close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విజన్‌ 20/20

విజన్‌ 20/20

- మాధవి కప్పగంతు

ఇల్లంతా హడావుడిగా ఉంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు నేను తప్ప. మావారి సంతోషానికి హద్దే లేదు. ఇక మా అత్తగారు అయితే చెప్పనక్కర్లేదు. ముందుగానే హెచ్చరికలు ఇచ్చేశారు ‘పుట్టే పిల్లలు సన్నగా, పీలగా ఉంటే ఎత్తుకోనమ్మాయ్‌’ అంటూ.

వన్నీ వింటూ ఒకపక్క సంతోషం, మరోపక్క భయం. ఎందుకో తెలీదు. పోయిన ఏడాది మా అక్క వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కానీ చదివించడానికి కానీ ఎంత కష్టపడిందో. బాబుకి సంవత్సరం వచ్చిన దగ్గర్నుంచీ స్కూళ్ళలో అడ్మిషన్లు. వీళ్ళకి తెలిసేటప్పటికి పెద్దపెద్ద స్కూళ్ళల్లో అడ్మిషన్లు అయిపోయాయి. దాంతో వాళ్ళు ఒక చిన్న స్కూల్లో చేర్పించి ఎంతో కష్టంగా చదివిస్తున్నారు. మొత్తానికి ఫస్ట్‌క్లాసు నుంచే ఎంసెట్‌ ఫౌండేషన్‌, ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు మొదలు. బ్యాగులో పదిహేనుకు పైగా పుస్తకాలు రోజూ తీసుకెళ్ళాలి. సాయంత్రానికి స్టడీ అవర్స్‌. అక్క టెన్షన్‌ చూస్తే నాకు భయమేసింది- నాకు పుట్టే పిల్లల్ని నేను సరిగ్గా ఈ రోజుల్లోలాగా చదివించగలనా అని. నాకు తెలిసి మా చిన్నప్పుడు మూడు నాలుగేళ్ళు వస్తేకానీ స్కూల్లో చేర్పించడానికి వీల్లేదు. కానీ, ఇప్పుడు అంతా వేరే. ఇలా ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కింది. నిద్ర పట్టింది. పట్టీపట్టగానే నాకసలు ఒళ్ళు తెలియలేదు. ఇందాకటి భయాలన్నీ మరచిపోయి మనసు తేలిక అయినట్టయింది.

డాక్టర్‌ రూములో టెస్ట్‌ చేయించుకున్న తర్వాత స్కానింగ్‌ రాశారు. స్కానింగ్‌ రూములో నుంచి బయటికి రాగానే పక్కన ఒక కౌంటర్‌. దానిమీద ‘ఫౌండేషన్‌ కోర్స్‌ ఫర్‌ ఇన్‌ఫాంట్‌ అండ్‌ ఫీటల్‌ ఎడ్యుకేషన్‌’ అని రాసి ఉంది. అది చూడగానే ఏంటో కనుక్కుందామని కౌంటర్‌ దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే ఒక గ్లాస్‌ ఆపిల్‌ జ్యూస్‌ ఇచ్చి ఒక టోకెన్‌ ఇచ్చి రూములోకి పంపించారు. అక్కడ వందమందికి పైగా ఉన్నారు. నా నంబరు 105. అందరూ ఆడవాళ్ళూ, గర్భవతులే. జ్యూస్‌ తాగుతూ కుర్చీలో కూర్చున్నాను.

ఒక గంట తర్వాత ఖరీదైన చీర కట్టుకుని, మేకప్‌ వేసుకుని ఎంతో అందంగా ఉన్న ఒకామె వచ్చి నా ముందు కూర్చుని ఎంతో మర్యాదగా ‘‘నమస్కారమండీ’’ అంది. నా మెడికల్‌ రిపోర్ట్స్‌, స్కానింగ్‌ రిపోర్ట్స్‌ చూపించమంది. అన్నీ తీసి చూపించా.

‘‘ఫర్‌ఫెక్ట్‌ మేడమ్‌, మీరు కరెక్ట్‌ టైముకి వచ్చారు. ఇంకో రెండు నెలలు ఆగుంటే చాలా కష్టం అయ్యేది’’ అంది.

నేను ‘దేనికి’ అని అడిగేలోపే ఆమే ‘‘మీకు ఇప్పుడు మూడు నెలలా రెండువారాలు కదా’’ అంది. ‘‘లోపల బేబీ బ్రెయిన్‌ చక్కగా పెరిగింది. బ్రెయిన్‌ పెరిగే దశలోనే మీరు పాపకి అన్నీ నేర్పించాలి’’ అని చెప్పింది.

ఆమె చెప్పేదేమీ నాకు అర్థంకాకపోయినా కరెక్ట్‌ టైమ్‌కి వచ్చారన్నందుకు మాత్రం సంతోషం వేసింది. రిపోర్ట్స్‌ చూశాక ఒక టైమ్‌టేబుల్‌ తీసి చేతికి ఇచ్చిందామె. అదేమిటో నాకు అర్థంకాలేదు. ‘‘ఏంటిది?’’ అని అడిగా.

అప్పుడు ఆమె ‘‘మేడమ్‌, ప్రహ్లాదుడి గురించీ అభిమన్యుడి గురించీ మీకు తెలుసా?’’ అని అడిగింది. ‘‘ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే సకల శాస్త్రాలనీ ఆపోశన పట్టాడంటారు. అవునా కాదా’’ అంది. ‘‘నారదముని అడిగిన ప్రశ్నలకి పొట్టలోనుంచే ‘వూ’ కొట్టాడని కూడా చెబుతారు కదా!’’ అంది. ‘‘అభిమన్యుడు తల్లి కడుపులోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడా లేదా!?’’ అని కూడా అడిగింది.

‘కాదు’ అనలేకపోయాను. ఎందుకంటే, చిన్నప్పుడు నేను ఇవన్నీ విన్నాను కాబట్టి.

అప్పుడు ఆమె ‘‘ఏమో, ఎవరి కడుపులో ఎవరున్నారో ఒక ప్రహ్లాదుడు, ఒక అభిమన్యుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రావణాసురుడు...’’ అంటూ చెప్పుకుంటూ పోయింది.

‘సరే’ అని నేను మధ్యలో ఆపి ‘‘నన్నేమి చేయమంటారు..?’’ అని కొంచెం ఆసక్తి చూపేసరికి,ఆమె రెట్టింపు ఉత్సాహంతో ‘‘మీరు పొద్దున్నే 8.30కల్లా మా ఇన్‌స్టిట్యూట్‌కి రావాలి. మీరు వచ్చిన వెంటనే ఒక కప్‌ ఆపిల్‌ జ్యూస్‌, అది తాగగానే అరగంట రైమ్స్‌ క్లాసు, మ్యాథ్స్‌ క్లాసు. ఆ తర్వాత ఒక కప్పు డ్రైఫ్రూట్‌ జ్యూస్‌. ఆ తర్వాత సైన్స్‌, జనరల్‌ నాలెడ్జి, కంప్యూటర్‌ క్లాసులు. ఆ తర్వాత మినీ లంచ్‌... ఒక బౌల్‌ పప్పు, కూరలు రెండు, పెరుగు; భోజనం తర్వాత ఒక బౌల్‌ ఫ్రూట్‌ సలాడ్‌’’ అంటూ ఆయాసపడింది.

ఇవన్నీ బేబీ బ్రెయిన్‌ గ్రోత్‌కీ గ్రాస్పింగ్‌ పవర్‌కీ అట. నాకు తల తిరిగినట్లయింది.

నేను కడుపుతో ఉన్న తొమ్మిది నెలల్లో వాళ్ళు నర్సరీ కోర్సు పూర్తి చేస్తారట. ఇది విని నాకు నోట్లో నీరు ఎండిపోయింది. వెంటనే పక్కనున్న గ్లాసు ఎత్తి గటగటా నీళ్ళు తాగాను. ‘‘ఏంటిది, దీనివల్ల లాభమేంటి?’’ అని అడిగితే, ఆమె ఇచ్చిన సమాధానం వినగానే ‘నేను అసలు ఇక్కడే, ఈ ప్రపంచంలోనే ఉన్నానా?’ అనిపించింది.

ఇలా నేర్చుకోవడం వల్ల పిల్లలు పుట్టినరోజు నుంచే అన్ని రైమ్స్‌ చెబుతారట. మమ్మీ, డాడీ అని చక్కగా ఇంగ్లిషులో మాట్లాడతారట. మూడేళ్ళు వేస్ట్‌ చేయకుండా పుట్టినరోజు నుంచే యుకేజీ లేదా ఫస్ట్‌క్లాసులో చేర్పించేయొచ్చట. దీనికంతటికీ ఫీజు మూడు లక్షలని చెప్పింది.

నాకు కొన్ని బ్రోచర్స్‌, పాంప్లెట్స్‌ ఇచ్చింది. నెలలు నిండేనాటికి పక్కనే హాస్పిటల్‌లో డెలివరీకీ, డెలివరీ అయిన రెండు రోజులకే ఆ పక్కన స్కూల్లో అడ్మిషన్‌కీ వాళ్ళే ఏర్పాట్లు చేస్తారట. నాకంతా అయోమయంగా ఉంది. బ్రోచర్స్‌ అన్నీ తీసుకుని ఇంటికి వచ్చాను. కూర్చుని పళ్ళు తింటూ హాయిగా టీవీ చూస్తున్నాను. ఇంతలో ఒక మెసేజ్‌ నా ఫ్రెండ్‌ లక్ష్మి నుంచి. తనూ ఆ కోర్సులో చేరిందట. చాలా బాగుందనీ నన్ను కూడా చేరమనీ చెప్పింది. అయితే నాకన్నా తను రెండు నెలలు సీనియర్‌ అట. రెగ్యులర్‌గా స్కానింగ్‌ రిపోర్టులు చూపించాలనీ, స్కానింగ్‌ రిపోర్టుల్లో బ్రెయిన్‌ పెరుగుదలనిబట్టి ఎక్స్‌ట్రా క్లాసులు తీసుకుంటారనీ చెప్పింది.

నేను మొదట చేరకూడదనుకున్నా. కానీ, అందరితోపాటు కదా... తప్పదేమో అనిపించింది. నేను ఈ కోర్సులో చేరకపోతే ఎక్కడ నా పిల్లలు అందరికంటే వెనకబడతారో అని- మొత్తానికి నచ్చినా నచ్చకపోయినా లక్ష రూపాయలు డొనేషన్‌, టరమ్‌ ఫీజు లక్ష - మొత్తం రెండు లక్షలు పైగా కట్టి చేరాను. మూడు నెలలు గడిచిన తర్వాత స్కానింగ్‌, బ్లడ్‌టెస్ట్‌, యూరిన్‌ టెస్ట్‌ రిపోర్ట్సు తీసుకుని, గంటసేపు అటూ ఇటూ తిప్పి, ఏవేవో లెక్కలు వేసి మొత్తానికి నన్ను ‘బి’ సెక్షన్‌లో వేశారు. నా బేబీకి బ్రెయిన్‌లో గ్రాస్పింగ్‌ కెపాసిటీ కొంచెం తక్కువంటూ ఏవేవో లెక్కలు చెప్పారు.

నాకేమీ అర్థంకాలేదు కానీ ఒకటైతే తెలిసింది- నాకు కచ్చితంగా పిచ్చిపడుతుందని. మొత్తానికి ఓరోజు వెళ్ళీ ఓరోజు వెళ్ళకా ఆపసోపాలుపడుతూ ఎనిమిదో నెల వచ్చే వరకూ వెళ్ళి మానేశాను.

‘‘మీ బిడ్డ కెరీర్‌ను మీరే చేతులారా పాడుచేస్తున్నారండీ. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. మీ పాప చాలా వెనుకబడిపోతుంది’’ అని చాలాసేపు చెప్పింది అక్కడి టీచర్‌.

‘‘ఉండమ్మా తల్లీ, హాయిగా సోఫాలో కూర్చుని, కాళ్ళు చాపుకుని టీవీ సీరియల్స్‌ చూసుకుంటూ, కజ్జికాయలో, కారప్పూసో తింటూ గడిపేదాన్ని. ఇదెక్కడి తలనొప్పి. నీకూ నీ చదువుకూ ఓ దండం. ఇంత కష్టపడి నేను చిన్నప్పుడు చదివుంటే ఈపాటికి కలెక్టర్‌ అయ్యేదాన్ని. నన్ను వదిలెయ్‌’’ అని చెప్పి గబగబా వచ్చేశా - మళ్ళీ నా మనసు మారకముందే.

ఇన్‌స్టిట్యూట్‌ మానేసిన నెలరోజులకి డెలివరీ అయింది. పుట్టిన పాపను ముద్దు చేస్తూచేస్తూ ఇరవై రోజులు గడిచిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతూనే ఉన్నారు. మా అత్తగారు ‘‘చూడు పక్కింటి రాజ్యలక్ష్మిగారి మనవడు టకటకా ఇంగ్లిషు, రైమ్స్‌, సైన్స్‌, కంప్యూటర్‌, జీకే... అన్నీ చెబుతున్నాడట- పుట్టిన రెండోరోజుకే. వాడు రెండోరోజు నుంచే స్కూలుకి వెళుతున్నాడు. చూడ్డానికి ముచ్చటగా ఉన్నాడు- హగ్గీ వేసుకుని, బేబీ కిట్‌తో. వీడూ ఉన్నాడు- ‘మమ్మీ, డాడీ’ తప్ప ఒక్కటీ రాదు. ఆమె అప్పుడే చెప్పింది ‘చివర్లో మానకండీ, సిలబస్‌ చాలా ఇంపార్టెంట్‌’ అని. నీకు ఆపసోపాలు పడటం సరిపోయింది’’ అని రోజూ తిడుతూనే ఉంటుంది. ఆమె ఒక్కతే కాదు, మావారూ ఫ్రెండ్సూ డాక్టరూ అందరూ అదే గోల.

‘ఇదేం పిచ్చిరా బాబూ’ అనిపించింది. ఇక తప్పదని అందరికోసమైనా బాబును ఫైనల్‌గా స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నా.

మర్నాడు స్కూలుకి తీసుకెళ్తే- ఇంటర్వ్యూ అన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ‘మమ్మీ, డాడీ’ అని తప్ప ఇంకేమీ చెప్పలేకపోయాడు. బాగా వెనకబడి ఉన్నాడని డొనేషన్‌, ఎక్స్‌ట్రా క్లాసుతో సహా సంవత్సరానికి ఇరవై లక్షలు కట్టమన్నారు. నేను చేసిన చిన్న తప్పు ఇంత ఖరీదా అని దిగులేసింది. అందరూ నన్ను తెగ తిట్టారు. మనసులో తప్పు చేశాననీ అనిపించింది. మొత్తానికి దేవుడికి దండాలు పెట్టుకుంటూ పిల్లాడిని మరుసటిరోజు నుంచీ స్కూలుకి పంపించాలని నిర్ణయించుకున్నా.

మర్నాడు పొద్దున్నే లేచి స్నానం అదీ చేయించి రెడీ చేసి రిక్షాలో పడుకోబెట్టగానే వాడు ‘కేర్‌ కేర్‌’మని ఏడ్చాడు. పాపం, రోజుల పిల్లాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు రిక్షావాడు ‘‘స్కూల్లో లేటుగా జాయిన్‌ చేశారా? పిల్లవాడు ‘మమ్మీ, మమ్మీ’ అని అనట్లేదూ’’ అని అడిగాడు.

‘‘చూడండీ, రిక్షాలోని ఈ బాబు పుట్టి రెండురోజులు. ‘మమ్మీ టాటా, డాడీ టాటా’ అంటాడు. ఇక, మా బాబు అయితే పుట్టిన నాలుగోరోజుకే మాథ్స్‌, సైన్స్‌, టేబుల్స్‌, కంప్యూటర్‌ అన్నీ చెబుతున్నాడు. అయినా ఫర్వాలేదు మీరేం బాధపడకండి, నాకు తెలిసిన ఒక ట్యూషన్‌ సార్‌ ఉన్నాడు. మీరు అక్కడ చేర్పించండి’’ అని చెప్పాడు.

అది వినగానే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి, కళ్ళు తిరిగి పడ్డట్టయింది. మెల్లగా కళ్ళు తెరిచా. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. నీరు ఎండిపోయింది. గబగబా పక్కన ఉన్న సీసాలో నుంచి గడగడా మంచినీళ్ళు తాగాను. కాస్త తేరుకుని చూస్తే... అది భయంకరమైన కల. ‘వామ్మో’ అనుకున్నా.

మరుసటిరోజు అన్ని టెస్టులూ చేయించుకుని, స్కానింగ్‌ రూమ్‌ నుంచి బయటికి రాగానే ఎదురుగా కౌంటర్‌ కోసం చూశా. ఎక్కడా కనిపించలేదు. ‘హమ్మయ్య, నిజంగానే అది కలన్నమాట, నిజం కాదన్నమాట’ అనుకుని గుండెల నిండుగా వూపిరి పీల్చుకున్నా- ఒకింత నిశ్చింతగా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.