close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కన్నుకొట్టే బ్యాగు!

కన్నుకొట్టే బ్యాగు!

క్రాస్‌బెల్ట్‌ బ్యాగులు అమ్మాయిలకు ఎప్పుడూ హాట్‌ ఫేవరెట్లే. అందుకే అందులో ఆకట్టుకునే ఎన్నో డిజైన్లు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. దాంట్లో ఓ వినూత్న రకమే ‘హై డి హై వింకీ షోల్డర్‌ బ్యాగు’. దీనిలోపలి త్రీడీ హోలోగ్రామ్‌ మామూలుగా చూస్తే అచ్చం పెద్ద కన్ను రెప్ప విప్పార్చి చూస్తున్నట్టు కనిపిస్తుంది. అదే కాస్త కోణం మార్చి చూశామనుకోండి రెప్పవాల్చినట్టు కనిపిస్తుంది. అందుకే దీన్ని వేసుకుంటే ఒక అడుగు వేసినప్పుడు కన్ను తెరిచినట్టూ, మరో అడుగు వేసినప్పుడు మూసినట్టూ... ఇలా నడుస్తున్నంత సేపూ బ్యాగు కళ్లు ఆర్పుతున్నట్లే కనిపిస్తుంది.


ఇవి... ఇంటి లిఫ్టులు!

డూప్లెక్స్‌ ఇళ్లలో నివసించే వాళ్లు ఏవో ఒక పనుల కోసం పైకీ కిందకీ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండానే మోకాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. అలాంటి వాళ్ల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మెట్లు ఎక్కే పని లేకుండా కేవలం ఇంట్లోని పై అంతస్తుకీ కింది అంతస్తుకీ తిరిగేలా ‘హోమ్‌లిఫ్టు’లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంట్లో ఓ మూలకు ఒదిగిపోయే వీటిని వీల్‌ ఛైర్లో ఉండే పెద్దవాళ్లూ వినియోగించుకోవచ్చు.


కుర్చీ కౌగిలి

కౌగిలింత మానసిక రోగాలనే కాదు శారీరక రోగాలనూ పోగొడుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే ఒంటరి తనంతో బాధపడే వాళ్ల కోసం జపాన్‌ కంపెనీ రూపొందించిందే ఈ ‘హగ్గింగ్‌ ఛైర్‌’. ట్రాన్‌క్విలిటీ ఛైర్‌గానూ పిలిచే ఈ కుర్చీ మనిషి రూపంలోని బొమ్మలా ఉంటుంది. సెన్సర్లతో పనిచేసే దీని మీద కూర్చున్నామంటే ఆ బొమ్మ రెండు చేతులూ చుట్టూ వేసి మనల్ని వాటేసుకుంటుంది. అంతేకాదు, ఆ దేశానికి చెందిన పాటలు పాడేలానూ, కొన్ని మాటలకు స్పందించేలానూ దీన్ని తయారు చేశారు.


వేజ్‌ ఒంపులు

కాసిన్ని పూలు ఇంటికి ఎంత అందాన్ని తెస్తాయో. అందుకే ఫ్లవర్‌వేజులంటే చాలా మందికి మోజు. అయితే ఇక్కడ కనిపిస్తున్నది మాత్రం ఓ సరికొత్త ఫ్లవర్‌వేజు. ‘ఇన్‌ఫినిట్‌ ఏప్రిల్‌ వేజ్‌’గా పిలిచే ఇందులో ఒకదానికొకటి లింకై ఉన్న చిన్న చిన్న గాజుగొట్టాలుంటాయి. ఒక్కో గాజు నాళికలో ఒక్కో పువ్వునూ, రెమ్మనూ పెట్టుకోవచ్చు. ఒకదానికొకటి కలిపే దీని గొలుసులను కదిలేలా రూపొందిస్తారు. అందువల్ల ఈ వేజును గీతలా, గుండ్రంగా, లేదా మరేదైనా మనకు నచ్చిన ఆకారంలో అమర్చుకోవచ్చు. ఇంటికి కొత్త శోభ తెచ్చేసుకోవచ్చు!


షెల్ఫు తిప్పేయండి...

చూసేందుకు అచ్చం చెక్క బీరువాలా కనిపిస్తున్న ఇది ‘క్యూబ్రిక్‌ క్యాబినెట్‌’గా పిలిచే ట్రాన్స్‌ఫార్మబుల్‌ ఫర్నిచర్‌. దీని అరలను గుండ్రంగా కదిలేలా ఏర్పాటు చేశారు. బీరువా తలుపులు తెరిచినట్టు దీన్ని లాగితే చుట్టూ అరలిలా తెరుచుకుంటాయి. మనం విడివిడిగా సర్దుకోవాలనుకున్న చిన్న వస్తువులూ, ఎప్పుడో ఒకసారి వాడేవీ, బయటికి పెద్దగా కనిపించనక్కర్లేని వస్తువులూ, పెన్నులూ, ఛార్జర్ల లాంటివీ ఇందులో పెట్టుకోవచ్చు. బయటికి శుభ్రంగా కనిపిస్తూ, వస్తువులు దుమ్ముపట్టకుండా ఉండేందుకూ అవసరమైనప్పుడు సులభంగా తీసుకునేందుకూ సాయపడుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.