close
నీడ కూడా అందమే...

నీడ కూడా అందమే...

వెలుగు నీడలు... ఒకదాని వెంటే మరొకటి. దీపం ఇంటికి వెలుగునిస్తుంది. మరి దాని వెనుక కనిపించే నీడనెందుకు వృథాగా పోనివ్వడం. ఈ ఆలోచనతోనే నీడనూ కళాఖండంలా మార్చేసి ఇంటిని అలంకరించేస్తున్నారు సృజనకారులు. క్యాండిల్‌ షాడో ప్రొజెక్టర్లతో వస్తున్న ఈ నూనె దీపాలూ, బ్యాటరీలతో పనిచేసే లైట్లూ అలాంటివే.కొవ్వొత్తి లేదా నూనె దీపపు కాంతిలో చేతి వేళ్లను రకరకాలుగా తిప్పి, గోడ మీద అమ్మ వేసే నీడ బొమ్మల్ని చూస్తే చిన్న పిల్లలకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో చెప్పనక్కర్లేదు. సరదాగా అనిపించడమే కాదు, ఆ కళ ఎంతో అందంగానూ సహజంగా కూడా ఉంటుంది. ఆ లక్షణం చాలదూ ఆ నీడను ఇంటి అలంకరణలో భాగం చెయ్యడానికి! అలా బ్రూక్లిన్‌కి చెందిన కళాకారుడు ఆడమ్‌ ఫ్రాంక్‌ రూపొందించిన ఈ క్యాండిల్‌ షాడో ప్రొజెక్టర్లు గృహాలంకరణలో కొత్త ట్రెండ్‌కి తెరలేపాయి. చిన్నసైజు స్టీలు డబ్బాలా ఉన్న వీటికి ఒక వైపు కొమ్మ మీద వాలిన పిట్టలూ ఎగురుతున్న పక్షులూ చూడచక్కని చెట్టు... ఇలా రకరకాల ఆకారాల్లో చెక్కిన స్టీలు ఆకృతులుంటాయి. ఇక, డబ్బా మధ్యభాగంలో వత్తి ఉన్న చిన్న నూనె బుడ్డీ, లేదా అచ్చం దీపపు వెలుగులానే కనిపించే ఎల్‌ఈడీ లైటూ ఉంటాయి. చీకట్లో వీటిని వెలిగించి బొమ్మల ఆకృతులు గోడవైపు ఉండేలా పెట్టగానే దీపం అంచుకు ఏ ఆకృతి ఉంటే దాని నీడ గోడమీద పెద్దగా చూడచక్కగా పడుతుంది.

చీకటిలో ఆహ్లాదం
ఎప్పుడూ కరెంటు ఉంటూనే ఉంటుందిగా... ఇక, వీటితో ఇంటినెలా అలంకరిస్తాం అంటారా... రంగురంగుల దీపాలు కనులకు ఆహ్లాదాన్ని పంచితే చీకటి మనసుకు హాయినిస్తుంది. ఇంటా బయటా ఈమధ్య పెరుగుతున్న క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లే అందుకు ఉదాహరణ. టెక్నాలజీకీ టీవీలకూ దూరంగా రాత్రిపూట కేవలం బెడ్‌లైటూ లేదా సువాసనలు వెదజల్లే అరోమా నూనె దీపాలూ కొవ్వొత్తుల్ని వెలిగించుకుని ఆ కనిపించీ కనిపించని వెలుగులో కాసేపు ఆత్మీయులతో గడిపితే ఉండే ఆనందమే వేరు. అలాంటపుడు ఈ షాడో ప్రొజెక్టర్‌ దీపపు బుడ్డీల్లో సువాసనలు వెదజల్లే నూనెను పోసి వెలిగించొచ్చు. అదంతా కష్టం అనుకునేవారికోసం కరెంటుతోనూ రీఛార్జబుల్‌ బ్యాటరీలతోనూ పనిచేసే షాడో ప్రొజెక్టర్లు ఇవే ఆకారాల్లో వస్తున్నాయి. వీటి వెలుగు కూడా అచ్చం కొవ్వొత్తుల కాంతిలానే ఉంటుంది. అన్నిటికీ మించి రాత్రిపూట వీటితో ఇంటిని ఎంతో వినూత్నంగా అలంకరించొచ్చు. ఇంటికొచ్చే అతిథులను అవాక్కయ్యేలా చెయ్యొచ్చు. వీటితో పాటు కొవ్వొత్తుల్ని పెట్టుకునే క్యాండిల్‌ హోల్డర్లూ దీపాలు వెలిగించుకునే ప్రమిదల్లోనూ వినాయకుడూ బుద్ధుడి రూపాలతో పాటు ఇంకెన్నో ఆకృతుల్లో చూడచక్కని నీడలు ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడొప్పుకుంటారా... నీడ కూడా అందమే అని.


 

మొక్కల్ని పెంచాలంటే ఇంటి ముందో వెనకో కాస్త స్థలం అయినా ఉండాలి. అదే అపార్ట్‌మెంట్‌ అయితే బాల్కనీ అయినా ఉండాలి అనుకుంటాం. కానీ ఆ రెండూ లేకున్నా ఫరవాలేదు. కిటికీలు ఉంటే చాలు... ఇల్లే ఓ అందాల పూదోటలా మారిపోతుంది.

ఇంట్లో రంగురంగుల పూలమొక్కల్ని పెంచుకోవాలని చాలామంది ఆశపడుతుంటారు. కానీ ఇరుకిరుకు అపార్ట్‌మెంట్లలో అది తీరని కోరికగానే మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ కిటికీ పూదోట. కాసేపు ఆ కిటికీలోంచి బయటకు చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగానూ కళ్లకు ఆహ్లాదంగానూ అనిపిస్తుంది. అంతోఇంతో చల్లదనాన్నీ ఇస్తాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా కిటికీలకు కిందుగా రాడ్‌లను ఏర్పాటుచేసుకుని వాటిమీద వెడల్పాటి ప్లాస్టిక్‌ లేదా ఫైబర్‌ గ్లాస్‌ కంటెయినర్లను అమర్చుకోవాలి. లేదంటే ఇనపరాడ్లతోనే తొట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేసుకుని అందులో కుండీలను పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్‌ వాటితో పోలిస్తే మట్టి కుండీలయితే మంచిది. అయితే ఈ కంటెయినర్లూ లేదా కుండీల్లో మట్టి కన్నా పీట్‌మాస్‌, చెట్టు బెరళ్లూ పీచూ ఇంకా కొన్ని ఖనిజాలూ వేసి చేసిన మిశ్రమాన్ని నింపితే తేలిగ్గానూ ఉంటుంది. మొక్కలూ ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఆ తరవాత ఆ తొట్టెల్లో మనకిష్టమైన పూలమొక్కల్నీ; మరువం, మాచిపత్రి... లాంటి పరిమళభరితమైన మొక్కల్నీ పెంచుకోవచ్చు. వంటింటి కిటికీల దగ్గర అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వాము, ఆకుకూరల్లాంటి వాటినీ పెంచుకోవచ్చు. ఈ కిటీకీల్లో పెంచుకునేందుకు కాస్త ఎత్తులో పెరిగే వాటితోబాటు ఏకకాలంలో మొక్కంతా పూచే వాటిని ఎంపిక చేసుకుంటే మంచిది. నాస్టర్టియం, జెరానియం, పెటూనియా, తలంబ్రాలు, నూరు వరహాలు... వంటివయితే మొక్కంతా విరబూసి కిటికీలకూ అందాన్నిస్తాయి. అలాగే సీజనల్‌గా పూసే డాలియా, టెంకీస్‌, బంతి, చామంతి... వంటి వాటిని కూడా పెంచుకోవచ్చు. నాచు, చంద్రకాంత, శంఖుపూలు, చిలకముక్కు, సీతమ్మవారి జడగంటలు, బిళ్లగన్నేరు... ఇలా రకరకాల రంగుల్లో విరిసే ఈ పూల మొక్కలు కిటికీలకూ ఇంటికీ కొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఈ పూలమొక్కల మధ్యలో చిన్నపాటి క్రోటన్‌ మొక్కల్ని కూడా పెడితే విరబూసిన పూలూ రంగుల ఆకులూ అన్నీ కలగలిసి ఓ అందమైన బొకేని తలపిస్తూ ఇంటికో ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. ఈ మొక్కలకు నీళ్లు కూడా కొద్దికొద్దిగా పోయాల్సి ఉంటుంది. అలాగే నెలకు రెండుసార్లు ద్రవరూపంలోని ఎరువును వేస్తే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం...మీ కిటికీని అందాల పూల వనంలా మార్చేయండి..!
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న