close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ గుహలో లక్షల మిణుగురులు..!

ఆ గుహలో లక్షల మిణుగురులు..!

‘కొత్త సంవత్సర వేడుకలు అనగానే ప్రపంచమంతా అటే చూస్తుంటుంది. ఆ ప్రదేశమే సిడ్నీ ఒపెరా. అలాగే చీకట్లో మిణుగురుల పాలపుంతను వీక్షించాలనుకునే వాళ్లకి ఠక్కున గుర్తొచ్చేవే వెయిటొమో గుహలు. ఆ రెండింటినీ ఏకకాలంలో చూడాలన్న కోరికతోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల పర్యటనకు బయలుదేరాం’ అంటున్నారు గుంటూరుకు చెందిన ఉషారాణి.

కుటుంబసభ్యులూ స్నేహితులతో కలిసి ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా డిసెంబరు 30న హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ మీదుగా సిడ్నీకి వెళ్లాం. ముందుగా నగరం చూడ్డానికి బయలుదేరాం. ఒపెరాహౌస్‌, సిడ్నీహార్బర్‌, మ్యాన్లీ బీచ్‌, డార్లింగ్‌ హార్బర్‌ ఇంకా అక్వేరియం అందాలన్నీ చూసి సిడ్నీటవర్‌కి వెళ్లాం. సాయంత్రం నాలుగున్నరకే న్యూఇయర్‌ గ్రాండ్‌గాలా వేడుకలు జరిగే ఒపెరాహౌస్‌కి వెళ్లి టిక్కెట్లు తీసుకుని లోపలకు వెళ్లాం. ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలమంది న్యూఇయర్‌ ఈవ్‌ చూడ్డానికి అక్కడికి వస్తారు. ఆ రోజు జరిగిన మ్యూజికల్‌ ప్రోగ్రామ్‌ చాలా బాగుంది. అందులో గత ఏడాది గతించిన ప్రముఖ సంగీతకారుల్ని స్మరించే కార్యక్రమంలో మన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌గారి పేరూ ఫొటో కనిపించడంతో మేం ఎంతో గర్వపడ్డాం. తరవాత నూతన సంవత్సర సంబరాలను పురస్కరించుకుని ఆకాశంలో విచ్చుకునే రంగుల పువ్వులూ రకరకాల ఆకారాలు వచ్చేలా సిడ్నీ హార్బర్‌ వంతెనమీద భారీఎత్తున బాణాసంచా కాలుస్తారు. ఒపెరా హౌస్‌ నుండి ప్రత్యక్షంగా వాటిని తిలకించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌!
సిడ్నీ నగరంలో డిసెంబర్‌ 31 రాత్రి ట్యాక్సీలను నిషేధించడం కారణంగా ఒపెరా హౌస్‌ నుంచి హోటల్‌కు నడిచివెళ్లాం. జనవరి 1న ఉదయాన్నే బయలుదేరి బ్లూమౌంటెయిన్స్‌కు వెళ్లాం. అక్కడ ఉన్న మూడు కొండల్నీ త్రీ సిస్టర్స్‌ అని పిలుస్తారు. అక్కడ స్థానిక తెగలు తమ సంప్రదాయ వేషధారణలతో ప్రదర్శనలు ఇస్తుంటారు. అక్కడే వాళ్ల చిత్రవిచిత్రమైన పనిముట్లనీ బూమెరాంగ్‌నీ చూశాం. తరవాత అక్కడ జూలో కంగారూలను చూసి ఆనందించాం.

తరవాతిరోజు కెయిర్న్స్‌కు బయలుదేరాం. అక్కడి విమానాశ్రయం నుంచి మమ్మల్ని కురుండాకి తీసుకెళ్లారు. అది ఓ వర్షారణ్యం. ఎటుచూసినా పచ్చదనమే. అక్కడే సీతాకోకచిలుకల పార్కు ఒకటి ఉంది. వాటికోసం ప్రత్యేకమైన గదులూ ఉష్ణోగ్రతా ఆహారమూ ఏర్పాటుచేశారు. అవన్నీ చూశాక కురుండా నుంచి కేబుల్‌ కార్‌ ద్వారా కెయిర్న్స్‌ పట్టణానికి కిందకి దిగాం. పచ్చని ఆ ప్రకృతిలో వేగంగా కొండదిగడం గమ్మత్తుగా అనిపించింది. గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌ని చూడ్డానికి ప్రపంచం నలుమూలలనుంచీ పర్యటకులు కెయిర్న్న్‌కి వెళ్తుంటారు. కెయిర్న్స్‌ నుంచి ఓడలో గ్రీన్‌ ఐల్యాండ్‌కు వెళ్లాం. అక్కడ నుంచి సబ్‌మెరైన్‌లో తీసుకెళ్లి ఆ రీఫ్‌ని చూపించారు. వేనవేల సంవత్సరాలనాటి లక్షల కోరల్‌ పాలిప్స్‌తో ఏర్పడిన ఆ పగడపు దీవి అందాలు వర్ణనాతీతం. సముద్రుడి అలల వూయల్లో వూగుతున్నట్లు ఉండే ఆ సాగరజీవుల రంగులూ రూపాల్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. వాటి మధ్యలో రకరకాల చేపలూ అక్కడక్కడా స్టార్‌ఫిష్‌లూ కనువిందు చేస్తుంటాయి. అండర్‌సీ వాకింగ్‌కి వెళ్దామనుకున్నాం. అయితే ఆ రోజు సముద్రంలో ఆటుపోట్లు తీవ్రంగా ఉండటంతో అది రద్దుచేశారు. నిరుత్సాహంతోనే వెనుతిరిగాం.

తరవాత మెల్‌బోర్న్‌కు బయలుదేరాం. అక్కడ గోతిక్‌ వాస్తుశైలితో నిర్మించిన అసెంబ్లీ హాల్‌ అద్భుతంగా ఉంది. అక్కడున్న మా బంధువులతో కలిసి ఆరోజు రాత్రి అక్కడి నైట్‌ లైఫ్‌ని చూడ్డానికి బయలుదేరి దీపకాంతులతో ధగధగలాడుతోన్న మెల్‌బోర్న్‌ స్కైలైన్‌నీ మెట్రోరైలు స్టేషన్‌నీ ఓ కేసినోనీ చూశాం. క్రిస్‌మస్‌, న్యూఇయర్‌ సందర్భంగా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఆ రాత్రికి అక్కడ ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం చేసి విశ్రమించాం. మర్నాడు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌కు వెళ్లాం. దేశంలోకెల్లా అతిపెద్ద స్టేడియం ఇదే. దీన్నే ‘ఎమ్‌సిజి’ అని పిలుస్తారు. చుట్టూ ఉన్న ఆవరణలో పేరొందిన క్రికెటర్ల విగ్రహాలూ విశాలమైన హాల్సూ రెస్టారెంట్లతో అదో వింతలోకంలా అనిపించింది. అక్కడకు వెళ్లిన ప్రతీ బృందానికీ ఓ గైడ్‌ వచ్చి మొత్తం చూపిస్తాడు. మొత్తం చూపించాక ఆ గైడ్‌ మాతో జనగణమణ పాడించాడు. అక్కడితో మా ఆస్ట్రేలియా పర్యటన పూర్తయింది. ఆ రాత్రికే బయలుదేరి న్యూజిలాండ్‌లోని ఆక్లండ్‌ చేరుకున్నాం.

ఉద్యాన చిత్రాలు!
ఆక్లండ్‌ ఓ సుందర నగరం. నగర పర్యటనకు బస్సులో తీసుకెళ్లారు. న్యూజిలాండ్‌ టూరిస్టు బస్సులోని డ్రైవర్‌ని కెప్టెన్‌గా పిలుస్తారు. అతనే గైడ్‌ కూడా. ఆ రోజు పర్యటనలో అన్నీ ఉద్యానవనాలే చూశాం. ఒక్కోదానిదీ ఒక్కో అందం. రంగుల మొక్కలూ చిట్టి చెట్లూ వాటిమధ్యలోంచి జాలువారే పొట్టి జలపాతాలూ అందాల కొలనులూ నున్నటి రాళ్లూ... ఇలా చిత్రకారుడు గీసిన ఓ అద్భుతచిత్రం అనిపించేలా పెంచడం అక్కడి ఉద్యాన నిపుణుల ప్రత్యేకత. ఒకచోట మాంసాహార మొక్కల్ని చూసి థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాం.

సముద్ర విమానం!
ఆక్లండ్‌ నుంచి రోటోరువా అనే వూరికి వెళ్లాం. అక్కడి సముద్ర విమానాలు మాకెంతో నచ్చాయి. నీళ్లమీద నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ మీదుగా ఆ విమానం ఎక్కితే అవి నీళ్లమీదుగానే టేకాఫ్‌ అయ్యి మరీ ఎత్తులో కాకుండా సముద్రంమీదనే ఎగురుతూ చుట్టుపక్కల అందాలను చూపిస్తాయి. మాకు ఆ విమానంలోంచి అగ్నిపర్వతాలనూ వేడినీటి బుగ్గలనూ హాట్‌ మడ్‌ పూల్స్‌నూ చూపించారు. తరవాత అగ్రొడోమ్‌కి బయలుదేరాం. అక్కడ గొర్రెలనూ లామాలనూ గేదెలనూ పెంచుతారు. ఓ పెద్ద ట్రాక్టర్‌ ఎక్కించి లామాల దగ్గరకు తీసుకెళ్లారు. పర్యటకులు వాటికి తినిపించే ఏర్పాటు కూడా ఉంది. న్యూజిలాండ్‌లో గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తి. అక్కడ ఎక్కువగా పెంచే మెరినో జాతి గొర్రెల్ని చూశాం. వాటి ఉన్నిని ఆరునెలలకోసారి మెషీన్ల సాయంతో రెండు నిమిషాల వ్యవధిలోనే తీసేస్తారు. ఈ ఉన్నితో చేసిన స్వెటర్లు నాణ్యమైనవీ ఖరీదైనవీ కూడా. న్యూజిలాండ్‌లో విషపూరిత జంతువులేవీ ఉండవట. పాములు అసలే ఉండవు. తరవాత స్థానిక తెగ మావోరీల ప్రదర్శన ద్వారా వాళ్ల గురించి తెలుసుకున్నాం. అక్కడే కివీ పక్షుల్నీ పండ్లనీ చూపించారు.

మిణుగురుల అందాలు!
తరవాత గ్లో వార్మ్స్‌ ఉన్న వెయిటొమో గుహలకు తీసుకెళ్లారు. మన బొర్రాగుహల్లా ఇవి కూడా వేల సంవత్సరాల క్రితం ఏర్పడినవే. కాల్షియంకార్బొనేట్‌తో ఏర్పడిన స్టాలగ్‌మైట్లూ స్టాలక్టైట్లూ చూపించాక ఓ పడవలో ఎక్కించి చిమ్మచీకటిగా ఉన్న ఓ గుహలోకి తీసుకెళ్లారు. కొన్ని లక్షల మిణుగురు పురుగులు ఆ చీకటి గుహలో మెరుస్తూ నల్లని ఆకాశంలోని నక్షత్రాల్లా దర్శనమిచ్చాయి. నిశ్శబ్ద వాతావరణంలోని ఆ చీకటి ప్రయాణం ఓ మరిచిపోలేని అనుభవం. గత 125 సంవత్సరాలుగా ఆ వెయిటొమో గుహలను పర్యటక ప్రదేశంగా నిర్వహిస్తున్నారట.

తరవాతి రోజు క్వీన్స్‌టౌన్‌కు వెళ్లాం. అక్కడ వాకాటిపు అనే సరస్సు పక్కనే ఉన్న నోవాటెల్‌ హోటల్లో నాలుగురోజులపాటు బస చేశాం. ఆ నాలుగురోజులూ విరామసమయంలో సరస్సు ఒడ్డున కూర్చుని అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాం. ఓ సాయంత్రం ఆ సరస్సు పక్కనే ఓ కళాకారుడు నృత్యప్రదర్శన చేశాడు. చాలా బాగుంది. చాలామంది కళాకారులూ అక్కడికొచ్చి తమ కళల్ని ప్రదర్శిస్తుంటారట. ఈ పట్టణంలో ముందుగా బాబ్స్‌ పీక్‌ అనే ప్రదేశానికి కేబుల్‌కారులో వెళ్లాం. కొండపైనుంచి కిందకి చూస్తే సరస్సూ పచ్చని చెట్లూ ఎంతో అందంగా కనిపించాయి. రెండోరోజు నాలుగు గంటలు ప్రయాణించి మిల్‌ఫోర్డ్‌ సౌండ్‌కు వెళ్లాం. ఆ ప్రదేశాన్ని చూస్తే పాపికొండలు గుర్తొచ్చాయి. కొండలమధ్య ఏర్పడిన నీటిప్రవాహమే మిల్‌ఫోర్డ్‌ సౌండ్‌. ఓ ఓడలో ఆ ప్రదేశంలో విహరించాం. ఆ ప్రయాణం మధ్యలో ఓ జలపాతం దగ్గర ఆపారు. అక్కడ పెంగ్విన్‌ పక్షుల్నీ వాల్రస్‌ జంతువుల్నీ చూపించారు. అక్కడ జనసాంద్రత తక్కువ. ఒక్కో వూళ్లొ 10-15 ఇళ్లకి మించి లేవు. విశాలమైన పచ్చికబయళ్లూ గొర్రెలూ వాటికి కాపాలాగా పెద్ద కుక్కలూ కనిపించాయి.

చెత్త లేని దేశం!
న్యూజిలాండ్‌లో చెత్త అనేది ఎక్కడా కనిపించదు. జీరో వేస్ట్‌ దేశంగా చెప్పవచ్చు. అక్కడ ప్రతి వస్తువూ రీసైకిల్‌ చేస్తారట. మరో రోజు డాట్‌నదికి స్పీడ్‌బోట్‌ రైడ్‌కి వెళ్లాం. స్పీడ్‌బోట్‌లో మనల్ని ఎక్కించి లోతు తక్కువగా ఉండే నీటిలో హఠాత్తుగా మలుపులు తిప్పుతారు. అంతలోనే గుండ్రంగానూ తిప్పేస్తారు. చుట్టూ కొండలూ రాళ్లూ నది అడుగు కనిపించేంత స్వచ్ఛమైన నీటిలోని ఆ బోట్‌ రైడ్‌ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. తరవాత గిబ్‌స్టన్‌ అనే వూరికి వెళ్లాం. బంగీ జంపింగ్‌ అనే సాహసక్రీడను మొదట అక్కడే ప్రారంభించారట. మరోరోజు క్వీన్స్‌టౌన్‌ నుంచి బయలుదేరి ట్విజెల్‌ అనే వూరికి చేరుకున్నాం. అక్కడ క్రామ్‌వెల్‌ అనే ప్రాంతంలో జోన్స్‌ ఫ్రూట్‌ స్టాల్‌ దగ్గర ఆపారు. అక్కడ రకరకాల పండ్లు విక్రయిస్తారు. వాటిని రుచి చూసి కొనే వెసులుబాటు ఉంది. తరవాత వనాకాలోని పజ్లింగ్‌ వరల్డ్‌కు వెళ్లాం. ఆ ఆవరణ అంతా పజిల్సే. ఓ గదిలోకి వెళ్లగానే జారిపోతున్నట్లు భ్రమ కలుగుతుంది. అప్పుడు ఎదుటివాళ్లు పడే అవస్థచూస్తే తెగ నవ్వు వస్తుంది. మధ్యాహ్నం పుకాకి సరస్సు మీదుగా మౌంట్‌ కుక్‌కి వెళ్లాం. ఇది ఓ పెద్ద రిజర్వాయర్‌ సరస్సు. చుట్టూ ఉన్న మంచుకొండలు స్వచ్ఛంగా కనిపించే ఆ నీళ్లలో ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఆ సరస్సులోని సహజ రసాయనాల కారణంగా అందులో ప్రాణులు జీవించవని విని ఆశ్చర్యపోయాం. హెలీకాప్టర్‌లో కుక్‌ పర్వతంమీదకు వెళ్లి అందాలను తిలకించాం.

అందాల బొమ్మరిళ్లు!
ట్విజెల్‌లో రాత్రికి బస చేసి ఉదయాన్నే క్రైస్ట్‌చర్చ్‌కి బయలుదేరాం. న్యూజిలాండ్‌లోని పెద్ద నగరాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ ఎక్కడ చూసినా బొమ్మరిళ్లుల్లాంటి అందమైన చెక్క ఇళ్లు కనిపిస్తాయి. ప్రతి ఇంటి చుట్టూ అందమైన తోట తప్పనిసరి. అక్కడ ఇళ్లకీ తోటలకీ ఏటా అందాల పోటీలు జరుగుతుంటాయట. అయితే అక్కడ భూకంపాలు ఎక్కువ. ఐదారేళ్ల క్రితం జరిగిన భూకంపం కారణంగా అక్కడ చాలా ఆస్తినష్టం జరిగింది. పెద్ద భవనాలు పునర్నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పుడు కట్టే కొత్త ఇళ్లూ భవనాలూ భూకంపాల్ని తట్టుకునే విధంగా కడుతున్నారు. అక్కడ కార్డ్‌బోర్డుతో తయారైన ఓ చర్చిని సందర్శించాం. భూకంపంలో మృతిచెందినవారి గుర్తుగా ఆ చర్చి ఆవరణలో వాళ్ల కుర్చీలను అలాగే ఉంచారు. చివరగా నార్త్‌ హేగ్లే పార్కుకి వెళ్లాం. ఓ పిల్లకాలువ, గట్టునే పెద్ద వృక్షాలూ రంగుల పూలమొక్కలతోనూ వీపింగ్‌ విల్లో చెట్లతోనూ ఉన్న ఆ పార్కు అద్భుతంగా ఉంది. ఈ రకం చెట్లు న్యూజిల్యాండ్‌ దేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఆ పార్కు చివరలో ఎవన్‌ నది కనిపించింది. అందులో అందమైన పడవలు ఉంటాయి. వాటిల్లో షికారు చేయడాన్నే పంటింగ్‌ అంటారు. ఆ నది లోతు చాలా తక్కువ. మనకు పక్కనే బాతులు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. తెప్పలా ఉండే ఆ పడవను పంటర్లు కర్రలతో నడుపుతారు. ఈ నదీ వ్యాహ్యాళితో యాత్రను ముగించుకుని ఆస్ట్రేలియా వెలుగుల్నీ న్యూజిలాండ్‌ ప్రకృతి అందాలనూ కళ్లలో నింపుకున్న ఆనందంతో తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.