close
అధరాలకెన్ని అందాలో..!

‘అందం హిందోళం... అధరం తాంబూలం’ అన్నాడో కవి. నిజమే, అధరాలకు రంగులద్దడం మనకేం కొత్త కాదు. అప్పట్లో తాంబూలంతో పెదవుల్ని పండిస్తే లిప్‌స్టిక్‌ మెరుపులతో మేకప్‌ పూర్తిచేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. పైగా ఇప్పుడు లిప్‌స్టిక్‌ల్లో మాయిశ్చరైజర్‌, శాటిన్‌, మ్యాట్‌, షీర్‌, క్రీమ్‌, ఫ్రాస్టెడ్‌, గ్లాసెస్‌... ఇలా వెరైటీలెన్నో. ఇక, షేడ్‌లకొస్తే పీచ్‌, పింక్‌, కోరల్‌, రెడ్‌, ఫుషియా... లెక్కే లేదు. లిప్‌స్టిక్‌ పెదాలను తడిగా ఉంచుతూ అందంగా కనిపించేలా చేయడమే కాదు, యూవీ కిరణాలనుంచీ రక్షిస్తుందట. అందుకే ఎస్‌పీఎఫ్‌ జోడించిన లిప్‌స్టిక్‌(లిప్పీ)ల జోరు పెరిగింది. వీటికితోడు రెండుమూడు రంగులూ, మెరుపులూ, మారే రంగులూ...ఇలా రకరకాల లిప్‌స్టిక్‌ ట్రెండ్‌లు అమ్మాయిల అధరాలమీద వెల్లివిరుస్తూ అందాల్ని పండిస్తున్నాయి. అంతేనా... లిప్‌స్టిక్‌ వేయని పెదాలూ అలంకరణ చేయని కేకూ ఒక్కటే అంటూ ఓ సుందరభాష్యమూ చెప్పేస్తున్నారు అందాల నిపుణులు. మొత్తమ్మీద ఈతరం అమ్మాయిలకు లిప్‌స్టిక్‌ తప్పనిసరి సౌందర్యసాధనంగా మారిపోయిందనడంలో సందేహం లేదు.


అధరహో..!

తివల అధర సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకు మార్కెట్లో కొలువుదీరుతున్న లిప్‌స్టిక్‌లకు లెక్కే లేదు. అయితే అన్నింటిలోకీ అధరహో అనిపించే లిప్‌స్టిక్కులమీద ఓ లుక్కేస్తే...
* హెచ్‌.కూటార్‌ బ్యూటీ డైమండ్‌ లిప్‌స్టిక్‌: పూలల్లోని ఆ మకరందాన్ని నేరుగా తేనెటీగలే తెచ్చి పెదాలమీదా అద్దాయా అన్నట్లుండే ఈ బ్రాండ్‌ లిప్‌స్టిక్‌ ధర సుమారు రూ. 95 కోట్లు. నాణ్యతను కలిగి ఉండటంతోబాటు దాని కేసు మొత్తం వజ్రభరితమే మరి.
* గెర్‌లా కిస్‌కిస్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ లిప్‌స్టిక్‌: పేరులోనే బంగారాన్నీ వజ్రాలనీ పొదువుకున్న ఈ లిప్‌స్టిక్‌ ధర కూడా తక్కువేం కాదు. సుమారు రూ. 42 లక్షలు. అచ్చంగా బంగారంతో తయారుచేసిన ఈ కేసుమీద మెరిసే వజ్రాలవల్లే దానికంత ఖరీదని వేరే చెప్పాలా..!


పెదవి మెరిసింది!

పెదాలను రకరకాల రంగుల్లో అద్దాల్లా ప్రకాశింపజేసే లిప్‌స్టిక్‌లే కాదు, చమ్కా చమ్కా చమ్కీరే అన్నట్లు మెరిపించే లిప్‌స్టిక్‌లూ వస్తున్నాయి. వీటిల్లో లిప్‌స్టిక్కూ ఆపైన లిప్‌గ్లాస్‌ వేశాక వాటిమీద బ్రష్‌తో గ్లిట్టర్లు అద్దుతూ వేయడం ఒకరకమైతే, నేరుగానే మెరిపించే లిప్‌స్టిక్కులూ ఉన్నాయి. వెండి, బంగారు వర్ణాలతోబాటు అన్ని రంగుల్లోనూ దొరుకుతూ కళ్లను కట్టిపడేస్తున్నాయి.


మ్యాచింగ్‌ మ్యాచింగ్‌

డ్రెస్సుకి మ్యాచింగ్‌ బ్యాగులు వేసుకోవడం అనేది ఓ ఫ్యాషన్‌ ట్రెండ్‌. ఈ మ్యాచీ మ్యాచీ ట్రెండ్‌ సౌందర్య ఉత్పత్తుల్లో మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నాయి కొన్ని కంపెనీలు. అంతే... నెయిల్‌పాలిష్‌కి మ్యాచింగ్‌ లిప్‌స్టిక్‌ కలర్‌ రూపొందించేసి ఇలా ఓ సరికొత్త బ్యూటీ ఒరవడికి శ్రీకారం చుట్టేశాయి. దాంతో నఖసౌందర్యం అధర వర్ణమై మెరుస్తోంది.


మనసు పలికే...

నసులోని మాటను పెదాలే పలుకుతాయి. కానీ ‘మూడ్‌కలర్‌ ఛేంజింగ్‌ లిప్‌స్టిక్‌’ వేసుకుంటే పెదాలు తెరవక్కర్లేదు. అది మారే రంగుని బట్టి వేసుకున్నవాళ్ల మనసేమిటో అర్థమైపోతుంది. అంటే శరీరం ఉష్ణోగ్రతా, రసాయనాల్లోని హెచ్చుతగ్గుల కారణంగా పెదాలమీద రంగు లేతనుంచి ముదురురంగులోకి మారుతుంటుంది. ముత్యాలూ, అలోవెరా, విటమిన్‌-ఇలతో తయారయ్యే ఈ రకం లిప్పీల్లో ఆరు షేడ్‌లు దొరుకుతున్నాయి. వేసుకున్నాక ఆరుగంటలవరకూ నిలిచి ఉంటుందట. రాత్రిపూట పార్టీల్లో ఈ పెదాల మెరుపు సూపర్‌!


అధరం... ద్వివర్ణం!

మధ్య హాలీవుడ్‌లో జుట్టుకి రెండుమూడురంగులు వేసుకోవడం ఫ్యాషనైపోయింది. అదే పెదాలకూ ట్రై చేశారు కొందరు సెలెబ్రిటీలు. దాంతో దగ్గరగా ఉండే రంగుల్ని పెదాలమీద అద్దడం ట్రెండయిపోయింది. ఓమ్రె లిప్స్‌ అంటూ దానికో అందమైన పేరునూ తగిలించారు. ఇక, లిప్‌స్టిక్‌ కంపెనీలు వూరుకుంటాయా... దగ్గరగా ఉండే రెండుఛాయల్ని ఒకే స్టిక్‌లో తయారుచేయడం ప్రారంభించాయి. ఫలితం... ఒకే పెదవిమీద రెండుమూడు షేడ్‌లు కనిపించేలా వేయడంతోబాటు పైనో రంగూ కిందో రంగూ వేసేస్తున్నారు మరి!


నేటి ఫ్యాషన్‌!

పెదాలను తడతడిగా మెరిపించే గ్లాసెస్‌, షిమర్స్‌, షీర్స్‌ రకాలకు చెందిన లిప్‌స్టిక్‌లు వచ్చాక మందంగా ఉండే మ్యాట్‌ లిప్‌స్టిక్‌ల వాడకం తగ్గిందనే చెప్పాలి. మైనంతోబాటు రంగూ ఎక్కువుండే మ్యాట్‌ లిప్‌స్టిక్‌లు మళ్లీ తెరమీదకొచ్చి పెదాలను మరీ ముద్దొచ్చేలా చేస్తున్నాయి. అయితే వీటిల్లో ఎరుపు, మెరూన్‌ రంగుల్లోని ఛాయలతోబాటు వూదారంగు లిప్‌స్టిక్‌లదే నేటి హవా. అదీగాక, కొత్తగా వస్తోన్న మ్యాట్‌ లిప్‌స్టిక్‌లు ఎండిపోయినట్లుగా కాకుండా పెదాలకు చక్కగా పట్టినట్లుగా ఉంటున్నాయి. దాంతో మ్యాట్‌ ఈ ఏటి మేటి ట్రెండయిపోయింది.


పెదవులకు పూలందం!

పూరేకుల్లాంటి పెదాలకు ఆ పూల మృదుత్వాన్నే అందించాలనుకున్నట్లుంది చైనాకు చెందిన కైలిజుమై కాస్మెటిక్స్‌ కంపెనీ. అందుకే జెల్లీలా కనిపించే లిప్‌స్టిక్‌ లోపల అందమైన పూలనూ చొప్పించేసింది. కకోవా బటర్‌, ఆలివ్‌, లావెండర్‌... వంటి సహజ తైలాలతోనే రూపొందించడం దీని ప్రత్యేకత. పారదర్శకంగా కనిపించే ఈ రకం లిప్పీలను వేసుకున్నాక శరీర ఉష్ణోగ్రత కారణంగా ఆయారంగుల్లోకి మారతాయి. అంటే వేసుకునేటప్పుడు రంగేమీ అతుక్కోనట్లే ఉంటుంది. కానీ వేశాకే రంగు తెలుస్తుంది.


మ్యాజిక్‌ మ్యాజిక్‌..!

అందంగా తయారవడం ఓ కళ. చాలామందికి ఓ సరదా కూడా. అందుకే మేకప్‌ కిట్స్‌లోనూ ఆ ఫన్‌ని జోడిస్తున్నారు తయారీదారులు. పైకి ఒక రంగులో కనిపించే ఈ లిప్‌స్టిక్‌లు వేసుకుంటే వేరే రంగులు వస్తాయి. ఆకుపచ్చ లిప్‌స్టిక్‌ వేస్తే గులాబీ, నారింజ వేస్తే ఎరుపు రంగులో అధరాలు మెరుస్తాయి. గోప్యమైన ఈ రంగుల్ని చూసి అమ్మాయిలు థ్రిల్లయిపోతున్నారు మరి.


ఎలా వేసుకోవాలి?

ధరకాగితంమీద మధురసంతకం చేయాలనిపించేంత అందంగా లిప్‌స్టిక్‌ వేసేదెలానో తెలుసుకుందామా...
ముందుగా మేనిఛాయనూ పెదాల పరిమాణాన్ని బట్టీ రంగుని ఎంపికచేసుకోవాలి. తెలుపూ, గోధుమ, నలుపూ... ఇలా శరీర రంగు ఏదయినా ముద్దులొలికే అధరాలకు ఎరుపురంగు ఛాయలే అందం అంటారు సౌందర్యనిపుణులు.

లిప్‌స్టిక్‌ వేసేముందు పెదాల చుట్టూ జిడ్డు లేకుండా కాంపాక్ట్‌ పౌడర్‌ అద్దాలి. లిప్‌ లైనర్‌తో పెదాల అంచుల్లో గీత గీయాలి. ఫ్రాస్టెడ్‌, మ్యాట్‌ లిప్‌స్టిక్‌లు వేస్తే ముందే లిప్‌బామ్‌ లేదా గ్లాస్‌ పూయాలి. షిమర్స్‌, గ్లాసెస్‌ రకాలకయితే అవసరం లేదు. ఇప్పుడు పైపెదవిపై స్టిక్‌తో మధ్యలోంచి నెమ్మదిగా వేస్తూ అంచులకు తీసుకురావాలి.అలాగే కిందపెదవిమీదా వేసి పెదాలను లోపలకీ బయటకూ కదుపుతూ మొత్తంగా పరచుకునేలా చేయాలి. ఇలా చేయడం రాకపోతే చూపుడువేలుతో సరిచేస్తే అదిరే అధరం మీ సొంతం!