close
అంతస్తులు

అంతస్తులు
- వాణిశ్రీ

‘‘లిఫ్ట్‌ లేదు, పాడూ లేదు. నాలుగో అంతస్తులో ఇల్లు తీసుకున్నావేంట్రా బాబూ!’’ ఇంట్లోకి వస్తూనే అన్నాడు రాజేంద్ర.

ఆయాసపడుతూ హాల్లోని సోఫాలో కూలబడ్డాడు.

‘‘లిఫ్ట్‌, కారు పార్కింగ్‌, ఇరవైనాలుగు గంటలు నీళ్ళుకావాలంటే అద్దె ఎక్కువరా. నా జీతంలో సగం సరిపోతుంది. చేస్తున్నది గుమాస్తా ఉద్యోగం. నేనేం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని కాదు’’ అని జవాబు చెప్పాడు లక్ష్మీనారాయణ.

‘‘ఔన్లే, అదీ నిజమే. అయినా నువ్వు అద్దె ఇంట్లో ఉండటం ఏంట్రా? ఉద్యోగంలో చేరిన కొత్తలోనే నువ్వు సొంత ఇల్లు కొనుక్కున్నావని మీ నాన్న చెప్పాడే?’’

‘‘అదా... అది ఎప్పటి సంగతి? హౌసింగ్‌ బోర్డులో ఒక ఇ.డబ్ల్యూ.ఎస్‌. ఇల్లు కొన్నానులే. కొనడం అంటే నాకు అలాట్‌ అయింది. వంద రూపాయలు డిపాజిట్‌ కడితే లాటరీలో తగిలింది. నెలనెలా ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టాలి. అది ఎంత ఇల్లులే... అరవైఆరు గజాలు. ఒకటే రూమ్‌. అప్పట్లో బ్యాచిలర్‌ని కాబట్టి సరిపోయింది. పెళ్ళయ్యాక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లోకి మారాను.’’

‘‘ఆ ఇడబ్ల్యూఎస్‌ ఇల్లు ఏమైంది?’’

‘‘అబ్బో, అదొక కథ.’’

‘‘దానికో పెద్ద కథ ఉందా?’’

‘‘ఆఁ...’’

‘‘చెప్పు, కాలక్షేపం అవుతుంది’’ అన్నాడు రాజేంద్ర.

‘‘నాకు అలాట్‌ అయిన ఆ చిన్న ఇంట్లో ఉంటున్నాను. అప్పుడు మా నాన్న వాళ్ళ వూరువాళ్ళ కుర్రాడిని- ఏడుకొండల్ని పంపించాడు. వాళ్ళ నాన్న వడ్రంగం పని చేసేవాడు. వీడికి ఆ పని నేర్పాలని వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నించినా వంటబట్టలేదు. పోనీ చదువైనా వచ్చిందా అంటే అదీ లేదు. టెన్త్‌ ఫెయిలయ్యాడు వెధవ. వూళ్ళొ ఉంటే ఎందుకూ పనికి రాకుండా పోతాడని వాళ్ళ నాన్న, మా నాన్నని పట్టుకున్నాడు. ‘మీవాడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడుగా, వీడికి అక్కడ ఏదైనా కంపెనీలో పని ఇప్పించమని చెప్పండి’ అని. మా నాన్న పిచ్చిమారాజు. ఇక వెనుకా ముందూ ఆలోచించే పనిలేదు. ‘మావాడు ఎటూ సొంతిల్లు కొన్నాడు, అక్కడ పడి ఉంటాడులే’ అని నాకొక ఉత్తరం రాసి ఏడుకొండల్ని పంపాడు. అది చదివి నాకు మండింది. మన అంతస్తు ఏంటి, వాడిది ఏంటి? నేను గ్రాడ్యుయేట్‌ని, వూళ్ళొ రైతు కుటుంబం. వాడు పనీపాటలు చేసుకునే చిన్న కులంవాడు. పదోక్లాసు పాసవడం చేతకాని మొద్దు. పోనీ మనిషైనా నాజూగ్గా ఉన్నాడా అంటే, అదీ లేదు. నల్లగా పొట్టిగా పల్లెటూరి గబ్బిలాయి అని తెలిసిపోయేట్టు ఉంటాడు. వీడా నా రూమ్మేట్‌? నా కొలీగ్స్‌ ఎవరైనా వస్తే పరువు పోతుంది. లారీల్లో క్లీనర్‌ పనికి కూడా పనికిరానోడ్ని నాతో ఉండమని పంపిస్తాడా? అని మా నాన్నమీద కోపం వచ్చింది. కానీ, ఏం చేస్తాం? వాడు మూటా ముల్లె సర్దుకుని వచ్చి కొంపలో చేరాడు.

‘వీడిని ఏం చేయాలిరా దేవుడా?’ అని ఆలోచించి నాకు పరిచయం ఉన్న కిరాణా కొట్టులో పనికి పెట్టాను.

హోటల్లో తింటే ఖర్చు ఎక్కువ అని నేనే వంట చేసుకుంటూ చేతులు కాల్చుకుంటున్నాను. ఈ గబ్బిలాయిగాడికి వంట చేయటం వచ్చు.

‘‘అన్నాయ్‌, నేను వంట చేస్తాలే, నాకు వచ్చు’’ అన్నాడు.

నేను ఏమో అనుకున్నాను కానీ, వాడు వంట బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆదివారంనాడైతే ఉల్లి పకోడీలో, మిరపకాయ బజ్జీలో వేసేవాడు. నాకు సుఖంగా ఉంది వీడు వచ్చాక. వాడు వంటచేసి నాకు లంచ్‌బాక్స్‌ రెడీ చేసి పోయేవాడు. నేను ఫుల్‌ హ్యాపీ.

కొంతకాలం పోయాక ఏడుకొండలు ‘‘అన్నాయ్‌, ఆ కొట్లో నాకు బాగాలేదు’’ అన్నాడు.

‘‘ఏంరా, జీతం తక్కువనా? అంతకంటే ఎక్కువ ఎవడూ ఇవ్వడు నీకు. అదీగాక నీ తిండికి సరిపోద్దిగా. ఇంటి అద్దె ఎటూ లేదు’’ అన్నాను.

‘‘అదికాదు అన్నాయ్‌, ఆ సేటు క్షణం నిలబడనీయడు. ఏదోక పని చెప్తున్నాడు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. సాయంకాలానికి నీరసం వస్తోంది’’ అన్నాడు.

నిజం చెప్పాలంటే వాడికి ఆ పని ఇష్టంలేదు. ఇష్టంలేని పని కష్టంగా ఉంటుంది.

‘‘సరేరా, ప్రస్తుతానికి చేస్తూండు... ఏదోకటి చూద్దాం’’ అన్నాను.

సిటీలో సేల్స్‌బాయ్స్‌కీ, సెక్యూరిటీగార్డులకీ ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేర్పించాను. వాళ్ళు కొన్నాళ్ళు ట్రైనింగ్‌ ఇచ్చి జాబ్‌లోకి తీసుకున్నారు. యూనిఫాం అదీ ఇచ్చారు. ఏజెన్సీవాళ్ళు ఎక్కడికి పంపితే అక్కడకు వెళ్ళాలి. సిటీ బస్‌పాస్‌ కూడా ఇప్పించారు.

‘‘అన్నాయ్‌, నన్ను చూసి పోలీస్‌ అనుకుని భయపడుతున్నారు’’ అని పకపక నవ్వాడు ఏడుకొండలు.

‘‘పోలీస్‌ అనుకుని భయపడుతున్నారని బెదిరించి డబ్బులు గుంజకు. ఆనక నిజం పోలీసులు పట్టుకుని మక్కెలు విరగ్గొడతారు’’ అన్నాను.

‘‘ఛ..ఛ... అటువంటి పని ఎందుకు చేస్తాను?’’ అని లెంపలు వేసుకున్నాడు.

అట్లా ఒక సంవత్సరం సెక్యూరిటీ గార్డుగా చేశాడు.

ఒకరోజు ‘‘అన్నాయ్‌, ఆ గార్డు పనేం బాగాలేదు. విసుగుపుడుతోంది. ఒక పనా, పాటా? గంటల తరబడి గుడ్లప్పగించి చూడ్డమే’’ అన్నాడు.

నాకు మండింది వాడు ఆ మాటనగానే.

‘‘ఒరేయ్‌ పిచ్చి వెధవా, నువ్వేమనుకుంటున్నావురా? చదువూ సంధ్యా లేదు. పెద్ద గవర్నమెంటు ఉద్యోగం వస్తుందనుకుంటున్నావా? ఇటువంటి ఉద్యోగాలు తప్ప ఇంకేం వస్తాయిరా. పోనీ నువ్వు టెన్త్‌ పాసై ఉంటే, ఐటిఐలో ఫిట్టరో, ఎలక్ట్రీషియన్‌గానో ట్రైనింగ్‌ అయ్యేవాడివి. ఏదోక కంపెనీలో జాబ్‌ వచ్చేది’’ అని బాగా వాయించి పెట్టాను.

వాడు ముఖం మాడ్చుకున్నాడు. రెండురోజులు ఎడముఖం, పెడముఖం అన్నట్టు ఉన్నాడు. జాబ్‌కి కూడా పోవడం లేదు. వంటచేసి తిని చాపమీద పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

‘‘ఒరేయ్‌ ఏడుకొండలూ, బీదవాళ్ళు బాగుపడాలంటే చదువు ఉండాలిరా. అది నీకు లేదు. పనిపాటలు చేసుకుంటూ బతకాల్సిందే’’ అన్నాను.

నేను చెప్పింది యథార్థమేగా? దానికి వాడేం చెప్తాడు? గమ్మున వూరుకున్నాడు- మాటా పలుకూ లేకుండా.

‘‘అరేయ్‌, నీకు ఇటువంటి పనులు చేయడం ఇష్టంలేకపోతే మీ వూరెళ్ళిపో. మీ నాన్న దగ్గర వడ్రంగం నేర్చుకో. ‘కులవృత్తిని మించింది లేదు గువ్వల చెన్నా’ అన్నాడు ఓ కవి. మీ నాన్న వడ్రంగం చేసుకుంటూ ఎంత పెద్ద సంసారం నెట్టుకొచ్చాడు. మీ అక్కలు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పంపాడు. ఉండటానికి వూళ్ళొ ఇల్లు కట్టాడు’’ అని హితోక్తులు చెప్పాను.

‘‘ఇప్పుడు వూరెళ్తే అంతా నవ్వుతారు అన్నాయ్‌, వెళ్ళను’’ అన్నాడు.

‘‘వాళ్ళు ఎవరో నవ్వుతారని, ఇక్కడ ఏడుస్తూ ఉంటావా?’’

‘‘అదికాదు అన్నాయ్‌, నాకొక ఐడియా వచ్చింది’’ అన్నాడు.

‘ఓరి మడ్డి వెధవా, మొద్దు సన్యాసీ, నీ బుర్రకి ఐడియాలు కూడానా?’ అనుకున్నాను నాలో నేను. పైకి అంటే ఏడ్చి చస్తాడని వూరుకున్నాను.

‘‘మన ఇంటిపక్కన ఖాళీస్థలం ఉంది కదా?’’

‘‘ఉంటే..?’’

‘‘మన ఇల్లు రోడ్డు పక్కనే ఉంది.’’

‘‘ఉంది సరే.’’

‘‘అక్కడ సాయంకాలం పకోడీలు, బజ్జీలు వేస్తే బిజినెస్‌ సాగుతుంది అన్నాయ్‌’’ అన్నాడు.

‘ఓర్నీ ఫరవాలేదే’ అనుకున్నాను. ఆ చుట్టుపక్కల కిరాణాకొట్లు, బట్టల షాపులు వగైరా ఉన్నాయి కానీ, ఇటువంటిది లేదు.

‘‘సరేరా, ఏం కావాలో చెప్పు. నేను సామాన్లు అప్పు ఇప్పిస్తాను. ఒక చెక్క టేబుల్‌, బాండీ, పొయ్యి అంతేగా. అవి తెచ్చుకుని స్టార్ట్‌ చేసుకో’’ అని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాను.

నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి ఘుమఘుమలాడే ఉల్లిపకోడీలు, మిర్చిబజ్జీలు తినడానికి రెడీగా ఉంటే ఇంకేం కావాలి?

‘‘అప్పు ఎందుకు, నా దగ్గర డబ్బు ఉందిలే’’ అన్నాడు ఏడుకొండలు హ్యాపీగా.

అన్నట్టే ఒక ముహూర్తాన సాయంకాలం ఇంటి పక్కన ఖాళీ స్థలంలో పకోడీలు, బజ్జీలు వేయడం మొదలుపెట్టాడు. నేను ఏమో అనుకున్నాను. వాడి బిజినెస్‌ దినదిన ప్రవర్ధమానమైంది. సాయంకాలానికి వాడి చుట్టూ ఈగల్లా ముసురుతున్నారు జనం. రాత్రి తొమ్మిదింటి వరకూ వాడి చేతికి ఖాళీ ఉండటం లేదు.

‘‘అన్నాయ్‌, ఎవర్నయినా పనిపిల్లని చూడు, అంట్లు తోమడానికి’’ అన్నాడు ఒకరోజు.

మా ఫ్రెండ్‌ కృష్ణయ్య అని ఎం.ఐ.జి. ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళింట్లో పోచమ్మ అని పని మనిషి ఉంది. ఆమెతో చెప్పాను. ‘ఎవరో ఎందుకు... నా కూతురే ఉంది సారూ’ అంది. తెల్లారే తన కూతుర్ని పట్టుకొచ్చింది. దాని పేరు శశిరేఖంట. నాకు నవ్వొచ్చింది. నల్లగా, పొడుగ్గా చీపురుపుల్లలా ఉంది. ఈ పిల్ల అసలు అంట్లు తోమగలదా? అని అనుమానం వచ్చింది. చెమ్చా కండలేదు ఒంట్లో.

‘‘మరీ చిన్నపిల్ల కదా పోచమ్మా?’’ అని సందేహం వెలిబుచ్చాను.

‘‘చిన్నదేంకాదు సారూ, పదహారేళ్ళు’’ అంది.

పాపం పోషణలేక అలా ఉందిలే అనుకున్నాను. ఆ విధంగా శశిరేఖ ఏడుకొండలు దగ్గర పనిలో చేరింది. పొద్దున్నే వచ్చి అంట్లు తోమి, ఇల్లూ వాకిలి వూడ్చి, కూరగాయలు కోసి, పప్పు రుబ్బి వెళ్ళిపోతోంది. ఏడుకొండలు మళ్ళీ సాయంకాలం కూడా రమ్మన్నాడు- బిజినెస్‌ సహాయానికి. రాత్రి లేటవుతోంది, నడిచిపోవడం కష్టంగా ఉంది అంటే, షేర్‌ ఆటోలో వెళ్ళమని రోజూ డబ్బులు ఇస్తున్నాడు ఏడుకొండలు.

ఇంతలో నాకు పెళ్ళయింది. ఏడుకొండలు ఖాళీ చేసి వెళ్ళినా ఒకే గది ఉన్న ఇంట్లో కాపురం పెట్టడం నాకు ఇష్టంలేదు. గుడిసెలో ఉన్నట్టే ఉంటుంది. దీనికి పైన శ్లాబ్‌ ఉంది. అంతే తేడా!

‘‘నువ్వు జాగ్రత్తగా చేసుకోరా, నేను ఎల్‌.ఐ.జి. ఇల్లు అద్దెకు తీసుకున్నాలే’’ అన్నాను ఏడుకొండలుతో.

‘‘ఆ ఇల్లు బాగుంది అన్నాయ్‌! రెండు గదులు... ముందు వంటగదీ, వెనుక బాత్‌రూమ్‌లు’’ అని మెచ్చుకున్నాడు.

నేను అద్దె ఇంట్లో కాపురం పెట్టాను. వాడు నాకు నెలనెలా అద్దె ఇస్తున్నాడు మార్కెట్‌ రేటు ప్రకారం. అట్లా రెండు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఏడుకొండలు వచ్చాడు.

‘‘అన్నాయ్‌, మన ఇంట్లో మెస్‌ పెడదామనుకుంటున్నాను’’ అన్నాడు.

‘‘అట్లాగే పెట్టుకోరా’’ అన్నాను.

‘‘దాన్ని రీమోడల్‌ చేయాలి అన్నాయ్‌. ఇప్పుడున్నట్టు బాగోదు.’’

‘‘అంటే ఏంట్రా, ఆ గది పడగొట్టాలా?’’

‘‘ఔను అన్నాయ్‌’’

నేను డైలమాలో పడ్డాను.

‘‘అన్నాయ్‌, నీకు అది ఉండటానికి ఎటూ పనికిరాదు. నాకు అమ్మేసెయ్‌. నువ్వు ఎల్‌.ఐ.జీనో, ఎం.ఐ.జీనో కొనుక్కో’’ అన్నాడు.

‘‘ఎల్‌ఐజీ అంటే మాటలేరా? ఐదు లక్షలు చెప్తున్నారు. నువ్వా ఇంటికి మహా అయితే లక్ష ఇస్తావు. దాని రేటు అంతే’’ అన్నాను.

‘‘గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నావు. లోన్‌ తీసుకో అన్నాయ్‌. నీకు బ్యాంకులో ఇస్తారుగా’’ అని సలహా ఇచ్చాడు ఏడుకొండలు.

‘ఓర్నీ, వీడికి తెలివి పెరిగిపోయిందే’ అనుకున్నాను.

‘‘సర్లేరా, నువ్వే తీసుకో’’ అన్నాను.

మర్నాడే వాడు డబ్బు తెచ్చి ఇచ్చాడు. నేను హౌసింగ్‌ బోర్డు వాళ్ళకి పూర్తిగా డబ్బు కట్టేశాను. తర్వాత వాడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాను. అందులో వాడు రీమోడల్‌ చేసి మెస్‌ స్టార్ట్‌ చేశాడు.

ఒకరోజు పోచమ్మ మా ఇంటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. శశిరేఖ రాత్రిళ్ళు కూడా ఏడుకొండలు దగ్గరే ఉంటున్నదట. పని ఎక్కువైంది అని సాకు చెప్తున్నదట. వాళ్ళ జనతా కాలనీలో రకరకాలుగా చెప్పుకుంటున్నారట. ఏడుకొండలు శశిరేఖను ఉంచుకున్నాడని పుకారు లేచిందట. ఇక దానికి పెళ్ళెట్లయితది సారూ... అని లబలబ కొట్టుకుంది.

నేను విషయం ఏంటో కనుక్కుందామని వెళ్ళాను. శశిరేఖను చూసి గుర్తుపట్టలేకపోయాను. నిండు యవ్వనంలో కళకళలాడిపోతోంది. ఒళ్ళు చేసి నిగనిగలాడుతూ నల్ల కలువలా మెరుస్తోంది. అది ఏడుకొండల్తో సరసాలాడుతోంది నేను వెళ్ళేసరికి. నాకు విషయం అర్థమైంది. వాడిని చాటుకు పిలిచాను.

‘‘అరేయ్‌, వాళ్ళ కాలనీలో గొడవగా ఉంది. వాళ్ళంతా ఏదోకరోజున వచ్చి నిన్ను విరగదీస్తారు. ఎందుకొచ్చిన గొడవ... దాన్ని పెళ్ళి చేసుకో! నీ బిజినెస్‌లో ఎటూ హెల్ప్‌గా ఉంది’’ అన్నాను.

‘‘సరే అన్నా, అదంటే నాకూ ఇష్టమే’’ అని మెలికలు తిరిగాడు.

ఇక శశిరేఖ సంగతి చెప్పేదేముంది?

తర్వాత వాళ్ళకి దగ్గరుండి నేనే పెళ్ళి చేశాను. పదేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇక వాళ్ళని స్కూలుకి పంపడం, రోగాలు, రొస్టులు వగైరాతో ఎంత జీతం పెరిగినా ‘గాజుల బేరం కూటికి సరి’ అన్నట్టు ఉంది. ఏడుకొండలుకి ఇల్లు అమ్మానుగానీ మళ్ళీ కొనలేకపోయాను.’’

చెప్పడం ముగించాడు లక్ష్మీనారాయణ.

‘‘సరిపోయింది. అప్పట్నుంచీ నువ్వు అద్దె ఇళ్ళల్లోనే కాలక్షేపం చేస్తున్నావన్నమాట. ఇంకేం ఇల్లు కొంటావ్‌? కొంటే గింటే నువ్వు రిటైరైన తర్వాత ఏమైనా...అసలు ఆ ఇల్లు అమ్మకుండా ఉన్నా పోయేది. ఇంతకీ అందులో మెస్‌ ఇంకా నడుస్తోందా?’’ అడిగాడు రాజేంద్ర.

‘‘ఏడుకొండలు మెస్‌లు పెట్టి, తర్వాత హోటల్‌ స్టార్ట్‌ చేసి బాగా సంపాదించాడు. ఈ ఐదంతస్తుల ఇల్లు వాడిదే! వాడి ఇంట్లో నేను అద్దెకు ఉంటున్నాను. కాలమహిమ!’’ అన్నాడు లక్ష్మీనారాయణ.

‘‘వ్వాట్‌...ఏడుకొండలు ఈ ఐదు అంతస్తుల బిల్డింగ్‌ కట్టించాడా?’’ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రాజేంద్ర.

నవ్వుతూ తలూపాడు లక్ష్మీనారాయణ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.