close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమకి పట్టాభిషేకం

ప్రేమకి పట్టాభిషేకం
- రమ ఇరగవరపు

‘నిజమైన ప్రేమకి పట్టాభిషేకం జరుగుతోంది... చూడటానికి తరలి రండి...’ కార్డు మీది అక్షరాల్ని మరోసారి చదువుకున్నా. నిన్న ఆ కార్డు చేతిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో... ఎందుకో నాకు ఆ పదాలు బాగా నచ్చేశాయి. ప్రేమకి పట్టాభిషేకం... వాళ్ళ అమ్మానాన్నల పాతికేళ్ళ పెళ్ళిరోజుని సెలబ్రేట్‌ చేయటానికి వాళ్ళ పిల్లలు తయారుచేసిన ఇన్విటేషన్‌ కార్డు మీది వాక్యమది. మా పెద్దన్నయ్యా వదినల పెళ్ళిరోజు రేపు. వాళ్ళకి తెలియకుండా సర్‌ప్రైజ్‌ పార్టీ అరేంజ్‌ చేస్తున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ. ‘బాబాయ్‌, మీరు కూడా అమ్మానాన్నకి తెలియనివ్వకండి...’ అంటూ పదేపదే చెప్పారు. మా కుటుంబాన్నీ, దగ్గరి స్నేహితులనీ పిలిచారు. వాళ్ళ ఇంట్లోనే రేపు సాయంత్రం పార్టీ.

అన్నయ్య పెళ్ళిరోజు అంటే మా అందరికీ కూడా ఆ రోజుతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. నాన్న పోయాక స్తబ్దుగా మారిపోయిన మా జీవితాల్లో మళ్ళీ కాస్త చైతన్యాన్నీ ఉత్సాహాన్నీ తెచ్చిన వేడుక అది. ఓ పక్క పెళ్ళి తంతు అంతా అందరం కళ్ళల్లో వూరే కన్నీరు బయటకి రాకుండా చూసుకుంటూ, మరోపక్క పక్కవాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చేందుకు నవ్వుతూ... ఆనాటి మా మానసిక స్థితిని మాటల్లో చెప్పలేను. అన్నయ్య పెళ్ళి ఎలా చేయాలీ అన్న దానిమీద, ఇంట్లో వారానికి ఒకరోజు అయినా నాన్న తన అభిప్రాయాలు చెప్తుండేవారు. మేము దానికి మార్పులూ చేర్పులూ చెప్పేవాళ్ళం. ఏదో రేపే పెళ్ళి అన్నంత సీరియస్‌గా సాగేవి మా కబుర్లు. అన్నయ్య చదువు పూర్తి అయినప్పటి నుంచీ కనీసం ఉద్యోగం అన్నా రాకముందే నాన్న అన్నయ్య పెళ్ళి కబుర్లు మొదలుపెట్టేశారు. తెల్లగా పొడవుగా ఉండే అన్నయ్యని చూసి అందరూ ‘హీరోలా ఉన్నాడు’ అనేవారు. ఆడపిల్లలున్నవాళ్ళు ‘మీ అబ్బాయికి పెళ్ళిచేసే ఆలోచన ఉంటే ముందు మాకో మాట చెప్పు’ అంటూ నాన్నకి చెప్పేవారట. అలా ఎవరన్నా నాన్నని అడిగిన రోజున ఇంటికి వచ్చి అన్నయ్య పెళ్ళి కబుర్లు మొదలుపెట్టేవారు. తనకి ఎలాంటి అమ్మాయిని తేవాలీ... ఎలా పెళ్ళి చేయాలీ... ఇలా. నిజానికి అన్నయ్య పెళ్ళి నిజంగా జరిగిన క్షణాలకంటే, నాన్నతో ఆ కబుర్లు పంచుకున్న క్షణాలే మాకు తీయటి జ్ఞాపకం. ఆరుబయట నులక మంచం మీద కూర్చుని, వెన్నెల వెలుతురులో నాన్న తన కొడుకు పెళ్ళి కలని పంచుకుంటుంటే వినటానికి ఎంత బావుండేదో. అందుకే అన్నయ్య పెళ్ళిరోజున అందరి కళ్ళూ మాటిమాటికీ చెలమలూరాయి. అమ్మ మాత్రం కొడుకు జీవితంలో మరపురాని రోజుని తన దుఃఖంతో నింపటం ఇష్టంలేకేమో నిండుగా నవ్వుతూ, ఆ పెళ్ళి తంతు అంతా దగ్గరుండి నాన్న కోరుకున్నట్టు జరిపించింది. నాకు బాగా గుర్తు... అన్నయ్యా వదినా తిరుపతికి వెళ్ళేదాకా హడావుడిగా తిరిగిన అమ్మ, వాళ్ళు వెళ్ళాక ఒక్కతే వెళ్ళి పెరటిలోని తులసికోట దగ్గర మౌనంగా కూర్చుంది. చీకటిలో అలా ఒంటరిగా కూర్చున్న అమ్మ మనసులో సుడులు తిరిగే ఆలోచనలు ఏంటో అర్థం చేసుకోగలిగిన మేము ఎవరం అమ్మని కదిపే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అమ్మే మా బలం. అమ్మ భోరుమంటే ఎలా ఓదార్చాలో కూడా తెలియనివాళ్ళం. ఆ రోజంతా ఇల్లు నిశ్శబ్ధంగా ఉంది. మర్నాడు తెల్లారుతూనే అమ్మ ఎప్పటిలా నవ్వుతూ మాతో కబుర్లు చెబుతుంటే నేను ఆశ్చర్యంగా అమ్మనే చూస్తూ ఉండిపోయా. ఎలా అమ్మ అంత దుఃఖాన్ని గుండెల్లో అదిమిపెట్టి ఇలా నవ్వగలుగుతోంది? తన కంటిలో వూరే కన్నీరు ఎక్కడ మమ్మల్ని బలహీనపరుస్తుందో అనుకుందేమో... ఆ కన్నీటి బావిని నాన్న కార్యక్రమాలు ముగిసిన రోజే మూసేసింది. తన ఉద్యోగం, పిల్లలు... తన ప్రపంచం మేమే. నాన్నతో కలిసి మాకోసం తను కన్న కలల్ని నిజం చేయటానికి... నాన్న లేకున్నా ఏ ఒక్కటీ తీరకుండా ఉండకూడదని అమ్మ పడ్డ ఆరాటానికి సాక్ష్యం ఈరోజు మేమందరం ఉన్న ఈ ఉన్నత స్థాయే. నాన్నలేని ఈ ముప్పయ్యేళ్ళ కాలంలో... అమ్మ ఎంతటి ఒంటరి పోరాటం చేసిందో! మా చదువులూ ఉద్యోగాలూ పెళ్ళిళ్ళూ... ఎవరి సాయం అడగకుండా- అదరకుండా, బెదరకుండా ఎలా నిర్వహించిందో. అందుకేనేమో నాన్న లేకపోయినా ఆ లోటు మనసులో ఉన్నా, రేపటి కోసం భయం మాత్రం తెలియలేదు మాకు. అమ్మ అన్ని పనులూ ఒక్క చేత్తో చక్కబెట్టడం చూస్తే మా గుండెలనిండా ఆత్మవిశ్వాసం. అందుకే ఇప్పటికీ అమ్మే మా బలం. అన్నయ్య పెళ్ళి అనగానే ఇన్నేళ్ళకి కూడా మా ఆలోచనలు ఇలాగే సాగుతాయి. ఆ ఆలోచనల్లో మేమంతా ఉంటాం... నాన్నతో సహా.

ఫోన్‌ ఒకటే మోగటంతో... ఆలోచనల్లోంచి బయటికి వచ్చి ‘‘హలో’’ అన్నా.
అటు అమ్మ... ‘‘రవీ, సాయంత్రం వచ్చేప్పుడు నాకు ఒక గ్రీటింగ్‌ కార్డు తేవాలిరా’’ అంది.
‘‘అన్నయ్యావాళ్ళకి ఇవ్వటానికామ్మా’’ అన్నా.
‘‘అవును కానీ... కార్డు ఎలా ఉండాలంటే...’’ అమ్మ చెబుతోంది. నేను ఆనందంగా వింటున్నా. అమ్మ ఆలోచన ఏంటో అర్థంకాగానే, ఇంకోసారి అమ్మతో ప్రేమలో పడిపోయా. అమ్మ ఆలోచనల్ని అందుకోవటం ఎప్పటికైనా సాధ్యమా నాకు అనిపించింది. రేపటిరోజు కోసం అందరం ఎదురుచూస్తున్నాం... పాతికేళ్ళ ఆ అనుబంధాన్ని సెలబ్రేట్‌ చేసుకోవటానికి.

అన్నయ్య ఒక్కడే కాదు, వదినతో మా అందరి అనుబంధాన్ని అమ్మతో సహా మేమంతా సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఒక్క మనిషి మన జీవితంలోకి వస్తే, ఆ భరోసా ఏంటో రుచి చూసినవాళ్ళం. పాతికేళ్ళ వయసులో అన్నయ్య, నాన్న బాధ్యతల్ని తలకెత్తుకుని అమ్మకి సాయంగా నిలబడితే... వదిన అన్నయ్య బాధ్యతని పంచుకుంది.

ఆలోచనల ప్రవాహం సాగిపోతోంది. పాతికేళ్ళ ప్రయాణం కళ్ళముందు కదులుతోంది. సంతోషాలూ భయాలూ బాధ్యతలూ ఇబ్బందులూ... అన్నీ ఉన్నాయి ఆ ప్రయాణంలో. ఆలోచనలు అలలు అలలుగా తాకుతుంటే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నా...

* * *

అన్నయ్యా వదినలతో ఉదయాన్నే అందరం యాదగిరిగుట్టకి బయలుదేరాం. ‘‘మీ అన్నదమ్ములు వెళ్ళిరండి, మేం రాం’’ అంటూ మమ్మల్ని పంపించి, పిల్లలందరూ ఇంట్లో ఉండిపోయారు. అన్నదమ్ములం ముగ్గురం బయలుదేరాం భార్యలతో కలిసి- అమ్మతోపాటు. ప్రయాణమంతా ఒకప్పటి కబుర్లతో సరదాగా సాగిపోయింది. అలసి ఇంటికి చేరాం. పిల్లలు అప్పటికే చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేశారు. రావాల్సిన అతిథులు రావటం మొదలుపెట్టారు.

ఎప్పటిలానే అన్నయ్య ‘‘ఇవన్నీ ఎందుకు? ఏదో మనమందరం కలిసి కబుర్లు చెప్పుకుంటే సరిపోయేది కదా’’ అన్నాడు.

మా అందరి విషయంలో ప్రతి చిన్న వేడుకకీ ఎంతో హడావుడిపడిపోయే అన్నయ్య తన విషయం వచ్చేసరికి మాత్రం స్తబ్దుగా మారిపోతాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలని చాలా ప్రయత్నించాం మేము చాలాసార్లు. కానీ అన్నయ్య ఆ అవకాశం ఇవ్వడు. గంభీరంగా ఉండే అన్నయ్యని కదిపే ధైర్యం మాకెవ్వరికీ లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మాకు ఈరోజు ప్రత్యేకంగా ఉంది. మేము కోరుకున్నదీ అదే... గలగలా మాట్లాడుతూ, మా అందరికంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఉండే అన్నయ్య మాకు ఓ జ్ఞాపకం. నాన్న తర్వాత ఆ బాధ్యతలని తన భుజాలకి ఎత్తుకున్న అన్నయ్య ‘నాన్న’లా ఎప్పుడు మారాడో తెలియదు.

మా వేళ్ళు పట్టుకుని నడిపిస్తూ తానెప్పుడు వయసుకు మించి ఎదిగాడో మేము గమనించలేదు. నాన్న గాంభీర్యం అన్నలో కనిపించటం ఎప్పుడు మొదలయిందో కూడా గుర్తులేదు. ఆ మార్పు అలా జరిగిపోయింది.

మా అన్నయ్యని, ఒకప్పటి సాగర్‌లా చూడాలనేది మా అందరి మనసులో కోరిక.

‘‘కేకు కట్‌ చేద్దాం రండి...’’ పిల్లల పిలుపుతో అప్పటిదాకా సాగుతున్న ఆలోచనలకి బ్రేక్‌ పడింది. హుషారుగా అందరం కేకు చుట్టూ చేరాం. పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. కేకు కటింగ్‌, దండలు మార్పించటం అన్నీ చకచకా చేయించేశారు. ఆ తర్వాత అన్నయ్యా వదినల పెళ్ళి ఫొటోలతో చేసిన వీడియో ప్లే చేశారు. అందరం మళ్ళీ అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయాం. ఆనందంగా అప్పటి విశేషాలని చెప్పుకున్నాం.
ఇంతలో ‘‘డాడీ, మా అమ్మకి గిఫ్ట్‌ ఇవ్వరా?’’ మా పవన్‌ అడిగాడు వాళ్ళ నాన్నని.
‘‘మీ అమ్మకి నేనే పెద్ద గిఫ్ట్‌, ఇంకేం కావాలి?’’ అన్నయ్య నవ్వుతూ అన్నాడు.
అందరం ‘ఓ’ అని అరుస్తూ చప్పట్లు కొట్టాం. వదిన మొహంలోనూ నవ్వులు విరిశాయి.
‘‘వీల్లేదు, ఇవ్వాల్సిందే. అమ్మకి గిఫ్ట్‌ కొనలేదా?’’ కావ్య వాళ్ళ నాన్నతో సరదాగా గొడవకి దిగింది.
ఇంతలో అన్నయ్య ఒక గ్రీటింగ్‌ కార్డు తీశాడు వెనుక నుంచి... వదిన చేతిలో పెట్టాడు. అందరూ ఇంకోసారి ‘ఓ’ అంటూ గోల.

ఆ కార్డు చూసిన వదిన కళ్ళల్లో కన్నీళ్ళు... భావోద్వేగం కమ్మేస్తుంటే అన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకుంది. అన్నయ్య- వదిన భుజాల మీద చేయి వేసి దగ్గరగా జరిగాడు. వదిన అన్నయ్య భుజానికి తల ఆనించి, లోపలి నుంచి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతోంది. ఆ దృశ్యాన్ని చూస్తూ మా అందరి కళ్ళూ చెమర్చాయి.

వాళ్ళిద్దరూ వాళ్ళకోసం బతకటం మర్చిపోయి మా జీవితాలతోపాటు సాగిపోయారు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారేమో కానీ ఒకరితో ఒకరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక్కరు కాదు... మేమంతా వాళ్ళనీ, వాళ్ళ ఆలోచనలనీ, జీవితాలనీ ఆక్రమించేశాం. జీవితాన్ని ఆనందంగా అనుభవించాల్సిన వయసుని మా బాధ్యతలతో నింపేసుకున్నారు వాళ్ళు.
కళ్ళు తుడుచుకుని వదిన గొంతు విప్పింది... ‘‘థ్యాంక్‌ యూ, మీరు ఇలా చెప్పగలరని నేను అనుకోలేదు.’’
ఒక్కటే మాట... ఆ ఒక్క మాటే అన్నయ్య మాటల ప్రవాహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.
‘‘నీ గురించి నాలుగు మాటల్లో చెప్పటం రాక చెప్పలేకపోయాను. ఏం చేసి నేను నీ రుణం తీర్చుకోగలను? మా అమ్మకి అమ్మవయ్యావు. నువ్వు వచ్చేదాకా అమ్మని చూస్తే... ఏం చెప్పి అమ్మకి ధైర్యం ఇవ్వాలో నాకు తెలియలేదు. కానీ నువ్వు వస్తూనే నా కుటుంబానికి నీ చేయి అందించావు చూడు... ఆరోజు చూశాను అమ్మ కళ్ళల్లో ఆ ధైర్యాన్ని.

ఇద్దరం కాపురం మొదలుపెట్టినరోజే వూరు నుంచి ఇద్దరు తమ్ముళ్ళని ఇక్కడకి తెచ్చి కాలేజీలో చేర్చుదాం అన్నప్పుడు కానీ, వాళ్ళ ఫీజులు నీ జీతంతో కట్టిన రోజున కానీ, ఉన్న రెండు గదుల ఇంట్లో ఎదిగిన ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని నీతో ఏనాడూ ఏకాంతంగా గడపకపోయినా కానీ ఒక్కరోజు కూడా నీలో అసంతృప్తి చూడలేదు, నీ ముఖంమీద నవ్వు చెదరలేదు. ఇప్పటికీ మనం అంటే నా వాళ్ళందరితో కలిపి అనుకుంటావు. తన ధైర్యం నేనే అంటుంది అమ్మ ఎప్పుడూ. కానీ, నా ధైర్యానివి నువ్వు. నువ్వు అన్నివేళలా నా కుటుంబం కోసం నేను చేసే ప్రతి పనిలో నా పక్కనే నుంచున్నావ్‌. నువ్విచ్చిన ఆ సపోర్ట్‌ని నేను ఎలా మాటల్లో చెప్పగలను? నేను అంటే నా కుటుంబం- అని నువ్వు అర్థం చేసుకుని మా అందరినీ అక్కున చేర్చుకున్నావ్‌. ఎలా చెప్పను- నువ్వు నాకెంత విలువైనదానివో. నాకు ఇంతకన్నా మాటలు రావు. నువ్వే నా బలం. ఒక భర్తగా నీకు ఎంత ప్రేమ చూపించగలిగానో, నీ కలలని ఎంతవరకు తీర్చగలిగానో నాకు తెలియదు. కానీ, ఒక భార్యగా నువ్వు మాత్రం చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువే చేశావ్‌’’ అన్నయ్య మాటలు ఆగాయి.

అంతటా నిశ్శబ్దం. అందరి కళ్ళూ వర్షిస్తున్నాయి. వదిన కళ్ళు ధారలు కట్టాయి. అన్నయ్య చేతిని గట్టిగా పట్టుకునే ఉంది. పూడుకుపోయిన గొంతుతో... ‘‘నాకు ఇంకేం తెలియదు, మిమ్మల్ని ప్రేమించటం తప్ప. ప్రేమంటే మీకు సంతోషాన్ని ఇచ్చేదిచేసి, మీరు ఆనందిస్తుంటే ఆ ఆనందాన్ని పంచుకోవటం అనుకున్నా. ఈ కుటుంబం కోసం మీ ఆరాటం, తమ్ముళ్ళనీ అమ్మనీ కళ్ళలో పెట్టుకు చూసుకోవటం... ఎంతమంది చేస్తారిలా? ప్రేమించటం మాత్రమే తెలిసిన మనిషి మీరు. ఆ ప్రేమని అందరికీ పంచారు. ఈ కాలంలో కూడా ఇలా ఇంత కుటుంబాన్ని తోడుగా ఇచ్చారు. ఇంతకంటే ఇంకేం కావాలి..?’’ వదిన మాటలు పూర్తయ్యాయి.

అన్నా వదినలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. పైకి చెప్పని ఎన్నో భావాలూ నిశ్శబ్దంగా ఒకరికి ఒకరు చేర్చుకుంటున్నారు. మేమంతా ఆ ప్రేమైక రూపాలని చెమ్మగిల్లిన కళ్ళతో తృప్తిగా చూస్తున్నాం. అమ్మ కోసం చూశాను... బాల్కనీలో అమ్మ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది- ఏదో బరువు దిగినట్టుగా.

నెమ్మదిగా అమ్మ దగ్గరికి నడిచి భుజం మీద చేయి వేశాను.
‘‘వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమని పైకి చెప్పుకోవటం మర్చిపోయార్రా... బాధ్యతల బరువులు మోస్తూ. అందుకే బాబు కోసం ఆ కార్డు కొనమన్నా. చూడు, ఒక్కసారి ఆ మంచుగడ్డ కరిగితే ప్రేమ ఎలా ప్రవహించిందో మాటల రూపంలో...’’ఆ కార్డులో భార్య కోసం రాసి ఉన్న మాటలు అచ్చంగా మా అన్నయ్య మనసులో ఉన్నవే. అందుకే అమ్మ అలాంటి కార్డు వెతికి తెమ్మంది.

అమ్మని దగ్గరగా తీసుకున్నా. ఒకసారి మా పిల్లలందరి వైపు చూశాను. అందరి కళ్ళూ తడిగా ఉన్నాయి. మొహంలో ఆనందం. ఇక వాళ్ళకి మేము ఈ బంధాల గురించీ, వాటిని నిలుపుకోవటం గురించీ ఏం చెప్పక్కరలేదు. చిన్నప్పటి నుంచీ రుచి చూస్తున్న ఆ అమృతాన్ని వాళ్ళు వదులుకోరు.
ప్రేమ... ప్రేమ... ప్రేమ... అక్కడంతా ప్రేమ సంతోషంతో నాట్యం చేస్తోంది. అన్ని బంధాలలో అనుబంధాలలో తనకంత చోటు దొరికినందుకు.
నిజమే, ఈరోజు ప్రేమకి పట్టాభిషేకం జరిగింది... మేమంతా అందుకు సాక్ష్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.