను కలుపుతూ అప్పట్లోనే అద్భుతమైన రవాణావ్యవస్థ ఉంది. ఇక్కణ్నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకూ విదేశాలకూ నౌకా వాణిజ్యం జరిగేది. వ్యవస్థీకృత పట్టణ, నగర సంస్కృతికి ధాన్యకటకం నిదర్శనంగా ఉండేది. బుద్ధుడి కాలంలో ఉత్తర భారతంలో 16 మహా జనపదాలు(స్వతంత్ర రాజ్యాలు) ఉంటే దక్షిణ భారతంలో ఉన్న ఏకైక జనపదం ధాన్యకటకమే. శాతవాహనుల కాలంలో ధాన్యకటకం ఆంధ్రులకు తొలిసారి రాజధాని అయింది. క్రీ.శ 60 నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దిగ్విజయ యాత్రలు చేసి రాజస్థాన్‌ వరకూ జయించాడు. తర్వాత పల్లవులూ కోట కేతరాజులూ ధరణికోటను రాజధానిగా చేసుకున్నారు. నాలుగోసారి చింతపల్లి జమిందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయడు 1780ల్లో ధరణికోట నుంచి కొంచెం ముందుకు వచ్చి నగరాన్ని నిర్మించాడు. ఇంద్రుడి రాజధానిలా అందంగా ఉన్న తన రాజధానికి అమరావతి అని పేరు పెట్టుకున్నాడు.

అమరావతి 1700 సంవత్సరాలకు పైగా ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా వర్ధిల్లింది. క్రీ.పూ. మూడో శతాబ్దంలో అశోకుడు ధాన్యకటకాన్ని స్వాధీనం చేసుకునే సమయానికే ఇక్కడ మహాచైత్యం ఉంది. బుద్ధుడి అవశేషాలు నిక్షిప్తం చేయడంతో దీన్ని బౌద్ధులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించేవారు. అశోకుడూ శాతవాహనులూ ఇక్ష్వాకులూ పల్లవులూ మహాస్తూపాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. రెండో గౌతమ బుద్ధుడిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి దగ్గర్లో ఉన్న శ్రీ పర్వతం(నాగార్జున కొండ) మీది నుంచే జ్ఞానబోధనలు చేశారు. గౌతమ బుద్ధుడు మూడుసార్లు ధర్మచక్రప్రవర్తనం చెయ్యగా మూడోసారి కాలచక్ర మూలతంత్రాన్ని అమరావతిలోనే బోధించాడని టిబెటన్లు విశ్వసిస్తారు. క్రీ.శ. తొమ్మిదో శతాబ్దం చివర్లో తూర్పు చాళుక్య రాజైన రెండో అమ్మరాజు పంచారామాల్లో ఒకటైన అమరావతిలో అమరేశ్వర ఆలయాన్ని నిర్మించాడు.

నవ్యాంధ్రకు మణిహారం
కొత్త రాజధాని ‘అమరావతి’ కూడా మరో వెయ్యేళ్లపాటు ఆంధ్రుల ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అత్యంత అధునాతనంగా, సుందరంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అందుకోసం వ్యూహాత్మకంగా గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 217 చ.కి.మీ. ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ నగరం సుమారు 15-17 కి.మీ. పొడవునా నది అభిముఖంగా ఉంటుంది. దీన్ని ప్రపంచంలోని పది అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రధాన కార్యకలాపాల్ని ప్రాతిపదికగా చేసుకుని ఇక్కడ నవ(ఆర్థిక, పాలన, విద్య, విజ్ఞాన, ఆరోగ్య, పర్యటక, క్రీడా, ఎలక్ట్రానిక్‌, న్యాయ) నగరాలను అభివృద్ధి చేస్తారు. ఒకప్పుడు ధాన్యకటకం విద్య, వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లినట్టే కొత్త అమరావతి కూడా ప్రసిద్ధి చెందాలన్నది తెలుగువారి ఆకాంక్ష. నాటి ఘన చరిత్రకూ రేపటి ఉజ్వల భవిష్యత్తుకూ సాక్షి కృష్ణమ్మే.

- జె.కళ్యాణ్‌బాబు, ఈనాడు అమరావతి

 

 

నాగార్జునుడు నడయాడిన చోటు...

కృష్ణవేణీ నది... కేవలం నది మాత్రమే కాదు. ఆ చుట్టూ ప్రపంచ గతిని మార్చిన నాగరికత అల్లుకుని ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే నాగార్జున కొండ. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన చోటిది. ఇక్కడి నుంచే ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేశాడు.

నుచూపు మేరలో గలగల పారే కృష్ణమ్మ, మరోవైపు నల్లమల కొండల అందాలు ఆ మధ్యలో ఎన్నో చారిత్రక విశేషాలను కళ్లకు కడుతూ కనిపిస్తుంది నాగార్జున కొండ. దీన్ని ఒకప్పుడు శ్రీపర్వతంగా పిలిచేవారు. ప్రముఖ బౌద్ధతాత్వికుడు, దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలంలో ఇక్కడే బౌద్ధమత బోధనలు చేశాడు కాబట్టి, తర్వాతి కాలంలో ఇది నాగార్జున కొండగా మారింది. గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో నాగార్జున సాగర్‌ జలాశయంలో 144 ఎకరాల విస్తీర్ణంలో ఒక దీవిలా ఉంటుందీ ప్రాంతం. నాగార్జునుడి బోధనలకు ఆకర్షితుడైన శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతం మీద బౌద్ధ విద్యాలయాన్ని నిర్మించి ఆయన్ను అందులో అధ్యాపకుడిగా నియమించాడు. ఇక్కడ విద్యనభ్యసించడానికి విదేశాల నుంచీ విద్యార్థులు వచ్చేవారు.

ఎన్నో ఆనవాళ్లు
1927-1956 మధ్య నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో ఈ చరిత్ర తాలూకు శిథిలాలెన్నో నాగార్జునకొండ పరిసర లోయప్రాంతాలలో లభ్యమయ్యాయి. వీటిలో క్రీ.శ. రెండూ మూడూ శతాబ్దాలనాటి నాగార్జున విశ్వవిద్యాలయ భవన శిథిలాలూ ఇతర విహారాలూ ఆరామాలూ స్తూపాలూ రంగమండపమూ చైత్యగృహాలూ మండపాలూ పాలరాతి కట్టడాలూ బౌద్ధశిల్పాలూ ఇలా వందలాది శిథిలాలు దొరికాయి. వీటిలో మహాచైత్యం అత్యంత ముఖ్యమైంది. దీన్లో ఒక ధాతు పేటిక కూడా దొరికింది. ఈ ధాతువు గౌతమ బుద్ధుడిదేనని నమ్మకం. సాగర్‌ ఆనకట్ట నిర్మాణమపుడు లోయ ప్రాంతంలో బయటపడిన స్తూపాలూ ఇతర బౌద్ధ ఆరామాలూ ముంపునకు గురికాకుండా వాటిని అక్కణ్నుంచి తొలగించి నాగార్జున కొండపై పునర్నిర్మించారు. మరికొన్నిటిని అప్పటి లాంచీస్టేషన్‌ ప్రాంతమైన అనుపు గ్రామం వద్ద ఉన్నది ఉన్నట్లుగా మళ్లీ ఏర్పాటు చేశారు. పాతరాతియుగం నుంచి నవీన శిలాయుగం వరకూ మానవులు వినియోగించిన ఎన్నో రకాల పనిముట్లూ నాణేలూ పూసలూ శిలా ఫలకాలూ విగ్రహాలు కూడా నాగార్జున కొండమీదా నదీ తీరంలోనూ లభ్యమయ్యాయి. 1966లో కొండమీద మ్యూజియాన్ని నిర్మించి వీటిలో చాలా వస్తువుల్ని అక్కడ భద్రపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ద్వీప మ్యూజియం’ ఇదే. ఈ ప్రాంతంలో బయటపడిన చారిత్రక విశేషాల్లో కొన్నింటిని మద్రాసు మ్యూజియానికీ, మరికొన్నిటిని బ్రిటిష్‌వారు లండన్‌ మ్యూజియానికి తరలించారు. డ్యాం నిర్మాణం తర్వాత నాగార్జున కొండకు పర్యటకులను చేరవేయడానికి అనుపు నుంచి లాంచీల రాకపోకలను ప్రారంభించారు. దీంతోపాటుగా అనుపులో పునర్నిర్మించిన బౌద్ధ ఆరామంలో వివిధ విభాగాలకు చెందిన విహారాలూ బౌద్ధసన్యాసుల గదులూ ధ్యానమందిరాలూ పాలరాతి శిలా మండపాలూ సందర్శకులను కట్టి పడేస్తాయి. ఇక్కడికి విదేశీ పర్యటకులూ, బౌద్ధ సన్యాసులూ వస్తుంటారు. ఈ ప్రదేశానికి కనుచూపు మేరలో ఆనాటిరాజులు వినోద, విజ్ఞాన సమావేశాలను నిర్వహించేందుకు వీలుగా నిర్మించిన రంగమండపం కనిపిస్తుంది. ఇక, శాతవాహనుల కాలం నాటి ఆటస్థలం, గిరిజనులు పూజించే రంగనాథస్వామి ఆలయం కూడా ఇక్కడున్నాయి. ఇక్కడకు వెళ్లాలంటే నాగార్జునసాగర్‌ ఆనకట్ట నుంచి 14కి.మీ కృష్ణానదిలో లాంచీలో ప్రయాణం చేయాలి.

బుద్ధ వనం
ఈ ప్రాంతానికి బౌద్ధంతో ఉన్న అనుబంధానికి గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, తెలంగాణ పర్యటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో ‘బుద్ధవనం’ను అభివృద్ధి చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి నుంచి నదీతీరం వరకు సుమారు 240 ఎకరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా వంద ఎకరాల్లో ఒకనాటి అమరావతి మహాస్తూపాన్ని అవే కొలతలతో పునర్నిర్మిస్తున్నారిక్కడ. 2000 ఏళ్ల నాటి మహాస్తూపం ఎంతటి శిల్పకళారీతిని సంతరించుకుందో అదేవిధంగా ఈ మహాస్తూపాన్నీ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ స్తూపం పనులు 80 శాతం పూర్తయ్యాయి. దీంతో పాటు బౌద్ధమతానికి ప్రతీకై అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ పాజెక్టును ఎనిమిది వనాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో బుద్ధ చరిత వనం, జాతక కథల వనం, బౌద్ధమత వనం, ప్రపంచ స్తూపాల వనం ఉన్నాయి. మిగతా నాలుగు వనాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పుష్కరాల సమయంలో పర్యటకులను దీన్లోకి అనుమతిస్తారు.


 

 

నల్లమల... ప్రకృతి ఖిల్లా!

అరుదైన వృక్ష సంపద, వైవిధ్యమైన జీవ సంపద... నల్లమల సొంతం. గాలించే కొద్దీ కొత్త కొత్త వృక్ష-జంతు జాతులు కనిపిస్తూనే ఉన్నాయిక్కడ. ఇవే కాదు ఎత్తయిన కొండలూ, అందమైన లోయలూ, పురాతన ఆలయాలూ ఆ మధ్యలోంచే కృష్ణమ్మ పరవళ్లూ... ఇలాంటివెన్నో నల్లమల సందర్శకులను కనువిందు చేస్తాయి.

ల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోనూ తెలంగాణాలో మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లోనూ విస్తరించాయి. నల్లమల మొత్తం విస్తీర్ణం 5,907.70 చ.కి.మీ, కాగా ఇందులో పులుల అభయారణ్యం 3,040.74 చ.కి.మీ. రాష్ట్ర విభజన తర్వాత అచ్చంపేట, నాగార్జున సాగర్‌ అటవీ ప్రాంతంలో కొంత భాగం తెలంగాణకూ, నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, సాగర్‌లో మిగతా భాగం ఆంధ్రకూ చెందాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3,296.31 చ.కి.మీ, తెలంగాణలో 2,611.39 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. నల్లమల ఉత్తర-దక్షిణ దిశల్లో 144 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. నల్లమల సగటు ఎత్తు... 3,608 అడుగులు. నల్లమలలో ఎత్తైన శిఖరం భైరాని కొండలు (శిఖరేశ్వరం). దీని ఎత్తు 1106 మీటర్లు.