close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్ఫూర్తి

స్ఫూర్తి
- గోపాలుని అమ్మాజీ

‘‘బాప్‌రే! మోటివేషన్‌ పేరుతో గంటసేపు బుర్ర తినేశాడు. ఆఫీసువాళ్ళు అరేంజ్‌ చేసిన ప్రోగ్రామ్‌ కాబట్టి గంటసేపు కూర్చున్నాను. లేకపోతే ఎప్పుడో బయటపడేదాన్ని ఆ టార్చర్‌ భరించలేక. ఆయన లెక్చర్‌ విని ఎంతమంది మోటివేట్‌ అయ్యారో తెలీదుగానీ నాకుమాత్రం దెబ్బకి తలనొప్పి వచ్చింది. అర్జంటుగా ఎక్కడన్నా మంచి స్ట్రాంగ్‌ కాఫీ తాగాలి’’ కళ్ళు పెద్దవి చేసి, తల విదిలిస్తూ, భుజాలు ఎగరేస్తూ చెప్పటంలోనే శ్వేత అసహనం, విసుగూ స్పష్టంగా అర్థం అవుతున్నాయి.

కావ్య మౌనంగా నడుస్తోంది శ్వేత పక్కన.

‘‘అసలు ఓపెనింగే చాలా రిడిక్యులస్‌గా అనిపించింది. న్యూటన్‌ చెప్పిన ‘లా ఆఫ్‌ ఇనర్షియా’ని తీసుకొచ్చి మనిషికి ఆపాదించటం... హౌ కెన్‌ ఇట్‌ బి పాజిబుల్‌’’ కావ్య వంక చూస్తూ అంది శ్వేత.

‘‘వై నాట్‌?’’ కావ్య అడిగిన పద్ధతికి ఆమె మోటివేషనల్‌ ప్రోగ్రామ్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయిందని అర్థం అయింది శ్వేతకి.

‘‘జస్ట్‌ థింక్‌ కావ్యా... న్యూటన్‌ చెప్పింది ఒక చలనంలేని ఆబ్జెక్ట్‌ గురించి. అది కేవలం ఒక వస్తువు కాబట్టి మనిషి ఒత్తిడి ద్వారా దానిలో చలనం కలిగించగలడు. కానీ, మనిషి అలా కాదు కదా! అతనికి సెట్‌ ఆఫ్‌ థాట్స్‌, ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, పర్‌సెప్షన్‌, జడ్జిమెంట్‌... ఇలా చాలా లక్షణాలు ఉంటాయి. అలాంటి మనిషిని మార్చటం అంత తేలికైన పనేనా?’’ అడిగింది శ్వేత.

‘‘దాని గురించి ఆయన చాలా క్లియర్‌గా, రీజనింగ్‌తో సహా చెప్పారు. మనిషిలో చలనం కలిగించటం అంటే, తన మాటల ద్వారా ఎదుటి వ్యక్తుల్ని మోటివేట్‌ చేసి, వాళ్ళలో దాగివున్న ఇన్నర్‌ థాట్స్‌నీ, టాలెంట్‌నీ వెలికి తీసుకురాగలగటం అనేది ఆయన ఉద్దేశ్యం.’’

శ్వేత సమాధానం చెప్పాలనుకునేలోపే ఎదురుగా ‘కాఫీ డే’ కనిపించింది.

‘‘పద, స్ట్రాంగ్‌ కాఫీ తాగాలన్నావుగా... తాగుతూ మాట్లాడుకుందాం’’ అంది కావ్య.

ఇద్దరూ కాఫీ మగ్స్‌తో వచ్చి కార్నర్‌లో ఉన్న టేబుల్‌ ముందు కూర్చున్నారు.

శ్వేత మౌనంగా కాఫీ సిప్‌ చేస్తోంది. ఆమెకి తన సమాధానం అంత తృప్తిగాలేదని అర్థం అయింది కావ్యకి.

నాలుగేళ్ళ వాళ్ళ స్నేహంలో ఇద్దరిమధ్యా డిఫరెన్స్‌ ఆఫ్‌ ఒపీనియన్‌ అనేది ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. అందుకే శ్వేతకి కొంచెం ఆశ్చర్యం అనిపించింది.

‘‘నీకు టైమ్‌ ఉండి, బోర్‌ అనుకోకుండా వింటానంటే నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను’’ అంది కావ్య.

‘‘నీ విషయంలో నాకెప్పుడు బోర్‌ అనేది లేదు. ఇక టైమ్‌ అంటావా... అంత అర్జంటుగా ఇంటికి పరిగెత్తి చేసేదేమీ లేదు. రాకేష్‌ వచ్చేసరికి ఎలాగూ రాత్రి పది దాటుతుంది’’ అంది శ్వేత.

శ్వేతకి పెళ్ళయి ఐదేళ్ళయింది. ఇప్పుడిప్పుడే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటున్నారు. కావ్యకి పదేళ్ళ బాబు. వాణ్ణి చూసుకోవటానికి వాళ్ళ దూరపు బంధువు రాజేశ్వరిగార్ని పర్మనెంట్‌గా ఇంట్లో ఉండే ఏర్పాటు చేసుకుంది కావ్య.

కావ్య చెప్పటం మొదలుపెట్టింది.

‘‘శ్వేతా, నాక్కూడా నీలాగే ఈ మోటివేషనల్‌ లెక్చర్‌üü్స మీద అంత ఇంప్రెషన్‌ ఉండేదికాదు. కానీ, కొన్ని ప్రశ్నలకి సమాధానం మన అనుభవాలే చెప్తాయి. అప్పుడింక నమ్మక తప్పదు’’ చెప్పటం ఆపి, కాఫీ సిప్‌ చేసింది.

‘‘డీటైల్డ్‌గా చెప్పి నిన్ను విసిగించను. టూకీగా చెప్తాను.

నేను ఎంటెక్‌ పూర్తికాగానే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాయిన్‌ అయ్యాను. ఉద్యోగం, జీతం, జీవితం అన్నీ బాగున్నాయి. రెండేళ్ళు జాబ్‌ చేశాక నాకు ప్రతాప్‌తో పెళ్ళయింది. అతను ఢిల్లీలో పనిచేసేవాడు, మార్కెటింగ్‌ సైడ్‌. అతనిది నాకన్నా మంచి జాబ్‌, మంచి జీతం కావటంతో మా పేరెంట్స్‌కి ఆ సంబంధం బాగా నచ్చింది. కానీ సమస్యల్లా నేను చెన్నైలో చేస్తున్న జాబ్‌ మానేయాలి. పోనీ, ఢిల్లీ వెళ్ళాక ఏదన్నా ట్రై చేసుకుందామా అంటే అతను ఢిల్లీ నుంచి సౌత్‌కి మూవ్‌ అయ్యే ఆలోచనలో ఉన్నాడని పెళ్ళయాక తెలిసింది.

 అది తెలిశాక నాకెంతో బాధనిపించింది. ఆ విషయం ముందే నాకెందుకు క్లియర్‌గా చెప్పలేదని అమ్మానాన్ననీ, ప్రతాప్‌నీ అడిగాను.

‘ఎంత కావ్యా, సంవత్సరంలో మనం సౌత్‌కి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు మళ్ళీ హ్యాపీగా నీ కెరీర్‌ కంటిన్యూ చేయొచ్చు. ప్రస్తుతం ఈ జాబ్‌లో నాకు ప్రెషర్‌ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలుసు... జాబ్‌ మానటం అంటే ఎంత బాధగా ఉంటుందో. నాకు మాత్రం నిన్ను మిస్‌ అవటం ఇష్టంలేదు. ప్లీజ్‌ ట్రై టు అండర్‌స్టాండ్‌ మి’ అంటూ ఎంతో ప్రేమగా చెప్తున్న ప్రతాప్‌ మాటలకి ఎదురు చెప్పలేకపోయాను.

ఒక సంవత్సరం అనుకున్నది రెండేళ్ళు పట్టింది- మేము బెంగళూరు రావటానికి. ఎప్పటికప్పుడు అయిపోయింది అన్నట్టే ఉండేది, పోస్ట్‌పోన్‌ అవుతూనే ఉండేది. అలాంటి సిచ్యువేషన్‌లో నేను జాబ్‌కి అప్లై చేయలేకపోయేదాన్ని.

బెంగుళూరు వచ్చాక నేను ముందు చేసిన పని జాబ్‌ సెర్చింగ్‌. కానీ, ఇంతలోనే మళ్ళీ అంతరాయం. నేను కన్‌సివ్‌ అయ్యానని తెలిసింది. నాకప్పుడే పిల్లల్ని కనాలని లేదు. ఆమాటే ప్రతాప్‌కి చెప్పాను. తను కూడా సరేనన్నాడు. డాక్టర్‌ని కలిశాం. ఏవో చాలా టెస్టులు చేశాక, నాకున్న హెల్త్‌ కండిషన్స్‌ వల్ల ‘టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ ఈజ్‌ నాట్‌ సజెస్టబుల్‌’ అని డాక్టర్‌ చెప్పారు.

తొమ్మిది నెలలకి శర్వాణ్‌ పుట్టాడు. కంపెనీలో ప్రతాప్‌ పొజిషన్‌, పొజిషన్‌తోపాటు వర్క్‌ప్రెషర్‌ రెండూ పెరుగుతున్నాయి. మా పేరెంట్స్‌ మా దగ్గరుండి బాబుని చూసుకుంటే నేను జాబ్‌కి వెళ్ళాలనుకునేదాన్ని. కానీ అమ్మ బెడ్‌రిడెన్‌ కావటం, ఆవిడని చూసుకోవాల్సింది నాన్న ఒక్కరే అవటంతో అటు నుంచి సహాయం లేకపోయింది. ప్రతాప్‌ వాళ్ళ అమ్మగారు మా పెళ్ళికి ముందే చనిపోయారు. బాబుని అంత చిన్న వయసు నుంచే డే-కేర్‌లో ఉంచటం నాకిష్టం ఉండేదికాదు.

కాలం అంత వేగంగా పరిగెత్తుతోందని కూడా నాకు తెలిసేది కాదు బాబుతో. అలా అలా వాడికి రెండేళ్ళు వచ్చేశాయి. నాకు నా గురించి ఆలోచించుకునే టైమ్‌ కూడా ఉండేదికాదు. ప్రతాప్‌ వర్క్‌ బిజీతో ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకోలేకపోయేవాడు. సో, ఇటు బుజ్జిగాడి పనులు, అటు ఇంటికి కావాల్సినవన్నీ చూసుకోవటం ఇదే నా ప్రపంచం అయిపోయింది.

ఆ టైమ్‌లోనే మా పక్క ఫ్లాట్‌లో ఒక బ్యాచిలర్‌ ఉండేవాడు. అతని పేరు నాకు తెలీదు. దాదాపు నా వయసే ఉండేది. నేనూ, ప్రతాప్‌ బాబుతో బయటికి వెళ్ళేటప్పుడు రెండుమూడుసార్లు పార్కింగ్‌లో కలిశాడు. ప్రతాప్‌, అతనూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేవాళ్ళు. నాకు మాత్రం అతనితో అంత పరిచయం లేదు.

ఒకసారి సంక్రాంతి పండగరోజు మా వాకిట్లో ముగ్గు పెడుతూ, పండగ కదా అని అతని వాకిట్లో కూడా పెద్ద ముగ్గు పెట్టాను. పండక్కి చేసిన స్పెషల్స్‌ ఒక బౌల్‌లో పెట్టి, అతనికిచ్చి రమ్మని ప్రతాప్‌తో పంపాను- బ్యాచిలర్‌ కదా అనే ఉద్దేశ్యంతో. ఎందుకనో అతను అవన్నీ తిప్పి పంపేశాడు.

మరోరోజు- నిజానికి నేను జీవితంలో మర్చిపోలేని రోజు- ఒక రకంగా నా జీవితాన్ని మార్చిన రోజు కూడా అదే!

ఆరోజు బాగా వర్షం పడేట్టు ఉంది. ఆరిన బట్టలు తీయటానికి బయటికెళ్ళాను. మా బట్టలు తీస్తున్నప్పడు పక్క తీగమీద అతని బట్టలు ఆరేసి ఉండటం చూసి, అవి కూడా తీసుకొచ్చాను. తర్వాత చాలా పెద్ద వర్షం వచ్చింది. ‘తీయకుండా ఉంటే అతని బట్టలన్నీ తడిసిపోయుండేవి పాపం’ అనుకున్నాను.

సాయంత్రం అతను రూమ్‌కి తిరిగివచ్చిన అరగంటకి మడతపెట్టిన బట్టలు తీసుకుని వెళ్ళి డోర్‌నాక్‌ చేశాను. ఐదు నిమిషాల తరవాత అతను తలుపు తీసి నావంకా, బట్టల వంకా ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పటిదాకా నేనెప్పుడూ అతనితో మాట్లాడలేదు.

‘మీరు బట్టలు ఆరేసుకుని వెళ్ళినట్టున్నారు. వర్షానికి తడుస్తాయని తీసి మడతలు వేశాను’ చేతిలో ఉన్న బట్టలు అతనికి అందిస్తూ చెప్పాను.

అతను ఒక్క క్షణం నావంకా, బట్టలవంకా నొసలు చిట్లించి చిరాగ్గా చూశాడు.

నేను కొంచెం కంగారుపడ్డాను.

 ‘అసలు నా బట్టలు మిమ్మల్ని ఎవరు తీయమన్నారు?’ చాలా అసహనం ఉంది ఆ గొంతులో.

‘తడిసిపోతే మళ్ళీ మీరు ఇబ్బందిపడతారని’ ఎక్కడో గోతిలో నుంచి వస్తున్నట్టుంది నా మాట. అతనలా చిరాకుపడేసరికి కంగారు, భయం, దుఃఖం అన్నీ ఒక్కసారే ముంచుకొచ్చాయి నాకు.

‘ఇవి తడిసిపోతే ఇక నాకు బట్టలు లేవని మీకు చెప్పానా?’ గద్దించినట్టుంది అతని గొంతు.

చేతిలో బట్టలు కిందపడేసి ఇంట్లోకి పారిపోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక్క అడుగు కూడా కదల్లేకపోయాను.

‘పండగరోజు కూడా అంతే. నా ఇంటిముందు ముగ్గులేశారు. పిండివంటలన్నీ పంపించారు. అసలు ఆరోజే వచ్చి- ఇలాంటివన్నీ నాకు నచ్చవు, ఇంకెప్పుడూ చేయొద్దని గట్టిగా చెప్పాలనుకున్నాను. పండగపూట ఎందుకులే మిమ్మల్ని బాధపెట్టటం అని వూరుకున్నాను. అయినా మీకింకా వేరే పనీ పాటా ఏం లేవా? అంత చదువుకుని కూడా వంటింట్లో పడి మగ్గిపోతుంటారు. అది కూడా చాలదన్నట్టు ఇలా చుట్టుపక్కలవాళ్ళ పనులు కూడా నెత్తినేసుకుంటారు. అసలు మీకంటూ ఒక డ్రీమ్‌, ఒక లైఫ్‌ ఏమీ ఉండవా? ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూడండి... ఎలా పరుగులు పెడుతోందో - కెరీర్‌ కోసం, వాళ్ళనివాళ్ళు ప్రూవ్‌ చేసుకోవటం కోసం. మిమ్మల్ని చూస్తే జాలిపడాలో, చిరాకుపడాలో కూడా అర్థంకావటం లేదు. డోన్ట్‌ రిపీట్‌ ఇట్‌ ఇన్‌ఫ్యూచర్‌’ వార్నింగ్‌లాంటి అతని మాటలకి దిమ్మెరపోయాను.

నేను తేరుకునేలోపే నా చేతిలో బట్టలు తీసుకుని, ఠపీమంటూ నా ముఖానే తలుపేసుకున్నాడు.

తర్వాత దాదాపు పది, పదిహేను రోజులు నా మనసు మనసులో లేదు. అవమాన భారంతో తలంతా దిమ్మెక్కిపోయింది. కరెక్టుగా చెప్పాలంటే ఐ వాజ్‌ ఇన్‌ ద స్టేట్‌ ఆఫ్‌ మెంటల్‌ బ్రేక్‌డౌన్‌.

ఎందుకో ప్రతాప్‌తో కూడా షేర్‌ చేసుకోవాలనిపించలేదు. అప్పటికీ తను చాలాసార్లు అడిగాడు ఎందుకంత డల్‌గా ఉంటున్నావని. ఏదో సాకు చెప్పేదాన్ని.

మెదడు కొంచెం నార్మల్‌ స్టేట్‌లోకి వచ్చాక చిన్నగా ఆలోచించటం మొదలుపెట్టాను.

అతను అన్న ప్రతి మాటనీ చాలా జాగ్రత్తగా రీకలెక్ట్‌ చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అతను అన్నదాంట్లో తప్పేముంది. కరెక్ట్‌గానే అడిగాడు. అలా అనుకున్నాకే సరైన వేలో ఆలోచించటం మొదలుపెట్టాను.

పదిరోజుల బ్రెయిన్‌ స్టార్మింగ్‌ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఆరోజే నా నిర్ణయాన్ని ప్రతాప్‌కి చెప్పాను. ఇద్దరిమధ్యా కొంత డిస్కషన్‌ తర్వాత ప్రతాప్‌ కూడా నాతో ఏకీభవించాడు.

నెలరోజుల్లో శర్వాణ్‌ని చూసుకోవటానికి మా దూరపు బంధువు రాజేశ్వరిగారు వచ్చారు. ఆవిడకి యాభై పైనే వయసు ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయాయి. భర్త లేడు. ఆవిడ బతుకుతెరువుకోసం ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కుంటున్నట్టు తెలిసింది. బాబుని చూడటానికి మా దగ్గరకి రమ్మని అడిగాం. అభ్యంతరాలేమీ చెప్పకుండా వెంటనే వచ్చారామె.

ఆ తర్వాత రెండు నెలల్లో నేను ఉద్యోగం సంపాదించి, నా కెరీర్‌ని మళ్ళీ మొదలుపెట్టాను. అంతేకాదు, నాతోపాటు మరో వ్యక్తికి కూడా ఎంప్లాయిమెంట్‌ ఇవ్వగలిగాననే తృప్తీ, ఆనందం కూడా నాక్కలిగాయి.’’

ఖాళీ అయిన కాఫీమగ్‌ని టేబుల్‌ మీద పెడుతూ వూపిరి తీసుకుంది కావ్య.

‘‘ఇప్పుడు చెప్పు, ఇదే నిర్ణయం రెండేళ్ళముందు నేనెందుకు తీసుకోలేకపోయాను. అప్పుడు నా ఆలోచనల్లా ఒక్కటే... ప్రతాప్‌, నేనూ ఇద్దరం బిజీ అయిపోతే పసివాడు తల్లిదండ్రుల ప్రేమ మిస్‌ అవుతాడేమో అని భయం. కానీ, అతను అలా ప్రశ్నించగానే నా గురించి నేను ఆలోచించటం మొదలుపెట్టాను. అంతేకాదు, ఇంటి పనులన్నీ రాజేశ్వరిగారు చూసుకోవటంతో ఇంట్లో ఉండే సమయమంతా నేనూ, ప్రతాప్‌ బుజ్జిగాడితోనే ఎంజాయ్‌ చేసేవాళ్ళం.

ఆరోజు అతనలా మాట్లాడకపోయుంటే నేనంత చప్పున మేల్కొనేదాన్ని కాదు. నిజానికి మన సమస్యలకి పరిష్కారాలు కూడా మన చుట్టూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరో చెప్తేనేగానీ మనం వాటిని గ్రహించలేం. ఇప్పుడు చెప్పు, ఈజ్‌ ఇట్‌ నాట్‌ ఎ మోటివేషనల్‌ ఫ్యాక్టర్‌?’’

కావ్య చెప్తున్నంతసేపూ ప్రతి విషయాన్నీ చాలా శ్రద్ధగా వింది శ్వేత.

కావ్య చెప్పటం పూర్తిచేసిన కొద్దిసేపటికి అడిగింది ‘‘అంతా బాగానే ఉందిగానీ, అతని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పటంలో తప్పులేదు. కానీ, నీ పర్సనల్‌ గురించి మాట్లాడే రైట్‌ అతనికెక్కడుంది?’’

‘‘అఫ్‌కోర్స్‌, నాకూ ఆ క్షణంలో అలాగే అనిపించింది. నువ్వు బోర్‌ ఫీలవనంటే నీకు చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది’’ అంది కావ్య.

‘‘ఇంత విన్నాక అసలు విషయం తెలుసుకోకుండా ఎలాగ, చెప్పు.’’

‘‘ఇది నేను చెప్పే విషయం కాదు’’ అంటూ హ్యాండ్‌బ్యాగ్‌ ఓపెన్‌ చేసి అందులోంచి ఒక కాయితం మడత తీసి శ్వేతకిస్తూ చెప్పింది కావ్య ‘‘ఇది చదువు’’ అని.

‘‘ఏంటి, ఏవన్నా లెటరా?’’ కాయితం మడతలు విప్పుతూ అడిగింది శ్వేత.

‘‘అవును. ఆ తర్వాత కొద్దిరోజులకి అతను పూణె మూవ్‌ అయ్యాడు. వెళ్ళేముందు వాచ్‌మేన్‌ చేత ఈ లెటర్‌ పంపించాడు’’ చెప్పింది కావ్య.

శ్వేత చదవటం మొదలుపెట్టింది.

కావ్య గారికి,

మీ పేరు నాకెలా తెలుసా అనుకుంటున్నారా? ప్రతాప్‌గారు పిలుస్తుంటే చాలాసార్లు విన్నాను.

ఆరోజు మీమీద అనాలోచితంగా అరిచినందుకు ముందుగా మీరు నన్ను మన్నించాలి. మనంచేసే ప్రతి పనికీ రీజనింగ్‌ వెతుక్కుంటే మనం చాలాసార్లు ఫెయిల్‌ అవుతాం. ఆరోజు నేను మీమీద అసహనం ప్రదర్శించటం కూడా అలాంటిదే.

మీరు ఎదురుతిరిగి ‘నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావ్‌’ అని ఒక్క మాట అడిగివుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. కానీ, మీరు అడగలేదు. అది మీ సంస్కారం. అలాంటి మీ సంస్కారానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి ఈ లెటర్‌ మనసుతో చదవటానికి ప్రయత్నించండి.

మా నాన్న తెలుగు, ఇంగ్లిషు రెండు భాషల్లోనూ గొప్ప పండితుడు. ‘పండిత పుత్ర - పరమ శుంఠ’ అనే సామెత ఎలా వచ్చిందో- మా నాన్నని చూశాకే నాకు బాగా అర్థం అయింది. పండితులకి జీవితంలో సగభాగం పాండిత్యం సంపాదించటానికీ, మిగిలిన సగం దాన్ని ప్రదర్శించి కీర్తి గడించటానికీ సరిపోతుంది. ఇక వాళ్ళకి పిల్లలతో గడిపే టైమూ, వాళ్ళని తీర్చిదిద్దుకునే ఓపికా ఎక్కడుంటుంది చెప్పండి.

దానికి గొప్ప ఉదాహరణే మా ఇద్దరు అక్కలు. మా నాన్నకి వూళ్ళొ ఉన్న పరువు ప్రతిష్ఠలు చాలా గొప్పవి. అక్కలని చదువు కోసం బయటికి పంపితే వాళ్ళేదన్నా తప్పు చేస్తారేమో, దానివల్ల తన గౌరవ ప్రతిష్ఠలకి ఎక్కడ భంగం కలుగుతుందో అన్న ముందుచూపుతో వాళ్ళని కనీసం హైస్కూల్‌కి కూడా పంపలేదు.

మా పొలం కౌలుకి చేసే సాంబయ్య కూతురు బి.ఇడి. చేయటానికీ, మాకు పాలుపోసే శేషమ్మ మనుమరాలు ఇంజినీరింగ్‌లో చేరటానికీ సలహాలు ఇచ్చింది మా నాన్నే. ప్రతి సంవత్సరం రిజల్ట్స్‌ వచ్చినప్పుడల్లా వాళ్ళు మా నాన్న దగ్గరికి వచ్చి ఆయన్ని ఒక దేవుడిలా ఆరాధించేవారు. అప్పుడు మా నాన్న కళ్ళల్లో మెరుపు చాలా స్పష్టంగా కనిపించేది. ఆ మెరుపే అక్కల జీవితాన్ని కాల్చేసిందనిపిస్తుంది నాకు.

ఇద్దరు అక్కలకీ- అందరిలాగా బయటికి వెళ్ళాలనీ చదువుకోవాలనీ ప్రపంచాన్ని చూడాలనీ కోరిక ఉండేది. ఆ విషయం మా నాన్నకి చెప్పే ధైర్యం వీళ్ళకీ, వీళ్ళకి ఏం కావాలో తెలుసుకునే బాధ్యతా, సమయం ఆయనకీ ఉండేవి కాదు. అమ్మ ఉందంటే- నాన్నగారి గౌరవ ప్రతిష్ఠలకి భంగంకలిగే పనులే కాదు, ఆలోచనలు కూడా ఆవిడ చేసేది కాదు. మహా పతివ్రత.

ఈపాటికి మీకొక సందేహం వచ్చే ఉంటుంది.

‘మరి మీరేం చేసేవారు?’ అని. చాలాసార్లు అక్కల గురించి నాన్నతో వాదనకి దిగేవాణ్ణి. కానీ, కీర్తికండూతి ముందు నాలాంటివాడి వాదనలూ వాస్తవాలూ అన్నీ నీరుగారిపోయేవి.

అక్కల్ని చూస్తేనే జాలేసేది. ఎవరన్నా కాలేజీ అమ్మాయిలు ఎదురైనా, బాగా చదువుకున్న అమ్మాయిలు మా ఇంటికి వచ్చినా వాళ్ళముందు కుచించుకుపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో న్యూనతాభావం ఉండేది. చేసే పనుల్లో తొట్రుబాటు. ఇవి చాలదన్నట్టు వచ్చినవాళ్ళ ముందే నాన్న వీళ్ళకి క్లాసులు పీకటం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఏడుపొచ్చేది.

ఆడుతూ పాడుతూ తమ వయసువాళ్ళతో కలిసి స్కూల్లో, కాలేజీలో గడపాల్సిన వయసంతా అమ్మతో, బామ్మతో కలిసి వంటింట్లో గడిపే అక్కల్ని చూస్తుంటే బాలకార్మిక వ్యవస్థ అంతా మా ఇంట్లోనే తిష్ఠ వేసుక్కూర్చున్నట్టు అనిపించేది.

వాళ్ళకి ఇరవయ్యేళ్ళ వయసు రాగానే మా నాన్న తన గౌరవానికి తగ్గ సంబంధాలు చూసి అక్కలకి ఘనంగా పెళ్ళిచేసి పంపారు. వూరంతా ఆయన్ని మళ్ళీ మెచ్చుకుంది. ‘రావుగారు కూతుళ్ళిద్దర్నీ ఎంతో పద్ధతిగా పెంచి, చేయాల్సిన వయసులోనే పెళ్ళిళ్ళు చేసి చక్కగా ఒకింటివాళ్ళని చేశారని.’ నాన్న కల నెరవేరింది.

కానీ అక్కలు మాత్రం ఇంటిపేరు మార్చుకుని మరో వంటింటికి పర్మనెంట్‌గా బదిలీ అయ్యారు.

చదువుకున్న ఆడపిల్లల్ని చూసినప్పుడల్లా నాకు మా ఇద్దరు అక్కలు గుర్తొస్తారు. ముఖ్యంగా వాళ్ళ కళ్ళు. ఆ కళ్ళల్లో ఎన్ని ఆశలూ, ఎన్ని కోరికలూ దాచుకున్నారు?

ఆరోజు నేను మీమీద విసుక్కోవటానికి కారణం- కొంత వరకూ అర్థం అయ్యే ఉంటుంది ఈపాటికి. కానీ, ఒకటి మాత్రం నిజం. ఆరోజు నా అసహనంలో ఒక ఆలోచనా ఆవేదనా ఉన్నాయి.

మీరు ఎంటెక్‌ చేశారని ఒకసారి ప్రతాప్‌గారు మాటల్లో చెప్పారు. అప్పట్నుంచే నేను మీ గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. చదువుకోని మా అక్కలకీ, చదువుకున్న మీకూ పెద్ద తేడా ఏం లేదనిపించింది. మీరు కూడా వాళ్ళలాగే వంటిల్లు, పిల్లాడు, భర్త... ఇదే ప్రపంచంగా బతికేస్తున్నారు.

పెళ్ళిలో అప్పగింతలప్పుడు అక్కలు ఏడుస్తుంటే ఏమనిపించిందో తెలుసా... అప్పటిదాకా కళ్ళలో దాచుకున్న ఆశలూ కోరికలూ కన్నీళ్ళుగా మారి శాశ్వతంగా కరిగిపోతున్నాయనిపించింది.

యుగాలు గడిచినా, ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించబడుతున్నా ఆడపిల్లల విషయంలో మాత్రం సాధించిన మార్పేమీ పెద్దగా లేదు.

ఆడపిల్ల చదువుకున్నంత మాత్రాన ఇంటినీ పిల్లల్నీ చక్కదిద్దుకోవటంలో తప్పేముందని మీరడగవచ్చు. తప్పేమీ లేదు. కానీ, ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కదిద్దుకోవచ్చు. కుటుంబం ఇద్దరిదీ అయినప్పుడు పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలు కూడా ఇద్దరివీ కావాలి. అలా కాకుండా ఒకళ్ళ అభివృద్ధికి అడ్డుకట్టవేసి, దానిమీద మరొకరు భవనాలు నిర్మించుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఉద్యోగం, కెరీర్‌ మగవాడికి ఎంత ముఖ్యమో, ఆడవారిక్కూడా అంతే ముఖ్యమనే భావం మనలో రావాలి. భార్యాభర్తల మధ్య అదొక కాంట్రాక్ట్‌లాగా కాకుండా ఒక అవగాహనతో జరగాలి. లేకపోతే మనం ఆశపడే సమానత్వం ఎన్ని తరాలు గడిచినా స్టేజీల మీద ఉపన్యాసాలకే పరిమితం అవుతుంది.

మీరు ఇంకో మూడేళ్ళ తర్వాత మీ బాబుని స్కూల్లో జాయిన్‌ చేసి మళ్ళీ కెరీర్‌ స్టార్ట్‌ చేయాలన్న ఆలోచనతో ఉండి ఉండొచ్చు. కానీ, ఒక్క విషయం గమనించండి, ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎప్పటికీ ఐదేళ్ళు వెనకబడే ఉంటారు. అది మీ కెరీర్‌లో ఎప్పటికీ ఒక అసంతృప్తిగానే మిగిలిపోతుంది.

ఇది చిన్న విషయమే అనిపించవచ్చు. స్త్రీ-పురుషుల మధ్య అసమానత్వానికి పునాదులుపడింది ఇలాంటి చిన్నచిన్న విషయాలతోనే.

కావ్యగారూ, మీరే కాదు... మీలాంటి చదువుకున్న అమ్మాయిలు చాలామంది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోవటం చేతకాక సర్దుకుపోవటానికి అలవాటుపడిపోతున్నారు. అదే నా ఆవేదన. మీకు లెటర్‌ రాయటంలో ఉద్దేశ్యం కూడా అదే.

నా మనసులోని భావాల్ని సరిగ్గా కన్వే చేయగలిగానో లేదో నాకైతే తెలీదు. మీరు మాత్రం సరిగానే అర్థం చేసుకోగలరనే నమ్మకం నాకుంది.

- భరత్‌

లెటర్‌ మడిచి కావ్యకి ఇస్తూ అంది శ్వేత ‘‘వెరీ ఇంటరెస్టింగ్‌ పర్సన్‌. కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు’’ అని.

‘‘అతని భావాల్ని ఆమె కూడా సరిగ్గా అర్థం చేసుకోగలిగితే భరత్‌ కూడా అదృష్టవంతుడవుతాడు’’ అంది కావ్య.

ఇద్దరూ ‘కాఫీడే’లోంచి బయటికి వచ్చి నడవటం మొదలుపెట్టారు.

‘‘ఇంతకీ ‘న్యూటన్‌ సిద్ధాంతాన్ని మనిషికి కూడా ఆపాదించవచ్చు’ అనేదాంతో నువ్వు ఏకీభవిస్తావా?’’ నవ్వుతూ అడిగింది కావ్య.

శ్వేత కొంచెం నాటకీయంగా తలూపుతూ ‘‘ఒప్పుకుంటా. కానీ, ‘చలనంలేని ఏ వస్తువునైనా’ అనేకన్నా ‘చలించగల లక్షణం ఉన్న ఏ వస్తువునైనా’ అనే చిన్న సవరణతో’’ అంది.

‘‘అప్పుడది న్యూటన్‌ సిద్ధాంతం ఎందుకవుతుంది. శ్వేత సిద్ధాంతం అవుతుందిగానీ’’ అంది కావ్య పెద్దగా నవ్వుతూ.

శ్వేత కూడా శ్రుతి కలిపింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.