close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ దెయ్యమే నా గురువు!

ఆ దెయ్యమే నా గురువు!

ప్రభుత్వం నుంచి ఐదు నంది అవార్డులు అందుకున్న వాళ్లు చాలామంది ఉన్నారేమో కానీ, ఐదు వేర్వేరు విభాగాల్లో అందుకున్న వాళ్లు మాత్రం అరుదు. అలాంటి వాళ్లలో ఒకరు రఘు కుంచే. ‘పెళ్లెందుకే రమణమ్మా’, ‘రాయె రాయె రాయె... సలోనీ’ లాంటి పాటలతో మాస్‌కీ, ‘ఓణీ వేసిన దీపావళి...’, ‘ఏదోలా ఉందే నువ్వే లేక’ లాంటి పాటలతో క్లాసుకీ గాయకుడిగా దగ్గరయ్యాడు. ‘బంపర్‌ ఆఫర్‌’, ‘దేవుడు చేసిన మనుషులు’, తాజాగా ‘నాయకి’ లాంటి సినిమాలతో సంగీత దర్శకుడిగానూ నిరూపించుకున్నాడు. అనేక విభాగాల్లో ప్రవేశం ఉన్న రఘుని పలకరిస్తే, పరిశ్రమలో ప్రతిభకంటే విజయాలకే విలువెక్కువ అంటున్నాడు.

ప్పట్లో శోభన్‌బాబులా ఉన్నావని కుర్రాళ్లనీ, శ్రీదేవిలా ఉన్నావని అమ్మాయిల్నీ ఎవరైనా అంటే నిజమేననుకొని చాలామంది వూరు నుంచి రైలెక్కి సరాసరి సినిమా స్టూడియోల ముందు వాలిపోయేవారు. ఇంచుమించు నేను కూడా అలానే నా గొంతు బావుందీ, సినిమాల్లో ప్రయత్నించమని చాలా మంది రెచ్చగొట్టేసరికి నేరుగా హైదరాబాద్‌ రైలెక్కేశా. అదృష్టం కొద్దీ కొన్ని పరిచయాలూ, వూహించని ఇంకొన్ని అవకాశాలూ నాకంటూ కొంత గుర్తింపుని తీసుకొచ్చాయి. సినిమాల్లో ఐదు వందలకు పైగా పాటలు పాడా. కొన్ని సినిమాలకు సంగీతం అందించా. హీరోలకు డబ్బింగ్‌ చెప్పా. బుల్లితెర మీద నటుడిగా, యాంకర్‌గా, సంగీత దర్శకుడిగా కనిపించా. దేశ విదేశాల్లో వందల స్టేజీ షోలు చేశా. చిన్నప్పుడు ఓ దెయ్యానికి భయపడి పాటలు పాడటం మొదలుపెడితే, ఆ పాటే ఇప్పుడు నాకు జీవితాన్నిచ్చింది. ఆ దెయ్యం కథ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని మా సొంతూరు గాదరాడ దగ్గర మొదలైంది. హైస్కూలు కోసం వూరికి దగ్గర్లోని కోరుకొండ వెళ్లి తరవాత స్నేహితులతో కాలక్షేపం చేసి ఆలస్యంగా ఇంటికొచ్చేవాణ్ణి. మా వూరికే చెందిన ఓ పెద్దాయన వూరి చివరున్న మర్రిచెట్టు మీద ఆత్మలా తిరుగుతున్నాడనీ, చీకటైతే అతడు బయటికొస్తాడనీ అందరూ చెప్పుకునేవాళ్లు. దాంతో రోజూ ఆ చెట్టు దగ్గర్నుంచి ఒంటరిగా వచ్చినప్పుడల్లా గట్టిగట్టిగా ఆంజనేయ దండకం పాడేవాణ్ణి. ఆ దెయ్యం కథలో నిజమెంతుందో తెలీకపోయినా పాడగా పాడగా నా గొంతు బావుంటుందని నాకూ, వూళ్లొ వాళ్లకూ అర్థమైంది. ఓ రకంగా ఉందో లేదో తెలీని ఆ దెయ్యమే నా తొలి గురువు. అదే నాలో గాయకుడిని బయటకు తీసింది.

డిగ్రీ మధ్యలో రైలెక్కేశా
స్కూల్లో ఉండగా ఎక్కడ పాటల పోటీలున్నా పాల్గొనేవాణ్ణి. రేడియోలో పాటల్నే విని నేర్చుకుని, అచ్చం అలానే పాడటానికి ప్రయత్నించేవాణ్ణి. పదో తరగతిలో ఉన్నప్పుడు కోరుకొండలో జరిగిన జిల్లా స్థాయి పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓసారి ఏదో పోటీలో పాడితే మా కాలేజీ బ్యూటీగా చెప్పుకునే ఒకమ్మాయి బాగా పాడుతున్నానని మెచ్చుకుంది. పాటలు పాడితే ఇలా అమ్మాయిలొచ్చి మాట్లాడతారు కాబోలు అనుకున్నా. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని అన్ని రకాల పాటల్నీ సాధన చేసేవాణ్ణి. అమ్మాయిల్ని మెప్పించాలన్న అమాయకత్వంతో, గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికతో పాడేవాణ్ణి తప్ప వేరే ఎలాంటి లక్ష్యమూ ఉండేది కాదు. డిగ్రీకొచ్చేసరికి ఫ్రెండ్స్‌ అంతా సినిమాల్లో సింగర్‌గా ప్రయత్నించమని ప్రోత్సహించడంతో ఓ రాయేసి చూద్దామనుకున్నా. నాన్నకు చెబితే వద్దని మందలించారు. అమ్మ మాత్రం ఓసారి ప్రయత్నిస్తే తప్పులేదని చెప్పింది. దాంతో నా గొంతు విని ఎవరైనా అవకాశం ఇస్తారన్న నమ్మకంతో డిగ్రీ చదువుతుండగానే హైదరాబాద్‌ రైలెక్కేశా.

పూరీతో పరిచయం
రైల్లో వచ్చేప్పుడు రాధాకృష్ణగారని ఈసీఐఎల్‌లో మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసే ఒకాయన పరిచయమయ్యారు. మాటల్లో మాటగా సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్‌ వస్తున్నానని చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. సరదాగా ఏదైనా ఒక పాట పాడమంటే పాడా. అది పూర్తయ్యేసరికి కొంతమంది నా చుట్టూ పోగై అభినందించారు. నాలో విషయం ఉందని రాధాకృష్ణగారికి అనిపించడంతో హైదరాబాద్‌లో ఆయనింటికే తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచుకున్నారు. తరవాత ఆయనకు పరిచయమున్న ఓ కుర్రాడి గదిలో నాకూ చోటు కల్పించారు. సికింద్రాబాద్‌లోని ఓ మ్యూజిక్‌ కాలేజీలో చేర్పించారు. ఏ ఆధారమూ లేకుండా హైదరాబాద్‌కి బయల్దేరిన నాకు అదృష్టం కొద్దీ ఆయన తారసపడి ఓ దారి చూపించారు. అలా రోజులు గడుస్తుండగా ఓరోజు కేఫ్‌లో పూరీ జగన్నాథ్‌ పరిచయమయ్యాడు. అప్పటికి జగన్‌ పరిశ్రమలో ప్రయత్నాల దశలోనే ఉన్నాడు. ఇద్దరికీ క్రమంగా స్నేహం పెరిగింది. కొన్నాళ్లకు తను నా గదికే మారిపోయాడు. నేను హీరోగా టీవీలో జగన్‌ కొన్ని సింగిల్‌ ఎపిసోడ్లు డైరెక్ట్‌ చేశాడు. నేను అవకాశాల కోసం ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గరికి వెళ్లినా, నా గొంతులో ఇతర గాయకుల అనుకరణ ఎక్కువగా ఉందనీ, దాన్నుంచి బయటికొచ్చి పాడమనీ అనేవాళ్లు. దాంతో దాదాపు రెండేళ్లు అవకాశాల వేట ఆపేసి, సొంతంగా ఏదైనా పాట రాసుకుని ట్యూన్లు చేసుకుని పాడుతూ నాకంటూ ఓ కొత్త శైలిని ఏర్పరచుకునే ప్రయత్నం చేశా.

తొలి పాట హిట్‌
నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తోన్న సమయంలోనే టీవీ ఛానెళ్ల హడావుడీ మొదలైంది. జీకే మోహన్‌ అనే ఓ ఫ్రెండ్‌ ‘విజేత’ అనే టెలీఫిల్మ్‌ డైరెక్ట్‌ చేస్తూ నేను బావుంటాననిపించి నన్నే అందులో హీరోగా తీసుకున్నాడు. యాంకర్‌ ఝాన్సీకి కూడా అదే మొదటి టెలీఫిల్మ్‌. దాని తరవాత నాకు కొన్ని కార్యక్రమాల్లో వరసగా అవకాశాలొచ్చాయి. అదే సమయంలో ‘యువర్స్‌ లవింగ్లీ’ అనే కార్యక్రమానికి యాంకరింగ్‌ చేశా. ఆ కార్యక్రమం చాలా విజయవంతమైంది. తరవాత ‘పోస్ట్‌బాక్స్‌ నెం 1562’, ‘సాంగుభళా’, ‘అంత్యాక్షరి’ లాంటి కార్యక్రమాలతో వ్యాఖ్యాతగా స్టార్‌డమ్‌ వచ్చింది. యాంకర్‌గా టీవీ నంది పురస్కారాన్నీ అందుకున్నా. టీవీలో కొన్ని కార్యక్రమాలకు టైటిల్‌ సాంగ్స్‌ పాడటం, యాంకరింగ్‌తో రోజులు సాఫీగా గడుస్తుండటంతో నా అసలు లక్ష్యం కాస్త పక్కకు పోయింది. అదే సమయంలో పూరీ జగన్నాథ్‌ దర్శకుడిగా ‘బాచి’ సినిమా మొదలుపెట్టాడు. అందులో ‘లచ్చిమీ లచ్చిమీ లచ్చిమీ’ అనే మాస్‌ పాట పాడే అవకాశం నాకొచ్చింది. సంగీత దర్శకుడు చక్రికి కూడా అదే మొదటి సినిమా. ఆ పాట మంచి హిట్టవడంతో చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాల్లో నా ప్రయాణం మొదలైంది.

రెండోపాట చిరంజీవిగారికి
చిన్నితెర మీద అప్పట్లో నేనొక్కడినే మగ యాంకర్‌ని కావడంతో ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపట్టేవారు. ఆ క్రమంలోనే చిరంజీవిగారితో కూడా పరిచయమైంది. నేను పాడిన మొదటి పాట ఆయన వింటే బావుంటుందనిపించి ఓసారి ఆయన్ని కలిసి ‘బాచి’ సీడీ ఇచ్చాను. సరిగ్గా అరగంట తరవాత చిరంజీవిగారు ఫోన్‌ చేసి పాట చాలా బావుందని అభినందించారు. కొన్ని రోజుల తరవాత ‘మృగరాజు’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చిరంజీవిగారే మణిశర్మగారికి నా గురించి చెప్పి అందులో ఓ పాట నాతో పాడించమన్నారు. మణిగారు ఆడిషన్‌ చేసి ‘హంగామా హంగామా’ అనే పాటను పాడించారు. ఏదో నా గొంతు వినిపిద్దామని చిరంజీవిగారిని కలిస్తే కెరీర్‌లో రెండో పాటే ఆయనకు పాడే అవకాశం రావడం కలలా అనిపించింది. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే మేనేజర్‌ని పిలిపించి ఇరవై వేలు పారితోషికం ఇప్పించారు. అప్పట్లో సాధారణ గాయకులకు రెండు, మూడు వేలొస్తే ఎక్కువ. అలాంటిది అంత మొత్తం చూసి చాలా ఆశ్చర్యమేసింది. తరవాత ‘ఇడియట్‌’లో జై వీరాంజనేయా, ‘అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి’లో తళుకు తళుకు తళుకుమందీ.., ‘దేశముదురు’లో గోలపెట్టినాదిరో, ‘శివమణి’లో ఏనాటికీ మనమొకటేననీ లాంటి పాటలు బాగా హిట్టయి క్రమంగా అవకాశాలు తీసుకొచ్చాయి. మరోపక్క వినీత్‌, అబ్బాస్‌, అరవింద్‌ స్వామి, దీపక్‌లాంటి చాలామందికి డబ్బింగ్‌ కూడా చెప్పా. ‘సంపంగి’ సినిమాకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్నీ అందుకున్నా.

‘శివమణి’ వచ్చినట్టే వచ్చి...
సినీ పరిశ్రమలో ఒకరి దగ్గరే ఎక్కువ పాటలు పాడితే వాళ్లందరనీ ఓ జట్టు కిందే జమకట్టి బయటివాళ్లు ఎక్కువగా అవకాశాలివ్వరు. అలాంటి ముద్రల వల్ల నష్టపోయిన గాయకుల్లో నేనూ ఒకడిని. దాదాపు పాడిన పాటలన్నీ హిట్టవుతున్నా, కొందరి నుంచే ఎక్కువగా అవకాశాలొచ్చేవి. ఒక్కోసారి ఇతర సంగీత దర్శకుల దగ్గర పాడిన పాటలు కూడా క్యాసెట్లోకి వచ్చేసరికి మాయమైపోయేవి. క్రమంగా వాటి గురించి బాధ పడటం మానేసి వచ్చిన అవకాశాలపైనే దృష్టిపెడుతూ వచ్చా. మరోపక్క టీవీలో కొన్ని కార్యక్రమాలకు ట్యూన్‌లు చేసేవాణ్ణి. అలా చేసిన ఓ కార్యక్రమానికి టెలివిజన్‌ విభాగంలో ‘నంది’ పురస్కారం దక్కింది. ఆ ఉత్సాహంతో ఓ కీబోర్డు ప్లేయర్‌ని పెట్టుకుని సొంతంగా ట్యూన్‌ బ్యాంకుని సిద్ధం చేసుకున్నా. ఓ దశలో ‘శివమణి’ సినిమాకి సంగీత దర్శకుడిగా దాదాపుగా నా స్థానం ఖరారైపోయింది. జగన్‌కి ఐదు ట్యూన్లు వినిపిస్తే అన్నీ నచ్చాయి. ఏం జరిగిందో తెలీదు కానీ చివరి నిమిషంలో ఆ సినిమాని చక్రి చేస్తున్నాడని జగన్‌ చెప్పడంతో నేను మరేం మాట్లాడలేదు.

‘బంపర్‌ ఆఫర్‌’ దొరికింది
గాయకుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఓ రోజు జగన్‌ పిలిచి ‘ఓ చిన్న నిర్మాణ సంస్థని మొదలుపెడదాం, ఎగ్జిక్యుటివ్‌ ప్రొడ్యూసర్‌గా దాని బాధ్యతలు నువ్వు చూసుకుంటావా’ అని అడిగాడు. నేనున్న రంగానికీ దానికీ సంబంధం లేకపోయినా, జగన్‌ నన్ను నమ్మడంతో సరేనని ఒప్పుకున్నా. సినిమాకి నటీనటులూ, సాంకేతిక నిపుణులంతా కుదిరాక, మేమనుకున్న సంగీత దర్శకుడు సమయానికి ట్యూన్లు ఇవ్వలేదు. దాంతో జగన్‌ ఓ రోజు నన్ను పిలిచి ‘సినిమాకి మ్యూజిక్‌ నువ్వే చేస్తున్నావు’ అన్నాడు. అలా ‘బంపర్‌ ఆఫర్‌’తో సంగీత దర్శకుడిగా నా కెరీర్‌ మొదలైంది. ఆ సినిమాలో ‘పెళ్లెందుకే రమణమ్మ’ అనేపాట ఆ ఏడాదంతా ఒక వూపు వూపింది. చార్ట్‌బస్టర్స్‌లో ఆ ఆడియో చాలాకాలం టాప్‌లోనే కొనసాగింది. సంగీత దర్శకుడిగా నాకు నంది అవార్డు కూడా దక్కింది. ఆ తరవాత అనిల్‌ సుంకరగారు నరేష్‌తో తీసిన ‘అహ నా పెళ్లంట’కు సంగీత దర్శకుడిగా పనిచేశా. అడపాదడపా సినిమాలు చేస్తూనే గాయకుడిగానూ కొనసాగా. ఓసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు కీరవాణిగారు ఫోన్‌ చేశారు. చాలాసేపట్నుంచి నేను మ్యూజిక్‌ చేసిన ‘దగ్గరగా దూరంగా’ సినిమాలోని ఓ పాట వింటూనే ఉన్నారట. ఆ విషయమే చెప్పి చాలా బావుందని మెచ్చుకున్నారు. తరవాత ఓ రోజు ఆయనే పిలిచి ‘మర్యాద రామన్న’లో ‘రాయె రాయె రాయె... సలోని’ అనే పాట పాడించారు. అది చాలామంచి హిట్టయింది.

సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే పాటలూ పాడుతున్నా. గతేడాది ‘మామ మంచు అల్లుడు కంచు’, ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌’, ‘దొంగాట’ సినిమాలకు సంగీతం అందించా. ఇటీవల ‘నాయకి’ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగుతో పాటు తమిళంలోనూ అడుగుపెట్టా. కన్నడలో రెండు సినిమాలు చేశా. ఎన్ని విభాగాల్లో పనిచేసినా మ్యూజిక్‌ డైరెక్షన్‌లో ఉన్న కిక్కు మరెందులోనూ లేదనిపిస్తుంది. ‘పాండిత్యం కంటే జ్ఞానం గొప్పది’ అనే ఓ పాత సినిమా డైలాగు నాకు బాగా నచ్చుతుంది. నాకు సంగీతంలో పాండిత్యం లేకపోవచ్చు కానీ సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలపైనా మంచి పట్టుంది. విజయవంతమైన సంగీత దర్శకుడిగా నిరూపించుకోవాలన్న కోరికా ఉంది. దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నమే ప్రస్తుతం చేస్తున్నా.

 


ఇంకొంత

నాది ప్రేమ వివాహం. నా భార్య కరుణ క్లాసికల్‌ డాన్సర్‌. పాప రాగ పుష్యమి, బాబు గీతార్థ్‌.

* ఓసారి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో త్రిష పాట పాడుతుందని ఎక్కడో వార్త చదివా. మంచు లక్ష్మి కూడా ఓ టీవీషోలో చాలా బాగా పాడింది. అలా వీళ్లిద్దరిలోనూ విషయం ఉందనిపించే సినిమాల్లో పాటలు పాడించా తప్ప పబ్లిసిటీ కోసం కాదు. సుమ కూడా యాంకరింగ్‌ చేసేప్పుడు మధ్యమధ్యలో పాడుతుంటుంది. అందుకే ఈమధ్యే తనతో కూడా ఓ షోకి టైటిల్‌ సాంగ్‌ పాడించా.
* దేశవిదేశాల్లో కొన్ని వందల స్టేజీ షోలు చేశాను. ప్రైవేటుగా వీడియో ఆల్బమ్స్‌ విడుదల చేశాను. వాటికి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌ కూడా నేనే చేశా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.