close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికా అందాలు చూడతరమా..!

అమెరికా అందాలు చూడతరమా..!

‘అటు ప్రకృతి అందాలకూ ఇటు అత్యాధునిక నిర్మాణాలకూ చిరునామా అంటే అమెరికానే అని ఆ దేశాన్ని సందర్శించిన వాళ్లకి తప్పక అనిపిస్తుంది. అందుకే అక్కడికి వెళ్లే వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పరకాల అనూరాధ.మెరికా అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా బయలుదేరాం. నాలుగు నెలల ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకోవడం వల్ల రానూపోనూ యాభైవేలలోనే టిక్కెట్టు దొరికింది. ముంబయి నుంచి 16 గంటలు ప్రయాణించి న్యూయార్క్‌కు చేరుకున్నాం. అక్కడ నుంచి కారులో బయలుదేరి న్యూజెర్సీ చేరుకున్నాం. ఏప్రిల్‌ నెల కావడంతో స్ప్రింగ్‌ సీజన్‌ మొదలై వాతావరణం చాలా బాగుంది. ముందుగా బుష్‌కిల్‌ ఫాల్స్‌కి బయలుదేరాం. న్యూజెర్సీ సిటీలోని ఎడిసన్‌ నుంచి కారులో గంటన్నర ప్రయాణం. విశాలమైన రోడ్లూ ఇరువైపులా పచ్చని చెట్లూ వాటికిందనే అందమైన లాన్లూ చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఆ జలపాతం ఓ లోయలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అందులోకి దిగడానికి చెక్కమెట్లను నిర్మించారు. ఎక్కడో కొండల్లోనుంచి మంచు కరిగి, కొండరాళ్లపై నుంచి పెద్ద యెత్తున జాలువారుతోంది. శివుడి జటాఝూటం నుంచి దూకుతోన్న గంగలా ఉన్న ఆ జలసోయగాన్ని చూసి మైమరిచిపోయాం.

మర్నాడు ఎడిసన్‌ నుంచి కారులో 15 మైళ్లు ప్రయాణించి జెర్సీ నగరానికి చేరుకున్నాం. దారంతా చెట్లూ పూలమొక్కలూ కనువిందుచేశాయి. బస్సులో న్యూయార్క్‌కు చేరుకున్నాం. అక్కడనుంచి సబ్‌వే ప్రయాణం. హడ్సన్‌ నదిని తొలిచి న్యూయార్క్‌ నగరాన్ని కలుపుతూ రెండు కిలోమీటర్లమేర టన్నెల్‌ను నిర్మించారు. ఈ దారిలో నిత్యం ఎందరో విద్యార్థులూ ఉద్యోగులూ ప్రయాణిస్తుంటారు. ప్రతి ఐదు నిమిషాలకీ ఓ రైలు ఉంటుందట. అది మమ్మల్ని పది నిమిషాల్లో బ్రూక్లిన్‌ డౌన్‌టౌన్‌ స్టేషన్‌కి చేర్చింది. సబ్‌వేలో నుంచి బయటకు వచ్చి బ్రూక్లిన్‌ వంతెన ఎక్కాం. కింద నది, చుట్టూ ఎత్తైన ఆకాశహర్మ్యాలతో అక్కడ దృశ్యం చూడ్డానికి ఎంతో బాగుంది. 1875లో ఇనుపతీగలతో ఈ వంతెనను నిర్మించారట. మధ్యమధ్యలో మార్పులు చేస్తూ ఆధునీకరించారు. అక్కణ్ణుంచి చూస్తే దూరంగా ఉన్న స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కూడా కనిపిస్తుంది. ఆకాశాన్నంటే ట్విన్‌ టవర్స్‌ కూడా పలకరిస్తాయి. వంతెన కింద నదిలో పడవలు తిరుగుతుంటాయి. ఆ వంతెనమీద నుంచి సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతంగా కనువిందు చేస్తాయట. అందుకే సందర్శకులు ఆ సమయానికి అక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

మైనం బొమ్మలతో...
మేం అక్కడ నుంచి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియానికి వెళ్లాం. పెద్దవాళ్లకి టిక్కెట్టు 37 డాలర్లు. ఈ భవంతిలో మొదటి అంతస్తులో సినిమా ప్రముఖులూ రెండో అంతస్తులో అమెరికా అధ్యక్షులూ మూడో దాంట్లో క్రీడా ప్రముఖులూ నాలుగో అంతస్తులో సంగీత, వాద్య ప్రముఖులూ ఐదో దాంట్లో సూపర్‌ మ్యాన్‌లాంటివి ఏర్పాటుచేశారు. ఏ బొమ్మ చూసినా మనిషి నిలుచున్నట్లే అనిపించింది. ఒకదాన్ని మించి మరొకటి జీవకళ ఉట్టిపడుతూ సందర్శకులను కట్టిపడేస్తాయి. మేం అమితాబ్‌తో కరచాలనం చేస్తున్నట్లూ ఒబామా కుటుంబంతో కలిసి నిలబడినట్లూ ఫొటోలు తీయించుకున్నాం.

అక్కడ నుంచి టైమ్‌ స్క్వేర్‌కి వచ్చాం. ఇది న్యూయార్క్‌ నగర కేంద్రంగా చెప్పవచ్చు. ఇక్కడ అన్నీ భారీ షాపింగ్‌మాళ్లే. కళ్లు జిగేల్‌మనిపించే లైట్లతో రకరకాల లైవ్‌ ప్రకటనలతో పర్యటకుల్ని ఆకర్షిస్తుంటాయి.

బీరులూ గుర్రాలూ!
అక్కడ కాసేపు తిరిగి హోటల్‌కు చేరుకున్నాం. మర్నాడు బోస్టన్‌ బయలుదేరాం. కారులో ఐదు గంటల ప్రయాణం. ఇక్కడ పట్టణానికీ పట్టణానికీ మధ్య ఎత్తైన ఓక్‌, పైన్‌ చెట్లు అడవుల్ని తలపిస్తాయి. మధ్యమధ్యలో అస్సలు ఆకన్నదే కనిపించకుండా చెర్రీ బ్లోజమ్స్‌ కనువిందు చేశాయి. మంచుముద్దల్ని తలపించే ఆ తెల్లని పూలు కళ్లను తిప్పుకోనియ్యవు. పట్టణం దాటగానే కనిపించే సుందర ప్రకృతిని చూడగానే అడవిలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ దారిలో ముందుగా న్యూహాంప్‌షైర్‌లోని నషువా నది దగ్గరకు వెళ్లాం. స్వచ్ఛమైన నీటితో ప్రశాంతంగా ప్రవహిస్తోన్న ఆ నదిని చూడగానే ఎంతో ఆనందంగా అనిపించింది. అక్కడ నుంచి అస్సలు కదలాలనిపించలేదు. తరవాత అక్కడ దగ్గరలోని హిందూ దేవాలయానికి వెళ్లాం. అక్కడ అన్ని దేవతల విగ్రహాలూ ఉన్నాయి. నిత్యపూజలు చేస్తుంటారట. తరవాత బీరు తయారుచేసే బడ్వైజర్‌ అనే కంపెనీకి వెళ్లాం. పూర్వం బీర్‌ను గుర్రాలమీద చేరవేశారట. ఆ గౌరవార్థం ఇప్పటికీ కొన్ని గుర్రాలను పోషిస్తూ ఏడాదికి ఒకసారి రథానికి ఆ గుర్రాలను కట్టి వూరేగిస్తారట.వందకి పైగా జలపాతాలు!
తరవాత న్యూహ్యాంప్‌షైర్‌లోని వైట్‌ మౌంటెయిన్స్‌ను సందర్శించాం. వీటిని నడిచి ఎక్కవచ్చు. అక్కడ స్ఫటికంలా మెరిసే నీళ్లతో కూడిన చిన్న చిన్న నదులు చాలానే కనిపిస్తాయి. వాటిల్లో ఈత కొట్టవచ్చు. బోటింగ్‌కీ వెళ్లవచ్చు. వాటితీరాల్లోని ఇసుక తిన్నెలపై పర్యటకులు ఎండ కాచుకుంటూ కనిపిస్తారు. అక్కడ జలపాతాలు ఓ వందకి పైగానే ఉన్నాయి. వాటి దగ్గరకు వెళ్లినప్పుడు రబ్బర్‌సోల్‌ ఉన్న చెప్పులు వేసుకోవాలి. లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. సుమారు ఏడున్నర లక్షల ఎకరాల్లో ఉన్న వైట్‌ మౌంటెయిన్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వసంతకాలంలో చెట్ల ఆకులు రంగులు మారుతూ ఇంద్రధనుస్సుని తలపిస్తుంటాయి. ఏటా లక్షలాది మంది ఇక్కడి ఈ అందాలను చూడ్డానికే వస్తుంటారు.

అదో వింత ప్రపంచం!
అక్కడ నుంచి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాన్నీ మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని చూశాం.వాటి నిర్మాణశైలి అద్భుతంగా ఉంది. తరవాత ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండో నగరానికి బయలుదేరాం. న్యూయార్క్‌ నుంచి ఫ్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ డొమెస్టిక్‌ ఫ్లైట్‌లో వెళ్లాం. రెండు గంటలా పదిహేను నిమిషాలు ప్రయాణించి నగరానికి చేరుకున్నాం. అక్కణ్ణుంచి పది నిమిషాలు ఫెర్రీలో ప్రయాణించి డిస్నీల్యాండ్‌ చేరుకున్నాం. ప్రవేశ రుసుము 111 డాలర్లు. లోపలకు వెళ్లగానే మెరుస్తోన్న మిక్కీమౌస్‌ కనిపించింది. ముందుగా టైమ్‌ స్క్వేర్‌ థియేటర్‌లోని మిక్కీ మౌస్‌ అండ్‌ టింకర్‌ బెల్‌ షో చూశాం. తరవాత ‘వాల్ట్‌ డిస్నీ టికి రూము’లోకి వెళ్లాం. అక్కడ రంగురంగుల పక్షులూ రంగుల పూలగుత్తులూ మాట్లాడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తుండటం చూసి ఆశ్చర్యం కలిగింది. తరవాత స్విస్‌ ఫ్యామిలీ ట్రీ హౌస్‌ని చూశాం. ఇది చాలా డిస్నీ సినిమాల్లో కనిపిస్తుంది. పెద్ద మర్రిచెట్టు వూతంగా చెక్కలతో తాళ్లతో ఇల్లు కట్టారు. ఓ వైపు జలధారా, చుట్టూ పచ్చని చెట్లూ, చెట్టుమీద ఒక్కో అంతస్తులో బెడ్‌రూమ్‌, భోజనాల గది, లైబ్రరీ... అన్నీ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. డిస్నీవరల్డ్‌లో రైలు చాలా బాగుంది. అది ఓ అడవిలో వెళ్తున్నట్లే ఉంటుంది. అందులో రకరకాల పక్షులూ జంతువులూ మనుషుల బొమ్మలు కనిపిస్తాయి. అదో వింత ప్రపంచంలా అనిపించింది. అవన్నీ చూసి చీకటిపడ్డాక సిండ్రెల్లా క్యాజిల్‌కు చేరుకున్నాం. అప్పటికే అది జనాలతో నిండిపోయింది. డిస్నీ కథల్లోని పాత్రలన్నీ ప్రాణం పోసుకుని రంగురంగుల దీపాలంకరణతో కూడిన వాహనాలపై బ్యాండుమేళాలతో వూరేగింపుగా వస్తాయి. సిండ్రెల్లాకు రాజకుమారుడు కనిపించడం, పెళ్లి చేసుకోవడం, వూరేగింపుగా తీసుకురావడం చేస్తారు. ఆపై ఆకాశంలో పూలు విరిసినట్లుగా రంగుల బాణాసంచా కాలుస్తారు. డిస్నీ మొత్తానికి ఇదే పెద్ద ఆకర్షణ.

మర్నాడు సీ వరల్డ్‌కు వెళ్లాం. అందులో ‘షము షో’ ప్రసిద్ధి. పెద్ద పూల్‌లో తిమింగిలాలతో విన్యాసాలు చేయిస్తారు. డాల్ఫిన్‌ ఎన్‌కౌంటర్‌ కూడా బాగుంది. సీ పోర్టు థియేటర్‌లో కుక్కలూ, పిల్లులూ, ఎలుకలూ, పందులూ చేసిన విన్యాసాలు మనల్ని కట్టిపడేస్తాయి. పెద్ద అక్వేరియంలో ఉన్న సొర చేపలు మనల్ని పలకరిస్తాయి. మంచుముద్దలతో చల్లని వాతావరణాన్ని ఏర్పాటుచేసి పెంగ్విన్లతో ఏర్పాటుచేసిన వైల్డ్‌ ఆర్కిటిక్‌ అద్భుతంగా ఉంది. తరవాత యూనివర్సల్‌ స్టూడియోకి చేరుకున్నాం. అందులో హారర్‌ దృశ్యాలు ఎలా చిత్రిస్తారో చూపించారు.

అట్లాంటిక్‌ మహాసముద్రతీరం!
మర్నాడు న్యూజెర్సీ నుంచి అట్లాంటిక్‌ సిటీకి బయలుదేరాం. ఒకటిన్నర గంటల ప్రయాణం. ఇదో రిసార్టు నగరం. బీచ్‌ వెంబడి పెద్ద పెద్ద రాళ్లమీద నడుస్తూ కొంతదూరం వెళ్లాం. నీళ్లు ఐస్‌లా ఉన్నాయి. అక్కడ అలల్ని చూస్తే కాస్త భయమనిపించినా మ్యాపులో మాత్రమే కనిపించే ఆ సముద్రాన్ని అంత దగ్గరగా చూడగలిగినందుకు సంతోషంగా అనిపించింది. అక్కడ ట్రంఫ్‌ తాజ్‌మహల్‌ కేసినోలో భారీ షాండ్లియర్లు ఆకట్టుకున్నాయి. కాసేపు గడిపాక వెనక్కి వచ్చి మర్నాడు వాషింగ్టన్‌కు చేరుకుని ఫెర్రీలో ఎలిస్‌ ఐల్యాండ్‌ ఇమిగ్రేషన్‌ మ్యూజియంకు వెళ్లాం. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాకు వలస వచ్చినవాళ్లకి ఈ దీవే ఇమిగ్రేషన్‌ సెంటర్‌గా ఉండేదట. అక్కడ ఉన్న గదుల్లోనే వసతి ఇచ్చేవారు. రిజిస్ట్రేషన్‌ చేసి, మెడికల్‌ చెకప్‌ చేసి అన్నీ బాగుంటేనే దేశంలోకి రానిచ్చేవారు. లేకపోతే వెనక్కి పంపించేసేవారట. అక్కణ్ణుంచే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీకి ఫెర్రీలో చేరుకున్నాం. ఫ్రాన్స్‌ బహూకరించిన ఈ రాగి విగ్రహం ఎత్తు 151 అడుగులు. నేలమీద నుంచి 305 అడుగులు. తరవాత 9/11 మెమోరియల్‌ ప్లాజాను చూశాం. చనిపోయినవారి గుర్తుగా పెద్ద పూల్‌ను నిర్మించి దానిమీద ప్రతి ఒక్కరి పేరూ చెక్కారు. తరవాత ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌కు వెళ్లాం. 13 నెలల్లో పూర్తిచేసిన భారీ కట్టడం ఇది. ఈ భవంతిలోని 86వ అంతస్తులో ఉన్న అబ్జర్వేషన్‌ డెక్‌ నుంచి చూస్తే నగరం అంతా రంగురంగుల దీపాల భవనాలతోనూ చీమలబారుల్లాంటి కారులతోనూ మెరిసిపోతున్నట్లే ఉంటుంది.మర్నాడు వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియంకి వెళ్లాం. అక్కడ స్కైల్యాబ్‌ ఆర్బిటాల్‌ వర్క్‌షాప్‌, అపోలో లూనార్‌ మాడ్యూల్‌ వంటి ఎన్నో విభాగాలు మనకు విజ్ఞానాన్ని పంచిస్తాయి. నేషనల్‌ హిస్టరీ మ్యూజియంలో రకరకాల జంతువుల బొమ్మలూ సీతాకోకచిలుకల పార్కూ వజ్రాలూ రత్నాల ప్రదర్శనలూ ఆకట్టుకుంటాయి. తరవాత అమెరికా క్యాపిటల్‌ అండ్‌ కాంగ్రెస్‌నూ అక్కడ ఉన్న ద స్టాట్యూ ఆఫ్‌ ఫ్రీడమ్‌నూ జార్జ్‌ వాషింగ్‌టన్‌ ఏర్పాటుచేసిన బొటానికల్‌ గార్డెన్‌నూ చూశాం. మర్నాడు అబ్రహంలింకన్‌ను తుపాకీతో కాల్చిన థియేటర్‌నూ, ఆయన ప్రాణం విడిచిన ఇంటినీ చూశాం. అక్కడ ఆయనమీద రాసిన వేలకొద్దీ పుస్తకాలు అందంగా సర్దారు. తరవాత అమెరికన్ల జాతీయచిహ్నమైన నేషనల్‌ మాన్యుమెంట్‌నూ చూశాం. మర్నాడు టెన్నిసీ రాష్ట్రంలోని స్మోకీ మౌంటెయిన్స్‌కు చేరుకున్నాం. పచ్చని చెట్లూ చల్లని గాలులూ మనల్ని దాటి వెళ్లే మేఘాలతో అక్కడి ప్రకృతి అత్యంత మనోహరంగా అనిపించింది.

చివరగా నయాగరాకి వెళ్లాం. అంతెత్తు నుంచి పడుతోన్న ఆ పాలధారలను చూస్తుంటే ఒళ్లు జలదరించింది. మెయిడ్‌ ఆఫ్‌ ద మిస్ట్‌ పడవలో ఆ జలధార దగ్గర వరకూ వెళ్లాం. కాసేపు ఆ అందాల్లో తడిచాక థౌజండ్‌ ఐల్యాండ్స్‌కు చేరుకున్నాం. అన్నీ చూశాక అటు ప్రకృతి అందాలకూ అత్యాధునిక నిర్మాణాలకూ చిరునామా ఏదీ అంటే అది అమెరికానే అనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.