close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చాల పెద్దమ్మ... మరిడమ్మ!

చాల పెద్దమ్మ... మరిడమ్మ!

  పెద్దాపురం ప్రజల పెద్ద దేవత - మరిడమ్మ! ఆ తల్లి ఉత్సవాల్లో దళితులు సహా అన్ని వర్గాల ప్రజలూ పాల్గొంటారు. ముజ్జగాలనూ ఆడించే అమ్మను, ఉయ్యాలలో వేసి ఆడిస్తారు. ఆ వైభోగాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి ప్రజలో తరలివస్తారు.మ్మ అంటే నమ్మకం. కష్టాల నుంచి కాపాడుతుందన్న ధైర్యం, నష్టాలను నివారిస్తుందన్న భరోసా. ఆ మాతృతత్వాన్ని ఒక్కో గ్రామంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో ఆ దేవత పేరు మరిడమ్మ. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు ఆ తల్లిని ఆరాధిస్తారు. ఏటా జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో అమ్మవారి ఉత్సవాలను సుమారు నలభై రోజులపాటూ ఘనంగా నిర్వహిస్తారు. ఆ సంబరాలకు అన్ని ప్రాంతాల నుంచీ భక్తులు తరలివస్తారు.

ఇదీ ఐతిహ్యం...
రాచరిక వ్యవస్థ ఆవిర్భావానికి ముందే పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ తల్లి వెలసిందని చెబుతారు. స్థానిక ఐతిహ్యం ప్రకారం...అమ్మవారి దేవాలయం ఉన్నచోట ఒకప్పుడు శివారు ప్రాంతం. తుప్పలతో డొంకలతో నిండి ఉండేది. గాజుల వ్యాపారికి ఓ సామాన్య మహిళ రూపంలో అమ్మ దర్శనమిచ్చింది. చొరవగా, రెండు చేతుల నిండా మట్టి గాజులు వేయించుకుంది. వ్యాపారి డబ్బు అడిగితే... ‘నా దగ్గర లేవు బాబూ! సామర్లకోటలో ఉన్న చింతపల్లివారిని అడిగి తీసుకో’ అని చెప్పింది. ఆ తర్వాత, ప్రస్తుత దేవాలయానికి ఎదురుగా ఉన్న మానోజీ చెరువు దగ్గర...ఓ పశువుల కాపరికి దివ్యదర్శనాన్ని ప్రసాదించింది. ‘నేను మన్యం నుంచి వచ్చాను. ఈ కర్రకు పసుపూ కుంకుమా పెట్టి, రోజూ పూజలు చేస్తే మంచి జరుగుతుంది’ అని చెప్పి మాయమైంది. ఆ కాపరి భక్తిశ్రద్ధలతో చిన్న తాటాకు పాక వేసి, కర్రకు పసుపూ కుంకుమా పూశాడు. ధూపదీపనైవేద్యాలు పెట్టాడు. క్రమంగా జనమూ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తల్లి, సామర్లకోటలోని చింతపల్లి వారికి కలలో కనిపించి...మానోజీ చెరువు ప్రాంతంలో తనకో దేవాలయాన్ని కట్టమని ఆదేశించింది. ఏటా జ్యేష్ఠ బహుళ అమావాస్య నుంచి జాగరణా, జాతరా నిర్వహించాలని కోరింది. ఆ ఆనతి ప్రకారమే, చింతపల్లివారు అమ్మవారి దేవాలయాన్ని నెలకొల్పారు. పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకం, మేకపోతులు, కోళ్లు నైవేద్యంగా సమర్పించారు. అప్పటి నుంచీ ఘనంగా జాతర జరుగుతోంది. అప్పట్లో, ఎండాకాలంలో వర్షాలు కురిసి అంటు వ్యాధులు ప్రబలేవి. అమ్మవారికి ప్రసాదాలు సమర్పించగానే...రోగాలు మటుమాయమైపోయేవని భక్తులు కథలుగా చెబుతారు.ఉయ్యాళ్ల తాళ్లొత్సవం...
అమ్మవారి జాతరకు ముందురోజు రాత్రి జాగరణ ఉంటుంది. ఆరోజు నుంచీ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాగరణ రోజు భారీ ఎత్తున బాణసంచా పేలుస్తారు. సుమారు 40 రోజులపాటు నిర్వహించే ఈ సంబరాలకు నలుమూలల నుంచీ భక్తులు వస్తారు. మొక్కులున్నవారయితే, దేవతామూర్తుల వేషాలు వేసుకుని వూరేగింపుగా ట్రాక్టర్లపై బయల్దేరతారు. బండ్ల ముందు గరగలూ, కోలాటాలూ, పెద్దపులి వేషాలూ... ఆ సందడిని చూడాల్సిందే.

అమ్మవారి జాతరంటే వూరందరికీ ఉత్సవమే. అంతా పాతపెద్దాపురం వెళ్లి, ఉయ్యాళ్ల తాటిచెట్లు తేవాలని దళితులను కోరతారు. దళితులూ అధికారులూ డప్పు కళాకారులతో కలసి తాటిచెట్టున్న ప్రాంతానికి వెళ్తారు. పెద్దాపురం పట్టణానికి నాలుగు దిక్కులా...ఏడాదికి ఒక దిక్కు నుంచి తాటిచెట్లను తీసుకొస్తారు. ముందుగా ఆ చెట్లకు పూజలు చేసి, నైవేద్యం పెడతారు. వాటిని వంశపారంపర్యంగా రజక కుటుంబీకులే నరకడం సంప్రదాయం. నరికిన చెట్లను మోపు తాళ్లతో జెట్టీలు కట్టి...అమ్మవారి ఆలయం వరకూ తీసుకొచ్చే ఉత్సవమే... ఉయ్యాళ్ల తాళ్లొత్సవం. డప్పుల విన్యాసాలూ గరగ నృత్యాల మధ్య ఆ ఘట్టం కన్నుల పండువగా జరుగుతుంది. దారి పొడవునా మహిళలు తాటిచెట్లకు నీళ్లుపోసి, పసుపు కుంకాలు రాసి పూజలు చేస్తారు. ఆ స్వాగతాలకు సంతోషించి అమ్మ సకాలంలో వర్షాలు కురిపిస్తుందనీ, పంటలు బాగా పండతాయనీ భక్తుల నమ్మకం. ఆలయం దాకా వచ్చాక, పెద్దాపురానికి చెందిన దూళ్ల వీర్రాజు కుటుంబం తాటిచెట్లను పాతేందుకు గోతులు తవ్వుతుంది. పాతపెద్దాపురానికి చెందిన దెయ్యాల సుబ్బారావు కుటుంబీకులు తాము తెచ్చిన తాళ్లతో ఉయ్యాలలు కడతారు. ఆత్రేయపురం మండలం అంకంపాలేనికి చెందిన చింతపల్లి వెంకట్రావు కుటుంబం అమ్మవారి గరగను ఒళ్లొ పెట్టుకుని ఉయ్యాలపై కూర్చుంటుంది. ప్రధాన పూజారి ఆధ్వర్యంలో మూడుసార్లు ఉయ్యాల వూపుతారు. దీంతో ఉయ్యాళ్ల తాళ్లొత్సవం ముగిసినట్టు.

ఇలా వెళ్లాలి...
రైలు మార్గంలో అయితే రాజమహేంద్రవరం నుంచి సామర్లకోటకు రావాలి. సామర్లకోట నుంచి పెద్దాపురం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం. రాజమహేంద్రవరం నుంచి బస్సులో రావాలంటే ధవళేశ్వరం నుంచి ద్వారపూడి మీదుగా సామర్లకోటకు వచ్చి, ఏ ఆటోల్నో బస్సుల్నో పట్టుకోవాలి. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, గోకవరం, భద్రాచలం వెళ్లే బస్సులు గుడిమీదుగా వెళతాయి.

- మహ్మద్‌ రియాజ్‌ పాషా, న్యూస్‌టుడే, పెద్దాపురం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.