close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ తల్లి మహత్యం ‘ఎరుకే’

ఆ తల్లి మహత్యం ‘ఎరుకే’

ఆ ఎరుకలసాని...వకుళమాతలో ఉత్సాహం నింపింది. ఆకాశరాజుకు కర్తవ్యం బోధించింది. పద్మావతికి గతజన్మ బంధాల్ని గుర్తుచేసింది. మొత్తంగా, లోకకల్యాణ కారకుడైన శ్రీనివాసుడి పెళ్లికి మార్గం సుగమం చేసింది. ఆ కృతజ్ఞతతోనే చిత్తూరు జిల్లా ప్రజలు ఎరుకలమ్మను వేంకటేశ్వరుడి అవతారంగా పూజిస్తున్నారు.

‘ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతాను! జరిగింది చెబుతాను, జరగబోయేదీ చెబుతాను...’ అని పాడుకుంటూ ఓ ఎరుకలసాని వకుళాదేవికి ఎదురొచ్చింది. ఆ మాతృమూర్తి శ్రీనివాసుడి పెళ్లి విషయమై ఆకాశరాజును కలవడానికి బయల్దేరుతోంది. ప్రయాణమైతే కట్టింది కానీ, మనసు నిండా ఆలోచనలే, గుండె నిండా భయాలే. శ్రీనివాసుడేమో ఏకాకి. దిక్కూమొక్కూ తెలియని దిమ్మరి. నయాపైసా లేని బికారి. వియ్యమొందాలని భావిస్తున్నదేమో సార్వభౌముడితో. పరిణయమాడాలని మనసు పడుతున్నదేమో పద్మాక్షి, పద్మవాసిని అయిన పద్మావతితో. వెళ్లను పొమ్మంటే శ్రీనివాసుడు చిన్నబుచ్చుకుంటాడు. మాతృహృదయం ఆ బాధను చూడలేదు. ఆ తర్జనభర్జన మధ్యే వకుళమ్మ మూట సర్దుకుంది. ఎదురుగా వచ్చిన ఎరుకలమ్మ ‘అంతా మంచే జరుగుతుంది తల్లీ!’ అని సోదె చెప్పింది. ఆ మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. అంతఃపురంవైపు వడివడిగా అడుగులేసింది.

అంతలోనే, ఆ ఎరుకలసాని ఆకాశరాజు కొలువులో ప్రత్యక్షమైంది. ‘నీ ముద్దుల కూతురికి ఓ గొప్ప సంబంధం రాబోతోంది. ముల్లోకాలకు అధిపతే ఆమెకు పతి కాబోతున్నాడు. కన్యాదానం సమయంలో నువ్వు కడగబోయేది సామాన్యమైన పాదం కాదు. యిభరాజు తలచినది, యింద్రాదులెల్ల వెదకెడిది...బ్రహ్మ కడిగినది...బ్రహ్మాండమంటినది...’ అంటూ ఆకాశరాజుకు సూచనాత్మకంగా శ్రీనివాసుడి మహత్తును వివరించింది. పద్మావతిని పలకరించి ‘వేదరక్షకుడు విష్ణువు సుండో, సోదించె శుకుడు అచ్చుగ సుండో, ఆది బ్రహ్మగన్నాతడు సుండో’ అంటూ హరితత్వాన్ని ఎరుకపరచింది. మొత్తానికి పెళ్లి కుదిరింది. ముక్కోటి దేవతల సాక్షిగా పద్మావతీ శ్రీనివాసుల పరిణయం జరిగింది. జగదేకపతి కల్యాణానికి పూనుకున్న ఆ ఎరుకల మహిళ శ్రీనివాసుడి అవతారమేనని అంటారు. తన పెళ్లి జరిపించుకోడానికి తానే ఆ రూపం దాల్చాడని చెబుతారు. ‘వేంకటేశ్వర కల్యాణ’ వృత్తాంతంలో కీలకపాత్రధారి అయిన ఆ వనితను చిత్తూరు జిల్లా ప్రజలు కొల్లాపురమ్మగా పూజిస్తారు.

అరుదైన ఆలయం...
పద్మావతీ వేంకటేశ్వరుల ఆలయాలు దేశమంతటా ఉన్నాయి. కానీ, ఆ ఇద్దరినీ ఒక్కటి చేసిన..ఎరుకలసానికి మాత్రం చిత్తూరు జిల్లాలో మాత్రమే గుడి కట్టారు. చిన్నగొట్టిగల్లు మండలంలోని రంగన్నగారిగడ్డ గ్రామంలో ఉందీ గుడి. రణగొణ ధ్వనులకు దూరంగా...ప్రశాంత వాతావరణంలో విరాజిల్లుతోందీ ఆలయం. ఆవరణలో అడుగుపెట్టగానే హృదయం భక్తి పారవశ్యంలో మునిగితేలుతుంది. ఇప్పటి క్షేత్రమా ఇది, వందేళ్ల నాటిది! ఆ మూలవిరాట్టు అయితే మరింత ప్రాచీనం.

రాయలసీమలో ఒకప్పుడు పాలెగాళ్ల వ్యవస్థ రాజ్యమేలింది. పన్నుల వసూళ్లూ శాంతిభద్రతలూ వారి చేతుల్లోనే ఉండేవి. ఓసారి ఆ ప్రాంత పాలెగాడు...చతురంగ బలాలతో అటుగా వెళ్తున్నాడు. ఓ చోటికి చేరుకోగానే, ఏనుగుల ఘీంకారాలు మొదలయ్యాయి. గుర్రాలు భయంకరంగా సకిలించడం మొదలుపెట్టాయి. సైనికులు మంత్రమేసినట్టు ఆగిపోయారు. పాలెగాడికి ఇదంతా చిత్రంగా అనిపించింది. ఏ దైవశక్తో తమను నిలువరిస్తోందని అర్థమైంది. ‘అమ్మా! నీ దాసులం. మమ్మల్ని కరుణించు...’ అని వేడుకున్నాడు. అంతలోనే, కొంత దూరంలో మిరుమిట్లు గొలిపే తేజస్సు దర్శనమిచ్చింది. పసుపు, కుంకుమలు కనిపించాయి. అక్కడ తవ్వకాలు జరిపించమని అశరీరవాణి ఆదేశించింది. తవ్వగా తవ్వగా...ముచ్చటైన అమ్మవారి విగ్రహం బయటపడింది. దివ్యకాంతులతో శోభిల్లుతోందా మూర్తి. తాను శ్రీవేంకటేశ్వర కల్యాణం జరిపించిన ఎరుకలసానినని స్వప్నంలో ప్రకటించింది. రంగన్నగారిగడ్డకు చెందిన చెంగారెడ్డి విగ్రహాన్ని వేదమంత్రాలతో ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించాడు. ఏటా ఘనంగా ఉత్సవాల్నీ జరిపించాడు. వందేళ్లనాటి గుడి శిథిల స్థితికి చేరుకోవడంతో, ఇటీవలే చెంగారెడ్డి తనయుడు సిద్ధరామిరెడ్డి నలభై లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించారు. చుట్టూ అనేక ఉపాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగు వైపులా ఆకర్షణీయంగా స్వాగత ద్వారాలు కట్టారు. సుబ్రహ్మణ్యస్వామినీ ప్రతిష్ఠించారు. ఆలయ సమీపంలో, పద్మావతీ శ్రీనివాసులు విహరించిన నారాయణవనాన్ని తలపించేలా ఉద్యానాన్ని తీర్చిదిద్దారు. పిల్లల్లో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని రేకెత్తించేలా అక్కడ శివుడు, బుద్ధుడు, వివేకానందుడు, పంచముఖ ఆంజనేయస్వామి తదితర విగ్రహాలను నెలకొల్పారు.

లక్ష్మీ స్వరూపంగానూ...
ముక్కోపి అయిన భృగుమహర్షి...శ్రీహరి దర్శనానికి వైకుంఠం వెళ్లాడు. లక్ష్మీదేవితో సరససల్లాపాలలో మునిగిపోయి, విష్ణువు తనను పట్టించుకోలేదన్న కోపంతో... హృదయలక్ష్మి స్థానమైన గుండెలమీద తన్ని పోయాడు. ఆ అలకతో ఆదిలక్ష్మి పుట్టింటికి పయనమైంది. అదే, నేటి మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ అని ఓ నమ్మకం. అక్కడి మహాలక్ష్మి ఆలయం సుప్రసిద్ధం. కొల్లాపురమ్మ...కొల్హాపురవాసిని అయిన లక్ష్మీదేవి అవతారమన్న అభిప్రాయమూ ఉంది. బీబీనాంచారిని షాదీ చేసుకోవడంతో శ్రీనివాసుడు ముస్లింలకూ ఆప్తుడయ్యాడన్న కథా ప్రచారంలో ఉంది. ఆ బంధుత్వంతోనే కావచ్చు, ఈ ఆలయానికి ముస్లిం భక్తులూ అధిక సంఖ్యలో విచ్చేస్తారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తారు.

- ఎం.డి.దస్తగిర్‌, ఈనాడు, చిత్తూరు డెస్కు
ఫొటోలు: లోకనాథనాయుడు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.