close
ఒక్క జత.. అన్నిటికీ మ్యాచింగే

ఒక్క జత చెప్పుల్ని కొనండి... పది జతల్ని ఉచితంగా పొందండి. ఇదేదో మార్కెట్‌ జిమ్మిక్కు కాదు. ‘ఇంటర్‌ ఛేంజబుల్‌ శాండల్స్‌’ పేరుతో చెప్పుల్లో సరికొత్తగా వస్తున్న ట్రెండ్‌. ఇలాంటివి ఒకటీ రెండూ జతలుంటే చాలు, వాటినే రకరకాల రంగుల్లోకీ డిజైన్లలోకీ మార్చి బట్టలకు మ్యాచింగ్‌గానూ ఫంక్షన్లకు మెరిసిపోయేలానూ చెయ్యొచ్చు. ఎలా అంటే... ఇలా..!

వేసుకుంటే చెప్పు అడుగు భాగం ఏదైనా ఒకటే. మారేదల్లా పైనున్న స్ట్రాప్‌లే. ఆ డిజైన్లూ రంగుల కోసమే ఫ్యాషన్‌ అనీ మ్యాచింగ్‌ అనీ... జతల కొద్దీ చెప్పుల్ని కొనాల్సిన పరిస్థితి. అన్ని చెప్పుల్ని కొనాలంటే బోలెడంత ఖర్చు పెట్టాలి. మళ్లీ వాటిలో కాస్త ఖరీదైనవీ ఫంక్షన్లకు వేసుకునే డిజైన్లుంటే అవి రోజువారీకి పనికిరావు. దాంతో వాటన్నిటినీ దుమ్ము పట్టకుండా భద్రపరచడమూ పనే. ఇక, ఫంక్షన్లూ పార్టీలున్నా ప్రయాణాల్లో ఒక్క జత చెప్పుల్ని తీసుకెళ్లడమే కష్టం. అలాంటపుడు ఎన్ని జతలున్నా వృథానే. అందుకే, ఈ సమస్యలకు పరిష్కారంగా ‘ఇంటర్‌ ఛేంజబుల్‌ శాండల్స్‌’ని రూపొందిస్తున్నాయి దూక్‌, బిజోలీ, స్లింక్స్‌, కామొ, కాంబియామి, స్విచ్‌ ఫ్లాప్స్‌, సోల్‌మేట్స్‌... లాంటికొన్ని కంపెనీలు. ఇవుంటే ఒక్క జత చెప్పుల్నే ఎన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు. కాబట్టి, ఖర్చూ తగ్గుతుంది. ప్రయాణాల్లోనూ సులభంగా తీసుకెళ్లొచ్చు.

వీటిలోనూ రెండు రకాలున్నాయి. కొన్నింటిలో చెప్పు అడుగు భాగాన్నీ పైనున్న స్ట్రాప్‌లనీ వేరు చేసేయొచ్చు. ఎలాగో మనం వేసుకున్నాక చెప్పు అడుగుభాగం కనిపించదు కాబట్టి, పైన అమర్చే స్ట్రాప్‌లలో రకరకాల రంగులూ డిజైన్లున్న వాటిని ఎంచుకుని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అందుకనుగుణంగానే ఆయా కంపెనీలు ఈ సోల్స్‌నీ స్ట్రాప్‌లనూ విడివిడిగా అమ్ముతున్నాయి. ఇంకేముందీ, ఆన్‌లైన్‌లో మనకు నచ్చిన ఫ్లాట్‌ లేదా హీల్‌ సోల్‌తో పాటు దానికి పెట్టేందుకు ఎక్కువ జతల స్ట్రాప్‌లను విడిగా తీసుకుంటే సరి. బటన్‌లూ బెల్టుల సహాయంతో వీటిని చెప్పుకి పెట్టడం కూడా సులభమే.అంటించేయొచ్చు
స్ట్రాప్‌లని తీసే పనిలేకుండా వాటిమీదే మరో రంగూ డిజైన్‌తో ఉన్న పలుచటి బట్టలాంటి స్ట్రాప్‌ని అంటించేవి ఇంటర్‌ఛేంజబుల్‌ శాండల్స్‌లో మరో రకం. విడిగా దొరికే ఈ అంటించే స్ట్రాప్‌లతో చెప్పుల్ని మనం వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా మార్చేసుకోవచ్చు. ఇవి కాకుండా పూసలూ రంగురాళ్లతో చేసిన స్ట్రాప్‌లను చెప్పు ముందుభాగంలో అమర్చుకునేందుకు పెద్దపెద్ద జెమ్‌స్టోన్‌లతో రూపొందించిన యాక్సెసరీలు కూడా ఎన్నో వస్తున్నాయి. చెప్పుల స్ట్రాప్‌లకు అమరి ఉండే బటన్‌ల సహాయంతో వీటినీ సులభంగానే పాదరక్షలకు పెట్టేయొచ్చు. ఇప్పుడొప్పుకుంటారా... ఇంటర్‌ఛేంజబుల్‌ శాండల్స్‌తో ఫ్యాషన్‌ని మరింత అందంగా సౌకర్యంగా అనుసరించేయొచ్చని. అన్నట్లూ రకరకాల స్ట్రాప్‌లతో కలిపి ఈ చెప్పుల్ని ప్రియమైనవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.


 

 

 

అదిరే అదిరే అరలే అదిరే

ఇంట్లో ఎన్ని అలంకరణ వస్తువులు ఉన్నాయన్నది కాదు. అవి కొత్తగా చూడగానే నచ్చేలా ఉండాలి. మొత్తంగా ఇంటికొచ్చిన అతిథులతో వావ్‌ అనిపించాలి. అందుకోసం ఇంట్లోని ఫర్నిచరు దగ్గర్నుంచి గోడకు అలంకరించే షెల్ఫుల వరకూ అన్నీ ట్రెండీగా అలంకరించేస్తున్నారు ఈనాటి గృహాలంకరణ ప్రియులు. అందులో భాగంగా వస్తున్నవే ఈ సరికొత్త షెల్ఫులు..!

కొత్త ఇంటికి ఫర్నిచరు చేయించాలన్నా షోకేసులు చేయించాలన్నా సౌకర్యంతోబాటు అవి పదికాలాలపాటు పదిలంగా ఉండేలా చూసుకునేవారు ఒకప్పుడు. అందుకోసం గోడల్లోనే సిమెంటు అరలు పోసి అల్మరాల్లా కట్టి షోకేసుల్లా అలంకరించేవారు. అయితే ఆ పద్ధతికి కాలం చెల్లిపోయింది. తరవాత రకరకాల చెక్కతో చేసిన రెడీమేడ్‌ షోకేసులూ చాలానే వచ్చాయి. ఇప్పుడు అవీ బోరయిపోయాయి. ఎందుకంటే గదులన్నీ విశాలంగా కనిపించాలి. గోడలు కూడా చూడముచ్చటైన రంగుల్లో ఉండాలి. మరీ ఎక్కువ అలంకారాలు లేకుండా సాదాగానూ ఆహ్లాదంగానూ కనిపించేలా ఉంచడమే గృహాలంకరణలో లేటెస్ట్‌ ట్రెండ్‌. ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్లేటప్పుడు చకాచకా విప్పేసి ప్యాక్‌ చేసుకునేలా ఉండాలి. అంటే అందం, సౌలభ్యంతోపాటు ఆయా వస్తువుల బరువూ తక్కువగా ఉండాలన్నమాట. అందుకోసం రూపొందించినవే ఈ సరికొత్త షెల్ఫ్‌లు. ఒక్కో అర సుమారు పది కిలోల బరువును మోయగలదు. పైగా ఈ అరలను గోడమీద అమర్చుకునేందుకు అవసరమైన వస్తువులూ అరతో పాటే రెడీమేడ్‌ కిట్‌ రూపంలో వస్తున్నాయి.

తేలికపాటి చెక్కతో తయారయ్యే ఈ షెల్ఫులకు ఆకర్షణీయమైన రంగులు వేయడం లేదా చెక్కకి రంగురంగుల కృత్రిమ లెదర్‌ను అతికించడంతో ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. పైగా ఇవి చదరం, వృత్తం, దీర్ఘచతురస్రం... వంటి రకరకాల రేఖాగణిత ఆకారాల్లోనూ విభిన్న సైజుల్లోనూ దొరుకుతున్నాయి. దాంతో ఈ బాక్సు షెల్ఫుల్ని గోడమీద మనకు కావాల్సినచోట బెడ్‌రూమ్‌లోనూ కిచెన్‌లోనూ లివింగ్‌రూమ్‌లోనూ ఇలా ఎక్కడంటే అక్కడ తగిలించుకోవచ్చు. రెండు నుంచి ఏడెనిమిది వరకూ ఎన్ని కావాలంటే అన్నింటిని అమర్చుకోవచ్చు. ఆయా గదుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన చిన్న చిన్న వస్తువులూ పుస్తకాలతోబాటు ఫొటోలూ ఫ్లవర్‌వేజ్‌లూ బొమ్మల్లాంటి వాటితో వీటిని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు. దాంతో గోడలు భారీ అలంకరణ వస్తువులతో కిక్కిరిసిపోకుండా గదిని విశాలంగా కనిపించేలా చేస్తాయి.

గోడ మధ్యలోనే కాదు, రెండు గోడలమీదా వచ్చేలా గది మూలల్లో కూడా నచ్చిన డిజైన్‌లో అలంకరించుకోవచ్చు. వాటి అమరికలో మనదైన సృజననూ ప్రదర్శించవచ్చు. మొత్తమ్మీద గోడమీద ఈ షెల్ఫుల అమరిక ఓ అందమైన కళాఖండాన్ని తలపిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు చెప్పండి... అరల అలంకరణ అదిరిందని మీకూ అనిపిస్తోంది కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.