close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తీగ తిరిగిన కళ!

ఎంత చేయితిరిగిన కళాకారుడైనా కుంచెను కాన్వాసుకు తగిలించకుండా చిత్రాన్ని పూర్తిచేయలేడు. కానీ రోగన్‌ కళలో ఇది సాధ్యం. భారతదేశంలోని ఒకేఒక్క కుటుంబం ఆపోశన పట్టి వృద్ధి చేస్తున్న ఈ కళలో వస్త్రం మీద పెయింటింగు వేసేందుకు కుంచె బదులు లావుపాటి సూదిని వాడతారు. ఆ సూదిని కూడా వస్త్రానికి తగిలించకుండానే అద్భుతం అనిపించే కళాఖండాన్ని రూపొందిస్తారు.

  ళ అంటేనే అందం. వీటిలో అరుదైన కళలది మరో కోవ. అచ్చంగా ఆ కోవలోకే వస్తుంది రోగన్‌ ఆర్ట్‌. దాదాపు నాలుగు వందల శతాబ్దాల నాటి ఈ కళ ఇప్పటికీ మన దేశంలో సజీవంగా ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా నిరోనా గ్రామం ఈ కళకు నిలయం. అక్కడి ఖత్రీ తెగకు చెందిన అబ్దుల్‌ గఫూర్‌ ఖత్రీ కుటుంబం ఒక్కటే దీనికి వూపిరిలూదుతోంది.

 
ఎంత కష్టమో...
రోగన్‌ చిత్రాలను వేసే పెయింట్‌ తయారీ కోసం ఆముదాన్ని దాదాపు 12 గంటలు మరగబెడతారు. తరువాత చల్లటి నీళ్లను చేరుస్తారు. దీన్నే రోగన్‌ అంటారు. తయారీ తరువాత మిశ్రమాన్ని వూరికి దూరంగా ఒక దట్టమైన అడవిలో మూడు రోజుల పాటు ఉంచుతారు. ఎందుకంటే ఇది తొలుత విపరీతమైన ఘాటు వాసనను వెదజల్లుతుంది. ఇంటికి తెచ్చిన తరువాత మిశ్రమానికి రంగుల పొడిని చేరుస్తారు. ఈ పెయింట్‌లాంటి పదార్థాన్ని పెద్ద సూదిలాంటి పరికరంతో బట్టమీదకు తీగలా తిప్పుతారు. కేవలం ఆ సూదికి వేలాడే తీగలను చక్కని ఆకృతుల్లోకి మారుస్తూ ఈ పెయింటింగు వేస్తారు. ఇలా వేసేప్పుడు ఎక్కడా సూది వస్త్రాన్ని తాకదు. అంతేకాదు మామూలుగా పెయింటింగ్‌ వేసే ముందు వస్త్రం మీద కార్బన్‌ ప్రింట్‌ వేస్తారు. కానీ రోగన్‌ ఆర్ట్‌లో మాత్రం నేరుగా వస్త్రం మీదే డిజైన్‌ విరుస్తుంది. చిత్రంలోని రెండుసగభాగాలూ సమానంగా వచ్చేందుకు గుడ్డను సగానికి మడిచి డిజైన్‌ గీస్తారు. అప్పుడు దాని వెనుక భాగంలో పెయింట్‌ అచ్చు పడుతుంది. మరో వైపు వేసేప్పుడు ఆ అచ్చును అనుసరిస్తూ చిత్రాన్ని పూర్తిచేయడం వల్ల మొత్తం డిజైన్‌ చూడచక్కగా సరిసమానంగా వస్తుంది. వాల్‌హ్యాంగింగ్స్‌తో పాటూ చీరలూ, సల్వార్‌లూ, జాకెట్లూ, బ్యాగులూ, శాలువాల మీదా ఈ చిత్రాల్ని వేస్తున్నారు. వస్త్రం పొడవూ వెడల్పూ అది గీసేందుకు పట్టిన సమయాల్ని అనుసరించి వీటి ధరలు రెండు వందల నుంచి సుమారు లక్ష రూపాయల వరకూ ఉంటాయి. వీటిని కొనుక్కోవాలంటే ట్రెడిషనల్‌రోగన్‌ఆర్ట్‌.కామ్‌ (traditionalroganart.com) వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

   

ప్రధానికీ ఇష్టం
ప్రధాని నరేంద్ర మోదీ సహా, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌, వహీదా రెహ్మాన్‌, షబానా అజ్మీ తదితరులు ఈ కళకు అభిమానులు. ప్రధాని రెండు రోగన్‌ కళాఖండాల్ని అమెరికా అధ్యక్షుడు ఒబామాకు బహూకరించారు కూడా. ఈ కళను ప్రోత్సహించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ప్రత్యేక అతిథులకు వీటినే బహుమతులుగా ఇస్తోంది. రోగన్‌ పర్షియన్‌ కళ. ఖత్రీ పూర్వీకులు సింధ్‌ ప్రాంతానికి చెందిన వారవడం వల్ల వాళ్ల నుంచీ కళ దేశానికి వచ్చింది. వీళ్లలో ఎనిమిదో తరమైన అబ్దుల్‌ గఫూర్‌ కుటుంబానికి చెందిన పిల్లలు సహా ఆడామగా అందరూ ఈ కళను తీర్చిదిద్దుతున్నారు. ఎనిమిది నెలలు కష్టపడి గఫూర్‌ ఓ చీరను తయారు చేశారు. దానికి అప్పటి ప్రధాని చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు గఫూర్‌. రోగన్‌ కళను ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరింపజేయడమే తన జీవితాశయం అంటారీయన. అందుకే త్వరలో రోగన్‌ ఆర్ట్‌స్కూల్‌ను మొదలుపెడతానంటున్నారు ఖత్రీ. అదే జరిగితే ఈ అరుదైన కళ ఔత్సాహికుల చేతుల్లో కొత్త వన్నెలద్దుకుంటుందనడంలో సందేహమే లేదు!

 


 

 

 
గృహాలంకరణ ఓ హంగుగా... అంతస్తుకూ, అభిరుచికీ చిహ్నంగా మారినప్పటి నుంచీ ప్రతి వస్తువూ దాని అసలు ఉపయోగం ఇదీ అని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ మార్పును వంటింటి గిన్నెల నుంచీ గోడగడియారాలూ, లైట్లదాకా ప్రతి దాంట్లోనూ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంటికోసం కొనే వస్తువేదైనా, దాని అవసరం ఎలాంటిదైనా ఇంటికి అందాన్ని తెస్తోందా, చూడచక్కగా అమరుతోందా... అనేదే కొనేవారి ఆలోచన. ఆ అందాల తోవలోకి తాళాల గుత్తులు తగిలించుకునే స్టాండ్లూ కొత్త రూపు సంతరించుకుని వస్తున్నాయి. వాటినే ‘వాల్‌ డెకరేటివ్‌ కీ హోల్డర్లు’గా పిలుస్తున్నారు.
విభిన్నం... వినూత్నం...
తగిలిచేందుకు ఏమన్నా కనిపించాలి గానీ ఇంటితాళాలేంటి బండి తాళాలూ కారు తాళాలూ ర్యాకుల తాళాలూ షోకేసుల తాళాలూ... అప్పుడప్పుడూ చిన్న చిన్న సంచులూ, మళ్లీ వేసుకుందామనుకున్న చున్నీలూ చొక్కాలూ, కాసేపాగి తీసుకోవచ్చనుకున్న గొలుసులూ... ఇలా అన్నీ తగిలించేస్తుంటాం. కాబట్టి కీ హోల్డర్లూ, కీ హుక్‌లూ లేని ఇల్లు ఉండదు. చిన్నదో పెద్దదో, డిజైన్‌దో మామూలుదో... ఏదో ఒకటి మాత్రం మనకు కనిపిస్తుంది. కీ హోల్డర్లు అంత అవసరం మరి. అందుకే, గృహాలంకరణ ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లోనూ అవసరానికి అందాన్ని జోడించి ముచ్చటైన కీహోల్డర్లను బజార్లోకి తీసుకొస్తున్నారు తయారీదారులు. మనం ఓ సీనరీనో, ఆర్ట్‌పీస్‌నో, వాల్‌ హ్యాంగింగ్‌నో చూడచక్కగా గోడకు తగిలించినట్టు వీటినీ గోడకు తగిలించుకోవచ్చు. రకరకాల ఆకారాల్లో విభిన్న రంగుల్లో ఇవి దొరుకుతున్నాయి. లోహం మొదలు, మట్టీ, చెక్కా, కాగితపు గుజ్జూ తదితర పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారు. కుంచె నుంచి జాలువారిన పెయింటింగుల నుంచి రాజస్థానీ ఆర్ట్‌, మీనాకారీ డిజైన్లు, పెబుల్‌ డెకరేషన్‌, మెటాలిక్‌, కలర్డ్‌ మెటాలిక్‌ డిజైన్లూ, మెహందీ వర్క్‌ ఇలా విభిన్న రకాల కళలను అద్దుకొని, చూడముచ్చటైన రూపాల్లో ఇవి రూపొందుతున్నాయి. డిజైన్లతో పాటూ ఆకారాల్లోనూ, రంగుల మేళవింపులోనూ భిన్న రీతులు ఇందులో ఉంటున్నాయి. పల్లెల చిత్రాల నుంచి మోడ్రన్‌ ఆర్ట్‌ తరహావీ, శ్రీకృష్ణుడూ, గణపతీ, సూర్యుడిలాంటి దేవతా రూపాలూ పువ్వులూ, తీగలూ, పక్షులూ ఇలా ఎన్నింటినో ఇందులో భాగం చేస్తున్నారు. మనం ఈ స్టాండ్లను ఏ గదిలో ఏ ఉపయోగం కోసం పెట్టుకుంటున్నాము అన్నదాన్నిబట్టి వీటిలోంచి కావలసిన రకాన్ని ఎంపిక చేసేసుకోవడమే. గోడ వెడల్పూ, రంగుని బట్టి సైజునీ ఎంపిక చేసుకోవచ్చు. దుకాణాలతో పాటూ ఆన్‌లైన్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇంకేం, మీకు నచ్చింది ఎంపిక చేసుకుని గోడకు కొత్త సోకులద్దండి మరి!

 

 


 

ఇంకా..

జిల్లా వార్తలు