close
ఆ రెండు సినిమాలే నిలబెట్టాయి!

ఆ రెండు సినిమాలే నిలబెట్టాయి!

శివలెంక కృష్ణప్రసాద్‌... ‘ఆదిత్య 369’తో ఆ తరానికీ, ‘జెంటిల్‌మన్‌’తో ఈ తరానికీ చేరువైన నిర్మాత. 30ఏళ్ల పైబడ్డ సినీ జీవితంలో హిట్‌ సినిమాలనిచ్చారు. ఫ్లాప్‌లనూ చవిచూశారు. చాలా డబ్బులు కోల్పోయారు. పోగొట్టుకున్న చోటే మళ్లీ సంపాదించుకున్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సినిమాల్నే నమ్ముకుంటూ వచ్చారు. ‘పరిశ్రమలో పడిపోవడం తేలికే, కానీ మళ్లీ పైకి లేవడం చాలా కష్టం’ అంటూ ఆయన పంచుకున్న అనుభవాలివి...

1991జులై 18... ‘ఆదిత్య 369’ సినిమా విడుదలైన రోజు. మరో రెండు వారాల్లో ఆ సినిమాకు సరిగ్గా పాతికేళ్లు పూర్తవుతాయి. నా జీవితాన్ని ఆ సినిమాకు ముందూ, తరవాతా అని చెప్పుకునేంత గుర్తింపు తీసుకొచ్చిన చిత్రమిది. ఆ తరవాతా నేను సినిమాలు నిర్మించా. కొన్ని హిట్టయ్యాయి. కొన్ని నష్టాలు మిగిల్చాయి. ఇప్పుడు నానీతో తీసిన ‘జెంటిల్‌మన్‌’ సినిమా విజయం మళ్లీ పాత రోజుల్ని గుర్తుచేస్తోంది. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ ఆసక్తి ఉన్నా ఇలా నిర్మాతగా మారతానని మాత్రం ఏరోజూ అనుకోలేదు. కృష్ణా జిల్లాలో కూచిపూడికి దగ్గర్లో ఉన్న పమిడిముక్కల గ్రామం నా స్వస్థలం. నటుడు చంద్రమోహన్‌గారు నాకు మేనమామ. పదో తరగతి దాకా మా వూళ్లొ, ఇంటర్‌ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కాలేజీలో, బీకామ్‌ మంచిర్యాలలో చదువుకున్నా. కాలేజీ రోజుల్లో ఏఎన్నార్‌గారికి వీరాభిమానిని. ఆయన సినిమాలు విడుదలయితే పండగే. అభిమానులందరం ఒక అసోసియేషన్‌లా ఏర్పడి, ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తూ హంగామా చేసేవాళ్లం.

ఏఎన్నార్‌గారి సాయం...
డిగ్రీ అయిపోయాక ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని చెన్నైలోని మావయ్య చంద్రమోహన్‌గారి ఇంటికెళ్లా. అప్పుడు ఏఎన్నార్‌, వాణిశ్రీగారు నటిస్తోన్న ‘అండమాన్‌ అమ్మాయి’ షూటింగ్‌ జరుగుతోంది. అక్కడికి ఓరోజు మావయ్య నన్ను తీసుకెళ్లి నేను ఏఎన్నార్‌గారి అభిమానినంటూ ఆయనకు పరిచయం చేసి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగారు. అలా నాగేశ్వరరావుగారి సహాయంతో ఆంధ్రా బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగిగా కెరీర్‌ మొదలుపెట్టా. అది పర్మినెంట్‌ అయ్యే సమయానికి ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకుతో సహా ఒకేసారి 21 బ్యాంకుల్ని నేషనలైజ్‌ చేసింది. దాంతో ఉద్యోగం పర్మినెంట్‌ అయ్యే ప్రక్రియ ఆగిపోయింది. మరోపక్క అప్పటిదాకా ఎన్టీఆర్‌, కృష్ణ, ఏఎన్నాఆర్‌ లాంటి వాళ్లకు తమ్ముడూ, బావమరిదీ తరహా పాత్రలు చేస్తూ వచ్చిన మావయ్య స్థాయి ‘సిరిసిరిమువ్వ’ సినిమా విజయంతో ఒక్కసారిగా పెరిగిపోయింది. తరవాత ‘సీతామహాలక్ష్మి’ షూటింగ్‌ మొదలైంది. ఆ పైన ‘పదహారేళ్ల వయసు’ సినిమా అవకాశమూ మావయ్యకే వచ్చింది. ఆ సమయంలో ఆయన పిలిచి ‘ఇప్పుడు నాక్కూడా ఒక మనిషి అవసరం. నువ్వు నా వ్యవహారాలు చూసుకుంటూనే వేరే ఉద్యోగ ప్రయత్నాలు’ చేసుకో అన్నారు. అలా మావయ్య డేట్లూ, ఆర్థిక లావాదేవీలూ చూసుకుంటూ సినిమా రంగంలో నా ప్రయాణం మొదలైంది. ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఇంటింటి రామాయణం’, ‘కొంటె మొగుడు పెంకి పెళ్లాం’... ఇలా వరసగా సినిమాలు హిట్టవడంతో మావయ్య ఏడాదికి పద్నాలుగు సినిమాలు చేసేంత బిజీగా మారారు. ఆయన వ్యవహారాలు చూసుకుంటూ నేనూ తీరిక లేకుండా గడిపేవాణ్ణి.

డబ్బింగ్‌ సినిమాతో మొదలు
కె.విశ్వనాథ్‌గారూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారూ మాకు చాలా దగ్గరి బంధువులు. తరచూ వాళ్లతో పాటు ఇతర సినీ ప్రముఖులనూ కలుస్తూ రావడంతో పరిచయాలు బాగా పెరిగాయి. మావయ్య వ్యవహారాలు చూసుకుంటూనే పరీక్ష రాస్తే స్టేట్‌ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దాంతో మావయ్యని వదిలి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డా. అ సమయంలో మా అత్తయ్య, రచయిత్రి జలంధరగారు పిలిచి ‘పరిశ్రమలో నువ్వు కేవలం ఈ పనులు చేయడానికే పరిమితం అవ్వకూడదు. ఇక్కడికి ఎప్పుడైనా రావొచ్చు, ముందు ఉద్యోగంలో చేరు’ అనడంతో హైదరాబాద్‌ బయల్దేరా. ఓ ఎనిమిది నెలల తరవాత బదిలీ చేయించుకుని చెన్నైకి తిరిగొచ్చా. ఉద్యోగం చేసుకుంటూనే మావయ్య డేట్లూ చూసుకోవడం మొదలుపెట్టా. ఆ క్రమంలో ఎంవీ రావు అనే మిత్రుడు ఓ కన్నడ సినిమా కొని ‘రాకాసి నాగు’ పేరుతో దాన్ని తెలుగులోకి అనువదించి నాకు చూపించాడు. ఆ సినిమాకి నెల్లూరు జిల్లా పంపిణీ హక్కుల్ని నన్ను కొనుక్కోమని చెప్పాడు. మొదట నాకెందుకులే అని సందేహించినా, ఆయనే బావుంటుందని చెప్పి ఒప్పించాడు. అలా తొలిసారి 11వేలు పెట్టి నెల్లూరు జిల్లాకి సినిమా హక్కుల్ని కొనుక్కున్నా. ప్రచారానికి దాదాపు నాలుగు వేలు ఖర్చయింది. ఆ సినిమా నాలుగు వారాలు ఆడి దాదాపు 30-35వేలు సంపాదించింది. అంటే నేను పెట్టిన దానికి రెట్టింపు లాభమన్నమాట. తరవాత ఎంవీ రావు భాగస్వామ్యంతోనే ‘ఎదురుదాడి’ పేరుతో మరో అనువాద చిత్రాన్ని విడుదల చేశాం. నా మూడో డబ్బింగ్‌ సినిమాగా ‘తులసీదళం’ నెల్లూరు జిల్లా పంపిణీ హక్కుల్ని కొనుక్కున్నా. ఎన్నో సెన్సార్‌ సమస్యలను దాటుకొని విడుదలైన ఆ సినిమా కూడా బాగానే ఆడింది.

తొలిసినిమా సూపర్‌హిట్‌
అనువాద చిత్రాల్ని పంపిణీ చేస్తున్న సమయంలో నేను నిర్మాతగా మారడానికి పునాది వేసింది దశరథ రామిరెడ్డిగారు. మావయ్యకు సంబంధించిన ఆడిటింగ్‌ పనులు ఆయనే చూసేవారు. ‘నాకు సినిమా నిర్మాణంపైన అవగాహన ఉంది. ఎవరైనా మీకు తెలిసిన ప్రొడ్యూసర్లు ఉంటే చెప్పండి, వాళ్ల సినిమా నిర్మాణ పనులు చేసిపెడతా’ అన్నా. ‘ఎవరి కోసమో ఎందుకయ్యా పనిచేయడం, నువ్వే సినిమా తియ్యి. నేను డబ్బు ఇప్పిస్తాను, తిరిగి జాగ్రత్తగా కట్టుకో చాలు’ అన్నారు. బ్యాంకు ఉద్యోగిని కాబట్టి నా పేరు మీద సంస్థను ఏర్పాటు చేయడానికి వీలు లేదు. అందుకే నా భార్య అనితా కృష్ణ పేరుతో సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. తమిళంలో ప్రభు, సత్యరాజ్‌, నదియా నటించిన ‘చినతంబి పెరియతంబి’ చూశా. అది బాగా నచ్చడంతో దాన్నే తెలుగులో చేస్తే బావుంటుందని అనిపించింది. మావయ్యతో పాటు కామెడీ హీరోగా అప్పుడప్పుడే దూసుకొస్తోన్న రాజేంద్ర ప్రసాద్‌ ఆ సినిమాకు సరిగ్గా సరిపోతాడని అనిపించింది. వెంటనే 78వేల రూపాయలకు ఆ సినిమా హక్కులు కొన్నాను. దర్శకుడు రేలంగి నర్సింహారావుగారికీ సినిమా నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నారు. ఖుష్బుని హీరోయిన్‌గా తీసుకున్నాం. అలా 1987లో గాంధీ జయంతి, విజయ దశమి కలిసొచ్చిన రోజున నా నిర్మాణ సంస్థ ‘శ్రీదేవి మూవీస్‌’ని మొదలుపెట్టా. కేవలం 22 రోజుల్లో షూటింగ్‌ని పూర్తి చేసి ‘చిన్నోడు పెద్దోడు’ సినిమాని విడుదల చేశాం. అది తొలిరోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుని పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.అదే కెరీర్‌కి మలుపు...
‘చిన్నోడు పెద్దోడు’ విడుదలయిన కొన్ని రోజులకు బాలూగారు పిలిచి, ‘ఏదైనా పెద్ద సినిమా చేయి కృష్ణా, పెద్ద హీరోతో నేను మాట్లాడతా’ అన్నారు. తరవాత ఉన్నట్టుండీ ఓ రోజు ఆయన ఇంటికి పిలిపించి ‘రాత్రి బెంగళూరులో రికార్డింగ్‌ పూర్తి చేసుకొని ఫ్లయిట్‌లో సింగీతం శ్రీనివాసరావుగారితో కలిసొస్తుంటే ఆయన ఓ అద్భుతమైన పాయింట్‌ చెప్పారు. నువ్వోసారి ఆయన్ని కలిసిరా’ అన్నారు. సింగీతంగారిని కలిస్తే ఆయన ‘బ్యాక్‌ టు ద ఫ్యూచర్‌’ సినిమాకు సంబంధించిన వీడియో క్యాసెట్లు ఇచ్చి, ‘ఇవి మనిషి కాలంలోకి ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో తీసిన సినిమాలు. వీటిని పక్కన పెడితే నాకో ఆలోచన ఉంది. ఓ వ్యక్తి ఉన్నట్టుండీ కృష్ణదేవరాయల కాలానికి వెళ్తే ఏం చేస్తాడు. భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుందీ అన్న అంశంతో సినిమా తీయాలనుకుంటున్నా’ అన్నారు. ఆయన ఆలోచన వింటూనే ఆశ్చర్యపోయా. వెంటనే బాలూగారికి కథ చాలా బావుందని చెప్పా. కృష్ణ దేవరాయల పాత్రకు బాలకృష్ణగారు అతికినట్లు సరిపోతారని అనిపించింది. ఆయనా కథ వినగానే ఓకే అన్నారు. ఆ సమయంలో బాలకృష్ణగారు ‘ముద్దుల మావయ్య’, ‘భలే దొంగ’ లాంటి వరస విజయాలతో ఉన్నారు. అయినా ఓ ఫిక్షన్‌ కథ ఇమేజ్‌కు ఎంతగా ఉపయోగపడుతుందో పట్టించుకోకుండా ఒప్పుకోవడం చూసి చాలా ఆశ్చర్యమేసింది. ఆ సినిమా కోసం ఇళయరాజా, వేటూరి, జంధ్యాల, పీసీ శ్రీరామ్‌, వీఎస్‌ఆర్‌ స్వామి లాంటి దిగ్గజాలతో పనిచేయడం నా అదృష్టం. విమర్శకుల అంచనాల్ని తలకిందులు చేస్తూ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.

లాభనష్టాల ప్రయాణం...
‘ఆదిత్య 369’ తరవాత ఓ పెద్ద హీరోని దృష్టిలో పెట్టుకొని మలయాళంలో హిట్టయిన మోహన్‌లాల్‌ సినిమా ‘అభిమన్యు’ హక్కుల్ని కొనుక్కున్నా. అది చాలావరకూ బొంబాయి నేపథ్యంలో తీసిన సినిమా. తెలుగు వాళ్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందోనన్న సందేహంతో దాన్ని రీమేక్‌ చేయకుండా, అదే పేరుతో అనువాదం చేసి విడుదల చేశా. తెలుగులోనూ అది మంచి విజయం సాధించింది. అదే ఉత్సాహంతో మోహన్‌లాల్‌గారి మరో సినిమా ‘యోధా’ని తెలుగులో విడుదల చేశా. తరవాత బాలూగారు నిర్మించిన ‘గుణ’ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేశా. ఆపైన జాకీచాన్‌ నటించిన ఐదారు ఇంగ్లిష్‌ సినిమాల్ని తెలుగులోకి తీసుకొచ్చి విజయాలు అందుకున్నా. కొన్నాళ్లపాటు డబ్బింగ్‌ ప్రాజెక్టులకు దూరంగా వచ్చి బాలకృష్ణగారితో ‘వంశానికొక్కడు’ సినిమా నిర్మించా. అదే సమయంలో బాలూగారు నిర్మిస్తోన్న ‘శుభసంకల్పం’ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా పనిచేశా. ఆ రెండు సినిమాలూ హిట్టయ్యాయి. ‘వంశానికొక్కడు’ 32 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఆ తరవాత ‘వీఐపీ’ అనే తమిళ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చా. ఆ పైన ఎగ్జిక్యుటివ్‌ ప్రొడ్యూసర్‌గా కమల్‌హాసన్‌ నటించిన ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’ సినిమాలకు పనిచేశా. అవి పూర్తయ్యాక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా ‘వూయల’, తరవాత ‘అనగనగా ఒక అమ్మాయి’ సినిమాలు తీశా. ఆ సమయంలోనే బాలకృష్ణగారిని కలిస్తే మళ్లీ సినిమా చేద్దామన్నారు. దాంతో ఆయనతో ‘భలేవాడివి బాసు’, కొన్నాళ్లకు ‘మిత్రుడు’ సినిమాలు నిర్మించా. అలా విజయాలూ, అపజయాలూ, లాభాలూ, నష్టాలతో నిర్మాతగా నా కెరీర్‌ కొనసాగుతూ వచ్చింది.

మళ్లీ బాలూగారి వల్లే...
‘మిత్రుడు’ తరవాత ఈటీవీలో ‘ముత్యమంత పసుపు’ పేరుతో ఏడాదిన్నర పాటు ఓ సీరియల్‌ తీశా. గతంలో సింగీతంగారితో సినిమా తీయమని సలహా ఇచ్చిన బాలూగారు, రెండేళ్ల క్రితం మళ్లీ పిలిచి ఇంద్రగంటి మోహన్‌కృష్ణగారితో సినిమా తీస్తే బావుంటుందని చెప్పారు. కానీ ‘బందిపోటు’ ఫ్లాపయ్యాక మోహన్‌కృష్ణగారు పిలిచి ‘మీరూ ఇబ్బందుల్లో ఉన్నారు, నా సినిమా కూడా సరిగా ఆడలేదు. కాబట్టి నా గురించి ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకోండి’ అన్నారు. సినీరంగంలో నేనూ ఎత్తుపల్లాల్ని చూశాను, కాబట్టి వాటికి నేను పెద్ద విలువ ఇవ్వనని చెప్పి ఆయనతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. నేను చాలా కాలం క్రితం నుంచీ తీయాలనుకుంటోన్న ఓ కథ గురించి ఆయనకు చెప్పి, నచ్చితే దాన్నే సినిమాగా తీద్దామన్నా. రచయిత డేవిడ్‌ నాథన్‌ చెప్పిన పాయింట్‌ మోహన్‌కృష్ణగారికీ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కథలో మార్పు చేర్పులు చేశాక దానికి నానీ అయితే సరిపోతాడని ఆయనే సూచించారు. అందరం అనుకున్నట్లుగానే ‘జెంటిల్‌మన్‌’ విజయాన్ని సాధించి నిర్మాతగా మళ్లీ నన్ను నిలబెట్టింది.

అప్పుడు కొత్తవాడినని కూడా చూడకుండా బాలకృష్ణగారు నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మొత్తంగా నాలుగు సినిమాలు చేసి నాకూ, నా సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు నా జయాపజయాలతో నిమిత్తం లేకుండా నానీ కూడా వెంటనే సినిమాకు ఒప్పుకున్నారు. ఇలా కథల్నీ, మనుషుల్నీ ఒకరినొకరు నమ్మినంత కాలం పరిశ్రమా బావుంటుందీ, మనుషులూ బావుంటారన్నది నా నమ్మకం.


వాళ్ల పనిలో తలదూర్చను!

మా అబ్బాయి శ్రీనివాస చైతన్యకి ఈమధ్యే పెళ్లయింది. అతను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మాయి శ్రీవిద్య రెడ్‌ ఎఫ్‌ఎంలో ఆర్‌జే. సినిమాల్లో ఇప్పటి ట్రెండ్‌కి సంబంధించిన విషయాలను పిల్లలే నాకు ఎప్పటికప్పుడు సూచిస్తారు.

* సినిమాలు తీస్తూనే దాదాపు ఇరవై ఏళ్లు ఎస్‌బీఐలో ఉద్యోగం చేశా. ఆఫీసుకు వెళ్లిన దానికంటే సెలవులో ఉన్న రోజులే ఎక్కువ. కొన్నేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశా.
* దర్శకుల్నీ, రచయితల్నీ వందశాతం నమ్ముతా. కథకు సంబంధించిన అన్ని సందేహాలనూ చర్చల దశలోనే తీర్చుకుంటా. ఒక్కసారి సినిమా సెట్‌ మీదకు వెళ్లాక వాళ్ల పనిలో వేలు పెట్టను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.