close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోరినవరాలిచ్చే కోరమీసాల దేవుడు!

కోరినవరాలిచ్చే కోరమీసాల దేవుడు!

ఆ దివ్య రూపాన్ని భక్తితో చూస్తే వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. భయంభయంగా చూశామా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ రౌద్రమూర్తి... వరంగల్‌ జిల్లాలోని కురవి వీరభద్రుడు. రుద్రదేవుడి దివ్యాంశే భద్రకాళీ సమేత వీరభద్రుడు.

ల్లని రూపం, కోర మీసాలు, పదునైన చూపులు! కుడివైపున ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పుష్పం, ఒక చేతిలో గద, ఒక చేతిలో దండం. ఎడమవైపున ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో సర్పం, ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ముద్దరం. మొత్తంగా ఐదు జతల చేతులు! స్వామి పాదాలకింద వినయంగా నంది వాహనం. ఎడమవైపున భక్తులకు అభయమిస్తూ భద్రకాళిక. వీరభద్రుడి రౌద్ర రూపం భూతప్రేత పిశాచాలకు వణుకుపుట్టిస్తుందని భక్తుల విశ్వాసం. కాబట్టే దుష్టశక్తుల పీడ తొలగించుకోడానికి ఎక్కడెక్కడి జనమో ఇక్కడి దేవుడిని శరణువేడతారు. వరంగల్‌ జిల్లాలోని కురవిలో భద్రకాళీ సమేతుడై కొలువుదీరాడు వీరభద్రుడు! కురవి అంటే ఎరుపు... ఆ రంగు వీరభద్రుడి రుధిర నేత్ర జ్వాలకు ప్రతీక కావచ్చు. ఇక్కడే పరమశివుడూ పూజలందుకుంటున్నాడు. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే...అనుజ్ఞ గణపతి దర్శనమిస్తాడు. గణపయ్య ఆనతి తీసుకున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ. అనుమతి ఇచ్చేవాడు కాబట్టే, ‘అనుజ్ఞ’ గణపతి అన్న పేరొచ్చింది. ఆలయ ఉత్తర భాగంలో రామలింగేశ్వరస్వామి, దక్షిణంలో చంద్రమౌళీశ్వరుడూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నవగ్రహాల్నీ సప్తమాతృకల్నీ ప్రతిష్ఠించారు. ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుడి గుడి ఉంది. నాగేంద్రుడి విగ్రహమూ కొలువుదీరింది.

పురాణాల్లో...
తండ్రి కాదని అన్నా, వద్దని చెప్పినా వినకుండా...దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి పరమేశ్వరుడిని పరిణయమాడింది. ఆతర్వాత కొంతకాలానికి, దక్షుడు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ముల్లోకాలకూ పిలుపులు వెళ్లాయి. ఒక్క... కైలాసానికి తప్ప. అయినా, పుట్టింటి మీద మమకారంతో సతీదేవీ ప్రయాణమైంది. భార్యను చిన్నబుచ్చడం ఇష్టం లేక, పరమేశ్వరుడూ సరేనన్నాడు. బిడ్డ వచ్చిన సంతోషం దక్షుడిలో మచ్చుకైనా కనిపించలేదు. సరికదా, అజ్ఞానంతో అహంకారంతో ఆ ఆలూమగల్ని చిన్నచూపు చూశాడు. ఈశ్వరుడిని నానా మాటలూ అన్నాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతైంది. పరమేశ్వరుడు...ఆ ఘోరాన్ని చూడలేకపోయాడు. మహోగ్రరూపం దాల్చాడు. ప్రళయ తాండవం చేశాడు. దుష్టశిక్షణ కోసం తన జటాజూటంలోంచి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరుడు ‘హరహర మహాదేవ’ అంటూ వెళ్లి దక్షుడి తల తెగనరికాడు. అంతలోనే, ‘పరమేశ్వరా, శాంతించు! యజ్ఞాన్ని మధ్యలోనే ఆపేయడం క్షేమం కాదు’ అని దేవతలంతా వేడుకున్నారు. శివుడు శాంతించాడు. దక్షుడి మొండేనికి మేక తలను తగిలించి...కార్యాన్ని పరిసమాప్తి చేయించాడు. శివుడైతే శాంతించాడు కానీ, వీరభద్రుడి క్రోధాగ్ని చల్లారలేదు. దీంతో మహాశక్తి... తనలోని పదహారు కళలలో ఒక కళని భద్రకాళిగా పంపింది. ఆమె సమక్షంలో వీరభద్రుడు చల్లబడ్డాడు. ముక్కోటి దేవతల సమక్షంలో భద్రకాళీ వీరభద్రుల వివాహం ఘనంగా జరిగింది.

చరిత్రలో...
రాష్ట్రకూట రాజైన భీమరాజు కురవిని (నేటి కొరవి సీమను) పాలించేవాడు. అతడే వీరభద్ర ఆలయ నిర్మాత. తర్వాతి కాలంలో, శిథిల స్థితికి చేరుకున్న ఆలయాన్ని కాకతీయ పాలకుడు ఒకటో బేతరాజు పునర్నిర్మించాడు. ఓసారి కురవి ప్రాంతంలో అల్లకల్లోలం తలెత్తింది. శత్రుమూకలు స్వైరవిహారం చేశాయి. అపార ప్రాణనష్టం కలిగించాయి. ఆ సమయంలో స్వయంగా వీరభద్రుడు ప్రత్యక్షమై, దుష్టుల్ని దునుమాడినట్టు ఐతిహ్యం. కొన్నిసార్లు అయితే, మానవ రూపంలో వచ్చి ప్రజలతో ఆటలు ఆడేవాడట, పాటలు పాడేవాడట. అంతలోనే హఠాత్తుగా మాయమైపోయేవాడట. గ్రామ ప్రజలకు వీరభద్రుడిపట్ల ఉన్న భక్తికి నిదర్శనం ఇలాంటి కథలు. కాకతీయ వీరనారి రుద్రమాంబ వీరభద్రుడిని దర్శించుకుని కానుకలు సమర్పించినట్టు విదేశీ యాత్రికుడు మార్కొపోలో రాతల ద్వారా తెలుస్తోంది. అలా ఈ క్షేత్రం కాకతీయుల పాలనలో ఓ వెలుగు వెలిగింది. పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు వీరభద్రుడు ఆరాధ్యదైవం. ‘కొరివి వీరన్న’గా పిలుచుకుంటారు. ఇక్కడ నిత్యం వెలిగే అఖండదీపం మహాశక్తికి ప్రతీక.

ఎన్నో నమ్మకాలు...
వీరభద్రుడి ఆలయంలోని ధ్వజస్తంభం మహిమాన్వితం. పూర్వం, సరిగ్గా దీని కింద ఓ శక్తియంత్రం ఉండేదట. స్తంభాన్ని ఆలింగనం చేసుకోగానే...ఎంతటివారైనా, అప్రయత్నంగా సత్యాన్నే పలికేవారట. నిజం నిప్పులాంటిది. ఆ తీక్షణతను సామాన్యులు భరించలేరు. ఫలితంగా, ప్రజల మధ్య అపనమ్మకాలు పెరిగాయి, ఘర్షణలు చెలరేగాయి. దీంతో... శక్తియంత్రాన్ని ధ్వజస్తంభానికి కాస్త పక్కగా జరిపినట్టు స్థానికులు చెబుతారు. సంతానభాగ్యాన్ని కోరుకునేవారు, తడిబట్టలతో పాణసరం పెట్టే (పొర్లుదండాలు వేసే) సంప్రదాయమూ ఉందిక్కడ. శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. అంగరంగవైభవంగా భద్రకాళి-వీరభద్రుల కల్యాణం జరుపుతారు. పదహారు రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘనంగా రథోత్సవం జరుగుతుంది. ప్రభ బండ్లని ప్రదర్శిస్తారు. జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల పైచిలుకు దూరంలో ఉందీ ఆలయం. మహబూబాబాద్‌ నుంచి అయితే, తొమ్మిది కిలోమీటర్లు.

- భరతపురపు వీరన్న న్యూస్‌టుడే, కురవి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.