close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సేవ చేసే మనసుంది..!

సేవ చేసే మనసుంది..!

‘ఆకలితో ఉన్నవాళ్లు ఇక్కడ ఉచితంగా తినొచ్చు’ అంటూ హోటల్లోకి ఆహ్వానిస్తారు ఒకరు. హోటల్లో వదిలేసిన సబ్బుల్ని రీసైకిల్‌ చేసి నిరుపేద పిల్లలకు అందిస్తారు మరొకరు. వీధుల్లో బిచ్చమెత్తుకునే పిల్లల్ని రెస్టారెంట్‌కి తీసుకెళ్లి భోజనం పెట్టిస్తారు ఇంకొకరు. తోచినంతలో తోటివారికి సాయం చెయ్యడమే వీరందరి మతం.

కేవలం చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం ద్వారా అరికట్టగలిగే వ్యాధుల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా పిల్లలు చనిపోతున్నారు. అందులో మన దేశంలోని మురికి వాడల్లోని పిల్లలు 20 లక్షలకు పైగా ఉంటున్నారు. దీనిక్కారణం వారి దగ్గర సబ్బులు కొనుక్కోవడానిక్కూడా డబ్బుల్లేకపోవడమే. ఇది... నాణేనికి ఒకవైపు. నాలుగొందల గదులున్న ఒక్కో హోటల్‌ నుంచి ఏడాదికి 3.5 టన్నుల సబ్బుల్ని వృథాగా పడేస్తున్నారు. ఎందుకంటే హోటల్లో కొత్త అతిథులు దిగిన ప్రతిసారీ కొత్త సబ్బును పెడతారు. వాళ్లు ఒకటీ రెండు రోజులు ఉండి వెళ్లిపోగానే ఆ సబ్బును తీసి పడేస్తారు. ఇది... నాణేనికి మరో వైపు. ఈ రెండు దృశ్యాలనూ కళ్లారా చూసిన 25 ఏళ్ల ‘ఎరిన్‌ జైకిస్‌’ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ‘సుందర’ స్వచ్ఛంద సంస్థ. అమెరికాలోని న్యూయార్క్‌కి చెందిన ఎరిన్‌ ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలో భారత్‌లోని మురికి వాడల్లోని ప్రజల దీనస్థితిని చూసి చలించిపోయింది. వారికోసం ఏదైనా చెయ్యాలని ముంబైకి వచ్చింది. అప్పుడే అపరిశుభ్రమైన చేతుల్తో తినడంవల్ల అక్కడి మురికివాడల్లోని ఎంతోమంది పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారని గమనించింది. వెంటనే ముంబైలోని కొన్ని హోటళ్లకు వెళ్లి, వాళ్లు పడేసే సబ్బుల్ని తనకిస్తే రీసైకిల్‌ చేసి పేద పిల్లలకు అందిస్తానని చెప్పి ఒప్పించింది. అలా 2014లో ‘సుందర’ స్వచ్ఛంద సంస్థకు పునాది పడింది. దీన్లో పనిచేసే మహిళలు హోటళ్లలో మిగిలిపోయిన సబ్బుల్ని తీసుకొచ్చి, పై పొరను చెక్కి, క్రిములు పోయేలా ప్రత్యేకమైన రసాయనంలో వేస్తారు. తర్వాత అన్నిటినీ పేస్ట్‌లా చేసి, మెషీన్ల ద్వారా కొత్త సబ్బులుగా మారుస్తారు. వాటిని మురికివాడల్లోని ముప్ఫై పాఠశాలలూ, ఇతర కమ్యూనిటీ సెంటర్లలో పేదవారికి పంచుతారు. దీంతోపాటుగా చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవల్సిన ఆవశ్యకత గురించి కూడా పిల్లలకూ వారి తల్లిదండ్రులకూ వివరిస్తారు ఉద్యోగులు. సంస్థలో పనిచేసేందుకు పేద మహిళల్ని ఎంపిక చేసుకుని ‘సుందర’ వారికీ చేయూతనిస్తోంది. వృథాగా పోయే సబ్బుల్ని ఇలా వినియోగించడం వల్ల పర్యావరణానిక్కూడా మంచిదే. ఎరిన్‌ మనదేశంతో పాటు మయన్మార్‌, ఉగాండాల్లో కూడా ఈరకం సేవల్ని అందిస్తోంది. వీటిని వివిధ స్వచ్ఛంద సంస్థలూ దాతల సహాయంతో నడిపిస్తోంది. ఇదే ఆలోచనతో మరో స్వచ్ఛంద సంస్థ ‘డాక్టర్స్‌ ఫర్‌ యూ’ ఈమధ్యే ‘సోప్‌ ఫర్‌ హోప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడు నెలల కిందట ముంబైలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటికే కొన్ని వందల సబ్బుల్ని రీసైకిల్‌ చేసి మురికివాడల్లో పంచింది.

డబ్బుల్లేవా... ఉచితంగా తినండి
‘ఫ్రెండ్స్‌... మీదగ్గర డబ్బుల్లేవా... ఆకలితో ఉన్నారా... అయితే, ఈ బెల్‌ నొక్కి లోపలికి రండి. శాకాహార భోజనం లేదా మాంసాహార భోజనం ఇంకా పాలు, కాఫీ మీకేది కావాలంటే అది ఉచితంగా తినండి, తాగండి’... కెనడాలోని ఎడ్మంటన్‌లో ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్‌ తలుపు మీద రాసున్న మాటలివి. ఈ ‘ఇండియన్‌ ఫ్యూజన్‌’ రెస్టారెంట్‌కు యజమాని దిల్లీకి చెందిన ప్రకాష్‌ చిబ్బర్‌. ‘దిల్లీలో ఓ రెస్టారెంట్‌లో షెఫ్‌గా పనిచేస్తున్న నాకు పెళ్లైన మూడు నెలలకే ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రెండున్నరేళ్లు మంచంమీదే ఉన్నా. తర్వాత ఉద్యోగం లేదు. చేతిలో డబ్బుల్లేక, ఆకలికి తట్టుకోలేక భోజనం సమయానికి స్నేహితులు ఎవరో ఒకరింటికి వెళ్లేవాళ్లం. తర్వాత నెమ్మదిగా నిలదొక్కుకుని డబ్బు సంపాదించేందుకు కెనడా వచ్చాను. ఇప్పుడు ఓ హోటల్‌కి యజమానిని అవ్వగలిగానంటే దాని వెనుక ఎన్నో ఆకలి కష్టాలున్నాయి. అందుకే, ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నా’ అంటాడు చిబ్బర్‌. ఈయన హోటల్‌ ప్రధాన ద్వారం కస్టమర్లు రావడానికైతే రెండో ద్వారం పేదవారికోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది.

వీధి పిల్లలకి రెస్టారెంట్‌లో భోజనం
ఆకలేస్తోంది... అంటూ రోడ్డుమీద పేద పిల్లలు అడుక్కోవడమూ, ఇష్టమున్నవాళ్లు రూపాయో రెండు రూపాయలో వారి చేతిలో పెట్టడమూ చూస్తూనే ఉంటాం. కానీ బిచ్చమెత్తుకునే అలాంటి పిల్లల్ని మంచి రెస్టారెంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టించే వారిని బహుశా ఎవరూ చూసుండరు. అందుకే, ఆ పని చేసి కొచ్చికి చెందిన పీసీ అలెగ్జాండర్‌ సోషల్‌ మీడియాలో జాతీయ మీడియాలో ఇప్పుడు అందరి మనసుల్నీ దోచుకుంటున్నాడు. వైద్యుడిగా పనిచేసే అలెగ్జాండర్‌ ఓరోజు దిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న ఓ హోటల్లోకి వెళ్లబోతుండగా కొందరు పిల్లలు ‘ఆకలేస్తుంది చిల్లర ఇమ్మని’ అడిగారు. కానీ ఆయన వాళ్లను హోటల్లోపలికి తీసుకెళ్లి, మెనూలోని బొమ్మల్ని చూపి, వారికి నచ్చింది తెప్పించుకోమన్నాడు. పిల్లలు చాలా సంతోషంగా కావల్సినవన్నీ తిన్నారు. అక్కడే టిఫిన్‌ చేస్తున్న అసిత్‌ రంజన్‌ మిశ్రా అనే ఆయన ఈ తతంగాన్నంతా చూసి, వారి ఫొటోనీ వివరాలనూ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ‘ఆకలిని తీర్చడంతోపాటు నేను వారి కళ్లల్లో ఆనందాన్నీ చూడాలనుకున్నా. పిల్లల వైద్యుడిగా నేనెప్పుడూ పేద ధనిక పిల్లల్ని వేరువేరుగా చూడలేదు. అందుకే మనసుకు తోచింది చేస్తుంటాను’ అంటారు అలెగ్జాండర్‌.


 

ఐఐటీ కల.. నిజం చేస్తున్నారిలా!

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటొస్తే జీవితం సెట్టయిపోయినట్టే అనుకోని విద్యార్థి ఉండడు. కానీ ప్రతిభ ఉన్నా మార్గదర్శులు లేకా, మంచి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లడానికి డబ్బుల్లేకా, అణాకాణీ కాలేజీలతో సరిపెట్టుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు. అలాంటి పేద ప్రతిభావంతుల ఐఐటీ కలల్ని నిజం చేస్తోంది ‘అవంతీ ఫెలోస్‌’.

తెలివితేటలకు పేదా గొప్పా అన్న తేడా ఉండదు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోనూ చదువులో చురుగ్గా ఉండే పిల్లలు చాలామంది ఉంటారు. కానీ నాణ్యమైన శిక్షణలేక వాళ్లు పోటీ ప్రపంచానికి దూరమవుతారు. ఫలితంగా అర్హత ఉన్నా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకోవడంలో విఫలమవుతారు. ఇంకోపక్క ఓ మోస్తరుగా చదివే ధనవంతుల పిల్లలు ఖరీదైన కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకొని ఐఐటీలకు అలవోకగా అర్హత సాధిస్తున్నారు. అలాంటి శిక్షణ పేద విద్యార్థులకూ అందితే వాళ్లూ అద్భుతాలు సృష్టించడం ఖాయం. అదే పనిని ఉచితంగా చేస్తూ ఎంతో మందిని ఐఐటీయన్లూ, ఎన్‌ఐటీయన్లుగా తీర్చిదిద్దుతోంది ‘అవంతీ ఫెలోస్‌’ అనే సంస్థ. మూడు వందలకు పైగా ఐఐటీ విద్యార్థులే ఈ సంస్థలో మెంటార్లుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తుండటం విశేషం. ఆరేళ్ల క్రితం అక్షయ్‌, కృష్ణ రామ్‌కుమార్‌ అనే ఐఐటీ బొంబే పూర్వ విద్యార్థులు మొదలుపెట్టిన సంస్థ ఇప్పుడు వందల మంది పేదవిద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తూ ముందుకెళ్తొంది.

విద్యార్థులే మెంటార్లు
ముంబై, చెన్నై, దిల్లీ, కాన్పూర్‌, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌, ముస్సోరీ లాంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులకు అవంతీ సంస్థ ఫెలోషిప్‌ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీ- బొంబే, మద్రాస్‌, కాన్పూర్‌, రూర్కీ, దిల్లీ లాంటి విద్యాసంస్థల్లో చదువుతోన్న దాదాపు మూడు వందల మంది విద్యార్థులూ, పూర్వ విద్యార్థులూ, ప్రొఫెసర్లూ అవంతీ సంస్థలో వలంటీర్లుగా సేవలందిస్తున్నారు. ఏటా సంస్థ ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులకు ఎంట్రెన్సు పరీక్ష నిర్వహించి శిక్షణ కోసం 300మందిని ఎంపిక చేస్తుంది. సంస్థలో వలంటీర్లే వీళ్లకు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు మద్రాస్‌, పుదుచ్చేరి కార్పొరేషన్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులు శిక్షణకు ఎంపికైతే వాళ్లకు ఐఐటీ మద్రాస్‌లో చదివే విద్యార్థులే శిక్షకులుగా ఉంటారు. జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు రావాలంటే ఎలాంటి పుస్తకాలు చదవాలీ, కఠినమైన ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లాంటి సబ్జెక్టుల్లో నైపుణ్యం ఎలా సాధించాలీ... లాంటి విషయాల్లో వలంటీర్లే శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన ప్రభుత్వ స్కూళ్లలో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అవంతీ బృందం రోజూ తరగతులు నిర్వహిస్తుంది. వారాంతాల్లో మెంటార్లు కాలేజీలకే వెళ్లి పాఠాలు బోధిస్తారు. అవంతీ మేనేజ్‌మెంట్‌ బృందం తయారు చేసిన సిలబస్‌కు అనుగుణంగానే రెండేళ్ల పాటు వారానికి 20గంటల చొప్పున శిక్షణ ఉంటుంది.

హార్వర్డ్‌ తరహా శిక్షణ...
‘నేను ఐఐటీలో చదివేప్పుడు ఆగ్రాకు దగ్గర్లోని ఓ పల్లెటూరి నుంచి వచ్చిన స్నేహితుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైన విద్యార్థి. కానీ అప్పటికి రెండేళ్ల క్రితం వరకూ అతడికి ఐఐటీ గురించి తెేలీదట. పల్లెటూళ్లొ పెరిగిన ఆ కుర్రాడు ఆగ్రాలో ఇంజినీరింగ్‌ చదువుకోవడానికి వచ్చినప్పుడే ఐఐటీల గురించి తెలుసుకొని ఏడాది పాటు శిక్షణ తీసుకుని సీటు సాధించాడు. దేశంలో అలాంటి ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు సరైన శిక్షణ లేక మంచి భవిష్యత్తుకు దూరమవుతున్నారని అనిపించింది. అప్పుడే ఇలాంటి సంస్థను మొదలుపెట్టాలన్న ఆలోచన వచ్చింది’ అంటాడు కృష్ణ. అతనికి అక్షయ్‌తో పాటు ఐశ్వర్య, రోహిత్‌, రాహుల్‌, వైభవ్‌ అనే మరో నలుగురు ఐఐటీ బొంబే విద్యార్థులూ తోడయ్యారు. వాళ్లంతా చదువు పూర్తిచేసి విదేశాల్లో పీహెచ్‌డీలూ, ఉద్యోగాలూ కొనసాగిస్తూనే సంస్థను ఏర్పాటు చేయడంలో భాగమయ్యారు. ఐఐటీ పూర్తయ్యాక అక్షయ్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో చదవడానికి వెళ్లినప్పుడు అక్కడి విద్యావిధానాలు నచ్చడంతో ప్రస్తుతం ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు.

గతేడాది 51మంది...
అవంతీ ఫెలోస్‌ పుణ్యమా అని ఏటా పదుల సంఖ్యలో పేద విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్లు సంపాదిస్తున్నారు. గతేడాది ఆరువేలమంది ఫెలోషిప్‌ కోసం పోటీ పడితే 150మంది ఎంపికయ్యారు. అందులో 89మంది ఐఐటీకి శిక్షణ తీసుకుంటే 51మంది వివిధ ఐఐటీలకు అర్హత సాధించారు. మిగతా వాళ్లు ఇతర జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చేరారు. ఒక్క పుదుచ్చేరి జేఎన్‌వీ స్కూల్లోనే 22మందిలో 12మంది ఐఐటీలకు అర్హత పొందారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎనిమిది మందికి శిక్షణ ఇస్తే నలుగురు ఎంపికయ్యారు. ‘జాతీయ స్థాయిలో టాపర్లతో పోటీ పడి నేను ఐఐటీ సీటు తెచ్చుకోగలనా అని సందేహిస్తోన్న సమయంలో అవంతీ బృందం మా స్కూల్‌కి వచ్చి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ల సహాయంతోనే నా కలని నిజం చేసుకోగలిగా’ అంటాడు వేదాంత్‌. తెలంగాణలోని సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌కి చెందిన ఈ కుర్రాడు గతంలో పుదుచ్చేరిలోని జవహర్‌ నవోదయాలో చదువుకున్నాడు. అవంతీ మెంటార్‌ ఆయుష్‌ భార్గవ సాయంతో జేఈఈ మెయిన్స్‌లో 36వ ర్యాంకు సాధించి ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో చదువుతున్నాడు. అవంతీ సీయీవో కష్ణ రామ్‌కుమార్‌ని ఫోర్బ్స్‌, దేశాన్ని మారుస్తోన్న యువనాయకుల జాబితాలో చేర్చింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ సంస్థను వరించాయి. కానీ పేద విద్యార్థులకు ఉన్నత జీవితానికి దారిచూపడంకంటే పెద్ద అవార్డులు ఏముంటాయన్నది అవంతీ సభ్యుల మాట. మరిన్ని వివరాలకు... avantifellows.org 

ఈ యాత్ర దమ్మున్నవాళ్లకే!

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, శీతలమైన, ప్రమాదకరమైన యుద్ధ భూమి సియాచెన్‌. పైకెళ్లిన భారత సైనికుల ప్రాణాలు తిరిగొచ్చే వరకూ గాల్లో దీపాలే. ఒకప్పుడు సామాన్యులకు అక్కడ ప్రవేశించే అవకాశమే ఉండేది కాదు. కానీ ఆర్మీ అడ్వెంచర్‌ విభాగం పుణ్యమా అని ఏటా కొద్దిమంది పౌరులకూ ఆ యుద్ధభూమిపైన కాలుమోపే అరుదైన అవకాశం లభిస్తోంది. ఈ ఏడాదీ ఆ సాహసయాత్రకు సమయం ఆసన్నమైంది.

భారత సైన్యం పనిచేసే భయంకరమైన ప్రాంతాల్లో సియాచెన్‌ది మొదటి స్థానం. అయినా సరే జీవితంలో ఒక్కసారైనా అక్కడ విధులు నిర్వహించి తమ సాహసాన్ని చాటుకోవాలని కోరుకునే సైనికులకు కొదవలేదు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తున కొలువైన సియాచెన్‌ గ్లేసియర్‌లో సామాన్యులు బతకడానికి అనువైన పరిస్థితులు చాలా తక్కువ. ఆ హిమ సీమకు నిత్యం మంచు తుపాను ప్రమాదం పొంచే ఉంటుంది. ఉండుండీ ఉష్ణోగ్రతలు -50డిగ్రీలకు పడిపోతాయి. అక్కడ ఆక్సిజన్‌ స్థాయులూ తక్కువే. తిండి తినడం, నిద్రపోవడమే కాదు స్థిరంగా ఓ పది నిమిషాలు నిలబడటం కూడా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో భారత సైన్యం దశాబ్దాల తరబడి పనిచేస్తూ శత్రు సైన్యం సరిహద్దులు దాటకుండా పహారా కాస్తోంది. సైనికులు తప్ప మరెవరూ ప్రవేశించడానికి వీల్లేని ఆ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని కోరుకునే భారతీయులూ చాలామంది ఉంటారు. సైనిక అధికారులకు కూడా తమ బృందం ఎంత కఠిన పరిస్థితుల్లో పనిచేస్తోందో ప్రజలకూ చూపించాలని అనిపించింది. దాంతో తొలిసారిగా 2007లో కొంత మంది పౌరులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సియాచెన్‌ ట్రెక్‌కు తీసుకెళ్లారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అది పూర్తవడంతో, అప్పట్నుంచీ ఏటా ఆగస్టు-అక్టోబరు మధ్య ఔత్సాహికుల కోసం సాహసయాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు.

నెలరోజులు ఆర్మీతోనే
జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్‌ లద్దాఖ్‌ దగ్గర మొదలై, సియాచెన్‌ బేస్‌ క్యాంప్‌ మీదుగా సముద్ర మట్టానికి 16వేల అడుగుల ఎత్తుమీదున్న కుమార్‌ ఎఫ్‌ఎల్‌బీ క్యాంప్‌కు వెళ్లి తిరిగి రావడంతో సియాచెన్‌ ట్రెక్‌ ముగుస్తుంది. మొత్తం అరవై కిలోమీటర్లు ఉండే ఈ సాహసయాత్రను పూర్తి చేయడానికి 13రోజుల సమయం పడుతుంది. వైద్య పరీక్షలూ, శిక్షణా అన్నీ కలిపి ఎంపికైన వాళ్లు దాదాపు నెల రోజుల పాటు ఆర్మీతోనే గడపాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉన్న నలభై ఐదేళ్ల లోపు వయసున్న వ్యక్తులకే ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేహ్‌ ప్రాంతమే సముద్రమట్టానికి 11వేల అడుగులకు పైగా ఎత్తులో ఉంటుంది. అక్కడ గాల్లో ఆక్సిజన్‌ సాధారణ స్థాయి కంటే తక్కువ. అందుకే ముందు ఓ రెండు మూడ్రోజుల పాటు పర్వతారోహకులను అక్కడే ఉంచి ఏ ఇబ్బందీ లేదనుకున్న వాళ్లనే ముందుకు తీసుకెళ్తారు. ఆ తరవాత ఇతర వైద్య పరీక్షలూ, ఫిట్‌నెస్‌ పరీక్షలూ నిర్వహిస్తారు. ఆ పైన వారంపాటు ఆర్మీ బ్యాటిల్‌ స్కూల్‌లో కొండ రాళ్లెక్కడం, భుజాలపైన బరువైన బ్యాగులు వేసుకుని మంచు ముద్దల మధ్య నుంచి నడవడం, తాళ్ల ఆధారంగా రాళ్లూ, నీటి పైనుంచి దాటడం లాంటి రకరకాల అంశాల్లో శిక్షణ కొనసాగుతుంది. అది పూర్తయ్యాక ఈసీజీ, బీపీ, రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని కొలవడానికి జరిపే వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన వాళ్లకే ముందుకు వెళ్లే అవకాశం.

18వేల అడుగులు పైకి...
సియాచెన్‌ గ్లేసియర్‌ మీద గడిపేదానికంటే అక్కడికి వెళ్లడానికి తీసుకునే శిక్షణకే ఎక్కువ సమయం పడుతుందంటేనే పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మూడు కిలోలకు పైగా బరువుండే బూట్లు ధరించి మంచు కొండల్లో అరవై కిలోమీటర్లు ముందుకు సాగడం అంటే మామూలు విషయం కాదు. మధ్యలో మంచు పెళ్లలు విరగొచ్చు. హిమ తుపాను దాడి చేయొచ్చు. వూహించని ఏ ప్రమాదమైనా ఎదురవ్వొచ్చు. అన్నిటికీ సిద్ధపడే యాత్రికులు ముందుకు సాగుతారు. రోజూ కొంత దూరం నడుస్తూ మధ్యమధ్యలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో సేద తీరుతూ దాదాపు రెండు వారాలకు ఆఖరి మజిలీ అయిన కుమార్‌ క్యాంప్‌కి చేరతారు. ఈ ప్రయాణమంతా 11వేల అడుగుల ఎత్తులో మొదలై దాదాపు 18వేల అడుగుల ఎత్తుకి చేరుతుంది. మొట్టమొదట సియాచెన్‌ గ్లేసియర్‌ని అధిరోహించి, అక్కడికి వెళ్లే మార్గం, ప్రమాదకర పరిస్థితులను వివరిస్తూ మ్యాప్‌ని రూపొందించిన నరేంద్ర కుమార్‌ అనే ఆర్మీ పర్వతారోహకుడు, ఆ ప్రాంతం పాకిస్థాన్‌ వశం కాకుండా భారత సైన్యం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే సియాచెన్‌ చివరి మజిలీ కేంద్రానికి అతని పేరొచ్చింది. సియాచెన్‌ యాత్ర హిమాలయాల్లో సేద తీరినంత హాయిగా ఉండదు కానీ ఏ విహారయాత్రా సరితూగలేని అనుభవాల్నీ, అనుభూతుల్నీ కచ్చితంగా అందిస్తుంది. మరిన్ని వివరాలు indianarmy.gov.in లో.