close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిన్నారి బొమ్మలకూ ఫ్యాషన్లెన్నో...

‘అమ్మా, ఈసారి పుట్టినరోజుకి నాకే కాదు, జెస్సీకీ గాగ్రాచోళీనే కావాలి. సరేనా...’ అంటూ దీర్ఘాలు తీసింది మున్నీ. ‘నికీ డ్రెస్సులన్నీ పాతగా అయిపోయాయి. షూ కూడా కొనాలి. బజారెళదామా మమ్మీ’ అంటూ గారాలు పోయింది ఖుషీ. ఇంతకీ ఆ జెస్సీ, నికీలు ఎవరో తెలుసా... పిల్లల బొమ్మ నేస్తాలు. ఇప్పుడు పిల్లలకు మాదిరిగానే బొమ్మలకూ ఫ్యాషన్‌ దుస్తులూ యాక్సెసరీలూ డిజైన్‌ చేస్తున్నారు. దాంతో ఇంట్లో బొమ్మలకీ ప్రత్యేక వార్డ్‌రోబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు ఈతరం అమ్మానాన్నలు.

పండగకో పుట్టినరోజుకో పిల్లలకి కొత్తబట్టలు కొని కుట్టించడం వెనకటి సంప్రదాయం. ఈతరం పిల్లలకి ఎప్పుడు కొత్తది వేసుకోవాలనిపిస్తే ఆ నిమిషమే కొని వేసేసుకుంటారు. అక్కడితో ఆగితే వింతేముంది... వాళ్లతోపాటు బొమ్మ చెల్లికో నేస్తానికో కూడా కొత్త బట్టలు కొనాల్సిందే. తొడగాల్సిందే. అందుకే ఇప్పుడు ఇళ్లలో పిల్లల బట్టల బీరువాల చెంతనే వాళ్ల బొమ్మలకూ వార్డ్‌రోబ్‌లు వెలుస్తున్నాయి. వాటిల్లో బొమ్మల దుస్తులూ యాక్సెసరీలూ అందంగా కొలువుదీరుతున్నాయి. ఒకప్పుడు పిల్లలు తమ తాటాకు బొమ్మలకు గౌన్లు కావాలంటే- మిగిలిపోయిన గుడ్డముక్కలతో చిన్న చిన్నవి కుట్టి ఇచ్చి వేసుకోమనేవారు అమ్మలు. ఇప్పుడు అలాంటి పప్పులేమీ ఉడకవు. పిల్లల దుస్తులకు మించిన స్టైల్స్‌తోనూ ఫ్యాషన్లతోనూ బొమ్మలకీ ప్రత్యేకంగా దుస్తుల్ని తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీటి ధరలు కూడా పిల్లల దుస్తులకి ఏమాత్రం తీసిపోనిరీతిలో ఉంటున్నాయి. అయినప్పటికీ తమ పిల్లల సంతోషం కోసం వాళ్ల బొమ్మల్నీ ఫ్యాషన్‌ దుస్తులతో అలంకరిస్తున్నారు నేటితరం తల్లిదండ్రులు.పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యంగా ఉంటాయన్న కారణంతో అంతర్జాతీయంగా 18 అంగుళాల బొమ్మలే ఎక్కువగా తయారుచేస్తారు. అందుకే ఆ సైజులోనే బోలెడు ఫ్యాషన్‌ దుస్తుల్ని డిజైన్‌ చేస్తున్నాయి అనేక కంపెనీలు. దాంతో ఆ బొమ్మలు కూడా ర్యాంప్‌లమీద క్యాట్‌ వ్యాక్‌ చేస్తున్న రీతిలో ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్యాషన్లతో ముస్తాబవుతున్నాయి. స్విమ్‌సూట్లూ, నైట్‌డ్రెస్సులూ, మ్యాక్సీడ్రెస్సులూ, స్కర్టులూ, జీన్స్‌ప్యాంట్లూ, లెగ్గింగ్‌టీషర్టులూ, ఓవర్‌కోట్లూ, పొట్టి ఫ్రాకులూ, పొడవు గౌన్లూ, సల్వార్‌కమీజ్‌లూ, చీరలూ, అనార్కలీలూ... ఇలా ఒకటా రెండా వాటికోసం దొరకని మోడల్‌ లేదు. పైగా ఆ డ్రెస్సుకి మ్యాచ్‌ అయ్యే షూలూ టోపీలూ హ్యాండ్‌బ్యాగులూ... వంటి యాక్సెసరీలకూ లెక్కలేదు. ఎందుకంటే పిల్లలకు అనుకరణ పుట్టుకతో వచ్చిన విద్య. అమ్మాయిలు అమ్మల్నీ అబ్బాయిలు నాన్నల్నీ తు.చ. తప్పక అనుకరిస్తారు. అందులో భాగంగానే అమ్మ తమను ఎలా తయారుచేస్తుందో అచ్చం అలానే తమ బొమ్మని తయారుచేసి మురిసిపోతుంటారు. దాంతో పిల్లల కోసం తయారుచేసినట్లే బొమ్మలకోసం కూడా బోలెడు రకాల దుస్తుల్నీ ఆభరణాల్నీ యాక్సెసరీలనూ డిజైన్‌ చేస్తున్నారు. పైగా ఈ బొమ్మలకోసం చేత్తో అల్లిన క్రోచెట్‌ నుంచి కాటన్‌, సిల్కు, నెట్‌, నైలాన్‌, డెనిమ్‌... ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్కుల్నీ ఉపయోగిస్తుండటం విశేషం. బొమ్మల సైజుని బట్టి ఆల్టరేషన్‌ చేయించుకునేలా కూడా కుడుతున్నారు సదరు డిజైనర్లు. ఏమైనా పిల్లల ఫ్యాషన్లతో వాళ్లు ఆడుకునే బొమ్మల దుస్తులు పోటీపడుతుండడం ఆశ్చర్యంగా లేదూ!


 

కాన్వాసు మీద చిత్రానికి రంగులద్దితే అది పెయింటింగ్‌. అదే వస్త్రం మీద డిజైన్‌ను దారంతో కుడితే అది ఎంబ్రాయిడరీ. మరి చిత్రాన్ని వస్త్రం మీద కుట్టుమెషీన్‌తో చిత్రిస్తే?... అది అరుణ్‌ బజాజ్‌ ఆర్ట్‌ అనాలి. కుంచె నుంచి జాలువారిన పెయింటింగుల్లా కనిపిస్తున్న ఈ చిత్రాలన్నీ అతను అలా రూపొందించినవే మరి!

క విషయం పట్ల ప్రేమ ఉండాలే కానీ దాన్ని ఎలాగైనా సాధిస్తాం... ఎన్నో జీవితాల్లో మరెన్నో సందర్భాల్లో ఇది నిజమేనని నిరూపితమైంది కూడా. అలాంటి ఓ ప్రత్యేక ఉదాహరణే అరుణ్‌ బజాజ్‌. దర్జీ పని చేయాల్సిన తన కుటుంబ అవసరాన్నీ, పెయింటింగు పట్ల తనకున్న ఇష్టాన్నీ కలగలిపి ఇలా దారాలతో బట్ట మీద చూడచక్కని దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాడు. ఈ అరుదైన కళతో ‘నీడిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుపొంది... లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ చోటు సంపాదించుకున్నాడు.

తండ్రి మరణంతో...
పంజాబ్‌కు చెందిన అరుణ్‌ తండ్రి దర్జీ. అందువల్ల ఇతనికి బట్టలు కుట్టడంతో పాటూ ఎంబ్రాయిడరీ మీద కూడా పట్టుంది. అయితే అరుణ్‌ అభిరుచి అందుకు భిన్నం. పెయింటింగులంటే అరుణ్‌కి చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. అందుకే చిత్రకారుడు కావాలని అనుకున్నాడు. కానీ తండ్రి మరణం తరువాత అతను కూడా దర్జీగా బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. అలా అతను ఎంబ్రాయిడరీ చేస్తున్నప్పుడు ఓ మంచి ఆలోచన తట్టింది. ఈ పువ్వులూ, కాయలకు బదులు దృశ్యాన్ని ఇలా మెషీన్‌ మీద దారంతో అచ్చం పెయింటింగులా ఆవిష్కరించగలిగితే... అంటే పెయింటింగునే దారాలతో రూపొందిస్తే... తనకిష్టమైన కళా, పనీ రెండూ పూర్తవుతాయి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన అభిరుచికి తగ్గట్టు ఓ దృశ్యాన్ని చిత్రించుకుని దానిమీద విభిన్న రంగుల దారాల కలబోతగా ఎంబ్రాయిడరీ చేశాడు. అద్భుతం... అది అచ్చం పెయింటింగులా వచ్చింది.ఎంతో కష్టపడి...
ఆలోచన విజయవంతమవడంతో అప్పటినుంచీ మెషీన్‌ మీద వేసే కుట్టుతోనే చూడచక్కని దృశ్యాలూ, బొమ్మలూ రూపొందించడం మొదలు పెట్టాడు. బాగా పరిశీలిస్తే తప్ప దారంతో కుట్టినట్లు తెలియనంత సునిశితంగా ఒక్కో కళాఖండాన్ని రూపొందిస్తాడు అరుణ్‌. ఇప్పటికి 16 సంవత్సరాల నుంచీ దాదాపు మూడు వందలకుపైగా ఇలాంటివి రూపొందించాడు. గణపతి, కృష్ణుడు, జీసస్‌లాంటి దేవుళ్లతో సహా పలువురు ప్రముఖులూ, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలనూ ఆవిష్కరించాడు. ఆరడుగుల ఎత్తూ నాలుగడుగుల వెడల్పుతో ఉన్న శ్రీకృష్ణుడి బొమ్మను ఇలా చిత్రించేందుకు మూడు సంవత్సరాల సమయం దాదాపు ఇరవై ఎనిమిదన్నర వేల మీటర్ల పొడవైన దారం, లక్షన్నర రూపాయల ఖర్చూ అయ్యిందట. ఈ చిత్రం ద్వారానే ఇతను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో పేరు పొందాడు. విదేశాలతో సహా దిల్లీ క్రాఫ్ట్స్‌మేళా, సూరజ్‌కుండ్‌ మేళాల్లాంటి పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు. గిన్నిస్‌ బుక్‌లోనూ చేరేందుకు కృషి చేస్తున్న ఇతని చిత్రాలు పదివేల నుంచీ కోటి రూపాయలవరకూ ధర పలుకుతున్నాయి. మనిషినో లేక ఫొటోనో చూసి అచ్చం అలాంటి చిత్రాన్నే మిషన్‌ సాయంతో రూపొందించడమూ అరుణ్‌ ప్రత్యేకత. మనమూ అరుణ్‌ చిత్రాలను కొనుక్కోవాలంటే బజాజ్‌ఆర్ట్‌.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ (bajajart.blogspot.com) వెబ్‌సైట్‌ను చూడొచ్చు. వాళ్లతో మాట్లాడి మనకు కావలసిన చిత్రాన్ని తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకోవచ్చూ... ప్రియమైన వాళ్లకి కానుకలుగానూ ఇవ్వొచ్చు!


 

ఇరవైముప్ఫై జతల చెవి పోగులూ పదీ ఇరవై రకాల బ్రేస్‌లెట్లూ ఉంగరాలూ ఇంకెన్నో రకాల చెయిన్లూ... ఈతరం అమ్మాయిల డ్రెస్సింగ్‌ టేబుల్లో ఉండే ఆభరణాల లెక్కల గురించి చెప్పాలంటే ఇలా ఎన్నో. మరి వాటిలో కావల్సినదాన్ని చటుక్కున తీసి, చిటుక్కున వేసుకోవాలంటే ఇలాంటి అందమైన స్టాండ్లు ఉండాల్సిందే.

క జత బంగారు పోగులు రోజువారీకీ, మరో జత పండుగలకూ ఫంక్షన్లకూ... ఇది ఒకప్పటి మాట. ఇప్పుడలా కాదు, చెవి పోగుల దగ్గర్నుంచి చేతికి పెట్టుకునే బ్రేస్‌లెట్లూ మెడలో వేసుకునే గొలుసులూ తల్లో పెట్టుకునే క్లిప్పుల వరకూ ప్రతిదీ రోజూ మార్చే డ్రెస్సుతో పాటు మారిపోవాల్సిందే. అందుకు తగ్గట్లే మెటల్‌, ఫంకీ, వన్‌గ్రామ్‌గోల్డ్‌, పూసలూ, రాళ్లతో మ్యాచింగ్‌కి పనికొచ్చేలా చేసిన రకరకాల ఆభరణాలు వస్తున్నాయి. బట్టల్లో వచ్చినట్లే వీటిలోనూ ఎప్పటికపుడు కొత్త డిజైన్లు వస్తూ ట్రెండ్‌ని సృష్టిస్తున్నాయి. అయితే ఎన్ని జతల బట్టలున్నా కావల్సినదాన్ని చిటికెలో తీసి వేసేసుకుంటాం. ఎందుకంటే దేనికదే కనిపించేలా వాటిని కబోర్డులో విడివిడిగా సర్దుకుంటాం. కానీ ఆభరణాల విషయంలో అలా సాధ్యం కాదు. అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఎంత అరలూ సొరుగులున్న పెట్టెలున్నా నాలుగైదు రకాల్ని కలిపి ఒకచోట పెట్టాలి. దాంతో అందులోంచి వెతుక్కోవడానికీ సమయం పడుతుంది. పైగా హడావుడిగా కాలేజీకి బయల్దేరేటపుడు అలంకరించుకోవడానికే టైం దొరకదు. దానికితోడు వెతుక్కోవాలంటే మరీ కష్టం. ఇలాంటి గందరగోళం లేకుండా ఆభరణాలన్నింటినీ ఎదురుగా కనిపించేలా అవసరమైనపుడు క్షణంలో తీసుకునేలా దేనికదే విడివిడిగా అమర్చుకునేందుకు వచ్చినవే ఈ జ్యువెలరీ స్టాండ్‌లు. చెట్టులా చేతిలా సీతాకోక చిలుకలా అమ్మాయి బొమ్మలా... రకరకాల రూపాల్లో వస్తున్న ఇవి సౌకర్యంగా ఉండడమే కాదు, అలంకరణ వస్తువులా చూడ్డానికి అందంగానూ ఉంటాయి. వీటిలో కిందిభాగంలో గిన్నెలానూ పైన చెట్టులా ఉండే స్టాండ్లకు పోగులూ బ్రేస్‌లెట్లూ చెయిన్లలాంటి వాటిని దేనికదే తగిలించవచ్చు. వీటి మొదలు భాగంలో కూడా చిన్న చిన్న వాటిని వేటినైనా పెట్టుకునే వీలుంటుంది.కళాఖండాలు
ప్రత్యేకించి చెవి పోగుల కోసం వచ్చే స్టాండ్లైతే ఎన్నో. వీటిలో పోగుల్ని వేలాడదీసేందుకు సన్నటి రంధ్రాలతో సీతాకోక చిలుకల ఆకారంలో రూపొందించినవైతే సౌకర్యంగా ఉండడంతో పాటు చూడ్డానికీ ఎంతో అందంగా ఉంటాయి. నెక్లెస్‌లూ, చెయిన్ల విషయానికొస్తే వీటిని ఒకచోట పెట్టామంటే చిక్కులు పడిపోవడం ఖాయం. అందుకే, వీటికోసం పెండెంట్‌ చెయిన్‌ డిస్‌ప్లే సెట్‌లు వస్తున్నాయి. ఇవుంటే గొలుసులన్నింటినీ ఒకేచోట దేనికదే విడివిడిగా అమర్చుకోవచ్చు. ఇక, ఉంగరాలూ బ్రేస్‌లెట్లను పెట్టుకునేందుకు వచ్చే జ్యువెలరీ ఆర్గనైజర్లనైతే అచ్చం అలంకరణకోసం వాడే కళాఖండాల్లానే రూపొందిస్తున్నారు. అందమైన అమ్మాయి చేతిలా చెట్టుకొమ్మ మీద పక్షులూ వాటికింద గూళ్లూ ఉన్నట్లూ, చిందిన పాలచుక్కలా, బార్బీబొమ్మ, షూ... ఇలా ఎన్నో వినూత్నమైన రూపాల్లో వస్తున్నాయివి. అదండీ సంగతి... ఈ జ్యువెలరీ స్టాండ్లుంటే ఎంత బిజీగా ఉన్నా చిటికెలో అలంకరించుకోవచ్చు, చక్కగా ఫ్యాషన్‌ను ఫాలో అయిపోవచ్చు.