close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పల్లె కొత్తందాలు అద్దుకుందిలా!

ప్రభుత్వం కదల్లేదు... ప్రజలు వదల్లేదు!

వంతెన కోసం 20 ఏళ్ల నిరీక్షణ... నాలుగే నెలల్లో తీరిపోయింది. 58 కోట్ల రూపాయల ఖర్చవుతుందన్న ప్రభుత్వ వాదన... 50 లక్షలకే కట్టిన వంతెనతో వీగిపోయింది. ఇది జార్ఖండ్‌లోని ఓ మారుమూల పల్లె విజయం. ప్రజలు ఎదురు చూడటం మానేసి, నడుం బిగించిన ఫలితం ఓ వూరికి దశాబ్దాల తర్వాత ఏర్పడిన దారి!

ది జార్ఖండ్‌ రాష్ట్రపు హజారీబాగ్‌ జిల్లాలోని లారాహి గ్రామం. 500 జనాభా. ఎనభైఒక్క ఇళ్లు. వూరికి ఆసుపత్రి లేదు. చిన్న తరగతుల వరకూ పాఠశాల ఉన్నా అదీ అంతంత మాత్రమే. వూరి నుంచి జిల్లాకేంద్రం హజారీబాగ్‌కు వెళ్లాలంటే 50 కిలోమీటర్లు. మరో పట్టణం కొడెర్మ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలు ఉన్నత పాఠశాలలో చదవాలంటే ఇన్ని కిలోమీటర్లూ వెళ్లి రావాల్సిందే. ఫలితంగా వసతి గృహాల్లో ఉంచి చదివించగలిగిన వాళ్లు తప్పించి, ఎందరో పిల్లలు అక్కడితోనే చదువు ఆపేశారు. ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. నిజానికి కొడెర్మ వెళ్లే జాతీయ రహదారిని చేరేందుకు ఈ వూరికి మరో దారీ ఉంది. ఒకటిన్నర కిలోమీటర్ల పొడవుండే ఆ దారి గుండా వెళితే కొడెర్మ వెళ్లే దూరం 15 కిలోమీటర్లు తగ్గుతుంది. కానీ మట్టిరోడ్డు ఉండే ఆ దారి లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ఎప్పుడూ నీళ్లతో నిండి ఉంటుంది. అది కూడా దాటినా అక్కడి కోయెలా నదికి సంబంధించిన కాలువ పారుతూ ఉంటుంది. దాన్ని కూడా దాటితేనే కొడెర్మ పట్టణానికి వెళ్లే జాతీయ రహదారిని చేరొచ్చు. నిజానికి ఈ దారి వేస్తే కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని బార్హి అనే చిన్న పట్టణాన్నీ చేరొచ్చు. అక్కడా పిల్లలు చదువుకోవచ్చు. ఈ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు కోసమే దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశారు.

అనుకున్నంత పనీ...
కొడెర్మ చేరేందుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో కష్టమైనా జనం కొయెలా నది కాలువ గుండానే ప్రయాణం చేస్తుంటారు. అలా 1996లో 12 మందితో నదిలోకి వెళ్లిన ఓ పడవ బోల్తాపడింది. ఆ ఘటనలో వూరికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అది మొదలు... వూరి జనం ప్రభుత్వ కార్యాలయాలకూ, ప్రజా ప్రతినిధులకూ ఎన్నోసార్లు వినతులు పెట్టుకున్నారు. ప్రతి ఎన్నికలకూ ఆ వూరి రోడ్డూ, వంతెనలే ఆకర్షణీయ వాగ్దానాలయ్యాయి. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారూ వెళ్లారు. కానీ ప్రజల అవసరం తీరలేదు. ఇచ్చిన మాట నిలబడలేదు. లారాహి ప్రజలు మాత్రం వంతెన కోసం పోరాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగానే 2014లో ప్రభుత్వ ఏజెన్సీవాళ్లు వచ్చి దర్యాప్తు చేశారు. ఈ దారి వేసేందుకు మొత్తం 58 కోట్లరూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మళ్లీ దాని పనులవంక చూసిన నాథుడు లేడు.

పట్టు బిగించారు...
త్రిలోకీ యాదవ్‌... ఆ గ్రామానికి చెందిన వ్యక్తే. పడవ దుర్ఘటనకు ప్రత్యక్షసాక్షి. వంతెన కోసం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన గ్రామస్థుడు. ఒకే ఒక్కవ్యక్తి కొండను తొలిచి వూరికి దారి ఏర్పాటు చేశాడన్న కథనాన్ని పత్రికలో చదివాడు. ఒక్క మనిషి పట్టుదలతో తమ వూరికి దారి ఏర్పాటు చేసుకున్నప్పుడు వూరందరం కలిసి మా దారిని బాగుచేసుకోలేమా... అనుకున్నాడు. తనకొచ్చిన ఆలోచనతో వూరికి చెందిన మరికొందరిలో స్ఫూర్తి నింపాడు. అలా2012లో త్రిలోకీ యాదవ్‌ సహా కొంతమంది ఓ బృందంగా ఏర్పడ్డారు. రోడ్డు నిధి కింద వూరి వాళ్లందరూ ఎవరికి సాధ్యమైనంత సొమ్ము వాళ్లు ఈ బృందానికిచ్చారు. చుట్టుపక్కల కొన్ని వూళ్లకూ తిరిగి మరికొంత జమచేశారు. అది 2016కి 50 లక్షల రూపాయలయ్యింది. ఆ డబ్బుతో మొన్న ఫిబ్రవరిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. లారాహిలో ఉండేవాళ్లలో ఎక్కువ మంది వలస కూలీలు. వాళ్లకు రోడ్డు వెయ్యడంలో అనుభవం ఉంది. వీళ్లంతా తమ వంతుసాయంగా ఆ పనులు చేసిపెడతామన్నారు. అలా ఓ 50 మందిని బృందంగా చేశారు. నాలుగు నెలలుగా వూరు వూరంతా పనుల దగ్గరే ఉంది. చుట్టుపక్కల మరో 25 వూళ్ల జనమూ ఇక్కడ శ్రమదానం చేస్తున్నారు. గంటకు రూ.1500 అద్దెకు పొక్లెయినర్లను మాట్లాడుకున్నారు. 30 ట్రాక్టర్ల చిప్స్‌, 700 బస్తాల సిమెంటు, 10 ట్రాక్టర్ల పెద్ద కంకర, 85 పైపులు... పక్కా లెక్క ప్రకారం నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం 75 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. తామనుకున్న 50 లక్షల బడ్జెట్‌లోనే పూర్తిస్థాయిలో వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని గ్రామస్థులు ధీమాగా ఉన్నారు. ‘మా వూళ్లొ చాలా మంది కడుపునిండా భోజనం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లే. అయినా అందరూ తలో చేయీ వేశారు. అందుకే మేం చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చుపెడుతున్నాం. కానీ మేం రోడ్డుకు ఇప్పటికి సుమారు 16 అడుగుల ఎత్తున మట్టిపోశాం. వర్షాలు బాగా పడేలోపు రాళ్లు అడ్డం వేయలేకపోతే మట్టి కొట్టుకుపోతుంది. ఈ సమయంలో అయినా ప్రభుత్వం సాయానికి వస్తే చాలా మేలు చేసినట్లవుతుంది’ అంటున్నారు త్రిలోకీ యాదవ్‌ (ఫోన్‌.8521514773).

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎన్నాళ్లని ఎదురు చూస్తారు ప్రజలు. వాళ్లు అడుగు ముందుకేస్తే... ప్రభుత్వ బడ్జెట్‌లో కేవలం పదోవంతుతో వంతెన నిర్మాణం పూర్తవుతోంది. జనబలానికి ఓ ఉదాహరణగా నిలుస్తున్న ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయమే పడుతుంది. ఈ ఒక్క అడుగు... దూరాన్ని తగ్గించుకునే దిశగా, జనాన్ని చైతన్యవంతం చేసే దిశగా!


 

పల్లె కొత్తందాలు అద్దుకుందిలా!

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లె ‘గునేహడ్‌’. మొన్నటివరకూ దీనిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. దేశంలోని మిగతా లక్షల గ్రామాల్లో ఇదీ ఒకటి. ‘అలా కాదు ఈ గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి’ అనుకున్నాడో వ్యక్తి. అనుకోవడమే కాదు చేసి చూపాడు కూడా. అదెలానో మీరే చదవండి..!

ఇండోర్‌ నుంచి ముదిత భండారీ, దిల్లీ నుంచి గర్గీ చందోలా, బెంగళూరు నుంచి షీనా దేవ్యా... ఇలా దాదాపు 12 మంది కళాకారులు దేశం నలుమూలల నుంచీ గునేహడ్‌ చేరుకున్నారు. వీరికి విదేశాలకు చెందిన మరో ఇద్దరూ తోడయ్యారు. అంతా హిమాచల్‌ప్రదేశ్‌లోని గునేహడ్‌లో మే 14 నుంచి జూన్‌ 14 వరకూ నెల రోజులపాటు ఉండి ఆ గ్రామానికి కొత్త కళ తెచ్చారు. ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది ఫ్రాంక్‌ ష్లి్కచ్‌మాన్‌. జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ ఎనిమిదేళ్లుగా గ్రామంలో ఉంటున్నాడు. గునేహడ్‌ని ఫ్రాంక్‌, ఫ్రాంక్‌ని గునేహడ్‌ పరస్పరం దత్తత తీసుకున్నాయని చెప్పాలి. పారాగ్లైడింగ్‌కి పేరు పొందిన బిర్‌-బిల్లింగ్‌ గ్రామానికి దగ్గర్లోనే ఉంటుంది గునేహడ్‌. కానీ ఆ గ్రామంతో పోల్చితే ఇక్కడ పర్యటకులు తక్కువ. దాంతో గ్రామస్థులకు ఆదాయమూ అంతంతే! ఈ పరిస్థితిలో మార్పు తేవాలనుకున్నాడు ఫ్రాంక్‌. అందుకే, 2013లో మొదటిసారి కొద్దిమంది కళాకారుల్ని ఆ గ్రామానికి ఆహ్వానించి వివిధ కార్యక్రమాల్ని నిర్వహించాడు. ఆసారి ఫ్రాంక్‌ దాన్ని చిన్నగానే చేశాడు. కానీ తర్వాత గ్రామానికి వచ్చే పర్యటకులు పెరిగారు. అలాంటి కార్యక్రమాన్ని భారీగా చేపట్టాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రఖ్యాత, వర్ధమాన కళాకారులకు పిలుపునిచ్చాడు. ఈ ప్రాజెక్టుకు ‘4టేబుల్స్‌ ప్రాజెక్టు’ అని పేరు పెట్టాడు. ఇదే పేరుతో గునేహడ్‌లో ఒక రెస్టరెంట్‌ని నడుపుతున్నాడు ఫ్రాంక్‌. అక్కడ ఆ పల్లె అందాలకు సంబంధించిన ఫొటోలనీ ప్రదర్శనకు పెట్టాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలోని పురాతన, సంప్రదాయ నిర్మాణాల సంరక్షణ, దుకాణాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, యువతకు వివిధ రంగాల్లోని వృత్తి నిపుణుల్ని పరిచయం చేయడంలాంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికోసం క్రౌడ్‌ ఫండింగ్‌ద్వారా నిధులు సేకరించారు.

* * *

అక్కడున్న నెలరోజులూ గునేహడ్‌ గ్రామాన్ని ఒక కాన్వాస్‌గా భావించి అందమైన బొమ్మల్ని గీశారు చిత్రకారులు. గ్రామంలోని దుకాణాల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పాత భవనాలకూ రంగులద్ది కొత్తందాలు తెచ్చారు. ముదిత భండారి... సిరామిక్స్‌ కళాకారిణి. అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు వెళ్లే ముదిత ఈసారి పల్లెబాట పట్టింది. స్థానిక యువతకు సిరామిక్స్‌ పైన బొమ్మలు గీయడంలో శిక్షణ ఇచ్చింది. ‘ఇప్పటివరకూ నేను వెళ్లిన పర్యటనలన్నింటిలోకీ ఇదే ఉత్తమమైనది, అర్థవంతమైనదీనూ’ అంటుంది ముదిత. అమృత్‌ వత్సా అనే యువకుడు మూడు నిమిషాల నిడివి ఉండే లఘు చిత్రాలు తీస్తుంటాడు. ఈసారి గునేహడ్‌ వచ్చి గ్రామంపైన అనేక కోణాల్లో మూడు నిమిషాల చిత్రాలు తీశాడు. వాటిలో ఒకటి... గ్రామానికి చెందిన మణిరాం దగ్గర ఉన్న తుపాకీ గురించి... ఆ తుపాకీ సంగతి ఇన్నాళ్లూ వూళ్లొ ఎవరికీ తెలియదట. ధర్మశాల కేంద్రంగా పనిచేసే ‘కంగ్రా ఆర్ట్స్‌ ప్రమోషన్‌ సొసైటీ’ కూడా మీనియేచర్‌ వర్క్స్‌ను ప్రదర్శించింది. పిల్లలకు చిన్న తెరపైన సినిమాల్ని చూపిస్తూ అలరించే సింగపూర్‌ వాసి ‘కె.ఎమ్‌.లో’ కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు ప్రదర్శించాడు. దిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ రమా కుమార్‌... స్థానిక ‘గద్ది’ తెగకు చెందిన సంప్రదాయ వస్త్రాల్ని నేయడంలో పిల్లలకు శిక్షణ ఇచ్చింది. ఆ స్ఫూర్తితో తమ సంప్రదాయ వస్త్రాల బొటిక్‌ పెడతామంటున్నారు ఒకరిద్దరు. అంతేకాదు సంప్రదాయ దుస్తుల్ని ధరించి 17 మంది అమ్మాయిలు ఉత్సవాల చివరి రోజున ర్యాంప్‌పైన నడిచారు. ‘ఫొటోకీ దుకాన్‌’ ఏర్పాటు చేసిన కేతనా పటేల్‌... పిల్లలూ, పెద్దల ఫొటోల్ని తీసి ఓ పెయింటింగ్‌ మధ్యలో ఉంచి పెయింటింగ్‌లానే వచ్చేట్టు చేసింది. ఇలా ఇంకా చాలామంది తమ కళాఖండాల్ని ప్రదర్శించారు.

* * *

‘ఇంతమంది కళాకారుల్ని ఒకేసారి చూస్తుంటే ఎంతో ప్రోత్సాహంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఈసారి ఉత్సవం చూసి సంతోషిస్తున్నారు’ అని చెబుతున్నారు స్థానిక అమ్మాయిలు ఉమా, మోనిక, సప్నా. గునేహడ్‌లో ఉన్న నెలరోజులూ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించామనీ ఎన్నో మధురానుభూతుల్ని మూటగట్టుకున్నామనీ చెబుతున్నారు కళాకారులు. ఈ సమయంలోనే ప్రపంచం గునేహడ్‌ వైపు చూసింది. అలా ఫ్రాంక్‌ లక్ష్యం కూడా నెరవేరింది.


 

ఏ పనైనా చేసేస్తాం..!

‘ఇంట్లో ఏసీ చెడిపోయిందని ఫోన్‌ చేసి వారమైనా మెకానిక్‌ రాలేదు. పనమ్మాయి రాక నాల్రోజుల నుంచి బట్టలన్నీ కుప్పయ్యాయి. సమయం లేక కారుని సర్వీసింగ్‌కీ ఇవ్వలేదు. కంప్యూటర్‌ పనిచేయట్లేదు. డైనింగ్‌ టేబుల్‌ కాలు విరిగింది. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది’... నగరాల్లో ఎవర్ని కదిలించినా ఇలాంటి సమస్య ఏదో ఒకటి వినిపిస్తుంది. అలా పనివాళ్లూ, నిపుణుల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ కూర్చోకుండా ఒక్క ఫోన్‌తో ఇంట్లో అన్ని రకాల సమస్యల్నీ ఇట్టే తీర్చేస్తాం అంటోంది ఎస్‌బ్రిక్స్‌.