close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్విస్ట్‌

ట్విస్ట్‌
- ఇంద్రగంటి నరసింహమూర్తి

‘‘డాడీ... ఇతను సాంబయ్య. మన కంపెనీలో వర్కర్‌. వారం రోజుల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. ఈమె ఇతని భార్య మంజుల. భార్యాభర్తలు మీ ఆశీస్సుల కోసం వచ్చారు’’ యువజంటను కంపెనీ ఛైర్మన్‌ కొండలరావుకి పరిచయం చేశాడు సుందరరావు. ఛైర్మన్‌ కొడుకు సుందరరావు కంపెనీ జనరల్‌ మేనేజర్‌. కొండలరావు కొత్త దంపతుల వైపు దృష్టి సారించాడు. మంజుల మనోహరంగా ఉంది. అందాలభామ వైపు కన్నార్పకుండా చూశాడు కొండలరావు. అతని మనసులో మంజుల రూపం ముద్రపడిపోయింది.‘‘డాడీ’’ అన్న కొడుకు పిలుపుతో వూహాలోకం నుంచి బయటపడి, కోటు జేబులోని పర్సు తీసి రెండు వేయి రూపాయల నోట్లు సాంబయ్య చేతిలో పెట్టాడు ఛైర్మన్‌.

భార్యాభర్తలు బాస్‌ కాళ్ళకు దండం పెట్టారు. సాంబయ్య ఆశీస్సులందుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకే వెళ్ళాడు జనరల్‌ మేనేజర్‌.

కంపెనీ ఉద్యోగులు ఎవరు వివాహం చేసుకున్నా బాస్‌ని కలిసి ఆశీస్సులు అందుకోవడం రివాజు.

వాళ్ళు అలా వెళ్ళగానే ఛైర్మన్‌ సెల్‌ రింగయింది. ‘నల్లతుమ్మ మొద్దు’ నుండి.

కొండలరావు మనసులో మంజుల సృష్టించిన అలజడి ఇంకా తగ్గలేదు. విసుగ్గా కాల్‌ కట్‌ చేశాడు. ‘నల్లతుమ్మ మొద్దు’ భార్యకు కొండలరావు పెట్టుకున్న నిక్‌నేమ్‌.

ఆ నల్లతుమ్మ మొద్దు చలవతోనే ఈ ఛైర్మన్‌ హోదా, విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నానన్న విషయం అతనెప్పుడో మరచిపోయాడు.

* * *

పద్మనాభం వంశపారంపర్యంగా వచ్చిన వ్యవసాయ భూములమ్మి, ఆ డబ్బు పెట్టుబడిగా హైదరాబాద్‌ శివార్లలో కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రారంభించాడు. నీతీ, నిజాయతీలతో వ్యాపారం చేస్తున్న పద్మనాభానికి కాలం కలిసొచ్చింది. ఫ్యాక్టరీ లాభాలపంట పండించడం ప్రారంభంకాగానే, బ్యాంకులో అప్పు తీసుకుని ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని విస్తరింప చేశాడు. కోట్లకు పడగలెత్తాడు. ఒక్కగానొక్క కూతురు శ్యామల. ఆమె నల్లగా ఉండటంతో ధనికవర్గంలోని పెళ్ళికొడుకులెవరూ ఆమెని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కాబోయే అల్లుడు అమ్మాయితోపాటు ఆస్తికీ సంరక్షకుడుగా ఉండాలని పద్మనాభం ఆకాంక్ష. బంధువర్గంలోని పెళ్ళికొడుకుల వివరాలు సేకరించాడు.

దూరపు బంధువు కొండలరావు బుద్ధిమంతుడనీ, గ్రాడ్యుయేషన్‌ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడనీ తెలుసుకున్నాడు. కొండలరావు తల్లిదండ్రుల్ని సంప్రదించాడు. కూతురితోపాటు కంపెనీలో మేనేజర్‌ పదవి కట్టబెడతానని ఆశ చూపాడు. ఇల్లరికం రావాలన్నాడు.

కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అర్ధాంగిగా రాబోవడం అదృష్టంగా భావించిన నిరుద్యోగి మారుమాట్లాడకుండా శ్యామల మెడలో మూడుముళ్ళు వేశాడు. ఇల్లరికం వచ్చి మామగారి కంపెనీలో కుదురుకున్నాడు.

పెళ్ళయిన మూడు సంవత్సరాలకు తండ్రి హోదా సంపాదించాడు. కొండలరావు కొడుకు పేరు సుందరరావు.

పది సంవత్సరాలు గడిచాయి. పద్మనాభం అల్లుడిని కంపెనీ జనరల్‌ మేనేజర్‌గా నియమించాడు.

మరో పది సంవత్సరాలు దొర్లిపోయాయి. అల్లుడిని అదృష్టం వరించింది - మామగారికి క్యాన్సర్‌ అటాక్‌ అయి.

తాను ఎక్కువకాలం బతకనని తెలుసుకున్న పద్మనాభం ఓ శుభముహూర్తాన కొండలరావుని కంపెనీ ఛైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టాడు.

పదవి అప్పగిస్తూ ‘‘నేనెంతో నిజాయతీగా వ్యాపారం చేశాను. ఎప్పుడూ ఎవరినీ నమ్మించి మోసం చేయలేదు. కార్మికుల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాను. నా మంచితనమే నాకింత ఆస్తిని సంపాదించింది. నువ్వు నా వారసత్వాన్ని కొనసాగించు. లాభాలలో కొంతభాగం ధర్మకార్యాలకు వినియోగించు. డబ్బుతో అబ్బే వ్యసనాలకు దూరంగా ఉండు. శ్యామలకు ఏ లోటూ రానీయకు’’ అంటూ హితోపదేశం చేశాడు.

మామగారి ముందు వినయంగా తలూపాడు అల్లుడు.

మరో మూడు నెలలకు పద్మనాభం క్యాన్సర్‌కు బలి అయ్యాడు.

* * *

మామగారు చనిపోయాక కొండలరావు స్వేచ్ఛావిహంగమయ్యాడు. మామగారి నీతిబోధల్ని ఆయన అస్తికలతోనే గంగలో కలిపేశాడు.

కొండలరావు మనసులో అణిగి ఉన్న కోరికలు ఒక్కసారి విజృంభించాయి. సుఖాలూ భోగాలూ అనుభవించమని మనసు మారాం చేసింది. కొండలరావు లొంగిపోయాడు. ఫ్యాక్టరీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఎకరం భూమి కొని, ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్‌ కట్టించాడు. చుట్టూ పూలతోటలు కనువిందు చేస్తున్నాయి. విశ్రాంతి నెపంతో వారంలో రెండు రోజులు గెస్ట్‌హౌస్‌లో విందులూ వినోదాలతో గడపసాగాడు. అందమైన అమ్మాయిల పొందుకోసం లక్షలు వెచ్చించడానికి వెనుకాడడు కొండలరావు. నీతి నియమాలకు పాతరేశాడు.

* * *

మంజుల, సాంబయ్యలు బాస్‌ ఆశీర్వచనం తీసుకుని నిష్క్రమించారు. మంజుల రూపం కొండలరావు మనసుని వీడలేదు. ఆమె అందం అతనికి పిచ్చెక్కిస్తోంది. మనసులోకి మరో ఆలోచన రానీయడం లేదు.‘మంజుల...సౌందర్యరాశి, అందాలభామ... రంభా వూర్వశులు కూడా ఆమె ముందు దిగదుడుపే. అంతటి అందగత్తె... ఆఫ్టరాల్‌ ఓ కార్మికుని భార్య కావడమా! కాకి ముక్కుకు దొండపండులా వాడా దాని మొగుడు. నో నో... మంజుల నాలాంటి కుబేరుడి సొంతం కావాలి. ఆ అప్సరస ఇంద్రభవనం లాంటి నా గెస్ట్‌హౌస్‌లో తన అందాలు ఆరబోయాలి. నా కౌగిలిలో కరిగిపోవాలి. ఆమె కోసం... నా ఆస్తి మొత్తం ధారపోసినా తప్పులేదు’ మంజులపై వలపు కొండలరావు తలపులో తళుక్కుమని మెరుస్తోంది.

‘మంజులను లొంగదీసుకోవాలి. అందాలరాశితో గెస్ట్‌హౌస్‌లో సహజీవనం సాగించాలి’ కోరికతో ఉక్కిరిబిక్కిరయ్యాడు కొండలరావు.

మనసును బుజ్జగించి మెదడుకు పని కల్పించాడు.

‘ఏం చేయాలి?’ ఆలోచనలో పడ్డాడు. మెదడులో ప్లాష్‌ వెలిగింది.

‘సాంబయ్యను తప్పించాలి. మంజుల దిక్కులేనిదవుతుంది. ఒంటరితనంతో వేగుతున్న అబలను మంచిమాటలతో చేరదీసి గెస్ట్‌హౌస్‌లో కాపురం పెట్టి, సహజీవనం సాగించాలి. మిగిలిన జీవితాన్ని నందనవనం చేసుకోవాలి’ కొండలరావు మదిలో ఓ క్రూరమైన పథకం రూపుదిద్దుకుంది.

* * *

వారం తరవాత...

డ్యూటీ ముగించుకుని స్కూటర్‌పై బయలుదేరాడు సాంబయ్య.

ఫ్యాక్టరీ దాటి కొంచెం దూరం వెళ్ళగానే, వేగంగా వెళుతున్న వ్యాన్‌ వెనుక నుంచి స్కూటర్‌ను ఢీకొంది. స్కూటర్‌ మీద నుంచి ఎగిరిపడిన సాంబయ్య మరుక్షణం మరణించాడు.

వార్త తెలిసిన వెంటనే సాంబయ్య ఇంటికి వెళ్ళి మంజులను ఓదార్చి వచ్చాడు కొండలరావు.

యాక్సిడెంట్‌కు కారకుడైన వ్యాన్‌ డ్రైవర్‌కు లక్ష రూపాయలూ... జరిగిన ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ తప్పులేదనీ, సాంబయ్య రాంగ్‌సైడ్‌లో వెళుతున్నాడనీ రిపోర్టు రాసి కేసు మూసేసిన పోలీస్‌ ఆఫీసర్‌కు మరో లక్షా ముట్టాయి.

* * *

నెల రోజుల తరవాత... మంజుల డిగ్రీ చదివిందని తెలుసుకుని, ఆమెను అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో నియమిస్తూ ఉత్తర్వులు పంపాడు ఛైర్మన్‌. మరో ఆధారంలేని మంజుల వెంటనే ఉద్యోగంలో చేరి ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది.

మంజులను తరచూ తన ఛాంబర్‌కు పిలిపించుకుని యోగక్షేమాలు విచారిస్తున్నాడు కొండలరావు.

మంజులకు కొండలరావుపై గౌరవభావం ఏర్పడింది. కంపెనీలో ఉద్యోగులూ ఆమెకి ఆత్మీయులయ్యారు.

* * *

‘మంజుల వ్యవహారం జాగ్రత్తగా డీల్‌ చేయాలి. యంగ్‌ బ్యూటిఫుల్‌ విడో... చేయి జారిపోనివ్వకూడదు. మంచి మాటలతో లొంగదీయాలి. బుజ్జగింపుకు లొంగకపోతే భయపెట్టాలి. మగతోడు లేకుండా జీవించలేనన్న భావన కలిగించాలి. అయినా, ఎక్కడికి పోతుంది... శరణు శరణంటూ కాళ్ళ దగ్గరకొచ్చినపుడు అభయమిచ్చి అక్కున చేర్చుకోవాలి. మంచి ముత్యంలాంటి మగువతో సహజీవనం చేయాలి’ అనుకుంటూ తగిన సమయం కోసం ఎదురుచూడసాగాడు కొండలరావు.

మూడు నెలలు గడిచాయి.

వారానికోసారి తన ఛాంబర్‌కు పిలిపించుకుని ఆమెకు మగతోడు ఎంత అవసరమో వివరించసాగాడు.

కొండలరావు మాటలను మంజుల మౌనంగా వింటోంది.

* * *

ఆదివారం మధ్యాహ్నం...

మంజుల ఇంట్లోకి ఇద్దరు రౌడీలు దూకుడుగా ప్రవేశించారు. ఇల్లంతా చిందరవందర చేశారు. మంజుల భయంతో వణికిపోయింది.

‘‘ఒంటరిగా ఏం ఉంటావు, మాలో ఒకర్ని పెళ్ళి చేసుకో... నీకు అండగా ఉంటాం’’ అంటూ కూశాడొక రౌడీ.

మంజుల కన్నీళ్ళు కార్చింది.

‘‘మంచిరోజు చూసుకుని మళ్ళీ వస్తాం. పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తే మీ అమ్మని మర్డర్‌ చేస్తాం, జాగ్రత్త!’’ అంటూ ఇద్దరూ పారిపోయారు.

మంజుల ఆలోచనలో పడింది.

రౌడీలిద్దరికీ చెరో పదివేలు ముట్టాయి.

* * *

నాలుగురోజుల తరవాత...

ఆరోజు సాయంకాలం...

మంజులకు ఫైనల్‌ డోస్‌ ఇవ్వాలనుకున్నాడు కొండలరావు. ఆమె బ్రెయిన్‌వాష్‌కు ముహూర్తం నిర్ణయించాడు.

అటెండర్‌ మంజులను పిలుచుకు వచ్చాడు. మంజులను ఛైర్మన్‌ క్యాబిన్‌ దగ్గర వదిలి అటెండర్‌ వెళ్ళిపోయాడు. తడబడుతున్న అడుగులతో మంజుల ఛైర్మన్‌ ఛాంబర్‌లో అడుగుపెట్టింది.

కూర్చోమంటూ కుర్చీ ఆఫర్‌ చేశాడు ఛైర్మన్‌.

‘‘ఫర్వాలేదు సార్‌’’ అంటూ ఒదిగి నిలుచుంది మంజుల.

‘‘నీతో కొన్ని ఇంపార్టెంట్‌ విషయాలు మాట్లాడదామని పిలిపించాను’’ ఉపోద్ఘాతం కొండలరావుది.

‘‘చెప్పండి సార్‌...’’ వినయంగా బదులిచ్చింది మంజుల.

‘‘చూడు మంజులా... ఇది మన పర్సనల్‌ విషయం. నా సలహా విన్నాక నువ్వు అపార్థం చేసుకోకూడదు. నీ శ్రేయోభిలాషిగా నన్ను భావించు’’ మొదలెట్టాడు కొండలరావు.

తల దించుకుని అతని మాటలు వినసాగింది మంజుల.

‘‘నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నిండు యవ్వనంలో ఉన్నావు. ఈ సొసైటీ నీలాంటి అందమైన అమ్మాయిలను ఒంటరిగా బతకనీయదు. మన చుట్టూ ఉన్నవాళ్ళలో చాలామంది కలియుగ కౌరవులే. నాలాంటి ధర్మరాజులు అక్కడక్కడ కనిపిస్తారు... అవునా’’ హితబోధ ఆపి, ఆమె రియాక్షన్‌ గమనించాడు కొండలరావు.

‘‘అవున్సార్‌, మీరు చెప్పింది అక్షరసత్యం. నా చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. పెళ్ళయిన పదిహేను రోజులకు భర్త యాక్సిడెంట్‌కు గురై మృత్యువాత పడ్డాడు. నేనూ, మా అమ్మా ఇద్దరం ఆడవాళ్ళం... బిక్కుబిక్కుమంటూ భవిష్యత్తు మీద బెంగతో రోజులు వెళ్ళదీస్తున్నాం’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ వాపోయింది మంజుల.

‘‘ఈ పరిస్థితుల్లో నీకో తోడు కావాలి. పదిహేను రోజుల కాపురానికి నీ మొత్తం జీవితం బలైపోకూడదు. గతం గతః. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నీ మనసుకు నచ్చచెప్పుకో. ఈ రోజుల్లో ఎంతోమంది వితంతువులు పునర్వివాహం చేసుకుంటున్నారు. మగతోడు కోరుకుంటున్నారు. ఆలోచించు... నీ జీవితం కష్టాలపాలు కాకూడదు’’ ఒక్కొక్క వాక్యం నెమ్మదిగా ఒత్తి పలుకుతూ ఆమె స్పందన గమనిస్తున్నాడు కొండలరావు.

‘‘మీరు నాకు దైవ సమానులు. నాకు ఉద్యోగమిచ్చి ఆదుకున్నారు. మీరెలా చెబితే అలా నడుచుకుంటాను సార్‌’’ ధైర్యంగా తలెత్తింది మంజుల.‘హమ్మయ్య... అమ్మాయి ఇంత సులువుగా వలలో పడుతుందనుకోలేదు. మనసులో మాట బయటపెట్టాలి’ అనుకుంటూ ఆనందంగా తన సీట్లోంచి లేచాడు కొండలరావు. ఆమె దగ్గరగా వెళ్ళాడు.

‘‘గుడ్‌... నీ ధైర్యం చూస్తూంటే సంతోషంగా ఉంది. నన్ను నమ్ము, నీ మంచి కోరి చెపుతున్నాను. నా ప్రపోజల్‌కు నీ అంగీకారం తెలపాలి’’ కొండలరావు కంఠంలో తడబాటు.

అతనేం చెపుతున్నాడో ఆమెకు అర్థమైంది. మౌనంగా నిలబడింది మంజుల. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించాడు కొండలరావు.

‘‘నీకు తోడుగా ఉండాలని నిర్ణయించాను. మా ఇంట్లో నీకు నీడ కల్పిస్తాను. నీకే లోటూ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను. నా భార్య గురించి భయపడకు, ఆమెవల్ల నీకెలాంటి ఇబ్బందీ రానీయను. అంతెందుకు... నువ్వు అంగీకరిస్తే నిన్ను మా ఇంటికి మహారాణిని చేస్తాను. నా మనసులోని మాట నువ్వు గ్రహించావనుకుంటాను. నా ...’’ కొండలరావు మాటలకు అడ్డుపడి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కొండలరావు కాళ్ళకి మొక్కింది మంజుల.

ఆమె చర్యకు కొండలరావు మనసు ఆనందంతో పులకించింది.

‘‘సార్‌! మీరు నిజంగా దయార్ద్రహృదయులు. గత నెల రోజులుగా నా మనసును నలిబిలి చేస్తున్న వ్యధను తొలగించారు. నా కళ్ళు తెరిపించారు. పునర్వివాహానికి జంకుతున్న నా మనసులో ధైర్యం నింపారు. మీరే నా ప్రత్యక్ష దైవం’’ మంజుల మాటలు కొండలరావుకి కర్ణపేయంగా తోచాయి. అతని మనసు మత్తెక్కింది.

‘‘మీ మాటల సారాంశం మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి నన్ను ఒప్పించడానికేనని నాకర్థమైంది. నెలరోజుల క్రితమే సుందరరావుగారు నన్ను పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశారు. మీరు ఒప్పుకుంటారో లేదోనని భయం వ్యక్తంచేస్తే మీ అబ్బాయి మిమ్మల్ని ఒప్పిస్తానని మాట ఇచ్చారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో మీ మంచిమాటలు నా మనసుకు వూరటనిచ్చాయి. మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను’’ ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సంతోషంగా చెప్పింది మంజుల.

అవాక్కయ్యాడు కొండలరావు. కాళ్ళకింద భూమి కదులుతున్నట్లనిపించింది. ఏసీ గదిలో ఉన్నా చెమట్లు...

గదిలోకి ఎవరో వస్తున్న సవ్వడికి తలుపు వైపు చూశారిద్దరూ. సుందరరావు

గదిలోకి ప్రవేశించాడు.

మంజుల వదనంలో ఆనందపు మైమరపు...

‘‘మన పెళ్ళికి మీ నాన్నగారు ఒప్పుకున్నారండీ... నన్నూ ఒప్పించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనండీ’’ చెప్పింది మంజుల సంభ్రమంగా సుందరరావు వైపు చూస్తూ.

‘‘థాంక్స్‌ డాడీ. నీ మంచితనం నాకు తెలుసు. నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతోనే మంజులకు మాట ఇచ్చాను. ఇప్పుడా విషయం మాట్లాడదామనే వచ్చాను. నా మనసులోని మాట కనిపెట్టి మంజులను ఒప్పించడం చూస్తూంటే నీలాంటి తండ్రికి కొడుకుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ ఉత్సాహంగా అన్నాడు సుందరరావు.

‘‘ఆశీర్వదించండి’’ అంటూ ఇద్దరూ కొండలరావు కాళ్ళకి దండం పెట్టారు.

కొడుకుతోబాటు కాబోయే కోడలిని నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయాడు కొండలరావు.

కుర్చీలో కూలబడిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు.

కొడుకు ఆ చెంపా ఈ చెంపా వాయిస్తున్నట్లూ తన వయసు గుర్తుచేస్తున్నట్లూ ఫీలయ్యాడు.

మరుక్షణం వేడి చల్లబడింది.

కళ్ళు తెరిచాడు కొండలరావు... ఎదురుగా కళ్ళు తెరిపించిన కుమారుడు.

దృష్టి మరలిస్తే... మంజుల- కామాక్షి దేవతలా కనపడింది.

క్షమించమన్నట్లు తల దించుకున్నాడు.

సెల్‌ రింగయింది అర్ధాంగి నుండి. సెల్‌ ఆన్‌ చేసి ‘‘హలో శ్యామలా...’’ పిలిచాడు.

చాలాకాలం తరవాత భర్త పేరుతో పలకరించడంతో పొంగిపోయింది భార్య.

‘‘ఏమండీ...’’ ఆమె కంఠంలో ఆర్ద్రత.

‘‘శ్యామలా, మన అబ్బాయి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదనేవాడు కదా. ఇన్నాళ్ళకి వాడి మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడింది. ముగ్గురం ఇంటికి వస్తున్నాం. స్వీట్స్‌తో రెడీగా ఉండు’’ అంటూ ముందుకు కదిలాడు కొండలరావు.

సుందరరావు, మంజుల అతన్ని అనుసరించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.