close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేదల ఆకలి తీర్చే ఫ్రిజ్‌లు!

పేదల ఆకలి తీర్చే ఫ్రిజ్‌లు!

  రంజాన్‌ మాసమనగానే ఉపవాసాలూ, ఇఫ్తార్‌ విందులూ, నిరుపేదలకు దానధర్మాలూ గుర్తొస్తాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఈసారి ఈ దానాల విషయంలో కొత్త పోకడ మొదలైంది. అదే... పేదల కోసం ఆహార పదార్థాలతో నిండిన ఫ్రిజ్‌ల ఏర్పాటు. ఓ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా మొదలైన ఈ దాతృత్వ కార్యక్రమం చాలా మందినే కదిలించింది!తుకు-బతకనివ్వు... ఏ మత సారాంశమైనా ఇదే! తోటివారిని ఆకలితో ఉంచి మనల్ని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయమని ఏ దేవుడూ చెప్పడు. అందుకే ఖురాన్‌లోనూ ఉందీ అంశం. ఉపవాసాలుండటమే కాదు డబ్బులేని వాళ్లకు చేతనైనంత సాయం అందించాలని చెబుతుంది. అందుకే ఈ నెల్లో ఉపవాసాలుండే ప్రతి ఒక్కరూ కనీసం పదిరూపాయలైనా దానం చేసి తీరతారు. ఇఫ్తార్‌ విందులూ ఈ మాసంలో ప్రత్యేకమే. మరి ఇలా ఉపవాసాలుండే నిరుపేదల సంగతేంటి... 45 డిగ్రీలకు మించిన వాతావరణంలో పనిచేసే కార్మికుల పరిస్థితేంటి... వాళ్లకూ చల్లటి మంచినీళ్లూ, పండ్ల రసాలూ, ఆహారం అందాలి... అన్న గొప్ప ఉద్దేశంతో మొదలైంది రమదాన్‌ లేదా షేరింగ్‌ ఫ్రిజెస్‌ ఇన్‌ యూఏఈ ఫేస్‌బుక్‌ పేజీ.

ఎవరైనా తీసుకోవచ్చు...
రమదాన్‌ ఫేస్‌ బుక్‌ పేజీ సభ్యులు ఈ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ వీధుల్లో ఆరుబయటే ఉంటాయివి. పేదలకు ఆహారాన్ని దానం చేయాలి అనుకునే ఎవరైనా ఈ ఫ్రిజ్‌ల దగ్గరకు వెళ్లి తాము ఇవ్వదలచుకున్న పదార్థాలను అందులో ఉంచుతారు. వీటిలో మంచినీళ్ల సీసాలూ, కూల్‌డ్రింకులూ, జ్యూసుల డబ్బాలూ, రకరకాల పండ్ల నుంచి చికెన్‌, మటన్‌ బిర్యానీలూ, బిస్కెట్లూ, యోగర్ట్‌, సమోసాల వరకూ అన్నీ ఉంటాయి. ఫ్రిజ్‌కు తాళం వేసి ఉండదు. అందువల్ల అవసరం ఉన్న ఎవరైనా ఆ ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లి కావలసిన పదార్థాలు తీసుకుని తినొచ్చు. దాహం తీర్చుకోవచ్చు. వలస కూలీలూ, నిర్మాణ పనులు చేసేవాళ్లూ, గ్యారేజీల్లో పని చేసేవాళ్లూ, గార్డెనర్లూ, వాచ్‌మెన్లూ... ఇలా చిన్న పనులు చేసే వివిధ వర్గాలకు చెందిన వాళ్ల కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్క దుబాయ్‌లోనే ఈ తరహా ఫ్రిజ్‌లు 50 ఉన్నాయి. ఇక యూఏఈ మొత్తం మీద మరో 70 ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చాయి.ఆ స్ఫూర్తితోనే...
సుమయా సయ్యద్‌ అనే యువతి జూన్‌ మొదటి వారంలో ఈ ఆలోచన చేసింది. దాని కోసం రమదాన్‌ పేరిట ఫేస్‌బుక్‌ పేజీని ఓపెన్‌చేసి అందులో ఉచిత ఫ్రిజ్‌లకు సంబంధించిన ఆలోచనతో ఒక గ్రూప్‌ను తయారు చేసింది. అనూహ్యంగా ఇప్పటికే దాదాపు 20 వేల మంది ఇందులో సభ్యులుగా చేరారు. వీళ్లలో కొంత మంది ఈ కార్యక్రమం కోసం తమ ఇళ్లలోని ఫ్రిజ్‌లను ఇచ్చేశారు. మరికొంత మంది కొత్త ఫ్రిజ్‌లనూ, ఇంకొంత మంది సెకండ్‌హ్యాండ్‌ ఫ్రిజ్‌లనూ కొని ఇలా ఏర్పాటు చేశారు. కొందరు తమ అవకాశాన్ని బట్టి పండ్లూ, జ్యూసులూ, మంచినీళ్లూ, బిర్యానీల్లాంటివి అందిస్తున్నారు. ఫ్రిజ్‌లు ఎవరిఇంటి ముందైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్లే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చుకోవడం, ఎవరైనా దానం చేసిన వాటితో ఖాళీ అవుతున్న ఫ్రిజ్‌ను తిరిగి నింపడంలాంటి పనులు చేస్తారు. ఈ ఉచిత ఫ్రిజ్‌లను అట్టడుగు వర్గాల కూలీలు పనిచేసే ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా అమరుస్తున్నారు. అందువల్ల అందులోని పదార్థాలను తినే వాళ్లు ఎవరినీ అడగాల్సిన పని ఉండదు. దానం చేయాలనుకున్నా, ఆహారం అవసరం ఉన్నా ఫ్రిజ్‌లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనే విషయం మీద మ్యాప్‌లు కూడా తయారు చేసి నెట్‌లో పెట్టారు. నిజానికి ఈ ఆలోచన సుమయాకు రావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి దుబాయ్‌కి చెందిన ఫిక్రా యెల్‌. ఈమె గత మూడు సంవత్సరాలుగా తన ఇంటి ముందు ఇలాంటి ఫ్రిజ్‌నొకదాన్ని నడుపుతున్నారు. తను సొంతంగా అందులో పేదల కోసం ఆహారాన్ని ఉంచుతారు ఫిక్రా. ఈ ఆలోచన నచ్చిన సుమయా ఫేస్‌బుక్‌ ద్వారా మరింత మందిని ఒక వేదిక మీదకు తెచ్చి ఇదే కార్యకమాన్ని పెద్ద ఎత్తున జరిగేలా చేస్తున్నారు. వ్యక్తులే కాదు ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నాయి. అల్‌ ఎయిన్‌ అనే సంస్థ 200 మంచినీళ్ల సీసాలు ఇస్తే, ఫ్రూట్‌ ఫర్‌ లైఫ్‌ అనే మరో సంస్థ రోజుకు 20 కిలోల పండ్లను అందిస్తోంది. హ్యాకర్‌ యూఏఈ, కైసర్‌ జర్మన్‌లాంటి సంస్థలు చెరో మూడు ఫ్రిజ్‌లను ఈ కార్యక్రమానికి ఇవ్వగా, మరి కొన్ని సంస్థలు ఇలాంటి ఫ్రిజ్‌లను సొంతంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఒక్కో ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం దాదాపు 150 మందికి సరిపోతుంది. ఇలా ఏర్పాటు చేసిన ఫ్రిజ్జుల్లో కొన్నింటిని రంజాన్‌ తరువాత తీసివేస్తే... మంచినీళ్లూ, పండ్లరసాలూ, కూల్‌డ్రింకులకు సంబంధించిన వాటిని మాత్రం ఏడాది పొడుగునా ఉంచే ఉద్దేశంలో ఉన్నారు. మొత్తానికి సందర్భం ఏదైనా పేదలకు చక్కని ఆహారం అందుతుండటం చెప్పుకోదగ్గ విషయమే కదూ!


 

అతడే ఒక నెట్‌వర్క్‌!

వృత్తిపరమైన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ లింక్డిన్‌ని రూ.1,70,000 కోట్లకు కొనుగోలుచేసింది మైక్రోసాఫ్ట్‌. సాంకేతిక రంగంలో రెండో అతిపెద్ద కొనుగోలిది. ‘లింక్డిన్‌’... రీడ్‌ హాఫ్‌మన్‌ మానస పుత్రిక. కేవలం లింక్డిన్‌లోనే కాదు సిలికాన్‌ వ్యాలీలోనే హాఫ్‌మన్‌ది కీలక స్థానం!

మెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో కొత్త వ్యాపారులు పెట్టుబడుల కోసం రీడ్‌ హాఫ్‌మన్‌ని కలుస్తుంటారు. కంపెనీ సమస్యల్లో చిక్కుకున్నపుడు యువ వ్యాపారులు ఆయన సలహాల కోసం క్యూలో వేచి ఉంటారు. అనుభవజ్ఞులు కూడా ఆయన స్నేహితుల జాబితాలో చేరడానికి ఉబలాటపడతారు. వారిలో ఎవ్వరినీ నిరుత్సాహపరచడు హాఫ్‌మన్‌. మనిషి సంఘజీవి అనేది ఆయన బలమైన నమ్మకం... అది ఆన్‌లైన్లోనైనా, ఆఫ్‌లైన్లోనైనా! అమెరికా అధ్యక్షుడు కూడా రీడ్‌ ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌లో సభ్యుడే!

* చిన్నపుడు మ్యాగజీన్‌ రూపంలో వచ్చే ‘రూన్‌క్వెస్ట్‌’ గేమ్‌ని ఆడేవాడు రీడ్‌. 12 ఏళ్ల వయసులో ఒకరోజు ఆ పుస్తకంలో ఎర్ర సిరాతో కొన్ని చోట్ల దిద్ది పుస్తక తయారీ సంస్థ ఆఫీసుకి వెళ్లి ఇక్కడ మార్పులు చేస్తే గేమ్‌ ఇంకా బావుంటుందని గేమ్‌ని రూపొందించిన వ్యక్తికి చెప్పాడట. బదులుగా హాఫ్‌మాన్‌కి ఎనిమిది వేల రూపాయల చెక్‌ని అందించిందా కంపెనీ. ‘ఆ సంఘటనతో నాపైన నాన్నకి నమ్మకం కుదిరింది’ అని చెబుతాడు రీడ్‌. పెద్దయ్యాక ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్‌ ‘జింగా’లో భాగం కావడానికి ఆ అనుభవం ఎంతో పనికొచ్చిందంటాడు. కంప్యూటర్స్‌ని మానవ మేధస్సుతో కలిపి అధ్యయనంచేసే ‘సింబాలిక్‌ సిస్టమ్స్‌’లో స్టాన్‌ఫర్డ్‌ నుంచి డిగ్రీ చేసిన రీడ్‌... ఆక్స్‌ఫర్డ్‌ నుంచి తత్వశాస్త్రంలో పీజీ చేశాడు. విద్యారంగంలో స్థిరపడాలని ఉండేది ఆయనకు... కానీ ఆ రంగంలో పరిధి తక్కువని అదే ఒక సంస్థని ప్రారంభిస్తే కోట్ల మందితో అనుబంధం ఏర్పడుతుందనుకున్నాడు.

* స్టాన్‌ఫర్డ్‌లో ఉండగానే ‘పే పాల్‌’ వ్యవస్థాపకుడు పీటర్‌ థీల్‌తో రీడ్‌కు పరిచయం. మొదట్నుంచీ రీడ్‌ బృందాలని ప్రోత్సహించేవాడనీ చెబుతాడు థీల్‌. ఆపిల్‌లో ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించిన రీడ్‌కి ఆన్‌లైన్లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ని స్థాపించాలని ఉండేది. ఫేస్‌బుక్‌ ‘జుకెర్‌బర్గ్‌’ హైస్కూల్‌కి కూడా వెళ్లని నాటి(1997)కే ‘సోషల్‌నెట్‌డాట్‌కామ్‌’ పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు. అది ఒక ప్రాంతంలో ఉంటూ ఒకేలాంటి అభిరుచులు ఉన్నవాళ్లని కలిపేందుకు సాయపడేది. డేటింగ్‌ వెబ్‌సైట్‌గానూ ప్రాచుర్యం పొందింది. కానీ తర్వాత విజయవంతం కాలేదు. 1999లో దాన్ని మూసేసి థీల్‌ ప్రారంభించిన ‘పే పాల్‌’లో ఉపాధ్యక్షుడిగా చేరి ఆ సంస్థ ఎదుగుదలలో తనదైన ముద్రవేశాడు. 2002లో ‘పే పాల్‌’ని ఈబే సంస్థకి అమ్మినపుడు మిగతా వ్యవస్థాపకులతోపాటు హాఫ్‌మన్‌కూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఆ సమయంలో ‘ఆడి’ కారుని కొనాలనుకున్నాడు హాఫ్‌మన్‌. అప్పుడే ఓ స్నేహితుడు సౌర విద్యుత్తుని ఉత్పత్తిచేసే అంకుర సంస్థ ‘నానో సోలార్‌’ గురించి చెప్పడంతో దాన్లో పెట్టుబడి పెట్టాడు. దాంతో ఆడీకి బదులుగా తక్కువ ధర ఉండే ‘ఆక్యురా’ కారుని కొన్నాడు. తర్వాత నానో సోలార్‌ విజయవంతమైంది.

* ‘సోషల్‌నెట్‌’ ద్వారా చేయకూడనివీ, ‘పే పాల్‌’ ద్వారా చేయాల్సినవీ తెలుసుకున్నాక 2002లో మరో ముగ్గురితో కలిసి తన అపార్ట్‌మెంట్‌లో లింక్డిన్‌ను ప్రారంభించాడు రీడ్‌. ఇది వృత్తి, వ్యాపార రంగాలకు చెందిన ఉద్యోగులూ, నిపుణుల్ని కలుపుతుంది. 2003లో సికోయా దీన్లో పెట్టుబడి పెట్టింది. నాణ్యమైన సేవల్ని అందిస్తూ లింక్డిన్‌ని విలువైన నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేయాలనేది రీడ్‌ లక్ష్యం. ఆరంభంలో లింక్డిన్‌కు ఆదరణ అంతంతమాత్రమే. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఉద్యోగావకాశాల కోసం చాలామంది లింక్డిన్‌ని వేదికగా ఉపయోగించుకోవడంతో నెమ్మదిగా లాభాలబాట పట్టింది. లింక్డిన్‌కు మొదటి నాలుగేళ్లు రీడే సీయీవో. తన తర్వాత ‘డేన్‌ నై’కి సీయీవో బాధ్యతలు ఇచ్చినా స్వల్ప వ్యవధిలోనే వాటిని తిరిగి తీసుకొని ఆపైన కొన్ని నెలలకు యాహూలో పనిచేసిన జెఫ్‌ వీనర్‌కి ఆ బాధ్యతల్ని అప్పగించాడు. అప్పట్నుంచీ వీనర్‌ ఆ సీట్లో ఉన్నాడు. రీడ్‌ ప్రస్తుతం సంస్థ కార్యనిర్వహక ఛైర్మన్‌.

* ప్రస్తుతం లింక్డిన్‌కు 43 కోట్ల మంది వినియోగదారులున్నారు. పదివేల మంది ఉద్యోగులున్నారు. లింక్డిన్‌లో అతిపెద్ద వాటాదారు రీడ్‌. ఆయన వాటా 11 శాతం. రీడ్‌ అంటే లింక్డిన్‌ మాత్రమే కాదు... తన కెరీర్లో సిలికాన్‌ వ్యాలీలో 150కి పైగా అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడాయన... వాటిలో కొన్ని వ్యక్తిగతంగా మరికొన్ని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘గ్రేలాక్‌ పార్ట్‌నర్స్‌,’ భాగస్వామిగా. ఫేస్‌బుక్‌, ఫ్లికర్‌, ఫైర్‌ఫాక్స్‌, గ్రూపాన్‌, జింగా... లాంటి విజయవంతమైన సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. అందుకే అంటారు రీడ్‌ అంటే లింక్డిన్‌ మాత్రమే కాదు, అతడో నెట్‌వర్క్‌ అని!

ఇంకొంత

  కివాడాట్‌ఆర్గ్‌, డూసమ్‌థింగ్‌డాట్‌కామ్‌, ఎండీవర్‌ లాంటి సేవా సంస్థల్లోనూ రీడ్‌ది కీలక పాత్ర.
* తనను కలవాలనుకునే ఔత్సాహిక వ్యాపారులకు వారాంతాల్లోనూ సమయం కేటాయిస్తాడు.
* ‘ద స్టార్టప్‌ ఆఫ్‌ యు: అడాప్ట్‌ టు ద ఫ్యూచర్‌’, ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ యువర్‌సెల్ఫ్‌’, ‘ట్రాన్స్‌ఫామ్‌ యువర్‌ కెరీర్‌’... పుస్తకాలను రాశాడు.
* కాలేజీరోజుల నాటి ప్రియురాలు మిషెల్లీని 2001లో పెళ్లిచేసుకున్నాడు.
* కొన్నేళ్లుగా సమయాన్ని గ్రేలాక్‌, లింక్డిన్‌లకు విభజించి పనిచేస్తున్నాడు.


 

ఈ కథలు కళ్లు లేని పిల్లలకు!

రామాయణ, భారతాల్లాంటి పురాణ గాథలు మొదలుకొని పంచతంత్ర, బేతాళ కథల వరకూ చదువుకునేందుకు మనకు ఎంతో సాహిత్యం పుస్తకాల రూపంలో అందుబాటులో ఉంటుంది. కానీ ఆ పుస్తకాలను చదవలేని కళ్లు లేని పిల్లల సంగతి ఏమిటి? పిల్లలను వూహాలోకాల్లో విహరింపజేసి మనోవికాసానికి తోడ్పడే కథలకు వాళ్లు దూరంగా ఉండాల్సిందేనా?... అంటే, కాదు అంటుంది ‘కహానీ ప్రాజెక్ట్‌.’ ఎందుకంటే అంధులైన పిల్లల కోసం ఈ వెబ్‌సైట్‌ వందల కథలను చక్కగా వినిపిస్తుంది మరి!చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ కథలంటే ఇష్టపడనివాళ్లుండరు. వూహా ప్రపంచానికి మనల్ని తీసుకుపోయే కథలంటే చిన్న పిల్లలకు మరీ ఇష్టం. అందుకే బోలెడు బొమ్మల పుస్తకాలూ, చిత్ర కథలు, బొమ్మల సినిమాలూ వాళ్లకోసం ఉంటాయి. కానీ కళ్లులేని పిల్లలు ఈ పుస్తకాలను చదవలేరు. బ్రెయిలీలో చదువుకునేందుకు అరకొర పుస్తకాలు ఉన్నా ఆ చుక్కల భాషను చదవగలిగే పిల్లల సంఖ్యా పరిమితమే. ఉమ్మడి కుటుంబాలు మాయమౌతున్న ఈ తరుణంలో నాయనమ్మలూ, తాతయ్యలూ చెప్పే కథలు వినే పరిస్థితీ లేదు. అందుకే చూపులేని పిల్లల కోసమే ప్రత్యేకంగా... ఎంతో మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో అజయ్‌దాస్‌ గుప్తా అనే ఓ యువకుడు నడుపుతున్న వెబ్‌సైట్‌ దకహానీప్రాజెక్ట్‌.ఓఆర్జీ (thekahaniproject.org).

ఆలోచనకు అంకురం...
అజయ్‌దాస్‌ గుప్తా మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అతని ప్రాజెక్టుల్లో భాగంగా ఓసారి సింగపూర్‌ వెళ్లినప్పుడు ఓ చీకటి గదిలో ప్రజెంటేషన్‌ మొదలుపెట్టారు. టిఫిన్స్‌ స్నాక్స్‌ సహా అక్కడన్నీ సాదాగా జరిగిపోతున్నాయి. తొలుత అంతా మామూలుగా అనిపించినా ఇతనికి మాత్రం అక్కడ పని కాస్త కష్టంగానే అనిపించింది. అక్కడి కార్యక్రమం మొత్తం పూర్తయ్యాకగానీ తెలీలేదు... దాన్ని మొత్తం 15 మంది కళ్లులేని వాళ్లు నిర్వహించారనీ... అందుకే వాళ్లు చీకట్లోనూ చక్కగా పనిచేయగలుగుతున్నారనీ. మిగిలిన జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నా కేవలం చీకటిలో చూడలేకపోవడం వల్ల తానెంత ఇబ్బంది పడ్డాడో గ్రహించాడు. కళ్లను వదిలేసి మిగతా జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అంధులు పనులు చేస్తుండటం కూడా అతన్ని ఆలోచింపజేసింది. అంటే వాళ్లు చూడకపోయినా ఓ ప్రత్యేక ప్రపంచాన్ని మెదడులో నిర్మించుకుంటారన్నమాట! ఆ తరువాతా చాలా సార్లు తన పనిలో భాగంగా కళ్లులేని వాళ్లను కలిసేవాడు. ఓ రోజు పిల్లలు గట్టిగా కథలు చదవడం వినిపించింది. అది అంధులకు సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థ. అదే అతని మనసులో ఆలోచనను రేకెత్తించింది. ఈ పిల్లలు చదువుకునేందుకు బ్రెయిలీలోని పుస్తకాల సంఖ్య తక్కువనీ, అందరు అంధులకూ బ్రెయిలీ రాదనీ తెలుసుకున్నాడు. తనకున్న సాంకేతిక జ్ఞానంతో వీళ్లకోసం ఏమైనా చేయాలనుకున్నాడు. అదే కహానీ ప్రాజెక్టు... అంధుల కోసం కథలను చక్కగా చదివి రికార్డు చేసి ఓ వెబ్‌సైట్లో పొందుపరచడం. దీనికోసం ముందుగా పుణెలోని కొన్ని అంధుల ఆశ్రమాలూ పాఠశాలలకు వెళ్లి కొన్ని కథలను స్వయంగా వినిపించాడు. కొంతమంది స్నేహితులతో కలిసి ఇలా కథలను రికార్డు చేసి ద కహానీప్రాజెక్ట్‌ పేరిట 2012 నవంబరు 14న వెబ్‌సైట్‌ను మొదలు పెట్టాడు. ఈ సంస్థవాళ్లు వాలంటీర్లుగా పనిచేస్తున్న చోట ఎంపీ3 ప్లేయర్ల ద్వారా కూడా వీటిని వినేలా సాయపడుతున్నారు. ఇప్పటికీ సంస్థ ఇలాంటి పిల్లలకు కథలు వినిపించే కార్యక్రమాల్ని చేపడుతూనే ఉంది.మనమూ కథ చెప్పొచ్చు...
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్లో ఇంగ్లిష్‌, తెలుగులతో పాటూ మరో ఎనిమిది భారతీయ భాషల్లో 600లకు పైగా కథలు రికార్డయి ఉన్నాయి. అందులో జానపద కథలు, జంతువుల కథలు, పంచతంత్ర కథలూ, అక్బర్‌ బీర్బల్‌ కథలూ ఇలా విభిన్న నేపథ్యాలకు సంబంధించిన కథలుంటాయి. ఇవన్నీ అంధులకు ఏదో రూపంలో తమ వంతుగా ప్రోత్సాహాన్నివ్వాలనుకునే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు రికార్డు చేసినవే. మన ఫోన్ల ద్వారా కూడా వీటిని వినవచ్చు. సంస్థ పనిచేస్తున్న పుణెలో అయితే పార్కుల్లాంటి స్థలాల్లోనూ పిల్లలు కథలు వినేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్లి కథలు వినొచ్చూ, మనకిష్టమైతే రికార్డు చేయొచ్చు. అంతేకాదు స్టోరీథాన్‌ పేరిట కథలు చెప్పేవాళ్లందరినీ ఒకదగ్గరికి తీసుకువచ్చి వాటిని రికార్డు చేసే కార్యక్రమాన్నీ పుణెలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ తదితర 100 దేశాల్లోని వినియోగదారులు ఈ వెబ్‌సైట్లోని కథలను వేల సార్లు వింటున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ‘కథలు వినడం అనేది పిల్లల ప్రాథమిక హక్కు. ప్రపంచంలో కథలను విడమరచి చెప్పగలిగే వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలన్నది మా ఆశయం.’ అంటారు అజయ్‌ దాస్‌ గుప్తా. ఇందులోకి కథలను కంప్యూటర్‌ ద్వారా మనమూ అప్‌లోడ్‌ చేయొచ్చు. అది ఎలా చేయాలో కూడా వెబ్‌సైట్లో స్పష్టంగా రాసి ఉంటుంది. ఇంకేం, మీకిష్టమైన కథను ఇందులో అప్‌లోడ్‌ చేసి వేల మందికి వినిపించండి!


 

వాళ్ల పేర్లు... గూగుల్‌, కాపీ, రేడియో..!

‘ఎవరు కావాలి... అమెరికానా... అదిగో ఆ చెట్టు దగ్గరే వాళ్లిల్లు. గూగుల్‌, సుప్రీంకోర్ట్‌, మైసూర్‌ పాక్‌, వన్‌ బై టూలు కూడా అక్కడే ఉంటారు. వాళ్లందరూ స్నేహితులు కదా.’ ఆ వూరికి ఎవరెళ్లినా ఇలాంటి ఏదో సంభాషణ వినడం, అవాక్కవడం ఖాయం. ఎందుకంటే దిమ్మ తిరిగిపోయేలాంటి పేర్లను పెట్టుకోవడమే హక్కిపిక్కి తెగవారి ప్రత్యేకత.క్ష్మి, కృష్ణ, శివ, సరస్వతి... లాంటి పేర్లుంటే హిందువులనీ రెహమాన్‌, సల్మాన్‌ లాంటి పేర్లుంటే ముస్లింలనీ... పీటర్‌, జాన్‌ లాంటి పేర్లుంటే క్రైస్తవులనీ... ఇలా మతాలూ ప్రాంతాలూ సంప్రదాయాలను బట్టి రకరకాల పేర్లు పెట్టుకోవడమే ఎక్కడైనా ఆనవాయితీ. అంతేకాదు, మనుషులకు ఒకలాంటి పేర్లూ వస్తువులకు మరోలాంటి పేర్లూ ఉంటాయన్నది కూడా అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని భద్రపుర, మైసూర్‌, మాండ్య, రామనగర, శివమొగ్గ, చిక్‌మగళూరు ప్రాంతాల్లో ఉండే హక్కిపిక్కి గిరిజనులు మాత్రం మిగిలిన ప్రపంచానికి పూర్తి భిన్నం. వస్తువులూ పార్టీలూ పదార్థాలూ దేశాలూ... అదీ ఇదీ అనే తేడా లేకుండా దేన్ని పడితే దాన్ని పేర్లుగా పెట్టేస్తుంటారు వీళ్లు. అలా అక్కడ గూగుల్‌, గ్లూకోజ్‌, మైసూర్‌ పాక్‌, బెంగళూర్‌ పాక్‌, కాఫీ, షుగర్‌, గ్రాస్‌, హైకోర్ట్‌, సుప్రీంకోర్ట్‌, హోటల్‌, విధానసౌధ, సైకిల్‌, కాంపౌండ్‌, గవర్నమెంట్‌, లాయర్‌, ఇన్‌స్పెక్టర్‌, రేడియో, మిలటరీ, కాంగ్రెస్‌, జనతా... లాంటి వింత వింత పేర్లెన్నింటినో పెట్టేసుకున్నారు. నిజానికి వీళ్లందరూ కొన్నేళ్లకిందటి వరకూ అడవుల్లోనే ఉండేవారు. వేటాడటం వీరి జీవన వృత్తి. అయితే, వన్య మృగాలనూ అడవులనూ రక్షించాలనే అటవీ చట్టాల అమల్లో భాగంగా నాలుగు దశాబ్దాల కిందట వీరిని అడవుల్లోనుంచి బయటకు తీసుకొచ్చింది స్థానిక ప్రభుత్వం.

ఏది గుర్తొస్తే అదే పేరు
నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న హక్కిపిక్కిలు ఒకప్పుడు తాము కొలిచే నదులూ కొండల పేర్లనే పిల్లలకు పెట్టుకునేవారు. అయితే, అడవిలోంచి బయటికొచ్చాక తాము విన్న కొత్త కొత్త పదాలన్నింటినీ ఇలా పేర్లుగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ పేర్లు పెట్టడంలోనూ ఆదివాసీలు ఓ పద్ధతిని పాటిస్తారు. అదేంటంటే బిడ్డ పుట్టగానే మనసులో మొదట ఏ పేరు గుర్తుకొస్తే అదే పెట్టేస్తారట. అలా కొన్ని పేర్లే కాదు, వాటి వెనుక ఉన్న కథలు కూడా విచిత్రంగానే అనిపిస్తాయి. కాఫీ తోటల దగ్గరున్న క్యాంపుల్లో పిల్లాడు పుట్టాడు కాబట్టి వాడికి కాఫీ అనే పేరునీ కాంపౌండ్‌ వాల్‌ పక్కన పుట్టాడు కాబట్టి కాంపౌండ్‌ అనీ ఇలా ఏది తోస్తే అది పెట్టేస్తుంటారు. ఎందుకలా అంటే... ‘మేమంతే, మాకు ఏది బాగా నచ్చితే దాన్నే పేరుగా పెట్టేసుకుంటాం’ అంటాడు హోటల్‌ కొడుకు సంగీత్‌. ఈ పేర్లతోనే వీరికి ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. అన్నట్లూ ఈమధ్య ఇక్కడ షారూఖ్‌ ఖాన్‌, సోనాలీ బింద్రే, జితేంద్ర, అనీల్‌ కపూర్‌, శ్రీదేవి, జుహిచావ్లా లాంటి బాలీవుడ్‌ స్టార్లతో పాటు ఒబామా, సోనియా గాంధీ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా తిరుగుతున్నారు. అదేనండీ వాళ్ల పేర్లు పెట్టుకున్న పిల్లలు. హక్కిపిక్కి గిరిజనులు ఇప్పుడిప్పుడే టీవీలు కూడా చూస్తున్నారు. ఆ ప్రభావంతోనే ఈ పేర్లూ పుట్టుకొస్తున్నాయి. ఇవేకాదు, అమెరికా, జపాన్‌, బ్రిటిష్‌, సౌత్‌కొరియాలాంటి దేశాల పేర్లతో పాటు డాలర్‌, ఇంగ్లిష్‌, వన్‌బైటూ, షేక్‌హ్యాండ్‌ లాంటి పదాలను కూడా పేర్లుగా పెట్టేసుకున్న ఈ ఆదివాసీలు ఈ పేర్ల పుణ్యమా అని స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ వార్తల్లోకెక్కేశారు.